శీర్షికలు / సంగీత రంజని  
త్యాగరాజస్వామి వారిని దర్శించిన సమకాలీన సంగీతజ్ఞులు

రచన  - సంగీతాచార్య డా.వైజర్సు బాలసుబ్రహ్మణ్యం


 

రామనామ రసికాగ్రణ్యులైన త్యాగరాజ స్వామివారు గొప్ప సంగీత విద్వాంసునిగా, వాగ్గేయకారుడిగా, మహాకవిగా, గేయనాటక మార్గదర్శిగా చిరస్మరణీయులు. ఇటువంటి మహనీయుల జీవిత విశేషములు సంగీత జగద్గురుగా వెలుగొందిన త్యాగరాజస్వామి వారి కీర్తి దేశ వ్యాప్తముగా విస్తరించగా, వీరిని సందర్శించి తమ జీవితములను ధన్యము చేసుకొని తరించిన సమకాలీన సంగీతజ్ఞులు, వాగ్గేయకారులు ఎందరో కలరు. వీరు త్యాగరాజ స్వామి వారిని కలుసుకొన్న సందర్భములలో జరిగిన విశేషములు, ఆ సందర్భమున చేయబడిన వివిధ రచనల వివరములు మనకు ఎంతో స్ఫూర్తిదాయకముగా ఉండగలవు.

శ్యామశాస్త్రి:
త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి - ఇరువురూ మంచి స్నేహితులు. సంగీతపరమైన సంభాషణలు కావించడానికి శ్యామశాస్త్రులవారు తరచూ త్యాగరాజస్వామి వారి ఇంటికి వస్తూ ఉండేవారట. ఈ సంభాషణలలో తాము చేసిన రచనలను పరస్పరము వినిపించుకొని వారి వారి అభిప్రాయములను పంచుకొనేవారని తెలుస్తోంది. ఇటువంటి విషయములను కొన్నింటిని ప్రొ.సాంబమూర్తి గారు ‘గ్రేట్ కంపోజర్స్’ అనే గ్రంథములో వివరించియున్నారు. శ్యామశాస్త్రుల వారు ఎప్పుడైనా త్యాగరాజు స్వామివారిని కలుసుకోవడానికి తిరువయ్యూరులోని వారి ఇంటికి వెళ్ళినప్పుడు, త్యాగరాజు గారి శిష్యులలోని పిన్నలు - ‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలు దాటితేనే కానీ మనకు భోజన ప్రాప్తి కలగదు’ అని అనుకొనేవారట. దీనిని బట్టి వీరి చర్చలు ఎంత సుదీర్ఘంగా సాగేవో మనకు అర్ధమవుతుంది. అయితే, త్యాగరాజు గారి శిష్యులలో విద్య బాగా నేర్చుకున్న వారికి మాత్రం వీరి సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా, జ్ఞానదాయకంగా ఉండేవని తెలుస్తోంది.

ముత్తుస్వామి దీక్షితులు:

ఇక ముత్తుస్వామి దీక్షితులు వారి విషయానికి వస్తే, వీరిరువురూ పరస్పరం కలుసుకొన్నారని చెప్పడానికి ఎక్కువగా ఆధారాలు లభించనప్పటికీ, టి.ఎల్ వెంకట్రామయ్యర్ గారి ‘ముత్తుస్వామి దీక్షితులు’ అను గ్రంథములో వీరిరువురూ కలుసుకున్న సందర్భమొకదానిని గురించి వివరించారు. ఒకానొక సందర్భములో దీక్షితుల వారు వీరింటికి వేంచేశారట. ఆ సందర్భంలో త్యాగరాజ స్వామివారు‘కొలువై యున్నాడే’ అనే భైరవి రాగ కృతిని రచించి, గానం చేసి, దీక్షితుల వారిని కూడా ‘మా రామునిపై ఏదైనా కృతిని ఆలపించండని’ అడుగగా, దీక్షితుల వారు మణిరంగు రాగంలో ‘మామవ పట్టాభిరామ’ అను కృతిని ఆలపించారని తెలియజేస్తోంది. ఈ సంఘటన ఆధారంగా వీరిరువురూ కలుసుకున్నారని మనకు తెలుస్తోంది.

త్రిభువనం స్వామినాథయ్యర్:

త్యాగరాజ స్వామివారు కాలానికి చెందిన ప్రసిద్ధ గాయకుడు, నటుడు అయిన త్రిభువనం స్వామినాథయ్యర్ ‘ఆనందభైరవి’ రాగాన్ని పాడుటలో ప్రసిద్ధి చెందిన వారని తెలుస్తోంది. వీరు బొమ్మలాటలలో నేపథ్య గానము చేసేవారట. ఒక సందర్భంలో త్యాగరాజు గారు వీరి గానం విని ఎంతో సంతసించి, వారిని మెచ్చుకొన్నారట. అప్పటికే త్యాగరాజస్వామి ‘రామరామ నీ వారము’, ‘క్షీర సాగర విహార’, ‘నీకే తెలియక’ అను కృతులు చేసి యుండగా, వారి కోరిక మేరకు అటు తరువాత యే రచనా చేయలేదని తెలియవస్తోంది.

శ్రీ తూము నరసింహదాసు:

ఆంధ్ర దేశానికి చెందిన గుంటూరు నివాసి అయిన తూము నరసింహ దాసు భద్రాద్రి రాముని స్తుతిస్తూ కీర్తనలు చేసిన మహా భక్తాగ్రేసరుడు. ఒకప్పుడు వీరు సుమారు 1821 ప్రాంతములో దక్షిణాన యాత్ర చేయుచుండగా, తిరువత్తియార్ లో వీణ కుప్పయ్యర్ గారి గృహమున శ్రీ త్యాగరాజ స్వామివారు బసచేసి ఉన్నారని తెలుసుకొని, వారింటికి వెళ్ళి స్వామివారిని ద్సర్శించుకొని, వారి గానానికి పరమానంద భరితులై, ఆశువుగా రెండు పద్యములను పాడి స్వామివారిని కొనియాడారని తెలుస్తోంది. కొంతమంది పండితుల అభిప్రాయము ప్రకారం నరసింహ దాసు గారు తిరువత్తియారులో కాక, స్వామివారి గృహమందే వీరిని సందర్శించారని కూడా తెలియవస్తోంది.

గోపీనాథ భట్టాచార్య:

కాశీకి చెందిన ఈయన హిందుస్థానీ సంగీతమందు ప్రావీణ్యుడు. త్యాగరాజ స్వామి రచించిన కృతులు దక్షిణ భారతదేశంలోనే కాక, భారతదేశమంతా ప్రాచుర్యము పొందినవి. ఒకానొక సమయంలో శ్రీ గోపీనాథ భట్టాచార్యులవారు రామేశ్వరం యాత్రకు వెళ్ళి, అక్కడినుండి తిరువయ్యూరులో నున్న శ్రీ త్యాగరాజ స్వామి వారిని సందర్శించారట. వారిని దర్శించుకొని, ‘అయ్యా, మీరు చేసిన రచనలు మా ఉత్తర హిందుస్థానములో కూడా ప్రాచుర్యము పొందాయి. అట్టి గొప్ప రచనలు చేసిన మిమ్మల్ని దర్శించుకునే భాగ్యము నాకు ఈనాడు కలిగినది’ అని అన్నారట. అంతట శ్రీ త్యాగరాజ స్వామి వారు చాలా సంతోషించి, తనకు ఇంతటి భాగ్యము కలుగజేసిన శ్రీరామచంద్రునికి కృతజ్ఞతా పూర్వకముగా ‘దాశరథే నీ ఋణము దీర్చ నా తరమా’ అని తోడి రాగములో ఒక కృతిని రచించి పాడారట. త్యాగయ్య గారి గానము విని గోపీనాథ భట్టాచార్యుల వారు ఎంతో సంతోషించి వారి దర్శన భాగ్యము కలిగినందుకు చాలా ఆనందపడిరి.

గోపాలకృష్ణ భారతి:

వీరు తమిళ వాగ్గేయ కారులలో ప్రఖ్యాతి గాంచినవారు. వీరు నందనార్ చరిత్ర, నయనార్ చరిత్ర, తిరునీలకంఠనాయక చరితము అను మూడు గ్రంథములు వ్రాసినారు. అద్భుతమైన రచనా శైలితో పాటు పలు క్రొత్త రాగములలో కూడా రచనలు గావించిన మహనీయుడు. ఇంతటి గొప్ప వాగ్గేయకారుడు త్యాగయ్య గారి కీర్తిప్రతిష్ఠలను విని వారి దర్శనము చేసుకొనవలెనని ఆకాంక్షించిరి. వీరు తన 35 వ యేట, అనగా సుమారు 1845 ప్రాంతములో త్యాగరాజ స్వామి వారిని దర్శించారని తెలియవస్తోంది. త్యాగరాజ స్వామి దర్శనార్ధము వారి యింటికి వెళ్ళిన గోపాల కృష్ణ భారతిని స్వామివారు సాదరముగా ఆహ్వానించి, వారు ఎచ్చటి నుండి వచ్చారో అడిగి తెలుసుకున్నారట. అందుకు, ‘మాయవరం నుండి’ అని గోపాలకృష్ణ భారతి సమాధానము చెప్పిరట.

అంతట త్యాగరాజ స్వామి వారు ‘మాయవరం నివాసి అయిన గోపాలకృష్ణ భారతి అను విద్వాంసులు తమిళములో చక్కని రచనలు చేయుచున్నారని విన్నాను. వారు మీకు తెలుసా?’ అని అడిగారట. త్యాగరాజ స్వామి లాంటి మహా వాగ్గేయకారుని వద్ద తనకు ఇంత గుర్తింపు లభించినందుకు గోపాలకృష్ణ భారతి ఎంతగానో ఆనందపడి, తానే ఆ గోపాలకృష్ణ భారతినని సవినయంగా మనవి చేసుకున్నారట. త్యాగరాజ స్వామి వారు కూడా వీరిని కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారట. ఈ సందర్భంలో త్యాగరాజ స్వామివారి శిష్యులు ‘నన్నుబ్రోవ నీకింత తామసమా’ అను అభోగి రాగ కృతిని గానం చేస్తున్నారట. వారి గానము పూర్తి అయిన తరువాత త్యాగరాజు స్వామివారు అభోగి రాగంలో ఏమైనా కృతులు చేశారా అని అడిగారట. ఆ ప్రశ్న విని గోపాలకృష్ణ భారతి మౌనము వహించి రాత్రికి రాత్రి అభోగి రాగములో ‘సభాపతిక్కు వేరు దైవం’ అనే కృతిని రచించి ఆ మరునాడు త్యాగరాజ స్వామివారికి వినిపించినారట. త్యాగరాజు గారు ఒక్క రాత్రిలోనే వీరు ఆ కృతిని చేశారని తెలుసుకొని పలు విధములు కీర్తించినారట.

వడివేలు:

తిరునాన్కూరు సంస్థానాధీశులు శ్రీ స్వాతి తిరునాళ్ మహారాజా వారు మంచి వాగ్గేయకారులుగా కూడా ప్రఖ్యాతినొందారు. కర్ణాటక సంగీత రచనలే కాక, హిందుస్థానీ సంగీత రచనలు కూడా చేసిన మహా పండితులు. అంతేగాక, ఎంతోమంది సంగీత విద్వాంసులను తన అస్థానమునందు గౌరవించేవారు. అటువంటి రాజాస్థానమునందు వడివేలు గారు వయోలిన్ విద్వాంసులుగా నుండేవారు. త్యాగరాజ స్వామివారి శిష్యులైన కుప్పయ్య భాగవతార్ అను విద్వాంసుని ద్వారా స్వామివారి రచనలను విన్న రాజుగారు మిక్కిలి ఆనందముతో, తన ఆస్థాన విద్వాంసుడగు వడివేలును పంపి తన సభకు ఆహ్వానించారు. అప్పుడు వడివేలు గారు త్యాగరాజ స్వామివారిని సందర్శించి రాజుగారి కోరికను ప్రస్తావించగా, త్యాగరాజు గారు ‘ఇహమున కాదు పరమున రాజును కలుసుకొందునని’ సమాధానము చెప్పి పంపిరట.

షట్కాల గోవింద మరార్:

వీరు కూడా తిరువాన్కూరు రాజాస్థానములో విలసిల్లిన సంగీత విద్వాంసులు. వీరు రామమంగళం అను గ్రామానికి చెందినవారు. వీరు ఆరు కాలములలో పల్లవులు పాడుటలో దిట్ట అయినందున, వీరికి ‘షట్కాల గోవింద మరార్’ అనే బిరుదు కలిగెను. వీరు 1842 వ సంవత్సరంలో త్యాగరాజ స్వామివారిని కలుసుకొన్న సందర్భములో ఒక పల్లవిని షట్కాలములలో పాడి తన సామర్ధ్యమును ప్రకటించుకొనిరట. ఇది విని త్యాగరాజస్వామివారు గోవింద మరార్ గారి ప్రతిభను మెచ్చుకుని, తాను రచించిన ‘ఎందరో మహానుభావులు’ అను కృతిని తమ శిష్యులచేత పాడించారని తెలుస్తోంది.

వీరే కాక ఇంకా అనేక మంది విద్వాంసులు వీరిని సందర్శించి యుండవచ్చును కానీ, సంగీత చరిత్రలో లిఖిత ఆధారముల ద్వారా మాత్రమే మనకు లభించిన కొద్దిపాటి సమాచారము వలన పైన తెలిపిన కొద్ది మంది విద్వాంసుల వివరములు మాత్రమే తెలియుచున్నది. ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు తనను కలుసుకొన్న సంగీత విద్వాంసులను ఎంతో సాదరంగ ఆహ్వానించి, వారి ప్రతిభా విశేషములను ఆస్వాదించి నిగర్వియై, సంగీత గాన రసా పానముతో తమ జీవనము సాగించిరి.

(ఆంధ్ర మహిళా సభ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ వారి  కిన్నెర త్రైమాసిక సంగీత పత్రిక,
శ్రీమతి వై.రమాప్రభ గారి సౌజన్యంతో..)

 

 
 
 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)