Sujanaranjani
           
  కబుర్లు  
  సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 27
 

బందులదొడ్డి

 
 

- రచన : సత్యం మందపాటి

 
  ఈమధ్యనే భారతదేశానికి వెళ్ళాం, ఒక పెళ్లి చూడటానికి, నా కొత్త పుస్తకం ఇంకొకటి ఆవిష్కరించటానికి, ఉత్తర భారతదేశంలోని కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలు చూడటానికి. మొత్తం కార్యక్రమం చాల చక్కగా జరిగింది. చుట్టాలనీ, మిత్రులనీ, సాహిత్యాభిమానులనీ చూసి, వారితో సమయం తక్కువే అయినా, సరదాగా గడిపాము.
కాకపోతే మామిడికాయ పప్పు తినేటప్పుడు పంటి క్రిందకి వచ్చే రాయిలా, ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లోని వెకిలి హాస్యంలా, చక్కటి వేడివేడి కాఫీలో తేలుతున్న ఈగ శవంలా, మధ్యేమధ్యే కొన్ని ఇబ్బంది పెట్టే విషయాలు కలుక్కుమన్నాయి.

ఏం చేయను. స్వరాజ్యం, స్వాతంత్రం లేని బ్రిటిష్ భారతంలో పుట్టి, ఎంతోమంది త్యాగాలతో, ప్రాణాలర్పించి సంపాదించిన స్వరాజ్యాన్నీ, స్వాతంత్రాన్నీ, వాటి విలువల్నీ చవిచూసిన వాడిని మరి.
ఆ వేదన, నా ఆవేదన చెప్పుకుందామనే ఈ వ్యాసం.

౦ ౦ ౦
ప్రస్తుతం మన తెలుగు దేశంలో రాజకీయ నాయకులు ఎలా వున్నారయ్యా అంటే:
“నడుస్తున్నా.. మనకోసం“ అంటూ ఆంధ్రప్రదేశమంతటా నడుస్తూనేవున్నాడొకాయన.
“వస్తా.. వస్తా.. బయటికి వస్తా.. వచ్చి మిమ్మల్నందర్నీ రక్షిస్తా.. “ అంటున్నాడు జైల్లో వున్న ఇంకొకాయన.
“తేలుస్తారా.. చస్తారా” అని ఇంకా అరుస్తూనే వున్నాడు నుదుట ఎర్రబొట్టు పెట్టుకున్న ఒక విభజనుడు.
“లాహిరి లాహిరి లాహిరిలో” అంటూ సినిమా పాట పాడుతున్నాడు పార్టీ మారి, పదవి తెచ్చుకున్న భజనశ్రీ.
“చూస్తున్నా.. చూస్తున్నా..” అంటూ ఏమీ చేయకుండా చూస్తూనే వున్నాడు ఒక అమ్మగారి పుత్రుడు.
అప్పుడే ఇంటికి వచ్చిన మా తమ్ముడి కొడుకుని అడిగాను “ఏరా.. ఇవాళ కాలేజీకి వెళ్ళలేదా?” అని.
“లేదు పెద్దనాన్నా, ఇవాళ బందు. కాలేజీలన్నీ మూసేశారు” అన్నాడా కాలేజీ కుర్రవాడు.
౦ ౦ ౦
అసలే పెళ్ళికి వెళ్ళాం కదా, నగల కొట్లో ఏవో వెండి నగలు పాలిషింగ్ చేసుకురమ్మని చెప్పింది శ్రీమతి. సతి ఆనతి కాదనలేని పతిగా, తమ్ముడిని తోడు తీసుకుని ప్రొద్దున్నే పదింటికల్లా షాపుకి వెళ్ళాం. అప్పుడే తలుపులు తెరిచి, దుమ్ము దులుపుకుంటున్నారక్కడ. చేయవలసినవేవో అతనికి ఇచ్చి అక్కడే కూర్చున్నాం. మా వెనకనే వచ్చింది అక్కడే ఒక కాలేజీలో పనిచేసే పంతులమ్మగారు. ఆవిడ పని కూడా అదే కనుక, ఇవ్వవలసినవేవో తను కూడా ఇచ్చి మాతో కబుర్లలోకి దిగింది. మంచి కలుపుగోలుగా ఎన్నో విషయాల మీద మాట్లడేస్తున్నది.
“ఇవాళ బుధవారం కదా, మీకు కాలేజీ లేదా?” అడిగాను, కొంచెం చనువు తీసుకుంటూ.
ఆవిడ నవ్వింది. “మాకిక్కడ వారాలతో పనిలేదు. ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు కావాలంటే అప్పుడే బంద్. ఇవాళ కూడా బందే. కాలేజీ మూసేశారు. మీ అమెరికాలో ఇలాటివి లేవేమో. ఇంకాసేపట్లో గుంపులు గుంపులుగా జెండాలు పట్టుకుని వస్తారు చూడండి. బలవంతాన షాపులన్నీ మూసేయిస్తారు. మూసేయకపోతే హింసాకాండకి దిగుతారు”
తమ్ముడితో అన్నాను “మరయితే అతన్ని తొందరగా పని పూర్తిచేయమను. గొడవ మొదలయే లోపల ఇంటికి వెడితే మంచిది కదూ” అని.
ఆవిడ మళ్ళీ నవ్వింది. “అంత హడావిడి ఏమీ లేదులెండి. వాళ్ళు రావటానికి ఇంకా సమయం వుంది. ఏ పార్టీ వాళ్ళు బంద్ చేసినా, అవి చేసేవాళ్ళు మాత్రం అదే గ్రూపు. కొంతమందికయితే, బంద్ ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. ముందు వరసలో కొంతమంది పార్టీ వాళ్ళు వుంటారు, వెనకాల పోలోమని వీళ్ళందరూ గొర్రెల్లాగా వెళ్లి గోల చేస్తుంటారు. వట్టినే చెయ్యరనుకోండి. రోజుకి ఇంత అని కూలి, ప్రొద్దున్నే కడుపునిండా అల్పాహారం... అల్పాహారం ఏమిటిలెండి.. కడుపునిండా పట్టించి వస్తారు. మధ్యే మధ్యే పూటుగా పానీయం సమర్పయామి. ఇవన్నీ పూర్తి చేసుకుని వచ్చేసరికీ, కనీసం పదకొండు దాటుతుంది..” అన్నది.
ఆవిడ చెప్పే మాటలు విని వింతగా చూశాను.
“నేను చెప్పింది మీరు నమ్మటల్లేదు కదూ.. మొదట్లో నేనూ నమ్మలేదు... మా కాలేజీ పిల్లలు కొంతమంది వీటిల్లో వేలు పెడుతుంటారు.. పుణ్యం పురుషార్ధం రెండూ వస్తాయికదా అని. అదో పార్ట్ టైం ఉద్యోగం అన్నమాట”
“అవును. నేనూ విన్నాను ఇలాటివి జరుగుతూ వుంటాయని.. “ అన్నాడు తమ్ముడు.
ఈలోపల అక్కడ మా పని పూర్తయింది. లేచి బయటికి రాబోతుండగా ఉద్యమకార్లు కార్లల్లో కాకుండా సైకిళ్ళ మీద గుంపులు గుంపులుగా వచ్చి కొట్లన్నీ మూసేయమంటున్నారు. ఒకటే జబర్దస్తీ. చాలామంది వాళ్ళని చూడగానే కొట్లు మూసేసి, షట్టర్లు క్రిందికి దించేశారు. అలా చేయకపోతే షాపులోని వస్తువులని సర్వనాశనం చేసేస్తున్నారు.
అక్కడే బయట అరటిపళ్ళు అమ్ముకునే అమ్మాయిని పక్కకి తోసి, అరటిపళ్ళు అన్నీ నేల పాలు చేసి, బండిని తలక్రిందులు చేశారు. ఆరోజు తన పెట్టుబడి అంతా అలా మట్టి కరుచుకుపోవటం చూసి, ఆ అమ్మాయి ఏడుస్తున్నది.
“పద వెడదాం.. మనం ఇక్కడ వుండటం మంచిది కాదు” అన్నాడు తమ్ముడు.
ఇద్దరం చకచకా ఇంటికి వెళ్ళాం.
౦ ౦ ౦
పెళ్లి చాల బాగా జరిగింది. ఆ రెండు రోజులూ బందులూ గిందులూ లేకపోవటంతో ఏమీ అడ్డంకులు కూడా రాలేదు.
పెళ్లయిన మర్నాడే విజయవాడ, కర్నూలు, చెన్నై, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, వరంగల్ మొదలైన వూళ్ళ నించీ వచ్చిన వాళ్లందరూ తిరుగు ప్రయాణం కట్టారు. ఆ రోజు రోడ్ రోకో. మర్నాడు రైల్ రోకో. ముందు ఇదేదో కొక్కురోకో వ్యవహారం, కోళ్ళు అరుస్తున్నాయి అనిపించింది. కానీ కాదుట. ఇంగ్లీషూ, హిందీ కలిపిన ఆ మాటలు తెలుగులోకి వచ్చేశాయిష. ఒకరోజు ప్రత్యేక తెలంగాణా కోసం. ఒకరోజు సమైక్య ఆంధ్రప్రదేశం కోసం. ఇలా ఎన్నో కారణాలు. ఏది ఏరోజో గుర్తులేదు కానీ ఒకరోజు బస్సులన్నీ ఆపేశారు. రోడ్ రోకో అంటే, రోడ్డు మీద ప్రయాణం చేస్తే డొక్కా చీరేస్తాం, ఆరోజు బస్సుల్లో టిక్కెట్లు కొన్న వాళ్ళందరికీ ఇక్కట్లు అని అర్థం అని అర్థమయింది. రైల్ రోకో అంటే ఆ రోజు రైళ్లల్లో వెళ్ళే వాళ్ళ డొక్కలు చింపబడకుండా ప్రజారక్షణ కోసం, శ్రీప్రభుత్వం వారు రైళ్ళు నడపరు, దూరాభారం నించీ వచ్చేవయితే దారిలోనే ఎక్కడో ఆపేస్తారు అని అర్థం అని కూడా అర్థమయింది.
దాంతో బస్సు టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళు రైళ్లల్లోనూ, రైల్ టిక్కెట్టు కొనుక్కున్నవాళ్ళు బస్సుల్లోనూ మళ్ళీ డబ్బులుపెట్టి టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళవలసి వచ్చింది. ఈ రెండూ ఒకే రోజు కాదని మళ్ళీ మనవి.
కాకపొతే మరి కార్లల్లో వచ్చిన వాళ్ళున్నారు, వారి సంగతో?
ఇందాకే అనుకున్నాం కదా, ఈ బందుగాళ్ళు నిద్ర లేచి, తీరిగ్గా తీర్థప్రసాదాలు పూర్తి చేసుకుని రావటానికి సమయం పడుతుందని. అందుకని మా మూర్తిగారు తెల్లవారు ఝామున రెండింటికే గుంటూరులో బయలుదేరి, కోళ్ళు కొక్కురోకో అనే లోపలే హైదరాబాద్ చేరుకున్నారు.
కొంచెం ఆలస్యంగా అదే హైదరాబాదుకి బయలుదేరిన రామూ, శ్యామూ మాత్రం ధైర్యంగానే వెళ్లారు. ఆందోళనకారులు కారుకి అడ్డం వస్తే, జగ్గయ్యపేట దాకా రాము ఆంధ్రా యాస తెలుగులోనూ, అది దాటాక శ్యామూ తెలంగాణా యాస తెలుగులోనూ మాట్లాడతారుట. “నీకెందుకు మామా! ఇద్దరం భారతీయులం వున్నాం కదా. మేము చూసుకుంటాం, నువ్వు భయపడుకు” అని అభయమిచ్చారు.
ఇంతకీ నువ్వు అక్కడున్న నెలరోజుల్లో ఎన్ని బందులయాయి, వాటికి కారణములు ఎయ్యది అని అడిగితే మాత్రం నేను చెప్పలేను. చాల అయాయి అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ బందుల్లో ఎన్నో రకాలు వున్నాయి. షాపులు మాత్రమే మూసేయటం, స్కూళ్ళు మూసేయటం, బాంకులు మూసేయటం, రైళ్ళు మాత్రమే ఆపేయటం, బస్సులు మాత్రమే ఆపేయటం ఇలాటివి. కొంచెం ఉద్రేకం ఎక్కువయితే వాటిని, అంటే షాపులు, స్కూళ్ళు, బాంకులు, రైళ్ళు, బస్సులు, మొదలైనవి పగలకొట్టటం, విరగకొట్టటం, తగలబెట్టటం లాటివి చేయటం ఇంకొకటి. వీటన్నిటికన్నా పెద్ద బంద్ పేరు టోటల్ బంద్. అంటే టోటల్ మొత్తం పూర్తి హోల్సేలుగా అన్నీ సంపూర్ణంగా బంద్ చేయటం అన్నమాట. అంటే ప్రజా జీవితాన్ని ఎన్నో విధాలుగా బంధించి, బాధించి, ఏడిపించి, ఇబ్బంది పెట్టి, అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుని, ఆనందించటమన్నమాట.
ఇక కారణాలా? వాటికి కొదువలేదు. రాజకీయ నాయకుడికి (ఈ రెండు మాటల్నీ కుదించి రానా అందాం. ఈ రానాల కోసం అన్ని తెలుగు అక్షరాలు వాడటం కూడా దండగ) ఏం కావాలంటే అది సాధించటానికి, కారణాలు వెదకవలసిన అవసరం వుందా? వెదికితే వేలకి వేలు.
ఉదాహరణకి: పదవిలో వున్న ఒక రానా ఎద్దు ఈనిందంటే, పదవి పోయిన ఇంకో రానా ఆ దూడని బందుల దొడ్లో పెట్టేయలేదని చేస్తాడు బంద్. అవినీతి పరుడైన ఒక రానాని పట్టుకుంటే, అతని అభిమానులు చేస్తారు కనీసం ఒక బంద్. అతన్ని పట్టుకుని జైల్లో వేస్తే టోటల్ బంద్. అతన్ని పట్టుకోకపోయినా, పట్టుకుని జైల్లో వేయకపోయినా ఎదుటి పార్టీ వాళ్ళు చేస్తారు ఇంకో బంద్. హిందువులని అందరినీ పది నిముషాల్లో మట్టు పెట్టేస్తానని, ఒక మతోన్మాది అంటే రెండు రకాల బందులు. అతన్ని పట్టుకుని జైల్లో వేయకపోతే ఒక వర్గం, వేస్తే ఇంకో వర్గం చేస్తారు బంద్. బస్సులు రేట్లు పెంచేస్తే, బంద్ చేసి కొన్ని బస్సుల్ని తగలేస్తారు. అసలే నష్టాల్లో వున్న బస్సుల వాళ్ళు, ఇంకా తగలబడ్డ బస్సుల నష్టంవల్ల మళ్ళీ రేట్లు పెంచుతారు. అప్పుడు మళ్ళీ ఇంకో బంద్. ఈమధ్య సడక్ బంద్ అనే ఒక మాట కూడా విన్నాను. అదేమిటో నాకు తెలీదు. కనీసం అ సడక్ బంద్ చేసేవాళ్ళకయినా అది తెలుసనుకుంటాను. ఈ బందులు ఎక్కడ ఎప్పుడు ఆగుతాయో ఈ రాబందులకే తెలియాలి.
మరి ఈ బందుల వల్ల నష్టపోయేది ఎవరు? ఇంకెవరు? ప్రజలు. సామాన్య ప్రజలు. పళ్ళ దుకాణాలు, కూరల దుకాణాలు, చిన్నచిన్న కాఫీ హోటళ్ళు, షాపులు పెట్టుకున్నవాళ్ళు. రిక్షాలు, ఆటోలు, టాక్సీలు నడిపేవాళ్ళు. అత్యవసరాలకి సమయానికి వైద్య సహాయం అందని పేషంట్లు. ప్రయాణ సౌకర్యాలు దెబ్బతిన్న ప్రయాణీకులు. స్కూళ్ళల్లోనూ, కాలేజీలలోనూ చదువుకి అంతరాయం కలిగిన విద్యార్థులు. ఇలా ఎందరో...
ఇంకొక విషయం ఏమిటంటే చాల కొద్దిమంది ప్రజలు ఈ బందుల్ని సమర్థిస్తున్నారు కూడాను. నేను చూసిన అలాటివాళ్ళు, ఒక పార్టీకి చెందినవాళ్ళో, ఒక కులానికి చెందినవాళ్ళో, దానిలో ఒక స్వంత ప్రయోజనం వున్నవాళ్ళో తప్పితే, ఈ బందుల వల్ల ఎంతమంది ప్రజలు కష్టనష్టాలకు లోనవుతున్నారు, అవసరానికి వైద్య సహాయంలాటివి అందక ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, పిల్లలు చదువులో ఎంత వెనుక పడుతున్నారు, వీటివల్ల ఉత్పత్తి తగ్గి దేశం ఎంత వెనక్కి వెడుతున్నది అని ఆలోచించేవాళ్ళు కనపడరు.
ఉద్రేకంతో ముందుకు దూకితే పరిష్కారం దొరకదు. సరైన ఆలోచన, దాని వల్ల అవసరమైన ఆచరణ కావాలి. అంతేకాదు, భారతంలో ఈ బందులు చరిత్ర చూస్తే, ఇవి నిజంగా సాధించినవి ఒక్కటీ కనపడదు.
నాకు అంతుపట్టని విషయం ఒకటి వున్నది. ఆనాడూ ఈనాడూ ఒక దేశం ఇంకో దేశాన్ని, మంచి కోసం ఒక వర్గం (వర్గం అంటే కులం కాదు సార్) ఇంకో వర్గాన్ని ఎదిరించాలంటే, మన బలం ఎంత, ఎదుటి వాడి బలం ఎంత అని ముందుగా లెఖ్కలు వేస్తారు. బలం ఎక్కువయినప్పుడే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఏ దేశ చరిత్ర చూసినా అధిక సంఖ్యాకుల బలం మంచిని గెలిపించి, చెడుని ఓడించటం చూస్తూనే వున్నాం. కానీ ఇప్పుడు భారతదేశంలో ప్రతి పదివేల మంది మంచివాళ్ళని పదిమంది చెడ్డవాళ్ళు శాసిస్తున్నారు. చాల కొద్ది మంది బందుగాళ్ళు ఎన్నో లక్షల మంది ప్రజల జీవితాలని తమ చేతుల్లో పెట్టుకుని అడిస్తుంటే, ప్రజలు చూస్తూ ఎలా వూరుకుంటున్నారా అని!
౦ ౦ ౦
“నడుస్తున్నా.. మనకోసం“ అంటూ ఆంధ్రప్రదేశమంతటా నడుస్తూనేవున్నాడొకాయన.
“వస్తా.. వస్తా.. బయటికి వస్తా.. వచ్చి మిమ్మల్నందర్నీ రక్షిస్తా.. “ అంటున్నాడు జైల్లో వున్న ఇంకొకాయన.
“తేలుస్తారా.. చస్తారా..” అని ఇంకా అరుస్తూనే వున్నాడు నుదుట ఎర్రబొట్టు పెట్టుకున్న ఒక విభజనుడు. “లాహిరి లాహిరి లాహిరిలో” అంటూ సినిమా పాట పాడుతున్నాడు పార్టీ మారి, పదవి తెచ్చుకున్న భజనశ్రీ.
“చూస్తున్నా.. చూస్తున్నా..” అంటూ ఏమీ చేయకుండా చూస్తూనే వున్నాడు ఒక అమ్మగారి పుత్రుడు.
అప్పుడే ఇంట్లోకి వస్తున్నాడు మా తమ్ముడి కొడుకు. నేను రోజూ అడుగుతున్న ప్రశ్నే ఆరోజు కూడా అడుగుతానని ఎదురు చూస్తున్నట్టున్నాడు, ఇంకా అడగవేం అన్నట్టు నా వేపు చూస్తున్నాడు.
“నాకు తెలుసు లేరా! ఇవాళ బంద్! మీ కాలేజీ మూసేశారు” అన్నాను.
౦ ౦ ౦

 
 

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం 'వేయి వసంతాలు' అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech