ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

యుద్ధంలో ఇంద్రజిత్తు మాయాసీతను సంహరించటం

శ్రీరాముడి నిర్ణయం తన మాయాబలంతో ఇంద్రజిత్తు తెలుసుకున్నాడు. వెంటనే లంకలోకి పారిపోయినాడు. జరిగిన రాక్షస మారణహోమాన్ని తలచుకొని మరింత క్రుద్ధుడై రామలక్ష్మణులకు దూరంగా ఉన్న లంక పశ్చిమద్వారానికి వెళ్ళాడు. వానరులూ, రామలక్ష్మణులూ శోకోపహతచేతనులై, నిస్తేజులై, నిర్వీర్యులైపోయే ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక మాయాసీతను సృష్టించి తన రథంపై ఆసీనురాలిని చేశాడు. ఆ మాయాసీతను తాను సంహరించి వానరులను భ్రమింపచేసే పూనికతో యుద్ధరంగంలో నిలిచాడు. ఇంద్రజిత్తు మళ్ళీ యుద్ధభూమికి రావడం వానరసేనా, శ్రీరామలక్ష్మణులూ చూశారు. క్రోధవివశులైనారు. హనుమంతుడు ఒక పర్వతశిఖరాన్ని ఇంద్రజిత్తుపై విసరడానికి ఉద్యుక్తుడైనాడు. కాని రథంలో అత్యంతకృశాంగి, దుఃఖ పరిదీనవదన, ధూళిధూసరితదేహ, మలినవస్త్ర, కేశసంస్కారరహిత, ఏకవేణీధర అయిన సీతాదేవిని హనుమంతుడు నివ్వెరపాటుతో ఒక్కక్షణం సేపు ఇంద్రజిత్తు రథంలో చూశాడు. ఆమె తప్పక సీతాదేవి అని భ్రమించాడు. విభ్రమం పొందాడు. తీవ్రశోకోపహతచేతనుడైనాడు. కన్నీళ్ళతో ఆయనకు చూపు ప్రసరించలేదు. వానరసైన్యాన్ని ప్రేరేపించి హనుమంతుడు ఇంద్రజిత్తు రథంవైపు పరుగులు తీశాడు.

ఆ విధంగా వాళ్ళు సంరంభంతో తనవైపు రావడం చూసి ఇంద్రజిత్తు తన ఒరలో నుంచి కత్తి దూసి, రెండో చేత్తో మాయాసీత జుట్టు ఒడిసిపట్టి, 'అయ్యో రామా! రామా!' అని ఆమె ఆక్రందిస్తున్నట్లు మాయాసన్నివేశం కల్పించి ఆమె కంఠం తన కరవాలానికి ఎర చేశాడు. హనుమంతుడు నిశ్చేష్టుడైనాడు. ఈ కిరాతకకృత్యానికి పూనుకున్నందుకు ఇంద్రజిత్తును ఎంతో దూషించాడు. వానరసైన్యాన్నంతా సమాయత్తం చేసి ఇంద్రజిత్తును హతమార్చాలని ముందు కురికాడు. అప్పుడు ఇంద్రజిత్తు సీతాదేవి శిరస్సునూ, ఖండిత శరీరాన్నీ నేలమీదకు పడత్రోశాడు. మీ ప్రయత్నమంతా వృథా అయిపోయిందని వానరసైన్యాన్ని ఉద్దేశించి పరుషభాషణం చేశాడు. పరిహాసం చేశాడు. దేవేంద్రుడు కూడా భయకంపితుడయ్యేట్లు తన విజయసూచకంగా ఇంద్రజిత్తు సింహనాదం చేశాడు. వానరులంతా భయపడి పారిపోతుంటే హనుమంతుడు నివారించి వాళ్ళకు ధైర్యం చెప్పాడు. మహాకోపంతో ఇంద్రజిత్తు రథం మీద ఒక పెద్ద కొండశిలను విసిరాడు. సారథి ఉపాయంగా రథాన్ని పక్కకు తప్పించాడు. కాని ఆ కొండశిల చాలామంది రాక్షసులను మట్టుపెట్టింది. వానరులు అప్పుడు విజృంభించి ఎందరో రాక్షసులను చంపివేశారు. వృక్ష, శైల మహావర్షం ఇంద్రజిత్తుపై కురిపించారు.
అప్పుడు హనుమంతుడు విషణ్ణుడై ''సీతాదేవి కోసం మనం చేసిన ప్రయత్నమంతా వ్యర్థమైన తర్వాత ఈ రాక్షససంహార మెందుకు? ఈ సాటోపపరాక్రమమంతా ఎందుకు? మనం వెళ్ళి రామలక్ష్మణులను, సుగ్రీవుణ్ణి దర్శించి వాళ్ళు ఏం చెయ్యమంటే అది చేద్దాము'' అని యుద్ధం నిలిపివేశాడు. ఇంద్రజిత్తు సంతోషపడ్డాడు. మారణ హోమం చేయడానికి లంకలోని చైత్యంలో ఉన్న నికుంభలామందిరానికి చేరుకున్నాడు. అక్కడ అగ్నిని ప్రతిష్ఠించి హోమం చేయడం ఆరంభించాడు. ఆగమవిధి ప్రకారం ఆ మారణహోమానికి ఇంద్రజిత్తు పూనుకోగా, విఘ్నమేమీ కలగకుండ జాగ్రత్తగా అక్కడ రాక్షసవీరులు కాపలా కాస్తున్నారు. అప్పుడు జాంబవంతుణ్ణి పశ్చిమద్వారంలో యుద్ధం చేస్తున్న హనుమంతుడికి సహాయంగా వెళ్ళవలసిందని రాముడు కోరాడు. ఇంతలో తన సేనను వెంటపెట్టుకొని వస్తున్న హనుమంతుణ్ణి, జాంబవంతుడు కలుసుకున్నాడు. హనుమంతు డప్పుడు వేగంగా శ్రీరాముణ్ణి సమీపించి సీతాదేవిని ఇంద్రజిత్తు చంపివేసిన విషయం, దుఃఖాక్రాంతుడై తెలియజేశాడు.

ఆ వార్త విని శ్రీరాముడు తెలివి తప్పి పడిపోయాడు. లక్ష్మణుడు అన్నను కౌగిలించుకొని ఆయనకు స్పృహవచ్చేట్లు చేసి, ఎన్నోవిధాలుగా ఓదార్చటానికి ప్రయత్నించాడు. ధర్మాన్నే అంటిపెట్టుకున్న నీ కడుగడుగునా ఈ కష్టాలేమిటి? అధర్మపరులకు ఈ వైభవా లేమిటి అని ప్రశ్నించాడు.

(-సశేషం)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)