Sujanaranjani
           
  కబుర్లు  
  వీక్ పాయింట్
      ఖాకి కష్టాలు ఖాకివి  
 

- రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి

 
 

ఔనుమరి! పోలీసులు చెప్పేదీ పాయింటే.

స్వస్తిశ్రీ చాంద్రమాన నందన నామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి గురువారం సాయంత్రం గం.7.01 ని.కు ఆర్ర్దా నక్షత్రయుక్త సింహలగ్న పుష్కరాంశలో దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టాండు దగ్గరి వెంకటాద్రి థియేటరు ముందు సైకిల్ బాంబు పేల్చుటకు పాకిస్తాన్ సర్కారు కొలువులోని లష్కరే తోయిబా దైవజ్ఞులచే సుముహూర్తము నిశ్చయించబడినది. కావున తమరెల్లరు రాజకీయ బంధుమిత్ర ఖాకీ పరివార సమేతంగా విచ్చేసి మమ్మానందింప జేయవలసినది - అని వారికెవరూ శుభలేఖ పంపలేదు. పిలవా పెట్టకుండా వారు మాత్రం ఎలా వెళతారు? అక్కడ అంత పెద్ద కార్యం జరుగుతూంటే మీరెందుకు జాడ లేరు అని పోలీసు బాబులను నిగ్గతీయడం ఏమన్నా మర్యాదగా ఉందా?
శుభలేఖే పంపక్కర్లేదు. ఫలానా చోట ఫలానా ఈవెంటు జరగబోతున్నదని ఎవరో ఒకరు కనీసం ముందస్తు సమాచారమైనా పోలీసు దళపతుల చెవిన వెయ్యాలికదా?
అలాంటిదేదో జరగబోతున్నదని మాకు ముందే తెలుసోచ్ - అని కేంద్ర హోంమంత్రి షిండేవారు బడాయి కబుర్లు బాగానే చెబుతున్నారు. మీ దగ్గర టెర్రరిస్టు దాడి జరగొచ్చని ఎ.పి. సర్కారుకూ, హైదరాబాదు పోలీసులకూ ఉప్పందించామన్న ఆయనగారి గొప్పలకే మొచ్చె?! మిగతా మూడు నగరాలకూ పంపినట్టే తమకూ ప్రమాద హెచ్చరికను అంపిస్తే ఆ దాడి సరిగా తమ రాజధాని నగరంలోనే జరగబోతున్నదని మన పోలీసులు ఎలా ఊహిస్తారు? ఫలానా తేదీన ఫలానా టైముకు ఫలానా ప్రాంతంలో ఫలానా స్థలంలో బాంబులు పేలుతాయని వారికి 'స్పెసిఫిక్' సమాచారం లేకపోతే వారు మాత్రం ఏమి చేయగలరు? రాజకీయ నాయకుల సేవలకే, పైవాళ్లు పురమాయించే చిల్లర పనులకే, వి.ఐ.పి.ల బందోబస్తుకే ఎక్కడి సమయమూ చాలనప్పుడు... ఉగ్రవాదుల జాడలను కనిపెట్టటం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచటం, శాంతిభద్రతలను రక్షించటం, ప్రజల ప్రాణాలు కాపాడటం లాంటి పనికిమాలిన ఎక్స్‌ట్రా పనులకు పాపం వారికి తీరిక ఎక్కడ?
పాకిస్తానీ ఏజెంట్లు పోయిపోయి దిల్‌సుఖ్‌నగర్ మీద పడతారని కలలో కూడా ఊహించలేకపోయాం అని చెప్పి పోలీసులు తప్పించుకోలేరు - నిజమే! ఇస్లామిక్ ఉగ్రవాదుల చెడుచూపు ఆ ఏరియా మీద పడిందని పదకొండేళ్ల కింద అక్కడి సాయిబాబా గుడి దగ్గర స్కూటర్ బాంబు పేలినప్పుడే అందరికీ తెలిసిపోయింది. ఆరేళ్ల కింద లుంబినీ పార్కు, గోకుల్‌ఛాట్‌లతోబాటు దిల్‌సుఖ్‌నగర్ సెంటర్లోనూ బాంబు పేలవలసి ఉండె! దాన్ని పెట్టినవాడు టైమరును కంగారులో సరిగా బిగించకపోవటంవల్ల, జనం రోజులు బాగుండటంవల్ల అది చప్పుడు చెయ్యలేదు. సరిగ్గా అప్పుడు పెట్టినచోటే అదే పద్ధతిలో మొన్నా బాంబులు పేల్చి పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీశారు. ఆరేళ్లు లేటుగా పని పూర్తి చేశారు. వెనకటి అనుభవం తర్వాతయినా పోలీసులు కాస్త మెలకువగా ఉండొచ్చుకదా? అదే చోట మళ్లీ దుర్ఘటన జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవలసింది కదా - అని ఇప్పుడు అంతా ఆక్షేపిస్తున్నారు. కాని - ఒకసారి దొరికిపోయిన చోటే మళ్లీ అదే నేరానికి సాధారణంగా ఎవడూ ఒడిగట్టడు కదా? టెర్రరిస్టులు తెలివిమీరి రెండోసారీ సరిగ్గా ఆ స్పాటులోనే బాంబు పెడతారని ఖాకీ దండధరులు పాపం ఎలా ఊహించగలరు?
అవసరం పడినప్పుడు బాంబులు ఎక్కడ పెట్టవచ్చన్నది చూసుకోవడానికి నిరుడు జులైలో దిల్‌సుఖ్‌నగర్ ఏరియా అంతా తిరిగి రెక్కీ చేశామని ఢిల్లీ పేలుళ్ల కేసులో పట్టుబడ్డ ఉగ్రవాది మూణ్నెల్ల కిందటే ఢిల్లీ పోలీసుల చెవిన వేశాడు. ఆ ఊసును ఢిల్లీవాళ్లు మన పోలీసులకు అప్పుడే చెప్పారు. (వాళ్లు చెప్పేదేమిటి? ఆ సంగతి మాకు వారికన్నా ముందే తెలుసు అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి మహోదయులే సెలవిస్తున్నారు. అది ఇంకా భేషు!) ఎలాగైతేనేం? దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పెట్టటానికి ఉగ్రవాదులు ఆనుపానులు చూసి పెట్టుకున్నట్టు తెలవడమైతే ముందుగా తెలిపింది కదా? కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్లు డైరెక్టుగా తొడకొట్టి... అఫ్జల్ గురూగారి ఉరితీత దరిమిలా ఢిల్లీ నుంచీ ఎలర్టు మీద ఎలర్టు వచ్చాకయినా పోలీసులు 'ఇంటెలెజిన్సు' తెలివితేటలు ఉపయోగించి, రెక్కీ జరిగిన చోట నిఘా పెట్టవద్దా? హైదరాబాదులో పాకిస్తానీ ఏజంట్లమీద, ఆ బాపతు సోకాల్డ్ స్లీపర్ సెల్సు మీద ఒక కన్నువేసి ఉంచవద్దా? అని ఘోరం జరిగిపోయాక ప్రతివాడూ పోలీసుల మీద ఒంటికాలిపై లేస్తున్నాడు సరే. కాని - కాస్త పోలీసుల వైపు నుంచీ ఆలోచించండి.
పీత కష్టాలు పీతవన్నట్టు ఖాకి కష్టాలు ఖాకివి. తెలివీ తేటా ఇంకా కొంచెం మిగిలిన వాళ్లు ఖాకీ కులంలో లేకపోలేదు. కాని - వాటిని ఉపయోగించి, ఉగ్రవాదుల అడ్డాలో ఉగ్రవాదుల పీచమణిచే దుస్సాహసానికి ఒడికట్టటం ఎంత డేంజరు? వెనకటికి ఎ.కె.మొహంతీ, రాజీవ్ త్రివేదీలనబడే సత్తెకాలపు పెద్ద పోలీసయ్యలు అలాగే చొరవ చూపించి, దేశద్రోహులను పట్టుకోబోతే ఏమయింది? వాళ్లు పక్కకు నెట్టెయ్యబడ్డారే తప్ప టెర్రరిస్టు ప్రమథగణాల తలవెంట్రుకనైనా చెదరగొట్టగలిగారా? పాతబస్తీనిండా, ఆ మాటకొస్తే జంటనగరాల నిండా స్లీపర్ సెల్లుల పుట్టలు పెరిగి ఉన్నప్పుడు వెయ్యికళ్ల పోలీసువాడు మాత్రం ఏ పుట్టలోని ఎన్ని విషపురుగుల మీదని దృష్టి పెట్టగలడు? ఒకవేళ పెట్టినా... జిహాదీ పుట్టలో వేలుపెడితే రాజకీయ రక్షకులు కుట్టకుండా, కొట్టకుండా విడిచిపెడతారా? లష్కరేలకు, హుజీలకు, కమాండర్లయిన వాళ్లు కూడా హైదరాబాదు షెల్టరు జోనులో అతి సామాన్య గృహస్థులుగా చలామణి అవుతుంటారు. ఏ కేసులో ఏ అనుమానంతోనో వారిని పట్టి ‘లోపల’ వేస్తే మానవహక్కులు మంట కలిసినట్టు, మత స్వేచ్ఛ బుగ్గి అయినట్టు, మహాపరాధం జరిగిపోయినట్టు గోలగోల అవుతుంది. డ్యూటీ చేసిన పోలీసు మీదే చివరికి వేటుపడుతుంది. ఇక తెలిసి తెలిసీ ఎవడు రిస్కు తీసుకుంటాడు? చూస్తూ చూస్తూ పులిగుహలోకి ఎవడు తలదూరుస్తాడు? ఏ సీటులో ఎవరుండాలో, ఏ కేసు ఎవరు దర్యాప్తు చేయాలో, ఎవరు చేయకూడదో కూడా అమాంబాపతు రాజకీయ శాల్తీలు నిర్ణయంచగలిగేటప్పుడు పోలీసు బలగం సజావుగా ఎలా పనిచేస్తుంది? చట్టమంటే భయం ఉగ్రవాద విషసర్పాలకు ఎందుకుంటుంది?

 

 
 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech