Sujanaranjani
           
  సారస్వతం  గగనతలము-36  
 

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు  

 

అకాలమృత్యువు-2

అకాలమరణము మరియు దానికి సంబంధించిన కొన్ని యోగములకు సంబంధించిన విషయములను కిందటి అంకములో చర్చించుకుని యున్నాము. ఈ అంకములో అకాలమరణమునకుసంబంధించిన మరికొన్ని యోగములు మరియు వానిని నివారించుకోవడానికి గల అవకాశములను చర్చించుకొను ప్రయత్నము చేయుదము.
మరణమనేది నిశ్చితము కానీ అది ఒకే సారి సంభవించి ప్రాణిని సంహరిస్తుందన్నది సరికాదనియు, మృత్యువు అనేకసార్లు సంభవించే అవకాశములున్నవనియూ దానిని దాటవేసే అవకాశములను మనిషి కలిగి ఉన్నాడన్న విషయములను సంక్షేపముగ చర్చించడము జరిగింది.

కొన్ని మరణయోగములు

1. జన్మలగ్నము నుండి సప్తమములో సూర్యుడు, చందృడు లేక కుజుడు ఉన్నచో జాతకుని మృత్యువు మద్యపానము కారణముగ సంభవించు అవకాశమున్నది.
2. జాతకచక్రములో సప్తమభావమునందు కుజుడుండి లగ్నమునందు చందృడు, సూర్యుడు లేక శని ఉన్నచో యంత్రముల కారణముగ మృత్యువు సంభవించు అవకాశమున్నది.

మద్యపాన కారణముగ మరణము
మద్యపానము అనేకరకములుగ మనిషికి ప్రాణాపాయమును కల్పిస్తున్నదని అందరికీ తెలిసిన విషయమే. మనిషి స్వయంకృతాపరాధముగ సంభవించు ఈ మరణము అకాలమే కాని సహజము కాదు. మద్యపానము కారణముగ శరీరాంగములు క్షీణించడము తద్వారా మనిషి మరణించడము ఒక విధమైన యోగము. మద్యము మత్తులో ప్రమాదామునకు గురి కావడము ద్వారా మరణించడము మరొక విధమైన యోగము. యోగములు గ్రహముల స్థితి గతులకారణముగ అనేక విధములుగ సంభవించు అవకాశములు ఉన్నవి. వానిని స్వవివేకముతో ఆలోచించి ఆదేశించవలెనన్నది ఆచార్యుల అభిమతము.

మద్యములో కల్తీకారణముగ, అధికము కావడముచే, శరీరాంగములు క్షీణించుటద్వారా, దుర్ఘటనల కారణముగా ఇలా అనేక విధములుగ మరణము సంభవించవచ్చును. అనగ ఇచ్చట కోరి తెచ్చుకున్న మృత్యువుకు ముఖ్యమైన లేక ఆధారభూతమైన కారణముగ మద్యము ఉండునని గ్రహించవలెను.


యంత్రప్రభావముగ మృత్యువు
యంత్రముల శ్రేణిలో వాహనములను కూడ పరిగణించవలెను. ఉచ్చాద్వాహనాద్వా పతనమ్ వంటి సూత్రములలో ప్రత్యేకముగ వాహనములు మరియు ఎత్తైన ప్రదేశములనుండి పడటమన్న భావము స్పష్టముగా గోచరిస్తుంది. కానీ చాలా సందర్భములలో యంత్రకారణముగ అన్న చోట ఘటనకు హేతువుగ వాహనములు కూడ కనబడుచున్నవి.

1. యంత్రతాకిడికి సంభవించే మరణము
2.  యంత్రవికారములకు సంభవించే మరణము
 

a. యంత్రములయందు లోపములద్వారా సంభవించు దుర్ఘటనలు
b. మానవతప్పిదము కారణముగ యంత్రముల విపరీత ప్రభావము
c. ఊహించని వాయువులు విడుదల
d. విస్ఫోటములు
e. దహనము

3. యంత్రములచే ఏర్పడిన గాయముల కారణముగ సంభవించే మరణము
4. యంత్ర సంబంధమైన భయము కారణముగ సంభవించే మరణము

ఇలా అనేకరకములుగ ఈ అకాలమృత్యువును తెలుసుకొనవచ్చును.

చాలా సందర్భములలో దుర్ఘటన జరిగిన పిదప ఈ విధముగ దుర్ఘటనలు జరిగే అవకాశమున్నదన్న విషయము లోకములో గ్రహించడము జరుగుతుంది. గ్రహముల ప్రవృత్తి, అవి సంచరించుటకు ఇష్డపడు స్థానములు, వానికి ఇష్టమైన పదార్థములు, అవి ప్రేరేపించు జనుల ప్రవృత్తి మొదలుగునవి దుర్ఘటనను ముందుగ ఊహించుటకు అవకాశమును ఇవ్వగలవు.

తప్పించుకునే మార్గము

పూర్వజన్మఫలితముగ లేక జన్మజన్మాంతరములలో ఆచరించిన శుభాశుభకార్యముల పర్యవసానముగ ఈ జన్మలో మానవునికి ఫలితములు లభిస్తాయి అన్నది కర్మ సిద్ధాంతము. అదే సిద్ధాంతముపై ఆధారపడి యున్నది జ్యోతిషశాస్త్రము. పూర్వకర్మలఫలితమును మనిషి అనుభవించకుండ తప్పించుకొనుట అసంభవము అని శాస్త్రములు చెప్పుచున్నవి. ఈ విషయములను దృష్టిలో ఉంచుకుని ఆలోచించునపుడు ఎవరికైనా కలుగు సందేహము ఒక్కటే. జరగబోవు సంఘటనలనుండి తప్పించుకొనుట సాధ్యమా? అని.

సాధ్యముకానినాడు పూజలు, జపములు , తపములు, దానములు, రత్నధారణము మొదలగునవి అన్నియూ నిరర్థకములే. మనను మనము మోసపుచ్చుకోవడము తప్ప మరియొకటి కాదు.

కాని సంభవము అనుకుంటే శాస్త్రవచనములు అసత్యములయినట్లే. శాస్త్రవచనములే అసత్యములయినపుడు అవి చెప్పు కారణములు మరియు ప్రమాణములు నిరాధారములే.
ప్రభావము తగ్గించుకునే మార్గము

శాస్త్రంలో వర్ణించబడిన పరిహారములు ప్రభావమును తగ్గించే మార్గములే కానీ ప్రభావమును తప్పించుకునే మార్గములు కావు. కావున కర్మఫలమును అనుభవించవలసినదే. ఇది సత్యము. కానీ దాని ప్రతికూలఫలమును తగ్గించుకునే అవకాశములు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. రాబోవు విపత్తిని గ్రహించి దానికి తగ్గించుకోవడము ఒక మార్గమైతే, పుణ్యకర్మాచరణ ప్రతిఫలాపేక్ష లేకుండ చేస్తూ ఉన్ననూ అకాలములను నివారించి వాటిని సకాలములో పొందేలా మార్గమును ఏర్పరచుకొనవచ్చును.

వనే రణే శతృ జలాగ్నిమధ్యే మహార్ణవే పర్వత మస్తకే వా
సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని.

వనములో, రణములో, శతృవులమధ్య, జలములో, అగ్నియందు, మహాసముద్రమునందు, పర్వతశిఖరమునందు, నిద్రావస్థయందు, ప్రమత్తముగా ఉన్నవానిని, విషమపరిస్థితులలో ఉన్నవానిని పూర్వము చేయబడిన పుణ్యములు రక్షిస్తాయి.             

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech