Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 
 

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.     

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం


ద్వని అనుకరణ సామ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్

వేయి గొంతులు వీరి నోట వినవచ్చు. ఈయన గళంలోంచి వినిపించని స్వరం లేదు. ద్వని అనుకరణ (మిమిక్రీ) కళకి జవం, జీవం పోసిన కళా పితామహుడు. ఈయన వ్రాసిన కళాంశాలు విశ్వవిద్యాలయలలో పాఠ్యాంశాలుగా వెలిశాయి. అరవై ఐదేళ్ళ పాటు మిమిక్రీ కళకు దన్నుగా నిలిచారు. ఈ విద్యే వారికి ఉపాది, జీవిత పరమావది ఐపోయింది. దాని ప్రాపకమే ఏకైక లక్షమైయ్యింది. 1947 లో మొదలైన ఈ సుధీర్ఘ ప్రవాహం నేటికి కొనసాగుతోంది. ఇలాటి అపూర్వ ఘనత సాధించిన తెలుగు తేజం, ‘ద్వని అనుకరణ సామ్రాట్’ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు.

న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి లో మిమిక్రీ ప్రదర్శన చేసి " స్టాండింగ్ ఒవేషన్ " అందుకున్న అద్బుత కళాకారుడు. ఈ ప్రాగణంలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయుడు. వీరి ప్రతిభను, కళకు చేసిన సేవలను గుర్తిస్తూ తిరుపతిలో గజారోహణం చేశారు. కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు బెజవాడలో తన రచనను వీరికి అంకితమిచ్చి గౌరవించారు. వేణుమాధవ్ గారిని అభివర్ణిస్తూ " హి ఈస్ సిలబస్ అండ్ కరికులం ఫర్ దిస్ ఆర్ట్ " అని ఓ మహానుభావుడు వ్యాఖ్యానించాడు.

వేణుమాధవ్ గారు " టెన్ కమేండ్ మెంట్స్ " మీద చేసిన మిమిక్రీ వీరికి ప్రపంచ ఖ్యాతి తెచ్చి పెట్టింది. కెన్నెడీ, సర్వేపల్లి రాధకృష్ణన్ గారి సంభాషణా ప్రక్రియ వీరి కళా ప్రతిభను అద్దం పడుతుంది. ఈయన మిమిక్రీ మీద " మిమిక్రీ కళ " అన్న పుస్తకం వ్రాశారు. ఈ పుస్తకం ఈ క్షేత్రాంశంలో విలువడ్డ ప్రప్రధమ గ్రంధం "మిమిక్రీ కళకు ఇది పెద్ద బాల శిక్ష " అని చెప్పవచ్చు. ఇది తెలుగు వారందరికీ గర్వ కారణం.

ఈయన గళంలోంచి వినిపించని స్వరం లేదు. హేమా హేమీలందరిని తనదైన శైలిలో చిత్రీకరించారు. అటు నేహ్రూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయి పటేల్, వి వి గిరి, ఇందిరా గాంధి, ప్రముఖ నటులు నాగయ్య, కంచు కంఠం కొంగర జగ్గైయ్య, ఎన్ టి ఆర్, ఎస్ వి రంగా రావు, నటీమణి భానుమతి తదితరులు ఉన్నారు.

ప్రముఖ హిందీ చలన చిత్ర నటుడు సౌరాభ్ మోడి నా గొంతుని అనుకరించడం చాలా కష్టం అన్నాడట వేణుమాధవ్ గారు తనదైన రీతిలో అనుకరించి ప్రత్యుత్తరం ఇచ్చారు. సినీ నటుడు రాజ్ కపూర్ కూడా ఆయన సంభాషణలు విని మురిసిపోయారు. 1972 లో రాష్ట్రపతి నిమంత్రణ మేరకు రాష్ట్రపతి భవన్లో జరిగిన సభలో ప్రముఖ కవి, కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి బాణిలో పద్యాలు వల్లె వేశారు. సరస్వతి గారినీ, అందరిని అబ్బుర పరిచారు. "మున్నూరు పదహారు" బహుమతిగా పొందారు. అంతే కాదు ఇంత ప్రతిభ కనపరిచిన వేణుమాధవ్ గారికి పద్మశ్రీ గానీ పద్మభూషణ్ గానీ ఇవ్వాలని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.

హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ వద్ద ప్రదర్శన చేశారు, మన్ననలను అందుకున్నారు. హరీంద్రనాధ్ ఛటోపాధ్యాయ వేణుమాధవ్ గారి మీద పద్యం వ్రాశారు.

అబ్బూరి, గగ్గయ్య, రఘురామయ్య గారి పద్యాలు, దేవా హనుమయ్య, సూరి భగవంతం, కాటూరి వెంకటేశ్వరరావు, ముల్క్రాజ్ ఆనంద్, సుభాష్ చంద్ర బోస్, ముక్కామల, ఎన్ టి ఆర్, ఏ ఎన్ ఆర్, రేలంగి, రమణా రెడ్డి, కృష్ణా మీనన్, సర్వేపల్లి, సౌరాబ్ మోడీ, ప్రిథ్విరాజ్ కపూర్, రాజ్ కపూర్, ఎం ఎస్ సుబ్బు లక్ష్మి, సూరి బాబు, కాకాని వెంకటరత్నం, గౌతు లచ్చన్న, హాషీం, జూపూడి, భవనం వెంకట్రాం, ఎం జి ఆర్, కరుణానిధి ఇలా మరెందరినో తనదైన బాణిలో సాక్షాత్కరింపజేశారు.

"నా లాగా ఎవరైనా అనుకరిస్తే నేను సన్మానిస్తాను" అని అన్నారు ప్రముఖ నటి భానుమతి గారు. భానుమతి లా మాట్లాడ్డమే కాకుండా, "ఓహో హొహో పావురమా " పాట కూడ పాడేరు, గౌరవం దక్కించుకున్నారు. ఆర్టిస్టు కి ఆరోహణం, అవరోహణం తెలిసి ఉండాలి అని వ్యాఖ్యానించారు డాక్టర్ వేణుమాధవ్ గారు. ఇవి తెలిస్తే ఎవ్వరి గళాన్నైనా అనుకరించవచ్చు అని వివరించారు.

ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య గారు నేరెళ్ళ వేణుమాధవ్ గారికి స్పూర్తి. తొలి రోజుల నుండి నాగయ్య గారంటే వీరికి మిక్కిలి ప్రీతి. ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తూరు నాగయ్య ఆయన్ని ఆవహించాడు.

నిజాం కళాశాల ఆచార్యుడు శ్రీ బి పి రాం నర్స్ గారు (శ్రీ బి పి ఆర్ విట్ఠల్ గారి తండ్రి), అరవై రూపాయలు బర్సారి ఇచ్చి ఇంగ్లిషు సినిమాలు చూడ్డానికి ప్రోత్సాహించారు. ఇది వేణుమాధవ్ గారి సాధనకు బాగా తోడ్పడింది. " రాం నర్స్ గారు నన్ను కొడుకులా చూసుకున్నారు ", అని ఓ సందర్భంలో చెప్పుకున్నారు శ్రీ వేణుమాధవ్ గారు. రాం నర్స్ గారిని కలవడంతో నా జీవితానికి ఓ మలుపు వచ్చింది, ఓ దిశామార్గం చూపించింది. " నన్ను ఒక మనిషిగా తీర్చి దిద్దారు " అని వివరించారు డాక్టర్ వేణుమాధవ్ గారు. ఇది వారి వ్యక్తిత్వ, సంస్కార గుణాలని చాటుతోంది. ఈ ఉదాహరణ తెలుగు సాంప్రదాయ పద్ధతికి నిలువుటద్దం పడుతోంది.

మీరు నా రోల్ మోడల్ (ఆదర్శం) అని రాధాకృష్ణన్ గారికి చెపితే నాగయ్య గారిని రోల్ మోడల్ చేసుకోండీ అని ప్రత్యుత్తరం ఇచ్చారట. అలా చెప్పి నాగయ్య గారి రెండు చేతుల్ని తీసుకుని కళ్ళకి అద్దుకున్నారట. గౌరవం, పరస్పర ప్రేమాభిమానానికి ఇది చక్కటి ఉదాహరణ. నాటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంగ్లిషు విని విని విసిగిపోయాను. తెలుగులో మాట్లాడండి అని అన్నారట. తెలుగు అంటే వారికి అంత ప్రీతి. వేణుమాధవ్ గారి ద్వని అనుకరణ మాయాజాలాన్ని చూసి మంత్ర ముగ్దులైపోయారు.

మిమిక్రీ అన్న పదానికి నిర్వచనంగా నిలిచారు డాక్టర్ వేణుమాధవ్ గారు. ఆరు దశాబ్దాల పాటు భారత దేశాన్నే కాదు, ప్రపంచాన్నే అబ్బుర పరచిన అపూర్వ వ్యక్తి. ఇష్టులు వీరిని " ఎన్ వి " అని కూడా సంభోదిస్తూ ఉంటారు.

కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనరాయణ గారు బెజవాడ సభలో "శివదర్పణం" నేరెళ్ళ వేణుమాధవ్ గారికి అంకితమిచ్చారు. అంతటి గౌరవం అందుకున్న ఘనత వీరిదే.

వీరి విశిష్టత:

వేణుమాధవ్ గారి ప్రత్యేకత ఏంటీ అంటే వీరు ఎవ్వరినీ యదాతథంగా అనుకరించరు. ఈ కళలో అఖండమైన ప్రావీణ్యం సంపాయించారు. అవతల వ్యక్తికాని, వస్తువుకు సంబందించిన విషయం కాని కూలంకషంగా అధ్యయనం చేసి, సమయ, సందర్భ, అనుభవ సారాన్ని తీసుకుని తనదైన బాణికట్టి వ్యక్త పరుస్తారు. అది ఎంతటి వారినైనా కదల్చి వేస్తుంది. " స్లాఘో " అనక మానరు.

జాన్ కెన్నడి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సంబాషణ విని తీరాల్సిందే. ఎంతో ఆహ్లాందంగా ఉండడమే కాకుండా వేణుమాధవ్ గారి సమయ స్పూర్తి, వివరించే ధోరణి సుస్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు అందరు హాలివుడ్ ఆర్టిస్ట్ లని అనుకరించారు.

అమెరికాలో అడిగారు మిమిక్రీ ఎప్పుడు పుట్టింది? అని " మీ దేశం పుట్టక ముందు పుట్టింది మిమిక్రీ " అని చెప్పారు.
రామాయణ కాలం నుండి ఉంది, అని వీరి వాచ.

రమణాచారి గారి కృషితో మిమిక్రీ అంశం తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రణాళికా బద్దమైన పాఠ్యాంశాలతో వెలసింది. తెలుగు విశ్వవిద్యాలయం మిమిక్రి లో డిప్లొమా బోధన మొదలు పెట్టి ఇప్పటికి తొమ్మిదేళ్ళు అయ్యింది. దాదాపు ఓ దశాబ్దం నుండి విద్యార్ధులకు శిక్షణ (డిప్లొమా) ఇస్తున్నారు. డాక్టర్ వేణుమాధవ్ గారు ద్వని అనుకరణ (మిమిక్రీ) మీద మిమిక్రీ కళ పుస్తకం వ్రాశారు. ఇది ఈ క్షేత్రాంశం మీద వెలువడ్డ ప్రప్రధం గ్రంధం. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇదే మాదిరిగా శిక్షణా తరగతులు ప్రవేశ పెట్టారు.

" మిమిక్రీ ఆర్టిస్ట్ జర్నలిస్ట్ కూడా అయి ఉండాలి " అని తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. విషయాన్ని యథాతథంగా అనుకరించడం కాదు, సమయం, సందర్భం, సన్నివేశం, హావ భావాలు, నిగూడ, నిషిప్తార్ధలు కూడా గ్రహించాలి. వాటిని ఆకళించుకుని తమ బాణిలో వ్యక్తం చేయాలి. అప్పుడే అది బాగా రాణిస్తుంది అని వారి ఉపవాచ.

జననం, బాల్యం, చదువు:

డిసెంబరు 28, 1932 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరంగల్ లో జన్మించారు. ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. ఆంగ్లం, తెలుగు, హిందీ భాషలలో అనర్ఘళంగా మాట్లాడ గలరు. వీరి తండ్రి ఆరు భాషలలో ప్రావీణ్యులు. ఆ రోజులలో ఆంగ్లంలో దొరలతోనే మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయట.

పదహారవ ఏట నుండి మిమిక్రీ చేయడం మొదలు పెట్టారు. ఈ విద్యే వారికి ఉపాది, జీవిత పరమావది ఐ పోయింది. 1947 లో మొదలైన ఈ కళ, నేటి దాకా కొనసాగుతూనే ఉంది; ఈ ప్రయాణంలో అది ఎంతో పరిణితి చెందింది. శబ్దాలు, ద్వనులు, మాటలు, గుర్రపు డెక్క శబ్దాలు, పశుపక్ష్యాదుల ధ్వనులు, బుడ బుక్కలవాడు, ఇలా ఒకటేమిటి, ఏది పడితే దాన్ని అనుకరిస్తూ, అభినయిస్తూ నిరంతరం అభ్యసిస్తూ, తన ఊహతో సన్నివేశాలని, సందర్భాలని ఆకళించుకుని వాటిని మరింత మెరుగుపరుస్తూ వ్యక్తపరుస్తూ తనదైన శైలిని అలవరచుకున్నారు." ఉత్తినే ఎవ్వరినైనా అనుకరిస్తే అది ఆనందమే ఇస్తుంది కాని, ప్రయోజనం ఉండదు అని సెలవిచ్చారు నేరెళ్ళ గారు. ఓ సూక్ష్మాన్ని ఇంత సునాయాసంగా చెప్పగలరు.

బి ఏ ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేసారు. దీనితో వేణుమాధవ్ గారికి హింది మీద బాగా పట్టు ఏర్పడింది. వేణుమాధవ్ గారికి నలుగురు పిల్లలు; కూతురు డాక్టర్ లక్ష్మి తులసి కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్టు.

నాగయ్య గారి " భక్త పోతన " (1947) చూసి బాగా ప్రభావితమైయ్యారు వేణుమాధవ్ గారు. " పద్యానికి ఒక నూతనత్వం తీసుకు వచ్చారు. నాగయ్య గారు " అని స్లాఘించారు వేణుమాధవ్ గారు.

బి ఎన్ రెడ్డి గారు మీరు ఓ వేషం వెయ్యాలి అని పట్టు పట్టినప్పుడు సినిమాలో వేషం వేశారు. 10 - 12 సినిమాలలో అభినయించారు. నాటి ముఖ్యమంత్రి పీ వి నరసింహా రావు గారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. సినీ నటుడు బాల్రాజ్ సహాని వేణుమాధవ్ గారికి మంచి మిత్రులు.

ఆర్టిస్ట్ కి అహంకారం ఉండకూడదు; అణుకువ ఉండాలి; అప్పుడే వారి జీవితం సాఫల్యమవుతుంది అని వారి మనోగతాన్ని చాటారు.

అవార్డులు, గౌరవాలు, గుర్తింపులు:

2001 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు
శ్రీ రాజ లక్ష్మి ఫౌండేషన్ అవార్డు (1981)
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రపూర్ణ గౌరవం అందుకున్నారు
కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్
ఇందిరా గాంధి ( ఇగ్నౌ )విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్

ఐ వి చలపతిరావు గారు వేణుమాధవ్ గారి మీద ఓ పుస్తకం వ్రాశారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు విశ్వ విఖ్యాత మిమిక్రీ సామ్రాట్ వేణుమాధవ్ పుస్తకం వెలువడించారు.

వీరి ధోరణి, సభా మర్యాధలు నేటి తరం అలవరచుకోవాల్సిందే. సరుకుతో పాటు ఏ సందర్భంలో, ఏమి చెప్పాలి, ఎంత చెప్పాలి; ఎంత వరకు చెప్పాలి; వేణుమాధవ్ గారిని చూసి నేర్చుకోవాల్సిందే. అంత పరిణితి చెందిన వ్యక్తిత్వం వీరిది. ఎనబై వసంతాలు చూసిన నేరెళ్ళ గారు ఇంకా ఉత్సాహంగా తన వంతు కృషి చేస్తున్నారు. ఈ కళని ఇంకా పెంపొందించాలని అభికాంక్షిస్తూ తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. వీరి శిష్యులు మిమిక్రీ శ్రీనివాస్, హరికిషెన్, ఈ కళను మరింత ముందుకు తీసుకు పోతున్నారు. వీరి శిష్య ప్రశిష్యులు కూడా ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. "ఎంకా ఎంతో ఉంది చెయాల్సింది" అని అన్నారు. ఈ కళకి ఇంకా జీవం ఇవ్వాలి, పెంపొందించాలి అని తపన పడుతున్నారు, క్రియాశీలకంగా పని చేయాలని వీరి తపన. వీరి ప్రయత్నాలు సఫలం అవ్వాలని ఆశిద్దాం. ఈ మంచి పనికి చేతనైనంత సహాయ సహకారాలు అందివ్వడం ప్రతీ వాడి ఉద్యుక్త ధర్మం. నిర్వర్తించాల్సిందే!.


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech