సారస్వతం

 అక్కినేనికి నివాళి

- రచన :  - పెయ్యేటి శ్రీదేవి 


 

 

 
 

ఇది నటన కాదు. దేవదాసులోలా, ప్రేమాభిషేకంలోలా నటన ఐతే బాగుండేది. అది సినిమా నటన. ఇది జీవితం. నటించడం కుదరదు. అందుకే ఇది నటన కాదు, కలా కాదు. మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారి మరణం జీర్ణించుకోలేని పచ్చినిజం. ఈ ప్రపంచానికి ఒక్కడే అసలైన హీరో. హీరో అంటే ఎలా వుండాలో తెలియజెప్పిన హీరో. అతడే నటసామ్రాట్. నిన్న అంజలి మరణం మరువకముందే నాగేశ్వరరావుగారి మరణం ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరిని విషాదంలో ముంచివేసింది. ఆయన లేని లోటు తీర్చలేనిది.

ఈ ప్రపంచానికి ఇద్దరే మహానటులు. ఎన్.టి.రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఇద్దరే మహా నటీమణులు. సావిత్రి, సూర్యకాంతం. వీరు మన తెలుగువారే కావడం మన అదృష్టం. ఇంకా మరెందరో అందాల నటులు, అందాల నటీమణులు ఎన్నో మంచి మంచి చిత్రాల్లో వేసారు. అది ఒక స్వర్ణయుగం.

సూర్యకాంతం అందర్నీ డిస్ మిస్ చేస్తాననేది. మృత్యువుని డిస్ మిస్ చెయ్యలేకపోయింది. భానుమతికి గర్వం అన్నారు. ఆవిడంటే అందరూ భయపడ్డారు. ఆవిడ గర్వమూ మంత్యువుని ఏమీ చెయ్యలేకపోయింది. వెండితెర అందాల సీతమ్మ అంజలీ అక్కడికే వెళ్ళిపోయింది. నటసామ్రాట్ నాగేశ్వరరావుగారి నటనాకౌశలమూ మంత్యువునేమీ చెయ్యలేకపోయింది. ఇల్లా ఎందరో మహామహుల మహాభినంష్క్రమణంతో ఆనాటి స్వర్ణయుగం అంతరించిపోయింది.

ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వందల సినిమాలు, ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్., హరనాథ్, బి.సరోజ, సావిత్రి, అంజలి, జమున, కృష్ణకుమారి, సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు, రేలంగి వాళ్ళ అద్భుత నటనతో, వాళ్ళ మధ్య వచ్చిన ఎన్నో మంచి చిత్రాలు ఆనాటి తరంవాళ్ళందరూ మైమరిచి చూసారు. అందరూ సకుటుంబంగా చూసిన ఆ సినిమాల తాలూకు మధురమైన జ్క్షాపకాలు మనసుకి ఆనందాన్నిచ్చేవి. ఇప్పుడెన్ని కొత్త పోకడల సినిమాలు వచ్చినా, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఆపాతమధురాలు, అంటూ టి.వి.ఛానెళ్ళలో వేసే ఆనాటి చిత్రాలనే ఇంక ఆరోజులు రావంటూ బాధతో అపురూపంగా చూస్తున్నారు.

నేడు ఫేషన్ పేరుతో జుట్లు విరబోసుకుని, రెండు చేతులున్నా, ఒక్క చెయ్యే పెట్టి, వంకర మెడతో అవకరంగా కుట్టించుకుని, పీలికల డ్రస్సులు వేసుకుని, నేను ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకం కానంటూ స్టేట్ మెంట్లిచ్చి, అందాలని పారబోసి, సినిమాల వేషాల కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేని, అందమైన సహజశిల్ప సుందర నటీమణులు ఆనాటి తారలు.

ఇంక హీరోల విషయానికొస్తే, ఎన్.టి.ఆర్. గాని, ఏ.ఎన్.ఆర్. గాని, హరనాథ, శోభన్ బాబు గాని, గడ్దం అడ్డంగా పెట్టుకుని నటించాల్సిన అవసరం లేకుండా, నీటుగా వుండి, నీటుగా నటించిన మహానటులు. అందమైన హీరోలు వాళ్ళు. ఏ.ఎన్.ఆర్. గాని, ఎన్.టి.ఆర్.గాని ప్రతిసినిమాలో, ఒకదానికొకటి సంబంధం లేకుండా, అనేక రకాల పాత్రలు చేసి అద్భుతంగా నటించారు. నడక, డాన్సు, నటన, డైలాగు చెప్పే విధానం, ఒక ప్రత్యేకమైన శైలి ఏ.ఎన్.ఆర్.ది. టి.వి. ఇంటర్వ్యూలలో నా కళ్ళు గుంటకళ్ళు అనేవారు. అలా ఎందుకన్నారో! అది విని టి.వి.యాంకర్లందరూ అలా అనడం మొదలుపెట్టారు. ఆయన తెలుగు సినీపరశ్రమకి చాలా అందమైన హీరో. ప్రతి సినిమాలో కళ్ళతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. దేవదాసులో దే్వదాసుగా, తెనాలిరామకృష్ణలో వికటకవిగా, మాయాబజార్ లో అభిమన్యుడిగా, శ్రీకృష్ణార్జునయుధ్ధంలో అర్జునిడిగా, భూకైలాస్ లో నారదుడిగా, బుధ్ధిమంతుడులో భక్తుడిగా, నేటి రామదాసులో కబీరుగా, శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా, ఇక సాంఘిక చిత్రాలకొస్తే, మంచిమనసులు, వెలుగునీడలు, సిరిసంపదలు, చదువుకున్న అమ్మాయిలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, బాటసారి, ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన అద్భుతంగా నటించారు. తాగుడు పాత్రల్లో గాని, సిగరిట్ కాల్చడంలో గాని, ఆయన నడక, చేతులు తిప్పడం, డైలాగు చెప్పడం ఆయనదో డిఫరెంట్ స్టైలు. హీరో అంటే ఇలాగే వుండాలి అని ఆనాటి తరం ప్రేక్షకుల మదిలో ముద్ర పడిపోయింది. అదృష్టవంతులు సినిమాలో అయ్యయ్యో బ్రహ్మయ్యా, అన్యాయం చేసావేమయ్యా పాటలో ఆయన వేసిన డాన్సు స్టెప్పులు ఎంతో సొగసుగా వుంటాయి. ఆయన మొహం సినిమాల్లోనే కాదు, మామూలుగా కూడా చాలా ప్రశాంతంగా వుంటుంది. ఆయన చాలా అందమైన హీరో. అజాతశత్రువు. బుధ్ధిమంతుడు. అందరివాడు. అందరికీ కావల్సినవాడు. అతడొక్కడే నటసామ్రాట్. జీవితాన్ని ఎలా జీవించాలో చూపించి జన్మ సార్ధకత చేసుకున్న సార్ధకనామధేయుడు. ఆయన గుడికీ వెళ్ళలేదు, బడికీ వెళ్ళలేదు. చదువుకోకపోయినా ప్రపంచకీర్తిని ఆర్జించాడు. ఆయన క్రమశిక్షణావిధానం, ఆయన ఆత్మవిశ్వాసం, నిరంతరం శ్రమించే తత్వం ఆయనకి ఏ బలహీనతలు, ఏ భయాలు లేని ఈ గుణాలే ఆయనకి గుడికి వెళ్ళే అవసరం లేకుండా చేసాయి. అందుకే గుడిలోని తత్వం, బడిలోని జ్క్షానం, రెండూ ఆయనలోనే వున్నాయి. గుడి, బడి ఆయనే. అందుకే నటుడుగా గొప్పవాడు మాత్రమే కాదు, అందరికీ జీవితాన్ని చక్కని సక్రమ మార్గంలో నడిచి చూపించిన ఆదర్శప్రాయుడు.

ఎంతోమంది మిమిక్రీ ఆర్టిస్టులు ఆయనని బాగా అనుకరిస్తూ నవ్వించారు. ఇది వాళ్ళమటుకు ప్రతిభే కావచ్చు. కాని దానికంటే ముఖ్యం ఆయన క్రమశిక్షణ, ఆయన చెప్పిన మంచి సూక్తులు, ఆయన నటించిన సందేశాత్మకమైన సినిమాలు, ఆయన పాడిన సందేశాత్మకమైన పాటలు చూసి, విని ఆ సన్మార్గంలో అందరూ నడవాలి. అటువంటి మంచి చిత్రాలు మళ్ళీ రావాలి. ఆ స్వర్ణయుగాన్ని మళ్ళీ మనం తెచ్చుకుని ఆయన లేరన్న బాధని మర్చిపోదాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను.
 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)