సారస్వతం - 'దీప్తి' వాక్యం

ఆధ్యాత్మిక కళలు

- దీప్తి కోడూరు

సృష్టిలో ప్రతి చోట ఆ సృష్టి యొక్క కేంద్రం ఉంటుంది. ప్రతి ప్రాణిలో దైవత్వపు నిగూఢత నిండి ఉంటుంది. సృష్టిలో జరిగే ప్రతి చిన్న కదలికతో పాటు ఆ కేంద్రం కూడ నిత్య నర్తనం చేస్తూనే ఉంటుంది.

మానవులుగా మనమంతా మన దైనందిన కార్యక్రమాల్లో మునిగి పోయి, ఆ దివ్యత్వపు ఛాయల్ని మన దృష్టికి రానివ్వకుండా గడిపేస్తుంటాము. కానీ సూక్ష్మంగా గమనిస్తే, మనలో ప్రతి ఒక్కరమూ తెలిసో, తెలియకండానో ఆ అనంతత్వం వైపుకే సాగడానికి మొగ్గు చూపిస్తుంటామనేది సత్యం.

లయబద్దంగా సాగే శ్వాస నిశ్వాసలు మొదలు, విశ్వాంతరాళాలలో జరిగే గ్రహ కూటములు కదలికల వరకూ ప్రతి క్షణం, ప్రతి చోట జరిగేది నర్తనమే. శివ తాండవమే.

నాట్యానికి, ఆధ్యాత్మికతకు అతి దగ్గర సంబంధం ఉంది. ఆధ్యాత్మికతలో అంతిమ ఘట్టం ఏకత్వం. అంతిమమే కాదు ఆధ్యాత్మికత ఆరంభమయ్యేది కూడా ఏకత్వానుభవంతోనే.

" నేను" అనే పరిమితమైన దేహ భావనను వీడి ,అనంతమైన చైతన్య స్రవంతిలో ఒక భాగంగా అనుభవం కావడమే ఆధ్యాత్మికత! అట్టి అనుభవం కోసం కృషి చేయడమే సాధన. ఆ సాధనా క్రమంలో ఎన్నో దివ్యానుభవాలు, అనుభూతులు సాధకుడిని పలకరించి పోతుంటాయి. అతడి అంతరంగంలో చెలరేగుతున్న సాత్విక భావావేశాలకు చిహ్నంగా అతడి శరీరం కూడా ప్రతిస్పందిస్తుంది. దేహమంతా శిలా సదృశ్యంగా బిగుసుకుపోవడం , ఆపుకోలేనంతగా కన్నీళ్ళు ధారలు కట్టడం, శరీరమంతా రోమాంచితం కావడం, గుండె భాగమంతా ఎర్రగా కందిపోవడం, దేహం కంపించడం, గొంతు పెగలకపోవడం మొదలైన అష్టవిధ సాత్విక భావాలు దేహంలో పలుకుతాయి.

అంటే, సహజంగా మన అంతరంగం దేనిలో లీనమై ఉంటుందో, దేహం కూడా దానికి అనుగుణమైన పని చేయడానికే సంసిధ్ధపడుతుంది.

సాధన పరిపక్వమై, దాని ఫలరూపంగా మన లోపలంతా ఆనందం చిప్పిల్లుతుంటే, దానిని భావస్థాయిలో కట్టడి చేయలేక, దేహం కూడా ఉత్సాహంగా, ఉద్రేకంగా గంతులు వేస్తుంది. అదే అసలైన నాట్యం.

మహాత్ములందరి జీవితాల్లో దానిని మనం గమనించవచ్చు.

అటువంటివారిలో ప్రధమ తాంబూలం అందుకొనేది భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస.
భావముఖంలో లీనమైపోయి, విస్ఫోటనంలా ఎగిసిపడే ఆనందం అనిర్వచనీయమైన కదలికల్లోంచి బహిర్గతమవుతుండగా, ప్రపంచ స్పృహ ఎరుగని పారవస్యపు స్థితిలో తాను నాట్యం చేస్తున్నానని కూడా తెలియకుండా, దేహం దానంతటదే కదులుతుంది. చివరికి సమాధి స్థితిలో విశ్రమిస్తుంది. అదే అసలైన నాట్యం.

ఇక ఆ తర్వాత పేర్కొనవలసింది బెంగాల్ లో పుష్పించిన మరో భక్తి కుసుమం శ్రీ చైతన్య మహా ప్రభువుల గురించి.

కృష్ణ నామం వినినంతనే తన్మయత్వంలో మునిగిపోయి, బాహ్యస్పృహ కోల్పోయేవాడు చైతన్యుడు. పురవీధులలో నామ సంకీర్తన చేసుకొంటూ, లయబద్దంగా నాట్యం చేస్తూ కదిలిపోతున్న చైతన్యుని వెనుక, ఆయన భక్తి తత్పరతకు సమ్మోహితులై వేలమంది జనం ఆయన వెనుక నడిచి వచ్చేవారు. తనను రాధగా భావించుకొని కృష్ణుడు కోసం పరితపించి పోతున్న హృదయ వేదనతో చైతన్యుడు అనేక సార్లు గాల్లో కొన్ని అడుగులు ఎత్తుకు ఎగిరి, నేల మీద పడి స్పృహ కోల్పొయేవాడట ! అతి వేగంగాను, అనుహ్యంగా ఉండే ఆయన దేహ కదిలికలను చూస్తే, తలపండిన నాట్యకారులు సైతం ఆ విధంగా దేహాన్ని కదిలించలేరని శ్రీ కృష్ణదాస కవిరాజు మొదిలైన గౌడీయ సంప్రదాయకులు చెప్తారు .

శ్రీ శిరిడీ సాయిబాబా జీవితంలో కూడా అటువంటి అద్భుత సన్నివేశాలు భక్తులు చూడగలిగారు. ఆయన శిరిడీ వచ్చిన తొలి రోజుల్లో, చావడికి వెళ్ళి, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని, నాట్యం చేసేవారని చూసిన భక్తులు కొందరు తమ అనుభవాలలో నమోదు చేసుకున్నారు.

బాబాకు అతి దగ్గరగా జీవించిన తాత్యా పాటిల్ ఆ వివరాలు స్పష్టంగా తెలియజేశాడు.

బాబా భారతీయ భక్త కవులైన కబీరు, తుకారాం పాటలకే కాక, అరబ్బీ, పార్శీ భాషల్లో కూడ ఎన్నో పాటలకు అందంగా నాట్యం చేసేవాడు. ఆయన చేతులు, పాదాలు, కళ్ళు క్రమబద్దంగా కదులుతూ, చూసేవారిని పారవశ్యంలో ముంచివేసివి. బృందావన కృషుణ్ణి గురించి అభినయిస్తూ, ఆయన మురళిని ధరించిన భంగిమలో నిలిచినపుడు, సాక్షాత్తు కృషుణ్ణే చూస్తున్నట్లు అనిపించేది అని తాత్యా అంటారు.

నాట్యానికి పరమార్దం అదే కదా!

ఈ అంతరార్దమే నాట్యశాస్త్రంలో కూడా ప్రతిబింబిస్తుంది.

" నాట్యం చేసేవాడు అతడు నాట్యం చేస్తున్న ఇతివృత్తంలోని భావాన్ని తాను అభినయించడమో, నటించడమో, లేక ఆ పాత్రను పరిచయం చేయడమో కాదు. అది తానుగా మారిపోయి, ఆ అనుభవాన్ని తాను పొంది, స్వానుభవంగా దానిని ప్రేక్షకుడి ముందు ఆవిష్కరించడం. నాట్యము, నాట్యకారుడు అని వేరుగా లేక, నాట్యమే తానుగా మారిపోయినపుడే రసానందం సిద్దిస్తుంది." ఇదీ నాట్యానికి వాత్సాయనుడు మొదలు భరత ముని వరకు మన ఋషులు చెప్పిన అంతరార్దం.

వారు అనుభవించడమే కాదు, అటువంటి పారవశ్యపు స్థితిని తమను ఆశ్రయించిన వారికి సైతం అలవోకగా ప్రసాదించగల మహితాత్ములు వారు.

అవధూత తాజుద్దిన్ బాబా గారి విషయంలో ఇది జరిగింది.

ఒక భక్తుడు, తాజుద్దిన్ బాబా దగ్గరకొచ్చిన, తనకెన్నో అనుభవాలు సిద్ధించాయి కానీ, హాల్ అనుభవం కలగలేదని, అది ప్రసాదించమని బాబాని వేడుకున్నాడు. ఆయన కొద్ది క్షణాలు తదేకంగా చూసి, తమ తల మీద ఉన్న టోపిని నేల మీద తిరగేసి ఉంచుతారు.

అంతే. మరుక్షణం ఆ భక్తుడికి హాల్ అనుభవం కలిగింది. పట్టరాని ఆనందంతో అతడు గంతులు వేయడం ఆరంభించాడు. అతడిలో ఆ అనుభవం ఎంత గాఢంగా కలిగిందంటే, అతడి శరీరం దానిని భరించలేక, తలకిందులై, శిరస్సు, చేతులు నేల మీదకు ఆని, తలకిందులుగా ఎగరడం ఆరంభించింది.
ఇది కాదా నృత్యమంటే!

కేవలం భారతీయ సంప్రదాయంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా, ఏ కాలంలోనైనా ఆధ్యాత్మికతకు, నాట్యానికి మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధం అలాగే కొనసాగుతోంది. దానికి ఉదాహరణలు కోకొల్లలు.

ముఖ్యంగా అందులో ప్రస్తావించదగినది ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రాగారి అనుభవం . తావో ఆఫ్ ఫిజిక్స్ గ్రంధానికి ముందుమాటలో, తన అనుభవాన్ని వివరిస్తూ, శివ తాండవం అంటే ఏమిటో నేను దర్శించాను అని ఆయన చెప్తారు.

నాట్య శాస్త్రానికి ఆద్యుడు భరత ముని. ఆయన పేరు మీదే భరతనాట్యం రూపుదిద్దుకుంది
భరతనాట్యంలో ఒక ధ్యాన శ్లోకం ఉంది.

శ్లో|| ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాఙ్మ్ యం
ఆహార్యం చంద్రతారాది తం సమః సాత్వికం శివం||

ఈ విశ్వమే శరీరంగా కలిగి, తన స్వరమే సర్వ భాషలకు అంతస్సూత్రంగా ఉండి, తారాచంద్రులనే ఆభరణాలుగా ధరించిన, సాత్విక, స్వరూపమైన శివుడికి నమస్కరిస్తున్నాము.

అంటే నాట్యంలో ఉండవలసిన అంతరార్దం, నాట్యం ద్వారా పొందవలసిన అంతిమ అనుభవం ఈ శ్లోకం ద్వారా చెప్పకనే చెప్పారు మన మహర్షులు.

అలాగే మధ్య ఆసియాలో ప్రాచుర్యం పొందిన సూఫీ సంప్రదాయంలో కూడా నృత్యానికి గొప్ప స్థానం ఇవ్వబడింది. వారి సాధనలో భాగంగా సాగే దర్వేషుల పారవశ్యపు నృత్యం ఒక గొప్ప ప్రక్రియ. అది చేస్తున్నవాడిని, చూస్తున్న వాడిని కూడా అలౌకికమైన మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది.
ఒక ప్రాచీన సూఫీ సూక్తి ఇలా చెప్తుంది, "మనం పనిలో నిమగ్నమై ఉంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు. అదే మనం ఆనందంలో మునిగిపోయి, ఆపుకోలేని ఉద్రేకంతో ఆనంద తాండవం చేస్తుంటే భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు."

నాట్యం అనేది కేవలం ఒక కళ కాదు.

అద్భుతమైన ఆధ్యత్మిక అనుభవాన్ని, అత్యంత సుందరంగా ఆవిష్కరింపజేసే మహోన్నత ప్రక్రియ అది. అనుభవజ్ణుడి అంతరంగం కదిలి, ప్రవాహమై, కట్టలు తెంచుకొని, దేహంలో ప్రస్ఫుటించిన కదలికలే నాట్యం. అదే నాట్య శాస్త్రంగా రూపొందింది.

ఒక్క నాట్యమే కాదు, ఏ కళ అయినా అనుభవం లోంచి పురుడు పోసుకున్నదే!

ఆధ్యాత్మికం కాని అనుభవం, అత్యంతిక కళలకు మాతృ స్థానం కాగలదా?!!

అందుకే సాయిబాబా అంటారు," కళలను భక్తి ప్రపత్తుల కోసం వినియోగించకుంటే మనిషికి అధోగతి తప్పదు."


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)