Sujanaranjani
           
  కథా భారతి  
 

అంతర్ముఖం - 5వ భాగం

 

                                                                           రచన :  యండమూరి వీరేంద్రనాథ్

 
ఉదయం తెల్లవెంట్రుకలతో విచలితమైన మనసు ఇప్పుడు శాంతంగా ఉంది. నా అశాంతికి కారణం అదొక్కటే కాదు. నా తల్లిని ఆశ్రమంలో చేర్పిస్తే నేనేదో ఘోరపాపం చేసినట్లు ఈ లోకమంతా ప్రతిక్షణం నన్ను దెప్పిపొడుస్తూ సలహాలిస్తుంది దేనికని?

ఆరునెలల క్రితం నా తల్లికి పక్షవాతం వచ్చింది. అప్పటికే హై.బి.పి.ఉంది. దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసాను.
రెండు రోజులు ప్రమాదస్థితిలో ఉంది. తర్వాత కొద్దిగా నెమ్మదిగా ఉంది. వారంరోజుల తర్వాత ప్రమాదస్థితి దాటిందని, ఫర్వాలేదని చెప్పారు.
ఇక ఇంటికి తీసుకుపోవచ్చునని, పుర్తిగా మంచం మీదే ఉండి విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. కొన్నాళ్ళు అక్కడే ఉంచడానికి నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ లోనయినా డబ్బులు చల్లడమో, రికమండేషనో లేకపోతే వైద్యం, గౌరవం కూడా లభించవని అర్ధమయ్యింది. బెడ్స్ ఖాలీలేవనీ, నర్స్ ల స్ట్రయిక్ అని ఏవో వంకలు చెప్పి డిశ్చార్జ్ చేసేశారు. ఆమెను ఇంటికి తీసుకువచ్చాను.

నాది టెంపరరీ ఉద్యోగం. నేను సెలవు పెట్టడానికి వీల్లేదు. ఈ ఉద్యోగం కూడా లేకపోతే నా తల్లికి మందులు కాదుగదా సరయిన తిండి పెట్టే అవకాశమూ పోతుంది. నేను ఆఫీసుకు వెళ్ళిపోతే అమ్మను చూసుకునే వాళ్ళ కోసం ప్రయత్నించాను.

భోజనం పెట్టి నెలకు నూటయాభై ఇవ్వమంది ఒక పనిమనిషి. భోజనం అక్కర్లేదు మూడువందలు ఇవ్వమంది మరొకావిడ. నాకు వచ్చే జీతం ఎనిమిది వందలు. ఇంటద్దెతో పాటు ఇంటి ఖర్చుని వెళ్ళదీయడమే కష్టమైన పరిస్థితి.

డిగ్రీ పాసయిన తర్వాత ఆరేళ్ళు అతి చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. రెండొందల నుంచి అయిదు వందల దాకా జీతం కోసం రోజుకి పదహారు గంటలు కష్టపడేవాడిని. అలాంటి సమయంలో ఈ ఉద్యోగం దొరికింది. టెంపరరీ అయినా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడిక సెంట్రల్ గవర్నమెంట్ స్కేలు వస్తుంది. ఇలాంటి సమయంలో లీవు పెట్టినా నష్టమే.

అందుకే అమ్మను తీసుకుని కృపా ఆంటీ ఊరు వెళ్ళాను.
ఆవిడ అమ్మ చిన్ననాటి స్నేహితులు. ఒకే ఊరివాళ్ళు. కలిసి చదువుకున్నారు. అమ్మ ఆరో తరగతితో మానేస్తే, ఆవిడ పదో తరగతి పాసై నర్స్ ట్రైనింగ్ చేసింది. ఉద్యోగంలోంచి రిటైర్ అయ్యాక స్వంత ఊరు తిరిగివెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది. అక్కడే ఏదో ఉద్యోగం కూడా చేస్తోంది. అమ్మను తీసుకు వెళ్ళబోయేముందు ఆమెతో స్వయంగా మాట్లాడాను.

మీ ఊళ్ళో ఈ మధ్య ఒక వృద్ధాశ్రమం ప్రారంభించారు కదా! చాలా మంది వృద్ధులు అక్కడ ఉన్నారని విన్నాను. అమ్మను కూడా చేర్పించే ఏర్పాటు చేయగలవా? ఆమెకు వైద్య సహాయం, నలుగురితో కాలక్షేపం కూడా దొరుకుతాయి..

ఆమె నా వైపు కన్నార్పకుండా ఓ క్షణం చూసి, అలాగే అంది.

ఆశ్రమం చాలా నీట్ గా ఉంది. ప్రశాంతంగా ఉంది. చుట్టూ పరిసరాలు చాలా బాగున్నాయి. కాకపోతే ఆశ్రమంలో వున్న వాళ్ళంతా క్రిస్టియన్సే. డాక్టర్, నర్స్ కూడా క్రిస్టియన్సే. ఉచితంగా సేవ చేస్తున్నవాళ్ళు.

వాళ్ల మధ్య అమ్మ ఉందగలదా? అరవై ఏళ్ళపాటు ఒక నమ్మకానికి అలవాటు పడిన మనిషి ఉన్నట్లుండి మరో రకమైన సమాజంలో బలవంతంగా జీవించవలసి వస్తే,... అదామెకు మరింత మనస్తాపం కలిగించదు కదా.. ఈ విషయమే అమ్మ దగ్గర ప్రస్తావించాను.

పర్వాలేదు. నాకిక్కడ చాలా బాగుంది. ఎవరయితే ఏం నాయినా! వాళ్ళూ మనుషులే. ముఖ్యంగా మంచివాళ్ళూ.. అంది ముభావంగా.

అంతకంటే ఆమె మాత్రం ఏమంటుంది? అనక తప్పదు. మనిషి జీవితం ఒక పోరాటం. స్ట్రగుల్ ఫర్ ఎక్జిస్టెన్స్! జీవించాలంటే లొంగిపోవడాలు, అణగిపోవడాలు, సర్దుకుపోవడాలు తప్పవు.

మనిషి తనకోసం తనొక నిర్ణయం తీసుకుంటే, దాన్ని సమర్ధించుకోవడం కోసం ఎంతయినా పోరాడగలదు. కానీ మరొకరి కోసం అతడో నిర్ణయం తీసుకున్నప్పుడు ఎలాంటి విసుర్లు, ప్రశ్నలు ఎదుర్కోవాలో ఆ రోజు నుంచే నా అనుభవంలోకి వచ్చింది.

ఊళ్ళో ఉన్న బంధువులే మొదలుపెట్టారు. అదేంటయ్యా! ఆ కిరస్తానీ వాళ్ళ మధ్య తల్లిని వదిలిపోతున్నావా? ఏం బాబూ, తల్లిని ఆ మాత్రం పోషించుకోలేని స్థితిలో ఉన్నావా? అన్నాడు నాకు తాత వరసాయన.

కలికాలం... కన్నతల్లిని ఆశ్రమంలో వదలిపోయే కొడుకులు పుట్టుకొస్తున్నారు. ఈ కాలం పిల్లలకు తల్లీ, తండ్రీ అనే గౌరవం, ఆత్మీయత అసలు లేవు అన్నారు ఇంకెవరో.

తొమ్మిది నెలలు మోసి, ప్రాణానికి ప్రాణం అడ్డువేసిన కన్నతల్లి నీకు చివరి రోజుల్లో బరువైపోయిందా? నువ్వసలు మనిషివి కాదురా? అన్నాడు మామయ్య వరసైన పెద్దమనిషి.

అప్పటికే నా వళ్ళు మండిపోతోంది. నేను మెటీరియలిస్ట్ నని ముద్రవేస్తారే తప్ప, నా సమస్యకు మరో పరిష్కారం లేదని గ్రహించరేం!

పోనీ మీ ఇంట్లో ఉంచుకుని సేవ చేస్తావా మావయ్యా! నా కోసం నెలకో రెండువందలు ఉంచుకుని మొత్తం నా జీతమంతా నీకేపంపుతాను.
నాకూ నిశ్చంతగా ఉంటుంది. అన్నాను.

బావుందిరా! నీకే బరువయ్యింది. ఇక మాకు పట్టిందా? అయినా మా ఇంట్లో చేసిపెట్టే వాళ్ళెవరూ లేరు! అన్నారాయన తేలిగ్గా.

ఎదుటివాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించడంలో వున్న సామర్ధ్యం, నీకు బాధ్యతను స్వీకరించడంలో లేదు మామయ్యా. నీ ముసలి తల్లి, తండ్రీ గొడ్లపాక పక్కన షెడ్డులాంటి గదిలో ఎలాంటి దుస్థితిలో ఉన్నారో నాకు తెలియనిది కాదు. లోకం కోసం, ఎవరయినా ఏమైనా అనుకుంటారేమోనన్న భయంతో తప్ప భక్తితో నువ్వు వాళ్ళను దగ్గర పెట్టుకోలేదు. నీ మనసులో ఏముందో నాకు తెలియదా మావయ్యా. వాడు చేసిన ఈ పని నేను చేయగలిగితే ఎంత బావుండును, ఈ బాదరబందీ వదిలిపోను అనుకుంటున్నావు. కానీ పైకి చెప్పుకోవు. ఆ విషయం ఒప్పుకోవడానికి నీ అభిజాత్యం అడ్డువస్తుంది. అన్నాను.

నాకు ‘పిక్చర్ ఆఫ్ డెరియన్ గ్రే’ గుర్తొచ్చింది. ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి. అందులో పైకి కనిపించేది కృత్రిమ చిరునవ్వు పులుముకున్న అందమైన ముఖం. రోజు రోజుకీ కుళ్ళిపోయి వికృతంగా మారేది అంతర్ముఖం. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ముఖం మనిషి మనసుకి ప్రతిరూపం అంటారు. కానీ చాలామందికి అది వర్తించదు.

అమ్మని వదిలి నేను తిరిగి వచ్చాను.

అమ్మ అక్కడుంది కాబట్టే త్వరగా స్వస్థురాలయింది. కొద్దిగానయినా నడవగలిగే స్టేజికొచ్చింది. ఇంకాస్త కోలుకుంటే తీసుకురావచ్చు కూడా. అయినా ఈ మధ్య కాలంలో ఆమె నుంచి అందుకున్న రెండు ఉత్తరాల్లో ఒక విషయం స్పష్టంగా గమనించాను.

కారణం తెలియదు. కానీ ఆవిడకు అక్కడ శారీరకమైన స్వస్థతకంటే మానసికమైన ఆనందం లభిస్తోందట. అది ఏ రకంగా వస్తోందో నాకు అర్ధం కాలేదు.

కాదు...అర్ధమైంది.
కాలేదనుకుంటే అది నా ఆత్మవంచన.
అమ్మకు నేను నచ్చను.
నాకొచ్చే ఎనిమిది వందల జీతంలో మూడొందలు పెట్టి, ఆమెను దినమంతా చూసుకోవడానికి ఒక మనిషిని నియమించి, మిగిలిన అయిదొందల్లో అమ్మకు మందులు కొనలేక, నేనో పూట పస్తులుంటూ, ఆమె మంచం ప్రక్కన కూలబడి నేను నిన్ను రక్షించుకోలేకపోతున్నానే అమ్మా, అని సెంటిమెంటల్ గా ఏడిస్తే ఆమెకు సంతృప్తి.

ప్రాణాలు త్వరతా పోయినా సరే.

* * *

మాది రెండు పోర్షన్ల ఇల్లు. పై మేడమీద మరో కుటుంబం ఉంటుంది.
మొత్తం మూడు.

ఆ రోజు ఆదివారం. ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. బయట గోలకి మెలకువ వచ్చింది. సాధారణంగా సెలవు రోజుల్లో నేను ఎనిమిదింటికిగానీ నిద్రలేవను.

బయటకు వచ్చి చూస్తే పక్కపోర్షన్ లో హడావుడి. రాత్రి వీచిన తుఫాను గాలులకు వీరభద్రయ్యగారికి ఆస్తమా ఎటాక్ తివ్రంగా వచ్చింది. ఉండేదే రెండు గదులు. అందువల్ల తప్పనిసరిగా గ్రిల్స్ ఉన్న వరండాలోనే పడుకోవాలి.

ఆ చలిగాలికి ఆయాసంతో, ఉక్కిరిబిక్కిరై పోతున్నాడు. పిల్లి కూతల్లాంటి స్వరం ఉఛ్చస్థాయిఉలోపైకి వచ్చి భయంకరంగా వినిపిస్తోంది. అది చూసి పిల్లలందరూ ఏడుపు ప్రారంభించారు. ఆయన భార్య వరాలమ్మ సంగతి చెప్పనక్కర్లేదు. హరి డాక్టర్ కోసం పరిగెత్తాడు.

పై నుంచి శ్రీనాథ్ వచ్చాడు. అతడి ముఖం బాగా పీక్కుపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇద్దరం ముసలాయన దగ్గర కూర్చున్నాం. మమ్మ్లల్ని చూడగానే ముసలావిడ ఏడుపు కాస్త తగ్గింది.

డాక్టర్ వచ్చి వెంటనే ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు. మందులు రాసిచ్చాడు. ప్రమాదమేమీ లేదనీ, గంటలో కాస్త ఉపశమనం కలుగుతుందని చెప్పి వెళ్ళాడు.
హరి లోపల భార్యతో పదినిముషాలు మాట్లాడి బయటకు వచ్చాడు.
ముఖం చూడగానే అతని దగ్గర ఎక్కువ డబ్బులేదని తెలుస్తోంది. శ్రీనాథ్ పైకెళ్ళి వచ్చి వందరూపాయలనోటు అందించాడు.

థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు హరి. అరగంటలో విరభద్రయ్యగారి ఆయాసం కొద్దిగా తగ్గిమ్ది. నేను నా గదిలోకి వచ్చేసాను.
నా వెనుకే నా ఇంట్లోకి వచ్చాడు శ్రీనాథ్. అనకూడదు కానీ ఆయన పోయినా బావుండేది. ఆయన అవస్థపడటం సరే, అంతకుమించిన అవస్థ ఆ ఇంట్లో అందరిదీ అన్నాడు.

ఈ అభిప్రాయం నీకే కాదు పైకి చెప్పకపోయినా, ఆ ఇంట్లో హరికీ, అతడి భార్యకీ, తల్లికి కూడా అలాంటి అభిప్రాయమే ఉండవచ్చు. అన్నాను.
ఆ మాటలకి శ్రీనాథ్ నావైపు విచిత్రంగా చూసి, నీకు అసలు మనుషుల మీద నమ్మకం లేదనుకుంటాను అన్నాడు.

నేను నవ్వి, అది సరే, నీ విషయం ఏమిటి? రాత్రంతా నిద్రపోయినట్లు లేరు. మళ్ళీ గొడవపడ్డారా? అని అడిగాడు. శ్రీనాథ్ ఎర్రబడ్డ కళ్ళలోకి చూస్తు.

అవును. రాత్రి నా భర్యకీ, నాకూ చాలా గొడవయింది. క్లబ్బులో పేకాడుతూ కూర్చుందట. పది దాటాకా వచ్చింది. అడిగానని కోపంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఈ రోజు మా పెళ్ళిరోజు.

పెళ్ళయి ముడేళ్ళయింది. ఇన్నాళ్ళ మనస్పర్ధలన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని, అవసరమైతే నేను కాస్త తన దారిలోకి వెళ్ళాలని నిన్నే నిర్ణయించుకున్నను. తనకు ఖరీదయిన చీర కొనుక్కొచ్చాను. ఈ రోజు ఉదయమే తీరిగ్గా కూర్చుని తనతో అనునయంగా మాట్లాడి ఇద్దరి మనసుల్లో ఉన్న కుళ్ళునీ కడిగేసి ఇకనించైనా హాయిగా బ్రతుకుదామని చెబ్దామనుకున్నాను. కానీ రాత్రి నేను ఎంత అనునయంగా మాట్లాడినా తను రెచ్చిపోయింది. నేనో చేతకాని వెధవనట. భార్యని సుఖపెట్టలేని అసమర్ధుడినట. చాలా డబ్బుందని అబద్దాలు చెప్పి పెళ్ళిచేసుకున్నానట. ఇప్పుడు ఆమెను వంటింటికి, పడకటింటికి కట్టిపడేసి బానిసలా చుడాలనుకుంటున్నానట. నేను సంకుచిత మనస్కుడినట. ఎందుకో భరించలేకపోయాను. మొట్టమొదటి సారి కొట్టాను. మొదటిసారిగా ఒక స్త్రీని, అందునా ప్రేమించి, పెళ్ళాడిన భార్యని కొట్టాను..అతడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రెండుచేతులతో ముఖం కప్పుకున్నాడు.

నేను ఆప్యాయంగా అనునయంగా అతని భుజం చుట్టూ చెయ్యివేసి పట్టుకోలేదు. దూరంగా వెళ్ళి సిగరెట్ వెలిగించుకున్నాను. ఇంకొకళ్ళ విషాదంపట్ల సానుభూతి ప్రకటించడం నాకు చేతకాదు. ఆ పరిస్థితిలో నేనుంటే ఏం చేస్తానా అని ఆలోచించడం మాత్రమే చేతవును.

త్వరగానే తేరుకున్నాడతను. ప్రొద్దుటే లేచి క్షమాపణ చెప్పుకున్నాను. అయినా సరే నేనెంత చెబుతున్నా వినకుండా, బ్రతిమాలుకున్నా పట్టించుకోలేదు. ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందో తెలియదు. కొద్దిసేపు ఆగి మళ్ళీ మొదలు పెట్టాడు. నువ్వు పెళ్ళి చేసుకుంటే మాత్రం ముందుగానే ఆ అమ్మాయి అభిరుచుల గురించి వివరంగా తెలుసుకో. ని గురించి కూడా చెప్పు. లేకపోతే ఇద్దరూ ఇబ్బంది పడతారు నాలాగ.

పెళ్లంటే భార్యాభర్తలిద్దరూ తమ అవసరాల కోసం అనుక్షణం ఒకరినొకరు అర్ధం చేసుకున్నట్లు నటిస్తూ బ్రతకటం అని నా ఉద్దేశ్యం. నాకు వేరే మనిషి అవసరం లేదు. అందుకని పెళ్ళిమీద నాకంత ఇంట్రెస్ట్ లేదు. అన్నాను. నేను చెప్పింది అతనికి అర్ధం కాలేదనుకుంటాను.

నువ్వంత గట్టిగా అంటే అందరూ నిన్ను అనుమానించే అవకాశం ఉందోయ్. మొన్నామధ్యన ఎదురింటి మన్మథరావు అన్నాడు కూడా.

అందువల్ల నా మగతనానికొచ్చిన లోటేమీ లేదు. అతడికా విషయం అనవసరం. సరేగానీ నీ మనసు బాగులేదు. ఏదైనా సినిమాకు పోదామా, కాస్త కుదుటపడుతుంది.

వద్దులే, నేను తనను కొట్టడం తప్పు. ఈరోజుల్లో భర్త దెబ్బలను ఏ భార్య సహిస్తుంది చెప్పు.? ఒకవేళ మనసు మారి తనుగాని తిరిగి వస్తే ఆ సమయంలో నేనింట్లో ఉండకుండా సినిమాకు వెళ్ళడం తప్పు. నేను ఇంట్లో నే ఉంటాను. అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనాథ్.

నా మనసు చేదుగా అయిపోయింది. ఇంతకాలం అలాంటి భార్య దొరికినందుకు శ్రీనాథ్ మీద జాలిపడేవాణ్ణి. కాని ఈ రోజు అంత మంచి వాడిని భర్తగా పొంది, సుఖపడలేని అతడి భార్యమీద జాలిపడాలనిపిస్తోంది.

స్త్రీ పురుషులెందుకిలా ప్రవర్తిస్తారు? అంత ఆలోచనారహితంగా పెళ్ళెందుకు చేసుకుంటారు? ఒకవేళ చేసుకున్నా జివితాన్ని ఎందుకు చేతులారా నరకం చేసుకుంటారు?

ఆలొచిస్తున్న కొద్దీ నాలో ఆశ్చర్యం, బాధ, కోపం ఒకటొకటిగా పెరగడం మొదలుపెట్టాయి.

నాకు తెలిసినంతలో నా తల్లి అంతగా సుఖపడలేదు. ఒకచోట నిలవక ఎప్పుడూ ఊరూరా తిరిగే తండ్రితో అమెకూడా బొంగరంలా తిరుగుతూనే ఉంది. చివరకు ఆయన మిగిల్చిపోయింది ఏమీలేదు, నన్నుతప్ప.

నాలుగిళ్ళలో పాచిపని చేసి, వాళ్ళు పెట్టింది తినక దాచుకుని ఇంటికెళ్ళి పిల్లలకు కడుపునిండా పెట్టి, భర్తకోసం తాను తినకుండా ఎదురుచూసే పనిమనిషి రంగమ్మకు దొరికిందేమిటి? తాను సంపాదించిన దానితో శుభ్రంగా తాగేసి, ఇంటికి రాగానే సరైన భోజనం లేదని భార్యను నాలుగు తన్ని, ఉన్నదంతా తిని హాయిగా పడుకునే భర్త. ప్రతి చిన్న తప్పుకి కొట్టి హింసించే భర్తని కూడా అది అతని బలహీనతగా తీసుకుని సర్దుకుపోయే పార్వతమ్మ పిన్ని, భర్త ఎంతమందితో తిరుగుతున్నా తనను ప్రేమగా చూసుకుంటాడని మురిసిపోయే వరలక్ష్మక్కా, భర్తతో సమానంగా సంపాదిస్తూ, ఇటు ఇంటిపని, బజారు పని, పిల్లల బాధ్యత అన్నీ నెత్తిన వేసుకుని, అన్ని రకాలుగా అవస్థ పడుతున్న కొలీగ్ సుజాత, ఆలొచించుకుంటూ పోతే స్త్రీజాతిపట్ల తాత్కాలికంగానైనా ఒక చెడు అభిప్రాయం కలిగినందుకు నా మీద నాకే కోపం వచ్చింది.

పురుషుడు తప్పు చేయడం, స్త్రీ సౌశీల్యంతో బ్రతకడం సహజం. ప్రాచీన కాలం నించి పురాణాల్తో సహా ఆధునిక నవలలు కూడా తరతరాలుగా సంస్కృతి పేరిట స్త్రీలలోని చిన్న తప్పుని కూడా బ్రహ్మాండమంతగా చిత్రికరిస్తున్నాయి. పురుషుడిలొని బలహీనతలను సీరియస్ గా తీసుకోనవసరం లేదు అన్న సమాజపు రీతిలోనేను కూడా పెరిగినందుకు నా ఆలోచన కూడా అలానే సాగుతోంది. పురుషుడి తప్పులకీ, స్త్రీ సౌశీల్యానికి అలవాటుపడిపోయిన ఆలొచన, స్త్రీ తప్పుని నేరంగా మలుస్తూ పురుషుడి గొప్పతనాన్ని అతిగొప్ప గుణంగా చిత్రీకరించే భావంతో మిగిలిపోతోంది.

ఆలోచనలతో వేడెక్కిన బుర్రని చల్లినీటి స్నానంతో చల్లబరిచి తయారయి బయటకు వచ్చాను. శ్రీనాథ్ రాకపొయినా నాకు సినిమాకు వెళ్ళాలనిపించింది. లేకపోతే ఆదివారం గడపటం కష్టం.

బస్సెక్కి దగ్గిరలో ఉన్న సినిమాహాలు దగ్గిర దిగి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కుర్చున్నాను.

మరీ పాత సినిమా కాదుకానీ ఏదో అవార్డు సినిమా కాబోలు ఎక్కువ రష్ లేదు. సినిమా అప్పతికే మొదలయింది. అరగంట గడిచినా కథ సాగలేదు. చీకట్లో తీసిన సినిమాలా ఉంది.

నకు బోర్ కొట్టింది. తలతిప్పి చుట్టూ చూసాను. రెండు వరుసల ముందు ఒక చివరగా ఒక జంట కూర్చున్నారు. వాళ్ళు సినిమా చూడ్డానికి వచ్చినవాళ్ళు కాదని తెలిసిపోతోంది. అతడి చెయ్యి ఆమె భుజం చుట్టూ తిరిగి ముందుకు వెళ్ళింది. మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. సినిమాకన్నా ఆ దృశ్యం బాగుంది. చీకట్లో అతడి చేతి కదలికలను బట్టి అతడేం చేస్తున్నాడో ఊహిస్తూ కూర్చున్నాను. ఆమె కూడా ఇబ్బందేమీ పడటం లేదు. ఏదో వద్దనాలి కాబట్టి అంటున్నట్లు మధ్య మధ్యలో చేయి తీసేస్తోంది.

అంతలో ఇంటర్వెల్ అయిందన్నట్లుగా లైట్లు వెలిగాయి. లేవబోతూ ఆ జంటవేపు చూసి ఆగిపోయాను.

ఆ స్త్రీ శ్రీనాథ్ భార్య మల్లిక. ప్రక్కునన్నది ఆమెకంటె వయసులో బాగా పెద్దవాడయిన వ్యక్తి. అతడి చెయ్యి ఇంకా ఆమె భుజాల చుట్టూనే ఉంది. ఆమె అతడి భుజాల మీద తలని వాల్చి చుస్తోంది.
నేను లేచి బయటకు వచ్చేసాను.

* * *
చలపతి, శ్యాంబాబు అప్పటికే వచ్చేసారు. వాళ్ళతో పాటు భోజనానికి కూర్చున్నాను. నాయర్ మెస్ లో భోజనం బావుంటుంది.
ఏమయ్యా, చెప్పకుండా వెళ్ళిపోయావేం! వస్తావో, రావోనని చూస్తున్నాను అన్నాడు శ్యాంబాబు. నేనా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా , ఏం చలపతీ, పోయినవారం రాలేదు. ఊళ్ళో లేవా? అని అడిగాను.

ఊ, అమ్మా వాళ్ళు సంబంధాలు ఏవో ఉన్నాయని వ్రాస్తే చూడటానికి వెళ్ళాను అన్నాడు చలపతి. అతడు సెక్రటేరియట్ లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. బ్రహ్మచారి, అక్కా బావా దగ్గరుంటున్నాడు. నాయర్ కీ చాలా కాలం నుంచీ ప్రెండ్. అందుకే ప్రతి ఆదివారం హోటల్ కి వచ్చి భోజనం చేసి వెళతాడు.

ఇంతకీ సెటిలయిందా లేదా అది చెప్పు.. అన్నాడు శ్యాం. అతడు టెలిఫోన్స్ లో చేస్తున్నాడు. పెళ్ళయింది. భార్య పుట్టింటికెళ్ళింది డెలివరీకి.
దాదాపు సెటిలయిపోయినట్లే. అమ్మాయిది మా ఊరి దగ్గరే పల్లెటూరు. పదో తరగతి పాసయ్యింది. తెలివిగా, అమయకంగా ఉంది. నాకు బాగా నచ్చింది.

ఉద్యోగం చేస్తున్న అమ్మాయి సంబంధం వచ్చిందన్నావుగా! అదెందుకు వద్దనుకున్నావు? అన్నాడు శ్యాంబాబు.
మీ ఆఫిసులో పరంధామయ్యగారని ఉన్నారు తెలుసా? అడిగాడు చలపతి.
తెలుసు, నేనాయన దగ్గరే పనిచేసేది.. ఏం.? అన్నాను.
ఆయన రెండో కూతురి సంబంధమే నేను తిరగొట్టింది.
ఆ అమ్మాయి ఏదో ప్రైవేత్ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది.
నేను ఆశ్చర్యంగా ఆ అబ్బాయివి నువ్వా! అన్నాను. అబ్బాయి సెక్రటేరియట్ లో అఫీసర్ సంబంధం సెటిలయినట్లే అన్నాడె.!

వాడి మొహం బాగా కోస్తాడు, కాబోయే అల్లుడు ఆఫీసరని చెప్పడం గొప్ప అనుకున్నాడేమో!
గొప్ప అనుకోవడమేమిటి! రేపు అందరికీ తెలుస్తుందనే ఆలొచన రాదంటావా?
ఆయనకు రాదు. మా అక్కయ్యా, బావల ప్రాణాలు తీస్తున్నాడు. నాకు వేరే సంబంధం సెటిలయిపోయినట్లే అని చెబితే ఏదో వంక చెప్పి కాన్సిల్ చేయమంటాడు. వాడంత నికృష్టుడిని నేను చూడలేదు.

నేనింకా షాక్ నుంచి తేరుకోలేదు.
అన్నీ లక్షాధికార్ల సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయి వప్పుకోవడం లేదు. ఈ సెక్రటేరియట్ సంబంధం వాళ్ళు మరీ వెంటపడుతున్నారు అన్నాడు మాతో .. అదే అన్నాను.

ఆ మాటలకి చలపతి మరిమ్త ఇరిటేట్ అయ్యాడు.

నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడనుకుంటాను. వాళ్ళ పెద్దమ్మాయి మా ఆఫీసులోనే చేస్తోంది. అప్పట్లో ఇంటిదగ్గరుండె ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయి నిరుద్యోగి. ఒకరోజు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పెళ్ళి చేసుకున్నారో లేదో గానీ ఎక్కడో కాపురం పెట్టారు. రెండు నెలల దాకా వాళ్ళ జాడ తెలియలేదు. పేపర్లో ఫోటోలు, పోలీసు రిపోర్టు కూడా ఇచ్చాడు. రోజూ మా ఆఫీసు చుట్టూ తిరిగేవాడు. చివరికి ఆ అబ్బాయితో ఆ అమ్మాయి కనిపించింది. ఏమీ చెప్పుకోలేక ఇద్దరికీ తనే పెళ్ళిచేసాడు. కానీ ఆ అబ్బాయంటే చిన్నచూపు. ప్రస్తుతం ఆ ఇంట్లో అతడికి గౌరవంలేదు. భార్యకి కూడా అతనంటే ప్రేమగానీ, గౌరవంగానీ లేవు. మొదట్లో ఉన్న ప్రేమంతా పొయింది. తను చేసింది తప్పని ఫీలవుతోందో, జీవితంలో డబ్బు అవసరం ఎక్కువని గ్రహించిందో ...అతడితో కాపురం అయితే చేస్తోంది గానీ నౌఖరు కంటే హీనంగా చూస్తోంది. ప్రస్తుతం మా ఆఫీసులోనే పనిచేసే రావుగారితో ప్రేమాయణం సాగిస్తోంది అన్నాడు.

ఛ! ఏదో స్నేహం కావచ్చు. ఎందుకలా చెడుగా అనుకోవడం!
నాకు మాత్రం ఎదుటివాళ్ళ గురించి కామెంట్ చేయడం, అదీ నిజం తెలుసుకోకుండా వాగడం ఇష్టమా! ఇది ఆఫీసులో అందరికీ తెలిసిన విషయమే. ఆ అమ్మాయి ఆయనమీద తనకున్న అధికారాన్ని బహిరంగంగానే చూపిస్తుంది. ఆయన భార్య ఆయనకు కట్నంగా తెచ్చిన కారుని నా కారు అని గర్వంగా చెప్పుకుంటుంది. మధ్యాహ్నం అవగానే ఇద్దరూ కారులో రోజుకో హాటల్ కి భోజనానికి వెళ్ళిపోతారు.

ఇంట్లో భార్య దగ్గర మనశ్శాంతి లేదని, అందుకే వీళ్ళమ్మాయి దగ్గరకు వస్తున్నాడని నాతోటే చెప్పాడు పరంధామయ్య.

వాళ్ళిద్దరిమధ్యా సంబంధం గట్టిపడటానికి ప్రత్యత్నిస్తున్నదీ, ప్రోత్సహిస్తున్నదీ ఆయనే. ఇంట్లో మనశ్శాంతి లేనివాళ్ళు వందమంది ఉంటారు. వాళ్ళందరినీ కూతురి దగ్గరకు రానిస్తాడా? అబధ్దాలు చెప్పడం సులువు. రేపు నిజం బయటపడితే ఫేస్ చేయగలిగే ధైర్యం ఉండాలి. ఆ అమ్మాయి భర్తకిపుడు మంచి ఉద్యోగమే దొరికింది. రావుగారే వేయించారు. ఎక్కువగా టూర్లుంటాయి. అతడు ఊరు వెళ్ళగానే రాత్రిళ్ళు రావుగారి మకాం అక్కడే. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. పరంధామయ్య మాత్రం వాళ్ళది స్వచ్ఛమైన స్నేహం అంటాడు.

మరోగంట అక్కడే కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చాను. శ్రీనాథ్ అప్పుడే బయటకు వెళుతూ ఎదురుపడ్డాడు.
మల్లిక ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉందేమో చూసివద్దామని వెళుతున్నాను. ఆమె మొండిగా ఉందని నేనూ మొండికేస్తే ఎలా? అన్నాడు.

ఆమెను సినిమా హాల్లో చూసిన విషయం చెప్పలేదు. అలాగే నన్నట్లు తలూపి లోపలికి నడిచాను. మల్లిక అన్నయ్య ఇంటికి వెళ్ళి ఉంటుమ్ది. అతడు మల్లికని ఆదరిస్తాడు. పరంధామయ్య కూతుర్ని పరంధామయ్య సపోర్ట్ చేస్తాడు. ఈ ప్రపంచంలో అబ్ సొల్యూట్ గా నైతిక విలువలంటూ ఏమీ లేవు. మన అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి.

వరండాలో వీరభద్రయ్య గారు పడుకుని చిన్నగా ఆయాసప్డుతున్నాడు. కానీ ఉధృతం చాలా తగ్గింది. ఆ ఇంట్లో వాళ్ళంతా పక్క గదిలో కుర్చుని టీ.వీ.లో సినిమా చూస్తున్నారు. నవ్వుకుంటున్నారు. ఉదయం ఆ ఇంట్లో కనిపించిన భయం, దుఃఖం ఏ కోశానా కనిపించడం లేదు.

* * *
 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech