Sujanaranjani
           
  శీర్షికలు  
  ఎందరో మహానుభావులు       

షేక్ చినమౌలా

 

 

 - రచన : తనికెళ్ళ భరణి      

 

నాదస్వరం లేకపోతే ఏ శుభకార్యం శుభకార్యంలా అనిపిమ్చదు నాకు! ఒట్టి తూతూ మంత్రంలా అనిపిస్తుంది.
ఏ మహానుభావుడు కనిపెట్టాడో గానీ ఈ నాదస్వరాన్ని!
అల్లంత దూరాన నాదస్వరం వినగానే గుండెంతా పచ్చతోరణం కట్టినట్టయి పోతుంది.
కళ్ళనిండా పట్టుచీరల రెపరెపల దర్శనమిస్తాయి. ఖచ్చితంగా అక్కడేదో శుభకార్యం జరుగుతూనే ఉంటుంది.

అంచేతేనేమో డోలు సన్నయిని మంగళ వాయిద్యాలన్నారు. నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ మరొకాయన స్ఫూర్తినిస్తాడు.
ఆయనే నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలా!

చినమౌలా జన్మస్థలం గుంటూరు జిల్లా కరవది! జన్మదినం ప్రభవ వైశాఖ బహుళ చతుర్దశి!
వంశపార్యంగా నాదస్వరం మౌలా వాళ్ళ ఆస్తి! ఒకటిగాదు రెండుగాదు, దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచీ కరవది దేవాలయానికి ఆస్థాన విద్వాంసులు. వంశానికి మూల పురుషుడు విద్వాన్ ఆదం సాహెబ్, దేవగాంధారి రాగంలో నిపుణుడు. ఆయన పల్లవి పాడుతున్నప్పుడు చేతులతోటి కాళ్ళతోడి కూడా తాళం వేసేవాడట. వంశంలో తర్వాత చిలకలూరిపేట చినమౌలా, పెదమౌలా అనే సోదరులుండేవారు. చినమౌలా సంస్కృత విద్వాంసుడు. అమరకోశం, రామయణం ఆయనకి కంఠోపాఠం! ఆ తర్వాతి వాడు కొమ్మూరు పెంటూ సాహెబ్! ఈయన్ని ‘కళ్యాణి’ పెంటూ సాహెబ్ అనీ, ‘కేదారగౌళ’ పెంటూ సాహెబ్, ‘బిళ్హరి’ పెంటూ సాహెబ్ అని పిలిచేవారట. ఎంచేతంటే ఆ రాగాల్ని ఆయన అంత సాధికారంగా, స్వారస్యంగా వాయించే వారు. ఆ తర్వాతి తరంలో చిన పీరు సాహెబ్! ఈయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ‘సావేరి’ రాగం వాయిస్తుంటే సుప్రసిద్ధ గాయకులు, నటులు శ్రీ జొన్నవిత్తుల శేషగిరిరావు గారు ‘చిన పీరూ నువు సావేరి వాయిస్తుంటే కనకదుర్గాంబ ప్రత్యక్షమౌ తోందయ్యా, కనక ఈ రాగాన్ని అమ్మకి అంకితమియ్యి అన్నాట్టా. అలాంటి వంశంలో ఇదిగో ఇపుడు చినమౌలా! సరే, పసితనంలోనే పాలపీక బదులు సన్నాయి పీకనే నోట్లో పెట్టుకునుంటాడా? సంగీత సాగరాన్ని జుర్రేసుంటాడా? ఊపిరితిత్తులు నాదస్వరాలూ, గుండె డోలూ అయిపోయుంటుందా?

సాక్షాత్తు ‘చినమౌలా నాద’ స్వర స్వరూపుడై పోయాడా! పట్టుమని పదేళ్ళుండగానే కరవది ఆలయంలో కచేరీ చేశాడా! సొగసుగా మృదంగ తాళము నాదస్వరంతో అతగూర్చి రాముణ్ణి సొక్కజేసిన ధీరుడైపోయాడా!

తర్వాత సంచారం మొదలు...స్వర సంచారం మొదలు..నాదస్వర సంచారం మొదలు!

దక్షిణ భారతదేశంలో ఆయన వెళ్ళని సంగీత సభుందా? గుళ్ళూ, గోపురాలూ ఉన్నాయా?

చేయించుకోని సన్మానం ఉందా? పొందని బిరుదులున్నాయా?
అయినా తనకి కొన్ని బాణీలని నేర్పిన నాచ్యార్ కోయిల్ శ్రీరాజం, దొరై కణ్డు సోదరుల్ను గురువులుగా స్మరిస్తాడు.

కంచి కామకోటి పీఠం పరమాచార్య సమక్షంలో నాదస్వర కచేరీ చేసి ధనాత్ముడయ్యాడు.
శృంగేరి పీఠం శంకరాచార్యుల సముఖంలో కచేరీ చేసి పుణ్యాత్ముడయ్యాడు!
పుట్టడం ముస్లింగానే నయినా, ఆయన ఇల్లూ, ఆచార్యవ్యవహారాలూ వైదిక సాంప్రదాయాన్ని ప్రతిబింబించేవి.
పట్టుబట్టడం, కుంకుమ బొట్టుపెట్టడం, భక్తిగా రాముడికి దణ్ణం పెట్టడం, ఏమిటని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన ఇలా అంటాడు. నాదోపాసకులకు మతభేదమేమీలేదు. పర్వీన్ సుల్తానా చక్కగా కుంకుమ బొట్టు పెట్టు కునేది. బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్ లో కచేరీ ఇస్తూ ‘కన్హయ్యా’ (కృష్ణుడు) అనే గీతం ఆలపిస్తే అక్కడి వాళ్ళు ఆక్షేపించగా కన్నయ్య లేని సంగీతం నా కక్కర్లేదు అని వచ్చేశాడట.
భగవత్ సాక్షాత్కారానికి వివిధ మార్గాలున్నా నాకు సంగీతమే శరణ్యం. దాన్లో పై స్థాయికి వెళ్ళడమే నా లక్ష్యం. అన్ని మతాల్లోనూ సంగీతానికి, భక్తికి సంబంధం ఉంది. మేము అనుదినం చేసే నమాజు అల్లా....ఆ...ఆ...ఆ..అనే బేంగ్ (నినాదం) మాయా మాళవగౌళరాగం!

సంగీతం నాకు ఎంత ప్రాణమైపోయిందంటే కరవధిలోమాకు మళ్ళూ మాన్యాలూ, ఇళ్ళూ వాకిళ్ళు ఉన్నా కేవలం సంగీతం కోసం, సంగీత వాతావరణం కోసం శ్రీవైష్ణవుల 108 దివ్య దేవాలయాల్లో ప్రధానమైన ‘శ్రీరంగం’ లోనే స్థిరపడ్దాను.
శ్రీరంగం కలియుగ వైకుంఠంగా విఖ్యాతమైనది.

ఆళ్వారుల్లో పెక్కుమంది శ్రీరంగ వైభవాన్ని గానం చేశారు. తిరుప్పాణాళ్వారు, నాచ్యార్ రంగనాథుని పాద సన్నిధిలో లీనమయ్యారు.
ఎంతోమంది సంగీత విద్వాంసులు ఈ శ్రీరంగ ద్వీపంలో జన్మించారు.

ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉంటూ నిత్యం నాదస్వరార్చన చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అంటూ కళ్ళనుండి ఆనంద బిందువులు దొర్లిస్తారు చినమౌలా! చినమౌలాని 1976 సంవత్సరంలో కళై మామణి అనే బిరుదంతో తమిళనాడు ప్రభుత్వం సత్కరించింది.

1977 లో భారతప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదంతో గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1977 లోనే అవార్డునిచ్చి తరించింది.

ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1980 లో ‘గానకళా ప్రపూర్న’ బిరుదు ...1981 లో రాజమండ్రి సంగీత రసికులు ‘గాంధర్వ కళానిధి’ అని బిరుదు..
1984 లో మచిలీపట్నం ‘సరస్వతి కళాసమితి’ వారు ’నాద స్వర కళానిథి’ బిరుదు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1985 లో ‘గౌరవ డాక్టరేట్’ పట్టము
1987 లో తెలుగు విశ్వవిద్యాలం సత్కారం..
1988 లో విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితి ‘ సంగీత విద్వన్మణి’ బిరుదు..
ఇవేకాకుండా అమెరికా, సోవియట్ యూనియన్, హాంకింగ్..లాంటి దేశాల్లో నాదస్వర కచేరీ!
రాముణ్ణి, అల్లాని..కృష్ణున్ని, త్యాగయ్యనీ...నాదస్వరంతో పూజించే ఒక మహ విద్వాంసుడు, ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త....అన్నిటినీ మించి ఒక మానవతా వాది శ్రీ షెక్ చినమౌలా!
 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 



సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech