సారస్వతం

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం

- రచన :  వేమూరి వేంకటేశ్వరరావు   


 

3. బాహుబలం, నిర్మాణక్రమం

 
 

ర్బన రసాయనంలో అణువుల అమరిక ఎంత ముఖ్యమో తెలపటానికి మరొక ఉపమానం చెబుతాను. మనందరికీ 1, 2, 3, 4, వగైరా అంకెలు తెలుసు. ఇలాంటి అంకెలు రెండు కాని అంతకంటె ఎక్కువ కాని ఉంటే వాటిని సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 27, 476 అనేవి సంఖ్యలు. ఈ 476 అనే సంఖ్యనే తీసుకుందాం. ఇందులో 4, 6, 7 అనే మూడు అంకెలు ఉన్నాయి. ఇప్పుడు 746 అనే సంఖ్యని తీసుకొండి. ఇందులో కూడ 4, 6, 7 అనే అంకెలే ఉన్నాయి కాని ఇక్కడ వీటి అమరిక వేరు. అమరిక మారటంతో 476 విలువ ఒకటయితే 746 విలువ మరొకటి అయింది. ఆ మాటకొస్తే 467, 674, 746, 647, 764 అనే సంఖ్యలన్నిటిలోనూ ఒకే అంకెలు ఉన్నాయి, కాని వాటి స్థానాలు వేరవటంతో వాటి విలువలు వేర్వేరు అయేయి. 

మరొక ఉదాహరణ.  ప్రతి భాషలోను అక్షరాలు ఉంటాయి కదా. పలక అనే మాటలో ఉన్న ప, , క అనే తెలుగు అక్షరాలనే తీసుకుందాం.  వీటి స్థానాలని మారుగుళ్లు చేసి కలప అని రాసినప్పుడు మాట అర్థమే మారిపోయింది. పలక వేరు, కలప వేరు. ఈ అక్షరాలనే మరోలా అమర్చి లపక అనే మాట తయారు చెయ్యొచ్చు. కాని లపక కి అర్థం పర్థం లేదు. ఇదే విధంగా కొన్ని అణువులని ఒకలా అమర్చితే మనకి పరిచితమైన బణువు రావొచ్చు. మరొక విధంగా అమర్చితే మనకి పరిచయం లేకపోయినా పనికొచ్చే బణువు తయారవవొచ్చు. మూడో విధంగా అమర్చితే అర్థం పర్థం లేని బణువు తారస పడవచ్చు. ఇదొక కోణం. 

మరొక కోణం నుండి చూద్దాం. అంకెలని, అక్షరాలని అమర్చినప్పుడు మనకి సర్వసాధారణంగా ఆ అంకెలు కాని, అక్షరాలు కాని ఒక వరుసక్రమంలో ఎడమనుండి కుడికి కనిపిస్తాయి. కాని అంకెలని, అక్షరాలని ఒక గీత వెంబడి రేఖీయంగా లేక ఏక-మితీయంగా లేక ఏక-దిశాత్మకంగా (వన్ డైమెన్షనల్, one-dimensional గా) అమర్చాలని నియమం ఏముంది? సుడూకో ఆటతో పరిచయం ఉన్నవాళ్లకి అంకెలని నలుచదరంగా అమర్చటం వల్ల వచ్చే అవకాశాల గురించి తెలిసే ఉంటుంది. అదే విధంగా గళ్లనుడికట్టు (క్రాస్‌వర్డ్, crossword) ఆడే వాళ్లకి కాని స్క్రేబుల్ (Scrabble) అనే ఆటతో పరిచయం ఉన్న వాళ్లకి కాని అక్షరాలని రెండు దిశలలో అమర్చటం వల్ల వచ్చే సావకాశాలు తెలుస్తాయి. 

నిర్మాణక్రమం ఇంకా బాగా అర్థం అవటానికి చిన్న ఉపమానం చెబుతాను. ప్రతి అణువుకి కొన్ని చేతులు (లేదా బాహువులు) ఉన్నట్లు ఊహించుకుందాం. అమ్మాయిలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒప్పులగుప్ప ఆట ఆడరూ? అలాగే అణువులు తమ స్నేహితులయిన ఇతర అణువుల చేతులు పట్టుకోటానికి ఇష్టపడతాయని అనుకుందాం. ఇలా ఒకరి చేతులు మరొకరు పట్టుకోగా తయారయే గుంపులే బణువులు. అమ్మాయిలకి రెండేసి చేతులు ఉన్నాయని మనకి తెలుసు. అణువులకి ఎన్నేసి చేతులు ఉన్నట్లు? మనుష్యులకి మల్లే రెండు చేతులా? దేవుళ్లకి మల్లే నాలుగు చేతులా?  

ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే పరిమాణాత్మక విశ్లేషణ (క్వాంటిటేటివ్ ఎనాలిసిస్, quantitative analysis) చెయ్యాలి. రెండు ఉదజని అణువులు ఒక ఆమ్లజని అణువుతో కలిస్తే నీరు వస్తుందన్న విషయం పరిమాణాత్మక విశ్లేషణ ద్వారానే తెలిసింది. మన ఒప్పులగుప్ప ఉపమానం ప్రకారం ఒక ఆమ్లజని రెండు ఉదజని అణువుల చేతులు పట్టుకోవాలి కనుక ఆమ్లజని అణువుకి రెండు చేతులు, ఉదజని అణువు ఒకొక్కదానికి ఒకొక్క చెయ్యి ఉంటే సరిపోతుంది. ఇదే విషయాన్ని రసాయన పరిభాషలో చెప్పాలంటే ఆమ్లజని బాహుబలం 2, ఉదజని బాహుబలం 1 అని అంటాం. ఈ బాహుబలం అన్న మాట ఇంగ్లీషులోని వేలెన్సీ (valency) అన్న మాటకి తెలుగుసేత. లేటిన్ భాషలో వేలెన్సీ అంటే బలం. (ఇందులోంచే వేలర్ valor లేదా పరాక్రమం వచ్చి ఉంటుంది.) కనుక ఈ మాటని మనం బలం అని కాని మరికొంచెం వివరణాత్మకంగా ఉంటుందనుకుంటే బాహుబలం అని కాని అనొచ్చు. లేదా కొంచెం కుదించి బాలం అనొచ్చు. మనం "బాలం" అందాం. ఆ బాలం అన్న మాట వాలం లా ఉంది కదూ. అణువుల హ్రశ్వనామాల పక్క గీసిన చిన్న చిన్న గీతలు తోకలులా ఉన్నాయి కనుక మనం పెట్టిన బాలం అన్న పేరు బెంగాలీవాడి వాలం లా ఉందని చమత్కరించుకోవచ్చు.

అణువులని రకరకాలుగా అమర్చి బణువులని చేసేటప్పుడు, వాటి అమరికలని బొమ్మలు గీసి చూపడం రివాజు. బొమ్మలు వాడడానికి నిశ్చయించుకున్నాము కనుక కొంచెం వెనక్కి వెళ్లి, ముందుగా కర్బనం, ఉదజని, ఆమ్లజనుల అణువులని వాటి బాహువులతో చూపెడతాను. ఈ దిగువ బొమ్మ (బొమ్మ 3.1) చూడండి.

బొమ్మ 3.1 బాలం ని గీతలతో చూపే విధానం.

ఈ బొమ్మలో ఉదజని (H) కి ఇటో, అటో ఒక చిన్న గీత గీసి, ఆ గీతని ఉదజని యొక్క బాహువు (చెయ్యి, హస్తము) అని అనుకోమంటున్నాను. ఈ చిన్న గీత H కి కుడి పక్కనో, ఎడం పక్కనో, మీదనో, కిందనో, ఏటవాలుగానో ఎక్కడ గీసినా పరవా లేదు. ముఖ్యమయిన విషయం ఏమిటంటే ఉదజనికి ఒకే ఒక చెయ్యే ఉన్నట్లు ఊహించుకోవాలి. (ఉదజనికి ఒకే ఒక చెయ్యి ఉందన్న విషయం ఎలా నిర్ణయం అయిందో ప్రస్తుతానికి మనకి అవసరం లేదు.)  ఈ చేతితో ఉదజని అణువు మరొకరి చేతిని పట్టుకోగలదు. లేదా రసాయన పరిభాషలో ఉదజని బాలం 1. 

ఆమ్లజనికి (O కి) ఇటూ, అటూ కూడ ఒక గీత గీసేము. అంటే ఆమ్లజనికి రెండు చేతులు ఉన్నాయన్నమాట. ఈ రెండు చేతులూ ఎడం పక్క, కుడి పక్క ఉండాలనే నియమం ఏదీ లేదు; ఎక్కడయినా ఉండొచ్చు. తన రెండు చేతులతో ఆమ్లజని అణువు ఇతరుల చేతులు రెండు పట్టుకోగలదు. కనుక రసాయన పరిభాషలో ఆమ్లజని బాలం 2. 

ఆమ్లజనికీ, ఉదజనికీ ఉన్నట్లే ప్రతి అణువుకి కొంత బాలం ఉంటుంది. ఉదాహరణకి గంధకం (సల్ఫర్, Sulfur) యొక్క బాలం 2, నత్రజని (నైట్రొజన్, Nitrogen) యొక్క బాలం 3, భాస్వరం (ఫాస్వరస్, Phosphorus) యొక్క బాలం కొన్ని సందర్భాలలో 3, మరికొన్ని సందర్భాలలో 5.  ఆ మాటకొస్తే కొన్ని మూలకాలకి బాలం 0 (సున్న). ఈ మూలకాలకి బాహువులు లేవన్న మాట. వీటిని కావలిస్తే నిర్బాహువులు (నిర్భాగ్యులు కాదు) అనొచ్చు. డబ్బు లేని వాళ్ళ సంపర్కం ఎవ్వరికీ ఎలాగ అక్కరలేదో అలాగే నిర్బాహులయిన నిర్భాగ్యపు మూలకాలతో సంయోగం చెందటానికి ఏవీ ఇష్టపడవు. నియాను (Neon), ఆర్గాను (Argon) వంటి వాయువులు ఈ జాతికి చెందినవి. కావలిస్తే వీటిని నిర్భాగ్యపు వాయువులు (ఇనర్ట్ గేసెస్, inert gases) అనొచ్చు. 

ఈ తికమకలు అన్నీ ఇప్పుడే చెబితే గాభరా పుడుతుంది. కనుక ప్రస్తుతానికి నేర్చుకున్నది చాలు. వీటన్నిటికంటె ముఖ్యమైన కర్బనం (కార్బన్, Carbon) యొక్క బాలం 4 అని చెప్పేసి ఊరుకోకుండా ఈ విషయాన్ని ఒక కొంటెబొమ్మలా గీసి ఈ దిగువ చూపిస్తున్నాను (బొమ్మ 3.2).

బొమ్మ 3.2. కర్బనపు అణువుకి నాలుగు చేతులు చూపే కొంటెబొమ్మ.

 

ఇప్పుడు రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు రసాయన సంయోగం చెందేయనుకుందాం. ఒకొక్క ఉదజనికి ఒకొక్క చెయ్యి ఉన్నాది కదా. ఒక ఆమ్లజని అణువుకి రెండు చేతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆమ్లజని అణువు ఒకొక్క చేత్తో ఒకొక్క ఉదజని అణువు చెయ్యి పట్టుకుందనుకుందాం. అప్పుడు వాటి అమరిక H-O-H లా ఉంటుంది (లేదా, బొమ్మ 3.3 లో లా కూడ చూపించవచ్చు). ఈ అమరికనే నిర్మాణక్రమం (structural formula) అని అన్నాం.

బొమ్మ 3.3 నీరు నిర్మాణక్రమం

సర్వ సాధారణంగా ఆ అణువుల అమరిక మూడు దిశలలోకి వ్యాప్తి చెంది ఉంటుంది. మరొక విధంగా చెబుతాను. ఒక  అణువుని మరొక అణువుకి తగిలించినప్పుడు ఆ అమరికలు తిన్నగా చీపురు పుల్లలాగా ఉండవు, పల్చగా అప్పడాలలాగా ఉండవు; ఆ బణువులు మూడు దిశలలోనూ వ్యాపించి ఉంటాయి. ఒక బణువులో ఏ అణువు ఏ అణువుకి ఎటుపక్క ఉందో నిర్ద్వందంగా చూపించాలంటే పూసలు-పుల్లల నమూనాలు (బాల్ అండ్ రాడ్ మోడల్స్, ball and rod models) ఉపయోగించాలి. మచ్చుకి డైమెతల్ ఈథర్ అనే పదార్థంలోని అణువుల అమరిక పూసలు-పుల్లల నమూనాలో ఎలా ఉంటుందో ఈ దిగువ బొమ్మ (బొమ్మ 3.4) లో సరదాకి చూపిస్తున్నాను; త్వరలోనే వీటి గురించి విపులంగా చెబుతాను. ఈ బొమ్మలో మధ్య (ఎర్రగా) ఉన్నది ఆమ్లజని అణువు. దానికున్న రెండు చేతుల తోటీ రెండు కర్బనం (నల్లగా ఉన్నవి) అణువులని పట్టుకున్నాది. ఈ రెండు కర్బనం అణువులూ వాటికి ఇంకా ఖాళీగా ఉన్న మూడు చేతులతోటీ మూడేసి ఉదజని (తెల్లటివి) అణువులని పట్టుకున్నాయి.

బొమ్మ 3.4 డైమెతల్ ఈథర్ యొక్క పూసలు-పుల్లల నమూనా. ఇక్కడ ఎర్రటి పూస ఆమ్లజని అణువు, నల్ల పూసలు కర్బనపు అణువులు, విభూతి రంగు పూసలు ఉదజని అణువులు. 

కాగితం మీద కాని, కంప్యూటరు తెర మీద కాని ఇటువంటి బొమ్మలు గీసి చూపించటం అంత తేలిక కాదు. అందుకని ఇటుపైన అణువుల అమరికని సులభమైన పద్ధతిలో గీసి చూపిస్తాను. వీటిని చదును నిర్మాణక్రమం (ఫ్లేట్ స్ట్రక్చరల్ ఫార్ములా, flat structural formula) అందాం. ఈ రోజుల్లో రసాయనశాస్త్రపు పాఠ్య పుస్తకాలలో ఇంతకంటె మంచి బొమ్మలు, రంగులలో, వేస్తున్నారు. ఆ రకం బొమ్మల కంటె నేను ఇక్కడ గీసి చూపించే బొమ్మలు అర్థం చేసుకోవటం తేలిక. విషయం అర్థం అయిన తరువాత  క్లిష్టమయిన బొమ్మలు అర్థం చేసుకోవటం తేలిక.

బొమ్మ 3.5 డైమెతల్ ఈథర్ యొక్క చదును నిర్మాణక్రమం. ఈ బొమ్మని పూసలు-పుల్లలు నమూనాతో పోల్చి చూడండి. ఈ చదును నిర్మాణక్రమాన్ని ఇంకా చదును చేసి మరొక చోట చూపిస్తాను.

బాలం (వేలెన్సీ, valency) అంటే ఏమిటో ఈ పాటికి అర్థం అయి ఉండాలి. ఈ బాలం అనే ఊహనం (కాన్‌సెప్ట్, concept) ఉపయోగించి, నిర్మాణక్రమం అనే కొత్త ఊహనాన్ని ప్రవేశపెట్టి, ఎతల్ ఆల్కహాలు, డైమెతల్ ఈథరు తెచ్చి పెట్టిన చిక్కు సమస్యని మన బెర్‌జీలియస్ ఎలా పరిష్కరించేరో చూద్దాం. ఈ రెండింటి సాంఖ్యక్రమము సి2ఎచ్6ఒ C2H6O అని అనుకున్నాం కదా. ఈ సి2ఎచ్6ఒ (C2H6O) లో రెండు కర్బనపు అణువులు ఉన్నాయి కదా. ఒకొక్క కర్బనానికి నాలుగు చేతులు. వీటిల్లో ఒక చేతితో పక్కనున్న కర్బనపు అణువు చేతిని పట్టుకుందనుకుందాం. అప్పుడు ఒకొక్క దానికి మూడేసి ఖాళీ చేతులు (రిక్త హస్తాలు) చొప్పున మొత్తం ఆరు ఖాళీ చేతులు ఉంటాయి. ఈ ఆరు ఖాళీ చేతులకీ ఆరు ఉదజని అణువులని తగిలించెస్తే సరిపోలా? మరి మిగిలిపోయిన ఆమ్లజని సంగతి? ఈ ఆమ్లజని అణువుని కూడా ఇరికించాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలనీ బొమ్మలు గీసి చూపించటం తేలిక.

ఈ ఉపోద్ఘాతంతో సి2ఎచ్6 (C2H6O) లో ఉన్న అణువులని ఎలా అమర్చవచ్చో చూద్దాం. నిబంధనలు ఏమిటంటే మన దగ్గర ఉన్న అణువులన్నిటిని వాడెయ్యాలి. ఏ చేతినీ ఖాళీగా ఒదిలెయ్యకూడదు. దీన్ని పరిష్కరించటం అంత బ్రహ్మవిద్య ఏమీ కాదు. ఈ సి2ఎచ్6ఒ (C2H6O) లో రెండు కర్బనపు అణువులు ఉన్నాయి కదా. ఒకొక్క కర్బనానికి నాలుగేసి చేతులు. వీటిల్లో మొదటి అణువు ఒక చేతితో పక్కనున్న రెండవ కర్బనపు అణువు చేతిని పట్టుకుందనుకుందాం. అప్పుడు రెండు కర్బనపు అణువుల గొలుసు ఒకటి తయారయింది కదా. ఈ గొలుసులో ఒకొక్క కర్బనానికి మూడేసి ఖాళీ చేతులు (రిక్త హస్తాలు) చొప్పున మొత్తం ఆరు ఖాళీ చేతులు ఉంటాయి. ఈ ఆరు ఖాళీ చేతులకీ ఆరు ఉదజని అణువులనీ తగిలించెస్తే సరిపోయింది కదా. మరి మిగిలిపోయిన ఆమ్లజని సంగతి? ఈ ఆమ్లజని అణువుని కూడా ఇరికించాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాలనీ ఈ దిగువ బొమ్మలో చూపిస్తున్నాను, (బొమ్మ 3.6 చూడండి.)
 

బొమ్మ 3.6.క               బొమ్మ 3.6.

బొమ్మ 3.6. క. లో ఎతల్ ఆల్కహోల్ బణువులో అణువుల అమరిక చూపేను. బొమ్మ 3.6. చ. లో డైమెతల్ ఈథర్  బణువులో అణువుల అమరిక చూపేను. ఈ రెండు అమరికల మధ్య తేడా అతి స్వల్పం. ఎతల్ ఆల్కహోల్ లో -ఒ-ఎచ్ (-O-H) అనే అణువుల గుంపు ఉంది చూడండి. డైమెతల్ ఈథర్ లో ఈ -ఒ-ఎచ్ (-O-H) కనిపించదు. ఈ బండ గుర్తుని జ్ఞాపకం పెట్టుకుంటే ఏది ఏదో గుర్తుపట్టటం తేలిక. రసాయన ద్రవ్యాలలో ఈ -ఒ-ఎచ్ (-O-H) అణువుల గుంపు తరచు తారసపడుతూ ఉంటుంది. పదే పదే వచ్చే అమరిక కనుక దీనికి ఒక పేరు పెట్టేరు. దీనిని -ఒ-ఎచ్ గుంపు (లేదా -OH group) అని కాని హైడ్రాక్సిల్ గుంపు (hydroxyl group) అని కాని పిలుస్తారు. ఇక్కడ హైడ్రాక్సిల్  అంటే ఏమిటి? హైడ్రొజన్ లో హైడ్రొ ని ఆక్సిజన్ లో ఆక్సి ని సంధించగా వచ్చిన మాటే హైడ్రాక్సిల్.రసాయన ద్రవ్యాలలో ఆల్కహోలు అన్న పేరు ప్రత్యయంగా వచ్చే ప్రతి పదార్ధంలోను ఈ హైడ్రాక్సిల్ గుంపు కనిపించి తీరుతుంది. అంటే ఈ హైడ్రాక్సిల్ గుంపు ఆల్కహోలు జాతికి ఒక చిహ్నం.

పోతే, పై రెండు బొమ్మలలోనూ మరొక గుంపు కనిపిస్తోంది. ఆ గుంపులో ఒక కర్బనపు అణువు, మూడు ఉదజని అణువులు ఉన్నాయి. ఈ గుంపుని టూకీగా మనం సిఎచ్3 (-CH3) అని రాయవచ్చు. ఎతల్ ఆల్కహోలులో ఒక సిఎచ్3 (-CH3) గుంపు ఉంది, డైమెతల్ ఈథర్ లో రెండు సిఎచ్3 (-CH3) గుంపులు ఉన్నాయి. ఇప్పుడు ఈ గుంపులని గుర్తించటం నేర్చుకున్నాము కనుక, పైన బొమ్మలలో చూపించిన నిర్మాణక్రమాలని టూకించి, వాక్యం మధ్యలో, ఒక మాట రూపంలో, రాయొచ్చు. ఈ పద్ధతిలో ఎతల్ ఆల్కహోలు ని ఎచ్3సిసిఎచ్2ఓఎచ్ (H3CCH2OH) అని రాస్తారు. ఇలా రాసినప్పుడు ఎతల్ ఆల్కహోలులో ఎడం పక్కన సిఎచ్3 (-CH3) గుంపు, మధ్యలో సిఎచ్2 (-CH2) గుంపు, కుడి పక్కన ఓఎచ్ (-OH) గుంపు ఉన్నట్లు తెలుస్తోంది కదా. (సిఎచ్3 (-CH3) అని రాసినా, ఎచ్3సి (-H3C) అని రాసినా అర్థం ఒకటే). ఇదే విధంగా డైమెతల్ ఈథర్ ని ఎచ్3సిఒసిఎచ్3 (H3COCH3) అని రాసినప్పుడు ఎడం పక్కన సిఎచ్3 (-CH3) గుంపు, మధ్యలో ఒక ఆమ్లజని అణువు O), కుడి పక్క మరొక సిఎచ్3 (-CH3) గుంపు ఉన్నట్లు తెలుస్తోంది కదా. కనుక బొమ్మలు గీసే ఓపిక, సౌకర్యం లేని వారు ఈ బారు క్రమం (లీనియర్ ఆర్డర్, liner order) లో నిర్మాణక్రమాన్ని చూపించవచ్చు. ఈ వ్యాసాలలో అవసరం వెంబడి ఈ రెండు పద్ధతులు వాడుతూ ఉంటాను, ఎందుకంటే బొమ్మల అందం బొమ్మలదే. రాత సౌలభ్యం మాట దేవుడెరుగు!

పోతే, గమనించదగ్గ మరొక విషయం. C2H6O ని రెండే రెండు విధాలుగా అమర్చవచ్చు. మూడో విధంగా అమర్చటానికి అవకాశం లేదు. నా మాట మీద నమ్మకం లేక పోతే కాగితం, కలం తీసుకుని ప్రయత్నించి చూడండి. ఒక బణువులో ఉన్న కర్బనపు అణువుల సంఖ్య పెరుగుతూన్న కొద్దీ ఈ అమరికల సంఖ్య కూడా పెరుగుతుంది. ఉదాహరణకి సి12ఎచ్28 (C12H28) అనే బణువుని  803 విధాలుగా అమర్చవచ్చు. అంటే సి12ఎచ్28 (C12H28)  కి 803 సమభాగులు (ఐసొమర్స్, isomers) ఉన్నాయి! (నా మాట నమ్మండి. అన్నీ ఉన్నాయో లేదో అని ప్రయత్నించి చూడటం మొదలెడితే పిచ్చెక్కి పోవచ్చు!) ఈ సమభాగులన్నీ వివిధమైన లక్షణాలు కలిగి ఉండాలన్న నిబంధన ఏదీ లేదు. ఒక తల్లి పిల్లల మధ్య  పోలికలు ఉండొచ్చు, లేక పోవచ్చు; ఇక్కడా అంతే. కనుక ప్రతి సమభాగిని నిశితంగా పరీక్షించి చూడాల్సిందే!

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)