శీర్షికలు

పద్యం - హృద్యం

- రచన : పుల్లెల శ్యామసుందర్    


 

సమస్యాపూరణము:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా (padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య:

క్రోధంబే సుగుణమగును కోమలికెపుడున్

గతమాసం సమస్య:

కందకు లేనట్టి దురద కత్తికిఁ బట్టెన్

 

ఈ సమస్యకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

 

శివప్రసాద్ చావలి,సిడ్నీ
కం.
అందములన్ వడ్డించగ
కందెరల ముడుచు చెలి పతి ఘన హితునిన్ - ఏ
మందుము సామెత నెన్నగ
కందకు లేనట్టి దురద కత్తికిఁ బట్టెన్

కం.
నిందించిన చింతించకు
విందున తిండి నియమముల వివరణ లీయన్!
అందువె ఆప్తులని? వలదు!
కందకు లేనట్టి దురద కత్తికిఁ బట్టెన్

మాగంటి శ్రీనివాసమూర్తి (మా మూర్తి), ఒంగోలు
కం//
కొందరి మనసున విభజన
అందరికామోద మగునె? అన్యాయంబే
తొందర పాటున జేసిన
కందకు లేనట్టి దురద కత్తికిఁ బట్టెన్

వారణాసి సూర్యకుమారి ,మచిలీపట్టణం
కం//
ముందుగ హితోక్తులు వినక
విందు వినోదముల నుండ విసిగిన మిత్రుల్
కుంది యతని నిట్లందురు
కందకు లేనట్టి దురద కత్తి కి పట్టెన్

డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశంజిల్లా.
కం//
ఎందుకు ఆంధ్రుల విభజన
పొందుగ శాసనసభలన పొసగదు అన్నన్
ముందుకు దూకెను కేంద్రము
కందకు లేనట్టి దురద కత్తికిఁబట్టెన్

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
కం:
మందమతి కెక్కదుగ, పొగ
మందును అమ్మెడి విపణియె మంచిని వ్రాయన్
చందము చూడగ తోచును,
కందకు లేనట్టి దురదయు కత్తికి బట్టెన్!

జంధ్యాల కుసుమ కుమారి
కం//
కుందె మనంబున యా భృగు
నందనుడు బలి వర దాన నియమోధ్ధతికిన్
తొందరగ యడ్డు కొనెనొకొ
కందకు లేనట్టి దురద కత్తికి కల్గెన్
 


 
 

పద్యాలలో నవ రసాలు(16 భాగం) 
- భైరవభట్ల కామేశ్వరరావు

ఊపి ఊపి మనసు నొక్కొక్క వేదన...

 

మేను మృదుశయ్య సగము, నా మేని మీద

సగముగా జేర్చికొని ముద్దు మిగుల నిద్ర

సేయునట్టి నీవిప్పుడు చెనటి నేల

దనువు వొందుట కోర్చితే తండ్రి! చెపుమ

 

హా! యను, ధర్మరాజ తనయా! యను, నన్నెడబాయ నీకు జ

న్నే! యను, దల్లి నేప జనునే! యను, గృష్ణుడు వీడె వచ్చె రా

వే! యను, నొంటివోక దగవే! యను, నేగతి బోవువాడ నే

నో యభిమన్యుడా! యను, బ్రియోక్తుల నుత్తర దేర్పవే! యనున్ 

ఈ రెండు పద్యాలూ శోకసంతప్తులైన సుభద్రార్జునుల మాటలు. ముంచుకు వస్తూన్న మహా దుఃఖమనే ఒక పెను తుఫానుకు, పెను సునామీకి, ప్రమాదసూచికలాంటిది అభిమన్యుని మరణ సన్నివేశం. యుద్ధం మిగిల్చే వేదన తొలిసారిగా అనుభవానికి వచ్చేది (అటు పాత్రలకూ, యిటు పాఠకులకూ కూడా!) బహుశా యీ ఘట్టంలోనే అని నేననుకుంటాను. ముక్కుపచ్చలారని పసివాడు, కొత్త పెళ్ళికొడుకు, తమకున్న ఒక్కగానొక్క కొడుకు అభిమన్యుడు. "సగం శరీరం మృదువైన పానుపుపైనా, మరొక సగం నా మీదా చేర్చి నిద్రపోయే నువ్వు ఈవేళ కటికనేల మీద ఎలా పడుకున్నావురా నా తండ్రీ!" అని విలపించింది సుభద్ర. అభిమన్యుడంటే అర్జునుడికెంత ప్రేమో ధర్మరాజుకూ అంతే ముద్దు. అందుకే, గతించిన కుమారుని పరిపరివిధాల పిలిస్తూ, "ధర్మరాజ తనయా!" అన్నాడు అర్జునుడు

యుద్ధానికెప్పుడూ ముగింపు ఒక్కటే - తీరని శోకం. మహాకావ్యాలైన రామాయణ మహాభారతాలు మనకి చెప్పే సత్యమిది. పరమశాంతి లభించడానికి ముందరి మెట్టు శోకాగ్నిలో మరిగి కరగడమే కాబోలు! శాంతరసప్రధానంగా ముగిసే భారతంలో చివర ఒక పర్వం పర్వమంతా కేవలం శోక ప్రవాహం కోసమే వ్యాసుడు వెచ్చించాడు అంటే మరి అందుకేనేమో. రామాయణం చివరనున్న సీత అగ్నిప్రవేశ ఘట్టం కూడా శోకభరితమైనదే కదా!  

కురుక్షేత్ర యుద్ధరగంగంలో నిహతులైన తమ బంధుజనాన్ని చూసి స్త్రీలు చేసే విలాపమే స్త్రీపర్వం. ఈ పర్వంలో సర్వ స్త్రీ దుఃఖానికీ నిలువెత్తు ప్రతిరూపంగా, మూర్తీభవించిన శోకదేవతలా, గాంధారీదేవి కనిపిస్తుంది. ఇంతటి విలయానికి కారణభూతునిగా శ్రీకృష్ణుని నిలిపి, రోదించే ప్రతి స్త్రీ వద్దకు అతన్ని తీసుకువెళ్ళి ఆ హృదయవిదారకమైన దృశ్యాలను చూపిస్తూ నిలదీస్తుంది

అట్టలకడ నుత్తమాంగముల్ గానక

            యలమట నలుగడ లరయువారు

దలలు చేతుల గొని తనువు లత్తలమున

            దఱచు పీనుగులలో దడవువారు

శిరములు మేనుల జేర్చి భావించి ని

            జాస్యముల్ వ్రేసి కొంచఱచువారు

తునియలు పెక్కైన బనివడి గూర్చి రూ

పులు గనుంగొని మూర్చ మునుగువారు

 

నైన కౌరవపాంచాల మానినీ జ

నముల నచ్యుత చూడుము నాథ జనక

పుత్ర సోదర శవముల పొంత కేగి

పెక్కు దురవస్థ లొందెద రక్కటకట 

రణరంగంలో పడి ఉన్న శరీరాలలో కొందరివి తలలు లేని మొండెములు, కొందరివి మొడెములు కనిపించని తలలు. కనిపించని తలల కోసం నలుదిక్కులా వెతికేవాళ్ళు కొందరైతే, కనిపించిన తలలను చేతబట్టుకొని, ఈటెలతో శవాలను తోసుకుంటూ, మొండెముల కోసం వెతికేవారు మరికొందరు. అలా ప్రయత్నించగా, తలలు శరీరాలు కనిపించి వాటిని రెండింటినీ దగ్గరకు చేర్చి, వాళ్ళ బ్రతికున్నప్పటి రూపాలను ఊహించుకుంటూ, తలలు బాదుకొని ఆరుస్తున్నవారు కొందరు. ముక్కలుముక్కలైపోయిన శరీరాలను ఎంతో ప్రయత్నంతో దగ్గరకు చేర్చి, వాళ్ళ రూపాలను చూసి మూర్చబోతున్నవారు మరి కొందరు. ఇలా కురు పాంచాల దేశాల ఆడవాళ్ళు, తమ తమ భర్తలనూ, తండ్రులనూ, కొడుకులనూ, అన్నదమ్ములనూ పోగొట్టుకొని, వాళ్ళ శవాల దగ్గరకు వెళ్ళి పడుతూన్న దురవస్థలను, చూడు "అచ్యుతా!" అని విపులంగా వాటిని వర్ణిస్తూ చూపిస్తుంది గాంధారి. అలాంటి శోక మహాసముద్రంలో కొట్టుకుపోకుండా శ్రీకృష్ణుడు కాబట్టి "అచ్యుతు"నిగా నిలబడ్డాడేమో కాని, సామాన్యులమైన మనకు అది శక్యం కాదు. స్త్రీపర్వాన్ని సాంతం ఒక్కసారి చదవడం అయ్యే పని కాదు. కొద్దికొద్దిగా చదివే వారికైనా, కడుపు చుమ్మలుచుట్టి, కళ్ళలో నీళ్ళు తిరగక మానవు.

శోకభావము రసస్థాయిని చేరుకుంటే అది కరుణము. హృదయాలను ద్రవింపజేసే శక్తి కరుణరసానికి ఉన్నట్లు మరే రసానికీ లేదనడం అతిశయోక్తి కాదు. "బాలుడు మొదలు వృద్ధుడు వరకును గల మనుష్యసమూహ మొక్కపెట్టున దనయందు లయమై సుఖపారవశ్యము నందునటుల జేయుటలో నీ కరుణరస మెల్ల రసములలో నగ్రస్థాన మలంకరించి యున్నది" - అన్న శ్రీ కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రిగారి మాట సత్యం. ఇష్టమైన వారి చావు, అనిష్టములైన మాటలు, మొదలైన బాధ కలిగించే విషయాల కారణంగా ఉద్భవించే శోకంనుండి కరుణరసం ఉత్పన్నమవుతుందని భరతుడు చెప్పాడు. కన్నీళ్ళు, నిట్టూర్పు, శరీరం పాలిపోవడం, నీరసించిపోవడం, గుండెలు బాదుకోవడం, స్మృతి కోల్పోవడం మొదలైనవి అనుభావాలు. నిర్వేదం, చింత, భ్రమ, విషాదం, దైన్యం, ఉన్మాదం, అపస్మారం మొదలైనవి సంచారీభావాలు. "రౌద్రాత్తు కరుణోరసః" అని చెప్పింది నాట్యశాస్త్రం. అంటే కరుణము రౌద్రరసం నుండి జనించింది అని. మనిషి క్రోధంతో చేసే పనులవల్లనే శోకం పుడుతుందన్నమాట

"కరుణ" పదానికి సంస్కృతంలో అర్థభేదాలున్నాయి. "కరుణః" అన్న అకారాంత పుంలింగ పదానికి శోకం స్థాయిభావంగా గల కరుణరసమని అర్థం. "కరుణా" అన్న ఆకారాంత స్త్రీలింగ పదానికి దయ, జాలి, కనికరము అని అర్థం. "కరుణామయుడు", "దాశరథీ కరుణాపయోనిధి" అనే పదాలలో ఉన్న దీర్ఘాంతమైన "కరుణా" పదం దయని సూచిస్తుంది. రసాన్ని సూచించేటప్పుడు దీర్ఘం ఉండదు, "కరుణరసం" సరైన పదం, "కరుణారసం" కాదు. తెలుగులోకి వచ్చినప్పుడు "కరుణః" - "కరుణము" అవుతుంది. "కరుణా" - "కరుణ" అవుతుంది. అంచేత "కరుణము" అంటే కరుణరసం. "కరుణ" అంటే దయ

కరుణరసానికి కవిత్వంలో చాలా గొప్ప స్థానం ఉంది. "శోకార్తస్య ప్రవృత్తోమే శ్లోకో భవతు నాన్యథా" అన్న వాల్మీకి మాటలో, కవిత్వావిర్భావ మూలాలు శోకంలోనే ఉన్నాయని గుర్తించవచ్చు. ఆదికావ్యమైన రామాయణం సర్వత్రా కరుణరసనిర్భరమే. అందుకే ఉత్తరరామచరితంలో కరుణరసాన్ని అత్యుత్తమస్థాయిలో నిర్వహించిన భవభూతి "ఏకో రసః కరుణ ఏవ" అన్నాడు. మన కంకంటి పాపరాజు కూడా, రాముడు తనని అడవులలో విడిచిపెట్టి రమ్మన్నాడన్న కటిక నిజం తెలిసినప్పటి సీతాదేవి స్థితిని పరమకరుణాత్మకంగా వర్ణించాడు. పాపం ఆ స్థితిలో కూడా, ఇక తాను రాముని, రాముడు తననూ కళ్ళారా చూసుకోలేరే అని దుఃఖిస్తుంది ఆ పిచ్చితల్లి

ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును; నన్నిక రామచంద్రుడున్

గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణ మేల పో

దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు; నాదు మే

నున్నది; చెంత గంగమడు గున్నది; యైనటు లయ్యెడున్ దుదిన్ 

రామాయణ మహాభారతాలే కాక ఇతర పురాణకథల్లోనూ కరుణరసం విస్తృతంగానే కనిపిస్తుంది. ఒక పరమభక్తుని భక్తి కాని, ఒక మహారాజు ధర్మదీక్ష కాని నిగ్గు తేలాలంటే వారు శోకాగ్ని తప్తులు కావలసిందే! హరిశ్చంద్రుని కథలోనూ నలచక్రవర్తి కథలోనూ, ధర్మవీరానికి అంగంగా కరుణమే హృదయాలను హత్తుకుంటుంది

కరుణరసానికున్న మరొక విశేషం ఏమిటంటే, దీనికి ఆలంబన మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా కావచ్చును. శృంగార విషయంలో అయితే అది రసాభాసం అవుతుంది. శరీరాలను విషయంలో రసోత్పత్తికి ఆటంకం లేదు. అంటే పశుపక్ష్యాదుల బాధలో కూడా మనిషి మనసు తన్మయత చెందగలదన్న మాట. భాగవతంలోని కుళింగపక్షుల వృత్తాంతం చదివితే ఇది చక్కగా అవగతమవుతుంది. బోయవాని వలలో చిక్కిన కుళింగి(ఆడ) పక్షిని చూసి కుళింగ(మగ) పక్షి పొందిన ఆవేదనను దుఃఖతీవ్రతను పోతన కరుణరసస్ఫోరకంగా రచించాడు

ఱెక్కలురావు పిల్లలకు ఱేపటి నుండియు మేత గానమిన్‌

బొక్కుచు గూటిలో నెగసి పోవగ నేరవు మున్ను తల్లి యే

దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్‌

దిక్కులు చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు? నక్కటా! 

రెక్కలు రాని తన పిల్లలు, ఎగరలేక గూటిలోనే ఆకలితో ఉండి, తల్లి ఏ దిక్కునుండి తమకు రోజూ ఆహారం తెస్తుందో ఆ వైపే చూపులు తిప్పకుండా నిక్కినిక్కి చూస్తూ ఉంటే, వాళ్ళ దీనత్వాన్ని నేనెలా భరించనని వాపోయే ఆ మగపక్షి విలాపం మనసులని ద్రవింపజేస్తుంది

జంతుపాత్రలతో మరొక అత్యంత కరుణరసాత్మకమైన సన్నివేశం, ప్రసిద్ధమైన ఆవుపులి కథలో కనిపిస్తుంది. అనంతామాత్యుడు రచించిన భోజరాజీయంలోని కథ యిది.  

మునుమును బుట్టె నాకు నొక ముద్దులపట్టి యతండు బుట్టి యే

డెనిమిది నాళ్ళపాటి గల డింతయు పూరియు మేయనేర డే

జని కడుపార జన్ గుడిపి చయ్యన వచ్చెద నన్ను బోయిర

మ్మని సుకృతమ్ము గట్టుకొన్నుమన్న దయాగుణ ముల్లసిల్లగన్!

 

ఏ నఱ్ఱు నాకుచుండగ

దా నను నండగొని చెవులు దాలవయిచుచున్

మేనెరుగక యుండెడు నా

కూనకు నెవ్వారు దిక్కొకో యిట మీదన్ 

పులికి చిక్కిన ఆవు తన లేగదూడ కోసం పడే ఆవేదన ఆ మాటలనిండా ధ్వనిస్తాయి

కొడుకు చనుగ్రోలుతున్నంత దడవు దల్లి

యడుగు దిరుగక, కదలక, యన్యచిత్త

గాక, పై నీగ సోకిన గదలకుండె

నెమ్మి బాషాణధేనువు నిలిపినట్లు 

తన దూడ పాలు తాగుతూన్నంత సేపూ తనపై ఈగ వాలినా కూడా కదలక మెదలక ఒక రాతివిగ్రహంలా నిలబడి ఉందట. మళ్ళీ మళ్ళీ అలాంటి అవకాశం రాదన్న ఆర్తితో కాబోలు

నిన్ను గని యిన్ని దినములు

చన్నిచ్చితి నేను ఋణవశంబున నిక నీ

వెన్నడు నన్ను దలంపకు

మన్న మమత్వంబు విడువుమన్న మనమునన్ 

ఇక తనకూ వాడికీ ఋణం తీరిపోయిందనీ తనపై మమకారం వదులుకోమని కన్నకొడుకుతో చెప్పే అప్పగింత మాటలు మనసుని ఆర్ద్రమొనరిస్తాయి

"బే" యను "దల్లీ నీవెట

పోయెద?" వను "నన్ను డించి పులివాత బడం

బోయెదవే!" యను "జెల్లం

బో" యను "నింకేటి బ్రతుకు పోనాకు" ననున్ 

ఇది తల్లి తన్ను విడిచిపోతోందని దూడ పడే దుఃఖం. "బడం బోయెదవే", "జెల్లంబో" అనే పద ప్రయోగాల వల్ల, పద్యం చదువుతూ ఉంటే, ఆ దూడ బేలగా "అంబా!" అని అరుస్తున్నట్టే ఉంటుంది. ఈ విధంగా గోవ్యాఘ్రసంవాదంలో, ఆవు చూపే సత్యవీరానికి అంగంగా కరుణరసం ఎంతో హృద్యంగా పోషింపబడింది

ప్రాచీనసాహిత్యంలో ప్రబంధయుగానికి వచ్చేసరికి కరుణరసానికి ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఆధునికకవిత్వం ఆ లోటును భర్తీ చేసిందని చెప్పవచ్చు. ఆధునికకవిత్వంలో అతి విస్తారంగా పోషింపబడిన రసం కరుణమే. ఇందులో అనేక పోకడలు కూడా కనిపిస్తాయి. దీనికి రెండు కారణాలని నేను ఊహిస్తున్నాను - ఒకటి ఆధునికయుగంలో ఏర్పడిన సాంఘికపరిస్థితులు, రెండు పాశ్చాత్య సాహిత్యప్రభావం. పాశ్చాత్యసాహిత్యంలో విషాదాంత కావ్యాలకూ నాటకాలకూ చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ ప్రభావం ఆధునిక కవిత్వంపై ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఆధునికాంధ్ర కవిత్వానికి ఆద్యునిగా చెప్పుకొనే గురజాడ కవిత్వంలో ప్రసిద్ధి పొందిన కన్యక, పూర్ణమ్మ వంటి కవితలు విషాదాంతాలే.  

బలబల కన్నుల కన్నీరొలికెను

పుత్తడి బొమ్మకు పూర్ణమకు

కన్నులు తుడుచుకు కలకల నవ్వెను

పుత్తడి బొమ్మా పూర్ణమ్మ

వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు

తల్లియు కంటను తడిబెట్టన్

కాసుకు లోనై అల్లుని చూసుకు

ఆనందించెను అయ్యొకడె 

అనే ఖండిక చదువుతూ ఉంటే మనసు మెలిపడక మానదు. సాంఘిక దురాచారాలపై తన నాటకంలో హాస్యం ద్వారా వ్యంగ్యాస్త్రాన్ని సంధించిన గురజాడ, కవిత్వంలో మాత్రం కరుణరసం ద్వారా మనసులను ఆర్ద్రం చేసారు.

వ్యథార్థజీవుల యథార్థగాథలు వినుతిస్తూ, నవీనగీతాలు సమాజంలోని దైన్యాన్ని కరుణరసాత్మకంగా కవిత్వంలోకు తీసుకువచ్చాయి. విద్వాన్ విశ్వంగారి పెన్నేటిపాట ఒక కన్నీటిపాట

ఈ యేటి కాల్వ లోతుల

పాయలుగా పారు, నీటి ప్రతి బొట్టున, నీ

చాయల రైతుల నెత్తుటి

చాయలు సమ్మిళితమై విచారము గొల్పున్‌

 

ఎఱ్ఱటెండ ప్రొద్దు, ఏడు మూరల గడ్డి

మోపు మెడలపైన, మూడుమట్ల

లోతు కనులు, పొట్టలో వీపు జేరెను

వగడు వోలె నతడు వణకుచుండె.

 

ఆ నిమిష మతని జూచిన

ఏ నరమానవుని గుండెయే యయినన్‌, లో

కానికి శాపమిదేయని

వేనోళ్ళను విచ్చి యేడ్చి విఱవిఱలాడున్‌. 

అంటూ సీమ రైతుల, రైతుకూలీల దీనావస్థను హృదయాన్ని కరిగించేలా చిత్రిస్తారు

సాంఘికదురాచారాలూ, అసమానతలూ, బీదరికము - ఆధునిక కవిత్వంలో కరుణరస నిష్పత్తికి చేకూరిన కొత్త ఆలంబనలు.  

శిలలు ద్రవించి యేడ్చినవి, జీర్ణములైనవి తుంగభద్రలో

పలి గుడిగోపురంబులు, సభాస్థలులైనవి కొండముచ్చు గుం

పులకు, చరిత్రలో మునిగిపోయినదాంధ్ర వసుంధరాధిపో

జ్జ్వల విజయప్రతాపరభసం బొక స్వప్నకథా విశేషమై 

అంటూ, గతించిన వైభవాన్ని తలుచుకొని కూడా ఆధునికకవి శోకసంతప్తుడయ్యాడు.  

కరుణరసమే ప్రధానంగా ఏర్పడిన ప్రక్రియకూడా ఒకటి పాశ్చాత్య ప్రభావంతో ఆధునికకవిత్వంలోకి ప్రవేశించింది. అది ఎలిజీ. ఎలిజీ అంటే స్మృతికావ్యం అని తెలుగులో పేరుపెట్టుకున్నాం కాని దీని మూలమైన "ఎలిగాస్" అనే పదానికి అర్థం - విషాదం, శోకం. అంచేత, ఎలిజీ అంటే పోయినవాళ్ళ గొప్పతనాన్ని ఏకరువుపెట్టి వారిని కీర్తిశేషులను చెయ్యడం కాదు. వారితో ఉన్న గాఢమైన అనుబంధంనుండి పుట్టిన వేదన రసాత్మకంగా నివేదించడం. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ఎలిజీ పెద్దన పేర ప్రసిద్ధమైన "ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి" అనే పద్యం అని భావించవచ్చు

"ఆంధ్ర కవితా పితామహ అల్లసాని

పెద్దన కవీంద్ర!" యని నన్ను పిల్చునట్టి

కృష్ణరాయలతో దివికేగలేక

బ్రతికియున్నాడ జీవచ్ఛవంబ నగుచు 

అనడంలో ఎంతటి ఆర్తి ధ్వనిస్తోందో చూడండి! ఆధునికకాలంలో వచ్చిన ఎలిజీలలో నాయని సుబ్బారావుగారు తన కుమారుని కోల్పోయినప్పుడు వ్రాసిన "విషాదమోహనం" అనే స్మృతికావ్యం ఆద్యంతం కరుణరసాత్మకమైనది. కొడుకు గుర్తుగా అతని చేతి గడియారాన్ని పెట్టుకొని అతను ఎంతగా దుఃఖిస్తారో చూడండి. కొట్టుకొనే గడియారంలో కొడుకు గుండెచప్పుడు వినే ఆయన విషాదం మన గుండెలను కలిచివేస్తుంది

ఈనాడు నీ గడియారమిట్లు ధరించి నా తండ్రి!

ఆనాటి నీ కోర్కి తీర్చ గంటెరా! యశ్రువుల్ దొరుగ

దీనిని ధరియించలేను; వలదంచు తీయను లేను,

దీని యాగని కొట్టుకొనుట నీ గుండెతీరై ధ్వనించె 

ఇక, ఆధునికకవిత్వంలో కరుణరసానికి నిలువెత్తు నీరాజనం పట్టిన కవి, పేరులోనే దాన్ని పొదువుకున్న కరుణశ్రీ జంధ్యాలపాపయ్యశాస్త్రిగారు. అతనికి ప్రతీ వస్తువూ కరుణరసమయంగానే కనిపించింది. తపోభంగ ఘట్టంలో రతీదేవి శోకమైతేనేమి, కర్ణుని విడిచిపెట్టే కుంతీవిలాపమైతేనేమి, పతినెడబాసిన యశోధర అయితేనేమి, ఆతని కలంలో పురాణ చారిత్రక పాత్రలెన్నో కరుణరసభరితాలై మనసులను తాకుతాయి. మనుషులు కాదు, పశుపక్ష్యాదులు కాదు, పూలగుండెలలో దాగిన ఆర్తినికూడా వెలికితీసి ఆలపించిన ఘనులువారు

"ఊలు దారాలతో గొంతు కురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము" 

అంటూ సాగే ఆ పుష్పవిలాపానికి కదిలిపోని తెలుగు హృదయం ఏది! రాధలో కూడా యీతనికి విరహం కాక విషాదమే దర్శనమిచ్చింది

ఇదియది యంచు దేల్చి వచియింపగరాని విషాదమేదియో

హృది కదలించుచున్నది దహింపగసాగె నిరాశ శుష్కమౌ

బ్రదుకును స్నిగ్ధశీతల కృపారసధారల దుర్దినమ్మునే

సుదినము సేయరా యదుకిశోర కృశాంగి ననుగ్రహింపరా 

"ఇదియది యంచు తేల్చి వచియింపగరాని విషాదం" ఉంది చూసారూ, దాన్ని తెలుగు కవిత్వంలోకి తీసుకువచ్చి ఫేషను చేసింది భావకవిత్వం! ఆధునికకవిత్వంలో ఎన్నో కొత్తపుంతలు తొక్కిన కరుణరసం, భావకవిత్వంలో మరొక సరికొత్త రూపు ధరించింది. అది పూర్తిగా వైయక్తికమైన, ఆత్మాశ్రయమైన ఒక మహాశోకం. "ఎవ్వరని యెంతురో నన్ను? ఏ ననంత శోకభీకర తిమిరలోకైక పతిని!" అని తనను తాను పరిచయం చేసుకుంటాడు భావకవి.  

"మీరు మనసారగా నేడ్వనీరు నన్ను - నన్ను విడువుడు! ఒకసారి నన్ను విడిచినంత, ఏకాంత యవనికాభ్యంతరమున వెక్కివెక్కి రోదింతును - విసువు లెక, విరతి లేక, దుర్భరశోక విషమ గీతు లేడ్చివైతు; ఎలుంగెత్తి ఏడ్చివైతు"  

అంటూ మనసారా ఒక్కపెట్టున ఎలుగెత్తి ఏడవాలన్నది యీ కవి తీరని కోరిక! ఈతని దుఃఖాన్ని చూసి సర్వప్రకృతీ కలత చెందుతుంది. "కోకిలమ్మ కోయని గొంతునెత్తి" యేడుస్తుంది. "దారి బోయెడు మందపవను డొకడు జాలిగ నొక్క నిట్టూర్పు" విసురుతాడు. కురిసే వాన కూడా యీ కవికి కన్నీరే

"ఎంత బరువయ్యేనో గాని యెడద వెలికి

తొలగి పారని దుఃఖాశ్రు జలము వలన

ప్రావృడంభోధరస్వామి, నీవు కూడ

నా వలెనె జాలి వొడమ వాపోవుచుంటి

ఒక్క టొక్కటె కన్నీటి చుక్క లొలుక

నేడ్వలేక యేడ్వ లేక యేడ్చుచుంటి" 

అందుకే "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అయ్యింది! అలా ఏడ్చి యేడ్చి అలసిపోయాక కూడా

ఊపి ఊపి మనసు నొక్కొక్క వేదన

కావ్య మౌను, మరియు గానమౌను

నేటి బాధ నన్ను మాటాడగానీని

ప్రళయమట్లు వచ్చిపడియె పైని! 

అని మూగగా వాపోతాడు. అచ్చంగా యిదే కాకపోయినా, ఇలాంటి వేదనకే ఒక సిద్ధాంతస్థాయిని కల్పించిన కవి విశ్వనాథ సత్యనారాయణ. దానిని వారు "జీవుని వేదన" అన్నారు. భావకవిత్వంలో వేదన కేవలం హృద్గతమైనదిగా కనిపిస్తే, విశ్వనాథ కవిత్వంలోని జీవునివేదన సామాజికము, సాంసారికము, ఆధ్యాత్మికము అనే మూడు స్థాయిల్లో కనిపిస్తుంది. నిజానికి యీ జీవునివేదన అనేది పూర్తిగా కొత్త విషయమేమీ కాదు

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్

నీవే తప్ప నితఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్

రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా! 

అన్న గజేంద్రుని కుయ్యిలో దాగి ఉన్నది జీవునివేదనే.  

స్వామిద్రోహము జేసి యేనొకని గొల్వంబోతినో కాక నే

నీమాటన్విన నొల్లకుండితినొ నిన్నేదిక్కుగా జూడనో

యేమీ యిట్టి వృథాపరాధినగు నన్నీ దుఃఖవారాశివీ

చీమధ్యంబున ముంచియుంపఁదగునా శ్రీకాళహస్తీశ్వరా!  

అన్న ధూర్జటి ఆర్తిలో కనిపించేదీ జీవునివేదనే

కరుణరసం గురించి భవభూతి చెప్పిన వాక్యాన్ని అతని తర్వాత లాక్షణికు లెవరూ అంతగా పట్టించుకున్నట్టు లేరు. విశ్వనాథవారు దీనిని వ్యాఖ్యానించారు. అతని వ్యాఖ్యలో యిలా అంటారు

'ఏకో రసః కరుణ ఏవ" అన్న సిద్ధాంతము ప్రతిపాదించిన మహాకవి మానవుడు సహజంగానే దుఃఖవంతుడనియు, దుఃఖము జీవలక్షణము నందలి ప్రధానాంశమనియు, తత్పరిహరణ మెవ్వడును చేయలేడనియు, వాని సర్వమైన లౌకిక ప్రవర్తనయు దుఃఖమూలమనియు భావించి యుండవలయును

ఈ భావననుండి పుట్టినదే జీవునివేదన. సిద్ధాంతపరంగా వ్యాఖ్యానించడమే కాక, తన సకలోహవైభవమైన రామాయణకల్పవృక్ష కావ్యమంతటా కూడా యీ "జీవునివేదన"ని రసమార్గంలో నిర్వహించి చూపించారు విశ్వనాథ. నాయకుడైన రామునిలోనే మనకిది మూర్తీభవించి కనిపిస్తుంది. ఏ రాక్షససంహారమైనా శ్రీరామచంద్రునిలో మిగిల్చేది దుఃఖాన్నే. "వారెందుకలా దుర్మార్గులై తన చేత మృత్యువాత పడుతున్నారు!" అని.

తల్లి కౌసల్యతో పలికే యీ మాటలలో, రామునిలోని వేదన చక్కగా ధ్వనిస్తుంది.  

అమ్మా! దేహమనన్ విచిత్రమగు దుఃఖారామ మన్పించు దే

హమ్మున్నంతన జీవి పొందనగు బాధా సహ్యతల్ చెప్ప శ

క్యమ్మా? యొక్కొక జీవి యొక్కొక విధంబై పొందు దుఃఖమ్ము, రా

జ్యమ్మో! రాణియొ, కాననంబొ, ఋషి భార్యారత్నమో చెప్పగన్

ఈ వేదనే శోధనకు దారితీసి, అంతులేని తీరాలను దాటుకూంటూ, రాక్షసప్రకృతి బారినపడ్డ తన ఆత్మస్వరూపాన్ని గూర్చి అన్వేషించి, ఆ వికృతిపై విజయాన్ని సాధించినప్పుడు, అప్పుడయినా ఉపశమనం లభిస్తుందా? లోకం సందేహమనే రూపంలో అడ్డం వస్తుంది. నిన్ను నువ్వు శోకాగ్నిలో దహించివేసుకొని ఆ అనుభవంలో నిగ్గుదేలినప్పుడే చివరకు శాంతి లభించేది. అందుకే శాంతరసం ఆఖరిమెట్టు అయితే, దాని ఉపధ కరుణరసం. ఇంక వచ్చే నెల ఆ చివరిమెట్టు కాస్తా ఎక్కేద్దాం!

ందాకా ఆలోచనకు - విప్రలంభశృంగారంలో కూడా బాధ, దుఃఖమూ ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మరి అక్కడ పండే రసం శృంగారమా? కరుణమా? ఉదాహరణకు, వనవాసంలో సీతాదేవి దూరమైనప్పుడు రాముడు అనుభవించిన వేదన విప్రలంభశృంగారమా? కరుణరసమా? విరహిణి అయిన రాధిక కృష్ణుని గూర్చి పడే బాధ ఏమిటి? - ఆలోచించండి.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)