ఎవరికెవరు తోడున్నా - ఎవరికెవరు కారు కన్నా
నీకు నేను అంటున్నా - నీవు ఒంటరే నాన్నా
నాది నీది మాటల మధ్యే వలయమేదో సృష్టించావు
ఇది ఎంతకాలమో తెలియని కానరాని స్వప్నమేనని ||ఎ||
కలువపువ్వు నేననుకున్నా - కలత రానే రాదనుకున్నా
కనులు తెఱచి చూసే వేళ - కానరాని అడవిలో ఉన్నా
రానేరాదు అనుకునేవేళ - నేనే రాధనవుతున్న
నవ్వుకునే వేళలోన - నగుబాటుగా దాక్కుంటున్నా ||ఎ||
కానరాని స్వర్గమేదో కనబడుతుందనుకున్నా
కడకురాని నేస్తమేదో కాపాడుతుందనుకున్నా
కన్నీళ్ళు నిండుతుంటే - కన్నతల్లిననుకున్నా
కాళ్ళకేదో తగులుతు ఉంటే - పేగుబంధమేననుకున్నా ||ఎ||
వలదు వలదు అంటూనే విలవిలలాడుతున్నా
కలదు కలదు అంటూనే కడుపు నింపుకోలేకున్నా
అయినవాళ్ళ మధ్యలోనే అలసిసొలసిపోతున్నా
అల్లనల్లన కనబడే కన్నయ్యే చాలనుకున్నా ||ఎ||




























