సారస్వతం

బ్రౌన్ శాస్త్రిగా ప్రసిద్ధి పొందిన జానమద్ది హనుమఛ్ఛాస్త్రి గారు

(1926 - 2014)
 

- రచన :  - డా|| మంగళగిరి ప్రమీలాదేవి  


 

 

 
 

బ్రౌన్ మహాశయుని పేరెత్తగానే ఆయన చేసిన సాహిత్యోద్ధరణం. మన మనోఫలకం మీద ప్రకాశిస్తుంది అదేవిధంగా జానమద్ది హనుమఛ్ఛాస్త్రిగారి పేరు ఎత్తగానే కడపలోని గ్రంధాలయం - బ్రౌన్ స్మారక చిహ్నం, ఆంధ్ర సారస్వత ప్రియం భావుకుల మనస్సులో తళుక్కు మంటాయి. దానితోపాటు వీటి నిర్మాణ కృషిలో సింహభాగం పంచుకొన్న జానమద్ది హనుమఛ్ఛాస్త్రి గారు బ్రౌన్ శాస్త్రి గా ప్రఖ్యాతి గడించారు.
 

కడప, సి.పి.బ్రౌ లైబ్రరీలో తాళపత్ర గ్రంథాలను చూస్తున్న శాస్త్రిగారు మరియు ఇతరులు

సంస్కృతాంధ్ర కన్నడ భాషలందు పండితులైన జానమద్ది హనుమఛ్చాస్త్రిగారు. అక్షర యశస్వి. చక్కని చిక్కని వచన రచన శాస్త్రిగారికి వెన్నతో పెట్టిన విద్య.

హనుమఛ్చాస్త్రిగారి కలం ఆంధ్ర భాషా పత్రికలలో సర్వే సర్వత్రా ధర్మనయం. 2200 వ్యాసాలు ప్రచురింపబడిన విషయం పాఠకులందరూ ఆనందింపవలసిన విషయం. వీరి ముద్రిత గ్రంథాలలో మా సీమ కవులు, నాట్య కళా ప్రపూర్ణ బళ్ళారి రాఘవ, కస్తూరి - కన్నడ సాహిత్య సౌరభం, వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం గణపతి - మనదేవతలు, రసవద్ఘట్టాలు, సి.పి.బ్రౌన్ చరిత్ర, నీరాజనం, వ్యాస భారతి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నివేదన ఇత్యాది గ్రంథాలు ప్రసిధ్దమయినవి.

అనేక సాహిత్య / సదస్సులలో ప్రసంగాలు, పత్ర సమర్పణ, ఆకాశవాణిలో చేసిన అనేక ప్రసంగాలు వీరి సాహితీ కృషికి నీరాజనం పడుతున్నాయి.

ఆంధ్ర భాషకు చేసిన కృషికి గుర్తింపుగా వీరు అనేక సత్కారాలు, సన్మానాలు పొందారు. అయ్యంకి అవార్డు స్వీకరణ, కవయిత్రి జయంతి పురస్కారం ఇత్యాదులు శాస్త్రిగారు పొందిన సత్కారాలలో కొన్ని. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి.లిట్ ను పొందారు. ప్రసిద్ధమైన గంగప్ప సాహితీ పురస్కారాన్ని అందుకొన్నారు. ఆ సందర్భంగా జరిగిన సాహిత్య సభలో గంగప్పగారి పదసాహిత్యాన్ని గూర్చి విస్తృతంగా ప్రసంగించిన ఈ వ్యాసకర్త్రి డా|| మంగళగిరి ప్రమీలాదేవిని గుర్తించి అభినందించడం, ఆశీర్వదించడం ఈ వ్యాసకర్త్రికి అపూర్వమైన అనుభవం, గర్వకారణమయింది కూడా.

శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రిగారిని గూర్చి సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు పలికిన వాక్కులలో ఈ వ్యాసాన్ని పూర్తి చేశారు. శ్రీ హనుమచ్చాస్త్రి శ్రమపడి విషయసేకరణ చేసుకున్నాడు. ఆయన ఏ పని చేసినా, ఓర్పుతో విషయ సేకరణ చేసేది ఆయన ప్రత్యేకత!. ఏదో చేస్తిలే అనే ఆత్మవంచన చేసుకోడు. తాను వ్రాసే విషయంపై ఎంతో సానుభూతితో గుణదోష వివేచనకు మరువని వివేకంతో కలం విదిలిస్తాడు.

ఆ కలం ఇప్పుడు ఆగిపోయింది. ఇది తెలుగు వారందరికీ విచారకరం.

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)