సారస్వతం

నాగరికత ఒక పెద్ద అబద్ధం

- రచన :  జగ్గీ వాసుదేవ్, ISHA Foundation


 

 
 

ప్రకృతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికమైన ప్రకృతి, మరొకటి భౌతికానికి ఆవల ఉండేది. మీలో ఉన్న భౌతిక ప్రకృతికి రెండు విషయాలు మాత్రమే తెలుసు స్వీయ పరిరక్షణ, సంతానోత్పత్తి. స్వీయ పరిరక్షణకై, మీరు ఆహారం, వస్త్రాలు, ఇల్లు లేదా ఒక కార్ కోసం పోరాడుతారు. సమాజాలు వృద్ధి చెందే కొద్దీ, మానవుల హోదాలో వృద్ధి చెందే కొద్దీ, వారి మనుగడ ప్రమాణాలు తదనుగుణంగా ఎప్పుడూ పెంచుకుంటూ పోతారు. ఒక వ్యక్తికి మనుగడంటే రోజుకో పూట తిండి కావచ్చు, మరో వ్యక్తికి మనుగడంటే మెర్సిడెజ్ బెంజ్ కారు కావచ్చు- దానికి తక్కువైనదేదైనా ఆ వ్యక్తి ఒప్పుకోక పోవచ్చు.

సంపద, లైంగికత లేదా- స్వీయ పరిరక్షణ, సంతానోత్పత్తి ఈ రెండు విషయాలు ఎంతో హింసను, సంఘర్షణను తీసుకు వస్తున్నాయి, అంతే కాక ఇవి మానవ శక్తిని అపారంగా వృధా చేస్తున్నాయి. ఆధ్యాత్మిక మార్గాలు ఎప్పుడూ మొట్టమొదట ఈ రెండు విషయాలతోనే వ్యవహరిస్తాయి - పూర్తి అంగీకారంతో పేదరికాన్ని స్వీకరించడం ద్వారా, అలాగే లైంగికత నుండి దూరం జరగడం- ఎందుకంటే ఈ రెండు విషయాలని తీసివేస్తే, భౌతిక శరీరంతో మీకున్న తాదాత్మ్య భావన(ఐడెంటిఫికేషన్) మెల్లగా మాయమవుతుంది. ఒక్కసారి ఇది కనుక సంభవిస్తే, మనం ఇక ఏమాత్రమూ ఒక భౌతిక పదార్థం కాబోము. అంటే, మీరిక ఏమాత్రం జంతు సామ్రాజ్యంలో భాగం కారని అర్థం.

ఆధ్యాత్మికత యొక్క అతి ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మనం జంతు జాతికి చెందకుండా ఉండటమే, ఎందుకంటే మీలో ఉన్న మరొక స్వభావం నిత్యం వృద్ధి కోరుకుంటోంది. మీరెక్కడ ఉన్నారన్నదాంతో సంబంధం లేకుండా, అది వృద్ధి కోరుకుంటుంది. మీరెవరైనా కావచ్చు, మీరిప్పుడున్న దానికంటే కొంత మెరుగ్గా ఉండాలనుకుంటారు. ఆ కొంత మెరుగుదలా జరిగితే, మరింత కావాలనుకుంటారు ఎడతెగకుండా మీరు మరింత వృద్ధి కావాలని కోరుకుంటూనే ఉంటారు. ఎంతటివృద్ధిని? అనంతమైన, హద్దులు లేని వృద్ధిని కోరుకుంటారు. కానీ భౌతికం యొక్క సహజగుణం హద్దుని కలిగి ఉండడం. హద్దులేనిదే భౌతికమే లేదు. మీరు ఎప్పుడైతే హద్దులులేని వృద్ధిని కోరుకుంటారో, మీలో భౌతికానికి ఆవల వెళ్ళాలనే కోరిక చేరుతుంది.

మీరు భౌతికానికి ఆవల ఉన్న ప్రకృతి పట్ల ఎరుక పొందితే, మీరు ఆధ్యాత్మికులౌతారు. ఇక మీరేమాత్రం కేవలం ఒక భౌతిక ప్రాణిగా ఉండరు. మీరు జీవశాస్త్ర సూత్రాల వల్లా, మీ జంతుప్రకృతి వల్లా అలాగే మీ భౌతిక సూత్రాల వల్లా ఏమాత్రం నియంత్రించబడరు. ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకి ఇదే మూలాధారం, ఎందుకంటే, ఈ ప్రమాణం మీలో ప్రవేశిస్తేనే మీరు నిజంగా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. లేదంటే, నాగరికత, విద్యల వల్ల మీరు కేవలం నటిస్తూ మీ జంతు ప్రకృతిని మీలోనే పట్టి ఉంచుకుంటారు.

ప్రస్తుతం, ప్రపంచపు మహా నగరాల్లో న్యూయార్క్, లండన్, ప్యారిస్ లేదా లాస్ ఏంజిల్స్ వీటిల్లో మూడు రోజుల పాటు పోలీసులు, చట్టం లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. ప్రతిదీ ఎంత అనాగరికమైందో మీరు చూస్తారు. మనుషులు ఆది మానవులకంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఆదిమానవులకి పోలీసులు ఉండేవాళ్ళు కాదు, కానీ వారంతట వాళ్ళే దాన్ని నిర్వహించుకున్నారు. నాగరికత అనేది మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడానికి మీరు మీపై కట్టుకున్న గొలుసు. అప్పుడప్పుడు ఒకసారి, మీరు మీ విద్యను, నాగరికతను మర్చిపోతారు, ఆ తరువాత మీ ఇంట్లోనో, ఆఫీస్లోనో లేదా వీధిలోనో ఎక్కడో ఒక చోట మీలోని జంతు ప్రవృత్తి కట్టలు తెంచుకుంటుంది. మీరు కేవలం భౌతిక పదార్థమైతే, మీరు అలాగే ప్రవర్తిస్తారు. కానీ జవాబు అది కాదు, మార్గం అది కాదు. ఇక్కడ విషయం అదుపు చేయడం కాదు, ఆవలగా వెళ్ళడం. మీరు భౌతికాన్ని నియంత్రించలేరు. మీరు భౌతికానికి ఆవలగా వెళ్ళాలి.

ఎప్పుడైతే మీలో ఆ ప్రమాణం సక్రియమై, మేల్కొని దాని పట్ల మీరు చేతనమౌతారో, ఎప్పుడైతే భౌతికానికీ మించినది మీకు సంభవిస్తుందో, అప్పుడు భౌతికత ఒక సమస్య కాబోదు. అంటే అది వెళ్ళిపోతుందని కాదు, కేవలం ప్రాముఖ్యం లేనిదిగా అయిపోతుంది. మిమ్మల్ని లాగ్గలిగేదిగా లేదా మిమ్మల్ని బలవంతపెట్టేదిగా ఇక అదే మాత్రం ఉండబోదు. ఇప్పుడిక జీవితం ఎంచుకున్నట్లు అవుతుంది. మీలో ఎలాంటి బలవంతం ఉండదు. దేహం మిమ్మల్ని నడిపించదు, మీకు తోచినట్టుగా మీరు దేహాన్ని నడిపిస్తారు.

కాబట్టి, మీరు నిజంగా ఒక శాంతియుతమైన సంస్కృతిని అంటే చట్టంచే నియంత్రించబడేది కాదు, నిజంగానే ఒక నాగరిక సమాజాన్ని- సృష్టించాలనుకుంటే, అప్పుడు ప్రతీ సమాజంలో పిల్లాడు పుట్టిన దగ్గరనుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను మొదలుపెట్టడం చాలా ముఖ్యం.
 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)