కబుర్లు

సత్యమేవ జయతే! అమెరికాలమ్ – 31

- రచన : సత్యం మందపాటి   


 

 

చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?

 
 

అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు కొడుకులూ ఒక రోజు వేటకి వెళ్లారు. ఏడుగురు కొడుకులూ వేటాడి ఏడు చేపలని పట్టుకున్నారు. ఆ ఏడు చేపల్నీ ఎండబెట్టారు. ఆరు చేపలు ఎండాయిగానీ, ఏడో కొడుకు ఎండబెట్టిన చేప ఎండలేదు.
చేపా! చేపా! ఎందుకు ఎండలేదు? అని చేపని అడిగాడు ఏడో కొడుకు.

* * *

ఇక్కడ గురువుగారు ముళ్ళపూడి వెంకటరమణగారి జోకు ఒకటి చెప్పుకుందాం. చేపా! చేపా! ఎందుకు ఎండలేదు? అని చేపని అడిగాడు ఏడో కొడుకు.“ఎండ లేదు! అందుకని ఎండలేదు అన్నది ఎండని ఏడో చేప.

* * *

మళ్ళీ కథలోకి వెడదాం.
`చేపా! చేపా! ఎందుకు ఎండలేదు?' అని చేపని అడిగాడు ఏడో కొడుకు. నాకు గడ్డి దుబ్బు అడ్డం వచ్చింది” అంది చేప. `దుబ్బూ! దుబ్బూ! ఎందుకడ్డం వచ్చావ్?' అడిగాడు ఏడో కొడుకు. `నన్ను ఆవు మేయలేదు' అంది  దుబ్బు. `ఆవూ! ఆవూ! ఎందుకు మేయలేదు?' అడిగాడు ఏడో కొడుకు.
ఇలా నడుస్తుంది కథ. చివరగా పిల్లవాడిని కుట్టిన చీమల పుట్టలోని చీమ దగ్గర ఆగుతుంది కథ.


                            * * *

ఈ కథ నా చిన్నప్పుడూ, మీ చిన్నప్పుడూ చదవటానికి సరదాగా వుండేది. కానీ కొంచెం పెద్దయాక, మన ఆలోచనా పరిధి పెరిగాక, ఈనాటి తెలుగు సినిమాల్లో లాగా అసందర్భంగా వుంటుంది.
ఉదాహరణకి ఆ రోజుల్లో రాజులు వేటకి వెళ్ళింది పులులు, జింకలు మొదలైన జంతువుల్ని వేటాడటానికి.  చేపలు పట్టటానికి కాదు. అది చాలావరకూ జాలరి వాళ్ళకే పరిమితం. అదీకాక చేపలు పట్టటాన్ని వేట అనరు.

పోనీ యువరాజులు చేపలు పట్టిరిబో, వాటిని ఎండబెట్టనేల? ఎండబెట్ట వలసిన భటులకు ఏమాయె?
పోనీ ఎండబెట్టిరిబో, ఆరు చేపలకు తగిలిన ఎండే, ఏడో చేపకీ తగిలెనుగదా, మరదేల ఎండలేదు?
మహారాజుగారు చేపని, తమ మహారాజ హోదాలో ఎండమని ఆదేశించ వచ్చునుగదా! అదేల చేయలేదు? పోనీ ఎండలేదుబో, ఎండకుండా బ్రతికి బయటపడ్డ చేపని, ఎందుకు ఎండలేదు అని అడగటం, నువ్వెందుకు చావలేదు అని అడగటం లాటిది కదా! అదృష్టవశాత్తూ చనిపోకుండా బ్రతికి బట్టకట్టిన వాడిని, నువ్వెందుకు చావలేదు అని అడగటం భావ్యం కాదు కదా!
ఇవన్నీ గట్టున పెట్టేసి, అసలు ఈ కథలో నీతి ఏమిటి అని వెతికితే, నిజంగా గొప్ప విషయమే కనిపిస్తుంది.

క్వాలిటీ ఇంజనీరింగులో ఒక సిద్ధాంతం వుంది. ఏదన్నా వస్తువుని తయారు చేస్తున్నప్పుడు ఏదయినా తప్పు (Product Defect) జరిగితేనో, లేదా ఒక సంవిధాన ప్రక్రియలో లోపం (Process Violation or Gap) వుంటేనో, అసలు అది అలా జరగటానికి మూలకారణం ఏమిటా అని (Root Cause Analysis) పరిశీలిస్తారు. `కారణం' మీద కాకుండా, ‘మూల కారణం’ కనుక్కుని, దాన్ని సరిదిద్దితే సమస్య పరిష్కారమవుతుంది. అందుకని నాలుగైదు సార్లు ఎందుకు, ఎందుకు అని ప్రశ్నలడుగుతూ వుంటే (Why-Why Analysis), మూలకారణం దొరుకుతుంది. ఇది ఎంతో శాస్త్రీయంగా చేసే సిద్దాంత ప్రక్రియ. ఆరోజుల్లోనే ఈ కథలో ఈ రోజుల్లోని సిద్ధాంతం వాడబడింది! ఎందుకు ఎండలేదు? ఎందుకు అడ్డం వచ్చావ్? మొదలైన ప్రశ్నల వల్లే మూలకారణం బయటికి వస్తుంది.

సరేనయ్యా! బాగుంది. అయితే ఏమిటి నీ బాధ? ఎందుకు ఈ సొద అని కొంతమంది చదువరులకు అనిపించవచ్చు. అందుకే చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకని, అసలు విషయానికి వద్దాం.


* * *

సాహిత్యం అనగానే చాలమందికి అదేదో కొంతమందికే పరిమితమనీ, మనకి కాదులే అనీ ఒక దురభిప్రాయం వుంది. ముఖ్యంగా మన దేశంలో, మన ఆంధ్ర ప్రదేశంలో, ఈ రోజుల్లో. కానీ సాహిత్యం లేకుండా మన జీవితం లేదు. ప్రతి రోజూ, ప్రతి చోటా మనతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సాహిత్యం వుంటూనే వుంది. అమ్మ పాడే జోల పాటల్లో సాహిత్యం వుంది. అమ్మమ్మ పాడే దేవుడి పాటల్లో సాహిత్యం వుంది. సంగీతంలో సాహిత్యం వుంది. మనం మాట్లాడే భాషలో సాహిత్యం వుంది. చిన్న పిల్లలకు తల్లులూ, తండ్రులూ చెప్పే కథల్లో సాహిత్యం వుంది. అదే కథా రూపంలో, నవలా రూపంలో, నాటిక రూపంలో ఎన్నో విధాల వుంది. ఏనాటినించో గ్రామాల్లోనూ పట్టణాలలోనూ వేసే వీధి నాటకాల్లో, యక్షగానాల్లో, హరికథల్లో, బుర్రకథల్లో సాహిత్యం వుంది. సినిమాల్లో వుంది, బుల్లి తెర టీవీల్లో వుంది.

ఈ వ్యాసంలో నేను వ్రాయదలచుకున్నది, మన తెలుగు సినిమా కథల్లో సాహిత్యం గురించి.
తెలుగులో సినిమాలు మొదలైనప్పటి నించీ, తెలుగు సాహిత్యంలో పేరు పొందిన కథలు, నవలలు ఆధారం చేసుకుని ఎన్నో చక్కటి సినిమాలు వచ్చాయి.

1940 - 1950లలోనే మాలపిల్ల, బారిష్టర్ పార్వతీశం, కన్యాశుల్కం వంటివి సినిమాలుగా వచ్చి ప్రజల ప్రశంసలు అందుకున్నాయి. 1960లలో బాగా పుంజుకుని, 1970-80లలో ఎన్నో నవలలు, మంచి కథలు తెలుగు సినిమాలకు మూలమయాయి. తెలుగు నవలా సాహిత్యమే కాకుండా, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు మొదలైన భాషల్లో పేరు తెచ్చుకున్న నవలలు కూడా తెలుగులో సినిమాలుగా వచ్చాయి.
ఆనాడు సినిమాలుగా వచ్చిన తెలుగు నవలా రచయితలలో చెప్పుకోదగ్గవారిలో రచయితలతో పాటు ఎందరో రచయిత్రులు కూడా వున్నారు. కోడూరి కౌసల్యాదేవి _ చక్రభ్రమణం (డాక్టర్ చక్రవర్తి), ప్రేమనగర్, శంకుతీర్థం, చక్రవాకం; యద్దనపూడి సులోచనారాణి – జీవనతరంగాలు, సెక్రటరీ, మీనా, జై జవాన్, ప్రేమ సింహాసనం, నీరాజనం, విజేత, గిరిజాకళ్యాణం, ఆత్మీయులు, అగ్నిపూలు; రంగనాయకమ్మ – బలిపీఠం, కృష్ణవేణి, ఇదెక్కడి న్యాయం (గోరింటాకు), రాధమ్మ పెళ్లి; శ్రీదేవి – కాలాతీత వ్యక్తులు (చదువుకున్న అమ్మాయిలు); వాసిరెడ్డి సీతాదేవి – సమత (ప్రజానాయకుడు), ఆమె కథ; తమిరిశ జానకి – విశాలి, మాదిరెడ్డి సులోచన– కలవారి సంసారం, ప్రేమలు పెళ్ళిళ్ళు; కావలిపాటి విజయలక్ష్మి – విధి విన్యాసాలు (తాసిల్దారుగారి అమ్మాయి); ఆనందారామం – జ్యోతి, త్రిశూలం.. ఇలా

ఎన్నో రచయిత్రుల నవలలు సినిమాలుగా వచ్చాయి. 
రచయితలు కూడా తక్కువ తినలేదు. విశ్వనాథ సత్యనారాయణ – ఏకవీర, ఆకాశరాజు; దాశరధి రంగాచార్య (చిల్లరదేవుళ్ళు), కాళీపట్నం రామారావు – యజ్ఞం; కొమ్మూరి వేణుగోపాలరావ్ – ప్రేమ నక్షత్రం, హారతి; ఆదివిష్ణు – సత్యంగారిల్లు (అహ నా పెళ్ళంట); కొవ్వలి నరసింహారావు – సిపాయి కూతురు; మునిపల్లె రాజు – పూజాఫలం; పోలాప్రగడ సత్యనారాయణమూర్తి – కౌసల్య (తల్లిదండ్రులు); కొండముది శ్రీరామచంద్రమూర్తి – చిరుమువ్వల మరుసవ్వడి (ఆనందభైరవి); జీడిగుంట రామచంద్రమూర్తి – అమెరికా అబ్బాయి; ఉన్నవ హరగోపాల్ – నవ్వినా కన్నీళ్ళే (సీతారామయ్యగారి మనుమరాలు)... ఇలా ఎన్నో వున్నాయి. ఇంకో ఇద్దరు రచయితలు – యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి _ వ్రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చాయి. సినిమా రూపం దాల్చిన వీరి నవలలు, చాలామందికి సుపరిచయమే కనుక వాటి పేర్లు ఇవ్వటం లేదు.

అంతేకాదు.. మంచి సాహిత్యం ఏ భాషలో వున్నా తెలుగు సినిమారంగం వదిలిపెట్టలేదు. బెంగాలీ నవలలు _ శరత్ – దేవదాసు, బడదీది (బాటసారి), నిష్కృతి (తోడికోడళ్ళు), వాగ్దత్త (వాగ్దానం); రవీంద్రనాథ్ ఠాగూర్ – ది రెక్ (చరణదాసి); ఆశాపూర్ణాదేవి – అగ్ని పరీక్ష (మాంగల్యబలం); అరుణ్ చౌదరి – పషేర్ బారి (పక్కింటి అమ్మాయి) వీటిలో కొన్ని. అలాగే హిందీనించీ మున్షీ ప్రేంచంద్ – కఫన్ (ఒక ఊరికథ); కిషన్చందర్ – జబ్ ఖేత్ జాగే (మాభూమి); భైరప్ప వ్రాసిన కన్నడ నవల  వంశవృక్ష (వంశవృక్షం) మొదలైనవి.

ఎన్నో ఇంగ్లీష్ నవలలు, కథలు కూడా చాల తెలుగు సినిమాలుగా వచ్చాయి. అలెక్జాండర్ డ్యూమాస్ వ్రాసిన త్రీ మస్కిటీర్స్ (చండిక), సామ్యూల్ బట్లర్ వ్రాసిన ది వే ఆఫ్ ఆల్ ఫ్లెష్ (నా ఇల్లు), జార్జ్ ఇలియట్ వ్రాసిన సైలాస్ మార్నర్ (బంగారుపాప), చార్ల్స్ డికెన్స్ వ్రాసిన ఆలివర్ ట్విస్ట్ (చిట్టితమ్ముడు), మార్క్ ట్వైన్ వ్రాసిన ప్రిన్స్ అండ్ పాపర్ (రాజు - పేద), విక్టర్ హ్యూగో వ్రాసిన లే మిజరాబ్ (బీదలపాట్లు), ఇలా ఎన్నో గొప్ప తెలుగు సినిమాలు వచ్చాయి. ఇక్కడ నేను ఇంగ్ల్లీషు, ఇతర భాషా సినిమాలను తెలుగు సినిమాలుగా తీసిన వాటి గురించి మాట్లాడటం లేదు. సాహిత్యపరంగా మన తెలుగులోకి వచ్చినవే వ్రాస్తున్నాను. అలాగే మన పురాణ సాహిత్యంలో నించీ వచ్చిన కొన్ని వందల పౌరాణిక సినిమాల గురించీ వ్రాయటం లేదు.

ఓకే సార్! ఎంతో కష్టపడి, ఎంతో సమాచారం సేకరించి, ఐదు పేరాగ్రాఫులు నింపారు. బాగుంది. అయితే ఏమిటిష! దీనికీ, ఎండని ఏడో చేపకీ ఏమిటి సంబంధం?” అని అడగాలని తహతహలాడుతున్నారు మీలో కొందరు.

కొంచెం ఓపిక పట్టండి మాష్టారూ... వస్తున్నా... వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
                               
* * *

అనగా అనగా రెండు పల్లెటూళ్ళు. ఒక పల్లెటూళ్ళో ఒక పెద్ద కుటుంబం. రెండు తరాల జుట్టు నెరిసిన పెద్దలూ, మూడో తరంలో నలుగురు అన్నదమ్ములూ, వాళ్లకి ముగ్గురు పెళ్ళాలూ, (పెళ్లిగాని నాలుగో కుర్రాడే హీరో), పెళ్ళయి పుట్టింటికి వచ్చేసిన కూతురు, ఇంకా హాస్యగాడు లాంటి ఒక పాలేరు, హాస్యగత్తె లాటి ఒక పని మనిషి.

మరి రెండో వూళ్ళో ఇంకో కుటుంబం. అదీ మూడు తరాలే. మొదటి తరంలో ఒక బామ్మ. రెండో తరంలో జుట్టుకి రంగేసుకున్న పెద్దలు. మూడో తరంలో పెళ్ళయిన ముగ్గురబ్బాయిలు, పెళ్ళికాని ఒక హీరోయిన్.
రెండు కుటుంబాల వాళ్ళూ సమయం దొరికినప్పుడల్లా, ఎవరి కుటుంబంలో వాళ్ళే పాటలు పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, సరదాగా సమయం గడిపేస్తుంటారు.
హీరో హీరోయిన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లోనో, కోటిపల్లి హైస్కూల్లోనో చదువుకోటానికి వచ్చి, ఎలాగూ కలిసాం కదా అని, కలిసి రోడ్ల మీద డాన్సులు చేస్తూ, కలిసి మధ్యే మధ్యే చదువుకుంటూ, కలిసి ప్రేమించేసుకున్నారు.

సంకురాత్రి పండక్కి అబ్బాయి వాళ్ళ వూరు వెడుతూ, అమ్మాయిని కూడా రమ్మన్నాడు. ఆ అమ్మాయి అలాగేనని అబ్బాయి వూరికి వెళ్ళింది. ఆ అమ్మాయి అంటే అందరూ ఇష్టపడ్డారు. ఇష్టపడ్డారు కనుక అందరూ కలిసి చక్కటి సంక్రాంతి పాట ఎవరికీ అర్ధం కాకుండా తెలుగు రాని ఒక హిందీ వాడితో పాడించి, పొలాల్లో డాన్సులు చేశారు.
`వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టున్నారు. పెళ్లి చేస్తే పోలా' అన్నది బామ్మగారు.
`అలాగే. తధాస్తు!' అన్నాడు, అప్పుడే ఆకాశంలో వాళ్ళ వూరి పైనించీ వెడుతున్న తంపులమారి నారదుడు.

కాకపొతే అక్కడే వచ్చింది సమస్య. పెళ్లివారు మూడు తరాల నించీ విరోధులు. అప్పుడే మొదలయింది కథ. రెండు వూళ్ళల్లోనూ యధాశక్తి కత్తులు నూరటాలు, తుపాకీలలో గుళ్ళు కొనుక్కురావటాలు, ముంబాయి నించీ ఫైల్మాన్లని తీసుకురావటాలు... హీరో హీరోయిన్లు మాత్రం దొంగతనంగా ఇద్దరి వూళ్ళ మధ్యా వున్న గుడి దగ్గర కలిసి, అక్కడికి పక్కనే వున్న సింగపూరు, మలైషియాలలో తలో ఇరవై మంది సత్తెనకాయలతో డాన్సులు కూడా  చేస్తూనే వున్నారు.. ఇలా ప్రేమించుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటూ.. సినిమా కథని నడిపిస్తున్నారు.

ఈ కథని ఆధారంగా తీసుకుని, తీసిన సినిమా పేరు మీరెవరైనా చెప్పగలరా?
గలరు. నాకు తెలుసు. ఎందుకంటే ఇలాటి కథనే తీసుకుని, ఒక్క తెలుగులోనే గత పది, పదమూడు సంవత్సరాల్లో కనీసం ఏడువందల అరవై మూడో, ఆరు వందల ముఫ్ఫై ఏడో సినిమాలు వచ్చినట్టు గణాంకాల గణపతిగారు చెబుతున్నారు. మరి, అన్ని వందల సినిమాల్లో మీరు ఒక్క సినిమా చెప్పలేరా.. అదే నా ధైర్యం!

ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. ఆ కథలన్నీ రాసింది ఒక రచయితేనుట. ఒక అంటే ఒక అని కాదు, ఆయనా.. ఆయన పేరుతో వ్రాసిన దయ్యం రచయితలు.. అంటే పేరు బయటికి రాకుండా కాపీ కొట్టే ఘోస్ట్ రచయితలన్నమాట.
ఇక్కడే ఏడో రాజకుమారుడు మళ్ళీ వస్తున్నాడు. ఇంతకుముండు చెప్పుకున్న నవలా సాహిత్యం ఆధారంగా వచ్చిన ప్రజారంజకమైన మంచి తెలుగు సినిమాలు చూసి, ఇప్పుడు వస్తున్న ఏక కథా చిత్రాలతో విసుగెత్తిన మీలో ఎవరైనా సరే, ఈ ఏడో రాజకుమారుడు కావచ్చు.
`ఏక కథా రచయితా! ఏ.క. రచయితా! ఎందుకిలాటి కథలు వ్రాస్తున్నావు' అడిగాడు ఏడో రాజకుమారుడు.

`నన్నేం చేయమంటారు. దర్శకుడు అదే కథ కావాలన్నాడు” అన్నాడు ఏక కథా రచయిత.
“దర్శకుడూ.. దర్శకుడూ.. మళ్ళీ అదే కథ ఎందుకు? గిన్నీస్ బుక్కులోకి ఎక్కుదామనా!' ఏడో కొడుకు.
`నేను నిమిత్తమాత్రుడిని మాత్రమే. నిర్మాత ఏం చెబితే అది. అతన్నే అడగండి' అన్నాడు దర్శకుడు.
`నిర్మాతా.. నిర్మాతా.. ఎందుకు ఇదే కథ అన్నిసార్లు కావాలంటావు? తెలుగులో ఎన్నో చక్కటి నవలలు, కథలు వున్నాయి కదా. వాటితో సినిమాలు తీయకూడదూ!' అడిగాడు రాజకుమారుడు.
నవ్వాడు నిర్మాత. “రాజకుమారుడుగారూ! భలే జోకేశారు. నాగేశ్వరరావూ, శోభన్ బాబూ, జగ్గయ్య, సావిత్రి, జమున, శారద, గుమ్మడి, ఎస్వీరంగారావులాటి మహానటులు ఆరోజుల్లో నవలల్లోని పాత్రలకు ప్రాణం పోశారు. ఈరోజు నటన తెలిసిన నటులేరి? అందరూ తారలే కదా! మిణుక్కు మిణుక్కుమంటూ వాళ్ళ నాన్నగారి కాంతిలో వెలుగుతుంటారు. సెర్చిలైటు పెట్టి వెతికినా హావభావాలేమీ కనపడవు ఆ `అందమైన' ముఖాల్లో! అందుకని వాళ్ళు చేయగలిగినవి  మాత్రమే వాళ్ళ చేత చేయిస్తున్నాం! అయినా వెళ్లి, ఆ హీరోలనే అడగరాదూ' అన్నాడు నిర్మాత.  

“హీరో.. హీరో.. నువ్వు ఎందుకు నటించలేకపోతున్నావు?" అడిగాడు ఏడో కొడుకు.
పడీ పడీ విలన్ లాగా నవ్వాడు హీరో. నవ్వటం ఆపి, లేచి నుంచుని హీరో అన్నాడు. భలేవాళ్ళు సార్ మీరు! మీరు బొత్తిగా మన సినిమాలు చూస్తున్నట్టు లేదు. తెలుగు సినిమాల్లో మొదట్లో నటులే తమ పాటలు తామే పాడుకునే వాళ్ళు. తర్వాత ఘంటసాల, సుశీల లాటి గాయకులు పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నాకు పాటలు పాడేవాళ్ళు వున్నట్టే, అవసరమైతే డైలాగులు డబ్బింగ్ చెప్పేవాళ్ళు కూడా వున్నారు. డాన్స్ స్టెప్పులు వేయించటానికీ, ముఖం చూపించకుండా నా డాన్సులు చేయటానికీ డాన్స్ డైరెక్టర్ వున్నాడు. నా బదులు ఫైటింగ్ చేయటానికి స్టంట్ మాస్టర్లు వున్నారు. మాకు అవకాశాలు ఇవ్వటానికి ఇక్కడే పాతుకుపోయిన నాన్నలూ, తాతయ్యలూ, అన్నలూ, మామయ్యలూ వున్నారు. డబ్బులు పెట్టటానికి వాళ్ళ నిర్మాతలున్నారు. మమ్మల్ని సినిమారంగంలో నిలబెట్టటానికి అభిమానులు వున్నారు. నా డబ్బులు నాకు వస్తున్నాయి. పొతే వాళ్ళేగా పోయేది! ఇక నటనతో అవసరం ఏముంది?' అన్నాడు హీరో.

`అదేమిటి. టెన్నిస్ ఆడటం రానివాడు, టెన్నిస్ ఆడలేడు కదా! ఫిజిక్స్ అంటే తెలియనివాడు ఫిజిక్స్ పాఠం చెప్పలేడు కదా! మరి నటన రానివాడు నటుడెలా అవుతాడు?' అమాయకంగా అడిగాడు రాజకుమారుడు.

`అవన్నీ నాకు తెలీదు. ఎలా అయానో తెలుసుకోవాలంటే నన్ను గుడ్డిగా అభిమానిస్తూ నన్ను పూజిస్తున్న  నా అభిమానుల్నీ, దేశమంతటా అల్లుకుపోయిన నా అభిమాన సంఘాల్నీ అడగండి' అన్నాడు హీరో.
రాజకుమారుడికి ఏమీ పాలు పోలేదు. పాలు తాగి రాజమందిరంలో హాయిగా పడుకునేవాడికి, ఈ తద్దినం ఎందుకు? వాళ్ళకెట్లాగూ పనిపాటా లేక ఈ అభిమాన సంఘాలు పెట్టుకున్నారు. తను ఆ ఊళ్ళన్నీ వెళ్లి ఈ అభిమాన సంఘాల చుట్టూ తిరగటమెందుకు అని అనుకుని ఇక ఆ పని విరమించుకున్నాడు.

* * *

`రైటరూ! నువ్వు వ్రాసినదాంట్లో ఒక తప్పు వుందయ్యా! చలం వ్రాసిన దోషగుణం (గ్రహణం), శ్రీరమణ వ్రాసిన మిధునం, జనార్ధన మహర్షి వ్రాసిన గుడి (దేవస్థానం) కథలు సినిమాలుగా వచ్చాయి కదా. మరి ప్రేక్షకులకు అవి నచ్చలేదు కదా' `మీరు చెప్పింది రైటు మరియు రాంగు.. రెండూ సార్! అవును వాళ్ళు వ్రాసిన ఆ మూడు కథలూ చక్కటి సినిమాలుగా వచ్చాయి. చూసినవాళ్ళకి చాలామందికి అవి నచ్చాయి. కొంతమంది చూద్దామనుకున్నా చూసే అవకాశం లేని వాళ్ళు కూడా వున్నారు. వాటిని అన్ని చోట్లా రిలీజ్ కాకుండా చేయటానికి వేరే కారణాలున్నయిష. అవి ‘ఆ ఆరుగురూ..’ అనే కథలో తర్వాత చెప్పుకుందాం”

* * *

కొన్ని సంవత్సరాల క్రితం, మిత్రులు తనికెళ్ళ భరణి ఒక జోక్ చెప్పారు.
ఒక కంపెనీ వార్షికోత్సవాల సభలో కంపెనీ  ఓనరుగారు మాట్లాడుతూ, `మన కంపెనీలో ఎవరైనా సరే కష్టపడి పని చేస్తే, ప్రమోషన్లు సంపాదించుకుని కంపెనీతో పాటు ఎదగవచ్చు. ఉదాహరణకి, ఇక్కడ నా పక్కన కూర్చున్న యువకుడు ఒక్క సంవత్సరం క్రితమే మన కంపెనీలో వర్కరుగా చేరాడు. మూడు నెలల్లో మేనేజర్ అయాడు. ఈ మధ్యనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయాడు. అంతా బాగుంటే ఇంకో ఆరు నెలల్లో జనరల్ మేనేజర్ అవుతాడు' అన్నాడు.

అని పక్కనే యువకుడిని ఉద్దేశించి, `ఏమయ్యా.. నువ్వేమైనా చెబుతావా?' అని అడిగాడు.
కొంచెం సిగ్గుపడుతూ, తల వంచుకుని `వేరే చెప్పేదేమీలేదు డాడీ! థాంక్యూ!' అన్నాడుట ఆ వంశోద్ధారకుడు!

* * *

   

      

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)