Sujanaranjani
           
  సారస్వతం  
          శ్రీ రామ! నీ నామ మేమి రుచిర (అపరాధ పరిశోధక పద్య కావ్యము) 
 

                                                            రచన : ఆచార్య వి.ఎల్.యస్. భీమశంకరం

 

          

2. శిథిలమైన గ్రామం.

 
తే.గీ. మరుసటి దిన మూరిలో తిరిగి నాడ
గ్రామ మేరీతి నుండెనో కనుగొనగను –
కళ్ళు చెమ్మగిల్లెను నాకు, కడుపులోన
త్రిప్పినట్లయ్యె నా యూరి తీరుచూడ.

ఆ.వె. ఊరు పెరిగె గాని ఉన్న ఇళ్ళకు చూడ,
వెల్ల లేక చివికి పెల్లు లూడె,
కప్పులందు పెద్ద కన్నాలు కన్పట్టె,
తలుపులుండు చోట తడిక లుండె.

ఆ.వె. వెనుకలేని 'తారు'వీథు లిపుడువచ్చె
కాని రోడ్లనిండ కంతలుండె;
ఇళ్ళనుండి కుళ్ళునీళ్ళు రోడ్లను పాఱె
ముఱుగు కాల్వలన్ని పూడి యుండె.

ఆ.వె. 'నల్ల' లుండె కాని నీళ్ళ చుక్కయురాదు
మూడు నాళ్ళ కొక్క నాడు గాని,
వచ్చు నీళ్ళు గూడ పుచ్చె పుర్వుల తోడ,
త్రాగునట్టులైన రోగ మొదవు.

ఆ.వె. వీధు లందు కలవు విద్యుత్తు దీపాలు
జ్వలన మొంద వవియు
'పవరు' లేక,
రోడ్ల తిరుగు గొడ్లు రుద్దుకొనగ నడ్లు
ఉన్న స్తంబము లుపయుక్తమయ్యె.మ. కనగన్ నా చిననాటి యూరు బహుధా కాలుష్యమై హేయమై
పొనుగయ్యెన్, దరి బేసులైరి జనులున్, పోకాడె సౌభాగ్యముల్,
తన పూర్వాతిశయమ్ము మంట గలిసెన్, దారిద్ర్య భూతంబు తె
య్యని నాట్యం బొనరించె, వీక చెడి పౌరానీకముల్ క్రుంగిరిన్.

కం. ఆ సాయంతనము హితుని
నే సాయంబుగ పిలుచుకొని వెడలినాడన్
గాసిలి పొలిమేరను గల
ఆ సరసికి, నిమ్నగకు, నహార్యంబునకున్.

తే.గీ. చెత్త మొక్కల తోడను చెఱువు నిండె,
ఆనకట్టయు చూడంగ కానబడదు,
ఇసుక పెద్ద మేటలు వేసె నేటిలోన
నీరు పాఱక గుంటల నిలిచి యుండె.

ఆ.వె. వరిని సాగు చేయు వ్యవసాయమే లేదు,
పెక్కు పొలములందు దుక్కి సున్న,
నీళ్ళు లేక చేలు బీళ్ళుగా మారెను,
బావులన్ని యెండి బావురనియె.

తే. గీ. వరికి నీళ్ళు చాలక మెట్టపంట లచ్చ
టచట రైతులు విత్తినారవియు గూడ
వాన తగినంతగా లేక వాడి యుండె,
పండ బోయెడు కొన్ని చేలెండిపోయె.

కం. పంటలు పండక జనులెటు
లుంటిరొ ఇన్నాళ్ళటంచు నూహించగ లే
కుంటిని - ఆ విషయమె నే
నంటిని స్నేహితుని తోడ నలజడి పడుచున్.

కం. 'ఊరట్లు పాడుపడె - ఈ
యేఱును, కొలనును, పొలములు నీ రీతి చెడెన్,
కారకు లెవరీ దుస్థితి
కౌరా!దాచకను తెల్పు మంతయు నాకున్.
'

కం. అని నేనడుగగ మిత్రుడు
వెనుకాడుచు చెప్పె నపుడు వివరముగా, నే
జనిత క్లేశుడనై శ్ర
ధ్ధను వినగ జరిగిన దెల్ల తత్తర మొనయన్.

తే.గీ. 'పద - నడువుము నగము పైకి – ముదముగ మును
ముందుగ మనము గుడి చూడ పోవుద - మిక
పోవు దారిలో తెలిపెద పూర్తిగ మన
యూరి కథ న
' నుచు బయలుదేరి పలికె.

తే.గీ. “ఈ వెరిగిన జమీందారు డీల్గె ముప్ప
దేండ్ల ముందు - అంతకు ముందె యెల్ల ఆస్తు
లాఱిపోయె జమీన్లు రద్దగుటవలన –
ఉన్న సొమ్ము తోడను కొడుకూరు విడిచె.

తే.గీ. అప్పటి దనుక ప్రభువులే అచ్చుకొనుచు
విధిగ నేటేట చెఱువు త్రవ్వించు వారు –
నేడు మన యూరి కేలిక లేడు గనుక
చెఱువు త్రవ్వించ నెవ్వరు చేరరైరి.

తే.గీ. జనుల విజ్ఞప్తిపైన పంచాయితీయు
తగిన తీర్మానమును చేసి త్వరితగతిని
పంపిరి
'సమితి'కి చెఱువు పనులు తక్ష
ణంబు చేపట్టుటకు సమ్మతంబు తెలుప.

తే.గీ. అచట కొన్ని నెలలు జాప్యమయ్యె గాని,
సమితి సభ్యుల మనవారు శాంత పరచి
పంప చేసి
'రెమ్మల్యె' 'సిఫార్సు' తోడ
'ఆర్. డి. వో' గార్కి తగు నార్థికానుమతికి.

తే.గీ. ఆయననుకూలముగ ఫైలునందు వ్రాసి
పంపె నామోదము కొఱకు పరిషదునకు
వారలంత చర్చించి ఈ పనిని జేయ
ఎంచి కంట్రాక్టరును నియోగించినారు.

తే.గీ. ఇంత జరుగుట కోస మయిదేండ్లు పట్టె,
అంతలోన మన చెఱువు కంతలన్ని
పూడె, నైననుగాని ఇప్పుడిక చెఱువు
బాగుపడునని తెలిసి మా బాధ తగ్గె.

తే.గీ. తనకు కంట్రాక్టు నివ్వలేదనుచు నొకడు
రెచ్చి అంతలో కోర్టులో రిట్టు వేయు
సరికి గౌరవనీయులౌ ‘జడ్జి’గారు
‘స్టే’ని ‘మంజూరు’ చేసిరి స్థిరము గాను.

తే.గీ. ఊరి నాయకు లిదివిని నోరు నెత్తి
బాదుకొనుచు తగిన న్యాయవాది నొకని
కేసు వాదింప నియమించి రాస తోడ,
వలయు ఫీజును దండుచు ప్రజల నుండి. 75

తే.గీ. కొన్ని ఏండ్లుగ నీ ‘కేసు’ ‘కోర్టు’నందు
మ్రగ్గుచుండంగ మన రైతు లెగ్గుదలచి,
చేరి యొక సంఘ మేర్పాటు చేసి,
వారె చెఱువు త్రవ్వ మొదలిడిరి చొరవ తోడ.

తే.గీ. అంత ‘కోర్టు’లో వాజ్య మున్నంతవరకు,
చెఱువు చెంతకు పోవ నిషేధమనుచు
కోర్టు ధిక్కార భీతిని కొంతమంది
కొలను త్రవ్వక మాపించి రలవు జూపి.

తే. గీ. ఎండి యుండెను మన చెఱు విన్ని యేండ్లు
పొలములన్ని బీటలుదీసె జలము లేక
వలయు ధాన్యము పడింప నలవి గాక
కఱవుతో కుందిరి జనులు గ్రామమందు.

చం. అసదృశలీల మ్రంగిరి జనావళి గ్రామమునందు, కొందఱో
అసువులు బాసినారు మదియందు కలంగి కృశించి బెంగతో,
నిసుగులకైన క్షీరములు నిండుగ నీయ నశక్తులౌటచే –
పసులు తినంగ నింత కసవైనను పండని కారణమ్మునన్.

తే.గీ. మధ్యతరగతి గేస్తులు మనుట కష్ట
మయ్యె, కూలిచేయగ నేర రాత్మ గౌర
వాన, ఖర్చులు తగ్గించు పథము లేదు,
రాబడియు సున్న - తిండెట్లు బ్రతుకటెట్లు!

తే.గీ. పొలములను గాని లేనిచో నెలవులైన
అమ్మజూపిన కొనువార లసలె రాక,
ఏండ్లు దాటిన బాగుచేయించ లేక
పోయి రిండ్లు చివికి పడిపోవుచున్న.

కం. అప్పులపాలై పౌరులు
తిప్పలు పడినారు, తగిన తిండియు లేమిన్
తప్పనిసరియై కూలికి
చిప్పలుగొని పోయినారు స్త్రీలున్ గూడన్.

కం. చొప్పడక కొందఱు మనము
ముప్పిరిగొని యూరువిడిచి పోయిరి బ్రదుకన్,
ఎప్పట్టునుండ నేరమి
అప్పటి కెట్లో ఒకట్టు లడగిరి ధీరుల్.

కం. వెచ్చముకై పొచ్చెముతో
కుచ్చితులై ప్రక్క యిండ్ల కొందలపడుచున్
మ్రుచ్చిలిరి కొందఱు యువకు
లుచ్చము నీచమును మఱచి యుద్విగ్నతతో

కం. పశువుల కసాయి వారల
కెసరేగుచు నమ్మినార లెకసక్కెముగా;
వసివాడక చేసిరి తమ
అసువులు నిలుపగ నవసర మయ్యెడి పనులన్.

తే.గీ. ఇంక నా సంగతి యనిన - ఇచటె తాత
తండ్రుల గృహము వదలి పో దలపు లేక,
చిన్న ఉద్యోగియైన నా చిన్న కొడుకు
పంపు సొమ్ముతో నెటులనో బ్రదుకుచుంటి.

తే.గీ. పొలము సాగుకు వనరులు పుష్కలముగ
కలిగియును చూడు మేరీతి గ్రామ జనులు
కఱవుతో తిండి దొరకక కందినారొ!
పాలకుల యాజమాన్య లోపాల వలన.” 87

కం. మిత్రుని పలుకులు వినగా
నేత్రము లార్ద్రంబులయ్యె - నిట్టలముగ నా
గాత్రము తడబడె - ఆలో
గోత్రముపై దేవళంబు గోచరమయ్యెన్.

                

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech