Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

కథా విస్తృతికి ఒక అప్పు సమస్య - వంశీకృష్ణ కథ అసహనం

 

                                                                           రచన : విహారి

 
కథకి ప్రధాన ద్రవ్యం - వస్తువే. దాన్ని వండి తయారుచేసి చదువరికి అందీయడం - సంవిధానం. శైలీశిల్పం అంటారు. మంచి ప్రధాన ద్రవ్యంతో మంచి వంటకం చేసి నోరూరించేటట్లు అందించవచ్చు. అదే మంచి ప్రధాన ద్రవ్యంతో చెడ్డ వంటకం తయారు చేసి ఆరగించడానికి పనికిరాకుండా చేయవచ్చు. ఇక్కడే కుక్ పనితనం బయటపడేది.

కథకి సంబంధించి - మళ్ళీ - మళ్ళీ - ఒక వస్తువుని కథగా మలచడం మాత్రమే సరిపోదు. ఒక కట్టడాన్ని తయారుచేయడం వేరు, అందమైన, నివాసయోగ్యమైన గృహనిర్మాణం వేరు. ఆ పైన ఆ గృహానికి ముఖ సౌందర్యాన్ని (ఎలివేషన్) కూర్చడం వేరు. అక్కడే శిల్ప ప్రయోజనం బహిర్గతమయ్యేది.

కథ విషయమూ అంతే. మంచి వస్తువుకి, శైలీశిల్పాల చాతుర్యం జత కావాలి. రచయిత కథన నైపుణ్యం ప్రస్ఫుటంగా వెల్లడి కావాలి. మంచి వస్తువు, మంచి శైలీ, మంచి శిల్పం - ఈ మూడింటి రచనా సమన్వయమే - ఒక మంచి కథగా రూపుదిద్దుకుంటుంది.

ఇలాంటి ఒక మంచి కథ - అసహనం.
వంశీకృష్ణ రచన!
వర్తమాన సామాజిక పరిణామాల కారణంగా ఎంతో వేగంగా సంభవిస్తున్న ఒక విలక్షణమైన, వ్యవస్థాగతమైన సమస్య - అసహనం కథలో ఇతి వృత్తం. ఇది రైతులకి, ఇతర బడుగు, బలహీన వర్గాలవారికి అనేక పథకాల క్రింద బ్యాంకులు ఇచ్చే ఋణాల గురించిన సమస్య. ఇదీ కథాంశం.

బ్యాంక్ లు అప్పులు ఇస్తాయి. అలా ఇవ్వటం వాళ్ళ వ్యాపార అవసరాల్లో ఒకటి. అలాగే రైతుకీ అప్పుచేయక తప్పనిపరిస్థితి. ఇచ్చిన అప్పుని ఒప్పందం ప్రకారం తిరిగి వసూలు చేయలి. బ్యాంక్ లు, శతకోటి ఈతి బాథల వలన రైతుకి అప్పు తీర్చేందుకు శక్తి చాలడం లేదు. ఈ అప్పు సమస్యతో, రైతు జీవనపార్వ్శాలు చాలా పెనవేసుకుని ఉన్నాయి. అప్పుని తిరిగి వసూలు చేయవలసిన బాధ్యత గల ఆఫీసర్ నరేంద్ర. ఇతనిది ముందు నువ్వు, వెనుక గొయ్యి పరిస్థితి. అప్పు వసూలు - పాము, కప్ప వ్యవహారం వంటిది. రైతు గంగరాజు. గంగరాజు వంటి వాళ్ళ భావాలూ, ఆలోచనలూ, వేరు.

ఈ సంవత్సరమంతా కరువేగా సారూ. ఎక్కడి నుండి తెమ్మంటారు అన్నాడు గంగరాజు. అతనికి ఎన్ని వివరాలు చెప్పినా, కఠినంగా హెచ్చరించినా ప్రయోజనం శూన్యం. కానీ రికవరీలు లేకపోతే ఛైర్మెన్ ఫుట్ బాల్ ఆడుకోవడం ఖాయం ఇదీ నరేంద్ర బాధ్యత, బాధ్యతతో కూడిన అవస్థ!

హరిజనవాడకి వచ్చాడు నరేంద్ర. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆగ్రహం, స్వయం నిర్ణయాధికారం కోసం పోరటం, కోపం, నిస్సహాయత లాంటి అంశాలు ఏవో వాతావరణంలో కలగలసిపోతాయేమో - అది ఎప్పుడూ ఉద్విగ్నంగానే ఉంటుంది.

ప్రభుత్వం వారి ఆర్. పి. హెచ్. యస్. స్కీమ్ కింద కట్టుకున్న ఇల్లు, దాని బాపతులోనూ రావాలి దైవాధనం నుంచీ. పిలిచి అడిగాడు నరేంద్ర. ఇప్పుడెక్కడివి సార్ ఇప్పుడు లేవు, అని తెగేసి చెప్పాడు దైవాధీనం. నలుగురూ కూడారు. అసలేమీ రద్దు చేయరా? ఎవరో అడిగారు. మనలాంటివాళ్ళకు ఎందుకు చేస్తారు. ఇండియా సిమెంట్స్ లాంటివాళ్ళకి అయితే కోట్లకి కోట్లు రద్దు చేస్తారు, కాలేజీ నుంచి ఫ్రెష్ గా వచ్చినట్టున్న యువకుడి కోపపు కామెంట్, కళ్ళ నిండా ఒక ఉద్వేగం.

నరేంద్ర అప్పు వసూలు చేసుకునే పద్ధతులూ, ఆ పద్ధతులు అవలంబిస్తే వీరందరికీ వచ్చే కష్టాలు...ఏవో చెప్పాడు...అవి విని, ఆ యువకుడు అడుగుతాడు. మంచిది సార్, వీటితో పాటు మీరు ఇంకా కొన్ని కూడా చెయ్యగలరా, కోట్లకి కోట్లు దిగమింగిన వాళ్ళని నడిరోడ్డులో ఉరితియ్యాలిరా? ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఆపగలరా? అనర్హులు అందలాలు ఎక్కకుండా చెయ్యగలరా? ఇలా..ఇలా... చివరికి ఒక బైరాగి నరేంద్రని అడుగుతాడు. ఇతను నిస్సహాయంగా తిరిగి మోటార్ సైకిల్ ని స్టార్ట్ చేయబోతుంటే.. బైరాగోడు ఏదో నవ్వుతున్నాడు. ఊసుపోక మాట్లాడుతున్నాడు అనుకోకండి స్వామీ. మూలానికి వెళ్ళకుండా ఏ రోగమూ నయం కాదు, అంటాడు.

హరిజనవాడలో కుర్రాడి ప్రశ్నలు...బైరాగి మాటలు నరేంద్రలో అసహనాన్ని మరింత పెంచాయి. ప్రశ్నలు వేసినవాళ్ళ కళ్ళలో స్కూటర్ లేపిన దుమ్ము...చీకటి తెరలా కమ్ముకొంది..అంటూ ముగిసింది కథ.

సమాజం సచేతనమైన చిత్ర వర్ణదర్శిని. మనుషులు కనిపిస్తారు. స్థూలమైన చూపుకి అందరూ ఒక్కలాగే గుంపుగా కనిపిస్తారు. కానీ ఏ మనిషికా మనిషి ఒక విలక్షణమైన స్పెసిమెన్. ఇక్కడా అంతే. అప్పు సమస్య. చూసే చూపుని బట్టి ఆ సమస్య తీవ్రతా, ఆవశ్యకతా, తిరిగి వసూలు చేసుకోవలసిన అవసరమూ అన్నీ మారిపోతున్నాయి. మనుషులు తత్త్వం, మనస్తత్వం మారిపోతున్నాయి. వంశీకృష్ణ అసహనం కథలో విభిన్నమైన భావజాలం కారణంగా ఒకే అంశాన్ని ఎలా చుస్తారో, దానికి ఎలా స్పందిస్తారో కళాత్మకంగా చిత్రించారు.

సామాజికమైన చిక్కు ముడులు ఎటూ ఉండనే ఉన్నాయి. అయితే, రచనలో కథకుని కంఠస్వరం ఏ ధ్వనిని అందిస్తున్నదనేది ముఖ్యమైన అంశం. అసహనంలో నరేంద్రపాత్ర ఎంతో సంయమనంతో వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేస్తూ ఉంటుంది. అయితే, అతని మనస్సు చర్చని ఒక కొలిక్కి తెచ్చుకోకుండానే ఎక్కడికక్కడ విత్ డ్రా అవుతూ ఉంటుంది.. దీనికి ప్రముఖ కారణం నరేంద్రకి చదువు నేర్పిన సంస్కారం. సమస్య వెనుక తానుగా నమ్మే జీవన సూత్రంతో పొంతన లేని, వర్తమాన సమాజ పరిణామం చెప్తున్న కొన్ని వాస్తవాంశాలు. అవి సబబైనవి అవునా, కావా - అనే తర్కంలోకి అతను వెళ్ళలేదు. వెళ్ళడు. వెళ్ళలేదు. అతని ఉద్యోగం అలాంటిది. ఈ విధంగా కథలో నరేంద్ర పాత్రని ఒక ఆత్మీయతా ముద్రతో చిత్రించారు వంశీకృష్ణ. అతని లోలోపలి అసహనానికి నిజానికి ఋణగ్రహీతల నిర్లక్ష్య ధోరణే కారణం!

ఒక వంక ఛిద్రమైపోతున్న గ్రామీణ సామాజిక, ఆర్ధిక వ్యవస్థ; మరో వంక ఆ పరిస్థితులకి కారణాల మూలాలు. ఇవన్నీ - గచ్చపొదలు. కథకుడు అసహనం ద్వారా ఈ నాటి బడుగు బతుకుల నిస్సహాయతనీ, ఆ నిస్సహాయతకి వారుగా కూర్చుకున్న జస్టిఫికేషన్ నీ ఎంతో అబ్జెక్టివ్ గా చెప్పారు. ఆ విధంగా కథా విస్త్రుతికి దోహదం చేసే బ్యాంకింగ్ రంగం సమస్యని చైతన్యవంతంగా చిత్రించారు ఈ కథలో. వంశీకృష్ణ కథలో సాగించిన వస్తుపరిథిలోని క్లుప్తత, శైలిలో క్లుప్తవాక్యాల కూర్పు, శిల్పంలో సాధించిన కాలిక స్పృహ - అసహనం కథని తేజోమయం చేసి మంచి కథగా నిలిపాయి.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech