Sujanaranjani
           
  కథా భారతి  
   

మేడ్ ఇన్ హెవెన్

 

రచన : ఇర్షాద్ జేమ్స్   

 
లావణ్య చాలా రోజులనుంచి అనుకుంటూంది, ఆమిర్ ఖాన్ సినిమా 'తలాష్' చూద్దామని. ఆస్టిన్ లో ఆరోజే సినిమా ఆఖరి రోజు. సాయంత్రం ఆరున్నర షోకి వెళ్దామని చెప్పాడు రవి, పొద్దున్న ఆఫీసుకి వెళ్తూ.

ఆరోజు సాయంత్రం లావణ్య తను పనిచేసే బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి త్వరగా ఇంటికి వచ్చి వంట చెయ్యటం మొదలుపెట్టింది. ఫ్రీజర్ లోంచి ఫ్రోజెన్ స్పినచ్ ప్యాకెట్టు తీసి, ఒక బౌల్ లో వేసి, మైక్రోవేవ్ అవెన్ లో పెట్టి ఆన్ చేసింది. ప్యాంట్రీ లోంచి కొన్ని బంగాళా దుంపలు తీసి, సింక్ లో కడిగి, పీలర్ తో తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కొయ్యటం మొదలుపెట్టింది.

ఇంతలో గరాజ్ తలుపు తెరిచిన శబ్దం వినపడింది. రవి తన కారు గరాజ్ లో పెట్టి, తాళం చెవితో తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు.

"త్వరగానే ఇంటికొచ్చేసారే... నిన్నటిలా లేటుగా వస్తారేమోనని భయపడ్డాను" అంది లావణ్య.

"నిన్న ఒక మీటింగు వుండింది. ఈ రోజు ఏమీ మీటింగులు లేవు." చెప్పాడు రవి.

"వంట ఆల్ మోస్ట్ అయిపోయింది. త్వరగా బట్టలు మార్చుకొని రండి. ఆరున్నరకి సినిమా !!" ఉత్సాహంగా అంది లావణ్య.

"సినిమాకా? నాకవ్వదు."

"అవ్వదా? అదేంటి? ఈరోజు వెళ్దామనుకున్నాం కదా?"

"నేను ఇప్పుడు ఫ్రెండ్స్ తో హ్యాప్పీ అవర్ కి వెళ్ళాలి. సినిమాకి రేపు వెళ్దాంలే." అన్నాడు రవి.

"రేపుండదు. ఈరోజే ఆఖరి రోజు. పొద్దున్న చెప్పారు కదా, వెళ్దామని..." కొంచెం బాధగా అంది లావణ్య.

"పోతే పోయింది. తరువాత డీవీడీ తెచ్చుకుని ఇంట్లో చూడొచ్చులే."

"పక్కింటి సతీష్, రమ్యా వాళ్ళు థియేటర్ లో చూసారు. చాలా బావుందట. ఈ రోజు జు వెళ్దాం ప్లీజ్..."

"నాకవ్వదు. ఫ్రెండ్స్ వెయ్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలి"

"హ్యాప్పీ అవర్ కి రేపు వెళ్ళొచ్చుగా?" నిరుత్సాహంగా అడిగింది లావణ్య.

"ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఈరోజు అవ్వదని? కావాలంటే నువ్వు వెళ్ళు !!" కోపంగా అని, వెళ్ళిపోయాడు రవి.

బాధ పడుతూ కొంచెం సేపు కిచెన్ లోనే కూర్చుండిపోయింది లావణ్య. కొంత సేపు తరువాత లేచి, ఇంటి వెనక తలుపు తెరిచి, ప్యాటియో లోకి వెళ్ళింది.

పక్కింటి బ్యాక్ యార్డ్ లో దూరం నుంచి సతీష్, రమ్య కనిపిస్తున్నారు. సతీష్ గడ్డిలోంచి వీడ్స్ ఒక్కొక్కటీ లాగి, ఒక ప్లాస్టిక్ బ్యాగులో వేస్తున్నాడు. కొంచెం దూరంలో రమ్య గులాబీ మొక్కలకి నీళ్ళు పోస్తోంది.

సతీష్, రమ్యా వాళ్ళు ఆరు నెలల క్రితమే పక్కింట్లో దిగారు. అంతకు ముందు ఆ వీధిలో రవి, లావణ్య వాళ్ళు తప్ప ఇంకెవరూ ఇండియన్స్ వుండేవారు కాదు.

లావణ్య ఎప్పుడు చూసినా, సతీష్, రమ్య, చాలా సంతోషంగా, ఇద్దరూ కలిసి ఏవో పనులు చేసుకుంటూ వుంటారు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి బయటకి వెళ్ళటం, ఇద్దరూ కలిసి ఇంటికి రావటం, ఇద్దరూ కలిసి పనులు చేసుకోవటం, చూసి, 'భార్యా భర్తలు ఒకరితో ఒకరు ఇంత ఫ్రెండ్లీగా కూడా వుంటారా?' అని ఆశ్చర్యపోతూంటుంది లావణ్య.

************ ************ ************

ఒక రోజు శుక్రవారం రాత్రి ఎవరిదో ఏనివర్సరీ పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్నారు రవి, లావణ్య.

ఏం మాట్లాడకుండా, సీరియస్ గా కారు నడుపుతున్నాడు రవి.

"పార్టీ చాలా బాగా అరేంజ్ చేసారు కదా?" అంది లావణ్య.

"..."

"డిన్నర్ తర్వాత గేమ్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేసారు కదా?"

"..."

"అంత మందికి అంత చక్కగా వాళ్ళే వండి పెట్టారు, కేటరింగ్ లేకుండా. నేనైతే అంత మందికి వండలేను బాబోయ్!"

"..."

"వచ్చిన వాళ్ళందరికీ గిఫ్టులు కూడా పంచి పెట్టారు. చాలా ఖర్చయ్యుంటుంది పాపం !" అంది లావణ్య.

"వాళ్ళకి ఎంత ఖర్చైతే మనకెందుకు?" హఠాత్తుగా చిరాకు పడ్డాడు రవి.

"ఏమైంది మీకు? ఎందుకలా వున్నారు?" అడిగింది లావణ్య.

"ఏం కాలేదు !!"

"మరి ఎందుకలా కోపంగా వున్నారు?"

"..."

"చెప్పండి !!"

"పార్టీలో నువ్వు ఎవరితోనో చాలా సేపు మాట్లాడావు. ఎవరతను?" అడిగాడు రవి.

"ఓ, అతనా? ఇండియా నుంచి రీసెంట్ గా ఆస్టిన్ వచ్చాడు. ఇంటెల్ లో పని చేస్తున్నాడు."

"అయితే? అంతసేపు అతనితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది?"

"మాట్లాడకూడదా? మాట్లాడితే తప్పేంటి?"

"నీ ఫ్రెండ్స్ తో నువ్వు మాట్లాడుకో. మిగతా మగాళ్ళతో నీకేం పని?" కోపంగా అన్నాడు రవి.

"పాపం అతని ఫియాన్సే ఇండియాలో వుందట. ఆమెని ఇక్కడికి ఎలా తీసుకురావాలని అడిగాడు."

"అయితే? నువ్వేమన్నా పెద్ద ఇమ్మిగ్రేషన్ లాయర్వా? అతని సంగతి నీకెందుకు?"

"జస్ట్... హెల్ప్ చేద్దామని... అంతే."

"మరి... ఫోన్ నంబరు కూడా ఇచ్చినట్టున్నావు?"

"అవును, ఇచ్చాను. తప్పేంటి?" కోపంగా అంది లావణ్య.

రవి సీరియస్ గా, కోపంగా చూసాడు ఆమె వైపు.

"పాపం అతను కొత్తగా వచ్చాడు. ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఎవరూ తెలియదట. మీరు హెల్ప్ చేస్తారని చెప్పాను. మీ పేరు, మీ సెల్ ఫోన్ నంబరు వ్రాసి ఇచ్చాను" చెప్పింది లావణ్య.

ఈ లోపల కారు ఇల్లు చేరుకుంది.

లావణ్య మౌనంగా దిగి, ఇంట్లోకి వెళ్ళింది.
రవి కారుని గరాజ్ లోకి పోనిచ్చాడు.

కిచెన్ లోకి వెళ్ళి చీకట్లో టేబుల్ దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంది లావణ్య.

పక్కింటి ప్యాటియోలో ఇంకా లైటు వేసి వుంది.
దూరం నుంచి సతీష్, రమ్య, కనిపిస్తున్నారు. వాళ్ళు ప్యాటియోలో పక్క పక్కనే కుర్చీలలో కూర్చొని ఏవో పుస్తకాలు చదువుకుంటున్నారు. మధ్య మధ్యలో ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.

వాళ్ళని చూసి, 'అసలు ఇంత హాయిగా, హ్యాప్పీగా ఎలా వుండగలరో..' అనుకుంది లావణ్య. 'మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే బహుశ అదేనేమో... ' అనుకుంది లావణ్య.

************ ************ ************

ఆ మర్నాడు ఉదయం లావణ్య ఇంటి వెనక మొక్కలకి నీళ్ళు పొస్తోంది.
ఎవరో "హలో !!" అంటే తలెత్తి చూసింది.
ఫెన్స్ అవతల రమ్య నిలబడి వుంది. ఆమె తల మాత్రమే కనిపిస్తోంది.

"హలో, బాగున్నారా?" అంది లావణ్య, ఫెన్స్ వైపు నడుస్తూ.

గత ఆరు నెలలలో లావణ్య, రమ్య ఎక్కువ సార్లు మాట్లాడుకోలేకపొయినా, బాగానే సన్నిహితులయ్యారు. కలిసినప్పుడల్లా చాలా సేపు మాట్లాడుకుంటూ వుంటారు.

కొంతసేపు మాట్లాడుకున్న తరువాత లావణ్య ఇక ఆపుకోలేక, తన గురించి, రవి గురించి, తమ వైవాహిక జీవితం గురించి, చెప్పింది. తను, రవి, ఎప్పుడూ గొడవ పడుతూంటారని, ఒకరంటె మరొకరికి పడటం లేదని, చెప్పింది. రవి హ్యాప్పీ అవర్ కి వెళ్ళినప్పుడల్లా తనకి అన్-హ్యాప్పీ అవర్ తప్పదని, అసలు జీవితమంతా ఒక పెద్ద అన్-హ్యాప్పీ అవర్లా ఉందని, చెప్పింది.

లావణ్య చెప్పినదంతా రమ్య మౌనంగా, సహనంతో వినింది.

"మరి మీ సీక్రెట్ ఏంటి? మీరిద్దరూ ఎప్పుడూ సంతోషం గా ఎలా వుంటున్నారు?" అడిగింది లావణ్య.

అప్పుడు చెప్పింది రమ్య...

"ఒకప్పుడు నేను, సతీష్ కూడా ఎప్పుడూ గొడవ పడుతు వుండే వాళ్ళం. కొన్ని సంవత్సరాల క్రితం మా డివోర్స్ కూడా అయ్యింది. డివోర్స్ అయి, విడిపోయిన తరువాత మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యాము. మేము ఇప్పుడు భార్యాభర్తలం కాదు. కేవలం ఫ్రెండ్స్, రూం మేట్స్, పార్ట్ నర్స్ మాత్రమే. పెళ్ళి అనే లీగాలిటీ వల్ల రిలేషన్షిప్ లో కొన్ని ఎక్స్ పెక్టేషన్స్, సమస్యలు ఎదురవుతాయి. రిలేషన్షిప్ లోంచి ఆ పెళ్ళి అనే కంపోనెంట్ ని తీసేసి, ఒకరి పై ఒకరికి ప్రేమతో, స్నేహంతో సంతోషంగా వుంటున్నాం..."

ఆశ్చర్యంగా వింటూండిపోయింది లావణ్య..

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech