ధారావాహికలు

మరీచికలు (సాంఘిక నవల) - 5

- రచన : వెంపటి హేమ. 


 

దేవాలయ ప్రాంగణమంతా చెత్త చెదారంతో నిండి గలీజుగా, అసహ్యంగా ఉంది. గర్భగుడి తలుపులు మూసి తాళం వేసి ఉన్నాయి. ఆ తాళం కప్ప బాగా తుప్పు పట్టి ఉంది. ప్రిన్సుకి ఒకసారి అనిపించింది, "ఈ గుడిలో దేవుడున్న జాడే లేదు, పూజకోసం కామాక్షి ఈ గుడికి ఎందుకు వచ్చినట్లు" అని .

కాని అతనికి ఆ విషయం మీద దృష్టి నిలిపి ఆలోచించే సావకాశం లేకపోయింది. గుడి మీది శిల్పాలే కాకుండా కొండ మీదనుండి చూస్తే కనిపించే ప్రకృతి అందాలు కూడా అతన్ని ఆకట్టుకుని, ఇతరవిషయాలను తలపోయనీకుండగా చేశాయి. అతడు వాటిని తన కెమేరాలో బంధించడంలో నిమగ్నుడైపోయాడు. వెలుగు తగ్గకముందే వీలైనన్ని ఎక్కువ ఫొటోలు తియ్యాలన్న తొందరలో ఉన్నాడు అతడు. ఇక ఇతర విషయాలమీద అతని మనసు నిలవలేదు.

దేవాలయ ప్రాంగణమంతా గాలికి ఎగిరి వచ్చిన దుమ్మూ - ధూళీ, చెత్తా - చెదారం లాంటి ఎన్నోరకాల వ్యర్ధ పదార్ధాలతొ నిండి ఉంది. అదేమీ పట్టించుకోకుండా ప్రిన్సు గుడిచుట్టూ తిరుగుతూ గుడి గోడలపై చెక్కబడ్డ శిల్పాలను వివిధ భంగిమలలో ఫొటొలు తీయసాగాడు. రీలు అయిపోతే కొత్తరీలుకి మారుస్తూ. దేవాలయ శిల్పాలనీ, కొండనీ, కొండమీదనుండి కనిపించే ఊరినీ, ప్రకౄతినీ తనివితీరా ఫొటోలు తీశాడు. క్రమంగా వెలుగు తగ్గుతోంది. ఇంక వెలుగు చాలదు అనిపించాక అతడు కెమేరాని మూసి బుజానికున్న సంచీలో ఉంచాడు.
మనసు నిండిన ఆనందంతో, ఉషారుగా ఈలవేసుకుంటూ కొండదిగి బైక్ దగ్గరకు వచ్చాడు ప్రిన్సు. అక్కడ అతనికోసమే ఎదురుచూస్తూ నిలబడివుంది కామాక్షి. ఒక్కసారిగా అతని సంతోషం చప్పబడిపోయింది. ఆమెను మళ్ళీ బైక్ ఎక్కించుకోడం అన్నది అతనికి సుతలాం ఇష్టంలేదు. అలాగని ఆ నిర్జన ప్రదేశంలో తన చెల్లెలి వయసున్న ఆమెను ఒంటిగా వదలి పోడానికీ అతనికి మనస్కరించడం లేదు. చివరికి, ఈ ఒక్కసారికేలెమ్మని మనసు సరిపెట్టుకున్నాడు అతడు. బైక్ మీద ఇద్దరూ ఇంటిముఖం పట్టారు.
అవసరంలో ఉండి ఎవరైనా లిఫ్టు అడిగితే అతడు ఎవరికీ ఎప్పుడూ కాదన్నది లేదు.బొంబాయిలో ఉన్నప్పుడు అతడు చాలామందికే లిఫ్టు ఇచ్చి ఉన్నాడు. అలా అడిగినవారిలో ఆడపిల్లలూ ఉన్నారు. బైక్ మీద ఒద్దికగా కూర్చుని, తమ అవసరం గడుపుకుని "థాంక్సు" చెప్పి వెళ్ళీవారే కాని, వారిలో ఎవ్వరూ ఈ కామాక్షిలా మీదవాలి ప్రయాణం చేసినవారు లేరు. కామాక్షి తీరు ప్రిన్సుకి ఏమాత్రం నచ్చలేదు.
సూర్యాస్తమయం కావడంతో వెలుగు తగ్గింది. చెట్ల గుబురుల్లో పొంచివున్న చీకటి క్రమక్రమంగా వెలుపలకి వస్తోంది. అవి కృష్ణపక్షపు రోజులు కావడంతో క్షణ క్షణానికీ చీకటి చిక్కనౌతోంది. ఇరు వైపులా దట్టంగా పెరిగిన చెట్లవల్ల ఆ దారి మరీ చీకటి గుహలా ఉంది . హెడ్ లైట్ సాయంతో ఆ చీకటిని చీల్చుకుంటూ బైక్ ముందుకు సాగుతోంది. కామాక్షి యధాప్రకారం ప్రిన్సుని ఆనుకుని కూర్చుని తన్మయత్వంలో మునిగి ఉంది. వాళ్ళింకా అడ్డరోడ్డు మీదుండగానే బైక్ మామూలుకంటే ఎక్కువగా కుదుపుతోందని గ్రహించాడు ప్రిన్సు. ఆ అడ్డరోడ్డుమీద ఒక ఫర్లాంగ్ మేర, ఏటా వర్షాకాలంలో ఒక కొండకాలువ తాలూకు నీరు ప్రవహించడంవల్ల రోడ్డు మరింతగా పాడై ఉంది. అక్కడ నీటి ఉరవడికి మన్నంతా కొట్టుకుపోయి రాళ్ళు బయట పడ్డాయి. అక్కడికి చేరుకున్నాక ప్రిన్సు తాను దిగి, కామాక్షిని కూడా దిగమన్నాడు. కామాక్షికి దిగక తప్పలేదు . ప్రిన్సు టైర్లను పరీక్షించి చూశాడు . రెండు టైర్లలోనూ గాలి చాలావరకు తగ్గిపోయింది. అతనికి ఆశ్చర్యమయ్యింది. రెండు టైర్లూ ఒకేసారి ఎలా పంక్చర్ అయ్యాయా - అని తికమక పడ్డాడు . " అయ్యో! రెండూ ఒకేసారి ఫ్లాటయ్యాయి" అంటూ ఉద్వేగంతో కేకపెట్టాడు.
పొంగులా పైకి ఉబికివచ్చిన ఆనందాన్ని దాచుకుంటూ , లేని దిగులుని ప్రదర్శిస్తూ, " పాడు పిల్లలు ఊరుకోరు కదా! కొంటె తనానికి గొడ్లని కాసే కుర్రాళ్ళెవరో ఏ ముల్లో గుచ్చివుంటారు. మన మిప్పుడు ఇల్లు చేరడం ఎలాగ " అంది కామాక్షి ఏడుపుమొహం పెట్టి .
"ఇంకేముంది దారి, నడకే! నేను నడవగలను, నీ సంగతే .... " అర్ధకుసిగా మాట ఆపేశాడు ప్రిన్సు.
కావాలని అతనివైపు బేలగా చూసింది కామాక్షి. " ఈ అడివిదారిలో బళ్ళుగాని, రిక్షాలుగాని - ఏమీ దొరకవుకదా ... మరోదారి ఏముంది, నడవడం తప్ప! నేనూ మీతోపాటు నడుస్తా, మీరు ఒప్పుకుంటే చాలు" అంది గడుసుగా .
ఇక చెయ్యగలిగింది మరేముంది కనుక, "సరే" ననడంతప్ప!
ఆ డొంక దారిలో బండిని తోసుకుంటూ నడక సాగించాడు ప్రిన్సు. అతని పక్కనే అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తోంది కామాక్షి. క్రమ క్రమంగా చీకటి ముసురుకుంటోంది . ఋషి పక్షులు తోటలవెంట వెళ్ళిపోడంతో బూరుగుచెట్టు ఖాళీగా ఉంది . రాత్రి వేట సాగించే పక్షుల సందడి మొదలయ్యింది . మర్రిచెట్టు తొర్రలో గూడు కట్టిన గుడ్లగూబ నిద్ర లేచిన గుర్తుగా కేక పెట్టింది. ఎంత "ఎథేలెటిక్ బాడీ" అయినా టైర్లలో గాలి సరిగా లేని రాజదూత్ మోటారు సైకిల్ని తోసుకుంటూ అంత దూరం నడవడమన్నది మామూలు విషయం కాదుకదా! కామాక్షి నడవలేకపోతున్నా నని గునుస్తూ మరీ నెమ్మదిగా నడవడంతో ప్రిన్సు కూడా ఆమెతో సమంగా నడవక తప్పలేదు . నడిచే దూరం ఎంతకీ తరగటం లేదు. కాని, కదిలే కాలం ఏమాత్రం ఆగడంలేదు. ఆకాశంలో నక్షత్రాలు, చట్టూ పెరిగిన చెట్ల గుబురుల్లో మినుకుమినుకుమని మెరిసే మిణుగురులు దారి చూపుతూండగా ఆ చీకటి దారుల్లో నడిచి ఊరును సమీపించారు వాళ్ళు.
వీధుల్ని వెలుగుతో నింపుతున్న కరెంటు దీపాల్ని చూడగానే తేలికపద్ద మనసుతో గాఢoగా నిట్టూర్చాడు ప్రిన్సు. తొలి దీపస్తంభం క్రిందికి రాగానే అతడు రిష్టువాచీ కేసి చూసుకుని కంగారు పడ్డాడు . టైం పది దాటి ఇరవై నిమిషాలయ్యింది. అది అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించే వేళ!
ప్రిన్సుకి చాలా బడలికగా ఉంది . చెల్లెలు తోరిపిన వేడినీళ్ళతో స్నానం చేసి, అమ్మ వడ్డించిన కమ్మని భోజనం తిని, తనకై అమరివున్న మెత్తని పక్క మీదికి చేరి, ఆదమరచి హాయిగా నిద్రపోవాలన్న తహతహ బయలుదేరింది అతనిలో .
కామాక్షీ వాళ్ళ ఇల్లు ముందుగా రావడంతో అక్కడ ఆగాడు ప్రిన్సు. కామాక్షి అతనికి విజయగర్వంతో వీడ్కోలు చెప్పి, ఇంట్లోకి వెళ్లి పోయింది. బాధ్యత తీరడంవల్ల తెరిపినిపడ్డ మనసుతో ప్రిన్సు తమ ఇంటికి వెళ్ళాలని బైక్ ముందుకి తోశాడు. కాని అది కదలలేదు. ఆశ్చర్యంతో వెనక్కి తిరిగిన ప్రిన్సుకి నిలువెల్లా తెల్లాగా ఉన్న ఆకారం ఒకటి బైక్ ని పట్టుకుని ఉండడం కనిపించింది. మొదట్లో ఘోస్టుని చూసినట్లై బిత్తరపోయాడు, అంతలో సుబ్బులమ్మను ఆనవాలు పట్టి, మరింత తెల్లబోయాడు ప్రిన్సు . ఆమె తనను అలా ఎందుకు ఆపవలసివచ్చిందో అతనికి ఎంతమాత్రం అర్థం కాలేదు.
అంతలో ఆమె గొంతెత్తి అరవడం మొదలెట్టింది, "ఔరౌరా! అర్ధరాత్రిదాకా కన్నెపిల్లని బెల్లించి వెంట తిప్పుకుని, చీకటి చాటున గప్ చుప్ గా ఇంటిదగ్గర విడిచిపెట్టి తప్పించుకు పోదామనుకుంటున్నావా బాబూ! అదేం సాగదు. దీనికి నువ్వు జవాబు చెప్పి తీరాలి " అంది.
ఆ కేకలు విని, అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలంతో అప్పటికింకా నిద్రపోని జనం ఒకరొకరే, కిటికీల్లోంచి తొంగిచూడడం మొదలు పెట్టారు . నిద్ర పట్టక కొట్టుకుంటూన్నవాళ్ళు లేచి కూర్చున్నారు. "పొరుగింటి కయ్యం వినవేదుక" కదా ఎవరికైనా!
అసలు ఆమె అలా ఎందుకు గోలచేస్తోందో, తనను ఎందుకలా నిలబెట్టిందో, ఏమీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు ప్రిన్సు. అతనికి విపరీతమైన బడలికగా, ఎంతో ఆకలిగా ఉంది. విశ్రాంతి కోసం ఆతుర పడుతోంది అతని తనువూ, మనసూ కూడా ! " ఏమిటిది? వదలండి " అన్నాడు సుబ్బులమ్మ నుద్దేశించి కరుకుగా. సుబ్బులమ్మ ఇంకా రెచ్చిపోయింది ,
ఇంకా ప్రిన్సు ఇంటికి రాలేదేమా - అనుకుంటూ కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ రామేశం ఇంట్లోవాళ్ళూ , ఎప్పుడో మధ్యాహ్నమనగా ఇంట్లోంచి వెళ్ళిపోయిన కన్నెపిల్ల కామాక్షి ఇంకా ఇంటికి చేరలేదన్న ఆదుర్దాతో వెంకట సుబ్బయ్య గారి ఇంట్లోవాళ్ళూ అప్పటికింకా మెలకువగానే ఉన్నారు. హఠాత్తుగా సుబ్బులమ్మ గొంతుకు గట్టిగా వినిపించేసరికి అందరూ కంగారుపడుతూ బయటికి వచ్చారు. అది చాలక, చోద్యం ఏమిటో చూచి పోడానికి చుట్టుపక్కలవాళ్ళు కూడా నెమ్మదిగా ఒకరొకరే రాసాగారు. జనం పోగుపడినకొద్దీ, అందరూ తలోమాటా మాట్టడడంతో, అక్కడ కలకలం మొదలయ్యింది . అది విని వంటిల్లు సద్దుకుంటున్నవాళ్ళు కూడా పనులు మాని ఏమి జరుగుతోందో చూడాలని వచ్చారు.
జనం పెరిగినకొద్దీ సుబ్బులమ్మ గొంతుకూడా పెరిగిపోయింది . "చూడండి ఎంతబాగుందో! చేసీదంతా చేసేసి, ఏమీ ఎరగనట్లు నన్ను కసురుతున్నాడు! అర్దరాత్రి అయ్యింది, ఇంతవరకూ మా కామాక్షిని తన కూడా ఉంచుకుని,ఇప్పుడేమో సడి, చప్పుడు కాకుండా గుట్టుగా దాన్ని ఇంట్లో వదిలెయ్యాలని చూస్తున్నాడు. మీరే చెప్పండి, ఇదేమైనా బాగుందా? "గొడవపెంచడమే తన ధ్యేయమైనట్లు అరుస్తోంది సుబ్బులమ్మ. పేరుపేరునా ఒకరొకరినీ పిలిచి మరీ విషయం వివరించి, ఇలా ఆడపిల్లకు అన్యాయం చెయ్యడం తగునా" అని అడిగి,, వాళ్ళని న్యాయం చెప్పమని వేడుకోడం మొదలుపెట్టింది. జనమంతా ప్రిన్సుని దోషిగా బావించి అతనివైపు తిరస్కారంగా చూడసాగారు . ప్రిన్సుకి అది చాలా అవమానంగా, తల కొట్టేసినట్లుగా ఉంది .
గలాటా ఏమిటో చూడాలని బయటికివచ్చిన రామేశానికి, జనం మధ్యలో అసహాయంగా బైక్ పట్టుకుని నిలబడ్డ కొడుకు కనిపించాడు. వెంటనే ఆయన ఒక్కపరుగున కొడుకు దగ్గరకు వచ్చి "ప్రిన్స్ ! ఈ గొడవేమిటి? ఏమయ్యిందిట" అని అదిగాడు.
ప్రిన్సుకి ఏమి చెప్పడానికీ నోరు పెగల్లేదు. అతడు గొంతు సవరింసుకునీలోగా అక్కడ చేరినవాళ్ళలో ఒకడు కల్పించుకుని చెప్పడం మొదలెట్టాడు, " ఆ, ఏముందిట, చెప్పడానికి! అంతా కావరం, వయసు కావరం! మర్యాదస్థుల ఇంటి ఆడపిల్లని వాడుకుని, వదిలేసి వెళ్ళిపోయీ ప్రయత్నం! మేం ఊరుకుంటా మనుకోకండి. ప్రతి ఊరికీ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి . జరిగినదానికి మీ తండ్రీ కొడుకులు జవాబు చెప్పక తప్పదు" అంటూ పెద్దగా హడావిడి చేశాడు .
అక్కడే ఉన్న వారిలో పెద్దాయన ఒకరు జనాన్ని తోసుకుంటూ ముందుకి వచ్చాడు, సబవు చెప్పడానికి . "విషయం ఇంతదాకా వచ్చాక ఇంకా వేరే జవాబేమివుంటుంది ! ఓ మంచిరోజు చూసి ఇద్దరికీ ముడెట్టేస్తే సమస్య చక్కగా దానంతటదే పరిష్కారమైపోతుంది కదా " అన్నాడు.
ఆ మాట సుబ్బులమ్మకి బాగా నచ్చింది. "అద్గదీ సరైన మాట! అలా చెప్పండిబాబూ; ఒక అమాయకపు ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరు చూస్తూ ఊరుకోదని తెలియాలి" అంది సంతోషంగా , జనాన్ని మరింతగా కవ్విస్తో. .
సుబ్బులమ్మ ఇంత గోల ఎందుకు చేస్తోందో, తన కూతురు బ్రతుకు ఎందుకిలా రచ్చకెక్కిస్తోందో అర్ధంకాలేదు వెంకట సుబ్బాయ్యకు. "కానిమాటను కప్పెట్టుకోవాలి" అని కదా అంటారు, మరి ఇదేమిటి సుబ్బి ఇలా చేస్తోంది" అనుకున్నాడు బాధగా . కాని, ఎలాగా రచ్చకెక్కడం అయిపోయింది కనక, ఇక తాను సమయానికి తగినట్లుగా మాట్లాడి, పని సానుకూలపరచడమే మంచిది ఔతుంది " అనుకున్నాడు. వెంటనే వెళ్లి నేలమీద చతికిలపడి, రామేశం కాళ్ళు రెండూ గట్టిగా పట్టేసుకున్నాడు. "అన్యధా శరణం నాస్తి" అన్నట్లు దీనంగా మొహంపెట్టి తలపైకెత్తి ఆయన మొహంలోకి చూస్తూ , "విషయం ఇంత దూరం వచ్చాక మీరింక వాళ్ళ పెళ్ళికి ఔననక తప్పదు బావగారూ! ఆడపిల్ల గలవాళ్ళం, మా మీద దయ చూపించండి" అంటూ ప్రాధేయపడ్డాడు..
రామేశం ఆయన్ని లేవదీసి, జరుగుతున్న డ్రామాని ఆశ్చర్యంగా చూస్తూ దిగ్భ్రాంతితో స్థాణువులా నిలబదిఉన్న కొడుకు నుద్ధేసించి , "ఏమిట్రా, ఏమయ్యింది? ఏమిటిదంతా" అని నిలదీసి అడిగాడు .
ప్రిన్సుకి మాట్లాడాలంటే చాలా కష్టమయ్యింది . ఎంతో ప్రయత్నం మీద గొంతుక స్వాధీనంలోకి తెచ్చుకుని తండ్రికి జవాబు చెప్పాడు,"అంతా అభూత కల్పన నాన్నా! ఇందులో నేను చేసిన తప్పేం లేదు. నేను శిల్పాల్ని ఫోటోలు తియ్యడానికని కొండమీది గుడికి వెడుతూంటే, దారిలో కామాక్షి ఒంటరిగా గుడికి వెడుతూ, నడవడానికి కష్టపడుతూ కనిపించింది . "మొక్కుంది , పూజచేయించడానికి గుడికి వెడుతున్నా" - అని చెప్పింది . పోనీ కదాని , నేను లిఫ్టు ఇచ్చా. తిరిగి వస్తూంటే బైక్ టైరు పంక్చర్ అవ్వడం వల్ల నడిచి రావాల్సి వచ్చింది, అందుకే లేటయ్యింది. అంతే! వీళ్ళంతా చేరి అనవసరంగా గొడవ చేస్తున్నారు " అన్నాడు.
అతడింకా మాట పూర్తి చెయ్యకముందే అక్కడున్న జనం మోహ మొహాలు చూసుకుంటూ నవ్వడం ప్రారంభించారు. వారిలో ఒకరు కల్పించుకుని, "ఇదిగో అబ్బాయీ! అబద్ధమాడినా అతికేలా ఉండాలి గాని ఇలా కాదు. కొండమీది గుడి ఏనాడో మూతపడింది. నీకా సంగతి తెలియకపోవచ్చు గాని ఈ ఊర్లోనే పుట్టి పెరిగిన పిల్లకి తెలియదంటే ఎవరు నమ్ముతారు చెప్పు! వృధాగా శ్రమపడ్డావు, పాపం" అంటూ ఎద్దేవాగా మాటలాడాడు.
కంగు తిన్నాడు ప్రిన్సు. అతని ముఖం మ్లానమైపోయింది. అసలు తాను ఇటువంటి పరిస్థితిలో చిక్కుకోడమే అతనికి చాలా అవమానకరంగా ఉంది . దిగులుగా తండ్రివైపు చూస్తూ, "నేను చెప్పింది "సెంట్ పర్సెంట్ కరెక్ట్." ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజమ్. ఆ అమ్మాయినే పిలిచి అడగండి" అన్నాడు.
అతని మాటల్నిఖండించింది సుబ్బులమ్మ. "ఇదిగో బాబూ! ఎందుకొచ్చిన మాటలివి చెప్పు! నువ్వు నిజం ఒప్పేసుకోడమే మంచిపని. మా కామాక్షి నాకు అంతా చెప్పేసిందిలే, నువ్వు దానికి "ఐ లవ్ యూ" అని చెప్పావుటగా! పైగా "మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాము" అని కూడా ఆశ పెట్టవుట!! అసలు నువ్వు పెళ్ళాశ చూపందే, ఏ అయినింటి ఆడపిల్లా నీ వెంట పడి రాదు. ఆ సంగతి ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అనవసరంగా బుకాయించాలని చూడకు, ఎవరూ నమ్మరు. ఆశ పెట్టి, మోసం చెయ్యడం నీకు న్యాయమా " అంటూ కంట తడి పెట్టింది.
అంతవరకూ, కొడుకు తప్పు ఇందులో ఎంతవరకూ ఉంది -అన్న సందిగ్ధంలో ఉన్న రామేశం సుబ్బులమ్మ మాటలకు, ఆమె కన్నీళ్ళకు కరిగిపోయాడు. ఆయన మనసు పరిపరి విధాలుగా ఆలోచించ సాగింది . తను రాజేశ్వరిని ప్రేమించి పెళ్ళాడింది తన కొడుకు వయసున్నప్పుడే కదా ! ఇప్పుడు తను, కూతురు పెళ్లి ముందు చేసి, ఆ తరవాతే కొడుకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. కాని, తన కొడుకు పెళ్ళికి తొందర పడుతూన్నాడేమో! ఈ చిక్కులో పడక ముందే నాకు ఈ ఆలోచన వచ్చివుంటే ఎంత బాగుండేది - అనుకున్నాడు బాధగా.
"కామాక్షి ఎంతమాత్రం ప్రిన్సుకి తగిన వధువు కాదన్న సంగతి చూసినవాల్లందరికీ తెలిసీ విషయమే! ప్రిన్సు ఇంత తొందరపడ్డాడు ఎందుకో... కాని ఇప్పుడింక ఏమనుకొని ఏమి లాభం! " రామేశం మనసు వ్యధతో నిండిపోయింది
అంతలో వెంకటసుబ్బయ్య అందుకుని కన్నీళ్ళతో,. "అయ్యా, రామేశం గారూ ! మీకూ ఒక పెళ్ళీడు కొచ్చిన కూతురు ఉందికదా, నా కష్టం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఇలా నా బిడ్డ బ్రతుకు రచ్చకెక్కాక ఇక దాన్ని ఇంకెవరు కోడలుగా చేసుకుంటారు చెప్పండి ? మీరు కాదనడం ధర్మం కాదు. మీరు కాదంటే, ఇక దీనికీ జన్మలో వేరే పెళ్లి చెయ్యడం సాధ్యపడుతుందంటారా ? మీరే పెద్దమనసు చేసుకుని కామాక్షిని మీ కోడల్ని చేసుకోడం బాగుంటుంది . మా మీద కనికరం చూపించాలి. ఇక న్యాయమేమిటో మీరే సెలవియ్యండి స్వామీ" అంటూ ప్రాధేయ పడ్డాడు .
"ఔను, న్యాయమేమిటో రామేశం గారే చెప్పాలి, రామేశం గారే చెప్పాలి" అంటూ అక్కడ పోగుపడ్డవాళ్ళు కూడా కేకలు పెట్టారు.
ఒక్కసారిగా జరిగిన మోసమంతా కళ్ళ ఎదుట కనిపించినట్లయ్యింది ప్రిన్సుకి. షాక్ తిన్నట్లు ఉన్నబడంగా ఒళ్లంతా గరిపోడిచింది . "ఎంత మోసం" అనుకున్నాడు బాధగా. జ్వాలలా భగ్గుమన్న కోపంతో నిలువునా వణికాడు. పట్టు సడలడం వల్ల బైక్ క్రింద పడి పెద్ద శబ్దం చేసింది . కాని దాన్ని పట్టించుకున్న వారెవరూ లేకపోయారు .
కామాక్షి తన కొడుక్కి ఇల్లాలుగా ఎంతమాత్రం తగదని రామేశం గారి అభిప్రాయమైనా, విషయం ఇంత దూరం వచ్చాక, ఒక అమాయకపు ఆడపిల్లకు అన్యాయం జరగకూడదంటే ఇక వేరేగా మాట్లాడడం మంచిపని కాదు అనుకున్నాడు రామేశం. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నది అనుభవించక తప్పదు. ఆ పిల్లని వీడు పలకరించకుండా ఉంటే ఎంతో బాగుండేది. కాని అలా జరగలేదు కదా! ఇక ఈ జన్మకి వాడికి ఇంతే ప్రాప్తమని సరిపెట్టుకోక తప్పదు - అనుకుని మనసు సరిపెట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఆయన. ఒక ఆడపిల్ల జీవితం కష్టాలపాలు కావడం, అదీ తనకొడుకు మూలంగా - అన్నది ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. తన కొడుకు తనమాట కాదనడన్న గట్టి నమ్మకం ఉంది ఆయనకు. ఆ నమ్మకం తోనే ఆయన తన తీర్పు చెప్పాడు ......
" అందరూ వినండి, మా మూలంగా ఒక అమ్మాయి జీవితం పాడవ్వకూడదు. చి. సౌ. కామాక్షిని నేను నా కోడలిగా అంగీకరిస్తున్నాను" అంటూ అందరికీ వినిపించేలా ఎలుగెత్తి చెప్పాడు రామేశం .
"ఉసూరు" మన్నాడు ప్రిన్సు. అతని మనసు నిలువునా నీరైపోయింది . " మా నాన్నకు కూడా నా శ్రేయస్సు అక్కరలేకుండా పోయిన్దన్నమాట! ఎంత దురదృష్టం "అనుకున్నాడు దుఖంతో .
అతనిలో ఒకవిధమైన తెగువ చోటు చేసుకుంది . "అసత్యానికి సత్యం దాసోహమా? వీల్లేదు! ఒక్కనాటికి అలా జరగనీయను. ఎట్ ఎనీ కాస్ట్ !" అనుకున్నాడు మనస్పూర్తిగా . వెంటనే ఒక నిశ్చయానికి వచ్చాడు .
రామేశం తీర్పు విన్న సుబ్బులమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఈ శుభవార్త మేనకోడలికి చెప్పాలని ఇంట్లోకి పరుగున వెళ్ళింది . ప్రిన్సు తలెత్తి తీక్షణంగా అక్కడున్న వాళ్ళందర్నీ ఒకసారి పరికించి చూశాడు . తండ్రి వైపు చూసి మనసులోనే క్షమించమని అదిగాడు . ఆపైన ధృడమైన స్వరంతో అందరికీ వినిపించేలా చెప్పేశాడు, " నేనీ తీర్పుని ఒప్పుకోను. దీనికి ఒప్పుకుంటే, నేను చెయ్యని తప్పు చేసినట్లు ఒప్పుకోడం ఔతుంది! అది జరిగేపని కాదు . మా నాన్న ఆమెను కోడలిగా అంగీకరించినా, నేను మాత్రం ఆమెను నా భార్యగా చేసుకోడానికి ఒప్పుకోను. క్షమించండి" అన్నాడు ఖండితంగా .
అక్కడ చేరినవాళ్ళందరూ ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఎవరూ అతని మాటల్ని అర్ధం చేసుకునీ ప్రయత్నం చెయ్యలేదు."పితృ ధిక్కారం" అంటూ కేకలు పెట్టారు . ఏది ఏమైనా సరే ఒక అమాయకురాలిని కాపాడడం కోసం ఈ పెళ్లి జరిగి తీరాలి - అన్నారు మరికొందరు . మొత్తం మీద అంతా ప్రిన్సుని దుయ్యబట్టారు.., నలుగురి మధ్యా తండ్రిని అవమానించి ఆయన పరువు తీశాడని తూర్పారబట్టారు అందరూ కలిసి .
అసలే కొత్తగా తెరిచిన బ్యాంకు తాలూకు లావాదేవీలతో తలమునకలుగా సతమతమౌతూండడం వల్ల రామేశం బి.పి., ఆ ఊరు వచ్చినప్పటినుండి నెమ్మదిగా పెరగడం మొదలయ్యింది . ఈవేళ జరిగిన గందరగోళం దాన్ని తారస్థాయికి తీసుకెళ్ళడంతో ఆయనకు తిక్క తిక్కగా ఉంది . అందరూ తలోమాటా అని దాన్ని మరింతగా రెచ్చగొట్టారు . దాంతో ఆయనకు యుక్తాయుక్త జ్ఞానం తగ్గిపోయింది . అహంకారం బుసలుకొట్టింది ..
" నా మాట కాదని నలుగురిమధ్యా నా పరువు తీసినవాడు నా కొడుకు కాడు. నా కసలు కొడుకే పుట్టలేదనుకుంటా, .ఫో! నాఎదుటి నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడూ మళ్ళీ నీ మొహం నాకు చూపించకు" అంటూ కేకలు పెట్టాడు రామేశం .
ప్రిన్సు నిర్ఘాంతపోయాడు. కాని లొంగదల్చుకోలేదు గుండె రాయి చేసుకుని, ఒక్కసారి తల్లితండ్రుల్నీ, చెల్లెల్నీ కళ్ళారా చూసుకుని, తలవంచుకుని రైలు స్టేషన్ ఉన్న వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు . కామాక్షితో మాటాడి తిరిగి వచ్చిన సుబ్బులమ్మ జరిగింది తెలుసుకుని తెల్లబోయింది . .క్షణ క్షణానికీ దూరమౌతూ క్రమ క్రమంగా చీకట్లో కలిసిపోతున్న ప్రిన్సునే బిక్కమొహ వేసుకుని చూస్తూ బొమ్మలా నిలబడి పోయింది.
* * *

అక్కడ చేరిన జనమంతా ఎవరికి తోచినట్లు వాళ్ళు తలో మాటా అనేసి, ఆ తరవాత తమ బాధ్యత తీరిపోయిందన్నట్లుగా, ఒకరొకరే ఇంటిదారి పట్టారు . దిగులు నిండి బరువెక్కిన మనసుతో నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి నడిచిన రామేశానికి ఇల్లంతా శూన్యంగా, భార్యా కూతురూ శోక దేవతల్లా కనిపించారు. మనసంతా ఆవేదనతో ధగ్ధమౌతూండగా నిస్త్రాణగా సోఫాలో కూర్చుండిపోయాడు ఆయన . ఎవరికీ ఎవరినీ పలకరించాలన్న కోరిక లేకపోవడంతో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది . ఆ రాత్రి వాళ్ళకు కాళరాత్రే అయ్యింది .
వెంకట సుబ్బయ్యకు దుఖంతో ఒళ్ళు తెలియడం లేదు. ఆయన దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోతున్నాడు. ఒక్కతే కూతురు, ఆమెకు అంగరంగ వైభొగంగా పెళ్లిచెయ్యలి - అన్న ఆశ అడుగంటిపోగా, అసలు కూతురు పెళ్లి చెయ్యగలడో , లేడో - అన్న బెంగ పట్టుకుంది ఆయనకు.
"అన్నిహంగులూ ఉన్నప్పుడే ఆడపిల్లలకి సవ్యంగా పెళ్లి జరగి, చక్కగా కాపురం చేసుకోవాలంటే ఎంతో సుకృతముండాలి - అంటారు . అలాంటిది, రచ్చకెక్కి అపఖ్యాతి పాలైన నా కూతుర్ని ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు నే నేమిచెయ్యాలి దేవుడా " అనుకుంటూ బాధపడ్డాడు వెంకటసుబ్బయ్య .
" ఎంత పని జరిగింది! ఆ పిల్లాడు అంతలా తన కుటుంబాన్ని కూడా కాదని వెల్లిపోయాడంటే, అసలు తప్పు ఎవరిలో ఉందనుకోవాలి? అయినా మన బంగారం మంచిదయతే కదా " అన్నాడు వెంకటసుబ్బయ్య రెండో కొడుకు ఉక్రోషంగా
ఆయన పడుతున్న బాధ చాలక, మూలిగే నక్కమీద తాటిపండు రాలిపడినట్లు, కొడుకులు కూడా కోపగించి తలోమాటా అనడం మొదలెట్టేసరికి వెంకటసుబ్బయ్యకు తీసినట్లనిపించింది .
పెద్దకొడుకు కళ్ళు పెద్దవి చేసి చూశాడు తండ్రివైపు, " నాన్నా! ఒక్కతే కూతురంటూ నువ్వుచేసిన పిచ్చిగారమే దానికింత ధైర్యాన్నిచ్చింది . ఇక తనేంచేసినా చెల్లిపోతుందనుకుంది. దీని ఆగం చాలదన్నట్లు, తందాన తానా - అంటూ దీని వెనకాల అత్తయ్య ఒకర్తి! ఈవేళ ఎంత అవమానమయ్యిందో చూడు" అన్నాడు కంఠశోషగా .
అక్కడే ఉన్న మూడోకొడుకు అందుకున్నాడు, " అయినా బుద్ధుండాలి దీనికి. ఆడపిల్ల బ్రతుకు అతి సున్నితం! అరిటాకొచ్చి ముల్లుమీద పడ్డా, ముల్లువెళ్లి అరిటాకుమీద పడ్డా నష్టపోయేది అరిటాకే కదా! ఆడపిల్లగా పుట్టాక దీనికి ఆపాటి జ్ఞానం ఉండొద్దా! ఎవరో రమ్మంటే మాత్రం, ముందూ వెనకా ఆలోచన లేకుండా అతనితో కలిసి వెల్లిపోడమేనా !"
నాలుగో కొడుకు ఏమీ అనలేదు అంటే, దానికి కారణం అతడు ఆ సమయంలో ఊళ్ళో లేకపోవడమే!
అసలే కామాక్షి భవిష్యత్తంతా అగమ్యగోచరంగా కనిపిస్తూ భయపెడుతోంది వెంకట సుబ్బయ్యను. దానికి కొడుకుల మాటలు జోడై, ఆయన్ను బాగా రెచ్చగొట్టాయి . జరిగిందంతా కలా నిజమా? అసలు ఎందుకిలా జరిగింది - అన్నది అర్థంకాక ఆయనకు పిచ్చెత్తీలా ఉంది పరిస్థితి.
"ఏదీ ఆ సుబ్బి! గుట్టుగా సమర్ఢించుకోవలసిన విషయాన్ని రచ్చ చేసింది కదా! రేపు ఊరిలో తలెత్తుకు తిరగడం ఎలాగో తెలియడం లేదు. ఉన్నబడంగా ఇద్దర్నీ నరికి పారేస్తా, సమస్య వదిలిపోతుంది . ఎక్కడున్నారు వాళ్ళు " అంటూ కత్తి దొరకపుచ్చుకుని, వాళ్ళని వెతుకుతూ ఇల్లంతా పరుగులు పెడుతున్న తండ్రిని కొడుకులు పట్టుకుని ఆపారు. బలవంతంగా ఆయనచేత నిద్రమాత్ర మింగించి మంచం పైన పడుకోబెట్టారు. కొద్ది సేపట్లో ఆయన సకల సమస్యలూ, దు:ఖాలూ, అవమానాలూ - అన్నీ మరిచిపోయి ఒళ్ళుతెలియని నిద్రలో కూరుకుపోయాడు.
ఎవరికీ మొహం చూపించలేక, తమ గదిలో చేరి తలదాచుకున్నారు మేనత్తా, మేనకోడళ్ళు . మంచంపైకి చేరి దుప్పటీ ముసుకులో దూరి, ఒకరినొకరు కౌగలించుకుని బోరున ఏడ్చారు వాళ్ళు చాలాసేపు. గట్టిగా ఏడిచేందుకు కూడా ధైర్యం చాలక, పైటకొంగు నోట్లో కుక్కుకుని కుమిలి కుమిలి ఏద్చారు ఇద్దరూ .
చాలాసేపు అయ్యాక కామాక్షి, " ఇదేమిటి అత్తయ్యా ఇలా జరిగింది" అని ఆడిగింది సన్నని ఎలుగుతో.
సుబ్బులమ్మ గమ్మున కామాక్షి నోటిమీద చెయ్యి ఉంచి గుసగుసగా అంది, " ఉష్! ఊరుకోవే బాబూ! ఇంకీ విషయం ఎత్తి ఒక్కమాట కూడా మాటాడొద్దు. అసలే మనరోజులు బాగాలేవు. అసలు విషయం గాని మీ నాన్నకు తెలిసిందా, వెంటనే మనిద్దరినీ మెడ పట్టుకుని వీధిలోకి గెంటేస్తాడు, గుర్తుంచుకొని నోరు మెదపకుండా గమ్మునుండిపో " అంది ముక్కు చీదుకుంటూ.
కామాక్షి మరి మాటాపలుకూ లేకుండా, ఎగదన్నుతున్న ఎక్కిళ్ళను దిగమింగే ప్రయత్నంలో పడింది. సుబ్బులమ్మ వెనుదిరిగి పడుకుని తనలో తాను అనుకుంది, "నేనుమాత్రం కలగన్నానా ఏమిటి, బ్రహ్మాండమైన నా ప్లానిలా భ్రష్టమై, " స్వపక్ష పరపక్ష నిర్దూమ ధామం"గా మారుతుందని! "నూరు అబద్దాలాడైనా ఒక పెళ్లి జరిపించాలి " అన్న సామెతను నమ్మి, ఎలాగైనా నీ పెళ్లి నువ్వు కోరుకున్న వాడితో జరిపించాలని తాపత్రయ పడ్డానేగాని, అలా చేస్తే ఫలితం ఇలా ఉంటుందనీ, చివరకి నీ పెళ్లి కూడా, ఇలా నూటొకటో అబద్ధంగా మారిపోతుందనీ ఏమాత్రం ఊహింకా గలిగినా, ఒక్కనాటికి ఇంత దుర్మార్గం తలపెట్టి ఉండేదాన్ని కాదు కదా! అంతా విధి, తలరాత!! దేవుడా " అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి ఏడ్చింది సుబ్బులమ్మ.
* * *

                            
(సశేషం)

 
     
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)