ధారావాహిక

 అంతర్ముఖం - (16 వ భాగం)

- రచన : యండమూరి వీరేంద్రనాథ్     


మర్నాడు మొదటి సాక్షిగా పరంధామయ్యగారు వచ్చారు. సిల్కు పంచె, సిల్కు జుబ్బాతో పెళ్ళికి తయారై వచ్చినట్టు వచ్చాడు.
రెండేళ్ళపాటు నన్ను గమనించాడట. నాలో తల్లిపట్ల ఎలాంటి ప్రేమ, గౌరవం, భక్తీ ఏనాడు కనిపించలేదుట. తను పోరుపెట్టి అమ్మను తీసుకువచ్చేలా చేసాడట. కానీ కొంతకాలం తరువాత తనకు చెప్పకుండానే అమ్మను తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్చానట. ఆ విషయం తెలిసి రెండు రోజులు తను నిద్రపోలేదుట. నేనంటే అసహ్యంతో, వాళ్ళ రెండో కూతుర్ని నేను చేసుకుంటానన్నా కాదన్నాడట..

నా లాయరు ఆయన్ని క్రాస్ ఎగ్జామ్ చేసాడు. "రెండు రోజులు సెలవులు వస్తున్నాయని అతను అమ్మను చూడటానికి వెళతానంటే, ఇన్ స్పెక్షన్ వస్తోందని మీరు ఆపేసినమాట నిజమేనా?"
"పని పూర్తిచేసి నేనే వెళ్ళమన్నాను. కానీ ’తలనొప్పిగా వుంది. వెళ్ళను’ అన్నాడు. అతడికి నిజంగా వెళ్ళాలనిప్లేదు. నలుగురూ ఏమైనా అనుకుంటారని వెళ్ళాలనుకున్నాడు. ఇన్ స్పెక్షన్ వంక పెట్టి మానేసాడు" అంటూ నా సిన్సియారిటికి మంచి నల్లరంగు పులిమాడు. చివర్లో అతడు చెప్పిన విషయం కోర్టులో బాంబులా పేలింది.

అమ్మ కర్మకండ కోసం అని చెప్పి శలవు తీసుకుని పిక్నిక్ కి వెళ్ళానన్న విషయం!

ఆ విషయం ఆయన చెపుతూంటే జడ్జీతోసహా అందరూ నా వైపు అసహ్యంగా చూశారు. ఆ తరువాత సాక్షిగా వచ్చిన మన్మధరావు అంతకన్నా పెద్ద న్యూస్ చెప్పాడు. ’అమ్మ చచ్చిపోయిఅన మూడోరోజు నేను నా గదికో అమ్మాయిని తెచ్చుకున్నానని, రాత్రంతా ఆమె అక్కదే గడిపిందనీ’ చెప్పాడు. పైగా ఆ అమ్మాయి నా తల్లి చీర కట్టుకోవటం ఆయనకి నా మీద అమితమైన ఏవగింపు కలిగించిందట.

ఆ విషయం వినగానే కోర్టులో ఇంకా పెద్దగా గొడవ వినిపించింది. రెండు నిమిషాలదాకా అది తగ్గలేదు. జర్నలిస్టులు తెగవ్రాసుకుంటున్నారు. రేపు హెడ్డింగులో ’నరరూప రాక్షసుడు’ అని పెడతారా?

అమ్మ చీరలేవో నాకు గుర్తుండవు. ఆర్నెల్లక్రితం ఎప్పుడో అమ్మ కట్టుకున్న చీర తిరిగి ప్రణవి కట్టుకుందని అతడికెలా గుర్తుందని ఎవరికీ అనుమానం రాలేదు. ఆ తరువాతి సాక్షిగా ఎవరో ముసలాయన వచ్చాడు. చిన్నప్పుడు నాకు కుస్తీ నేర్పించినట్టు గుర్తు. కానీ నేనే వెంటపడి నెర్పమని బలవంతం చేసినట్టు సాక్ష్యం చెప్పాడు. రోజూ వెళ్ళి నా తోటి కుర్రాళ్ళమీద ఆ ప్రయోగాలన్నీ చేసేవాడినని చెప్పాడు. ఆ రోజునుంచే నాలో ఈ రౌడీ మనస్తత్వం వుందని చెప్పటానికనుకుంటాను ఈ సాక్ష్యం. ఎవరయినా ఇదంతా రికార్డు చేస్తే బావుండును. నాకు కూడా తెలియని నా ’బయోగ్రఫీ’ వ్రాయించి పుస్తకంగా ప్రచురించవచ్చు. ఆ కూర్చున్నజర్నలిస్టుల్లో ఎవరయినా ఆ పనే చేస్తున్నారేమో.

నాయర్ కనిపించగానే ఆలోచనల్లోంచి తేరుకున్నాను. అతడు సాక్షిగా బోనులో నిలబడి నా వైపే చూస్తున్నాడు. అంతదూరం నించి అతడి కళ్ళల్లో నీళ్ళు తిరగడం స్పష్టంగా కనిపించింది.
లాయర్ రఘవీర్ మొదట అతడ్ని ప్రశ్నిస్తుంటే అతను నా విట్నెస్ అనుకున్నాను. "చాలా మంచివాడండి. రెండేళ్ళుగా దాదాపు ప్రతిరోజు చూశాను. ఎన్నడూ ఎవరికీ ఏ రకంగానూ హాని కలిగించడం నేను చూడలేదండి.

"వాళ్ళ అమ్మ గురింఛి చెపుతుండేవాడా"?
"అప్పుడప్పుడు. ఆవిడ తన దగ్గరున్నప్పుడు ఎక్కువ వచ్చేవాడు కాదు. ఆశ్రమంలో చేర్చి వచ్చాక అక్కడ బావుందని, ఆవిడనక్కడ బాగా చూసుకుంటున్నారని చెప్పి సంతోషించాడు".
"తల్లిని సరిగ్గా చూసుకోలేక పోతున్నానని బాధపడేవాడా"?
"బాధనైనా, సంతోషం అయినా అతడు ఎక్కువ బయటపెట్టుకునే మనిషి కాదండి. తన లోపలే దాచుకుంటాడు. అందుకే అతడంటే నాకు గౌరవం".
"ఆవిడను ఆశ్రమంలో చేర్పించి వచ్చినప్పుడు కూడా బాధపడలేదా?"

"చెప్పాకదండీ. ఇక్కడకంటే ఆవిడ అక్కడ సుఖంగా వుందని అనేవాడు. అదేకదండీ ఎవరికయినా కావలసింది. నలుగురు ఏమో అనుకుంటారని, తల్లిని దగ్గ్రంచుకుని ఇబ్బందిపెట్టి తను బాధపడేకంటే అదే మంచిది కదండీ" అన్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చాడు ప్రశ్నించడానికి.
"అతడు నీ కస్టమరా?"
"కస్టమరే కాదండి, స్నేహితుడు కూడా"! జవాబిచ్చాడు నాయర్.
"అయితే నీతో బాగా మాట్లాడేవాడన్నమాట."

"లేదండి, అతడు అవసరం వస్తే తప్ప ఎక్కువ మాట్లాడడండి. అనవసరంగా ఎప్పుడు ఎవరితోటీ మాట్లాడడం నేను చూడలేదండి".
"నీ డబ్బు సరిగ్గా ఇచ్చేవాడా?"
"మేమిద్దరం మంచి స్నేహితులమండి, అయినా డబ్బు విషయంలో ఎన్నడూ పైసా కూడా తేడా రానివ్వలేదు. నేనెప్పుడయినా అవసరమా అనడిగినా తీసుకునేవాడు కాదు. అతడు మీరనుకుంటున్నట్లు చెడ్డవాడు కాదు. కాని మంచివాళ్ళకు రోజులు కావండి".

"మంచివాడయితే హత్య ఎందుకు చేశాడు?"
"అది ప్రమాదవశాత్తూ జరిగిందే అయుంటుంది. రోడ్డుమీద రోజుకి ఎన్నో యాక్సిడెంటులు జరగడం లేదా? అలాగే అదీ ఒక యాక్సిడెంట్. అంతే". అన్నాడు నాయర్ గట్టిగా.
ఇంకేం ప్రశ్నలు లేవన్నాడు ప్రాసిక్యూటర్. నాయర్ బోను దిగలేదు.
"మీతో ఒక్క విషయం చెప్పాలి" అన్నాడు జడ్జికేసి తిరిగి.
"క్లుప్తంగా చెప్పండి" అన్నాడు జడ్జి.

"ఆయన దుర్మార్గుడు కాడండి. నిజంగా మంచివాడండి. జరిగింది ప్రమాదవశాత్తూ జరిగిందండి. మీరతడిని సరిగ్గా అర్థం చేసుకోండి" అన్నాడు.

"జడ్జిమెంట్ చెప్పటానికి మేమున్నాం. మీరు చెప్పనవసరం లేదు. మీరు వెళ్ళవచ్చు" అన్నాడు జడ్జి. నాయర్ బోనుదిగి వెళుతూ నావైపు చూసాడు. అతడి పెదవులు అదురుతున్నాయి. ’నీ కోసం ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను. నాకు చేతనయింది చేశాను’ అన్నఫీలింగ్ అతడి మొహంలో కనిపిస్తోంది.

ఒక్కసారి లేచివెళ్ళి అతడిని కౌగలించుకోవాలనిపించింది. నా కోసం కాదు. అతడిని ఓదార్చడం కోసం. నాయర్ మెల్లిగా వెళ్ళి ప్రేక్షకుల మధ్య ఒక బెంచీలో కూర్చోవడం చూస్తూనే వున్నాను. అతడు మొదటి నుంచి అక్కడే వున్నాడేమో నేనే గమనించి వుండను. తరువాత సాక్షిని చూసి ఉలిక్కిపడ్డాను.

ఆమె ప్రణవి.

ఎన్నో యుగాల తరువాత ఆమెని చూచినట్టు అనిపించింది.
ఆమె అలాగే అందంగా వుంది, కాని పూర్వపు వన్నె తగ్గింది. కళ్ళక్రింద నల్లగీతలు ఏర్పడ్డాయి. బహుశా రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొనటం వల్లనేమో....శ్రీనాధ్ నాకు ఆమె గురించి చెప్పిన విషయంగానీ, తగ్గిన ఆమె అందంగానీ - ఇవేమీ నన్ను బాధించలేదు. ఇంతకాలం ఆమె ఎందుకు రాలేదు నా దగ్గిరికి? వచ్చి నన్నెందుకు పలకరించలేదు అన్న విషయమే బాధిస్తోంది. ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్న అప్తమిత్రుడిని అప్యాయంగా పలకరించాలన్న నా భావం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ప్రణవి కోసం నేనింతగా ఎదురుచూస్తున్నానని నాకు తెలీదు.

ఆమె నా తరపు సాక్షిగా వచ్చింది. ఆమె సాక్ష్యం నన్ను శిక్షనుంచి తప్పించకపోయినా ఆమెని ఒకసారి మళ్ళీ చూసేలా చేసింది.

ఆమెతో కనీసం ఒకసారైనా మాట్లాడాలని కోరిక కలిగింది. కేవలం ఒకే ప్రశ్న....జీతం చాలకా? నన్ను మర్చిపోవటానికా? ఎందుకు....ఎందుకు నీవా వృత్తిలోకి దిగావు? అని అడగాలనిపించింది.

రఘవీర్ కి ఆమె ముఖ్యమైన సాక్షి! ఒక రౌడీ ఆమెని రేప్ చేయబోతూండగా నేను అడ్డుకున్నానని, ఆ ఆక్సిండెంట్ లో ఆ రౌడీ మరణించాడనీ నిరూపించగలిగితే చాలు. కేసు బలహీనమైపోతుందని చెప్పాడు.. అదే ప్రయత్నిస్తున్నాడు. మానభంగం టైమ్ లో హత్య నేరం కాదుట.

కానీ ప్రాసిక్యూటర్ దాన్ని వప్పుకోవటం లేదు. నాకూ. ఓంకార్ కీ శత్రుత్వం వుందని, నా నుంచి తనని తాను రక్షించుకోవటం కోసమే ప్రణవిని కత్తితో బెదిరించాడనీ, దానికి పై ఎత్తువేసి మేము అతడిని నిరాయుధుణ్ణి చేసామనీ, ఆ తరువాత నేను అతనిని చంపివేసాననీ వాదించటానికి కావల్సిన ప్రశ్నలు వేసాడు.

ప్రశ్నల్తో ఆమెని తికమకపర్చాడు. నేను గోదావరిలో మునిగి వుండగా, నన్ను చూడని టైమ్ లో కూడా ఓంకార్ ఆమెను మానభంగం చేసే ప్రయత్నం ఏదీ చేయలేదు. అదీ ప్రాసిక్యూటర్ నిరూపించింది! ఆమె వంటిమీద నగలు కూడా లేవు. కాబట్టి అతను శీలం కోసం గానీ డబ్బుకోసం గానీ ఆమెని బెదిరించలేదు. మరెందుకు కత్తి చూపించాడు?
దీనికి ప్రణవి సమాధానం చెప్పలేకపోయింది. దాంతో ప్రాసిక్యూటర్ వాదనకి బలం చేకూరింది. నిజానికి ఓంకార్ ప్రణవి నుంచి ఏం ఆశించాడో, మల్లిక పంపగా వచ్చి శ్రీనాధ్ ని వదిలి నన్నెందుకు వెంబడించాడో అర్థంకాలేదు.

"హైదరాబాద్ లో ముద్దాయి మిమ్మల్ని ఎక్కడ మొదటిసారి కలిసారు?"
"జూ పార్క్ లో"
"వాళ్ళింట్లో ఆయనతో పాటు ఎన్ని రోజులున్నారు?"
"మర్నాడు వెళ్ళిపోయాను".
"ఆ రాత్రి ఎలా గడిపారు?"
లాయర్ రఘవీర్ అభ్యంతరం చెప్పాడు. కానీ ప్రాసిక్యూటర్ ఆ ప్రశ్న ముఖ్యమయిందని చెప్తూ...."హంతకుడికి సెంటిమెంట్స్ అనేవి లేవు. తల్లి చీర, అదీ క్రితంరోజు చనిపోయిన తల్లి తాలూకు చీరని కట్టుకున్న గర్ల్ ఫ్రెండ్ తో గడిపాడు. అది అతడి చవకబారుతనన్ని తెలియచేస్తోంది. అది చెప్పించడమే నా ఉద్దేశ్యం" అన్నాడు.

లాయర్ రఘవీర్ మరేదో అనబోయేంతలో ప్రణవి గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. "ఆయన సెంటిమెంట్స్ సంగతి సరే....అవి నాకు ఉన్నాయి యువరానర్! అందుకే ఆయన దగ్గరకు కూడా నేను వెళ్ళలేకపోయాను. ఒక ఆడ, మగ ఒకే ఇంట్లో ఉంటే ఏదో జరిగిపోతుందని అనుకునే మనస్తత్వం మారాలి మువరానర్. ఆ లోకంలో ఎంతో మంది దగ్గర బంధువులతో ఒకోసారి ఒక స్త్రీ, పురుఘడు ఒకే ఇంట్లో ఉండవలసిన అవసరం రావచ్చు. ప్రతిసారీ ప్రాసిక్యూటర్ గారు అనుకున్నదే జరుగుతుందని నాకు రాసివ్వగలరా? ఆయనింట్లో ఆయన తన వదినగారితోనో, మరదలితోనో ఒంటరిగా ఎప్పుడూ లేరా?" దు:ఖంలో ఆమె స్వరం పూడుకుపోయింది. ప్రణవిలో అంత ఆవేశం ఉందని నాకు తెలియదు. కోర్టులో గోల, జనం ఈలలు.

"చూడండి. మిమ్మల్ని అడిగిన ప్రశ్నలకు మాత్రమే మీరు జావాబివ్వాలి. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు" అన్నాడు జడ్జి, గొడవ తగ్గాక.

"జరిగిన దుర్ఘటనకి, అంతక్రితం ఎన్నడో నేను ఆయన ఇంట్లో వుండడానికి సంబంధం లేదు. అయినా నన్నెందుకు ఆ విషయం గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు?" ఎదురు ప్రశ్న వేసింది ప్రణవి.
"మేము ఏదడిగినా అది కేసుకి సంబంధించిన పాయింట్ అయుంటుంది. అలా లేకపోతే డిఫెన్స్ లాయర్ లేచి దానికి అభ్యంతరం చెప్తారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇది సినిమా కాదు" అన్నాడు జడ్జి.

సినిమాల్లో చూపించే అలాంటి సన్నివేశాలపట్ల ఆయనకెంత కోపం వుందో మాకు అర్థమయింది.
ప్రాసిక్యూటర్ ప్రశ్నించటం కొనసాగించాడు. "ఆయనకూ మీకు ఎలాంటి సంబంధం వుంది?"
"అప్పటివరకూ స్నేహం. పెళ్ళి చేసుకోవాలని భద్రాచలంలో నిర్ణయించుకున్నాం. కానీ...."అగింది.
"కానీ - ఏమిటి?"
"ఏమీలేదు"
"మీలో ఇప్పటికీ అదే ఉద్దేశ్యం వుందా?"
"ఉంది"
"ఉంటే మరి వేశ్యావృత్తి ఎలా చేపట్టారు?"

కోర్టు హాలంతా గుసగుసలు. జనాలకి జడ్జీ వార్నింగ్ ఇచ్చాడు. హాలు నిశ్శబ్దం అయింది.
"మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి"! రెట్టించాడు.
"నా వృత్తికీ , మా వివాహానికీ సంబంధంలేదు. వివాహం అన్నది మా ఇద్దరి వ్యక్తిగత విషయం" అన్నదామె.

చప్పట్లు కొట్టాలనిపించింది. ప్రాసిక్యూటర్ అన్నాడు - "మీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. ఈ లోపులో అతను నేరంలో ఇరుక్కున్నాడు. అతను హత్య చేశాడని మీకు తెలుసు. అందుకని అతన్ని నమ్ముకోవటం ఇష్టంలేక మీరు డబ్బు సంపాదనలో పడ్డారు. అవునా?"

రఘవీరు లేచి అభ్యంతరం తెలిపాడు. జడ్జి రఘవీర్ ని బలపర్చాడు. ప్రాసిక్యూటర్ ఇంకో ప్రశ్న అడిగాడు. "మీరు స్కూల్లో పని చేస్తున్నారు. ఆ జీతం మీకు సరిపోలేదు. వేలు అర్జిద్దామని ఈ వృత్తిలోకి దిగారు. అవునా?"
రఘవీర్ దీనికి కూడా అభ్యంతరం చెప్పాడు. ప్రాసిక్యూటర్ నవ్వుతున్నాడు. అతడికి సమాధానాలతో పనిలేదు. కోర్టులో జనం అప్పుడే ప్రణవి అడ్రసుకోసం వాకబు చేస్తున్నారు. జడ్జి ప్రణవిని అసహ్యమ్గా చూస్తున్నాడు. అదీ కావల్సింది.

"మీ ఇద్దరికీ శారీరక సంబంధం ఎప్పటినుంచీ వుంది?"
రఘవీర్ మళ్ళీ అభ్యంతరం లేవనెత్తాడు. అది ఆమెని అవమానించే ప్రశ్న అన్నాడు.
ఆమెకి ఇష్టమయితే చెప్పొచ్చునన్నాడు జడ్జి.
"భద్రాచలం వచ్చినరోజు రాత్రి".

"అంటే తల్లి చనిపోయిన పదమూడు రోజులు కాకమునుపేదనన్నమాట ....తల్లి కర్మకి అని శలవు పెట్టి - మీతో సుఖం అనుభవించాడన్నమాట" అని అందరికీ వినిపించేలా స్వగతంగా".....దారుణం” అన్నాడు ప్రాసిక్యూటర్.
ప్రెస్ తో సహ, జడ్జీ కూడా వ్రాసుకుంటున్నాడు.
ఇది ఓంకార్ హత్యకేసో, నా తల్లి మరణం తర్వాత నా ప్రవర్తనపై కేసో నాకు అర్థంకాలేదు. ప్రణవి బోను దింగింది. కోర్టు హాల్లోంచి బయటకు వెళ్ళిపోయింది. దిగులుగా.....వేదనగా.

ఆరోజు కోర్టు అయిపోయింది. సాక్ష్యాలు కూడా ముగిసాయి.
ఆలోచనతోటే జైల్లో అడుగుపెట్టాను. ఇదే నా శాశ్వత నివాసం కాబోతోందా? నా శవాన్ని ఏం చేస్తారు - ఏ కర్మలోనూ నమ్మకం లేని నాస్తికుడినని జంతువులకీ, పక్షులకీ ఆహారంగా వేస్తారా? మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం ఇస్తారా? అలా అయితే కొంత ప్రయోజనం అయినా వుంటుంది.
వెంటిలేటర్ లోంచి నీలాకాశం ముక్క కనిపిస్తోంది. నక్షత్రాన్ని చూసి ఎంతకాలం అయింది?
నా రూమ్ లో కిటికీ దగ్గిర కూర్చుంటే ఎదురుగా మన్మధరావు యింటి గోడకి తగిలించిన దిష్టిబొమ్మ రాత్రిళ్ళు వింతగా కనిపించేది. గుడ్లగూబ కూర్చుని చూస్తున్నట్లుండేది.

గుడ్లగూబ తలుచుకున్నప్పుడల్లా పరంధామయ్యగారే గుర్తు వస్తారు. ఎంత చక్కగా అబద్ధాలు చెప్పాడు? అమ్మ శ్రాద్ధక్రియలు సరిగ్గా చెయ్యమని బ్రతిమలాడాడాట. వాలంటే సాయం చేస్తానన్నాడట. సాయం ఎందులో చేసేవాడో? పిలిస్తే వచ్చి భోజనంచేసి వెళ్ళేవాడేమో! లేదా భోజనంలో చేయించే ఆధరవువుల గురించి చెప్పేవాడేమో.

మనిషి చనిపోతే ఈ విందు భోజనమేమిటి? చనిపోయిన మనిషికి అత్మకాంతి అని ఒక వంక. లాభం పొందేదంతా బ్రతికున్నవాళ్ళే. హరి తల్లి చనిపోయినప్పుడు చూసాను. రకరకాల బంధువుల రావడం. రకరకాల పద్దతులు చెప్పడం. అవన్నీ హరి జరిపించే వుంటాడు. ఆ అప్పులు తీర్చుకునే లోపలే తండ్రి పోవడం మళ్ళీ అతనికి ఫ్రెష్ గా అప్పులు!
ఆర్థికంగా నిలదొక్కుకున్న వ్యక్తి వున్నదాంట్లో చనిపోయినవారి జ్ఞాపకం కోసం కొంత ఖర్చుపెట్టడం వేరు. హరిలాగా ప్రతినెలా లోటు బడ్జెట్ తో వెళ్ళబుచ్చే వ్యక్తి అప్పులపాలవడం అమానుషం కదా.

మనిషి ఆలోచించే ఏకైక జంతువు అన్నారు. ’ఆలోచన’ అంటే మరెవరో ఎప్పుడో చెప్పినదాన్ని గుడ్డిగా అనుకరించడమేనా? స్వయంగా ఎందుకు ఆలోచించరు? ఏ పని ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించి చెయ్యగలిగితే మనిషిలో కొత్త చైతన్యం పుడుతుంది. నేను ఆలోచించకుండా ఆవేశంతో చేసిన ఒక పని ఎదుటివాడి ప్రాణం తీసిందనీ - దానికీ - ఒక సంవత్సరంగా , ఇమ్త ప్రభుత్వ ఖర్చుతో అనేక రకలుగా చర్చిస్తున్న ఈ మనుఘలు - ఒక్కసారి కూర్చుని తాము చేసే చర్యల గురించి కూడా ఆలోచించగలిగితే?

ప్రతి మనిషి ఆవేశపరుడే. వెంటనే వచ్చే కొద్దిపాటి మానసిక లాభం కోసం ఒక్కోసారి చేయకూడని పనులు చేస్తాడు. మన్మధరావు ఆడవాళ్ళ వెంటపడడం, పరంధమయ్య స్టాఫ్ దగ్గర లంచాలు పుచ్చుకోవడం, సుశీల రావుగారితో తిరగడం - అన్నీ అలాంటివే. నేను చేసిన పని కోర్టుకెక్కింది. వాళ్ళు చేసేవి దగ్గరున్న నలుగురులో మాత్రమే బయటపడేవి. వాళ్ళకి శిక్ష ఎవరూ విధించరు.

ఉన్నట్లుండి వెంటిలేటర్ నించి చల్లటిగాలి వీచడం మొదలయింది. గాలి వాసనని బట్టి వర్షం కురుస్తున్నట్లుగా అనిపించింది. చీకటి కాబట్తి వర్షం కనిపించటంలేదు. ఎన్నాళ్ళయింది వర్షాన్ని చూసి. చిటపట చినుకుల్లో తడిసి! గొడుగు కొనుక్కునే తాహతులేక ఎంత పెద్ద వర్షమైనా నడుస్తూనే తడిచేవాడిని. ఇప్పుడు వర్షాన్ని చూసే స్వేఛ్ఛ కూడా లేదు.

స్వేఛ్ఛకు నిజమైన అర్థం ఏమిటి?
ఎవరో చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరించటం, ఎవరో వెలిబుచ్చిన భావాల్ని ఆచరించటం - ఇదా స్వేచ్ఛ?
మనుఘ్యలు సొంతంగా ఎందుకు ఆలోచించరు?

* * * *
కోర్టుహాల్లో వాదొపవాదాలు బలంగా సాగుతున్నాయి. నా భవిష్యత్తుని ఎవరు నిర్ణయించబోతున్నారో - ప్రేక్షకుడిలా చూస్తూ వున్నాను. నాకు కోళ్ళపందెం గుర్తొచ్చింది. నన్నేమీ మాట్లాడనివ్వకుండా కూర్చోబెట్టి లాయర్లిద్దరూ మాట్లాడుకోవటం గమ్మత్తుగా అనిపించింది.
అసలు నా స్వరం నేను విని ఎన్నాళ్ళయింది?
జైలుకి వచ్చిన తరువాత మౌనాన్నే ఆశ్రయించుకున్నాను.
మనసుతో మాట్లాడటం తప్ప నోరు విప్పి మాట్లాడటం చాలా అరుదై పోయింది.

నాకు అర్థం కాని విషయం నా గురించి కాదు. ప్రణవి గురించి ఎందుకామె నన్ను వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి ఎందుకు కోర్టులో నన్ను సపోర్ట్ చేస్తూ సాక్ష్యం ఇచ్చింది? ఆమె నన్ను వివాహం చేసుకుందామనుకుందా? ఆ చర్చ మా మధ్య వచ్చిందా?
ఆలోచనలతోనే లంచ్ టైమ్ అయింది.

లంచ్ తరువాత ఆఖరి వాదనలు మొదలయ్యాయి. ప్రాసిక్యూటర్ ప్రారంభించాడు. "యువరానర్! ముద్దాయిలో చిన్నతనంలో నేరప్రవృత్తి వుంది. అందుకే కుస్తీలూ, కరాటేలూ నేర్చుకున్నాడు. పదేళ్ళక్రితపు శత్రువుని కూడా గుర్తుపెట్టుకుని చంపి పగ తీర్చుకున్నాడు. పగకి కారణం కూడా చాలా చిన్నది. అంత చిన్న కారణానికే హత్య చేసినవాడిని వదిలిపెడితే రేపు బయటకొచ్చాక మరెన్నో హత్యలు చేస్తాడు".
’చెయ్యను’ అనుకున్నాను ’.....కిడ్నీ ట్రబుల్ తో చచ్చిపోతాను.’

"యువర్ ఆనర్! ఇతడి గత చరిత్ర చూస్తే పవిత్రమైన ఈ గడ్డ మీద ఇంత అపవిత్రమైన ఆత్మలున్నాయా అని అనుమానం కలుగుతుంది. ఎంత బీదవాడయినా, ఎంత లేనివాడైనా అప్పయినా చేసి తల్లిదండ్రుల ఆత్మకి శాంతి కలిగేలా శ్రాద్ధకర్మలు చేయిస్తాడు. ఇతడు డబ్బుకి కక్కుర్తిపడి కనీస క్రియలైనా చెయ్యలేదు. ఉంచుకున్న దానితో పిక్నిక్ ల కెళ్ళే ’తాహతు’ వుంది కానీ, ఏ బ్రాహ్మడికయినా డబ్బులిస్తే ఆ తల్లి కింత పిండం పెట్టేవాడు - అన్న జ్ఞానం లేదు. హిందువుగా పుట్టిన ఏ వ్యక్తీ సహించలేని చర్య ఇది. మనిషిగా పుట్టిన ఏ వ్యక్తీ భరించలేని చేష్టలివి. ఇతడికి ఆత్మ అనేది లేదు" ఆవేశంగా అన్నాడు.

"ఇతడు తల్లిని ఆశ్రమంలో వదిలేసిన విధానం చూడండి. సభ్య సమాజంలో ఏ వ్యక్తి చేయని కార్యం అని నేనంటాను. పరోక్షంగా తల్లి మరణానికి ఇతడే కారకుడు. ఇతడి ప్రవర్తనవల్లే ఆమె కృంగి, కృశించి చచ్చిపోయింది. ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో వుండడానికి తగడని మరోసారి మనవి చేస్తున్నాను. వీరివల్లే సమాజం ఇంతగా కుళ్ళిపోయింది. ఇతడిని చూసి మరొకడు తన తల్లిదండ్రులని అలాగే ట్రీట్ చేస్తాడు. అదొక అంటువ్యాధై పోతుంది. అందుచేత ఇతడికి ఈ సమాజంలో ఎలాంటి స్థానం లేకుండా చెయ్యాలి" గుండెలనిండా గాలి పీల్చుకుని ఆగాడు.

"...నా సర్వీసులో ఎంతోమందికి ఉరిశిక్ష వేయమని అడగబోయి సందేహించాను. కాని ఈ వ్యక్తికి ఉరిశిక్ష వేయమని అడగటానికి నాకు ఎలాంటి సందేహం, బాధ కలగడంలేదు. అది నా బాధ్యత అనిపిస్తోంది". కోర్టుహాల్లో చప్పట్లు పడ్డాయి. ’మరి ఇది సినిమా సంఘటన కాదా’ అన్నట్టు జడ్జివైపు చూసాను. ఆయన చాలా తదాత్యంగా ఆ వాదన వింటున్నాడు.

"....యువరానర్, ఈ వ్యక్తి చాలా తెలివైనవాడు కాదు. తను చాలా తెలివైన వాడినని అనుకుంటాడు. మాటలు తూచి తూచి మాట్లాడతాడు. ఒక్కసారయినా తనవల్ల తప్పయిపోయిందని అనడం మీరెవరైనా విన్నారా? లేదు. క్షమాపణ అనేది అడగడం నామోషీ అనుకుంటాడు. పశ్చాత్తాపం మనిషిని శుద్ది చేస్తుందంటారు. ఇతడిలో పశ్చాత్తాపం లేదు. చేసిన పనికి అతడిలో ఎలాంటి బాధ లేదు. అంటే ఇతడు మనిషికాదు. రాక్షసుడు. ప్రతిదానికీ తన అభిప్రాయమే కరెక్టన్నట్టు వాదిస్తాడు. చేసిన హత్య కూడా సరి అయినదే అన్నట్టు తన ప్రవర్తన ద్వారా భ్రమ కలిగిస్తాడు. అతడికి ఉరిశిక్ష విధించి ఈ సమాజానికి సేవ చేయండి. సమాజాన్ని రక్షించండి" హాలు ప్రతిధ్వనించేలా ముగించాడు.

తరువాత డిఫెన్స్ లాయరు లేచి నిలబడి మాట్లాడటం ప్రారంభించాడు.
"ప్రాసిక్యూటర్ గారికి ముద్దాయిలో ఆత్మ అనేది కనిపించలేదట. నాకు మాత్రం అతడిలో పరిశుద్ధమైన అత్మ కనిపిస్తోంది. ఎవరికీ ఏనాడూ అన్యాయం చేయని వ్యక్తి అతడు. ఎక్కడ పనిచేసినా అది సిన్సియర్ గా చేసాడు. అతడి వ్యక్తిత్వం అర్థం చేసుకున్నవారికే అది గొప్పగా అనిపిస్తుంది" ఆగాడు.
"....హత్య జరిగింది. ఆ విషయాన్ని నా క్లయింటే వప్పుకున్నాడు. స్నేహితుడు వెళ్ళిపోదామని చెప్పినా వినకుండా వెళ్ళి పోలీసుస్టేషన్ లో రిపోర్టు స్వయంగా ఇచ్చాడు. దాన్ని బట్టి అతడి నిజాయితీ తెలుస్తోంది".

రఘవీర్ ఉపన్యాసం సాగిపోయింది. మరోవైపు నాకీ వాదనలలో ఆసక్తి తగ్గిపోయింది. వినాలని కూడా అనిపించడంలేదు. మళ్ళీ అదే అనుమానం. ఈ కేసు నేను హత్య చేశానన్న నేరానికా? లేక అమ్మ అంత్యక్రియలు సరిగ్గా చెయ్యలేదన్న నేరానికా? దానికీ, దీనికీ పెద్ద లింకుందంటాడు ప్రాసిక్యూటర్. నిజమేనేమో. నేను చేసినదానికి పశ్చాత్తాపడటంలేదని విమర్శించాడు. అది మాత్రం నిజంకాదు. పశ్చాత్తాప పడాల్సిన అవసరం నాకు కనిపించలేదు. ఆయన్ని ఆలోచించరు. ప్రతి మనిషి ఆలోచన వేరుగా వుంటుంది. నా ఆలోచనని నేనేమీ నిర్మొహమాటంగా బయటపెట్టటామే నా తప్పని మీరు అనుకుంటే నేనేమీ చెయ్యలేను. అని చెప్తే?.....లాభం లేదు. ఆయనకు అర్థంకాదు.

ఉరిశిక్ష వేసి ఒక అమాయకుడి ప్రాణాలు తియ్యవద్దని రఘవీర్ వేడుకుంటున్నాడు. శిక్ష వెయ్యవద్దని అనడం లేదు. కాని ’అతడు చేసిన నేరం కావాలని చేసింది కాదు. యాక్సిండెంటల్ గా జరిగిందన్న విషయం మనసులో పెట్టుకుని ఆలోచించమని జడ్జీని అర్థిస్తున్నాడు.
నాకు లేని ఆసక్తితో ప్రేక్షకులు నిశ్శబ్దంగా కూర్చుని తీర్పుకోసం ఎదురు చుస్తున్నారు. హాలంతా కలయచూశాను. ఇప్పుడు నాకు తెలిసినవాళ్ళంతా అక్కడక్కడ కనిపించారు. శ్రీనధ్, నాయర్ ఒకచోట కూర్చుని వున్నారు. వాళ్ల మొహాల్లో భయం, అత్రుత. వాళ్ళని చూసి చిన్నగా నవ్వాను. మా ఆఫీసు వాళ్ళూ, పరంధామయ్య, మన్మధరావు అందరూ వున్నారు.
సుశీల కూడా కనిపించింది. ఆమె కళ్ళల్లో తడి.
జడ్జిగారు తీర్పు తయారు చేసేలోగా నన్ను ఒంటరిగా మరో గదిలో కూర్చోమన్నారు. కాస్సేపటికి లాయర్ రఘవీర్ గదిలోకి వచ్చాడు.

"మరేం ఫర్వలేదు. శిక్ష ఎక్కువ పడకపోవచ్చు. కావాలంటే నువ్వు అప్పీలు చేసుకోవచ్చు" అన్నాడు.
ఆ అవసరం లేదన్నాను. జడ్జి ఇచ్చిన తీర్పుకి నేను కట్టుబడి ఉంటానన్నాను. నాలో ఎలాంటి ఉద్వేగమూ లేకపోవడం లాయర్ కీ ఆశ్చర్యం కలిగించినట్లుంది.
"నిజంగా నీకు భయం వెయ్యడం లేదా?’ అడిగాడు.
"భయం వెయ్యాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు" అన్నాను.
అంతలో కోర్టుహాల్లో కలకలం వినిపించింది. జడ్జిగారు వచ్చినట్టున్నారు. బెల్ మ్రోగింది. నన్ను కోర్టుహల్లోకి తీసుకెళ్ళారు.
ఎవరో జడ్జిమెంట్ చదువుతున్నారు. ఏవేవో గతపు కేసుల హిస్టరీ వుంది. నాకు సరిగ్గా అర్థం కాలేదు. నా తల్లిపట్ల నా ప్రవర్తన గురించి కూడా చాలా సేపు చెప్పాను. కర్మలకని శలవు పెట్టి, వేశ్యతో వెళ్ళటం గురించి చర్చించి బాధపడ్డారు.

చివర్లో జడ్జిగారు నా వైపు తిరిగి అన్నారు - "ఓంకార్ అనే యువకుడిని పాతపగ కక్షలతో హత్య చేసినందుకు నిన్ను హంతకుడిగా నిర్ధారించి....మరణించేవరకూ ఉరి తీయవలసిందిగా అదేశిస్తున్నాను".
కోర్టు అంతా నిశ్శబ్దం. చాలా చిత్రంగా....పరంధామయ్యగారు కూడా కళ్ళు తుడుచుకున్నారు. ఒక పశ్చాత్తాప పర్వానికి మరో కథ ప్రారంభమయిందేమో - పదిమందికీ చెప్పుకోవచ్చు.
జడ్జిమెంటు ఆఖరి వాక్యం చెప్పగానే రఘవీర్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను అతడికి ఆసరా కావటమేమిటి? అప్పుడు నాకు నవ్వు వచ్చింది. సుతారంగా విడిపించుకున్నాను. పోలీసు వచ్చి ’పదండి’ అన్నాడు. ఎన్నడూ లేని మర్యాద. వెళ్ళి వ్యాన్ లో కూర్చున్నాను. వ్యాన్ కదిలింది.

* * *

నన్ను కొత్త సెల్ లోకి మార్చారు. ఇక్కడ నేను పూర్తిగా వంటరివాడిని. సెల్ బావుంది. ఆకాశం, నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయి. చివరిరోజుల్లో ఆ మాత్రం కన్సెషన్ ఇవ్వకపోతే బావుండదనుకున్నారేమో.
ఉరిశిక్ష ఎలా వుంటుందో ఎప్పుడూ చూడలేదు. నన్ను ఉరితీసేటప్పుడు చూడటానికి ఎవరయినా వస్తారా? రానివ్వరనుకుంటాను. రానిస్తే బావుండేది.
కొన్ని వేలమంది జనం సాడిస్టు ఉత్సాహంలో వచ్చి చూసి వుండేవారు. వాళ్ళకేం సంబంధం లేకపోయినా మొన్న కోర్టుకి రాలేదూ? అలాగే.

జనంలో వున్న ఈ ఉత్సాహాన్ని ప్రభుత్వం ఎందుకు గమనించదు? క్రికెట్ మ్యాచ్ లో ఆటస్థలం చుట్టూ పెట్టినట్టు. బూస్ట్, ఎమ్.ఆరెఫ్ టైర్ల ప్రకటనల బోర్టులు ఉరికంబం దగ్గరా పెట్టొచ్చు. ఈ తతంగాన్నంతా ప్రత్యక్ష ప్రసారంగా దూరదర్శన్ లో ప్రసారంచేసి మధ్య మధ్యలో అడ్వర్ టైజ్ మెంట్లు వెయ్యొచ్చు. చాలా డబ్బు వస్తుంది.జనం చూడరనీ భయమేమీలేదు. రోడ్డుమీద ఆక్సిడెంటు జరిగితేనే గుంపులు గుంపులుగా మూగుతారు కదా? ’మనిషి చావటం చూపిస్తాం’ అంటే యింకా వస్తారు. దారుణమైన హింస అనికూడా అనుకోనవసరంలేదు. ఇంతకన్నా దారుణంగా రక్తం వచ్చేటట్టు కొట్టుకునే బాక్సింగ్ ని టీ.వీ.లో చూపిస్తున్నారు కదా.

పేపరువాళ్ళని కూడా అనిమతిస్తే బావుంటుంది. ’మరణానికి మూడు క్షణాలముందు’ అని నా మొహాన్ని క్లోజప్ లో తీసికూడా పేజీల్లో వేస్తారు. అమ్మకాలు పెరుగుతాయంటే వాళ్ళు ’చావు’ ని ముందు క్యాష్ చేసుకుంటారు. పేపరువాళ్ళుకదా!
గమ్మత్తుగా....సిగరెట్ తాగే అలవాటు పడిపోయింది. ఒకసారి లాయర్ గారు సిగరెట్ ఆఫర్ చేస్తే వద్దనేశాను. అంత వెగటు పుట్టేసింది. ఇప్పుడా మాట చెప్తే మేజిస్ట్రేట్ గారు వరసగా డజను సిగరెట్లు కాల్చమని శిక్ష వేస్తాడేమో. అమ్మ శవం దగ్గర సిగరెట్ కాల్చడమేగా నేను చేసిన పెద్ద తప్పు.

సిగరెట్ మానాలనుకున్న వాళ్ళందరికీ నెలరోజులు జైలుశిక్ష వేస్తే చాలు. ఈ ఉపాయం ఎవరికీ తట్టలేదేమో. చెప్పాలి. చనిపోయేటప్పుడు చివరి సందేశం ఇవ్వవచ్చా? అడగాలి..
చావు గురింఛి ఎందుకింతగా ఆలోచిస్తున్నారు? వద్దు, వచ్చేది ఎలాగూ వస్తుంది దానికోసం సమయం వేస్ట్ చేయడం దేనికి? అయితే ఇంకేం ఆలోచించను? కోర్టు గుర్తువచ్చింది. కోర్టులో జనం గుర్తొచ్చారు.

అంతమంది నన్నసహ్యించుకున్నారంటే - చెప్పొద్దూ - ఒక్కోసారి బాధేసేది. ఎందుకు వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోయారు? ప్రాసిక్యూటర్ ఏమన్నాడు? నేను సంఘానికి చీడపురుగునట. నాలాంటి వాళ్ళవల్ల సంఘం కలుషితమై పోతుందట.

’నాకు శక్తివుంది. నలుగుర్ని కాదు ఆరుగురిని కంటాను’ అంటు జనాభాని విపరీతంగా పెంచే మనిషివల్ల ఈ సంఘానికి హాని కలగడంలేదా? ఒక్క చెట్టుని నరికితే నష్టం ఏమిటి అని దేశంలో ప్రతివారు ఒక్కో చెట్టుని నరికేస్తే అది దేశానికీ, వాతావరణానికీ హానికాదా?

చచ్చిన ఒక మనిషిని దహనం చెయ్యడానికి బ్రతికిన రెండు చెట్లను నరకడం ఎవరి దృష్టిలోనూ తప్పుకాదా? ఒక చెట్టు పెరగడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఆ విషయం ఎవరూ ఆలోచించరేం?

దేశంకంటే ఎక్కువగా వాతావరణం కలుషితమై పోతోందని నాలాంటి వాడు అలా దహనం చెయ్యడానికి నిరాకరిస్తే అది సంఘ విద్రోహం కిందకు వస్తుందా?
అందర్లా ఆలోచించని నాలాంటివారు ఈ సంఘంలో పనికిరాని వాడా?
అవును. ఈ సంఘానికి నేనే కాను. కాదు ఈ సంఘం నాకేమీకాదు.

నాకు తెలిసినంత వరకు ఈ మనఘల్లో నిజాయితీ లేదు. నమ్మిన నిజాన్ని నిర్భయంగా చెప్పుకోగలిగే అత్మస్థయిర్యం లేదు. ప్రతివాడు తన కోసం కాకుండా నలుగురూ ఏమనుకుంటారో అని బ్రతికేవాడే. అలాంటి సంఘంలో నేను నమ్మిన సిద్ధాంతం ఇది. ’దీన్ని నేను ఆచరిస్తాను. అందులో తప్పులేదు.’ అని నాలాంటి వాడు బహిరంగంగా చెప్పుకుంటే, అతడు ఛస్తే ఈ సంఘంలో బ్రతకడానికి వీల్లేదని చంపేస్తారు.

అందుకే ఈ సమాజం నాకొద్దు. దీన్నించి దూరంగా పొవడమే నాకు మేలు. అందుకే ఈ సంఘాన్ని నేను బహిష్కరిస్తున్నాను.

* * * *
"జైలర్ గారు నా కిమ్మన్నారు" పెద్ద పుస్తకం పట్టుకొచ్చాడు జవాను. తీసి చూస్తే భగవద్గీత.
"వద్దు." తిప్పి ఇచ్చేశాను.
"రామయణంగానీ, మహాభారతంగానీ తెచ్చి పెట్టనా?" అడిగాడు.
"అవసరం లేదు. వీలయితే అయన్ ర్యాండ్ వ్రాసిన ’అట్లాస్ ష్రగ్గ్ డ్’ నవల తెచ్చి పెట్టు. చదివి చాలాకాలం అయింది" అన్నాను.
"అదేం నవల?" అడిగాడు ఆశ్చర్యంగా.
"వ్యక్తిత్వాన్ని ఎలా బ్రతికించుకోవచ్చో చెప్పిన నవల. చనిపోయే ముందు అది మరోసారి చదివినా తృప్తిగా వుంటుంది". అన్నాను. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం మళ్ళీ వచ్చాడు. "నిన్ను చూడ్డానికి స్వామీజీ వచ్చారు. తీసుకురానా?" అన్నాడు.
"ఏ స్వామీజీ?" అడిగాను.

"పేరు తెలియదు. ఎప్పుడూ వస్తుంటారు. ఖైదీలకు మంచి మాటలు చెప్తుంటారు. అందరూ ఆయన్ని స్వామీజీ అంటారు. ఇవ్వాళ నిన్ను చూసి మాట్లాడ్డానికి జైలర్ గారు స్పెషల్ గా పిలిపించారు".
"అవసరం లేదని చెప్పు. నాకెవరితోటి మాట్లాడాలని లేదు". జవాను వెళ్ళిపోయాడు.

‘జైలుకి కూడా స్వామీజీలు, బాబాలు వస్తుంటారా! ఏం చేప్తారు?’ నువ్వు పాపం చేశావు నరకానికి వెళతావు. నా మాట విని నాలుగు రోజులు దైవ ప్రార్థనలు చేయిస్తే సరిపోయేది కదా! నేను ప్రార్థన సరిగ్గా చేస్తున్నానో లేదో చూడటం కోసం నలుగురు పోలీసుల్ని కాపలా పెట్టుకోవచ్చుగా కావాలంటే.

స్వర్గాన్ని చేరటానికి అంత సులభ మార్గం వుంది కాబట్టి బ్రతికినన్ని రోజులు అన్ని రకాల పాపాలు చేసి సుఖాలు అనుభవిస్తున్నారు. ఎంత అన్యాయంగా డబ్బు అర్జించినా అయిదు రూపాయలు పెట్టి దేముడికో కొబ్బరికాయ కొడితే ఆయన పొంగిపోయి తప్పులన్నీ మాఫీ చేస్తాడు అన్న ధీమా.
ఎవరో వస్తున్న అలికిడికి తలతిప్పి చూశాను. కాషాయవస్త్రాలు, మెడలో రుద్రాక్షలు, స్వామీజీ కాబోలు. నేను కలవననడంతో చెప్పకుండా వచ్చేసాడు. నేను కూర్చున్న చోటునించి కదలలేదు.

"ఎందుకు బాబూ నన్ను చూడడానికి ఇష్టపడటంలేదట" అన్నాడు. కంఠంలో కృత్రిమంగా అలవాటయిపోయిన మార్దవత్వం ఉట్టిపడుతోంది. తనొక ఉన్నతస్థాయిలో వున్న పవిత్ర పురుఘడిగాను, నేను బురదలో కొట్టుకుంటున్న కీటకంలాగాను వుంటే, నన్ను రక్షించి ప్రక్షాళితం చేయటానికి వచ్చిన పుణ్యమూర్తి అనుకుంటున్నాడు. నన్ను ప్రేమగా పలకరించడం అతడిలో దైవత్వానికి ఉదాహరణంగా భావిస్తున్నాడని అర్థమయింది.

"నువ్వు చాల అజ్ఞానంలో వున్నావు. చనిపోయిన నీ తల్లి అత్మ కూడా క్షోభిస్తుంది. ఇప్పటికయినా నీ తల్లి శ్రాద్ధ కర్మలు సక్రమంగా నిర్వహించి ఆవిడను కాపాడు. అది నీకూ మంచిది" అన్నాడు.
"అలాగే. నాకు కావలసిన పదార్థాలు తెచ్చి పెడతారా?" అడిగాను కామ్ గా.
"తప్పకుండా నాయనా, అన్నీ తీసుకొచ్చి దగ్గరుండి జరిపిస్తాను, ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను. నిన్ను, నీ కుటుంబాన్ని నరకం నించి రక్షించడమే నా లక్ష్యం."

"అయితే అయిదుగురు బ్రాహ్మణులతో ఖడ్గమృగ మాంసం, పొట్టేలు మాంసం, ముళ్ళచేపలు, తేనె, బియ్యం పట్టుకొచ్చి వంట చెయ్యండి" అన్నాను.
"ఛీ, అవన్నీ ఎందుకు?"

"ఖడ్గ మృగ మాంసంతో శ్రాద్ధ భోజనం పెడితే పితరులు తుది లేనంత కాలం తృప్తిపడతారని మనువు చెప్పాడుగా".
"ఈ రోజుల్లో బ్రాహ్మలు మాంసాహరం తినరని నీకు తెలుసుగా".
"అప్పటి రూల్సు ప్రకారం తినమందాం".
"తప్పు నాయనా. అప్పటి రోజులు మారాయి. ఇప్పటి పద్ధతి ప్రకారం నేను జరిపిస్తాను."

"అదే నేననేది. పద్ధతులు మారుతున్నాయి. రేపు నా పద్దతి అమల్లోకి రావచ్చు. పితరులకి శ్రాద్ధం పెట్టడం తెలివిలేని పని అనిపించవచ్చు. నేను కాలం కంటే కొంచెం ముందు మారాను. అది అర్థం చేసుకొండి చాలు".

దాదాపు అరగంట సేపు నిన్ను విసిగించి ఓడిపోయి, మొహం వేలాడేసుకుని నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయాడాయన.
ఆలోచించి చూస్తే అతి మామూలు మనిషి కూడా సహజ పతనానికి కారణం అవుతూనే వున్నాడు. అందరూ నైతిక విలువల గురించి మాట్లాడేవారే కాని ఒక్క చెడుని ధైర్యంగా విమర్శించేవాళ్ళు లేరు.

వీళ్ళ గురించి ఎందుకు నేనిలా ఆలోచించాలి? వద్దు. పడుకుని కళ్ళు మూసుకున్నాను. ‘శూన్యంలోనయినా చూస్తూ భగవంతుడిని దర్శించుకోవచ్చు నాయనా?’ అన్నాడు స్వామీజీ. శూన్యంలో నాకు ప్రణవి కనిపిస్తోంది.

ప్రణవి ఏం చేస్తుంటుంది? నా కోసం దైవ ప్రార్థన చేస్తుంటుందా? లేక ఏ విటుడితోనైనా గడుపుతూ వుంటుందా?

* * * *

జైలర్ వచ్చి వెప్పి వెళ్ళాడు, అప్పీలు చేసుకోవాలంటే ఈ రోజే చివరి రోజట. మరోసారి ఆలోచించమన్నాడు. అవసరం అయితే లాయర్ రఘవీర్ ఫోన్ చెయ్యమన్నాడట.
అలాంటి అవసరం ఏమీ లేదని చెప్పేశాను.
"మీ ఆరోగ్యం సరిగా లేనట్లుంది. డాక్టర్నీ పంపనా?" అన్నాడు. "నేను ఆరోగ్యంగానే వున్నాను. డాక్టర్ అవసరంలేదు" అన్నాను. అతడు నా వైపు జాలిగా చూస్తూ వెళ్ళిపోయాడు.
వెంటిలేటర్ వుండడంతో పగలూ, రాత్రీ బాగా తెలుస్తున్నాయి. కాని ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు గడిపానో లెక్కమాత్రం జ్ఞప్తికి రావడం లేదు. రోజులు ఎన్ని గడిస్తేనేం? ఎదురు చూస్తున్నది ఆ ఒక్కరోజు కోసం. అది మాత్రం తెలియడం లేదు..

సాధారణంగా ఉరి తెల్లవారుజామునే తీస్తారట. అంటే అర్థరాత్రి తాలూకు ఏ సమయంలోనైనా వాళ్ళు రావచ్చు. చెయ్యాల్సిన కార్యక్రమం చాలా వుంటుందిగా మరి. ఆ జరిగేదేదో త్వరగా అయిపోతే బావుండును. ఎందుకంటే ఆలోచించడానికి వస్తువే దొరకడం లేదు.
నేనాలా పడుకునే వున్నాను. గత వారం రోజులుగా నేనెక్కువగా లేవడం లేదు. మరణం దగ్గర కొస్తుందన్న భయంవల్ల అలా ఉంటున్నానని వాళ్ళనుకోవడంలో తప్పులేదు. పొత్తి కడుపులో నొప్పి గురించి గాని, నేను పడుతున్న బాధ గురించి గాని నేనెవరికీ చెప్పలేదు. చెప్పదలచుకోలేదు కూడా...

వాళ్ళు నాకు ఉరిశిక్ష అమల్లో పెట్టే లోపలే నేను చచ్చిపోవాలి. సంవత్సరం పైగా వాళ్ళు తీసుకున్న శ్రమ, ఖర్చుపెట్టిన డబ్బు అన్నీ వృధా అవ్వాలి. అది నా విజయం అవుతుంది. వాళ్ళని నేను ఫూల్ చేశానన్న విషయం నా మరణం తర్వాత గాని వాళ్ళకు తెలియకూడదు.
పగలు ఎక్కువగా నిద్రపోవడం మొదలుపెట్టాను. అర్థరాత్రి మేల్కోవడం అలవాటు చేసుకున్నాను. అప్పటి నుంచి వాళ్ళు వస్తారేమోనని ఎదురు చూడడం. ఆకాశం ముదురు నీలం నించి లేత ఎరుపులోకి దిగేవరకు అదే ఎదురుచూపు. వాళ్ళ అడుగులు వినిపిస్తాయేమోనని చెవులు రిక్కించి వింటాను. వాళ్ళు రాలేదంటే మరో ఇరవై నాలుగు గంటలు బ్రతికే వుంటానన్నమాట.

అలవాటు ప్రకారం అర్థరాత్రి మెలకువ వచ్చింది. వెంటిలేటర్ లో నించి నీలాకాశం, మెరుస్తున్న నక్షత్రాలు కనిపిస్తున్నాయి. నిన్న ఎడం వైపుకి కనిపించిన నక్షత్రం ఈ రోజు మధ్యకి వచ్చింది. రేపటికది కుడివైపుగా వచ్చి మర్నాటికి కనిపించకుండా పోతుంది. ఆ దారిన మరో నక్షత్రం నడిచి వస్తుంది. ఆ రెండో నక్షత్రాన్ని చూసేంతవరకు నేనుంటానా?
అంతలో వరండాలో అడుగుల చప్పుడు. ఒకరు కాదు. యిద్దరు కాదు, కనీసం నలుగురైనా వస్తుండాలి. అంటే నేను ఇంతకాలం సహజ మరణం కోసం చూసిన రోజు రాకముందే వాళ్ళు నా కోసం వచ్చేస్తున్నారు. విజయం నాది కాదు, వాళ్ళది కాబోతుంది. దిగులుగా అనిపించింది. కళ్ళు మూసుకున్నాను. అప్పుడు అనిపించింది. వెన్ను మధ్యలో శూలంతో గుచ్చినట్టు! గుచ్చి గిరగిరా తిప్పినట్టు! దిక్కులు అదిరిపోయేలా కేక పెట్టాను!!!

వాళ్ళు లోపలకు వచ్చారు. నన్ను లేపబోయారు. నడుం దగ్గర నొప్పితో మళ్ళీ నాకు తెలియకుండానే కేకపెట్టాను. వాళ్ళు కంగారుపడ్డారు. నాకు స్పృహ తప్పుతోంది. డాక్టర్ నన్ను పరీక్ష చేస్తున్నాడు. నొప్పితో నేను విలవిలలాడిపోతున్నాను. వాళ్ళు మెల్లిగా ఎత్తడం తెలిసింది. తర్వత ఏం జరిగిందో తెలియలేదు.

 

* * *

మెలకువ వచ్చింది. గదిలో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరవబోతే బరువుగా మూసుకుపోయాయి. ఆ అరక్షణంలో నా చేతికి గుచ్చబడిన సెలైన్ సూదిని గుర్తుపట్టాను.
నేనెక్కడున్నాను? జైలు కాదు. నడుం దగ్గర నొప్పిగా వుంది. చేత్తో అదుముకున్నాను. బ్యాండేజి తగిలింది. అంటే నేను హాస్పిటల్లో వున్నానా? ఎలా వచ్చానిక్కడికి జైల్లో నన్ను ఉరికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నా పరిస్థితి తెలిసిపోయి తెచ్చి హాస్పిటల్లో పడేశారు అనుకుంటాను.

"డాక్టర్! కదులుతున్నాడు" ఎవరిదో స్త్రీ కంఠం.
"ఇంజక్షన్ ఇవ్వు సిస్టర్" పురుష కంఠం. డాక్టర్, నర్స్ అన్న మాట. జబ్బమీద సూది గుచ్చిన నెప్పి, మళ్ళీ నిద్రలోకి జారిపోయాను.
మళ్ళీ మెలకువ వచ్చేసరికి తలభారం తగ్గినట్లనిపించింది. గదంతా కలయచూశాను. హాస్పిటల్ గది. నా చేతికింకా సెలైన్ ఎక్కుతోంది. మరో ప్రక్క కుర్చీలో శ్రీనాధ్ నిద్రపోతున్నాడు.
శ్రీనాధ్ ని ఎలా రానిచ్చారు? అంతా అయోమయంగా అనిపిస్తోంది. నడుం దగ్గర భారంగా వుంది. తడిమి చూస్తే చాల పెద్ద బ్యాండేజి. నాకు ఆపరేషన్ అయిందా?
నేను కదలడం గమనించినట్లున్నాడు. శ్రీనాధ్ కళ్ళు తెరిచాడు.
“ఎలా వుంది”? అన్నాడు
“నాకేమయింది శ్రీనాధ్”?
“ఆపరేషన్...కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది”.
“నాకు కిడ్నీ ప్రాబ్లం అని వాళ్ళకెలా తెలిసింది?”

“నువ్వు చాలా సిక్ అయిపోయావు. తీసుకొచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. మాకు కబురు వచ్చింది. వచ్చాం. వెంటనే ఆపరేషన్ చేసేశారు.” నా అనుమానాలన్నీ తీర్చేశాడు.
“అనారోగ్యంతో ఉన్న మనిషిని ఉరితీయరు కాబోలు. ఆరోగ్యం కుదుటపడేలా వైద్యం చేయించి, బాగుపడ్డ తర్వాత ఉరితీస్తారన్నమాట. భలే బావుంది. అన్నాను.
ఆ మాటలకు శ్రీనాధ్ నావైపు ఎగ్జయింటింగ్ గా చూసాడు. దగ్గిరగా వస్తూ - “నీ శిక్ష రద్దయిపోయింది తెలుసా నీకు”! అన్నాడు. అతని స్వరంలో సంతోషం.

“శిక్ష రద్దయిందా? ఎలా?” ఆశ్చర్యంగా అడిగాను.
“నీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదుగా. అందువల్ల, నువ్వింకేం ఆలోచించకు. పడుకో” అన్నాడు శ్రీనాధ్.
రెండు రోజుల తరువాత కొద్దిగా మామూలు మనిషినయ్యాను. అప్పుడు చెప్పాడు శ్రీనాధ్ నెమ్మదయిన స్వరంతో...నేను పెద్దగా షాక్ తినకుండా......
“ప్రణవి చచ్చిపోయింది”.

ఆ సమయానికి నేను పక్కకి వత్తిగిల్లటానికి ప్రయత్నిస్తున్నాను. అతని మాటలకి అలాగే ఆగిపోయాను. నాలో కదలికలేదు. ఎగ్జయింట్ మెంట్, షాక్, దు:ఖం....ఏమీలేవు. అన్నిటికన్నా అతీతమైన నిశ్శబ్దం. పెద్ద శబ్దంతో ఒక కెరటం వచ్చి ఒడ్డును కొట్టి వెళ్ళిపోయినప్పటి నిశ్శబ్దం.
ప్ర....ణ.......వి......చ.....ని.....పో.......యిం.......దా?

“అవును. అత్మహత్య చేసుకుని చనిపోయింది”.
ఇదీ షాక్. నన్ను కదిల్చివేసే షాక్.
“అంత అత్మహత్య చేసుకోవలసిన అవసరం ఎందుకొచ్చింది?” అయోమయంగా అడిగాను.

“నిన్ను రక్షించటం కోసం....
“నువ్వు చెప్పేది నాకేమీ అర్థంకావడం లేదు శ్రీనాధ్”.
“ఆమె విషం తీసుకుని, ఇంక తాను బ్రతకదని డాక్టర్లు నిర్ణయించాక అప్పుడు మేజిస్ర్టేట్ ని పిలిచి స్టేట్ మెంట్ యిచ్చింది.
ఏదో అనుమానం.....చిన్న అనుమానం....లోలోపలే పెద్దదవు తూంటే....మోచేతి మీద లేవటానికి ప్రయత్నిస్తూ అడిగాను. “ఏమని స్టేట్ మెంట్ యిచ్చింది?”
“ ఆ హత్య నువ్వు చేయలేదనీ....తనే చేసానని.....”

“ అ.....బ.....ద్ధం” అ అస్పత్రి గోడలు బీటలు వారేలా అరిచానా! లేదు. నా ఎదుటి మనిషికి కూడా ఆ విషయం తెలుసు. నేను బిత్తరపోయి చూస్తుండిపోయాను. శ్రీనాధ్ అర్థం చేసుకుంటున్నట్టు తలూపాడు”....కోర్టులు వాదోపవాదాలూ ఇవేమీ లేవు. కేవలం ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేయటానికి మాత్రమే సమయం వుండింది. తెలివితేటలతో అలా ప్లాన్ చేసింది. చనిపోయిన ఓంకార్ ని తన మావయ్య పంపించాడట. ఎలాగయినా తనని వ్యభిచార వృత్తిలోకి దింపటంకోసం ఓంకార్ తనని ఫాలో అయ్యాడట. అంతవరకూ కరెక్టే. ఎందుకంటే ప్రణవి మరణించిన తరువాత పోలీసులు ఆమె మావయ్యని అరెస్టుచేసి కేసు పెట్టారు. నాలుగు కొడితే ఒప్పుకున్నాడు....తనే ఓంకార్ ని పంపానని. మల్లిక కూడా అదే రౌడీని ఏర్పాటు చేయటంతో మనం కన్ ఫ్యూజ్ అయ్యాం....”

నేను వినటం లేదు. ప్రణవి గురించే ఆలోచిస్తున్నాను. మేజిస్ట్రేట్ ఇదంతా నిజం అని ఎలా నమ్మాడు?

“నమ్మించింది” అన్నాడు శ్రీనాధ్. “వాడు అంతకు ముందే చిత్తూరులో ఆమెని రేప్ చేసినవాడట. అదీ అబద్దమే చెప్పింది. రేప్ విషయం నీకు తెలియబరుస్తానని తరచూ బెదిరించేవాడట. తను నిన్ను పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో వుంది. ఆ సంగతి తెలిస్తే నువ్వు ఒప్పుకోవేమోనని భయపడిందట. ఈ లోపల నువ్వు రావటం, కొట్టటం జరిగింది. నీకు స్పృహ వస్తుండగా వాడు మాళ్ళీ లేచాడనీ, నిన్నేమైనా చేస్తాడన్న భయంతో తనే అతడి తల రాతికేసి కొట్టి చంపేసానని చెప్పింది! హత్య జరగ్గానే ఆ నేరం నువ్వు నీ మీద వేసుకుంటున్నావుట. మూత్రపిండాల వ్యాధి కాబట్టి ఎలాగూ ఎక్కువకాలం బ్రతకవనీ, అందుకని నేరం నీ మీద వేసుకున్నా తప్పులేదనీ ఒప్పించావుట. నువ్వు ఉరిశిక్ష అనుభవించటం భరించలేక అత్మహత్య చేసుకుంటున్నాననీ చెప్పింది. కానీ అసలు జరిగిందేమిటో మన ఇద్దరికే తెలుసు” శ్రీనాధ్ చెప్పటం ముగించాడు.

బాధగా కళ్ళు మూసుకున్నాను. ఆ రోజు ప్రణవి వెళ్ళిపోతుంటే ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపుకి ఇదీ కారణం!
“అన్నట్లు నీకో ఉత్తరం వ్రాసిపెట్టింది. ఆపరేషన్ సక్సెస్ అయి నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతుడివి కాగానే ఇమ్మంది” అంటూ సీలు చేసిన కవర్ అందించాడు శ్రీనాధ్. చాలాసేపు దాన్ని విప్పలేకపోయాను. విప్పకుండా ఉండనూ లేక పోయాను. కవరులో చిన్న వుత్తరం వుంది.


నా నీకు
నీకు గుర్తుందా?
మొదటిసారి నేను అమాయకంగా నీకు ఉత్తరం వ్రాసినప్పుడు, ఇంత స్టుపిడ్ ఉత్తరం నేనెప్పుడూ చూడలేదని పరిహసించావు. నాకు ఆ రోజు వివరించి చెప్పగలిగే జ్ఞానం లేకపోయి వుండొచ్చు. కానీ నాలో అజ్ఞానం లేదు. నా ప్రేమ ఆ రోజుకీ ఇప్పటికీ....అదే ప్రేమ. నీకు మనుఘల మీద నమ్మకం లేదు. నాకేమో అపారమైన నమ్మకం. మనిద్దరం ఒకే పరిస్థితుల్లోంచి వచ్చినా, మానవ సంబంధాల పట్ల ఆశావాదంతో నేనూ, నిరాశావాదంతో నీవూ బ్రతికాము. కానీ నేనే గెల్చాను. ఎందుకంటే, “ ప్రేమించటం” లోని అపారమైన ఆనందాన్ని పొందుతూ వచ్చాను కాబట్టి. అందుకే నువ్వు నీ అభిప్రాయాలు కర్కశంగా, కఠినంగా, నిర్మొహమాటంగా చెపుతూ ఉంటే, నేను నా అభిప్రాయాలు మనసులోనే మౌనంగా వింటూ వుండేదాన్ని! నీలో వున్న ఇంకో గుణం ఏవిటంటే, నీ అభిప్రాయాల్చి నువ్వు చాలా దృఢంగా నమ్ముతావు. వాటి చుట్టూ ఒక పటిష్టమైన గోడ నిర్మించుకుంటావు. నీ వాదన పటిమతో వాటికి బలం సమకూర్చుకుంటావు. అవతలి వారి బలహీనత నీకు స్వార్థంగా కనిపిస్తుంది. ప్రేమ కూడా స్వార్థం అన్న నమ్మకం నీది!

నీకు నా పట్ల గాఢమైన ప్రేమలేదని నాకు తెలుసు. ఆ మాటకొస్తే ఎవరి పట్లా నీకే అనుబంధం లేదు.. అలా అని కరుణలేదని కాదు. పార్కులో కాల్తున్న ఎండలో పనిపిల్లని చూసినా నువ్వు కరిగిపోతావు. కానీ ఆ పాపపట్ల కరుణని ప్రదర్శించటానికి బదులు, ఆ పరిస్థితులు కల్పించిన చుట్టూ వున్న వ్యక్తులపట్ల ద్వేషం పెంచుకుంటావు. అందువల్ల నీ మనసులో ప్రేమా, కరుణా స్రవించటానికి బదులు, ఎప్పుడూ ఆ దారుణమైన పరిస్థితులపట్ల కసే ప్రస్ఫుటమవుతుంది. అవునా? ఆలోచించు. ఎప్పుడూ ఎదుటి మనిషి మనసులోని, ప్రవర్తనలోని చీకటి కోణాల్నే చూడటం సాగిస్తే నీకు మిగిలేదేమిటి? చిరాకు, కోపం, అసహ్యం.....ఇవేగా.

ప్రతీ మనిషిలోనూ మంచీ, చెడూ ఉంటాయి. మంచిని చూడటానికి ప్రయత్నించు. సాటి మనిషితో సత్సంబంధాలు పెంచుకోవటానికి స్నేహ హస్తం సాచు. ఈ ప్రపంచంలో ఎవరూ నూరు శాతం మంచి వారు కాదు. ఎవరి బలహీనతలు వారివి. ఆ బలహీనతల్నే నువ్వు చూడటం కొనసాగిస్తే చివరికి లేని బలహీనత అవుతుంది. ఇక ఎప్పటికి నీ మొహం మీద ఆహ్లాదకరమైన చిరునవ్వు రాదు.
ఈ క్షణం నుంచీ నువ్వు ప్రేమించాలి!
నీ జీవితం నాది. ఈ హక్కు నాకు నిన్ను ఉరికంబం నుంచి రక్షించటం వల్ల వచ్చింది కాదు.. నిన్ను నిస్వార్థంగా ప్రేమించటం వలన వచ్చింది.
నువ్వు ప్రేమించటం నేర్చుకోవాలి.
సాటి మనిషి మీద నమ్మకం ఏర్పరచుకోవాలి.
అంటే!........
నువ్వు వివాహం చేసుకోవాలి. సంసారం కొనసాగించి, నీ నిర్లిప్తత నుంచి బయటపడాలి. నా శేష జీవితాన్ని నీకిస్తూ, నేను కోరుకున్న ఆఖరి కోరిక మిత్రమా ఇది.
నీ
ప్రణవి.


ఉత్తరం చదవటం పూర్తిచేసి అలాగే వుండిపోయాను...ఆఖరి వాక్యాలు క్లుప్తంగా వున్నా వాటి అర్థం అనల్పమని నాకు తెలుసు. ఆమె నన్ను వివాహం చేసుకోమన్నది శారీరక సుఖం కోసం కాదు, మానసిక సంగమం కోసం. నిజంగా దాని అవసరం నాకున్నట్లుంది.
ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుకుంటే నా ఆలోచనల్లో కేవలం మొండితనం మాత్రమే కనబడింది. నాణేనికి రెండోవైపు నేను చూడలేదు.
ఆమె అన్నట్లు ఈ జీవితం ఆమెది!
ఆమె కోరిక తీర్చటం నా విధి.
ఈ క్షణం నుంచీ నేను మామూలు మనిషిగా బ్రతుకుతాను. విశ్లేషణ కన్నా రసాస్వాదన ముఖ్యం చేసుకుని జీవిస్తాను.
నాకళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది నాలో మొదటి మార్పు.
ప్రణవి విజయం సాధించింది.
నాకు జ్ఞాపకం ఒక వచ్చాక వ్యక్తి కోసం మొదటిసారిగా ఏడ్చాను.

 

(- సశేషం)

     
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)