Sujanaranjani
           
  కథా భారతి  
   

నాకు నచ్చిన కథ : శ్రీశ్రీ గారు వ్రాసిన "చావూ-- పుట్టుకా"

 

వ్యాస రచన : టీవీయస్.శాస్త్రి.    

 

శ్రీ శ్రీ గారు అప్పుడప్పుడూ కొన్ని కథలు వ్రాసినప్పటికీ, ఆ కథలన్నీ చాలా గొప్పగా వుంటాయి. కథనం అద్భుతంగా వుంటుంది. ఒక మహా కవి వ్రాసే కథలోని కథా వస్తువును గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1910 లో ఒక సూర్యోదయాన విశాఖపట్నంలో ఉదయించిన ఈ సూర్యుడు, 1983 లో ఒక సాయం సంధ్య వేళ మద్రాసులో అస్తమించాడు. సముద్రపు ఒడ్డున పుట్టిన ఈ మహాకవి సముద్రపు ఒడ్డునే మరణించాడు. ఆయన జీవితం, కవిత్వం కూడా సముద్రమంతటి గంభీరమైనవి. ఆయన ఆత్మ చరిత్రలో ఆయనే అంటారు, సముద్రానికీ, ఆయన  జీవితానికీ విడదీయరాని సంబంధం వుందని. అందుకనే వారి కవిత్వంలో 'తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్ జల ప్రళయ నాట్యం చేస్తున్నవి' ఆయన కవితాక్షరాలు' పోటెత్తిన సప్త సముద్రాల్'. నిరంతరం ఘోషించే సముద్రమంత లోతైనదీ, గంభీరమైనది ఆయన కవిత్వం. ఆకాశమంత ఎత్తున్న ఆ మనిషిని మరగుజ్జు లాంటి మనం ఏ విధంగా చెప్పగలం? ఒక మహాకవికి నివాళిగా, నీరాజనంగా, ఆయన వ్రాసిన చివరి కథను చెబుతున్నాను యధాతధంగా! చనిపోయే ముందు ఆయన 'విప్లవ రచయితల సంఘం' యొక్క అధ్యక్షుడిగా వుండేవారు. నక్సల్బరీ ఉద్యమాన్ని సమర్ధించారు. వారు చేసే సాయుధ పోరాటాలను కూడా సమర్ధించారు. ఆ పోరాటాలను సమర్ధిస్తూ వ్రాసిన ఈ కథ, వారు వ్రాసిన చివరి కథగా చెప్పుకోవచ్చును. ఈ కథ 'అరుణతార' అనే త్రైమాసిక పత్రికలో , Oct 1978 --Jan 1979 వ సంచికలో ప్రచురించపడ్డది. 

____________________

అదో వూరు. ఆ వూళ్ళో ఒక ఆసుపత్రి.
ఇదో వూరు. ఈ వూళ్ళో ఒక పోలీసు స్టేషన్.
ఆ వూళ్ళో. ఈ వూళ్ళో ఆంధ్రదేశం అంతటా అది అర్ధ రాత్రి!
ఆసుపత్రికి నొప్పులు పడుతున్న ఒక గర్భవతిని తీసుకువచ్చారు.
ఆమె వయసు నలభై.
పోలీసు స్టేషన్ కు బేడీలు వేసిన ఒక కుర్రవాణ్ణి తీసుకొచ్చారు. అతని వయస్సు ఇరవై.
గర్భిణి బాధ పడుతోంది. ఏడుస్తోంది.
కుర్రవాడు బాధ పడుతున్నాడు. కానీ, నవ్వుతూ వున్నాడు.
ఆసుపత్రిలో వైద్యులు ఆశాజనకంగా మాట్లాడుతున్నారు.
స్టేషన్ లో పోలీసులు కారుకూతలు కూస్తున్నారు.
'నీకేం భయం లేదమ్మా! కేసు కొంచెం కఠినమైనదే! కానీ ప్రమాదం ఏమీ లేదు.'
'లంజకొడకా! మావో పుస్తకాలు చదువుతావూ? లోకాన్ని మరామత్తు చేస్తావూ?
ముందు నిన్ను హజామత్తు చేస్తాం జాగ్రత్త!'
వైద్యులు శస్త్ర చికిత్సకు ఉపక్రమించారు.
పోలీసులు కత్తులూ, కటార్లూ నూరుతున్నారు.
రెండు చోట్లా హింసా ప్రయోగమే జరిగింది.
కానీ సూర్యోదయంలో అక్కడ ఆసుపత్రిలో ఒక జననం!
ఇక్కడ తెల్లారగానే పోలీసు స్టేషన్ లో ఒక మరణం.

________________

19 వాక్యాల్లో వ్రాసిన ఈ కథను కవిత అందామా, లేక కథ అందామా?
ఆ మహాకవికి శ్రద్ధాంజలి ఘటిస్తూ...


 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech