కథా భారతి  - 2

నాక్కొంచెం టైమివ్వు

- రచన : - తాటిపాముల మృత్యుంజయుడు  


 

గుమ్మం తలుపు మెల్లగా తెరిచి ఇంట్లోకి వచ్చింది జ్యోతి. చప్పుడు కాకుండా చెప్పులు విడిచి, భుజాన ఉన్న పుస్తకాల బ్యాగును టేబుల్ పై పెట్టింది. తన గదిలోకి వెళ్లబోతుంటే హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న భానుమూర్తి "ఏంటమ్మా జ్యోతి తల్లీ! రోజు ఇంత లేటయ్యింది" అడుగుతూ గోడగడియారం దిక్కు చూశాడు. అది తొమ్మిది గంటలు చూపుతున్నది.

జ్యోతి తండ్రి భానుమూర్తి. బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కగానొక్క కూతుర్ని అనురాగంతో 'తల్లీ' అని సంబోధిస్తాడు.

"సెమిస్టర్ పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కద నాన్న! ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రిపేర్ అవుతున్నాం" జవాబు చెప్పింది జ్యోతి. 'చదువు' పూత పూసిన అబద్దం గొంతుకలోనుండి కాకుండా పెదాల చివర్నుండి వస్తున్నట్టు ఇట్టే గ్రహించగలిగాడు భానుమూర్తి.

తండ్రీ కూతుళ్ల మాటల్నివంట చేస్తూ వంటింట్లోనుండి చెవిన వినసాగింది శాంత. ఈడు వచ్చిన కూతురు చీకటిపడ్డా ఇంటికి రాకపోయేసరికి అప్పటివరకు ఆందోళనపడ్డ శాంత కాస్తా ఊపిరి పీల్చుకొంది.

 ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న జ్యోతి, కంప్యూటర్ ల్యాబ్, ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ వర్కులతో ఎప్పుడూ బిజీగా ఉండడం తల్లిదండ్రులకు తెలిసిందే. కానీ, మధ్య జ్యోతి ప్రవర్తనలో కొద్దిగా మార్పు వచ్చినట్టు గమనించారు. ఇంట్లో ఉన్న సమయంలో చాలాసేపు తనగదిలోనే గడపడం, రాత్రి భోజనాలు చేసేటప్పుడు ముభావంగా ఉండటం గమనించారు. అదే విషయం భానుమూర్తితో కదిపింది శాంత.

శాంత మాటను పూర్తిగా కొట్టీవేయకుండా, అలా అని జ్యోతి ప్రవర్తనను పూర్తిగా సమర్థించకుండా 'జ్యోతి చాలా తెలివైంది. మనం  డొనేషన్లు కట్టవలసిన కష్టం లేకుండా మంచి ర్యాంకు తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నది. కాబట్టి మన కూతురు ఏదైన తెలివితక్కువ పని చేస్తుందని నేను అనుకోను. అయినా ఇంకొంత కాలం గమనిద్దాం. అవసరమైతే అప్పుడు మాట్లాడుదాం' అన్నాడు

టేబుల్ పై భోజనాలకి అన్ని సర్దిపెట్టింది శాంత. పిలిస్తే భానుమూర్తి వెళ్లి కూర్చున్నాడు. జ్యోతిని పిలిచింది. బదులు రాకుంటే మళ్లీ పిలిచింది. 'ఇదిగో వస్తున్నా'అంటూ ఐదు నిమిషాలైన రూంలో నుండి బయటకు రాలేదు.

శాంత సహనం కోల్పోయింది. "ఛూశారా! మీరు దీన్ని నిలదీసి అడిగేయాల్సిందే. ఇంక తాత్సారం చేస్తే బాగుండదు" అని భర్తను సవాలు చేస్తున్నట్టు అడిగింది. భానుమూర్తికి ఆ మాట విషయం సబబుగానే తోచింది. "భోజానానికి రానీ. నెమ్మదిగా విషయాన్ని లేవదీద్దాం" అన్నాడు.

మరో రెండుమార్లు పిలిస్తే గాని డిన్నర్ కి రాలేదు జ్యోతి. కూర్చుని భోజనం చేస్తున్న ముగ్గురి మధ్య భరించలేని నిశ్శబ్దం ఆవరించుకొంది. ఏవరైనా మాట్లడం మొదలెడుతారా అని మిగతా ఇద్దరూ ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు భోజనాల సమయంలో మాటలు గలగలా ఏరులై పారుతుండేవి. జ్యోతి తన కాలేజీ కబుర్లు, క్లాసుల్లో జరిగే తమాషాలు, నేర్చుకుంటున్న చదువు గురించి తల్లితండ్రులు ఆపేంతవరకు చెపూతూనే ఉండేది. ఇప్పుడు మాటలే కరువైనట్టున్నాయి.

భానుమూర్తి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ "బంగారుతల్లీ! రోజురోజుకీ నీకు చదువు భారం ఎక్కువౌతున్నట్టుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త. భోజనం సరిగ్గా చెయ్. విశ్రాంతి కూడా తీసుకొంటుండు" అన్నాడు.

జ్యోతి ముఖంలో ఏదో టెన్షన్ కొట్టొచ్చినట్టు అగుపడుతోంది. పరధ్యానంగా అన్నం కెలుకుతున్నది. తలెత్తి చూడటం లేదు. కూతురు ప్రవర్తన చూసి శాంతకు ఉక్రోషం వచ్చింది. "ఏంటీ? నాన్నగారు అడుగుతుంటే మారు మాట్లాడటంలేదు" అరిచినంత పని చేసింది శాంత

ఎన్నడులేని విధంగా తల్లి కోపం చూసి జ్యోతి బెదిరిపోయింది. భానుమూర్తి మాత్రం ప్రశాంతంగా, "అదిగాదు కన్నా! నిన్ను చూస్తుంటే నువ్వు ఒక విషయంతో తర్జనభర్జన పడుతున్నట్టున్నావు. నీకు మేం ఉన్నాం గా. కష్టమేంటో మాతో చెప్పొచ్చుగా!" అన్నాడు

జ్యోతి ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే తన రూం లో సెల్ ఫోను మోగిన శబ్దం వినిపించింది. కంగారుపడుతూ లేచి పరిగెట్టి తలుపులేసుకొని మాట్లాడింది జ్యోతి. తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది

"ఎవరమ్మా ఆ అబ్బాయి?" సరిగ్గా పాయింట్ కే వచ్చేస్తూ అడిగాడు భానుమూర్తి.

"అతని పేరు సుధీర్! నా బాయ్ ఫ్రెండ్" ఒక్కొక్క పదం మాట్లాడింది జ్యోతి.

పక్కనే పిడుగు పడ్డట్టు బెదిరింది శాంత. ఇంతకాలం ఊహించుకొంటున్న అనుమానం నిజమైంది. "బాయ్ ఫ్రెండా?" అడుగుతంటే తొట్రుపడింది.

"అంటే? నా స్నేహితురాళ్లకు ఎందరికో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకుండ కూడదా?" ధిక్కారంగా అడిగింది జ్యోతి.

నేటి యువతరం ప్రేమకథలు, చిలువలు పలువలుగా వచ్చే వార్తలు, జరుగుతున్న అనర్థాలని గుర్తు చేసుకుంటూ వణికిపోయింది శాంత. కళ్లలో నీళ్లు ఉబికాయి. తల్లిలో వచ్చిన మార్పును చూసి "మమ్మీ! నాకు ఇరవై ఏళ్లొచ్చాయి. నేను ప్రేమలో పడకూడదా? ప్రేమించే అర్హత నాకు లేదా?" ప్రశ్నించింది జ్యోతి.

కొత్తతరం పోకడలకు, పాతతరం ఆలోచనలకు ఘర్షణ ఎప్పుడు జరిగేదే. కాని 'కాలం మారింది ' అంటూ ఎంతమంది అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తారు. కూతురు ధిక్కారానికి ఏం బదులు చెప్పాలో తెలియక భానుమూర్తి దిక్కు చూసింది.

"నీకు బాయ్ ఫ్రెండ్ ఉండాలా, వద్దా, ఎప్పుడు, వయసులో, ఎవర్ని  ప్రేమించాలి అనే ఆంక్షలు నేను పెట్టటం లేదు. కాని, ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. నువ్వెంతగానో ఎదిగిపోయావు. కాబట్టి నువ్వు చేసే పనులకు నీవే బాధ్యత వహించాలి. విచక్షణా జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం చెబుతున్నాను" ఎంతో హుందాగా జవాబు ఇచ్చాడు భానుమూర్తి.

తండ్రి మాటలతో జ్యోతి ఆలోచనల్లో పడిపోయింది. మనసులో జరుగుతున్న సంఘర్షణని కూతురి ముఖంలో స్పష్టంగా చూసాడు భానుమూర్తి.

"నువ్వు చేస్తున్నది తప్పు అని అనటం లేదు. కాని, విషయంలో మనిద్దరం స్నేహితుల్లా మాట్లాడుకుందాం. నేను నీకు విషయంలో ఎలా చేదోడుగా ఉండగలనో ఆలోచిస్తాను" నింపాదిగా అన్నాడు భానుమూర్తి. తండ్రిలా అథారిటీ చూపెట్టకుండా ఒక స్నేహితుడిలా మాట్లాడుతుంటే జ్యోతి మనసు కొద్దిగా కుదుటపడింది.

ఆలోచనల్లో మునిగి తేలుతున్న జ్యోతిని 'సరేనా?' అంటూ అడిగాడు. 'సరే' అన్నట్టు తలూపింది జ్యోతి.

***

ఆబిడ్స్ లో ఉన్న ఆరంతస్థుల భవనం ముందు ఆటో ఆగింది. అందులొంచి దిగారు భానుమూర్తి, జ్యోతి. భానుమూర్తి జ్యోతిని ఎక్కడికి తీసుకెళుతున్నాడో చూచాయగా చెప్పాడు. మిగతా వివరాలు అక్కడికెళ్లిన తర్వాత తెలుస్తాయన్నాడు. పాతగా ఉన్న బిల్డింగ్ కింది అంతస్తులో రోడ్డు వైపు ఒక బట్టల షాపు ఉంది. రెండో అంతస్థులో బ్యాంక్ ఉంది. పక్కనే ఉన్న చిన్న సందులోనుండి వెనక్కి వెళ్లితే భవనంలో ఇం కా ఎన్నో చిన్నచిన్న ఆఫీసులున్నాయి. ఇరుకుగా ఉన్న మెట్లు ఎక్కుతూ నాలుగో అంతస్థుకు చేరుకొన్నారు. వాతావరణాన్ని చూసి జ్యోతి విసుక్కుంది.

ఒక చిన్న ఆఫీసు ముందు ఆగారు. 'మే హెల్ప్ యూ?' అని ఇంగ్లీష్, తెలుగులో రాసిఉన్న చిన్నబోర్డ్ తగిలించి ఉంది. తలుపు తెరుచుకొని లోనికి వెళ్లారు. ముందు గది చాలా ఇరుకుగా ఉంది. ఒక టేబుల్, దాని ముందు రెండు కుర్చీలు వేసి ఉన్నాయి. అలికిడి విని లోపలినుండి జ్యోతి ఈడు గల అమ్మాయి వచ్చింది. చేతిలో ప్యాడు, కొన్ని పేపర్లు ఉన్నాయి. వివరాలు అడిగి అప్లికేషన్లో నింపి జ్యోతితో సంతకం తీసుకొంది.

"మేడంగారు లోపల కలుస్తారు. లోనికి వెళ్లండి" అని జ్యోతితో చెప్పింది. భానుమూర్తి కూడా లేవబోతుంటే "మీరిక్కడే కూర్చోండి" అని చెప్పింది.

మధ్య తలుపు తెరుచుకొని లోపలికి వెళ్లింది జ్యోతి. పెద్ద రూము. రూములో టేబుల్, నాలుగు కుర్చీలు వేసి ఉన్నాయి. ఇంకా మేడం వచ్చినట్టు లేదు. వెనకాల ఇంకో గది ఉన్నట్టుంది. అందులోంచి కొందరి మాటలు వినవస్తున్నాయి.

ఏం చెయ్యాలో తెలియక చుట్టూ పరికించి చూసింది. గోడలకు పెద్ద పెద్ద పటాలు తగిలించి ఉన్నాయి. కుతూహలంతో దగ్గరికెళ్లి వాటిని చూడసాగింది. మహత్మా గాంధీ, మదర్ థెరెసా ఫోటోలను సులభంగానే గుర్తించింది. కింద రాసి ఉన్న పేర్లను బట్టి మరో రెండు పటాలను మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మెండేలా అని గుర్తు పట్టింది. వెనకనుండి 'హలో' అన్న మాట వినిపించింది. తిరిగి టేబుల్ దగ్గరికి నడిచింది జ్యోతి. కుర్చీలో కూర్చుని మేడం దిక్కు చూసింది.

అంతే, దిగ్గున లేచింది. 'నాన్నా!' అని అరవబోయి ధైర్యం తెచ్చుకొని ఆగిపోయింది. వడిగా  లేచి బయటకు నడవబోయింది.

"ఏం ఫర్లేదు. కూర్చో" అంది మేడం.

"సారీ! మేం వేరే ఆఫీసుకు వెళ్లబోయి మీ దగ్గరికి తప్పుగా వచ్చామేమో  అడుగుతాను" అంది జ్యోతి.

"నువ్వు సరైన చోటుకే వచ్చావ్" అనునయంగా మాట్లాడింది మేడం.

మనిషి ముఖంలోకి మరొక్కమారు చూసింది. మొహం చూస్తే కురూపిలా ఉంది. తెల్లగా జీవంలేని చర్మం ముఖం మొదలుకొని మెడ వరకు వ్యాపించి ఉంది. కనుగుడ్డు లేక కన్ను సొట్ట పోయింది. తలముందు భాగంలో వెంట్రుకలు లేక నుదురు విశాలంగా కనిపిస్తున్నది. ఒకసారి చూస్తే కొన్ని రోజులు వెంటాడుతూ భయపెట్టేలా ఉంది.

"నా పేరు గౌతమి " అంటూ చేయి ముందుకు సాచింది. చేతిమీది చర్మం కమిలిపోయింది. మధ్యవేటి గోరు లేదు.

"నైస్ టు మీట్ యూ" అంటూ భయంతో మెల్లగా కరచాలనం చేసింది జ్యోతి. గరుకుగా ఉన్నచర్మాన్ని తగులుతుంటే జుగుప్స వేసింది.

"మే ఐ హెల్ప్ యూ సంస్థకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ సంస్థ గురించి మీకు సమాచారం తెలుసా?" అని అడిగింది గౌతమి. భానుమూర్తి జ్యోతితో 'అక్కడికెళ్లితే నీకన్ని విషయాలు తెలుస్తాయి. తప్పకుండా పోదాం' అని చెప్పి తీసుకొచ్చాడు. కాబట్టి తెలీదన్నట్టు తలూపింది జ్యోతి.

మాట్లడం మొదలెట్టింది గౌతమి. "ఈ సంస్థ స్థాపించి ఆరు నెలలు అయ్యింది. మధ్య కాలంలో యువతీ యువకుల మధ్య చిగురించే  ప్రేమ  ఎన్నో అపార్థాలకు లోనయ్యింది. అనూహ్యంగా జరుగుతున్న అభివృద్ధివల్ల అమ్మాయిలు, అబ్బాయిలు ఆర్థికంగా స్వతంత్రం పొందుతున్నారు. వారి మధ్య అసమానత్వం కూడా అంతరించిపోతున్నది ఇలాంటి శుభ పరిణామాల మధ్య కొన్ని మానవీయ సంబంధాలు పలుచబడి చులకనై పోతున్నాయి. వాటిల్లో ప్రేమ ఒకటి. కొన్నిసార్లు అది విషమ పరిస్థితులకు కూడా దారి తీస్తున్నది. ఇలాంటి గందరగోళంలో కొట్టూమిట్టాడుతున్న అమ్మాయిలకు, అబ్బాయిలకు స్వచ్ఛందంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో సంస్థను ప్రారంభించాను. "

అలా మాట్లాడుతున్న గౌతమిని మరొక్కమారు పైనుండి కిందకు చూసింది. గౌతమి అనాకారితనానికి, మాట్లాడుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు. అది గమనించిన గౌతమి "నీ మనసులో తొలుస్తున్న అనుమానం నాకు అర్థం అవుతున్నది. కురూపినైన నేను ప్రేమ సలహాలు ఇవ్వటం ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదూ. ఏం అందమైన వాళ్లే ప్రేమ గురించి మాట్లాడాలా? అందవిహీనులు అందుకు అర్హులు కారా?" చిరునవ్వుతో అంది. ఏం జవాబు చెప్పాలో తెలియక జ్యోతి ఇబ్బందిగా కదిలింది.

జ్యోతి ప్రేమ విషయం గురించి వివరాలడిగింది గౌతమి. సుధీర్ తో ఎంతకాలం నుండి పరిచయం, పరిచయం ప్రేమగా ఎలా మారిందో చెప్పమంది. వాళ్లిద్దరు ఎక్కడ కలుసుకుంటారు, ఏయే సమయాల్లో కలుకుంటారో, కలిసి ఏం చేస్తారో అడిగి తెలుసుకుంది. ఇద్దరి ఇష్టాఇష్టాల గురించి చెప్పమంటే గడగడా పెద్ద లిస్టే చెప్పింది జ్యోతి. వారి ప్రేమ గురించి ఇంకా చెప్పుకొస్తూ సుధీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే సుధీర్ తనను చూడకుండా, మాట్లాడకుండా కనీసం ఒక్క రోజైన ఉండలేడని చెప్పింది జ్యోతి.

గౌతమి అడిగే ప్రశ్నల తీరు, వాటిని విశ్లేషించే విధానం జ్యోతికి బాగా నచ్చింది. గౌతమి అంటే గురి ఏర్పడింది. గౌతమి బాహ్య వికృతరూపం క్రమంగా అదృశ్యమవుతూ, అంతర్లీనంగా ఉన్న స్నేహతత్వం కనిపించసాగింది. ఇన్నాళ్లకి మనసు విప్పి మాట్లాడుకోటానికి ఒక మనిషి దొరికినందుకు జ్యోతికి సంతోషం కలిగింది. మధ్య మధ్యలో తనకున్న సందేహాలను నివృత్తి చేసుకుంది.

చివరగా తన ముందున్న సమస్యను గౌతమితో పంచుకుంటూ "ఇంకో నాలుగు రోజుల్లో వాలెంటైన్స్ డే ఉంది. తనకిష్టమైన పబ్ లో జరిగే స్పెషల్ ఈవెంట్ కి సుధీర్ వెళ్దామని పట్టుబడుతున్నాడు. నేను ఇంకో రెండు రోజుల్లో నిర్ణయం తెలపక పోతే సీట్లు దోరక్కపోయే అవకాశముందని తొందర చేస్తున్నాడు. నేను రాను అంటే సుధీర్ ఎంతో బాధపడతాడని తెలుసు. వస్తాను అంటే నా ప్రేమ సంగతి తల్లిదండ్రులకి తెలుస్తుందనే భయం. రెండు చిక్కుల మధ్య చిక్కుకొని చాలారోజులు సతమతయ్యాను. చివరకు అనుకున్నంత అయ్యింది. అమ్మానాన్నలకు తెలిసిపోయి మొన్న ఇంట్లో గొడవ జరిగింది" అంటూ లోపల కలచివేస్తున్న బాధను బయటకు చెప్పుకుంది.

"కొంతమంది నువ్వంటే నాకు ప్రాణం... నువ్వు లేకపోతే నేను బ్రతలేను అంటారు. ఇంకొందరేమో ఇలానే చెయ్యాలి, అలా ఉండకూడదు అని షరతులు పెడతారు. మొదట్లో ఇవన్నీ 'నేనంటే ఎంత ప్రేమ!' అని అపార్థం చేసుకోవచ్చు. కాని, ఇలాంటి ప్రవర్తన మున్ముందు పెద్ద సమస్యలకు దారి తీయవచ్చునని సైకాలజిస్ట్ లు అంటారు. అలా అని నేను సుధీర్ ను తప్పుబట్టటం లేదు. కాని, ఇలాంటి నడవడిక గురించి జాగ్రత్తగా అలోచించమంటున్నాను " అంది గౌతమి.

ఆ మాటలు విన్న జ్యోతి ఆలోచనల్లో పడింది. దాన్ని భంగపరుస్తూ, "ప్రేమ పేరున గట్టి దెబ్బలు తిన్న అమ్మాయిలు గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉంటాం. నేను మొదలెట్టిన 'మే హెల్ప్ యూ' గురించి తెలుసుకొని అలాంటి అమ్మాయిలు కొంతమంది నాతో పనిచెయ్యటానికి ముందుకు వస్తున్నారు" అంటూ లోపల ఉన్న అమ్మాయిలను పిలిచింది.

" అమ్మాయి పేరు లలిత. 'నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించు ' అని ఒకతను వెంటబడ్డాడు. ప్రేమను తిరస్కరించేసరికి ఏకంగా ఇంట్ళొ జొరబడి లలితను లాక్కేళ్లటానికి ప్రయత్నించాడు. తల్లితండ్రులు అడ్డు వచ్చేసరికి వాళ్లను హతమార్చాడు. అమ్మాయి జయంతి. ఒకబ్బాయితో ప్రేమలో పడింది. కొన్నాళ్ల తరువాత అబ్బాయి వింత ప్రవర్తన తెలుసుకొని ప్రేమించడం మానేసింది. కాని, అబ్బాయి మాత్రం వాళ్ల ఊళ్లో ఉన్న సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేసాడు. పరువు పోయిందన్న వ్యధతో వీళ్ల కుటుంబం ఊరు వదిలి హైద్రాబాద్ వచ్చింది. అమ్మాయేమొ పద్మజ. ధనవంతుల అబ్బాయి ప్రేమించానంటూ నమ్మించాడు. తన కారులో షికార్లకు తిప్పేవాడు. ఒక రోజు బయటకు తీసుకెళ్లి, నిర్జన ప్రదేశం లో కారును ఆపి లోబరుచుకొన్నాడా ప్రబుద్ధుడు. పని చేసింది చాలక సన్నివేశాన్ని సెల్ ఫోను కెమరాతో చిత్రీకరించి ఫ్రేండ్స్ అందరికి చూపించాడు. ఇలాంటి వార్తలు రోజూ పేపరలో వస్తూనే ఉన్నాయి. కాని, మనకున్న'మరుపు ' అనే గుణం వల్ల ఎట్లాంటి అన్యాయాన్నైనా

ట్టే మరచిపోతాం. కాబట్టి ఇలాంటి సజీవ ఉదాహరణలు ఒక టీం గా ఏర్పడి నీలాంటి అమ్మాయిలకు సహాయం అందిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచనే 'మే హెల్ప్ యూ? ' కు మూలకారణం" అంటూ వివరించింది గౌతమి.

ఎంతోమంది అందమైన ఆడవాళ్లున్న సమాజంలో ఒక కురూపికి ఇలాంటి ఆలోచన కలిగినందుకు మనసులో 'హాట్స్ ఆఫ్ గౌతమీ!’ అనుకుంది జ్యోతి.

"అన్నట్టు మరో అమ్మాయికి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకోవాలి. అమ్మాయి ఇంజనీరిం విద్యార్థిని. దృష్టంతా చదువు, కెరీర్ పైనే. మంచి మార్కులతో పాసై, పెద్దజీతం వచ్చే జాబ్ చేయాలనే ఆశయం. మనిషొకటి తలిస్తే దైవమొకటి తలచింది అన్న విధంగా 

ంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగా వాళ్ల క్లాసుకు కుమార్ అనే అబ్బాయి ట్రాన్స్ ఫర్ అయి అమ్మాయి కాలేజీకి వచ్చాడు. వాళ్ల నాన్నగారు వ్యాపారరీత్యా విజయవాడనుండి హైద్రాబాద్ కు మకాం మార్చారు. కుమార్ అమ్మాయిని ప్రేమించానన్నాడు. కుమార్ మంచి స్ఫురద్రూపి. ఆరడుగుల అందగాడు. మారు చూడగానే మళ్లీ చూడాలనిపించే ఆకర్షణ. సహజంగానే అమ్మాయి అతని ప్రేమలో పడింది. కుమార్ కు గర్ల్ ఫ్రెండ్ అంటే కొంత దురభిప్రాయం, ఇంకా కొన్ని ఆశలు కూడా ఉన్నాయి. అతన్ని నియంత్రిస్తూ వాళ్ల ప్రేమను సరైన దారిలో పెట్టాలనుకుంది అమ్మాయి. కాని, ఆంక్షలు భరించలేక కుమార్ లోని వికృతరూపం ఒకరోజు బయటపడింది. పెద్ద బాటిల్ తో ఆసిడ్ అమ్మాయిపై పోసాడు." శ్రద్ధఆ వినసాగింది జ్యోతి.

"ఆసిడ్ వల్ల ముఖం, మెడ, ముఖానికి అడ్డుపెట్టిన చేతులు కాలిపోయాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మాంసం ముద్దలా మారిపోయిన అమ్మాయిని బతికించటానికి చాలామంది దాతలు ముందుకు వచ్చారు. ఏడాదిపాటు డాక్టర్లు కష్టపడి మాములు స్థితికి తీసుకొచ్చారు. అమ్మాయి తిరిగి కాలేజీ లో జాయిన్ అయి చదువు పూర్తి చేసి సాఫ్ట్ వేర్ లో మంచి ఉద్యోగం సంపాదించింది."

'ఆ అమ్మాయి ఎవరూ? లోపల ఉందా? ఇప్పుడు పిలుస్తుందేమో?'అనుకుంది జ్యోతి.

"అవును, అసలు అమ్మాయి పేరు చెప్పలేదు కదూ...” అంది గౌతమి. జ్యోతి మెదడులో మెరుపు మెరిసింది. వెనువెంటనే గౌతమిని ఆపుతూ, "చెప్పనఖ్ఖర్లేదు... అమ్మాయి పేరు గౌతమి" అంది జ్యోతి. మెచ్చుకోలుగా జ్యోతి దిక్కు చూసింది గౌతమి.

" పేపర్లో మీ గురించి చదివాను. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకొన్నాను. కాని, ఇక్కడ... మీరు... సంస్థ..."

" సంవత్సరం పాటూ ఉద్యోగం చేసాను. బాగానే ఉండేది. కాని ప్రతిరోజు ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలు ఎన్నో చిదిమేయబడటం పేపర్లలో చదివి తల్లడిల్లి పోయేదాన్ని. నాలా మరో అమ్మాయి జీవితం బుగ్గిపాలు కాకూడదు అనుకునేదాన్ని. ఏం చెయ్యాలా అని ఆలోచించగా 'మే హెల్ప్ యూ' ఐడియా వచ్చింది. దీన్ని సప్పోర్ట్ చేయటనికి చాలామంది పెద్దలు విరాళాలు ఇస్తున్నారు. ప్రేమ పేరుతో మోసగించబడ్డ అమ్మాయిలు, ఇదిగో వీళ్లలా... నాతో పనిచేయటనికి ముందుకు వస్తున్నారు" అంటూ ముగించింది గౌతమి.

'ఎవరికీ వైకల్యం? బయటికి వికృతరూపం ఉండి ఎంతో విశలహృదయమున్న గౌతమికా? బయటకు అందంగా అగుపడి లోలోపల మనోవైకల్యం ఉన్న కుమార్ కా?' ఆలోచనలో పడింది జ్యోతి.

"చాలామంది తమ బాధలను తమలోనే ఉంచుకొంటారు. నువ్వు నీ వ్యధల్ని, బాధల్ని నాలాంటి అమ్మాయిలతో పంచుకోటానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు" అంటూ జ్యోతి ముందు గదిలోకి వస్తుంటే స్టిక్కర్ లాంటి కాగితాన్ని ఒకటి ఇచ్చింది గౌతమి.

" స్టిక్కర్ ను నీ బెడ్రూంలో ఉదయం పక్కమీద నుండీ లేవగానే అగుపించేటట్టు అతికించు. గుడ్ లక్ ఇన్ యవర్ లవ్" అంటూ భుజం మీద తట్టింది.

***

ఆటోలో ఇంటికి తిరిగి వస్తుంటే జ్యోతి సెల్లోకి టెక్స్ ట్ మెసెజ్ వచ్చిన శబ్దం వచ్చింది. భానుమూర్తి తొట్రుపాటుతో జ్యోతి దిక్కు చూసాడు. జ్యోతి మాత్రం ఏమాత్రం తడబడకుండా సెల్ తీసి మెసెజ్ చదివింది. నింపాదిగా సమాధానం టైప్ చేసింది. నవ్వుతూ తండ్రి దిక్కు చూసింది. తండ్రి కళ్లలో పొడసూపుతున్న సందేహాన్ని గుర్తుపట్టి  ఫోను తండ్రికి చూపించింది.

'జ్యోతి! ఏం నిర్ణయించుకున్నావ్? నిన్నటి నుండి నీ దగ్గరనుండి సమాధానం లేక పోయేసరికి ఎంత హడలిపోయానో తెలుసా. వాలెంటైన్స్ డే రిజర్వేషన్స్ కి రోజే లాస్ట్ డే. లేట్ చేస్తే టికట్లు దొరకవు. ప్లీజ్ రిప్లై ఇవ్వు అన్న సుధీర్ కు 'తొందరేందుకు సుధీర్! ఆలోచించుకోవటానికి నాకో రెండు రోజులు టైం కావాలి. వాలెంటైన్స్ డే కాకుంటే వచ్చే సంవత్సరముందిగా!' అంటూ జ్యోతి ఇచ్చిన సమాధానం చదివి హాయిగా నిట్టుర్చాడు భానుమూర్తి. ఆరిందలా మారిన జ్యోతిని చూసి ఒకింత ఆశ్చర్యపోయాడు.

జ్యోతి తన దగ్గరున్న నోట్ బుక్ లోనుండి స్టికర్ లాంటి కాగితాన్ని తీసి తండ్రికి చూపించింది.

పెద్ద అక్షరాలతో విధంగా రాసి ఉంది. "In a world where you can be anything... Be Yourself!"

వాక్యానికి వెంటనే భావం స్ఫురించని భానుమూర్తి "దీని అర్థం ఏమిటి, బంగారూ?" అడిగాడు.

టూకీగా రెండు ముక్కల్లో చెప్పింది జ్యోతి. "నీలాగా నువ్వుండు".

 
 

 

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)