Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - సమకాలీన సమస్యలకు అద్దం పట్టిన కధలు "అద్దం'' 
 
 

                                                                                  సమీక్షకులు ; శైలజామిత్ర

 

ఎన్నో ఏళ్ళు గడిచినా కధ తాజాతనం తగ్గిపోదు. ఎందుకంటే కధకు ఎప్పుడు వృద్ధాప్యం రాదు. భవిష్యత్ లో ఉండదు కూడా ! ఎందుకంటే కధలన్నీ మానవ జీవితాలకు సంభందించినవి. లేదా సమాజ సమస్యలకు సంభంధించినవి. సహజమైన వాతావరణం లోని మనం నిత్యం ఎదురుచూసే సమస్యలను వస్తువులుగా తీసుకుని అర్థవంతమైన పరిష్కారాన్ని జత చేసి రూపుదిద్దుకున్న కధలు కస్తూరి అలివేణి గారి ''అద్దం' కధల ఆంతర్యం. ఈ కధల సంపుటిలో దాదాపు గా అన్నీ మంచి కథలనే చెప్పాలి. కారణం కధల్లో సమాజానికి సందేశం ఇవ్వాలనే తపన కనబడుతుంది కనుక. 
 
ఈ కధకురాలి మొదటి సంపుటి ఇది. సంగీత వేత్తగా ప్రేక్షకులకు సుపరిచితమైన కస్తూరి గారు  ఈ పుస్తకంతో సాహిత్యంలో కి అడుగు మోపారు. కస్తూరి అలివేణి అనే పేరుతో ఇటీవల కాలంలో ప్రముఖ పత్రికల్లో కధలు చాల మంది చదివే ఉంటారు. అందుకే ఆ కధలకు అనేక ప్రశంసలు లభించాయన్నది అతిశయోక్తి కాదు. గ్రందం శీర్షిక " అద్దం" కధను పరిశీలిస్తే దాతృత్వ గుణం కలిగి ఉన్న సుబ్బారావు పాత్ర మనల్ని పలకరిస్తుంది. ఒకింత నవ్వును అందిస్తుంది. నేడు సమాజం లో అప్పులు చేసిన వారు, దానాలు చేసిన వారు చివరకు ఎందుకు కొరగారు అనే విషయం తెలియని వారు లేరు. ఈ కధలో సుబ్బారావు పాత్ర దానాలు చేసేది. ఉన్నదానిలో దానాలు చేసి ఇంట్లో ఏమి లేకున్నా ఆ దేవుడు సహాయం చేస్తాడు అనేది ఈ పాత్ర వాదన. ఎవరి స్వభావం, వారి చేతల్లోనే ప్రతిఫలిస్తుంది అన్నట్లు ఈ కదానిక లో సుబ్బారావు పాత్ర అతని స్వభావ అద్దం లోంచి ప్రతిఫలించినవే!

అత్తా కోడళ్ళు ఒకప్పుడు ఎంత గొడవ చేసుకునే వారు. ఇప్పుడు చాల వరకు కోడళ్ళ ఉద్యోగ నిర్వహణ కారణంగా అత్తకు కోడలితో మాట్లాడే అవకాశం కాని, అత్తగారితో కోడలు కబుర్లు చెప్పే అవకాశం కాని ఉండటం లేదు. అలాగని ఎక్కడా లేవనీ చెప్పలేము. ఆ ఇతివృత్తం ఆధారంగా ఒక చిన్న సంఘటనను ఆధారంగా తీసుకుని'' ఈ తరం కోడలు''  హృద్యంగా మలిచేరు. కోడలు మంచితనంతో అత్తగారు మనసును సంతృప్తి పరచడం కొత్తదనం గా ఉంది. 

అలాగే స్త్రీకి వ్యక్తిత్వం , ఆత్మాభిమానం ఎంత అవసరమో అనేది ''జీవిత గమనం'' కధలో ఎంతో ఆలోచింపచేసేది గా ఉంది. పురుషుడు ఎంత బాధించినా చివరకు వచ్చి క్షమించమని అడగగానే ఎంత మాట.. మీరు అలాంటి మాట అనకండి. అసలు ఆ మాట నేనే అడగాలి. ఇన్నాళ్ళు ఎంతో అపార్ధం చేసుకున్నాను. అనే పాత విధానం కాకుండా తన జీవితానికి ఏమాత్రం అర్థం లేకుండా చేసిన అతడిని జీవితాంతం క్షమించక పోవడం ఎంతో బావుంది. స్త్రీ లో మార్పు ఇలా ప్రత్యక్షంగా చూపిన ఈ రచయిత్రికి అభినందనలు.
       
రచన అనేది నా ఒక వ్యక్తికి సంభందించింది కాదు. ఒక సమిష్టి సమస్యను ఒక వ్యక్తి విపులీకరించేది. ఆ విపులీకరణ, వివరణ, వివక్ష, లాంటివి కొన్ని వాక్యాల నిర్మాణమే కాకుండా ఒక జీవిత నిర్మాణాన్ని సరిదిద్దాలనే చేసిన ప్రయోగం ఈ ''పెద్దదిక్కు'' కధ. ఈ కదా నవ్య వారపత్రికలో ప్రచురింపబడి ఎందఱో మన్ననలను, ప్రశంసనలను పొందింది. కస్తూరి గారు స్వతహాగా బాధ్యత పట్ల ఎంతో అవగాహన కలిగిన వారు అనిపించేలా ఉంది. నేను అనే పదంలో నలిగిపోతున్న నేటి సమాజంలో మనకు కనిపించేవన్నీ వికృత పాత్రలే.  జీవితం అంటే అది కాదు అని తెలియజెప్పే కద ఇది. జీవిత విలువలు అంతమైపోతున్నాయి అనుకోవడం ఒక ఎత్తైతే, ఆ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఎంతో అవసరం.  అలంటి ఇతివృత్తాన్ని తీసుకుని రచించిన ఈ కధ ప్రస్తుత సమాజానికి ఎంతైనా అవసరం.. 

సొంత ఇల్లు ఆరాటంలో వాసంతి పడిన వేదనకు భయపడక తనకు కుదిరినప్పుడే అంటే తనకు ఆర్ధిక స్థితి మెరుగు పడినప్పుడే ఆ  కొత్త ఇల్లు కోరికను  తీర్చి జీవితంలో తొందర పాటుకు  ఏమాత్రం అవకాశం తీరు ఆశ్చర్యం కలిగిస్తూ నేడు అన్నీ కావాలి అని పరుగులు తీస్తున్న సమాజానికి ఒక గుణపాఠం గా నిలిచింది. 

రచయిత్రి కస్తూరి గారు ఎన్నో కధలు రచించినా వాటిని భద్ర పరచకుండా పోగొట్టుకున్నాను అని తమ ముందు మాటలో తెలిపారు.  రచన అనేది ఎంతో విలువైనది అని తెలియడానికి పత్రికల ఆదరణ ఎంతో అవసరమని  అనిపిస్తుంది. ఆ తర్వాత వీరు రచించిన కద లన్నీ వరుసగా ప్రచురితం అయ్యాక ఇక పోగొట్టుకోవడం అనేది ఉండదేమో అనిపించింది. కాలం ఎవ్వరినైనా మార్చేస్తుంది అనడానికి ఒక గొప్ప ఉదాహరణ గా వీరి కధ " చివరి త్యాగం '' తల్లి అనే పదానికి మరో పేరు ఉండదేమో అనిపిస్తుంది. ఎన్ని సార్లు పలికిన ఆ పదానికి, ఆ స్థానానికి వేరొక పేరు లేదేమో అనిపిస్తుంది. ఎలాంటి వారికైనా ఈ కదా చదివితే కళ్ళు చమర్చుతాయి.
 
అలాగే మనిషిలో మనిషి, సుందరం కథ , సన్యాసి పెళ్లి,  లాంటి ఎన్నో కధలు ఎంతో గొప్ప ఇతివృత్తాన్ని కలిగి వస్తు వైవిధ్యంతో అద్భుతమైన మలుపులను, వాస్తవాలను, జీవిత విలువలను చాటి చెబుతూ  రచించిన ఈ కధలు ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దబడ్డాయి.  కథ పట్ల  అవగాహన ఉంది. ఎలా రాయాలో మెళకువ ఉంది. వస్తు వైవిధ్యం ఉంది. అన్నింటికన్నా ఎక్కువ అందరినీ చదివించగల నైపుణ్యం ఉంది. మరిన్ని కధలతో  మరో గ్రంధం వీరి నుండి వెలువడాలని ఆశిస్తున్నాను మరియు అభినందిస్తున్నాను.

ప్రతులకు 

Kasthuri Aliveni,
Flat No:302, 'E' Block,
High rise appts,
Lower tank band Road,
Kawadiguda,
Hyderabad-80
Ph: 98494 29383

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech