ఆంగ్ల మూలం: Pulitzer బహుమతి గ్రహీత, ఝుంపాలాహిరి
INTERPRETER OF MALADIES నుండీపెద్ద కథ (మొదటి భాగం)

బోరీమాకి రెండు రాత్రుల నుండీ కంటిమీద కునుకు లేదు. దాంతో ఆమె మూడోరోజు పొద్దున్నే పక్క బట్టలు దులపడం మొదలుపెట్టింది. ఒకసారి అక్కడికక్కడే, ఆ పోస్టుబాక్సుల క్రిందనే దులిపింది. ఆ తరువాత బయటికి దూరంగా పట్టుకుపోయి బలంగా మళ్ళీ దులిపింది. ఆ చప్పుడుకి పక్కనున్న పెంటదిబ్బమీద తిండి కోసం వెతుకులాడుతున్న కాకులన్నీ భయంతో "కావ్, కావ్"మంటూ కంగారుపడుతూ కకావికలుగా ఎగిరిపోయాయి.

బోరీమాకి ఆ మేడ మెట్లను రోజుకి రెండుసార్లు పై నుండి కిందకంతా శుభ్రంగా ఊడిస్తేగానీ తృప్తిగా ఉండదు. నాలుగంతస్థుల మేడమెట్లు ఎక్కాలంటే ఈ మధ్య బోరీమాకి కష్టమవుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, మోకాళ్ళు వాచిపోయి బాధ మొదలౌతుంది. పక్కబట్టలు ఒక్కసారి ఎండలో వేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన రావడంతో ఆమె పక్క చుట్ట, బక్కెట్టు, చీపురు కట్ట ఒకే చేత్తో పట్టుకుని రెండవ చెయ్యి మోకాలిచిప్ప మీద ఆనించి నెమ్మదిగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. ఇటీవల ఆమెకు ఆ మెట్లు ఎత్తు పెరిగిపోయినట్లుగా తోస్తోంది. వాటిని ఎక్కటం అంటే నిచ్చెన ఎక్కడంలా ఉంటోంది ఆమెకు ఈ మధ్య!

అరవైనాలుగేళ్ళు వచ్చేశాయి ఆమెకు. నెత్తిమీద పోక్కాయంత జుట్టు ముడితో, సన్నగా బద్దలా, ఎటుచూసినా ఒకేలా ఉంటుంది బోరీమా. ఆమెలో స్ఫుటంగా ఏదైనా ఉందీ అంటే అది ఆమె కంఠస్వరం మాత్రమే! రెండు పూట్లా మేడమెట్లు ఊడుస్తూన్నప్పుడల్లా, మొరటు తేలిన కంఠస్వరంతో తన కష్టసుఖాలన్నీ ఏకరువు పెడుతుంది.

దేశ విభజన తర్వాత తూర్పు బెంగాల్ నుండి తాను ఎలా వెళ్ళగొట్టబడిందో, ఆ సమయంలో తాను ఎన్నెన్ని కష్టాలను అనుభవించిందో, భర్త-పిల్లలు తనకి ఎలా దూరమయ్యారో వగైరా విషయాలన్నీ ఏకబిగిన గుక్కతిప్పుకోకుండా చెపుతూంటుంది బోరీమా. తన రెండంతస్థుల మేడ, బీరువా, డబ్బులు దాచుకునే పెట్టెలు - అన్నిటిని గురించి చెపుతూనే ఉంటుంది. వాటి తాలూకు గుర్తులుగా ఇప్పటికీ మిగిలి ఉన్న ఆ పెట్టెల తాలూకు తాళం చెవుల గుత్తి, తదుపరి జీవితంలో ఆమె సంపాదించి కూడబెట్టుకున్న చిల్లరడబ్బులతో పాటుగా ఇప్పటికీ ఆమె కొంగు చివర ముడిపెట్టబడి వేళాడుతూ ఉంటాయి. నిత్యకృత్యంగా, అలా మెట్లు తుడుస్తూ తన పాత జీవితం గురించి వెళ్ళబోసుకోవడం అన్నది, ఆమెకు ఒక వ్యసనమైపోయింది.

ఆమె జీవితంలో అన్నీ కష్టాలే అనుభవించింది అనుకోవడానికి లేదు. కొన్ని సుఖప్రదమైన రోజులు కూడా ఉన్నాయి అనిపిస్తుంది, ఆమె మాటలు వింటే! అలా కష్టసుఖాలు తవ్విపోసుకోవడం పూర్తయేసరికి ఆమె ఆ నాలుగంతస్థుల మెట్లు తుడవడం పూర్తయ్యేది. ఆమె కంచు కంఠం ఆ బిల్డింగులో కొందరిని ఆకర్షించేది. వాళ్ళు వచ్చి ఆమె మాటలు వినేవారు. వాళ్ళు అలా వింటున్నారంటే చాలు. ఆమె మరీ రెచ్చిపోయి చెప్పేది తన గతాన్ని, ఆనాటి వైభవాన్ని.

ఆమె తన మూడవకూతురు పెళ్ళి సమయంలో తాము చేసిన ఘనమైన విందును గుర్తుచేసుకునేది తఱచుగా - "మా మూడవ అమ్మాయిని ఒక పెద్ద స్కూలు నడిపే ప్రిన్సిపాలుకి ఇచ్చి చేశాము. ఆ పెళ్ళి విందుకి రోజ్ వాటరుతో అన్నం వండారు. మేయర్ని భోజనానికి పిలిచాం. భోజనాలు చేశి అందరూ వెండిగిన్నెల్లో చేతులు కడుక్కున్నారు, తెలుసా" - అనేది.

ఇక్కడికి వచ్చేసరికి ఇక దమ్ము చాలక కాసేపు ఆగేది ఆమె. చంకలో ఉన్న సామాను జారిపోతుంటే సర్దుకునేది. అక్కడొక బొద్దింక కనిపించిందనుకోండి, బోరీమా దాన్ని బయటకు తరుముతూ కూడా చెబుతూండేది - "ఎన్నెన్నో వింత వింత రుచుల వంటలు, ఒక్కటికూడా వదలకుండా, అన్నీ చేశారు. ఆవ కలిపి రొయ్యల్ని అఱటి ఆకుల్లో చుట్టి వండారు. ఆ రోజుల్లో అది మాకొక ఖర్చే కాదు. మేము వారానికి రెండు సార్లు మేక మాంసం వండుకునేవాళ్ళం. మా తోటలో చెఱువు నిండా చేపలు బిలబిలలాడుతూ ఈదుతూ ఉండేవి. ఆ రోజులే వేరులే!" - ఉసూరుమనేది బోరీమా.

రెండంతస్థులు ఎక్కేసరికి బోరీమాకి మెట్లపైనుండి కొంచెం వెలుగు కనిపించింది. అప్పుడు సమయం ఎనిమిది గంటలే అయినా ఆ మెట్లు సూర్యుడిధాటికి అప్పుడే వెచ్చబడటం మొదలెట్టాయి. అది చాలా పాతకాలపు మేడ. సౌకర్యాలు తక్కువ. వాడకానికి నీళ్ళు డ్రమ్ముల్లో నిలువ చేసుకోవాలి. కిటికీలకు అద్దాల తలుపులు లేవు. పిట్టగోడలు కూడా అందంగా మలచినవి కావు. కేవలం ఇటుకలు మాత్రమే ఉపయోగించి కట్టినవి. ఆ మేడ ఏ విధంగానూ తదుపరి నిర్మాణాలతో పోటికి రాలేదు.

బోరీమా మెట్లు సగం వరకు ఎక్కడం అయ్యింది. మిగిలిన సగం పూర్తి చేస్తూ మళ్ళీ గతాన్ని తలపోయసాగింది ఆమె గొంతెత్తి చెప్పడం మొదలుపెట్టింది. " ఆ రోజుల్లో ఒకరు జామకాయలు, ఖర్జూరాల కోసం వస్తే, మరొకరు మందారాలు - మల్లెపూలు కోసుకోడానికి వచ్చేవారు. జీవితం అంటే అది! ఇప్పుడిక్కడ నేను అంటగిన్నెల్లో ఆదుగూబొడుగూ మిగిలిన మెతుకులు తిని బ్రతుకుతున్నాను" - అంది ఆమె బాధగా. సరిగా ఆ సమయంలో వాచి ఉన్న మోకాళ్ళలో "ఛురుక్కు"మని పోటు మొదలయ్యింది. అయినా ఆమె మాటలు ఆపకుండా నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ మాటాడుతూనే ఉంది.

"సరిహద్దు దాటి వచ్చేసరికి ఇంకా నా చేతిని రెండు జతల బంగారు గాజులు మిగిలే ఉన్నాయి - అన్న విషయం చెప్పానా? ఒకానొకప్పుడు నా కాళ్ళు పాలరాతి నేలమీద తప్ప మరోచోట నడిచి ఎరగవు. నువ్వు నమ్మూ నమ్మకపో! అలాంటి సుఖం నువ్వెప్పుడూ రుచి చూసైనా ఉండవ్" అంటూ పోటు పెరుగుతున్న చోట మోకాలిని అరచేత్తో రుద్దుకుంది బోరీమా.

ఆమె మాటల్లో నిజమెంతో ఎవరికీ తెలియదు. కానీఒకటి మత్రం చెప్పక తప్పదు - రోజురోజుకీ గతంలోని ఎస్టేట్ ఉరవ, బీరువాల్లో ఇనప్పెట్టెల్లో ఉన్న సంపద పరిమాణం, మొదలైన వాటి అంచనాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతుంటాయి.

ఆమె ఒక కాందిశీకురాలన్న విషయంలో మాత్రం ఎవరికీ ఏ సందేహం లేదు. ఆమె మాటలోని యాస కూడా ఆమె తూర్పు బెంగాల్ నుండీ వచ్చిన మనిషేనని ధృవీకరిస్తుంది. అయినా ఆ మేడలోని జనం, బోరీమా తన పూర్వ వైభోగాల్ని గురించి నిరంతరం చెప్పే మాటల్ని మాత్రం నమ్మలేకపోతున్నారు. అంతేకాక ఆమె వేలాది ఇతర శరణార్ధుల్లాగే గంజాయి ఆకుని తెచ్చే లారీల్లో నక్కి, త్ర్పు బెంగాల్ సరిహద్దు దాటి వచ్చి ఉండవచ్చునన్న భావన కూడా వాళ్ళకు నచ్చట్లేదు. కానీ ఆ విషయం అడిగితే బోరీమా, తాను ఎడ్లబండి మీద సరిహద్దు దాటివచ్చినట్లు చెప్పేది.

"బోరీమా! ట్రక్కా, ఏడ్లబండా? ఏమెక్కి వచ్చావు ఇక్కడికి" అని ఎవరడిగినా ఆమె చెప్పే సమాధానమదే. ఆడుకునే పిల్లలు కూడా ఆమె అటుగా వెడుతూ కనిపిస్తే అదే ప్రశ్న అడుగుతుంటారు. విసుక్కోకుండా ఆమె జవాబు చెపుతూనే ఉంటుంది. కొంగుచివర కట్టి ఉన్న తాళం చెవుల గుత్తి గలగలలాడిస్తూ. కానీ అప్పుడప్పుడు మాత్రం "నేను ఏమెక్కి వస్తే మీకెందుకర్రా! ఎందుకలా తమలపాకుకి రాసిన సున్నాన్ని పీకాలని చూస్తారు? మీరు నమ్మండీ, నమ్మకపొండి - నేను నా జీవితంలో పడ్డ కష్టాల్లాంటివి మీరు మీ కలలో కూడా అనుభవించి ఉండరు" అంటూ విసుక్కునేది.

ఇవి ఆమె గతాన్ని గుఱించి మనకు తెలిసిన విషయాలు. కాని ఆమె ఒకసారి చెప్పినదానికి భిన్నంగా మరొకసారి చెప్పేది. ఇప్పుడు ఆమె ఉన్న దుస్థితిని చూసి ఎవరూ ఆమె మాటను పూర్తిగా కొట్టిపారెయ్యలేరు.

మూడవ అంతస్థులో కాపురం ఉండే దలాల్, వెడుతూ మెట్లుతుడుస్తున్న బోరీమాని తప్పించుకుని, పక్కనుండి దిగుతూ అనుకునే వాడు, "ఈమె ఉంది కనుక ఈ మెట్లు శుభ్రంగా ఉన్నాయి గాని, లేకపోతే ఈ ఇంటి యజమాని అసలు ఈ మెట్ల విషయం పట్టించుకునేవాడా?" అతడు కాలేజి వీధిలో రబ్బరు ట్యూబులు, పైపులు మొదలైనవి అమ్మే హోల్‌సేల్ షాపులో జమాఖర్చుల తాలూకు దస్త్రాలు సరిగా ఉండేలా చూసుకునే గుమాస్తా ఉద్యోగంలో ఉన్నాడు.

పాపం! కుటుంబాన్నంతా ఒకేసారి పోగొట్టుకుని, ఆ దుఃఖాన్ని దిగమింగుకునేందుకు ఈ బోరీమా కల్లబొల్లి కబుర్లు చెపుతూంటుంది - అనుకునేవారు, ఉబుసుపోక కబుర్లు చెప్పుకునేటప్పుడు, ఆ మేడలో కాపురముండే ఇల్లాళ్ళు సానుభూతితో. "బోరీమా దేశ విభజన సమయంలో బలైపోయిన కుటుంబానికి చెందినదని తెలుస్తూనే ఉంది. కానీ ఆమె నోరు మహా చెడ్డది" అనేవాడు ముసలి ఛటర్జీ మాత్రం నిరసనగా.

అతడు తన ఇంటి బాల్కనీ విడిచి కాలు బయట పెట్టకపోయినా, ఒక్క వార్తా పత్రికైనా మడత విప్పి చూడక పోయినా, తన అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించడంలో మాత్రం మంచి ధాష్టీకం చూపించేవాడు. బోరీమా తన పూర్వపు వైభవాన్ని గురించి చెప్పే మాటల్ని ఒప్పుకోలేని వారిలో ఆయన ప్రథముడు.

బోరీమా వెనకటి రోజుల్లో ఏ జమీందారు ఇంట్లోనో ఒక పనిమనిషిగా ఉండి ఉంటుందనీ, అందుకనే భోగభాగ్యాల్ని గురించిన సంగతులు ఆమె అంత చక్కగా చెప్పగల్గుతోంది - అన్న మాట కూడా కొంతవరకు ప్రచారంలో ఉంది. ఏది ఏమైతేనేం, ఆమెతో ఆ మేడలో ఉన్నవారికి మంచి కాలక్షేపం జరిగిపోతోందన్నది నిర్వివాదాంశం. పోస్టుబాక్సుల క్రింద ఆమెను ఉండనిచ్చిన దానికి బదులుగా ఆమె, ఆ మేడ తాలూకు వంకరటింకర మెట్లన్నీ రెండు పూటలా శుభ్రంగా ఊడ్చిపెట్టేది. ఆమె ఆ మెట్లు శుభ్రం చెయ్యడమే కాదు గేటుకి దగ్గరలో పగలూ రాత్రీ గడుపుతూ, ఆ ఇంటిని గేటు బయట ఉన్న దుర్మార్గ ప్రపంచం నుండి రక్షించే కాపలాదారుగా (ఒక దర్వాన్ లా) కూడా ఉపయోగపడేది. క్రమంగా ఆమె వల్ల జరిగే ఉపకారాన్ని గుర్తించి, ఆ ఇంట్లో కాపురముండే వారందరూ ఆమె అంటే ఇష్టపడటం మొదలుపెట్టారు.

ఆ మేడలో కాపురాలుండే వారెవరికీ పెద్దగా దొంగలు ఆశ పడేటంత విలువైన సామానులేవీ ఉండేవి కావు. రెండవ అంతస్థులో ఉండే విధవరాలు మిసెస్ మిశ్రాకి మాత్రమే టెలిఫోన్ ఉండేది. అయినా ఆ ఇంట్లో జనానికి బోరీమా గుమ్మంలో అహర్నిశలూ దర్వాన్‌లా కాపలా ఉండటం బాగా నచ్చింది. వాళ్ళు ఒక రిక్షాని పిలవాలన్నా, ఫ్యాన్సీ సామానులు, బట్టలు వగైరా అమ్మేవాళ్ళని కేకెయ్యాలన్నా బోరీమాను ఉద్దేశించి ఒక్క కేక వేస్తే చాలు, పనిజరిగిపోయేది. అంతేకాదు, ప్రహరీ గోడ పక్కన ఎవర్నీ ఉమ్మడం గానీ, ఇతరత్రా గానీ చేయనిచ్చేది కాదు. ఎవరైనా గోడ పక్కన గానీ, గేటు దగ్గర గానీ తారట్లాడుతున్నట్లు కనిపిస్తే ఊరుకోకుండా చీపురు కట్ట పట్టుకుని వెంట తరిమేది ఆమె.

నిజం చెప్పాలంటే, తన బాధ్యతలాగా బోరీమా చేస్తున్న పని, సరిగ్గా భాగ్యవంతుల ఇళ్ళల్లో ఒక దర్వాన్ చేసే పనితో సమానం. నిజానికి ఆ పని ఎక్కడా ఆడవాళ్ళు చేయకపోయినా, ఇక్కడ మాత్రం బోరీమా దానిని ఎంతో శ్రధ్ధాసక్తులతో చేసేది.

ఎంతో కష్టంతో నాలుగంతస్థులు ఎక్కి డాబా మీదకి చేరుకున్న బోరీమా తన పక్కబట్టలన్నీ దులిపి దండెం మీద ఆరేసింది. బోరీమా అలవాటుగా నాలుగువైపులా పరికించి చూసి, డాబా మీద ఉన్న కుళాయి దగ్గర మొహం కడుక్కుంది. వేళ్ళతో పళ్ళుతోముకుంది. ఆ తరువాత దండెం మీద ఆరేసిన బొంతల్ని చీపురుకట్టతో రెండువైపులా బాది, దుమ్ము దులిపింది. మధ్య మధ్య దులపడం ఆపి, తనకు రెండు రాత్రుల నుండి నిద్ర లేకుండా చేసిన పాపిష్టి జీవులేవైనా క్రింద రాలాయేమోనని వెతికి చూసింది. ఆమె తన పనిలో నిమగ్నమై ఆ డాబా మీద నిమ్మకాయల్ని ఆరబెట్టడానికి వచ్చిన దలాల్ భార్యని చలాసేపటివరకు గమనించనేలేదు. ఆమెను గుర్తించగానే పలకరించింది బోరీమా.

ఈ బొంతల్లో ఏం పురుగులు జేరాయో గానమ్మా, అవి కసి పట్టినట్లు నాకు రాత్రులు నిద్ర పట్టకుండా చేసి వేపుకు తింటున్నాయి. నీకేమైనా కనిపిస్తాయేమో కాస్త చూసిపెట్టమ్మా" అని అదిగింది.

దలాల్ భార్యకు బోరీమా మీద వల్లమాలిన సానుభూతి. అప్పుడప్పుడూ ఆమె బోరీమాకి రవ్వంత అల్లం ముద్ద సంకటిలో వేసుకోవడానికి ఇస్తూ ఉంటుంది కూడా. ఆమె బోరీమా ఉన్న చోటికి వచ్చి నేలంతా పరికించి చూసింది.

"నాకేం కనిపించడం లేదు" అంది బొంతలు కూడా పట్టిచూసి.

"అయితే వాటికి రెక్కలున్నాయి కాబోలు. నాకు కళ్ళు సరిగా ఆనకపోవడంతో కనిపించలేదుగాని, నేను దులిపినపుడు అవి ఎగిరిపోయి ఉంటాయి" అనుకుంది బోరీమా.

నిరాశతో తలెత్తి పైకి చూసిన బోరీమాకి ఆకాశంలో మేఘాలు వేగంగా ఒకదాని వెంట ఒకటి పరుగులు తీస్తూ కనిపించాయి. దలాల్ భార్యతో, "రాత్రంతా అవి కుట్టి చంపడంతో చూడమ్మా, నా వీపు ఎలా దద్దుర్లు తేలి ఎఱ్ఱగా కందిపోయిందో" అంటూ వెనుదిరిగింది. దలాల భార్య ఆమె వీపు పరికించి చూసింది. "బోరీమా! నువ్వు ఏమితో ఊహించుకుని బాధపడుతున్నావ్. అంటే. ఇక్కడ ఏమీ పెద్దగా కనిపించట్లేదు" అంది.

"అదేం కాదు. ఏం దురద, ఏం మంట, ఈ మాయదారి జీవులు నన్ను బ్రతికుండగానే తినేసేలా ఉన్నాయి" అంది

"నీదంతా ఉట్టి హడావిడి! అలాంటిదేం జరగలేదు. నీ ఒళ్ళు పేలింది. అంతే!" అంది దలాల్ భార్య. ఆమె అలా అనగానే బోరీమా చీర కొంగు దులుపుతూ, "నాకు పేలడం అంటే ఏమిటో తెలుసులే! ఇది - అది కాదు. నేను నాలుగు రోజులుగా కంటినిండుగా నిద్రపోయి ఎరుగను. అయినా నా బాధ ఎవరికి లెక్క? నా బాధలు పట్టించుకునేవారు ఎవరున్నారు కనుక? నేను మంచి పట్టు మజ్లిన్ పరుపుల మీద పడుకోవడానికి అలవాటు పడినదాన్ని. నువ్వు నమ్మూ, నమ్మకపో గానీ మా దోమతెరలు మెత్తగా పట్టులా ఎంత మెత్తగా ఉండేవని! అలాంటివి నువ్వెప్పుడూ కలలో కూడా చూసి ఉండవు."

"నువ్వు చెప్పిందీ నిజమే. నేను అలాంటి కలలు కనాలనుకోనులే" అంది దలాల్ భార్య. "నేనలాంటి కలలు కనడానికి తగిన దానిని కాదు. నేను పెళ్ళాడింది కొట్లో పనిచేసే గుమాస్తాను. ఉండేది, ఇవేళో రేపో కూలిపోయే భవంతిలో" అంటూ దలాల్ భార్య బోరీమా బొంతను దగ్గరగా చూసింది. విడిపోతున్న కుట్లను చూసి, "బోరీమా ఈ పక్క బట్టల్ని నువ్వు ఎన్నాళ్ళనుండీ వాడుతున్నావు?" అని అడిగింది.

"ఏనాటి మాటో అది తెలీదమ్మా" అంది బోరీమా.

"మరి నాతో ఒక్క మాట అనచ్చు కదా. ఆపాటి బొంత శుభ్రమైనది ఒకటి నీకు ఇవ్వలేననుకున్నావా? పక్కకో చాపైనా కనీసం ఇచ్చి ఉండేదాన్ని కదా" దలాల్ భార్య బాధపడింది.

"అవసరం లేదమ్మా. అవి ఇప్పుడు శుభ్రంగానే ఉన్నాయి కదా!"

బోరీమా మాటలకు అడ్డు తగులుతూ దలాల్ భార్య, "నాకింకేం చెప్పొద్దు. ఇదింక పనికిరాదు. నీకో కొత్త పడక కావాలి, బొంత తలగడలతో సహా. చలికాలం వచ్చిందంటే చలి ఆపడానికి ఒక దళసరి దుప్పటీ కూడా కావాలి" అంటూ బోరీమాకు తప్పనిసరిగా కావల్సిన వస్తువులు లెక్కపెట్టసగింది.

"షాపు నుండి రాగానే దలాల్ గారితో ఈ విషయం చెబుతా. నువ్వేం దిగులుపడకు" అంటూ మెట్లవైపు నడిచింది దలాల్ భార్య. వెనక్కి తిరిగి, "మధ్యాహ్నం ఒకసారి కనిపించు. నీకో పిసరు ఊరగాయ, వీపుకు రాసుకోడానికి రవ్వంత పౌడరు ఇస్తా"

"పౌడరెందుకు? అదేం పేలుడు కాదు" అంది బోరీమా తనకి ఒళ్ళు పేలిందని తేలికగ ఒప్పేసుకోవడం ఇష్టంలేక. మరీ అంత నేలబారు విషయం తనకి అన్నాళ్ళుగా నిద్ర లెకుండా చేయలేదు అని ఆమె భావన. పేలుడు అంత మంట పెట్టడం అవమానంలా తోచింది ఆమెకు. ఆ విషయమే బాధపడుతూ మెట్లు పైనుండి కిందకి కడగటం మొదలుపెట్టింది ఎప్పటిలాగా.

నెమ్మదిగా వాన మొదలయ్యింది. పెద్దవాళ్ళ జోళ్ళు తొడుక్కున్న కుర్రకుంక నడకలా, చూస్తుండగా పెద్ద చప్పుడు చేసుకుంటూ దడదడా కురవసాగింది ఆ వాన. దలాల్ భార్య ఎండపెట్టిన నిమ్మకాయ ముక్కలన్నీ క్రమంగా తూములద్వారా మురికి కాలవలోకి చేరుకుంటున్నాయి. రోడ్డు వెంట నడుస్తున్న వాళ్ళు గొడుగులు విప్పేలోగానే తడిసిముద్దైపోయారు. ఇళ్ళల్లోవాళ్ళు వాన జల్లు ఇంట్లోకి పడకుండా ఆపడం కష్టమే అయింది.

అప్పటికి బోరీమా రెండవ అంతస్థు తుడవడం పూర్తి అయింది. నిచ్చెన మెట్లలా పైకంతా లేచి ఉన్న మెట్ల వైపు దిగులుగా చూసింది. వర్షధారలు చేస్తున్న చప్పుడుని బట్టి, తను ఆరేసిన బట్టలు తడిసి ముద్దై ఉంటాయని, వటిని కాపాడుకోవడం తన వల్ల కాదనీ తెలిసింది. దలాల్ భార్య చెప్పిన మాటల్ని తల్చుకుని మనసు సరిపెట్టుకుంది బోరీమా. ఇంక ఎక్కడా ఆపకుండా క్రిందకంటా మెట్లను తుడుచుకుంటూ పోయింది. మెట్లమీది చెత్తంతా ఎత్తి బయట పారవేసి వచ్చింది. తన సామానంతా వెతికి పాత పేపర్లను తీసి, గేటుకి ఉన్న కంతల్లో కుక్కి చలిగాలి ఆవరణా లోనికి రాకుండా ఆపింది. ఇక తన వంట వండుకుని, కుంపటి ఆర్పి కదిలింది.

ఆ మధ్యాహ్నం బోరీమా అలవాటుగా జుట్టుదువ్వుకుని ముడివేసుకుంది. పఈట కొంగు చివరనున్న ముడిని విప్పి, తను పొదుపు చేసి దాచుకున్న చిల్లర డబ్బుల్ని లెక్కపెట్టుకుంది. మళ్ళీ కొంగు చివర తాళాలతో ముడిపెట్టి, గోడవార వార్తా పత్రికల కాగితాలు పరుచుకుని కునుకు తీసింసి. లేచేసరికి వాన వెలిసి మామిడాకుల పసరు వాసనతో ఆ ప్రాంతం నిండిపోయింది.

అప్పుడప్పుడూ మధ్యాహ్న సమయాల్లో ఆ మేడలో కాపురమున్న ఇళ్ళకు పెత్తనానికి వెళుతూంటుంది. ఆ ఇళ్ళల్లో వాళ్ళు కబుర్లలో వాళ్ళ పిల్లలు, భర్తల గురించిన విశేషాలు, వారి వారి జమా ఖర్చులూ ఇత్యాదివన్నీ మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడూ బోరీమాకు టీ కాఫీలు, చిరుతిండీ ఇచ్చేవారు. పిల్లలకు ఆటల్లో సాయమందిస్తూండేది. ఎప్పుడూ కుర్చీలో కూర్చోడమనేదే ఎరగనట్లు నేల మీద చతికిలపడి కూర్చునేది. పొరుగుదేశం వెళ్ళిన వాళ్ళు అక్కడి జనాన్ని, వారి పధ్ధతులను ఆకళింపుచేసుకోవడానికి చూసినట్లు అక్కడున్న వాళ్ళవైపు పట్టిపట్టి చూసేది.

ఆరోజు దలాల్ ఇంటికి వెళ్ళడానికి లేచింది. ఆమె వీపు ఇంకా చిరచిరలాదుతునే ఉంది. పడకైతే న్యూస్‌పేపర్లతో సరిపెట్టుకుంది గానీ, ఆమె వీపుకు రాసుకునేందుకు పౌడర్ అవసరం చాలా ఉంది మరి. పేపర్లు జాగ్రత్తగా మడిచి, చీపురు అందుకుంది. అది చేతుల్లో లేకపోతే ఆమెకు అస్సలు తోచదు. ఒక్క అడుగుకూడా ముందుకు నడవలేదు.

ఆమె అలా చీపురు పట్టుకుని మెట్లు ఎక్కుతుండగా ఒక రిక్షా వచ్చి గేటు ముందు ఆగింది. అందులో నుండి దలాల్ గారు కిందకు దిగారు. ఆయన మెట్లెక్క్బోతున్న బోరీమాను పిలిచారు. ఏమిటోనని ఆతృతతో గేతు దగ్గరకు వచ్చింది బోరీమా.

(ఇంకాఉంది - మిగిలిన భాగం వచ్చే నెల)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)