Sujanaranjani
           
  కథా భారతి  
 


బాధ్యత

 

                                                                                                                             రచన: చింతల దేవేందర్

  సిరిసిల్ల బస్సెక్కాను.
విపరీతమైన జనం. సీటు దొరుకుతుందేమోనని లోపలికి చూశాను. ఖాళీ సీటు ఒక్కటీ కన్పించలేదు. పైగా రాడ్ ని పట్టుకుని వేళ్ళాడుతున్నారు. ఎదైనా పరిచయ ముఖం కన్పిస్తుందేమోనని ఆశ పడ్డాను. లాభం లేదు. ఏమీ పాలు పోవడం లేదు. ప్రయాణం మానుకుందామంటే అర్జంటు వ్యవహారం. ఆశగా మరోసారి బస్సులోకి చూశాను. లోపలినుంచి నాపేరు పెట్టి మరీ పిలుస్తున్నారు. కొంత ఆశ జనించింది. మెల్లిగా లోపలికెళ్ళాను. నాకంతగా పరిచయం లేని ముఖం. కాని నన్ను ఎన్నో రోజుల పరిచయమ్మున్నట్టుగా పేరుపెట్టి మరీ పిలుస్తున్నాడు దేవీ అని.

నన్నంతా నా చిన్నతనంలో దేవీ అని పిలిచేవారు. సరేలే ఎవడైతే ఏంటీ కాస్త సీటు దొరికే చాన్సున్నట్టుందనుకుని ఆయన వైపోసారి చూసి నవ్వాను చిన్నగా. రా రా దేవీ ఇక్కడ కూర్చోమ్మంటూ తనూ కొద్దిగా సర్దుకుని నాకు కాస్తా జాగా ఇచ్చాడు.
ఎప్పుడూ చూసినట్టుగా లేదు ఆయన్ని. కాని కాస్త చనువుగానే వ్యవహరిస్తున్నాడు.

తన పేరు మనోహరని తన చిన్ననాటి నేస్తమని తను ముభావంగా వుంటే పట్టి పట్టి మరలా బాల్యంలో జరిగిన చేష్టలన్ని నెమరువేయసాగాడు. నేను ఆశ్చర్యపోయాను. అవును అవన్నీ నాకు గుర్తుకు రాసాగాయి. ఆయన అదే మనోహర్ చెప్పినవన్ని కరెక్ట్. కాని ముఖమే పోల్చుకోలేకపోతున్నాను.
నా పని వత్తిడి వల్ల గుర్తుకు రాలేక పోతున్నారేమోలే అనుకుని ఆయన చెప్పినవన్నింటికి తలాడించేస్తున్నాను డూ డూ బసవన్నలా.
ఈ లోగా బస్సు లయబద్దంగా ఊగడం వల్ల కాబోలు నాక్కాస్త మగతగా వుండి నిద్రలోకి జారుకున్నాను.
సిరిసిల్ల వచ్చిన తర్వాత కండక్టర్ అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను. నానిద్ర మత్తు వదిలింది కండక్టర్ అరుపుతో.
మెల్లిగా పక్కకి చూశాను ఇందాక నాకు సీటిచ్చిన మనోహరనే నాకు గుర్తుకురాని చిన్ననాటి స్నేహితుడికై.
ఆశ్చర్యం. పక్కన మనోహర్ కనిపించలేదు కాని ఆయన వదిలేసిన బ్రీఫ్ కేసుంది. దానిపై అందంగా వ్రాసివుంది మనోహర్ అడ్రస్.
పాపం మరచిపోయుంటాడులే వెళ్ళి ఆయాన ఇంట్లో ఇచ్చేసి మా పెద్దమ్మ ఇంటికెల్దామనుకుని చూశాను అడ్రస్ వివరాలు బస్ దిగేసి.
కోర్ట్ వెనకాల అని ఇంటి నెంబరుంది. ఆశ్చర్యపోయాను. అవును మనోహర్ ఇప్పుడు గుర్తుకొచ్చాడు. అవును ఆయన నాచిన్ననాటి మిత్రుడే కాని మనోహర్ పోలికల్లేవు ఆయన ముఖంలో. సరే అనుకుని అటో తీసుకుని వెళ్ళాను మనోహర్ ఇంటికి. ఇంటి ముఖద్వారం మూసి వుంది. తట్టాను ద్వారాన్ని. కొద్దిసేపట్లో తెరచుకుని ఓ పాప వచ్చింది, ఏం కావాలన్నట్టుగా ప్రశ్నార్థకంగా. యాదృచ్చికంగా లోపలికి అడుగుపెట్టాను మనోహారంటూ. లోపలికి వెళ్ళాగానే ఆశ్చర్యపోయాను.. మనోహర్ ఫోటోకి దండ వేసి వుంది. నాకండ్లు ఎందుకో చెమర్చాయి ఆ ఫోటో చూసి. లోపలినుండి మనోహర్ భార్యవచ్చి నన్ను, నా చేతిలో వున్న బ్రీఫ్ కేసుని చూసి ఏడుస్తూ ఐదేళ్ళక్రితం బాకీ వసూళ్ళకని పూనా వెళ్ళొస్తానని వెళ్ళిన ఆయన రైలు ప్రమాదంలో పోయారు. ఆయన వెళ్ళినప్పుడు ఇదే బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళారంటూ నాచేతిలోని బ్రీఫ్ కేసు తీసుకుని నాముందే తెరచింది. అంత దు:ఖంలోనూ ఆమె ఆశ్చర్యంతో ఆనందపడింది ఎందుకంటే బ్రీఫ్ కేసు నిండా కరేన్సీ నోట్లే. మనోహర్ చచ్చిపోయినప్పటికి తన బాధ్యతని తీర్చుకోవడానికి నన్ను పావుగా వాడుకున్న తీరు నన్ను కలచివేసినప్పటికీ ఓ రకంగా సంతోషాన్నిచ్చింది.

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech