రంగయ్య ప్రతీ రోజూ ప్రొద్దున్నే ఆరుగంటల వేళ ఆ దారంటే నడచి వెళ్తూంటాడు. అతని ఇంటినుంచి రెండు మైళ్ళు నడచి వెళితే సెంట్రల్ పార్క్ వస్తుంది. ఉదయం ఆరుగంటల వేళప్పుడు కూడా ఆ దారంపటా, ఆ పార్కులోనూ నిండా జనమే. అసలు ఆ చుట్టూపక్కల జనం సంచరించని సమయం వుండదేమో బహుశా. 46th street నుండి 6th avenue మీదుగా సుమారు ఓ ఇరవై వీధులు దాటితే సెంట్రల్ పార్కు వస్తుంది. అది న్యూ యార్కు నగరం, మిడ్ టౌన్, టైం స్క్వేర్ దగర స్థలం.

రంగయ్య అలా నడుస్తూ ఎన్నో ఆలోచనల్లో కొట్టుకుపోతూ వుంటాడు. గతమంతా నెమరు వేసుకుంటూ వుంటాడు. “ఎక్కడి వాణ్ణి ఎక్కడికి వచ్చాను, కాలం ఎలా మారిపోయింది, ప్రపంచం ఎంత మారిపోయింది” అని అబ్బురపడిపోతూ వుంటాడు. ప్రతీరోజూ గతంలోకి జారుకుంటూ వుంటాడు. అదొక ఉహాలోకంలో వున్నట్టుగా వుంటుందతనికి. ఆ నడకలో రోజుకో విషయమ మీదకి చాలా లోతుగా వెళ్ళీపోతూ వుంటాడు . హటాత్తుగా కార్ల హారన్లతోనో ఎవరో పక్కనుంచి రాసుకుపోతేనో, రోడ్డుమీద వున్న ఓ గోతిలో కాలు పడితేనో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తూ వుంటాడు. చూసేవాళ్ళు తనగురించి ఏమైనా అనుకుంటారేమోనని మొదట్లో జంకేవాడు. కానీ త్వరలోనే తెలిసింది ఈ మహానగరంలో ఎవ్వరూ ఎవ్వరిగురించీ పట్టించుకోరని. పట్టించుకునే సమయమూ, ఓపికా, మొగ్గూ, ఇష్టమూ ఎవరికీ లేవని.

అదే తన చిన్నప్పుడూ పుట్టి పెరిగిన ఊర్లో అయితేనా, ఎవరింటిలోనైనా పోపు మాడిందంటే ఊర్లో అందరికీ తెలిసిపోయేది. మధ్యాహ్నం చెట్టుకింద కబుర్లలో ఆ విషయమై మాటలు జరిగేవి కూడాను. ఎక్కణ్ణుంచి ఎక్కడికి వచ్చాడు తను! రంగయ్య తండ్రి కుంటముక్కల బుచ్చయ్య. తల్లిపేరు తలుపులమ్మ. కాకినాడ దగ్గిర లాకులు దాటాక ఓ చిన్న పల్లెటూరు కోదాడ. దానికి ఆనుకుని ఉండే చిన్న ఏరుదాటాక పల్లంలో పేరులేని ఓ చిన్న ఊరు. అందరూ “చిన్న పాలెం” అంటూ వుంటారు. ఆ పాలెంలో ఓ ఇరవై ముఫ్ఫై పాకలు, రెండో మూడో పెంకుటిళ్ళు, ఒకటో అరో ఎత్తరుగుల ఇళ్ళు చెదురుమదురుగా వుంటాయి. చుట్టూ మట్టి రోడ్లు, మురిక్కాలవలు, ఓ చిన్న ఎలిమెంటరీ స్కూలు, అడపా దడపా ఆ మట్టిరోడ్డు మీదనుంచి వెళ్ళే ట్రాక్టర్లు, దుమ్మూ దూరంగా రైలు కట్టాలు.

ఆ వూర్లో ఒక పాక బుచ్చయ్యది. పాకనుంచి గోదారి పాయ ఏరు దాకా ఏ అడ్డూలేకుండా భూమీ ఆకాశమూ, మేఘాలూ అన్నీ కనిపిస్తూ వుంటాయి. బుచ్చయ్య అక్కడున్న వరిపొలంలో పాలేరు పని చేస్తూ వుంటాడు. జమిందారింటి స్థలంకంటే తన పాక చుట్టూ వుండే స్థలమే చాలా ఎక్కువ అని తృప్తి పడే వాడు.

బుచ్చయ్య రోజూ సాయంత్రం వేళ పొలం పనుల్నుంచి ఇంటికి వచ్చాక పాక బయట నులక మంచం మీద కూర్చుని కొడుకు రంగయ్యని వొళ్ళో కూర్చో బెట్టుకుని బోల్డన్ని కబుర్లు చెప్పేవాడు.
“నీ బుడ్డోడికి మీ యమ్మ కాళ్ళ మీద పడుకోపెట్టి తానం సేయిస్తాది. నేనోమో గోటీ బిళ్ళ నేర్పిస్తా. ఉండేలెయ్యడం నేర్పిస్తా” అనే వాడు. అప్పుడు తలుపులమ్మ పాక బయటున్న పొట్టుపొయ్యి మీద అన్నం దించి, గంజి నీళ్ళు వేరే గిన్నెలో దింపుతూ అనేది.. “నీ యెవ్వారం బానే వుంది. చదూకునే పిల్లాళ్ళు గోటీబిళ్ళా వుండేలూ యేస్తారేటి” అని.
“యేదోలే నాకట్టా అనిపించింది అన్నానంతే. ఒరేయ్ నువ్వు బాగా సదువుకోరా. ఫెద్ద జమీందారు కారా పెపంచమంతా సూడరా ఆ పోతరాజు గారి పిల్లల్లాగ” అనే వాడు బుచ్చయ్య. రంగయ్యకి అట్టా అమ్మా అయ్యా అస్తమానూ తనగురించి మాటాడుకుంటా వుంటే ఎంతో బాగుండేది.

వేసవి కాలం వచ్చిందంటే రోజంతా తెగ తిరిగేవాడు వాళ్ళా స్నేహితులతోటి. తేగలూ, చెరుగ్గడలూ, పనసపిక్కలూ, మామిడికాయలూ, జామకాయలూ, రేగుపళ్ళూ, తాటిముంజెలూ తినేవాళ్ళు. కొనుక్కోవడముండేది కాదు, ఎవరివో చెట్లెక్కడమూ, పొదలు పీకడం అంతె . తోటి కుర్రాళ్ళతోటి పొలంగట్లమ్మట చెట్లెక్కడమూ, కాలువలో ఈతలు కొట్టడమూ, వానపాములు పట్టి చేపలు పట్టడమూ చేసేవాడు. అయ్యతో పొలం గట్లమీద కూర్చుని ఓ చిన్నబస్తాడు వేరుశెనక్కాయలు బండకేసి కొట్టి వొలిచి తినేశేవాడు. ఏంత కమ్మగావుండేవో అవి. పొద్దున్నే లేవంగానే దూరంగా సూరీడు కనిపించేవాడు, పిట్టలు కనిపించేవి, మబ్బులు కనిపించేవి – ఏ అడ్డూలేకుండా భూమీ ఆకాశాలు కనిపించేవి. ఆ రెంటికీ మధ్య జరిగేవన్నీ కనిపించేవి. దూరంగా గూడ్సు బండి రోకలిబండలా పాకుతూ కనిపించేది. కాకినాట్లో సూరీడు నిశ్శబ్దంగా ఉదయిస్తాడు, నిశ్శబ్దంగా అస్తమిస్తాడు…

ఇంతలో పెద్ద కారుహార్న్ చప్పుడికి ఉలిక్కిపడి ఊహల్లోంచి బయటకి వచ్చిచూస్తే తనెక్కడున్నాడో కాసేపు బోధపడలేదు. ఏ రోడ్డుమీదున్నాడో, వెల్తురెటువైపు నుంచి వస్తోందో, సూరిడు ఎటువైపున్నాడో, అసలు ఆకాశం ఎక్కడుందో కూడా కనిపించటంలా. న్యూయార్క్ వచ్చిన కొత్తలో ఈ పెద్ద పెద్ద మేడలు చూసి అయ్యా అమ్మా ఇయన్నీ చూస్తే ఎంత ఆశ్చర్యపోయేవారో అనుకునేవాడు. కానీ రానురాను ఈ మధ్య అనిపిస్తోంది “సూడబోతే మెడ నొప్పెట్టే మేడలు.. బూదేవికి సమాధులు లాగ” అని. ఇంక ఆ రోజుకి ఆలోచనలు ఆగిపోయాయి. గబగబా సెంట్రల్ పార్కుకి వెళ్ళి , పార్కులోని ఓ కొలను చుట్టూ వున్న జాగింగ్ ట్రైలులో ఆ రోజుకి నడక కానిచ్చి ఇంటికెళ్ళిపోయాడు రంగయ్య.

రంగయ్య కొడుకి కిష్టయ్య. ఇప్పుడైతే అందరూ కృష్ణ అంటారు కానీ వాడెప్పుడు అతనికి కిష్టయ్య, కిష్టిగాడే. కుంటముక్కల కిష్టయ్య.. కాకినాట్లో పీ. ఆర్. గవర్న్మెంటు స్కూల్లోనూ, జూనియర్ కాలేజీలోనూ, ఆ తర్వాత ఇంజినీరింగ్ కాలేజీలోనూ చదివాడు. భారతదేశంలో, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో I.T. పారిశ్రామిక వృధ్ధి ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో చాలామంది విద్యార్ధులకి, కులమూ, జాతీ ప్రమేయంలేకుండా సమానంగా అవకాశాలు , అభివృధ్ధికి మార్గాలూ వచ్చాయి. ఆ సమయంలో రంగయ్య తనకు చదువుకే అవకాశమూ, చదువుకోవాలన్న జ్ఞానము లేకపోయినా తన కొడుకు కిష్టయ్యని కనీసం ఏ పదో తరగతో చదివిస్తే తాలూకాఫీసులో ప్యూనుగానైన చేరొచ్చు. ఇంకాస్త ఎక్కువ చదువుకుంటే చిన్న గుమాస్తాగానైనా చేరితే హాయిగా ముసిలాడయ్యాక తనలాగా కాకుండా ముసలివయసులో కష్టపడనవసరము లేకుండా పించనూ వస్తుందనుకున్నాడు. కిష్టయ్య మాత్రం పదోతరగతిలో మంచి మార్కులు రావడమూ, గవర్నమెంటు కాలేజీలో ఇంటర్మీడియెట్లో సీటు రావడమూ, అందులో చాలా మంచి మార్కులు రావడంతో ఆ మేష్టార్లే ఇంజనీరింగుకి చేయించారు. రంగయ్యకి అదో పెద్ద అద్భుతం.

ఆ తరవాత దేశంలో I.T. రంగం పెద్ద విప్లవంలా, పెద్ద ఉప్పెనలా రావడంతో కిష్టయ్యకి కూడా ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా చెన్నై, బెంగుళూరు, బొంబాయి నగరాలు వెళ్ళాడు. ఆమెరికా ప్రాజెక్టులో పని చేసి, తరవాత కన్సల్టెంటుగా అమెరికా వచ్చి ఒక కంపెనీలోంచి ఇంకో కంపెనీలోకి మారి, ప్రస్థుతం న్యూయార్కు పట్టణంలో ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఒక హెడ్జ్ ఫండ్ కంపెనీలో నెట్ వర్క్ ఎడ్మినిస్ట్రేటరుగా చేరాడు. నెట్వర్క్ మైంటైను చెయ్యడం కంపెనీకి చాలా ముఖ్యమైన పని, నువ్వు ఆఫీసు దగ్గర్లోనే కంపెనీ ఎపార్టుమెంటులోనే వుండాలి అని కంపెనీవాళ్ళు అంక్ష పెట్టడంతో సిటీలోనే ఓ ఏభై అంతస్తుల మేడలో ఇరవై అయిదో అంతస్థులో వుంటున్నాడు. తండ్రి రంగయ్యని కూడా తెచ్చుకున్నాడు. ఆ విషయాలేవీ రంగయ్యకి అర్ధం కావు కానీ తన కొడుకొక పెద్ద ఆఫీసరు అని తెలుసంతే.

కిష్టయ్యకి జూనియర్ కాలేజీలో సీటూ వచ్చిన ఏడాదే రంగయ్య భార్య లచ్చి పోయింది. కారణం ఏమిటని డాక్టర్లని అడిగేంత ఇంగితం రంగయ్యకి లేకపోయింది. ఎందుకంటే ఒంట్లో కాస్త నలతగా వున్నంత మాత్రాన డాక్టర్ల దగ్గిరకి పరిగెత్తి పరీక్షలు చేయించుకుని మందులిప్పించేంత పరిజ్ఞానము, డబ్బూ వున్న కుటుంబం కాదాయె. రంగయ్యకి భార్య మీదా, కొడుకుమీదా, అమ్మ్మ మీదా ప్రేమ వుంది కానీ, ఏవో ప్రణాళికలు వేసి, జాగ్రత్తపడి పనులు చేసేంత వ్యవహార దక్షతా, పరిజ్ఞానమూ లేదు. అందులోనూ పెళ్ళయేంతవరకూ తన పనులన్నీ అమ్మే చూసేది. ఆ తరవాత అమ్మాభార్య లచ్చి కలిసి ఇంటి పన్లు అన్నీ చూసుకుఏవారు. రంగయ్యేమో బయట పొలం పనులు తర్వాత ఒక మిల్లులో కూలీ పనులు చేస్తూ వుండే వాడు.

కొడుకు పదో తరగతి పాస్ అవ్వడం, జూనియర్ కాలేజీలో చేరడంతో లచ్చి కాస్తా లక్ష్మిగా మారింది. కొడుకు కిష్టయ్య కృష్ణ అయ్యాడు. అమెరికా వచ్చి mr. కృష్ణా కుంటముక్కల అయ్యాడు. లక్ష్మి పోయేటప్పటికి కిష్టయ్యకి పదిహేడేళ్ళు. రంగయ్యకి ముప్పై తొమ్మిదేళ్ళు. అప్పట్నుంచి రంగయ్యకి కిష్టయ్యే ప్రపంచం. అమ్మ పోయాక నానమ్మ తల్లయింది. ఇంట్లో పనులన్నీ చేసేది. కిష్టయ్యకి కూడా తండ్రంటే ఎంతో గౌరవం, ప్రేమ, కృతజ్ఞత.

అందుకనే భారత దేశంలో వున్నప్పుడు ఎప్పుడు వీలయితే అప్పుడు తండ్రికి తను వెళ్ళిన వూర్లన్నీ చూపించేవాడు. రంగయ్య చెన్నై, బెంగుళూరు, బొంబాయి నగరాలు చూశాడు. వెళ్ళిన ప్రతీ వూరూ ఎంతో అబ్బురంగా అనిపించేది. అయ్యె కనక బతికి వుంటే, ఇయన్నీ చూసి వుంటే ఎంత బాగుండేదో అనుకునేవాడు. కొడుకు తనని ఖరీదయిన హోటలుకి తీసుకు వేళితే అమ్మా అయ్యా గుర్తుకొచ్చేవాళ్ళు. ఈ బిర్యానీ, ఈ పళ్ళ రసాలూ, ఈ నూడుల్శూ, ఈ సూపులూ, చౌమీన్లూ చూసి ఏమనేవాడో అని ఊహించుకునేవాడు. కాలం ఇంత తొందరగా తనలాంటి అట్టడుగు జాతి వాళ్ళకి ఇన్ని అవకాశాలు కల్పిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. తన తండ్రీ, తాత, ముత్తాతలు, లెక్క పెట్టగలిగినన్ని తరాల వెనక వరకూ అందరూ కూలోళ్ళే. అంత కంటే ఇంకో జీవితం వుంటుందని, ఇలాంటి పెపెంచం వుంటుందనీ ఊహించను కూడా అనుకోలేదు.

చిన్నపాలెం దాటాక కోదాడ. కోదాడ దాటాక లాకులు. ఆ లాకులు దాటాక ఓ పెద్ద తార్రోడ్డు. దాని మీద రూటు బస్సులు వెళ్ళేవి. అ తార్రోడ్డు దాటాక వుండె ప్రపంచం రంగయ్యకో రోదసీ మండలం. ఆకాశంలో నక్షత్రాలెలాగో ఆ తార్రోడ్డుకవతలుండే ప్రపంచం అంత దూరం!

మరి ఈ కంప్యూటర్ల యుగమంట, సాఫ్ట్వేరంట .. అదేంటో తెలియదు కానీ దేశంలో ఎక్కడెక్కడో మూలనున్న వాళ్ళని బయటకు తెచ్చింది. తెలివితేటలుంటే చాలు, కాస్త చదువుంటే చాలు, ఎన్నెన్నో మెట్లు పైకెక్కే అవకాశాలు బోల్డన్ని ఇచ్చింది. అంతెందుకు కిష్టిగాడికి పదో తరగతినుంచి ఒక క్లాసుమేటుండేవాడు. మంచి కుర్రాడు. బుల్లెయ్యని పిలిచేవాళ్ళు. ఇద్దరికీ జత బాగా కుదిరింది. కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి అల్లరి చేసేవాళ్ళు. వాళ్ళు తనలాగే కూలోళ్ళనుకున్నాడు. ఓ రోజు మాటల్లో “మీ నాన్నేం చేస్తాడు” అని అడిగాడు బుల్లెయ్యని. ముందర బదులు చెప్పలేదు. కొన్ని రోజులకి మళ్ళీ అడిగితే చెప్పడానికి తటపటాయించాడు. సర్లే అని ఊరుకున్నాడు. తరవాత కిష్టిగాడు చెప్పాడు – వాళ్ళ అయ్య పాకీ పని చేస్తాడని. తనే అనుకుంటే తనకన్నా కనికిష్టం అనుకున్నాడు. ఇప్పుడా బుల్లెయ్య కాలిఫోర్నియాలో వుంటున్నాడట. ఆ మధ్యోసారి వచ్చి కలిసాడు. అందరూ కలిసి కార్లో స్టాట్యూ ఆఫ్ లిబెర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగూ అన్నీ చూసొచ్చారు.

తల్చుకుంటే ఇంతకంటే అద్భుతం ఇంకోటుంటుందా అనిపించింది రంగయ్యకి. కాలం మారింది.. నిజంగా మారింది ... తన ముత్తాత నుంచి తాత వరకూ వున్న పాతిక సంవత్సరాలు లాంటివి కావు తన నుంచి తన కొడుకుకి వున్న పాతిక సంవత్సరాలు. ఇవి ఎంతో విభిన్నమైనవి. అనూహ్యమైనవి.

కొడుకుతో ఏ వూరెళ్ళినా ఏ కొత్త విషయం చూసినా ఏ కొత్త వంటకాలు రుచి చూసినా ఒక్క సారి అయ్య మనసులోకి వచ్చి అయ్యో అనిపించేది. ఇక అమ్మ గుర్తుకొస్తే మనసు ముక్కలయ్యేది. పోయిన అయ్యని ఎలాగూ తీసుకు రాలేడు. బతికున్న అమ్మకూడా ఆ చిన్నపాలెంలోనే ఆ గుడిసెలోనే ఆ చుట్టుపక్కలే వుండిపోయింది. అప్పుడే వుద్యోగంలో చేరిన తన కొడుకు తనను వూరూరా తిప్పడమేకాక బామ్మని కూడా ఎట్టా తీసుకెళ్తాడు? కొడుకు ఉద్యోగరీత్యా అన్ని వూర్లు తిరిగినా తనని రమ్మని పిలిస్తే వెళ్ళాడు, అన్నీ చూసాడు కానీ, అమ్మని, తల పండిపోయిన తలుపులమ్మని ఎట్టా తీసుకెళ్తాడు? కొడుకుని అడగడానికి నోరు చెల్లలేదు. కానీ అమ్మకి ఈ కొత్త ప్రపంచం చూపలేదని కడుపులో కలుక్కుమనేది, మనసులో చివుక్కుమనేది.

కొడుకింకా మంచోడు కాబట్టి తనైనా ఇంత చూసాడు. కడలి లాంటి రోడ్డుమీద పడవలాంటి కార్లు, ఎమ్యూజ్మెంటు పార్కులు, ఎత్తైన మేడలు, పెద్ద సోఫాలూ, పెద్ద రంగుల టీ.వీలూ అయన్నీ అమ్మకోసారి చూపిస్తే.. “ఏటిరా రంగా, ఇది మన పెపంచమేనాట్రా? నచ్చత్రాల్లో వున్నట్టుందిరా!” అని పళ్ళులేని బుగ్గలు ఇంకొంచెం లోపలికిపోయేలా నొక్కుకుంటే గర్వంగా కొడుకు ప్రయోజకత్వం అమ్మకి చూపాలని తన మనసులో ఎదో ఇది.

అస్తమానూ అమ్మని గురించి మాట్లాడేసరికి కొడుకు కిష్టయ్య విసుక్కునేవాడు. “అయ్యా, నీ కాయం ఇక్కడుంది కానీ నువ్విక్కడ లేవు.. ఇన్ని కొత్త విషయాలు చూపిస్తే ఆనందించక ఏటదీ?” అనే వాడు. ఇంక మనసు చిన్నబుచ్చుకుంటాడేమోనని ఊరుకుండేవాడు. ఆయ్య పోయినప్పటినుంచి అమ్మే తనని పెంచింది. కూలిపని చేసి ఇంటికొచ్చేసరికి ఏడిబువ్వ సిద్ధం చేసి పెట్టేది. ఆయ్య పడుకునే నులకమంచమ్మీద తను కూర్చునుంటే చూసి “నీ అయ్య పోలికే నీది” అనేది. అలా అనడంలో అమ్మకి తనంటే ఎంతిష్టమో తెలిసేది. తనలా తన కొడుకులా ఏ పెపంచం చూసిందని, ఏ భాష నేర్చిందని ఇంతకంటే తన ప్రేమని, అయ్యలేకపోవడాన్ని ఇంకెలా వెల్లడించగలదు?

న్యూయార్కులో వున్న ఈ చిన్న అపార్టుమెంటులో తండ్రి రంగయ్యుండడమే విశేషం. ఇంక తన అమ్మని కూడా ఎక్కడ తీసుకురాగలడు? ఇలా ఎన్నో ఆలోచనలు రంగయ్యకి. ప్రతీరోజూ నడకలో ఇవన్నీ మననం చేసుకుంటూ వుంటాడు. రంగయ్యకిప్పుడు ఏభై రెండేళ్ళు. కొడుకుకి ఇరవై తొమ్మిది. తలుపులమ్మకి డెబ్బై యేళ్ళు. కొడుకుకి పెళ్ళై కోడలు నీళ్ళోసుకుంటే ఇంకో ఏడాదికి మనవడిని చూసి ఇంక తాను చిన్నపాలెంలో వుండి పోవచ్చు అమ్మ ఇంకా బతికుంటే తను చూసుకోవచ్చును అని ఆలోచన.

ప్రతీరోజులాగానే ఆ రోజు నడూస్తున్నాడు. ఆ రోజు కొంచెం వొంట్లో నలతగా వుంది. కొంచెం చలిగాలి వీస్తోంది.. ఒళ్ళుకూడా వెచ్చగా వుందేమో.. పొద్దున్నే లేవలేక పోయాడు. ఎలాగో అలాగ ఆలీసెం అయినా, ఇంట్లో ఒక్కడూ వుండి చేసేదేముందిలే అని బయలుదేరాడు. ఆఫీసుకెళ్ళబోతూ క్రిష్ణ “అయ్యా, జాగ్రత్త. ఫోన్ తీసుకెళ్ళు. నీకేమైనా బాలేకపోతే – నాకు ఆఫీసుకి కాల్ చెయ్యి. ఓక వేళ అంతగా అర్జెంటయితే తెలుసు కదా 911 అన్న నంబరు నొక్కాలి” అని చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకెంత మంచివాడో అని ఆనందపడిపోయాడు. మొదట్లో తను నడకకి వెళతానంటే – నువ్వు దారి తప్పుపడిపోతే నాకు ఫోను చెయ్యి అని ఇచ్చాడు ఈ సెల్ ఫోను. ఆది తీసుకుని “మాంత్రికుడి మంత్రదండం ఎంత మాయదో ఇదీ అట్టాగే వుంది” అన్నట్టుగా భయంతో , గౌరవంతో పట్టుకున్నాడు. దాన్ని ముట్టుకుంటే ఏ కొండ గుహలోకి తనని మాయం చేసేస్తుందో అనుకుని జేబులో భద్రంగా పెట్టుకుని దాన్ని అనవసరంగా తాకేవాడు కాదు.

6th Avenue లో టైము లైఫ్ బిల్డింగు దగ్గరకొచ్చెసరికి రొమ్ములో కొంచెం నొప్పనిపించింది. గతం గుర్తుకొచ్చింది. ఓ రోజున పొద్దున్నే అయ్య బుచ్చయ్య పొలం పన్లోకి వెళుతూంటే రొమ్ము దగ్గర కాస్త నొప్పనిపించి నులక మంచం మీద కాసేపు కూర్చుని “ఓ ముంతతో నీళ్ళందుకోరా” అని కొడుకునడిగాడు. రంగయ్య నీళ్ళిస్తే అది తాగి లేచి మళ్ళీ బయలుదేరుతూ “ఇదిగో మీ యమ్మతో సెప్పు, నాకియ్యాల ఓ మాదిరిగా వుంది. మద్దేనానికి సద్దికూడులోకి ముక్కల పులుసు తెమ్మని” అని చెప్పి వెళ్ళీపోయాడు. అంతే ఆ ముక్కలపులుసందేలోపలే పోయాడు. తనకప్పుడు తొమ్మిదేళ్ళు.

రొమ్ము మీద ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. “అయ్యా!” అని గెట్టిగా అరిచాడు. ఒక్క సారి తానెక్కడున్నాడో చూసుకున్నాడు.. ఎదురుగా రేడియో సిటీ మ్యూజిక్ హాల్ అని కనిపిస్తోంది. జరిగిందేమిటో అర్ధం అయ్యింది. కొడుకుకి కబురు చెప్పాలి అని జేబులోంచి ఫోను తీసి కొడుకి స్పీడ్ డయల్ చేసేడు.
“ఏరా కిష్టయ్యా .. నాకు ఎట్టాగో వుందిరా…”
కృష్ణ కంగారుగా “ఎక్కడున్నావు?” అని అడిగాడు.
ఇదిగో ఈ రేడియో సిటీ ఎదురుగా .. ఫౌంటేనుంది కదా – దాని గట్టు మీద కూర్చున్నా”..
“అక్కడే వుండు. నేను వస్తున్నా” ఆని వెంటనే బయలుదేరాడు కృష్ణ.

రంగయ్య కళ్ళు తెరిచేసరికి పెద్ద హాస్పిటల్లో చుట్టూ చాలా ట్యూబులూ, ఎన్నెన్నో పరికరాలూ, మందుల వాసనలూ…కొంచెం దూరంగా కుర్చీలో కృష్ణ. నెమ్మదిగా తెలివి వచ్చింది. జరిగింది లీలగా గుర్తుకొచ్చింది. తను ఆ ఫౌంటెన్ గట్టు మీద కాసేపు కూర్చుని ఆయాసపడడమూ, ఆ గట్టుమీదే ఒరిగిపోవడమూ, కొడుకు రావడమూ, వెంటనే ఏవరో ఇద్దరు మనుషులు తనని స్ట్రెచరుమీద అంబులెన్సులోకి ఎక్కించడమూ .. పెద్ద చప్పుడు చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళడమూ గుర్తుంది అంతే.. తరవాత ఏ లోకంలోకి వెళ్ళి వచ్చాడో.. ఏమి కలవరించాడో…

తరవాత క్రిష్ణ చెప్పాడు ఏమి జరిగిందో. రంగయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. “ఇలాగ రొమ్ముపోటొచ్చి చచ్చిపోయేవాళ్ళని కూడా రక్షించేస్తారా ఈ కాలంలో. ఇంత మారిపోయిందా కాలం” అని. అది ఒక ఊహకందని విషయం. రంగయ్యకి అప్పుడనిపించింది .. “ఆ చిన్నపాలెంలో తన భార్య లచ్చికీ, అయ్యకీ ఇలాగే తొందరగా వైద్య సహాయం అంది వుంటే ఇప్పుడు ఇంకా బతికే వుండేవారుకదా అని. ఇన్ని అనుకోని అద్భుతాలు చూపించిన కాలం, ఆ యిద్దరూ కాలం చేయకుండా ఆపగలిగితే ఎంత బాగుండేది” అని…

హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక – ఓ రోజున కృష్ణ అన్నాడు రంగయ్యతో ..
“ఎల్లుండి ఆదివారం నాడు… మనం ఏర్ పోర్టుకి వెళ్ళాలి”
“ఎయిర్ పోర్టుకా? ఎందుకు? ఎవరు వస్తున్నారు?” మొన్నామధ్యేగా బుల్లయ్యా, పెళ్ళాము వచ్చారు కదా, ఇంకెవరైనా వీడి స్నేహితులొస్తున్నారేమోనని వాళ్ళని రిసీవ్ చేసుకోడానికి వెళ్ళాలేమోనని అనుకున్నాడు రంగయ్య.
“బుల్లయ్యే వస్తున్నాడు మళ్ళీ.. కానీ .. బుల్లయ్యతో పాటుగా ఇంకెవరో కుడా వస్తున్నారు”.. ఎవరయి వుంటారబ్బా అని ఆలోచిస్తూంటే. బుర్రకి తట్టటంలేదు. అప్పుడు కృష్ణ అన్నాడు…“నాయనమ్మ! ఎంపైర్ స్టేటు బిల్డింగు ఎక్కించి న్యూ యార్కు నగరమంతా చూపించవా మరి నాయనమ్మకి?” రంగయ్య ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. “కిష్టిగా…నా కన్నయ్యా..” అని కొడుకుని గట్టిగా కౌగలించుకున్నాడు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)