కథా భారతి

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులన్

- ఆర్. శర్మ దంతుర్తి

కైలాసం లోపలకి వచ్చే నారదుణ్ణి నందీ, విఘ్నేశ్వరుడు సాదరంగా ఆహ్వానించారు. ఆది దంపతులకి నమస్కారం చేసి అడిగాడు నారదుడు, "ఈశ్వరా, పులస్త్య బ్రహ్మ కుమారుడైన వైశ్రవణుడు తెలుసు కదా? ఆయన కుమారుడైన కుబేరుడనేవాడు మీ కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అతన్ని కరుణించేదెప్పుడో తెలుసుకుందామని ఇలా వచ్చాను."

భవుడు చిరునవ్వు నవ్వేడు జగదంబ కేసి చూసి. అమ్మవారు చెప్పింది, "నారదా ఈ తపస్సు ఫలించి కుబేరుడికి కోరికలు తీరినా ఆయన అడిగినది ఎంతో కాలం నిలవదు."

నారదుడు ఆశ్చర్యంగా చూసాడు అదేమిటన్నట్టు.

పార్వతి వివరణ ఇస్తున్నట్టూ చెప్పింది, "నువ్వే చూద్దువు గాని కదా? కోరికలీడేరడం వల్ల సుఖం వస్తుందనేది ఎంత నిజమో."

అంతకన్న చెప్పడానికేమీ లేదన్నట్టు అమ్మవారు ఆగేసరికి భవుడు సమాధిలోకి జారుకున్నాడు. జగజ్జనని కూడా కళ్ళు మూసుకోబోయేంతలో ద్వారం వరకూ వచ్చే నందీశ్వరుడితో త్రిలోకసంచారి నారదుడు “నారాయణ, నారాయణ” అంటూ కైలాసంలోంచి బయటకొచ్చాడు.

* * * * * * * * * * * * * * * * * *

కుబేరుడి తపస్సు తారాస్థాయినందుకునేసరికి పార్వతితో సహా పరమశివుడు భక్తుణ్ణి చూడ్డానికి బయల్దేరాడు. వెనకనే ఎప్పటిలాగానే కనిపించకుండా భూతగణాలూ, నందీశ్వరుడూను. కుబేరుడికి ఎదురుగా కనపడిన దృశ్యంలో బూడిదపూసుకున్న త్రినేత్రుడు. మెడలో నాగేంద్రుడూ, వంటిమీద ఏనుగు చర్మం; ఓ చేతిలో కపాలం, మరో చేతిలో సన్యాసులకి మల్లే కమండలం. శివుడికివన్నీ మామూలే కదా అనుకుంటే పక్కనున్న అమ్మవారు కళ్ళు చెదిరే అద్భుత సౌందర్య రాసి! శివస్తోత్రం చేయబోయిన కుబేరుడి మనసులో ఒక్కసారిగా అసూయ పొడచూపింది - కపాలంతో భిక్షాటన చేసుకునే ఈ మృగచర్మధారికి ఇంతటి సౌందర్య రాసి ఇల్లాలా? ఎంతటి విచిత్రం? మరుక్షణంలో కుబేరుడి కళ్లముందు కారు చీకట్లు వ్యాపించాయి. ఏమైందో తెలిసే సరికి అప్పటికే పూర్తిగా ఆలశ్యం అయిపోయింది.

శివుడు అష్టైశ్వర్యాలు కలవాడనీ, ఒక్కసారి “శివ, శివా” అని స్మరించగానే భవబంధాలన్నీ పోతాయని విన్నా సరే తన మనసులోకి అసూయ ఎలా వచ్చిందో? తన దురదృష్టం కాకపోతే అదీ అమ్మవారిని చూసాకా? విశ్వేశ్వరాయ మహాదేవాయ, త్ర్యంబకాయ త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ కాలగ్ని రుద్రాయ నీలకంఠాయ, మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః అని కీర్తించబడే ఏ దేవుడి కోసమైతే తాను ఇన్నేళ్ళూ అహోరాత్రాలూ కష్టపడి తపస్సు చేసాడో ఆ దేవుడు కనబడేసరికి తనకి అసూయ ముంచుకొచ్చింది. అమ్మవారు ఆ మాత్రం గ్రహించలేదా? ఆ అసూయవల్లే తన చూపుపోయింది. మరి ఇప్పుడెలా? ఈ స్థితిలో ఎవరి ప్రాపకం కోసమైతే ఇంతకాలం తపస్సుచేసాడో అతణ్ణే స్తోత్రం చేయడం మంచిది. శివ, శక్తి అనే స్వరూపాలు రెండూ ఒకటే అనేది ఈపాటికి ప్రత్యక్షనుభూతిగా అర్ధమైన కుబేరుడి నోట్లోంచి పార్వతీపరమేశ్వరులని ఇద్దర్నీ కలిపి ప్రార్ధించే శ్లోకాలు బయటకొచ్చాయి.

"చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ

కస్తూరికాకుంకుమచర్చితాయై చితారజఃపుఞ్జ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ

ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ

విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ

మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ

అంభోధరశ్యామలకున్తలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ

ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ”

ఇన్నాళ్ళూ తనకి తెలిసిన శివ స్వరూపం, శక్తి స్వరూపం వేరు వేరు కావు. కస్తూరికా కుంకుమతో అర్చించబడే అమ్మవారైన శక్తీ, చితాభస్మంతో అర్చించబడే శివుడూ ఒక్కరే. మెడలో ఓ పక్క రత్న కుండలాలతో భాసించే శక్తి స్వరూపిణీ, మరో పక్క నాగేంద్రహారంతో దర్శనమిచ్చే శివుడూ ఒక్కరే; ఓ పక్క దివ్యాంబరాలు ధరించిన శక్తీ, ఇటువేపు దిగంబరులైన శివుడూ ఒక్కరే; జగన్మాత అయిన శక్తీ సమస్త జగత్తుకీ తండ్రియైన శివుడూ కూడా ఒక్కరే. అలాగే సర్వప్రపంచాన్నీ ఉధ్భవింపచేసే శక్తీ, దాన్ని ఉపసంహరించి లయం చేసే శివుడూ ఒక్కరే. తాను చూసిన శివుడూ, దేవదేవుడి సహధర్మచారిణీ వేరు వేరు కాదు. అమ్మవారిలో కనిపించిన అద్భుత సౌందర్యం అయ్యవారిది కూడా. వాక్కునీ అర్ధాన్నీ ఎలా విడదీయలేమో అలాగే జగన్మాతనీ జగత్పితనీ విడదీయలేము. వాగర్ధావివ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ.

స్తోత్రానికి సంప్రీతుడై ఆషుతోషుడైన శివుడు హృదయంలో సంతోషం ఉప్పొంగుతూండగా కుబేరుడి ముందు మరోసారి కనిపించాడు; ఈ సారి అర్ధనారీశ్వరుడిగా. అసూయ తొలగిపోయిన కుబేరుడికి అమ్మవారు ఇంకా కోపంగానే ఉండడం తోచింది. మరోసారి కన్నీళ్లతో మొరపెట్టుకున్నాక అతి తేలిగ్గా భక్తులని కరుణించే పినాకపాణి అడగకుండానే వరాలిచ్చాడు, "ఇప్పట్నుంచీ ఉత్తర దిక్కున నువ్వు దిక్పాలకుడివిగా ఉంటూ లోకాలని పాలిస్తూ ఉండు. సర్వ సంపదలకీ అధికారివై యక్ష, నాగ, గంధర్వులకి నాయకుడిగా నరుణ్ణి వాహనంగా చేసుకుని పాలన సాగించు. నీ రాజ్యం నా కైలాసానికి పక్కనే ఉన్నఅలకాపురి."

అన్నీ సంతోషంగా ఒప్పుకున్న కుబేరుడు అడిగాడు, "అనేకానేక దుర్గుణాలు ఉన్న నరుణ్ణి ఎందుకు వాహనంగా ఇచ్చారు నాకు?"

"జడమైన భౌతిక సంపదలనేవి ఎప్పటికీ సంతోషాలనివ్వలేవు. వాటిని పోగుచేసుకునేకొద్దీ కోరిక ఎక్కువౌతుందే తప్ప తగ్గేది లేదు. నరుడికివన్నీ తెలిసినా సంపదలకి దాసోహం అనే స్థితిలోనే ఉంటాడు కనకా, ఆ సంపదలు సంపాదించడానికి ఎంతటి నీచానికైనా వెరవడు కనకా, వైరాగ్యం రానంతవరకూ దానికి బానిసత్వం చేస్తూ ఉంటాడు కనకా, ఆ నువ్వు సంపదలకి అధికారివై ఉండబోతున్నావు కనకా" భవుడు సమాధానం చెప్పాడు.

వెనుతిరిగి కైలాసం వెళ్ళేముందు మరో సారి హెచ్చరించాడు శివుడు కుబేరుణ్ణి, "భౌతిక సంపద అనేది ఎటువంటిదైనా సరే అది ఎప్పటికీశాశ్వతం కాదు. ఓడలు బండ్లు అయినట్టూ, బండ్లు ఓడలైనట్టూ అవి అలా మారుతూనే ఉంటాయి. అది గుర్తు పెట్టుకుని ఎప్పుడైతే ముముక్షత్వం, వైరాగ్యం సంతరించుకుంటావో అప్పుడే పూర్తి మనఃశ్శాంతి దొరికేది. ఆ వైరాగ్యం లేనినాడు నువ్వు కైలాసానికి అతి దగ్గిరలో ఉన్న అలకాపురిలో ఉన్నా, నా స్నేహితుడవని చెప్పుకున్నా నాకు అతి దూరంగా ఉన్నట్టే."

* * * * * * * * * * * * * * * * * *

తపస్సు చాలించి పరమేశ్వరానుగ్రహంతో అన్ని సంపదలకీ అధికారి అయ్యాక అలకాపురిలో ఉన్న కుబేరుడి దగ్గిరకి వచ్చి పలకరించాడు నారదుడు. కుబేరుడి కధ విన్నాక నారదుడికి అంతకుముందు తాను కైలాసం వెళ్ళినప్పుడు అమ్మవారు చెప్పిన 'సంపదలు అశాశ్వతం' అనే విషయం గుర్తొచ్చింది. జరగబోయేది ఎలాగా జరగక తప్పదు కదా, ముందే కుబేరుడికి చెప్పడం అనవసరం. పరమేశ్వరుడే కుబేరుణ్ణి అంతకు ముందు హెచ్చరించాడు కూడా. తాను మరోసారి చెప్పడం దేనికి?

నారదుణ్ణి అలకాపురి అంతా తిప్పి తనకి భవుడిచ్చిన సంపద అంతా చూపించాడు కుబేరుడు. అన్నీ చూసిన నారడుడు అడిగాడు కుబేరుణ్ణి, "ప్రపంచంలో అతి ఎక్కువ విలువైన రత్నాలూ ఏమిటో తెలుసా?"

తాను చేసిన తపస్సూ, చంద్రశేఖరుడు చెప్పిన చివరి వాక్యం గుర్తొచ్చి చెప్పాడు కుబేరుడు, "మూడు రత్నాల సంగతి అంత తెలియదు కానీ ఒకటి మాత్రం గ్రహించాను. దేవాదిదేవుడైన ఆ శంకరుడి కృపాకటాక్షం ఒక్కటుంటే అదే చాలు."

"నిజమే. భూమిమీద ప్రజలకి సంపదలు కూడబెట్టుకోవడంలో ఉన్న ఆనందం నారాయణ స్మరణం చేయడానికి ఉండదు. ధరిణీమండలంలో ఉండే మూడు రత్నాలు, తినడానికి తిండీ, పీల్చడానికి గాలి, తాగడానికి నీరూను. అవి లేనిది మనుగడే లేదు. మిగతా రత్నాలూ, మణులూ అని చెప్పబడేవన్నీ రాళ్ళూ రప్పలూను."

కుబేరుడు నవ్వుతూ తలాడించాడు నిజమేనన్నట్టూ.

* * * * * * * * * * * * * * * * * *

నారదుడు ఆ తర్వాత మరోసారి కుబేరుణ్ణి చూసింది కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల దగ్గిర. నారదుడు లోపలకి వచ్చేసరికి కనబడినది విచారంగా ఉన్న కుబేరుడి మొహం, ఎప్పటిలాగానే చిరునవ్వుతో ఆదిదంపతులూను.

నారదుణ్ణి చూసి శంకరుడే చెప్పాడు, "ఇదిగో ఈ నారదుణ్ణే అడుగుదాం ఏమి చేయాలో"

సంగతి అర్ధం కానట్టూ నారదుడు అన్నాడు, "నారాయణ, నారాయణ నేనేం చేయాలి?"

కుబేరుడు చెప్పాడు సంగతి, "మహర్షీ నా ఇద్దరు కుమారులు నలకూబర మణిగ్రీవులనే వాళ్ళకి అహంకారం బాగా బలిసిపోయింది. ఎవరినీ లెక్క చేసే రకంగా లేరు. ఏమైనా అంటే “మేము యక్షరాజుడైన కుబేరుడి కొడుకులం, ఆ పైన శివుని సేవకులం” అనే మాట చెప్తూ కళ్ళు నెత్తిమీదకి తెచ్చుకుని సంచరిస్తున్నారు. ఎవరేం చెప్పినా ఇప్పటి వరకూ ఏమీ ప్రయోజనం కనపడలేదు. ఏమి చేయాలో తెలియక ఇలా వచ్చి అమ్మవారినీ, అయ్యవారిని అడిగేలోపుల మీరే వచ్చారు. మీరే చెప్పండి ఏమి చేయాలో."

"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని కదా లోకోక్తి? ఈ పినాకపాణి ముందా నేను నోరు విప్పేది? ఆయనకి తెలియని విషయాలు నాకు మాత్రం ఎలా తెలుస్తాయి?"

అమ్మవారు ముసి ముసి నవ్వుకుంది లోలోపల నారదుడి మాటలు విని శివుడి మహత్తు తల్చుకుంటూ. శివుడు నవ్వుతూ అన్నాడు, "నారదా నువ్వు ధ్రువుడంతటివాడికి దీక్ష ఇచ్చిన ఆది గురువువి. ఆ పైన త్రిలోకసంచారివి. అదీగాక ఈ నలకూబర మణిగ్రీవులు నా భక్తులు. నేను నా భక్తుల్ని ఏమీ చేయలేని అశక్తుణ్ణి అని నీకు తెలుసు కదా, అందువల్ల నువ్వే చెప్పు ఏం చేయాలో."

"నేనోసారి ఈ కుర్రాళ్ళనిద్దర్నీ కలుసుకుని మాట్లాడనీయండి."

"తప్పకుండా. వాళ్ల గర్వం వదలడానికి మీరు శాపం ఇచ్చినా నేనేమీ అనుకోను,” కుబేరుడు చెప్పాడు వినయంగా.

పక్కనే ఉన్న అలకాపురికి బయల్దేరుతూ, నారాయణ స్మరణంతో నారదుడు నిష్క్రమించాడు, కైలాసంలోంచి.

* * * * * * * * * * * * * * * * * *

అలకాపురిలో ప్రవేశించిన నారదుడికి కనిపించినది వెండికొండమీద ఉద్యాన వనాల్లో జల క్రీడలాడుతున్న నలకూబర మణిగ్రీవులు. మనోహరంగా పాటలు పాడే గంధర్వ కాంతలతో దిగంబరంగా మద్యం కైపులో ఉన్న కుబేర సుతులు జలాల్లో కల్లోలం సృష్టిస్తూ అదే లోకం అన్నట్టూ విహరిస్తున్నారు. ఇది చూసిన నారదుడికి నవ్వు వచ్చింది. యవ్వనం ఎన్నాళ్ళు ఉంటుంది? అది చూసుకుని ఈ పిల్లలిద్దరూ ఎంత పొగరుగా బతుకుతున్నారు? వచ్చిన నారదుణ్ణి చూస్తూనే గంధర్వ స్త్రీలు తడబడుతూ వస్త్రాలు ధరించారు. మరి కుబేర సుతులకి ఎవరొచ్చారో కూడా తెలియకుండా ఉంది కాబోలు మత్తు కళ్ళతో నారడుణ్ణి 'ఇక్కడ నీకేం పని?' అన్నట్టు వెక్కిరిస్తున్నట్టూ పొగరుగా చూసారు అలా దిగంబరంగానే. అప్రయత్నంగా నారదుడి నోట్లోంచి బయటకొచ్చింది….

సంపన్నుం డొరు గానలేడు తనువున్ సంసారమున్ నమ్మి హిం
సింపన్ జూచు దరిద్రు డెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హిం
సింపండన్యుల నాత్మకున్ సములుగా జింతించునట్టౌట ద
త్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్య మూహింపగన్

ధనవంతుడు ఎవరినీ లెక్కచేయడు. తన ధర్మాన్నీ, శరీరాన్నీ సంసారాన్నీ అవే ముఖ్యం అని నమ్ముతూ అందర్నీ హింసించాలనే చూస్తాడు. మరి దరిద్రుడో? లోకరీతి ప్రకారం దరిద్రుడు ఇతరులు కూడా తనవంటివాళ్ళే కదా అని ఆలోచిస్తాడు. అంచేత ధనం మూలంగా మదం ఎక్కినవారికి దారిద్రమే మంచి అంజనం. అయితే ఇప్పుడు ఇలా గర్వంతో ఉన్నా శివుడికి ఇష్టులైన వారే. ఏం చేస్తే మంచిదో ఆలోచించి నారదుడు శపించాడు కుబేరసుతులని “మీ గర్వం అణగడానికి, సత్పురుషులుగా మారడానికీ మద్యం, యవ్వనం మత్తులో దిగంబరులై కన్నూ మిన్నూ కనిపించకుండా వ్యవహరిస్తున్నారు కనక అలా దిగంబరులుగా నూరు దివ్య సంవత్సరాలు మద్ది చెట్లై పడి ఉండండి".

ఈ శాపం వినేసరికి ఒక్కసారి మత్తుదిగిపోయింది గుహ్యకులకి. నూరు దివ్య సంవత్సరాలు మద్ది చెట్లై ఎండా, వానా, చలీ, వేడీ అని తెలిసినా భరిస్తూ అలా పడి ఉండాలా? అసలే శపించినవాడు నారద మహర్షి. ఒక్కసారి జ్ఞాననాడి కదిలి కాళ్ల మీద పడి శాపవిమోచనం కోరారు.

కళ్ళు మూసుకుని జరగబోయే విషయాలన్నీ గ్రహించి, "గోవింద చరణాల వల్ల మీ ఇద్దరికీ శాప విముక్తి కలుగుతుంది ఆ తర్వాత నా అనుగ్రహం వల్ల ముక్తులై సత్ప్రవర్తనతో దేవలోకంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పటి వరకూ నారాయణ స్మరణం చేస్తూ జీవించండి." నారదుడు ముందుకి సాగిపోయాడు.

వేగులద్వారా వార్త విన్న కుబేరుడికి నోట మాట రాలేదు. ఆది దంపతులని అడిగితే చిరునవ్వే సమాధానంగా వచ్చింది.

* * * * * * * * * * * * * * * * * *

కుబేరుడి సంపద చూసి తల్లి కైకసి అడగడంతో బ్రహ్మని గూర్చి తపస్సు చేసిన రావణాసురుడు లంకా నగరాన్నీ, తన సంపదల్నీ కొల్లగొట్టి పుష్పక విమానం తీసుకున్నాక కుబేరుడికి అర్ధమైంది ఓడలు బండ్లు అవడమనే సంగతి. ఈ సంపదలిస్తూనే మహేశ్వరుడు చెప్పినదీ అదే కదా? తన తాత పులస్త్య బ్రహ్మ ఇచ్చిన సలహా ప్రకారం తాను ఉత్తరంగా అలకాపురిలో రావణుడి నుంచి దూరంగానే ఉంటున్నాడు, తన తమ్ముడే కదా అని విరోధం రాకుండా ఉండడం కోసం ఒక దూతని పంపితే ఆ దూతని భక్షించాడని తెలిసినా. పుత్రులని చూసి ఎంతకాలమైందో. రావణుణ్ణి మట్టుబెట్టి ధర్మం స్థాపించి రాఘుకులతిలకుడైన రాముడు తన పుత్రులకి శాపవిమోచనం కల్పిస్తాడేమోనని మిణుకు మిణుకు మంటూ ఉన్న ఆశ నిరాశే అయింది. రావణ సంహారానంతరం పుష్పకం తన దగ్గిరకి వచ్చాకా, లంకా నగరం ధర్మాత్ముడైన విభీషణుడి చేతుల్లోకి వెళ్ళాకా కూడా తన పుత్రుల శాపం పూర్తవ్వలేదు.

అయినా, నారద మహర్షి శాపం మహాన్వితం అనేది సుస్పష్టం. అది పూర్తి కాకుండా ఎవరేం చేయగలరు? నూరు దివ్య వర్షాలు గడవడానికి ఒక్కొక్కరోజే లెక్కపెట్టుకోవాలి కదా? కుబేరుడిక్కడ ఇలా ఉంటే అటువేపు నారాయణ స్మరణంతో అర్జున వృక్షాలు దిగంబరంగా శ్రీహరి కృపాకటాక్షాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. యుగాలు మారుతున్నాయి వాటి వాటి ధర్మం ప్రకారం యధావిధిగా.

* * * * * * * * * * * * * * * * * *

భూదేవి మొర విన్నాక శ్రీహరి ఆవిడ భారం తీర్చడానికి మానవ జన్మ ఎత్తుతానని మాట ఇచ్చాడు కనక ఇప్పుడు ఆయన ఎవరికి ఎక్కడపుట్టాలో, ఆయన్ని ఎవరు ఎలా పెంచాలో అనే భాధ్యత బ్రహ్మ మీద పడింది. ముందుగా జన్మ నిచ్చే తల్లితండ్రులని నిర్ధారించాక, ఇద్దరు వసువులని తనని చూడడానికి రమ్మని ఆదేశించాడు చతుర్ముఖుడు.

బ్రహ్మలోకంలో సరస్వతీ దేవి వీణ మీద సామగానం సాగుతూండగా ద్రోణుడనే వసువూ అతని భార్య ధరా లోపలకి వచ్చారు బ్రహ్మ ఆదేశానుశారం.

బ్రహ్మ చెప్పాడు, "మీరిద్దరూ భూమి మీద మానవజన్మ ఎత్తవల్సిన అవసరం ఏర్పడింది. మీకు ఆ జన్మలో ఏమి కావాలో చెప్తే అలాగే ఏర్పాటు చేయవచ్చు."

ద్రోణుడూ, ధరా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. ఒక్క క్షణం ఆగి ఒకే కంఠంతో చెప్పారు, "జగన్నాధుడైన శ్రీహరిని కొలిచే సేవాభాగ్యం ప్రసాదిస్తే భూమి మీద మానవ జన్మే కాదు ఏ జన్మ, ఎక్కడ ఎన్నిసార్లు ఎత్తడానికైనా సిద్ధమే."
చిరునవ్వు నవ్వేడు విరించి, "సేవా భాగ్యం అన్నారు కనుక శ్రీహరిని కనడం కుదరదు గానీ అసలు మిమ్మల్ని మానవజన్మ ఎత్తమన్నదే శ్రీహరి పెంచి సేవించడానికి. వెళ్ళిరండి తధాస్తు."
యోగనిద్రలోంచి అన్నీ గమనిస్తూన్న శేషశాయి ఇదంతా గమనించి లోలోపల చిరునవ్వు నవ్వుకున్నాడు. తనని కనే తల్లితండ్రులొకరూ, పెంచే వారు మరొకరూ. అంటే తాను ఇద్దరు తల్లులనీ, ఇద్దరు తండ్రులనీ సంతోషంగా ఉంచాలి. తనని కన్న తల్లి, కొడుకు అనే మమకారం వల్లా, సాక్షాత్తూ మహా విష్ణువే కొడుకుగా పుట్టాడనే జ్ఞానం వల్లా పెంచుకోవడానికి అడగ్గానే ఎవరికీ ఇవ్వదు కాబట్టి తానే ఏదో విధంగా ఇది చూడాలి. యోగమాయని పిలిచి చెప్పాడు ఏమి చేయాలో.
ఆ ఆదేశం అందుకుని యోగమాయ నందగోకులంలో ఆడపిల్లగా పుట్టడానికి సాగిపోయింది. ఆ తర్వాత జరగబోయేవన్నీ అవలోకించి శంఖ చక్ర సుదర్శన గదాదండ నందకాలతో శార్గ్యమూ అక్షతూణీరాలూ వెంటబెట్టుకుని చతుర్భుజ రూపుడై, మకర కుండల కిరీట కేయూర హార కటక కౌస్థుభాలతో వనమాలికా విరాజితుడై కనిపించి తాను పుట్టాక ఏమి చేయాలో దేవకీ వసుదేవులకి ముందుగా చెప్పడానికి బయల్దేరాడు జగన్నాధుడు.
* * * * * * * * * * * * * * * * * *

యశోద పొయ్యి మీదనుంచి పాలు కిందకి దించి వచ్చేసరికి పెరుగు తినేసి కుండ పగులకొట్టి పారిపోయిన కృష్ణుడు కనిపించలేదు. వెతకడానికి బయలుదేరింది. పక్క ఇంట్లోనే కనిపించిన నల్లనయ్య ఉట్టిమీద వెన్న కోతులకీ గోకులంలో పిల్లలకీ పంచిపెడుతున్నాడు.

కనిచేతన్ సెలగోల వట్టికొనుచుం గానిమ్ము రానిమ్ము రా
తనయా! యెవ్వరియందు జిక్కువడ నేదండంబునుం గాన నే
వారంబును బొంద నే వెరపు నే విభ్రాంతియుం జెంద ము
న్ననియో నీవిటు నన్ను గై కొనమి నేడారీతి సిద్ధించునే

కృష్ణుణ్ణి చూస్తూ కోపంగా అంది, “నిన్ను ఎవరూ అడ్డుకోలేరనీ శిక్షించరనీ అనుకుంటున్నావు కాబోలు. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూద్దాం కదా?”

ఒక్కసారి చేయి పట్టుకుని ఇంటికి బరబరా ఈడ్చుకొచ్చిన యశోద కొట్టకుండా, మరోచోటికి పారిపోకుండా ఉండడానికి కృష్ణుణ్ణి రోటికి కట్టడానికి సిద్ధమైంది. సనక సనందనాదులైన మహర్షుల హృదయాల్లో చిక్కని మహావిష్ణువు, మహాలక్ష్మి కౌగిట్లో చిక్కుకోని లక్ష్మీకాంతుడు, వేదవేదాంగాలలో చిక్కని జగన్నాధుడు తల్లి చేతికి మాత్రం అలా అవలీలగా చిక్కవల్సిన ఆగత్యం. తాడు సంపాదించి ఓ చివర రోలుకీ రెండో చివర నల్లనయ్యకీ తగిలించబోతే రెండు అంగుళాలు తక్కువైంది. మరో తాడు సంపాదిస్తే అదీ అంతే. ఇంట్లో ఉన్న తాళ్ళు అన్నీ కలిపి కట్టినా ఆ బొజ్జకి రెండు అంగుళాలు తక్కువే. పధ్నాలుగులోకాలూ ఉన్న ఆ బొజ్జని చిరుతాటితో కట్టడం యశోద తరమా?

ఇదంతా బయట నుంచి ఆతృంగా చూస్తున్నఅర్జున వృక్షాలు కళవెళ పడ్డాయి. ఇరవై ముఫ్ఫై అడుగుల దూరంలోనే ఉన్న గోవింద చరణాలు తమని ఎప్పటికి తాకేను?

గోపికలూ, యశోదా చెమట్లూ కార్చుకుంటూ కూలబడేసరికి భవబంధాలని హరించే బాలకృష్ణుడు జాలిగా చూసాడు. ఇటు తలతిప్పి బయటకి చూస్తే అప్పటివరకూ దిగంబరంగా చలీ, వేడీ, ఎండా, వానా అని చూసుకోకుండా నారాయణ స్మరణంతో శాపవిమోచనం కోసం - ఒకటా రెండా? నూరు దివ్య సంవత్సరాలు - వేచి ఉన్న అర్జున వృక్షాలు, అటువైపు చెమట్లు కక్కే యశోద.

ఆప్తులైన వారిని ఆదుకోవడానికా అన్నట్టు ఈ సారి యశోద కట్టిన తాళ్లకి తలవొగ్గి కదలకుండా కూర్చున్నాడు మహాయోగీశ్వరుడు. భక్తులకి పట్టుబడినట్టుగా ఆయన యోగులకి గానీ జ్ఞానులకి గానీ పట్టుబడడని తెలిసిందే కదా?

యశోద అటు వెళ్లగానే రోలు తనకూడా లాగుతూ జంట మద్ది చెట్ల మధ్యకి తీసుకెళ్ళి ఒక్క సారి లాగాడు.
ఒక్కసారి ఉరుమూ మెరుపూ లేకుండా పిడుగు పడ్డట్టైంది. చెట్లు నేలకి ఒరిగిపోగానే మరు క్షణంలో శాపం పోగొట్టుకుని కుబేర సుతులు బయటకొచ్చారు. ఎదురుగా, నూరు దివ్య సంవత్సరాలలో ప్రతీరోజూ మనసు కొట్టుకుపోతూ చూడడానికి తపించిన, నారదుడు చెప్పిన దివ్య మంగళ విగ్రహం. ఏ పాదాల వల్లైతే బలి చక్రవర్తికి దానవోద్రేక స్థంభన అయిందో, ఆ బ్రహ్మ కడిగిన పాదాలు తమని సోకగానే శాపం హరించింది. ఇన్నాళ్ళూ చేసిన నారాయణ స్మరణం వల్ల లభించిన ఫలితం ఇది. చేతులు జోడించి చెప్పేరు, "మా తండ్రి కుబేరుడు అడిగితే పార్వతీ పరమేశ్వరుల అనుజ్ఞతో మమ్మల్ని కనికరించడానికి వచ్చిన మహా తపస్వీ, సాధువూ అయిన నారదుణ్ణి మదంతో గేలిచేసి మా బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇలా మద్ది చెట్లగా జన్మ ఎత్తాము. అదీ మా మంచికే అయింది. ఆ మహర్షి చెప్పినట్టూ నూరు దివ్య సంవత్సరాలు నీ నామం జపిస్తూ నిన్ను చూడడానికి తపించాం. మమ్మల్ని అనుగ్రహించు. ఇక మాకు కావాల్సింది ఇదొక్కటే,

నీ పద్యావళు లాలకించు చెవులున్ ని న్నాడు వాక్యంబులన్
నే పేరం బనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులున్
నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజ పత్రేక్షణా”

"నారద మహర్షి శాపం మీమీద కోపంతో కాక కరుణతో ఇచ్చినది. ఆయనే కనక మీదగ్గిరకి రాకపోతే ధనం మూలంగా గర్వాంధకారంతో ఎన్నాళ్ళు అలకాపురిలో ఉండి ఉండేవారో. ఆ శాపం వల్లే - అనేకానేక జన్మలు ఎత్తుతూ ఎంతో కష్టపడినా ఎవరికీ కనిపించని - నన్ను మీరు చూడగలిగేరు. ఇప్పట్నుండీ నా మీద మరింత భక్తి కలుగుతుంది. మీకే కాదు, మీ తండ్రి కుబేరుడికున్న సంపదలు కూడా ఏవీ శాశ్వతం కాదని తెలుసుకుని వైరాగ్యం అలవర్చుకోండి," వెళ్లడానికి అనుమతిస్తూ, దేవకీనందనుడు చెప్పాడు సమాధానంగా.

* * * * * * * * * * * * * * * * * *

వెనక్కి వచ్చిన కుమారులతో కుబేరుడు మరో సారి ఆది దంపతులని చూడబోయేడు. ఎప్పటిలాగానే అమ్మవారు కార్తిక పౌర్ణమి చంద్రుడిలా వెన్నెలు చిందిస్తూ చిరునవ్వు నవ్వుతోంది. నలకూబర మణిగ్రీవులని చూస్తూ ముక్కంటి అన్నాడు, "నూరు దివ్య సంవత్సరాల కాలం శాపం పొందినా ఆ శేషశాయి, దేవదేవుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు, సంతోషం."

"మమ్మల్ని అనుగ్రహించడానికి మీరు కల్పించిన మాయే కదా ఇదంతా?" అన్నారు కుబేరుడు, ఆయన సుతులూ ముక్త కంఠంతో.

శ్రీచక్ర సంచారిణి మనోహరంగా నవ్వుతూ ఓరగా చూస్తూంటే, చిరునవ్వుతో పరమశివుడు కళ్ళుమూసుకుని సమాధిలోకి జారుకున్నాడు.

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)