కథా విహారం

 ఆ లేడీ డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ - అత్మస్థైర్యం!
ఎన్.కె.రామారావు, కథ : ఉందిలే మంచికాలం

- రచన : విహారి     


 

ఆనంద విషాదాలూ, విజయాపజయాలూ, సౌఫల్యవైఫల్యాలూ, జీవనతరంగాలలో ఉత్ధానపతనాలు, ఎవరివి వారికుంటాయి. ఆయా మనుఘలతో పెనవేసుకున్న ఇతివృత్తాలతో కథలు వస్తూ వుంటాయి. ఆయా మనుషులతో పెనవేసుకున్న ఇతివృత్తాలతో కథలు వస్తూ వుంటాయి. వాటిని రాసే రచయితలూ, అనేక దృక్పథాలు కలిగిన వారై వుంటారు. అనేక సామాజికవర్గాలకు చెందినవారూ అయి ఉంటారు. కథాసాహిత్యం సుసంపన్నం అవుతూ వస్తున్న విధం ఇదే. అందువల్లనే కథారచన పట్ల చిత్తశుద్ధి కలిగిన మంచి రచయితలు తమకు తెలియని జీవితం జోలికి పోకుండా, మంచి కథలు రాసి పేరు తెచ్చుకుంటారు. అలాంటి కథకుల్లో ఒకరు ఎన్.కె.రామారావుగారు. కండ కలిగిన కథలు రాసి పాఠకుల్ని అలరిస్తున్న రచయిత రామారావుగారు. వీరి చాలా మంచి కథల్లో ఒకటి ’ఉందిలే మంచికాలం!’

కథానాయిక డాక్టర్ ప్రభావతి, నాన్న చిన్నప్పుడే పోయాడు. అమ్మ రెక్కల కష్టం మీద చదువుకుంది. మంచి తెలివితేటలున్నాయి. ముప్ఫై అయిదేళ్ళ వయసూ, చక్కటి అందం వున్నాయి. వివాహం అయింది. తన జీతం భర్త విలాసాలకు సరిపోని పరిస్థితి. ఆయన జీవనశైలి అది. ఇక డబ్బున్న అమ్మాయిని వల్లో వేసుకుని సిటీలో కాపురం పెట్టాడు. భర్త వదిలేసిన స్త్ర్రీ అయింది డాక్టర్ ప్రభావతి! వృత్తి గురించీ, లా గురించీ, సాహిత్యం గురించీ ప్రభావతికి మంచి పరిచయం వుంది. బాగా సాహిత్యాన్ని మధించిన పాఠకురాలు. నీతీ, నిజాయితీ, ఆదర్శాలూ పునాదిగా బతకాలని నిశ్చయించుకుంది. హిపోక్రటిక్ వోత్ కి వ్యతిరేకంగా ఏ పనీచేయదు. ప్రైవేట్ ప్రాక్టీస్ కి విరోధి. సిన్సియర్ గవర్నమెంట్ డాక్టర్ ఆమె. ముక్కుసూటి మనిషి.

ఈ ముక్కుసూటితనం ప్రభావతిని అడుగడుగునా ముప్పుల్లోకి నెట్తుంది. హత్యల్ని ఆత్మహత్యలుగా చిత్రించేటట్లు, ప్రాణాంతక గాయాల్ని సింపుల్ ఇంజురీస్ చేసేటట్లు తప్పుడు సర్టిఫికెట్స్ కావాలి పోలీస్ ఇన్ స్పెక్టర్ కి. ఒక్కసారి ప్రభావతి పొందూ కావాలి! తుమ్మో, దగ్గో జలుబో గిలుబో వచ్చి మేజిస్ట్రేట్ దొరవారు ఇంటికి రమ్మని పిలిస్తే, పరిగెత్తుకు వెళ్ళి వారి ఆరోగ్యం చూసి రావాలి. చికిత్స చేయాలి! వీటన్నిటినీ ససేమిరా కాదని వాళ్లని శత్రువుల్ని చేసుకుంది ప్రభావతి.

డాక్టర్ ప్రభావతిని ఒక ఆర్టిఫిషియల్ క్రిమినల్ అబార్షన్ కేసులో దోషిగా ఇరికిస్తాడు ఇన్ స్పెక్టర్. బలవంతాన రోగి బంధువుల్ని ఉసిగొలిపి, ఈమె మీద అభియోగాన్ని తెస్తాడు. ఈ నీచ పన్నాగానికి తల్లిడిల్లి, ఉక్కిరి బిక్కిరి అయినా, ప్రభావతి చలించదు. కోర్ట్ లో కేసు నడుస్తుంది.ఈమెకు వ్యతిరేకంగా పకడ్బందీ సాక్ష్యం తయారుచేశాడు ఇన్ స్పెక్టర్. ప్రభావతి నిజాయితీని అర్థం చేసుకున్న మేజిస్ట్ర్రేట్, తీర్పు యివ్వడానికి చాలా భావ సంఘర్షణకి లోనవుతాడు. అందుకు పబ్లిక్ సర్వెంట్ మీద కేసు పెట్టడానికి పోలీసులు, రాష్ట్రప్రభుత్వం నుంచీ అనుమతి తీసుకోలేదనే టెక్నికల్ పాయింట్ మీద కేసు కొట్టివేశాడు. శిక్ష ఈ విధంగా తప్పినందుకు ప్రభావతికేమీ సంతోషం కలగలేదు. ఇలాంటి కేసులకి చట్టపరంగానే న్యాయమైన, ధర్మబద్ధమైన తీర్పు కావాలి. అప్పుడే సమాజంలో నిజాయితీపరులు ధైర్యంగా మనగలుగుతారు. సమాజం ఆరోగ్యవంతంగా పురోగమించగలుగుతుంది. అలా జరగటానికి ’ఉందిలే మంచికాలం’ అనే ధ్వనితో కథ ముగుస్తుంది.

ఈ కథా సంవిధానాన్ని ఒక అద్భుతమైన ప్రయోగంగా నడిపారు రచయిత. కథలో ఒక చిలక పాత్రని సృష్టించారు. ఆ చిలక ప్రభావతి ’కాన్షియన్స్ కీపర్’గా ఆమె ముందు కొన్ని ప్రశ్నార్ధకాల్ని నిలుపుతూ వుంటుంది. హెచ్చరికలు చేస్తూ వుంటుంది. ఆమె గమన్నాన్ని ’మానిటర్’ చేస్తూ వుంటుంది. నీతీ, నిజాయితీ, గట్రా అంటూ మడికట్టక్కూచుంటే జరిగిందేమిటో చేస్తూ వుంటుంది. జరుగుతున్నదేమిటో విశ్లేషిస్తూ వుంటుంది. జరగబోయే పరిణామాల్ని గురించి హెచ్చరిస్తూ వుంటుంది. వీటికి ప్రతిస్పందనగా ప్రభావతి మాత్రం దృఢమైన కచ్చితమైన నిశ్చయాల్ని తెలుపుతూ సాగిపోతూ వుంటుంది.

పాలగుమ్మి పద్మరాజు గారంటారు. "కథలో ఏది ఎక్కువ స్ఫుటంగా చిత్రాంచాలో నిర్నయించటమే కథాశిల్పంలో ముఖ్యమైనదీ, కష్టమైనదీ అని. ఈ కథలో గవర్నమెంట్ డాక్టర్ గా ప్రభావతికి ఆమె జీవన విధానంలో ఉన్న convicitions నీ, విలువల పాటింపు తత్వాన్నీ, స్పుటంగా చిత్రించటానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ సంఘటనల్నీ సన్నివేశాల్నీ వివరిస్తూ శిల్పాన్ని చక్కగా పోషించారు రామారావుగారు.

‘వైచిత్రి కథానికకు ప్రాణం’ అనీ అన్నారు పద్మరాజుగారు. రామారావుగారు ఈ కథలో చూపిన వైచిత్రి అద్భుతమైనదీ, అపూర్వమైనదీ. చిలక హెచ్చరికలకు ప్రభావతి సమాధానాలుగా ఒక ఆత్మావలోకన ప్రక్రియని పాఠకుల ముందుంచటం అపురూపంగా అమరింది. దీని వలన ప్రత్యక్షసాక్షి కథాకథన విధానంలోనే ఒక వినూత్నతని సాధించగలిగారు రచయిత.

ప్రభావతి కున్న సాహిత్యాభినివేశం, Versatality ఈ రెంటినీ ’అరయన్ శంతనుపై....’ పద్యం నుంచీ, గేబ్రియల్ గార్షియా మార్కృజ్ కల, సిడ్నీ షెల్టర్ నవల, అండ్సన్ కథ, ’ఇన్ ది గలీ’ కథ వరకూ ఉదహరిస్తూ పాత్రపోషణకు అవసరమైన వివరాలు చెప్పారు రచయిత. వీటిని ఆమె గుర్తు చేసుకొనేటప్పుదు ఆయా అంశాల ‘రెలవెన్స్’ ని దృష్టిలో ఉంచుకుని సందర్భశుద్ధినీ, ఔచిత్యాన్నీ చాలా చాకచక్యంతో, నైపుణ్యంతో పొషించారు! అలాగే డాక్టర్ గా ప్రభావతికున్న మెడికల్ పరిజ్ఞానమే కాకుండా, లా గురించీ, సామాజిక వ్యవస్థాస్వరూపం గురించీ ఆమెకు గల నిండు అవగాహనని కథా సందర్భంలో మిళితం చేసి కథకొక ‘రిచ్ నెస్’ తెచ్చారు.

రామారావుగారి శైలి కూడా సాహిత్య సంప్రదాయాల విజ్ఞతని చాటుతూ సంస్కారవంతంగా సాగింది. ’గొంతులో త్రాచుపాము దూరినట్లు వాయిస్ బుసబుసలుగా మారింది. ‘సోమ్మాం బులిస్ట్ నడక. మెదడు మొద్దుబారుతోంది. ఆలోచనలు సున్నితమైన దారాల్లా తెగిపోతున్నాయి. ఇలా వుంటుంది వాక్యసరళి. పద సౌభాగ్యంలోనే అర్థ సౌష్ఠవమూ వుండటమమంటే అదే మరి!

కథావస్తువు ఆదర్శవంతురాలైన ఒక గవర్నమెంట్ డాక్టర్ చుట్టూ అల్లుకుని వున్నది అందువలన రచయిత ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా, ఆ పాత్ర మోడర్న్ సినిమా హీరోయిన్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం రాకుండా తన చేయి తిరిగిన కథాకథన నైపుణ్యంతో ‘ఉందిలేమంచికాలం...’ కథని ఉత్తమ రచనగా తీర్చిదిద్దారు రామారావుగారు. అందుకే ఇది ఒక కథా ముత్యం! ఒక తేజోరేఖ!

 
   

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)