సారస్వతం

సాహిత్యంలో చాటువులు-6

-  ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు   


 

 పూర్వం కలసి ఉన్న వేదాలని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము
అధర్వణవేదము అని విభజించి కృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసునిగా కీర్తింప బడ్డాడు. అతడే
పదునెనిమిది పురాణాలు,పదునెనిమిది ఉపపురాణాలు,భారత,భాగవతాది మహాగ్రంథాలు
రచించి. “వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే” అని పూజలందు కొంటున్నాడు.
అట్లే భారత,భాగవతాది రచనలకు ముందే “ఆదికవి వాల్మీకి ఆదికావ్యం రామాయణం రచించి”
ప్రాతఃస్మరణీయుడు అయినాడు. ఈ భూమిపై నదులు,పర్వతాలు,ప్రకృతి,జీవకోటి ఉన్నంత
కాలం పై సాహిత్యం రత్నాకరంలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆసముద్రంలో మునకలు వేసి
సాహిత్య రత్నాలను సేకరించి, ఆనందించడమే మన కర్తవ్యం. సముద్ర తరంగాలవలె
వివిధ రూపాలలో ఉన్న సాహిత్యంలోని ‘చాటు’సాహిత్యాన్ని మనం ఇప్పుడు అస్వాదిస్తున్నాము.
అలంకారాలలో వ్యాజస్తుతి, వ్యాజనింద అనే అలంకారం ఉంది. పైకి నిందలా కనపడిన లోపల అంటే అంతరార్థం చూస్తే స్తుతి కనపడుతుంది. అటువంటి చాటువులని ఇప్పుడు చూద్దాం.
“భ్రాత్రుహంతా పితృహంతా/ మాతృహంతా చ యః పుమాన్/
త్రయేతే చ మహాభక్తాః / ఏతేషాంచ నమామ్యహం//”
భ్రాత్రుహంతా = అన్నని చంపించినవాడు.
పితృ హంతా = తండ్రిని చంపించిన వాడు.
మాతృ హంతాచ = తల్లిని చంపినవాడు.
యః పుమాన్ = ఎవరైతే ఉన్నారో
త్రయేతేచ = ఆ ముగ్గురు.
మహాభక్తా: = గొప్ప భక్తులు.
ఏతేషాం చ = ఆ ముగ్గురికి.
నమామ్యహం = నమస్కరించుచున్నాను. అని అర్థం.
“అన్నని,తండ్రిని, తల్లిని చంపినవారు మహాభక్తులు ఎలావుతారు? వారుపాపాత్ములు కదా! మరి వారికి నమస్కరించడం ఏమిటి?” ఇది పైకి కనపడేభావం. కాని అంతరార్థం పరిశీలిస్తే “అన్నని చంపిచినవాడు ‘విభీషణుడు’ రామునిచేత పాపాత్ముడైన రావణుని చంపించి లోక కల్యాణానికి
కారణమైన మహాభక్తుడు.”
ఇక తండ్రిని చంపించిన వాడు. ‘ ప్రహ్లాదుడు.’ లోక కంటకుడైన హిరణ్య కశిపుని నరసింహస్వామిచేత సంహరింపజేసిన పరమ భక్తుడు ప్రహ్లాదుడు.
తల్లిని చంపినవాడు ‘పరశురాముడు.’ తండ్రి జమదగ్ని ఆజ్ఞను అనుసరించి తల్లి (రేణుకాదేవి)ని చంపి, తండ్రి వరం కోరుకోమనగా తల్లిని బ్రతికించమని కోరుకొని, మాతా, పితరులను భక్తితో సేవించిన గొప్ప భక్తుడు ‘పరశురాముడు’ ఆయన సాక్షాత్ నారాయణుని అవతారం.
“ ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనకాది” పరమ భక్తుల వరుసలో ప్రహ్లాదుడు, విభీషణుడు కూడా కీర్తించ బడ్డారు. పరశురాముడు సాక్షాత్ భగవంతుడే కనుక వారికి నమస్కరించుట పుణ్య ప్రదమే కదా!” చూశారా! పైకి తప్పుగా కనిపించినా లోపల ఎంత గొప్ప అర్థాన్నిదాచుకొని ఉందో పై చాటు శ్లోకం. ------- ఇట్టిదే మరొకటి.
“ ప్రాతః ద్యూత ప్రసంగేన/ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతాం/
నక్తం చొరప్రసంగేన/ కాలో గచ్ఛతి ధీమతః//” అర్థం.
ప్రాతః = ఉదయంపూట. ద్యూత ప్రసంగేనా = జ్యూదం గురించి మాటాడుకొంటూ.
మధ్యాహ్నే = మధ్యాహ్నసమయంలో. స్త్రీ ప్రసంగాతాం = స్త్రీ గురించి మాటాడుతూ
నక్తం =రాత్రుళ్ళు. చోరప్రసంగేన = దొంగల గురించి ప్రసంగిస్తూ.
ధీమతః= బుద్ధిమంతులు (లేక పెద్దలు.) కాలో గచ్ఛతి= కాలాన్ని గడుపుతారు. ఏ మాశ్చర్యం! బుద్ధిమంతులు, ఉదయం జూదం గురించి, మధ్యాహ్నం స్త్రీని గూర్చి, రాత్రి దొంగలను గూర్చి మాటాడుకొంటూ కాలం గడుపుతారట! పై వాటిని గూర్చి చర్చించుకొనే వారు బుద్ధిమంతులు ఎలా అవుతారు. చాల విచిత్రంకదా! ( క్రింది వివరణ చదవకుండా కొంచం ఆలోచించి ఈ చాటువులో విశేషం ఏమిటో తెలుసుకొందుకు ప్రయత్నించండి.తెలియ లేదా అయితే.) ఇప్పుడు విశేషార్థం చూడండి.
“ కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముఖ్య కారణం శకుని మాయాజ్యూదమేకదా! ఆకథ మహాభారతం లో ఉంది కనుక ‘ద్యూత ప్రసంగం’ అంటే (ఉదయం) మహాభారతాన్ని చదువుతూ, అట్లే సీతాదేవిని అపహరించటం వలెనే కదా! రామ రావణ యుద్ధంజరిగి లోక కంటకుడైన రావణుడు అంతరించాడు. ఈ చరిత్ర కలిగినది రామాయణం. స్త్రీ ప్రసంగం అంటే (మధ్యాహ్నం పూట) రామాయణాన్ని చదువుతూ, వెన్న దొంగిలించడం,గోపికల (భక్తుల) వస్త్రాల్ని, మనసులని దొంగిలించి, ‘గోపికా మానస చోరుడుగా కీర్తించ బడిన శ్రీకృష్ణ వృత్తాంతం కలిగిన గ్రంథం ‘శ్రీమద్భాగవతం’ నక్తం చోర ప్రసంగం అంటే రాత్రిపూట భాగవతం చదువుతూ” అనగా బుద్ధిమంతులు కాలాన్ని వృధాచేయకుండా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడుకాలాల్లో “మహాభారత, రామాయణ, భాగవతాది” గ్రంధాలు చదువుతూ కాలాన్ని సద్వినియోగం చేసుకొంటారు, అని పై చాటువుకి విశేషార్థం. చూశారా పై చాటువుల గొప్పతనం.

 

(వచ్చేనెల మరికొన్ని.)

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)