Sujanaranjani
           
  కబుర్లు  
  వార్త - వ్యాఖ్య
         

రేడియో రోజులు

 
 

- రచన : భండారు శ్రీనివాస రావు

 
  “ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.
అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం.  ఇందిరాగాంధీ దయవల్ల తాను  ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికి కానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.
చెన్నారెడ్డి గారి వంటి  చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్థానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర  కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ  సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా  ఈ మీటింగులు  శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సంకేతం  పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి  అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.           
ఎందుకో ఏమో కారణం తెలియదు కాని,  నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది.  ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా  కదలనిచ్చేవారు కాదు. “వెడుదుగానిలే! కాసేపు కూర్చో!” అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా. 
అంజయ్య గారు  గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో – కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.
పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా - ఈ.ఎస్.ఐ.  ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో ప్రసూతి  గదికి  ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం  చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.
ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి కానీ, అంజయ్య గారు విషయాలను యెంత  నిశితంగా పరిశీలించేవారో నాకు తెలుసు.   
ఒకసారి కౌలాలంపూర్ లో తెలుగు మహాసభలు జరిగాయి.  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన  తరవాత అంజయ్య గారు హోటల్ రూముకి తిరిగొచ్చేసారు. వెంట షరా మామూలుగా నేను. కాస్త నలతగా కనిపించారు. అంత పెద్ద గదిలో ఆయనా నేను ఇద్దరమే. సాయంత్రం అవుతోంది. ఆయన దీర్ఘంగా ఆలోచిస్తూ  కిటికీలోనుంచి బయటకు చూస్తున్నారు.  విశాలమయిన రోడ్డు. వచ్చే కార్లు. పోయే కార్లు. పక్కనే ఏదో ఫ్యాక్టరీ లాగావుంది.
ఆయన వున్నట్టుండి “చూసావా!” అన్నారు. నాకేమీ అర్ధం కాలేదు.
“పొద్దున్న బయలుదేరేటప్పుడు చూసాను. అందులో (ఆ ఫ్యాక్టరీ లో) పనిచేసేవాళ్లందరూ గంట కొట్టినట్టు టైము తప్పకుండా వచ్చారు. అయిదు నిమిషాల్లో లోపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్లీ అంతే. షిఫ్ట్ పూర్తికాగానే ఠంచనుగా ఇళ్లకు పోతున్నారు. పనిచేసేవాళ్లకు వాళ్లకు కావాల్సింది ఇవ్వాలి. కావాల్సిన విధంగా పని చేయించుకోవాలి.  ఇలా మన దగ్గర కూడా చేస్తే కావాల్సింది ఏముంటుంది!” అన్నారాయన యధాలాపంగా.
అంటే ఇప్పటిదాకా ఆయన ఆలోచిస్తోంది ఇదన్నమాట.
‘కౌలాలంపూర్ తెలుగు మహాసభల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదనీ, ఇందిరాగాంధీ ఈ విషయంలో ముఖ్యమంత్రి పట్ల  చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారనీ’  – హైదరాబాదులో ఒక పత్రిక రాసిన విషయం ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న అంజయ్య గారికి “రాజకీయ జ్వరం” పట్టుకున్నట్టు అప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. అందుకే ఆయన సభా ప్రాంగణంలోనే వుండిపోకుండా వొంట్లో బాగోలేదనే నెపంతో హోటల్ రూముకి తిరిగొచ్చేసారని వదంతులు హైదరాబాదు దాకా పాకాయి. ఈయనగారేమో ఇక్కడ తాపీగా కూర్చుని  కార్మికులు గురించి ఆలోచిస్తున్నారు. అలా వుండేది అంజయ్య గారి వ్యవహారం.
అంజయ్య గారితో మరో వ్యక్తిగత అనుభవం గురించి చెప్పి దీన్ని ముగిస్తాను.
ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్  అనాలా?)లో  ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్థితిలో  ఉందో తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే – అక్కడినుంచి మూడో ఇల్లే మాది – మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో  బాగా వెనగ్గా  వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో  ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా  లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని  చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి  పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ  సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు  భవనం వెంకట్రాం కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్థితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి  పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.
ఏవయినా అవి బంగారు రోజులు.
 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech