Sujanaranjani
           
  సారస్వతం  
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 

విశ్వ – విశ్వప్రకాశాల ఐక్యవాదం :

కొన్ని చర్చనీయాంశాలు


 

 

                                                  -  పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

     
 

సంస్కృతంలోని కోశవాఙ్మయంలో అమరసింహుని నామలింగానుశాసనం తర్వాత అత్యంత సుప్రసిద్ధమైన విశ్వప్రకాశకోశం, విశ్వకోశం ఒక గ్రంథానికే నామాంతరాలా? లేక అవి రెండూ వేర్వేఱు గ్రంథాలా? అన్న వివాదం ఈ నాటిది కాదు. వ్యాఖ్యానచక్రవర్తి మల్లినాథసూరి వివృతులలోనూ, ఇతరానేకవ్యాఖ్యాతల ఉదాహరణలలోనూ ఇతి విశ్వప్రకాశః, ఇతి విశ్వప్రకాశికా, ఇతి విశ్వః అని కనబడుతున్న నిర్దేశాలలోని విశ్వప్రకాశం, విశ్వప్రకాశిక క్రీ.శ. 111112 లో మహేశ్వర సూరి రచించిన విశ్వప్రకాశ కోశమని అందఱూ అంగీకరిస్తున్నారు. అయితే, విశ్వకోశం అన్నది విశ్వప్రకాశ కోశానికే వేఱొక పేరని కొందఱు; కాదు, విశ్వకోశం అనే ప్రాచీనమైన కోశం వేఱొకటున్నదని కొందఱు; విశ్వకోశంలోని పెక్కు శ్లోకభాగాలు నేటి విశ్వప్రకాశకోశంలో కలిసిపోయాయని కొందఱు - విమర్శకులు విధవిధాలుగా ఊహించినందువల్ల ఈ విషయం వివాదగ్రస్తమయింది. క్రీ.శ. 1864 లో కాశీలో అచ్చయిన విశ్వప్రకాశ కోశం పీఠికలో పరిష్కర్త శ్రీరామ మహోపాధ్యాయులు ముమ్మొదటిగా ఈ వాదాలను పరిశీలించి, మల్లినాథుని వ్యాఖ్యానోదాహరణలలో కనుపిస్తున్న విశ్వకోశం, విశ్వప్రకాశ కోశం అన్నవి రెండూ ఒకటి కావని, వస్తుతః అవి వేర్వేఱని, కర్తృకాలాదికవిశేషాలు గుర్తెఱుగరాని ఒకనాటి విశ్వకోశం ఇప్పుడు అంతర్హితమైపోయిందని నిశ్చయించారు. క్రీ.శ. 1911లో శీలస్కంధ స్థవిర రామగోపాల భట్ట విద్వాంసులు ముద్రించిన విశ్వప్రకాశ కోశం పీఠికలోనూ సంపాదకులు శీలస్కంధ యతి ఈ విషయాన్ని చర్చించి, విశ్వకోశం, విశ్వప్రకాశ కోశం అన్నవి రెండూ ఒకటేనని నిర్ణయించి, రెండింటి ఐక్యవాదాన్ని సమర్థిస్తూ -  

In them the references are indicated by the word “iti viśvah” and this has given rise to doubt among certain people as to the identity of the reference. They believe that there existed two books called “Viśvakosa” and “Viśvaprakāśa” and that the former is now extinct. The greater number of scholars admits that both names were applied to one and the same book.”

అని వ్రాశారు. అందువల్ల స్థితగతిచింతనులు వివిధవ్యాఖ్యానాలలోని ఉద్ధారాలన్నింటిని సేకరించి ఈ ఐక్యానైక్యవిషయాన్ని పరిశీలిస్తే వివాదం సుపరిష్కృత మవుతుంది.

ముందుగా క్రీస్తుశకం 14-వ శతాబ్ది ఉత్తరార్ధం నాటి మల్లినాథసూరి వ్యాఖ్యానవిషయాన్ని పరిశీలిద్దాము. కావ్యార్థప్రతిపత్తికోసం ఉద్దిష్టార్థప్రదీపకంగా ఆ వ్యాఖ్యాతృచక్రవర్తి తన వ్యాఖ్యలలో ఉద్ధరించి ప్రమాణీకరించిన గ్రంథాలు అనేకం. పదార్థోక్తి కోసం, నామాంతరపరిచయం కోసం, ప్రతికూలప్రమాణాల అనుపలబ్ధినిర్దేశం నిమిత్తం, ప్రతిజ్ఞోపసంహార వాక్యావళిని ప్రదర్శించటం కోసం నిర్వేలాయితమైన ఆ విషయ వివరణ విన్యాసక్రమపరిగతిలో ఒక్కొక్కసారి గ్రంథనామాలను, ఒక్కొక్కసారి గ్రంథకర్తృనామాలను ఉదాహరించటం ఆయనకు పరిపాటి. కాళిదాసీయ మేఘదూత  సంజీవనీ వ్యాఖ్యలో ఆయన ఇతి విశ్వః అని విశ్వకోశాన్ని ముప్ఫైఅయిదు పర్యాయాలు, ఇతి విశ్వప్రకాశః అని విశ్వప్రకాశ కోశాన్ని కేవలం రెండు పర్యాయాలు ఉదాహరించాడు. ప్రథమ సర్గలోని యే సంరమ్భోత్పతనరభసాః" అన్న శ్లోకవ్యాఖ్యలో కాళిదాసు "శరభా లఙ్ఘయేయు ర్భవన్తం" అన్నందుకు "శరభః శలభే చాష్టాపదే ప్రోక్తో మృగాన్తరే ఇతి విశ్వః" అని; "కరకస్తు కరఙ్కే స్యా ద్దాడిమే చ కమణ్డలౌ పక్షిభేదే కరే చాపి కరకా చ ఘనోపలే ఇతి విశ్వప్రకాశ వచనే తు" అని, ఆ ప్రక్కనే కొద్దిపాటి వ్యవధానంతో రెండు పేర్లను ఉదాహరించటం కనుపిస్తుంది. విశ్వప్రకాశము నుంచి మల్లినాథుడు ఉదాహరించినది విశ్వప్రకాశములో ఆ ప్రకారంగానే ఉన్నది కాని, విశ్వకోశము నుంచి ఉదాహరించిన చోట మాత్రం కొద్దిపాటి వ్యత్యాసంతో "కరభః శరభ స్త్వష్టాపదే ప్రోక్తో మృగాన్తరే" అని ఉన్నది.

కాళిదాసీయ రఘువంశములోని ఒక్క ప్రథమ సర్గను మాత్రమే తీసుకొందాము.

"ప్రణవ శ్ఛన్దసామివ" అని కాళిదాసు (శ్లో. 11). "ఛన్దః పద్యే చ వేదే చ - ఇతి విశ్వః" అని మల్లినాథుడు. ఈ భాగం నేటి విశ్వప్రకాశంలో ఈ విధంగా లేదు. "ఛన్దో వశే౽ప్యభిప్రాయే హృదాఖ్యా చిత్తబుక్కయోః, వేదిరఙ్గులముద్రాయాం బుధే౽లఙ్కృతభూతలే" అని ఉన్నది.

"మేరు రి వాత్మనా" అని కాళిదాసు (శ్లో. 14). "ఆత్మా జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని - ఇతి విశ్వః" అని మల్లినాథుడు. ఈ భాగం నేటి ముద్రిత విశ్వప్రకాశంలో లేదు.

"సహస్రగుణ ముత్స్రష్టు మాదత్తే హి రసం రవిః" అని కాళిదాసు (శ్లో. 18). "రసం గన్ధే రసే స్వాదే తిక్తాదౌ విషరాగయోః, శృఙ్గారాదౌ ద్రవే వీర్యే దేహధాత్వంబుపారదే - ఇతి విశ్వః" అని మల్లినాథుడు. ఈ భాగం నేటి ముద్రిత విశ్వప్రకాశములో "రసో గన్ధరసే స్వాదే చిత్తాదౌ విషరాగయోః, శృఙ్గారాదౌ ద్రవే వీర్యే దేహధాతౌ చ పారదే" అని ఉన్నది. నిజానికి ముద్రిత ప్రతిలోనూ మల్లినాథుడు ఉదాహరించిన పాఠమే అనుసరణీయం. 

"స వేలావప్రవలయాం" అని కాళిదాసు (శ్లో. 30). "వేలా కూలే౽పి వారిధేః - ఇతి విశ్వః" అని మల్లినాథుడు. ఈ భాగం నేటి ముద్రిత విశ్వప్రకాశంలో ఈ విధంగా లేదు. "వేలా కూలే చ జలధేస్తీర నీర వికారయోః" అని ఉన్నది.  

"వార్ధకే మునివృత్తీనాం" అని కాళిదాసు (శ్లో. 8). "వార్ధకం వృద్ధసఙ్ఘాతే వృద్ధత్వే వృద్ధకర్మణి - ఇతి విశ్వప్రకాశః" అని మల్లినాథుడు. ఇది విశ్వప్రకాశములో ఇదే విధంగా "వార్ధకం వృద్ధసఙ్ఘాతే వృద్ధత్వే వృద్ధకర్మణి"ఉన్నది.

వ్యాఖ్యలో తొలిసారి కనుక 8-వ శ్లోకం వద్ద "విశ్వప్రకాశము" అని గ్రంథం పేరును పూర్తిగా పేర్కొని, ఆ పైని మల్లినాథుడు కోశనామాన్ని సర్వే సర్వత్ర "విశ్వము" అని సంగ్రహీకరించాడని దీనిని బట్టి ఊహించటానికి వీలులేదు.

సూక్ష్మంగా పరిశీలించి చూస్తే - మల్లినాథుని అనుసరించిన ఇతర వ్యాఖ్యానకర్తల విషయమూ చాలా వఱకు ఇంతేనని తేటతెల్ల మవుతుంది. క్రీస్తుశకం 13-వ శతాబ్ది ఉత్తరార్ధం నాటి హేమాద్రి పండితుడు వ్రాసిన రఘువంశ దర్పణ వ్యాఖ్యలో ద్వితీయ సర్గలోని రెండవ శ్లోకానికి కోశప్రమాణాన్ని పేర్కొంటూ - మొదటిసారి కనుక ఒకే ఒకసారి ఇతి విశ్వప్రకాశః అని పేర్కొని, ఆ పైని ఎన్నిసార్లు పేర్కొనవచ్చినా ఇతి విశ్వః అని మాత్రమే పేర్కొన్నాడు. ఆయన ఇతి విశ్వప్రకాశః అని పేర్కొన్న దళం విశ్వప్రకాశములో యథాతథంగానూ;  ఇతి విశ్వః అని పేర్కొన్న చోట్ల ఉదాహరణలన్నీ విశ్వప్రకాశములో కొద్దిపాటి వ్యత్యాసంతోనూ ఉన్నాయి. ఎలాగూ పూర్వవ్యాఖ్యాతలు బహుపర్యాయాలు ఉదాహరించినదే కనుక క్రీస్తుశకం 16-వ శతాబ్ది నాటి దినకర మిశ్రుడు విశ్వప్రకాశమును పేర్కొనక తన సుబోధినీ వ్యాఖ్యలో మాత్రం అన్నిచోట్ల ఇతి విశ్వః అని మాత్రమే పేర్కొన్నాడు. ఆయన ఇతి విశ్వః అని పేర్కొన్న ఆ భాగాలన్నీ నేటి విశ్వప్రకాశములో కొద్దిపాటి వ్యత్యాసంతో కనుపిస్తున్నాయి. క్రీస్తుశకం 13-వ శతాబ్ది ఉత్తరార్ధాన హేమాద్రి పండితునికి సమకాలికుడైన చారిత్రవర్ధనుడు ఇందుకు మాఱుగా తన రఘువంశ శిశుతోషిణీ వ్యాఖ్యలో అన్నిచోట్ల ఇతి విశ్వప్రకాశః అని పూర్తి పేరును యథాతథంగా స్మరించాడు. ఆయన ఉదాహరించిన భాగాలన్నీ నేటి విశ్వప్రకాశములో యథాతథంగా ఉన్నాయి.  నేను చూచినంతలో ఇతి విశ్వః అన్న నిర్దేశంతో ఆయన ప్రమాణాలను ఉదాహరించినట్లు లేదు.

దీనిని బట్టి మల్లినాథుడు కొన్ని కొన్ని చోట్ల ఇతి విశ్వః అని పేర్కొన్న భాగాలే ఒకపాటి సందేహానికి తావిస్తున్నాయన్నది స్పష్టం.

 కుమారసంభవ సంజీవనీ వ్యాఖ్యలో మల్లినాథసూరి ప్రథమ సర్గ 29-వ శ్లోకం వద్ద "నిర్వేశో భృతి భోగయోః ఇతి విశ్వః" అని ఉదాహరించాడు. నేటి విశ్వప్రకాశములో ఇది "నిర్వేశో మూర్ఛనే భోగే నివేశో వేతనే౽పి చ" అని ఉన్నది.

ఒక్క విశ్వప్రకాశం విషయంలోనే కాక మల్లినాథసూరి ఇతర నిఘంటువులను పేర్కొనవలసి వచ్చినపుడు కూడా అప్పుడప్పుడు కొంత తడబాటుకు లోనైనట్లు కనబడుతుంది. లేదా, ఆయన తనవద్ద ఉన్న ప్రతులలో నుంచి ఉదాహరింపగా కాలాంతరంలో వ్రాతప్రతులను వ్రాసుకొన్నవారు ఆనాటి ఆ పాఠాలను మార్చివేశారని ఊహించాలి. కిరాతార్జునీయ ఘంటాపథ వ్యాఖ్యలో ద్వితీయ సర్గ 18-వ శ్లోకం వద్ద ఆయన "తేజో బలే ప్రభావే చ జ్యోతి ష్యర్చిషి రేతసి" అని యాదవ ప్రకాశుని వైజయంతీ కోశమును ఉదాహరించాడు. అయితే, ముద్రిత వైజయంతీ కోశములో అది "తేజో బలే ప్రభావే౽న్నే" అని కొంత వ్యత్యాసంతో ఉన్నది. ద్వితీయ సర్గలోనే 51-వ శ్లోకం వద్ద "ఛన్దఃకారణగుహ్యేషు జ న్త్వమాత్యాదికేష్వపి" అని ఆయన వైజయంతిని ఉదాహరింపగా అది నేటి ముద్రితప్రతులలో "... జన్త్వమాత్యాది మాతృషు" అని భిన్నంగా ఉన్నది. ప్రయోగసరళిలోని సామ్యవైషమ్యాల మూలాన ఒక నిఘంటువులోని శ్లోకాన్ని మఱొక నిఘంటువులోనిదిగా పొరబడటం కూడా అసంభావ్యం కాదు. విశ్వకోశములో "నిగమో వాణిజే పుర్యాం పథి వేదే వణిక్పథే", "పతఙ్గ శ్శలభే శాలౌ మార్జారే౽గ్నౌ రవౌ ఖగే", ఆధార శ్చాధికరణే౽ప్యాలవాలేం౽బుధారణే" వంటివి క్రమంగా వైజయంతీ కోశములో "నిగమో నిశ్చయో వేదే పురే పథి వణిక్పథే", పతఙ్గ శ్శలభే శాలిప్రభేదే విహగే రవౌ", "ఆధార ఆలవాలేం౽బుబన్ధే౽ధికరణేపి చ" అని యథాతథంగానో, కొద్దిపాటి మార్పులతోనో కనిపిస్తాయి. అలాగే, "రసో రాగే విషే వీర్యే తిక్తాదౌ పారదే ద్రవే, రేత స్యాస్వాదనే హేమ్ని నిర్యాసే౽మృత శబ్దయోః" అన్న వైజయంతీ కోశంలోని శ్లోకమే పదభేదంతో "శృఙ్గారాదౌ కషాయాదౌ ఘృతాదౌ చ విషే జలే, నిర్యాసే పారదే రాగే వీర్యే చ రస ఇష్యతే" అని పురుషోత్తమదేవుని ధనంజయ కోశములో ఉన్నది. హేమచంద్రుని అభిధానచింతామణిలో "తర్కో వితర్కే కాంక్షాయా మూహకర్మవిశేషయోః" అని ఉన్నదే, మహీపుని అనేకార్థతిలకములో "తర్కో విచారే కాంక్షాయా మూహకర్మవిశేషయోః" అని కనబడుతుంది. "హంసో విహఙ్గభేదే స్యా" దిత్యాదిగా ఉన్న విశ్వప్రకాశ శ్లోకాన్ని చూసే, ఇరుగప దండేశుడు నానార్థరత్నమాలలో "హంసః స్మరే ఖగే విష్ణౌ యతో నిర్లేపభూభుజి, జీవే౽ర్కే శ్వేతపృష్ఠే స్యా న్మన్త్ర పరమాత్మనః" అని అనుసంధించుకొన్నాడు. ఇవి ముద్రితాలు కాబట్టి సుపరిష్కృతాలని భావించటానికి వీలులేదు. పాఠభేదాలు, అపపాఠాలు మిక్కుటం.

ఇందుకు భిన్నంగా అమరసింహుని నామలింగానుశాసనమునకు మల్లినాథుడు వ్రాసిన అమరపద పారిజాత వ్యాఖ్యలో మల్లినాథుడు ఇతి విశ్వప్రకాశః, ఇతి విశ్వః అని పేర్కొన్న అన్ని చోట్లలోని భాగాలూ నేటి విశ్వప్రకాశ కోశంలో యథాతథంగా ఉన్నాయి. ఉదాహరణకు, నామలింగానుశాసనములోని జీవంజీవ శ్చకోరకః అన్న చోట ఆయన జీవంజీవ శ్చకోరే స్యాద్ ద్రుమపక్షివిశేషయోః ఇతి విశ్వః అని ఉదాహరించిన విశ్వకోశములోని పంక్తి విశ్వప్రకాశములో యథాతథంగా ఉన్నది.  అలాగే, నామలింగానుశాసనములోని "సఙ్ఘసార్థౌ తు జన్తుభిః" అన్న చోట ఆయన సార్థో వణిక్సమూహే స్యాదపి సఙ్ఘాతమాత్రకే ఇతి విశ్వః అని ఉదాహరించిన విశ్వకోశములోని పంక్తి విశ్వప్రకాశములో యథాతథంగా ఉన్నది. విశ్వప్రకాశములో నుంచి ఆయన ఇతి విశ్వప్రకాశికా అని ఉదాహరించిన పంక్తులన్నీ నేటి విశ్వప్రకాశములో యథాతథంగా ఉన్నాయి.  

 నామలింగానుశాసనమునకు కృష్ణమిశ్రుడు వ్రాసిన అమరకోశ టీకలోనూ విశ్వప్రకాశ విశ్వకోశముల ప్రస్తావనలన్నీ విశ్వప్రకాశములో యథాతథంగా ఉన్నాయి.

ఈ  "విశ్వప్రకాశ కోశము" ఆంధ్రదేశంలో "విశ్వకోశము" అన్న పేరుతోనూ, ఉత్తర భారతదేశంలో "విశ్వకోశము", "విశ్వప్రకాశ కోశము" అన్న రెండు పేర్లతోనూ ముద్రితమై ప్రచారంలో ఉన్నది. 

మహేశ్వర సూరి : విశ్వప్రకాశ కోశము

నిశ్శేషమైన గీర్వాణవాఙ్మయమహార్ణవం లోతును, విస్తృతిని ఆసాంతం పరీక్షించిన మహేశ్వర సూరి తన కోశంలో గ్రంథనామాన్ని సర్వే సర్వత్ర "విశ్వప్రకాశ కోశము" అనే వ్యవహరించాడు. "విశ్వకోశము" అన్న వాడుక ఆయన నాటిది కాదు. ఆయన రచనలో,

 

"విశ్వప్రకాశ ఇతి కాఞ్చనబన్ధశోభాం,

బిభ్ర న్మయాత్ర ఘటితో ముఖఖణ్డ ఏషః"

      అని; ఆ ముఖఖండంలోనే

 

"యద్యస్తి వాఙ్మయమహార్ణవమన్థనేచ్ఛా

ప్రాప్తుం పదం ఫణిపతే ర్యది కౌతుకం వః

విశ్వప్రకాశ మనిశం తదిదం నిషేవ్య

సమ్భావ్యతాం పరమశాబ్దికశేఖరశ్రీః"

      అని;

 

      "కోశం విశ్వప్రకాశాఖ్యాం విరమాచ్ఛ్రీమహేశ్వరః"

      అని, అన్ని చోట్ల "విశ్వప్రకాశము" అనే ఉన్నది. వ్యాఖ్యాతలు దీని నామైకదేశాన్ని స్వీకరించి "విశ్వము", "విశ్వప్రకాశ కోశము" అనినట్లే, ముద్రాపకులు కూడా దీనిని "విశ్వకోశము", "విశ్వప్రకాశ కోశము" అని రెండు విధాలుగానూ అచ్చువేశారు. 1864 లో దీనిని వారణాసిలో ముద్రించిన శ్రీరామ మహోపాధ్యాయులు "విశ్వప్రకాశ కోశము" అన్నారు. వారణాసిలోనే 1865 లో హేమచంద్ర కోశ, ఉణాది కోశ, పంచతత్త్వప్రకాశికా కోశ, శారదీయ నామమాలా, హలాయుధ కోశములతో కలిపి అచ్చువేసిన విశ్వనాథ మాలవీయ మహాపండితులు "విశ్వకోశము" అన్నారు. 1911 లో శీలస్కంధ స్థవిర రామగోపాల భట్ట విద్వాంసులు విశ్వప్రకాశము అన్నారు. 1936 లో వావిళ్ళ వారి ప్రతికి పీఠికను వ్రాసిన ఉత్పల వేంకట రంగాచార్యుల వారు "విశ్వకోశము" అన్నారు. The Grammars & Dictionaries Of the Sanskrit Language లో హొరేస్ హెయ్మన్ విల్సన్ పండితుడు (నా వద్ద ఉన్నది 1971 నాటి పునర్ముద్రణ ప్రతి) ఈ రెండు గ్రంథాలను ఒకటి గానే పరిగణించారు.  

అన్య కోశకర్తల వ్యవహారాలు

 

        విశ్వ, విశ్వప్రకాశికా, విశ్వప్రకాశములని ఒక్క గ్రంథానికే వ్యవహారం అనుకొన్నాము. అయితే, వివిధ కోశకర్తల దృష్టిలో విశ్వ విశ్వప్రకాశములని రెండు వేర్వేఱు కోశాలు  ఉండినట్లు కనబడుతుంది. రాఘవ పండితుని "నానార్థమంజరి"లోని అవతారికా శ్లోకాలివి:

 

        "విశ్వాదీని సమాహృత్య బాలానాం జ్ఞానసిద్ధయే

        కవినా రాఘవేణాద్య కృతా నానార్థమఞ్జరీ. 

        విశ్వప్రకాశో గోపాలో శేషకారో (?) ధనఞ్జయః

        శబ్దార్ణవో వైజయన్తీ సూర్యో రుద్రశ్చ యాదవః. 

        ప్రతాపో భాగురి ర్దణ్డీ రభసశ్చ హలాయుధః

        సుభూతి ర్హరి విష్ణూ చ వరరుచ్యమరోత్పలాః.

        అజయ శ్శాశ్వత శ్చైతే ఉచ్యన్తే పణ్డితైః పురా."

        "విశ్వాదీని సమాహృత్య ... విశ్వప్రకాశో అనటం వల్ల రాఘవుడు విశ్వ - విశ్వప్రకాశములను రెండింటిని చూచినట్లు స్పష్టం. లేదా, లోకవ్యవహారాన్ని పరిశీలించి, బాలుర జ్ఞానసిద్ధికోసం రచిస్తున్నానని అన్నట్లుగా ఆ దళాన్ని సమన్వయించుకోవాలి.  

        కాగా, గణపవరపు వేంకటకవి తన ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము అవతారికలోని 63-వ వచనంలో

      ... అమ, రామరశేష, విశ్వ, శాశ్వత, శబ్దార్ణవ, యాదవ, వైజయంతికా కార, నానార్థరత్నమాలికా కార, హలాయుధ, వాగురి (?భాగురి), కేశవ, తారపాల, ధరణి, ధన్వంతరి, ధనంజయ, రభస, విశ్వప్రకాశ, మాధవ, చింతామణి, జయ, ప్రతాప, శుభాంగ, జయపాల, క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతి వివిధ నిఘంటుపదమ్ములకుఁ బదమ్మును ...

      అని చతుర్వింశతి నిఘంటువుల పట్టికలో విశ్వ, విశ్వప్రకాశములను విడివిడిగా పేర్కొన్నాడు.

      అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతి (3 128) లో

      "అమ, రామరశేష, విశ్వ, శాశ్వత, శబ్దార్ణవ, యాదవ, వైజయంతీ, నానార్థరత్నమాలికా, మేదినీ, హలాయుధ, వాగురి (?భాగురి), కేశవ, తారపాల, ధన్వంతరీ, ధరణీ, ధనంజయ, రభస, విశ్వప్రకాశ, మాధవ, చింతామణి, జయ, ప్రతాప, శుభాం, కాజయపాల, క్షీరస్వా, మ్యేకాక్షరాది నిఘంటువులును ..."  

        అని, ఇరవై ఆరు నిఘంటువుల పట్టికలో విశ్వ, విశ్వప్రకాశములను విడివిడిగా పేర్కొన్నాడు.

      కథలు గాథలు (తృతీయ సంపుటం) లోని బహుజనపల్లి వారు అన్న వ్యాసంలో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు 145-వ పుటలో

      పూర్వం సుప్రసిద్ధ సాహిత్యపరులనేవారికి దశవిధ నిఘంటులు (అమర, విశ్వ, విశ్వప్రకాశ, కేశవ, హలాయుధ, శబ్దార్ణవ లోనైనవి)

      అని విశ్వ, విశ్వప్రకాశములను విడివిడిగా పేర్కొన్నారు.

      పైని పేర్కొన్న గణపవరపు వేంకటకవికి, అయ్యలరాజు నారాయణమాత్యునికి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి గారికి ఈ చతుర్వింశతి నిఘంటువులు, ఇరవై ఆరు నిఘంటువులు, దశవిధ నిఘంటువులు అన్న నిర్దేశాలు ఎక్కడ దొరికాయో; ఆ నిర్దేశాలు ఏ నాటివో తెలియదు కాని, పరంపరీణంగా పెద్దలు చెప్పుకొనే నిఘంటు నామశ్లోకాలివి:

      మేది న్యమరమాలా చ త్రికాణ్డో రత్నమాలికా

        రన్తిదేవో భాగురిశ్చ వ్యాడిః శబ్దార్ణవ స్తథా.

        ద్విరూపశ్చ కలిఙ్గశ్చ రభసః పురుషోత్తమః

        దుర్గో౽భిధానమాలా చ సంసారావర్త శాశ్వతౌ.

        విశ్వో వోపాలితశ్చైవ వాచస్పతి హలాయుధౌ

        హారావలీ సాహసాఙ్కో విక్రమాదిత్య ఏవ చ.

        హేమచన్ద్రశ్చ రుద్ర శ్చాప్యమరో౽యం  సనాతనః

        ఏతే కోశాః సమాఖ్యాతా స్సఙ్ఖ్యా షడ్వింశతిః స్మృతః.

అని.

వేఱొక విశ్వ నిఘంటువు

 

      వ్యాఖ్యాతలు ఇతి విశ్వః అని పేర్కొంటున్న పేరును బట్టి సుప్రసిద్ధమైన విశ్వకోశము గాక, ఆ పేరిట విశ్వకోశము అని వేఱొకటున్నదా? అన్న జిజ్ఞాస కలుగక మానదు. చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో 19392 సంఖ్య గల విశ్వ నిఘంటువు అని, నానార్థ పదకోశం ఒకటున్నది. దీని కర్త విశ్వకవి అట. ఈయన ఎవరో, కాలాదికం ఏమిటో తెలుసుకోవటానికి ఆధారాలేవీ గ్రంథంలో అగుపించలేదు. ఇందులో పన్నెండు కాండలున్నాయి. మల్లినాథాదులు ఇతి విశ్వః అని ఉదాహరించిన పంక్తులేవీ ఇందులో కనబడలేదు.

 

      మహేశ్వర సూరి విశ్వప్రకాశ కోశమును అధికరించి విశ్వ నిఘంటువు అన్న పేరుతో కేరళీయుడైన పరమేశ్వర భట్టు రచించిన టీక ఒకటున్నది. దానితో ఈ విశ్వ నిఘంటువుకు సంబంధ సాజాత్యాలు లేవు.

 

      మహేశ్వర సూరి విశ్వప్రకాశ కోశమును అధికరించి రచింపబడిన విశ్వ నిఘంటు టీక అన్న పేరుతో ఉన్న ఒక టీకను విశ్వప్రకాశమునకు శ్రీవల్లభ గణి తన సారోద్ధార వ్యాఖ్యలో ఉదాహరించాడు. దానికీ విశ్వకవి రచించిన ఈ విశ్వ నిఘంటువుకు ఎటువంటి సంబంధమూ లేదు.

 

      విశ్వ నిఘంటువులో పన్నెండు కాండలున్నాయి. ఒక్కొక్క కాండలోనూ నూరేసి శ్లోకాలున్నాయి. గతివైవిధ్యం కోసం విశ్వకవి అనేకచ్ఛందస్సులను వినియోగించుకొన్నాడు. ఇది అవతారికా భాగం:

      శ్రీవాణీపరమానన్దనిధానం పదపఙ్కజమ్  

        అజ్ఞానాన్ధనిమగ్నానాం ప్రకాశన ముపాస్మహే.

        మాతామహమహాశైలం మహ స్త దపితామహమ్  

        జగతః కారణం వన్దే కణ్ఠాదుపరివారణమ్.

        కారణం చాదిజగతాం మారణార్థ మనాగవం(?)

        వారణానన మాత్మాన మద్వయం సముపాస్మహే.

        సర్వవ్యాకరణామ్బోధిం సర్వకోశమహోదరమ్

        విలోడ్య వాణీజనితకవితానన్దనిర్భరః.

        కవిరాణ్మస్తకారోహకౌతూహలసమన్వితః

        వీరో విశ్వకవి ర్విశ్వకోశం పూర్ణం కరోతి సః.   

     ఇందులో వీరః అనటం వల్ల విశ్వకవి రాజపురుషుడని ఊహించటానికి ఆస్కారం ఉన్నది.

 

      నానార్థప్రథమాన్తేత్ర సర్వత్రాదౌ ప్రదర్శితః

        సప్తమ్యన్తేషు సిద్ధయర్థం వ్యాకర్ణపదవేదినా

        శ్రీమద్విశ్వకవి ర్విరించివదనశ్రేష్ఠాసనాధిష్ఠితా

        వాణీ వాణీజనసర్వసూత్రజనితవ్యాకర్ణ మాకర్ణ్య తమ్  

        ఆలోడ్యాలోడ్య కోశం సకలబుధజనానన్దకన్దం

        చక్రే చక్రగదాధరాఙ్ఘ్రికృపయా విశ్వైకవిశ్వాభిధమ్.

      అని గ్రంథాన్ని ముగించాడు. ఇటువంటి నిఘంటువులలో కవి రచనాశైలిని గుర్తుపట్టడం కష్టమే అయినా, విశ్వకవి రచన ఎక్కడా శిథిలబంధం లేక సుమనోహరమూ, సప్రమాణమూ, రమ్యాక్షరాఘటితమూ అయి ప్రశస్తంగా ఉన్నది. పూర్వం కోశకర్తలైనవారు ప్రాచీనార్వాచీన సమీచీన సాహిత్యసమీక్ష చేసి ప్రయోగాంతరాలను, అర్థాంతరాలను సమకూర్చుకొని కాని పదసంగ్రహాన్ని వివరించటానికి పూనుకొనేవారు కారు. అపురూపమూ, అప్రతీతమూ అయిన ఆ పదసంగ్రహం వారి పరిశ్రమకు నికషోపలంగా విభాసించేది. విశ్వకవి ఉత్తమమైన కవిత్వరచన చేయగలిగి శబ్దసన్నివేశాన్ని గుర్తెఱిగినవాడని చెప్పటానికి ఎన్నైనా ఉదాహరణలను చూపవచ్చును. విశ్వ నిఘంటువు అముద్రితంగా ఉండటం వల్ల భాషాయోష కొక అమూల్యాభరణం లోపించినట్లయింది.

 

      ప్రథమ కాండ చివఱను

 

      అనేకార్థప్రద శ్శబ్ద స్సర్వత్రాన్తేషు యోజితః

        మదుక్తౌ నితరాం సమ్య గాదావాదిప్రదర్శితా.

        శ్రీమద్విశ్వకవి ర్విరించివదనశ్రేష్ఠాసనాధిష్ఠితా

        వాణీ వాణీజనసర్వసూత్రజనితవ్యాకర్ణ మాకర్ణ్య తమ్  

        ఆలోడ్యాలోడ్య కోశం సకలబుధజనానన్దకన్దం

        చక్రే పద్మనివాసినీ స్వకృపయా విశ్వైకవిశ్వాభిధమ్.

        శ్రీమతా విశ్వకవినా సర్వవిద్యార్థవేదినా

        విబుధజ్ఞానసిద్ధ్యర్థం ప్రథమః కాణ్డః ఈరితః.   

      అని వ్రాసుకొన్నాడు. కాండ కొక నూఱు శ్లోకాల వంతున కూర్చాడు. పన్నెండవ కాండ ఏకాక్షరీ పదసంగ్రహం. పురుషోత్తమదేవుని హారావళి కంటె ఇది చాలా పెద్దది. ముందు కావ్యప్రయోగాలను సమకూర్చుకొని, కోశకర్తలు మునుపెన్నడూ చేర్చుకొనని పదాలను ప్రత్యేకించి పేర్కొన్నాడు. గ్రంథం అముద్రితం కాబట్టి 1972లో నేను  వ్రాసికొన్న ప్రతిలో నుంచి ఒక్క భాగాన్ని ఉదాహరిస్తాను:

 

      "సారఙ్గ శ్చన్ద్ర హంసాబ్జ చాతకే గజ భృఙ్గిషు

        వీణా వారిద కన్దర్ప శఙ్క రార్యమ వారిషు.

        రాజా సూ ర్యేన్దు ఫాలాక్ష విష్ణు వైశ్రవణేషు చ

        కాదమ్బే వృషభే శక్రే ష్వరుణే వారిదే నృపే."   

      అని.

      1979లో Claus Vogel గారు రచించిన Indian Lexicography గ్రంథంలో విశ్వకవి కృతమైన ఈ విశ్వ నిఘంటువు వివరాలు లేవు.

      ఈ విధంగా ప్రదర్శింపబడిన ప్రమాణాల వలన మహేశ్వర సూరి విరచితమైన విశ్వప్రకాశమునకే విశ్వము అన్నది అభిధాంతరమని; విశ్వకవి రచితమైన విశ్వ నిఘంటువు వేఱొకటి ఉన్నదని స్పష్టపడుతున్నది.

      మహేశ్వర సూరి విశ్వప్రకాశమునకు మంచి పరిష్కృతమైన ప్రతి ఇంకా వెలువడలేదు. సారస్వత మిశ్రుని విశ్వమేదినీ నిఘంటువు, వాచస్పతి మిశ్రుని విశ్వమేదినీ సుమనఃకంఠ వ్యాఖ్య మొదలైన గ్రంథాలను; వ్రాతప్రతులను; మల్లినాథాదుల వ్యాఖ్యలలోని ఉదాహరణలను తులనాత్మకంగా పరిశీలించి మేలైన ప్రతిని రూపొందింపగలిగితే పార్యంతికంగా ఈ విశ్వ విశ్వప్రకాశాల ఐక్యానైక్యవివాదానికి భరతవాక్యం చెప్పవచ్చును.  

 
 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech