Sujanaranjani
           
  కబుర్లు  
  సెటైర్
          అసలైన ABCD   
 

- రచన : మధు పెమ్మరాజు

 
 
అమెరికా సంక్షిప్త పదాలకి (acronym) పెట్టింది పేరు, ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతి సంబాషణా సంక్షిప్తపదాల చుట్టూ తిరిగి బుర్ర తిరిగేలా చేసేవి, అర్థం కాకపోయినా మొహం ప్రశాంతంగా పెట్టి 'దేశానికి కొత్తయినా, ఊతపదాల్లో కేక' అనుకునేలా ఇకిలించేవాడిని.  చిత్రగుప్తుడి చిట్టాలా మీ ముందు అన్ని పదాలు ఏకరువు పెడితే నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు కనుక మచ్చుక్కి ABCD, FOB, DESI లాంటి కొన్ని పంచుకుంటాను.
మనం ABCD- కాన్వెంట్ చదువులు అనడానికో, “ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి…” లాంటి వయోజన విద్య పాటల్లో వింటూ ఉంటాము...అమెరికాలో అది వాడుకపదం మాత్రమే కాదు రెండో తరపు దేశీలని గేలి చేసే వాతపదం (America Born Confused Desi) అలానే అమెరికా వచ్చి, ఇక్కడి పద్ధతులకి అలవాటు చేసుకోక మొండిగా ఉండే మొదటితరం వారిని ముద్దుగా FOB (Fresh Off the Boat) అంటారు.
ఈ రెండు ఫ్యాక్షన్లకి ఒకరంటే ఒకరికి చిన్న చూపు, ఎదురు పడితే నిశ్శబ్ద యుద్ధం..”బయటకి మీలా ఉన్న, మా ఆలోచన వేరు..జీవన విధానం వేరు...మేము అమెరికన్స్!!" అని ఒకరు, "మేము మీలా ఉండడం మా దురదృష్టం, మా నర, నరాల్లో దేశ సంస్కృతి లావాలా ప్రవహిస్తోంది..మేము నిప్పు!!" అని ఇంకొకరు, ఈ సాత్విక వైరం అర్థం చేసుకోవాలంటే ఇరువర్గాల గొడవ వినాల్సిందే -
FOB-"అమెరికాలో పుట్టిన అయోమయమా! నీ డిప్ప కట్టింగ్, తింగర చూపులు, తిరునాళ్ళలో తప్పిపోయిన వాటం చూళ్లేక చస్తున్నా”
ABCD-"ఏజ్ బారయిన యెర్ర బస్సా!నీ  కుచ్చు మీసాలు, భయం చూపులు విసుగు తెప్పిస్తున్నాయి"
FOB-"మీకు పెద్దల పట్ల వినయ, విధేయతలు లేవు, అవసరం తీరాకా తెప్ప తగలేసే అవకాశవాదులు మీరు”
ABCD- “అవును బాబాయ్! మీరు మహాత్ములు, అందుకే దేశాన్ని వదిలి ప్రపంచాన్ని, మమ్మల్ని బాగు చెయ్యడానికి వచ్చారు”
FOB-“మీకు బాష లేదు, రుచి పచి లేవు (గోంగూరలో ఉల్లిపాయ)…ఓవరాల్గా యూస్ లెస్స్ ఫెల్లోస్”
ABCD-"మాకు లేనివి బానే చెప్పారు, మీకు ఉన్నవి చెప్తాను- వంటి నిండా వంటింటి వాసనలు, ఇంటి నిండా కూర కారాలు...మీ మూలాన మా దేశంలో మా పరువు పోతోంది”
FOB-“మీ క్రాఫ్ లాగ పేర్లు కూడా డిప్ప కటింగే, రాజ్ కాస్తా రోజర్, సిద్ధార్థ్ కాస్తా సిడ్, అసలు పేర్లు చెప్పుకోలేని నకిలీ జీవితాలు మీవి, ఎక్కడ మళ్ళీ వెలి వేస్తారోనని తోటి దేశీని పలకరించాలంటే కూడా భయమే"
ABCD- “హాబీస్ కి,, ఉద్యోగానికి తేడా లేని జాలి బతుకులు మీవి, సరదాకి సాఫ్ట్వేర్ పుస్తకాలు, బాధగా ఉంటే హార్డువేర్ మాన్యువల్స్ చదువుతారు”
డివైడ్ అండ్ డివైడ్ పాలసీ మనకి కొత్తేం కాదు, దేశం వదిలినా మన వాళ్ళు ఆనవాయితీని మర్చిపోలేదని మనమంతా  గర్వపడాలి.
****
పైన చెప్పిన పాత రకాలు ఒక వైపు, ఈ మధ్య తటస్థ పడుతున్న కొత్త తరహా ఇంకో వైపు....వీరు తమ అవసరాల దృష్టితో ప్రపంచాన్ని చూస్తారు, మార్పులని అస్సలు సహించలేరు...ఆ ఇమేజ్ ఏ మాత్రం తొణికినా, చెదిరినా..విసుక్కుంటూ, మదనపడుతూ అయోమయంగా తయారవుతారు..ఈ రకాన్ని రవి అనే కల్పితపాత్ర పదిహేనేళ్ళ ప్రయాణం ద్వారా పరిచయం చేస్తాను.
మొన్నటి రవి 
హడావిడిగా జనాలని తోసుకుంటూ సిటీ బస్ కిటికీ సీట్ దక్కించుకుని గర్వంగా చుట్టూ చూసాడు, ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు, కనీసం వాడి మొహం కేసి కూడా చూళ్ళే....బస్ వేగానికి, మూసీనదిపై చల్లటి పిల్లగాలి తోడవ్వగానే మొదట నిద్రలోకి, కాసేపటికి పగటి కలల్లోకి జారుకున్నాడు.
దారిలో ఎన్ని గతుకులున్నా బెణకని ఉక్కు మనిషి, డ్రైవర్ వేసిన సడన్ బ్రేకుకి కాస్త కళ్ళు తెరిచి బయటకి చూస్తే దిగాల్సిన స్టాప్ ఎప్పుడో దాటిపోయింది, అతని మోహంలో అలవాటైన హావభావం (నాట్ అగైన్) పెట్టి సుఖంగా నిద్రలోకి జారుకున్నాడు.
అరగంటకి ధీమాగా లేచి, దిగాల్సిన స్టాప్కి అవతల పక్క దిగి, ఎదురుగా ఉన్న ఇరానీ హోటల్లోకి వెళ్ళాడు (డిపో దాకా వెళ్ళిన బస్ తిరుగు రూట్లో వెనక్కి వచ్చింది).
“అరె ఇంత లేటా మామా” అని పనిలేని మిత్రుల పలకరింపుకి మీటింగ్ నుంచి వచ్చినట్టు నవ్వి, "చోటే! వన్ బై టు చాయ్ లానా" అని కూర్చోగానే, బక్కగా ఉన్న ముసలాయన టీతో పాటు రెండు రూపాయల బిల్ టేబుల్ పై పెట్టి వెళ్ళిపోయాడు. ఘుమ, ఘుమల టీ నాలికకి తాకగానే రాకెట్టుకి నిప్పెట్టిన బలం…ఆ ఊపులో ఆపకుండా రెండు గంటలు పక్కింటమ్మాయి నాలుగో బాయ్ ఫ్రెండ్ నుంచి చార్మినార్ అమ్మకం దాకా కీలకమైన సమస్యలు ఓపిక నశించే దాకా విశ్లేషించారు.
జనాలు నిదానంగా, నవాబీ ధిలాసాతో కాలక్షేపం చేసే చవకైన, మధురమైన రోజులు….ఆ రోజుల్లో అబిడ్స్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ మహా అంటే పంజాగుట్ట, అమీర్పేట్! నగరానికి ఏ మూలకి వెళ్ళాలన్నా అరగంట, గంట ప్రయాణం....సరదాగా సినిమా చూసి, ఫుట్ పాత్ పై పాత పుస్తకాలు చూస్తూ నడవడం, గోకుల్ చాట్లో పానీ పూరి, బావర్చిలో బిర్యానీ, ఆల్ఫాలో టీ...... సంతోషానికి కొలమానం ఏమిటి? ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి? జవాబు లాంటి ప్రశ్నలు రవిని చిరునవ్వు నవ్వేలా చేసాయి.
కొద్ది రోజులకి 'సాఫ్ట్వేర్' అనే వింత జ్వరంతో నగరం మూడ్ మారిపోయింది...అవేవో కోర్సులు చేసి పక్కింటబ్బాయి అమెరికా ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడని ఇంట్లో వాళ్ళ పోరు పెడితే, వారి గోల పడలేక అదే వెర్రి కోర్స్ చేసి, కులాసా జీవితాన్ని కష్టంగా వదిలి అమెరికా ఫ్లైట్ ఎక్కాడు...మినిస్టర్ కాలేదు కానీ డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు.
****
నిన్నటి రవి 
పేడి మొహం, గళ్ళ చొక్కా, నైకీ బూట్లతో నున్నగా దిగిన రవి ఎయిర్పోర్ట్ బయటకి రాగానే నేలని, నీలి ఆకాశాన్ని చూసి "మేరా భారత్ మహాన్" అని మనసులో అనుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ మెరుస్తున్న కళ్ళతో "వాడు మా అబ్బాయి" అని గర్వంగా చూసారు, అంతా కలిసి ఆనందంగా ఇంటికి వెళ్లారు.
వెళ్ళిన రోజు నుండీ బంధు మిత్రుల VVIP ట్రీట్మెంట్-"మీ అబ్బాయి బాగా రంగు తేలాడండి, అమెరికా నీళ్ళు పడ్డట్టున్నాయి", "మా మేనల్లుడు మీసం తీసేసి అమెరికాన్లా ఉన్నాడు.....అవును వదినా మాకేం తెచ్చాడు రవి?", "సంబంధాలు చూస్తున్నారా? మా అక్క కూతురు మొన్నే ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీగా ఉంది" ఎవ్వరూ పట్టించుకోని ఏకాకి జీవితం నుండి నూని జిడ్డులా ఎవ్వరూ వదలని చోటికి రావడం…దానికి జెట్లాగ్ తోడయ్యి, గాల్లో తేలుతున్నట్టుంది, రెండు రోజులకి పెట్టెల బరువు తగ్గగానే జనాలు పల్చబడ్డారు.
"స్టేచ్యు అఫ్ లిబర్టీ" మాదిరిగా ఒక చేతిలో బిస్లరి బాటిల్, ఇంకో చేతిలో ఆపిల్ పండుతో రవి రోడ్ ఎక్కగానే, పాత రోజులతో పోలిక వరదలా పొంగి నోట్లోంచి అప్రయత్నంగా మాటలు వచ్చేసాయి -"డాడీ! ఇండియాలో ఇంత మంది బెగ్గర్స్ ఉన్నారా?", "చత్..ఎవ్వడికీ సివిక్ సెన్స్ లేదు..", "రోడ్లు లేని చోట కార్లు ఎందుకో?, తన కార్ మీదకి ఆవేశంగా వస్తున్న ట్రాఫిక్ చూస్తుంటే 3-D హారర్ సినిమాలా అనిపించి "నాకేం తెలీదు, నన్ను వదిలెయ్యండని" సీట్ గట్టిగా పట్టుకుని ఇష్ట దైవాన్ని తలుచుకున్నాడు.
పొగరుగా డాలర్లు, క్రెడిట్ కార్డులు పట్టుకుని షాపింగ్ మాల్కి వెళ్ళిన రవి సాయంత్రానికి జేబులు గుల్ల చేసుకుని బయటకి వచ్చాడు, మోహంలో ఎవరో చాచి పెట్టి కొట్టిన ఎక్స్ ప్రెషన్…నోట్లోంచి దానికి సరిపడా ఒక మాట “ఇవేమి రేట్లురా బాబు?”, అమెరికాలో ఆచి, తూచి అడుగెయ్యడం అలవాటయి హైదరాబాద్ షాపింగ్ పెద్ద కల్చర్ షాక్! రెండు రూపాయల టీ రోజులు, వంద రూపాయలు (చేంజ్ లేదని) మిత్రులకి చూపించి వారం గడిపిన రోజులు కళ్ళ ముందు తిరిగాయి.
సాఫ్ట్వేర్, సర్విస్ ఎక్స్పోర్ట్ పెరిగాకా హైదరాబాద్ హంగులు పెరిగి ఆరోగ్యం చెడిపోయింది, ఎక్కడ చూసినా హడావిడి, మలక్పేట్ నుండి మాదాపూర్ మూడు గంటలు, ఏ మాల్ కి వెళ్ళినా ఖర్చుకి వెనుకాడని నవతరం, కోటి రూపాయల అపార్ట్మెంట్స్, అప్పు చేసి పప్పు కూడనే అసంతృప్తి జనాభా…ఇది నా ఊరా? వేరే లోకమా? అనే జవాబు లేని ప్రశ్నలు రవిని వేధించాయి 
****
నేటి రవి 
సూర్యుడు ఎప్పుడూ తూర్పునే ఉండడు, మార్పు అనివార్యం! రవి వయసు, బాధ్యతలు తప్ప పరిపక్వత పెరగలేదు, అమెరికాలో పదిహేనేళ్ళున్నమాటే కానీ చేసే ప్రతీ ప్రయత్నం పాత ప్రపంచాన్ని సృష్టిద్దామనే తపనతో కొత్త సంస్కృతికి, సమాజానికి అలవాటు కాలేకపోయాడు. ఆడపిల్లల్ని పెంచాలంటే భయం, సరదాగా తలుపు తట్టే రిసెషన్ అంటే భయం, ఏ కొత్త మనిషిని చూసినా భయం!
ధైర్యంగా సొంత చోటికి వెళ్లిపోదామంటే, వదిలొచ్చిన నగరం బేలగా 'వస్తాడు నా రాజని' ఎదురుచూస్తూ కూర్చోక ముదరగా, పొగరుగా మారిపోయి, ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడి ట్రాఫిక్కంటే భయం, ఆఫ్షోర్ కంపెనీల బండ చాకిరంటే భయం, ఎండలు, కాలుష్యమంటే మహా భయం.....’దిల్ ఎప్పుడూ మాంగే మోర్’ కావున రవికి కావల్సినవి ఇక్కడి పరిసరాలు-అక్కడి సుఖాలు, ఇక్కడి జీతాలు-అక్కడి ఆప్తులు, ఇక్కడి టీవీ ఆక్టర్స్-అక్కడి జెమినీ సీరియల్స్.... అలా అయోమయపు సంఘర్షణ.
****
ముగింపు- లిబరలైశేషన్ తర్వాత ఇండియాకి ప్రపంచ పటంపై పెద్ద పీట వేసారు, అన్ని దేశాల కళ్ళు మన మీద పడగానే ఎన్నో తెలిసీ, తెలియని మార్పులు గత ఇరవై ఏళ్ళుగా మనవాళ్ళని చుట్టుముట్టాయి, అందలానికి ఎత్తేసే అవకాశాలు, చిక్కు ముళ్ళ సమస్యలు తోబుట్టువుల్లా వచ్చి ఉద్యోగావకాశాలు, దేశం గీతలని నిర్దేశిస్తున్న విదేశీ కంపెనీలు, చాలీ చాలని రోడ్లపై లెక్కలేని కార్లు, కుదిపేస్తున్న సామాజిక మార్పులని తెచ్చాయి....ఆ వరదల్లో 'మునకే సుఖమనుకోవోయి' అని కొట్టుకుపోయే పావులు, బుద్దుడి విగ్రహంలా నిగ్రహంతో అవసరమైన వాటిని మాత్రమే అలవర్చుకొనేవారు ఇలా రక, రకాలు కనపడతారు…..అటూ, ఇటూ కాని రవి లాంటి వారు అయోమయపు, అతి తెలివితో మిగులుతారు..వారిని America Based Confused Desi (ABCD) అంటారు!!
 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech