Sujanaranjani
           
  శీర్షికలు  
  దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - శాస్త్రీయ చర్చ 15వ భాగం
 

 - రచన: ముత్తేవి రవీంద్రనాథ్

 
 

ఇక బౌద్ద ధర్మం యొక్క దైవ సిద్ధాంతమేమిటో తెలుసుకోబోయే ముందు ఆ ధర్మాన్ని ప్రవచించిన గౌతమ బుద్ధుడిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
 క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో గౌతముడు బీహారుకు ఉత్తరదిక్కుగా ఉన్న కపిలవస్తు ( ఇది నేటి నేపాల్ లో ఉంది ) రాజధానిగా ఉన్న శాక్య గణ  రాజ్యాన్ని పాలించిన రాజ దంపతులు శుద్ధోదనుడు, మాయాదేవిలకు జన్మించాడు. అతి పిన్న వయస్సులోనే వృద్దులనూ, వ్యాదిగ్రస్తులనూ, శవాలనూ చూసి, ఈ ప్రపంచమంతా దుఃఖ మయమనీ, సుఖం కోసం మన వెంపర్లాట కూడా అంతిమంగా దుఃఖానికే దారితీస్తుందనే నిర్ణయానికొచ్చాడు. సంసార బంధనాలను పరిత్యజించి, సన్యసించి, భిక్షువుగా జీవిస్తూ  దుఃఖాలకు మూల కారణం ఏమిటో, దుఃఖ నివారణకు మార్గం ఏమిటో కనుగొనే ఉద్దేశంతో  ప్రసిద్ధులైన ఎందఱో  సమకాలీన తాత్త్వికులతో చర్చలు జరిపాడు. ఏకాగ్రతతో ఆరేళ్ళపాటు ఘోరమైన తపస్సు చేశాడు. దుఃఖానికి  మూలం, దుఃఖ నివారణా మార్గం కనుగొనడంలో అంతిమంగా సఫలమయ్యాడు.అలా గౌతముడు సిద్ధించిన అర్థము (నెరవేరిన లక్ష్యం) కలవాడై సిద్ధార్థుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. జ్ఞానం సిద్ధించి బుద్ధుడు (the Enlightened) అని పిలువబడ్డాడు. శాక్య వంశంలో జన్మించి, తాపసిగా జీవించిన ఆయన్ని శాక్య ముని అనీ శాక్య వర్ధనుడు-- శాక్య వంశాన్ని ఉద్ధరించినవాడు-అని  కూడా పిలుస్తారు.  బుద్ధుడికి ఉన్న సర్వజ్ఞుడు అనే పేరును బట్టి ఆయన ఎంతటి పండితుడో గ్రహించవచ్చు. బుద్ధుడు తిరిగి రాని  విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు. బుద్ధుడికి సమంతభద్రుడు (సంపూర్ణమైన శుభం కలవాడు), మారజిత్ (మన్మథుడిని అంటే కామాన్ని జయించినవాడు) వగైరా ఎన్నో ఇతర పేర్లు కూడా  ఉన్నాయి. అతడు బోధించిన బౌద్ధ తత్త్వం అనతికాలంలోనే బౌద్ధ మతంగా రూపుదాల్చి, సింహళం,బర్మా, సయాం, టిబెట్, చైనా, కొరియా, జపాన్ మొదలగు  పరిసర ఆసియా  దేశాలకు వ్యాపించింది. జ్ఞాన జ్యోతిగా ఆసియా ప్రజలకు మార్గదర్శనం చేసిన కారణంగా బుద్ధుడిని 'ఆసియా  ఖండపు జ్యోతి' (Light of Asia) అంటారు.

తన కాలం నాటి  అందరు తాత్త్వికుల వలెనే  బుద్ధుడు కూడా తన సన్నిహిత శిష్యులతో జరిపిన సంభాషణల ద్వారానూ , అడపా దడపా శిష్య బృందాలనూ, సామాన్య ప్రజలనూ ఉద్దేశించి  చేసే ప్రసంగాలు, ప్రవచనాల ద్వారానూ బౌద్ధ తత్త్వం యొక్క మూల సూత్రాలను బోధించాడు. ఆయన శిష్యులు పరంపరగా మౌఖికంగానే ఈ సిద్ధాంతాలకు విస్తృత ప్రచారం కల్పించారు.ఆయన గతించిన తరువాత చాలా కాలానికి ఆయన బోధనలు త్రిపిటకాల పేరుతో ప్రసిద్ధమైన  మూడు పిటకములు (Baskets of Canonical Teachings) గా గ్రంథస్థం చేయబడ్డాయి.అవి వినయ పిటకం (బౌద్ధ సంఘ విధులు), సుత్త పిటకం (సూత్ర పిటకం -- బౌద్ధం యొక్క మౌలిక సూత్రాలను వివరించే  బుద్ధుడి ప్రవచనాలు, సన్నిహిత శిష్యులతో ఆయన చేసిన సంభాషణలు), అభిధమ్మ పిటకం (అభిధర్మ పిటకం-- బౌద్ధ తాత్త్విక సిద్ధాంతాల లోతైన పరిశీలన) అనే మూడు గ్రంథాలు. ఇవి మూడూ పాళీ భాషలో సంకలనం చేయబడ్డాయి. 

జనబాహుళ్యంలోకి విస్తరించినకొద్దీ బుద్ధుడి బోధనలను దైనందిన కార్యకలాపాలలో ఎలా అమలుచేయాలనే విషయమై  బౌద్ధ సంఘంలో పలు విభేదాలు తలెత్తాయి. థేరవాదులు (స్థవిరవాదులు), మహా సాంఘికులు అనే రెండు శాఖలుగా బౌద్ధం విడిపోయింది. వీరు వేర్వేరు మత సూత్రాలు తయారు చేసుకున్నారు. తమ తమ తాత్త్విక సిద్ధాంతాలు కూడా ఎవరికివారు రూపొందించుకున్నారు.కాలక్రమేణా థేర వాదులు హీన యాను (Lesser Vehicle) లనీ, మహా సాంఘికులు  మహాయాను (Greater Vehicle)  లనీ పిలువబడ్డారు. ముక్తి అనే అంతిమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు తమదే అత్యుత్తమమైన యానము (వాహనం) అని భావించిన మహాయాన శాఖవారు, మరొక శాఖ ప్రతిపాదించిన ముక్తి సాధనా మార్గాన్ని హీనమైనదని ఎంచి  వారిని హీనయానులు అన్నారు.

వాస్తవానికి బుద్ధుడు ఉపయోగించిన పాళీ భాషనే తమ ప్రచారంలో వినియోగిస్తూ బుద్ధుడి బోధనలను తుచ తప్పకుండా పాటించే హీనయానులే బౌద్ధ సిద్ధాంతాలకు నిజమైన వారసులు.ఆ శాఖ దక్షిణ ఆసియా దేశాలైన సింహళం, బర్మా, సయాం  దేశాల్లో ప్రబలంగా వ్యాపించింది. వారి అపార  సాహిత్య సంపదంతా పాళీ భాషలో ఉంది.ఇతర భారతీయ దర్శన శాఖలతో తాత్త్విక సిద్ధాంతాలపై జరిపిన చర్చలలో  సంస్కృత భాషకు ప్రాథమ్యం ఇచ్చిన మహాయాన శాఖ తన సాహిత్యాన్నంతా సంస్కృతంలో అభివృద్ధి చేసుకుంది. బుద్ధుడు నమ్మని, ప్రచారం చేయని పలు  సిద్ధాంతాలను సైతం  అన్య తాత్త్విక సిద్ధాంతాల ప్రభావం కారణంగానే  మహాయానులు నమ్మసాగారు.మహాయానం ఉత్తర ఆసియా దేశాలైన టిబెట్, చైనా,కొరియా, జపాన్ దేశాలలో విస్తరించింది.

బుద్దుడు తన తత్త్వ విచారాన్నంతా దుఃఖానికి  హేతువేమిటో, దుఃఖ నివారణకు  మార్గమేమిటో కనుగొనడానికే కేటాయించాడు.ఆత్మ శరీరానికి భిన్నమైనదేనా ? మరణానంతరం కూడా ఆత్మ కొనసాగుతుందా? ఈ ప్రపంచం పరిమితమైనదా లేక అంతులేనిదా? శాశ్వతమైనదా? లేక అశాశ్వతమైనదా?--  ఇలా ఎవరైనా ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆ విషయాలపై చర్చించడానికి ఆయన నిరాకరించేవాడు. తగినంత ఆధారాలు లేకుండా ఇలాంటి విషయాలపై చర్చించడం శుద్ధ దండగని బుద్ధుడు అభిప్రాయపడ్డాడు. పైపెచ్చు ఆ తరహా చర్చలు పరస్పర విరుద్ధమైన పాక్షిక దృక్పథాలకే దారితీస్తాయి. ఏనుగును తాకిన తొమ్మిది మంది అంధుల వలెనే ప్రతివాడూ తన వాదనే సత్యమంటాడు. అందుకే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రాచీన తాత్త్వికులు  చేసిన ఏ ప్రయత్నాలూ సఫలం కాలేదు. వారి సిద్ధాంతాలన్నీ పాక్షిక సత్యాలపై ఆధారపడిన అపరిపూర్ణ సిద్ధాంతాలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే అవన్నీ అనిర్ధారిత  ఇంద్రియానుభూతులు, వెంపర్లాటలు,  ఆశలు, భయాలపై ఆధారపడినట్టివి. పైపెచ్చు ఇలాంటి ఊహాగానాలు సకల దుఃఖాలు నివారించబడే విముత్తి (విముక్తి) దశకు మనల్ని ఏమాత్రం దగ్గర చేయకపోగా మరింత దూరం చేస్తాయి. ఇటువంటి ఊహాపోహల్లో మునిగితేలే వ్యక్తి తాను స్వయంగా అల్లుకున్న సిద్ధాంతాల గందరగోళంలో తానే  చిక్కుకుపోవడం తథ్యం. దుఃఖ నివారణా మార్గాల గురించి ఆలోచించకుండా ఇటువంటి తాత్త్విక మీమాంసలో చిక్కుకున్న వ్యక్తి --  విష దిగ్ధమైన బాణం దెబ్బతో విలవిలలాడుతూ కూడా ఆ బాణాన్ని విషం వ్యాపించక ముందే తక్షణం తన శరీరంనుంచి లాగెయ్యకుండా -- ఈ బాణం ఎక్కడి నుంచి, ఏ దిశగా వచ్చింది? దాన్ని ఎవరు తయారు చేశారు? దాన్ని ఎవరు  వేసి ఉంటారు?  అనే వ్యర్థ ప్రశ్నలపై ఆలోచించే మూఢమతి వంటి వాడే. ఇలాంటి నిర్ధారించ వీలుగాని ప్రశ్నల (అవ్యాకతాని) పై చర్చలు నిష్ప్రయోజకమనీ,  మనకు కావలసిందల్లా  ఈ ప్రపంచంలో  శాశ్వత  దుఃఖ నివారణా మార్గం కనుగొనడమేననీ  బుద్ధుడి అభిప్రాయం.  
           
బుద్ధుడి బోధనల సారాంశం నాలుగు ఆర్య సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని -- Four Noble Truths). అవి: 1) దుఃఖ (Suffering) 2) దుఃఖ-సముదాయ (There is a cause of this Suffering) 3) దుఃఖ నిరోధ (It is possible to stop Suffering) 4) దుఃఖ-నిరోధ-మార్గ (There is a path which leads to the cessation of Suffering).  ఈ నాలుగు సత్యాలనూ ఇప్పుడు వివరంగా చూద్దాం.  
             
బుద్ధుడు ప్రవచించిన మొదటి సత్యం ప్రకారం ఈ ప్రపంచమంతా దుఃఖమయమే.చార్వాకులు ప్రపంచమంతా దుఃఖమయమేనంటే అంగీకరించరు. ఈ ప్రపంచంలో మనం అనుభవించగలిగే సుఖాలూ ఎన్నో ఉన్నాయని  వారి భావన.కేవలం హ్రస్వ దృష్టి కలవారికి మాత్రమే అవి సుఖాలుగా కనిపిస్తాయంటాడు బుద్ధుడు.ఆ సుఖాల యొక్క క్షణభంగుర స్వభావం, వాటిని పొందేందుకు మనం అనుభవించే కష్టాలు, అలాగే ఆ సుఖాలు దూరమైనప్పుడు మనం పొందే ఆవేదన, మనం పొందిన సుఖదాయక వస్తువులను  శాశ్వతంగా మనవద్దే నిలుపుకొనడానికి నిత్యం మనం  అనుభవించే  భయం,  ఆత్రుతతో కూడిన వేదన -- ఇవన్నీ తలుచుకుంటే ఎవరికైనా వారు సుఖాలుగా  భావించేవి  ఏవీ కూడా వాస్తవానికి సుఖాలు కాదని అర్థమవుతుందని అంటాడు బుద్ధుడు.
           
ఇక రెండవ సత్యం ఏమిటో చూద్దాం. బుద్ధుడు ప్రతిపాదించిన ప్రతీత్య సముత్పాద వాద సిద్ధాంతం (Theory of Dependent Origination) ప్రకారం ఈ ప్రపంచంలో ప్రతిదీ కొన్ని కారణాలు, నియమాలు లేక షరతులపై ఆధారపడి మాత్రమే  అస్తిత్వం కలిగి ఉంది. షరతులు లేని అస్తిత్వం కలిగివున్నదేదీ ఈ ప్రపంచంలో  లేదు. వృద్ధాప్యం, చావు, దుఃఖం, నిరాశ, ఆవేదన మొదలైనవి (వీటిని జరామరణాదులు అంటారు) అన్నీ మన పుట్టుక (జాతి) కారణంగానే కదా ? పుట్టుక  అనేది పుట్టాలనే భావం కారణంగాననీ, అది తిరిగి ఇంద్రియార్థాలతో మనం ఏర్పరచుకున్న లంకె  కారణంగాననీ, అది అంతిమంగా సంస్కారం ( మన మనస్సులలో  గత జన్మకు చెందిన మన అనుభవాల కారణంగా ఏర్పడిన మానస ముద్రలు- Imprints)  కారణంగాననీ తేల్చి, దానికి కారణం అజ్ఞానం లేక అవిద్య (Ignorance) అని నిర్ధారించాడు.ఇలా జరామరణాది దుఃఖదాయక విషయాలకు  కారణాన్ని అన్వేషిస్తూ  ఒక్కొక్క మెట్టూ  వెనక్కు   వెళ్లి పన్నెండు దశలను నిర్ధారించాడు.ఈ పన్నెండు దశలనూ  భవ చక్రం (Wheel of Rebirth) యొక్క  ద్వాదశ నిదానములు (Twelve Sources) అంటారు. బౌద్ధుల ప్రార్థనలలో భాగంగా వారు రోజూ పన్నెండు పూసలు(Beads) గల ఒక జపమాల (Rosary) చేతబూని, ఆ పూసలను లెక్క పెడుతూ జపం చేస్తారు.కొందరేమో పన్నెండు ఆకులుగల  కారణ చక్రం (Wheel of Causation) తిప్పుతూ జపం చేస్తారు.
             
రెండవ ఆర్య సత్యం నిర్ధారించినట్లు  ఈ ప్రపంచంలో దుఃఖం కొన్ని కారణాలపై ఆధారపడిన అస్తిత్వం కలిగి ఉంది. ఈ కారణాలను తొలగిస్తే మనం దుఃఖ నివారణ చెయ్యవచ్చు.ముందుగా దుఃఖ నివారణ అంటే ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బుద్ధుడి దృష్టిలో స్వర్గ నరకాలు లేవు. ఇక్కడే ఈ భూమి మీదే,  ఈ జన్మలోనే దుఃఖ నివారణ సాధ్యమే.ప్రాపంచిక విషయాలపై వాంఛలు  విసర్జించి, అష్టాంగ మార్గంలో మనస్సును ధ్యానం మీదే లగ్నం చేసి, అంతిమంగా పరిపూర్ణ జ్ఞానం( ప్రజ్ఞా పారమిత --Wisdom par excellence)  పొందగలిగిన వాడిని జరామరణాది దుఃఖాలు ఏమీ చేయలేవు. పూర్తి స్థాయిలో దుఃఖ నివారణ జరిగే 'నిర్వాణము'  అనే ఈ దశకు చేరుకున్న వ్యక్తిని అర్హత్  (a venerable person) అంటారు. నిర్వాణం అంటే నిష్క్రియాపరత్వం కాదు. విముక్తుడైన వ్యక్తి  ముక్కు మూసుకుని మౌనంగా తపస్సు ఆచరించాల్సిన అవసరంగానీ, ధ్యాన మగ్నుడై సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన అవసరంగానీ  ఏమీ లేదు.ఇందుకు బుద్ధుడి జీవితమే ఓ ఉదాహరణ. బుద్ధుడు తన ముప్పై ఐదవ ఏట  విముక్తుడైన అనంతరం నలభై ఐదేళ్ల సుదీర్ఘ కాలం పాటు  పర్యటనలు చేస్తూ, బౌద్ధ సంఘాలను స్థాపిస్తూ, ఉపదేశాలు చేస్తూ తన ఎనభయ్యవ ఏట మహాపరినిర్వాణం చెందే వరకు నిర్విరామంగా గడిపాడు.రాగద్వేషాలు, మోహం వంటి వాటితో కూడుకున్న  పనులు చేసినప్పుడు మనం ఈ ప్రాపంచిక విషయాల పట్ల మమకారం పెంచుకునే కారణంగా పునర్జన్మకు దారితీసే కర్మబీజాలు మొలకెత్తుతాయి.అదే మనం ఈ విశ్వం యొక్క వాస్తవ స్వరూపం పట్ల సవ్యమైన  ఎరుక (ప్రజ్ఞా పారమిత) కలిగి, నిర్మమ భావంతో,  నిష్కామ దృష్టితో  లౌకిక కార్యకలాపాలలో పాల్గొన్నట్లయితే పునర్జన్మకు దారితీసే కర్మ బీజాలు మొలకెత్తవంటాడు బుద్ధుడు. 'అంగుత్తర నికాయం'లో బుద్ధుడు ఈ తరహా  కార్యకలాపాలను మొలకెత్తే విత్తనం, వేయించడం (frying)  కారణంగా మొలకెత్తే సామర్థ్యం కోల్పోయిన విత్తనం -- ఈ  రెంటితో  పోల్చాడు. తాను జీవన్ముక్తుడై భవజల తరణం చేసిన ఒక తెప్ప వంటి తన శరీరాన్ని నిష్క్రియాపరత్వంతోనో, లేక పూర్తిగా విసర్జించో వృథాగా నిరర్థకం చేసుకోకుండా, లోకంలోని జనులందరి దుఃఖాలను నివారించడానికి తనకు వీలున్న మేరకు తానూ ప్రయత్నించాలని భావించాడు. అలా భవసాగరాన్ని దాటడానికి తాను ఉపయోగించిన తన శరీరం అనే తెప్పను  వీలైనంత మంది  లోకులను కూడా దాటించేందుకు ఉపయోగపరచాడు బుద్ధుడు. కొందరనుకుంటున్నట్లు 'నిర్వాణం' అంటే అంతరించి, లోకాన్నుంచి అదృశ్యమై పోవడం కాదు. అదే నిజం కనక అయితే బుద్ధుడు తాను మహా పరినిర్వాణం చెందిన 80వ సంవత్సరం వరకు విముక్తి పొందనట్లు అవుతుంది. కనుక ఇది సరికాదు. నిర్వాణం అంటే అస్తిత్వం కోల్పోవడం కాదు. నిర్వాణం పొందిన వ్యక్తికి ఇక పునర్జన్మ అంటూ ఉండదు. ఎందుకంటే పునర్జన్మకు కారణమైన అవిద్య తొలగిపోతుంది కనుక. అలా బుద్ధుడు ప్రవచించిన మూడవ ఆర్యసత్యాన్ని అనుసరించి దుఃఖ నివారణ సాధ్యమే.
                   
ఇక నాల్గవ సత్యం దుఃఖ నివారణ లేక విముక్తి మార్గాన్ని వివరిస్తుంది.ఈ మార్గం బుద్ధుడు స్వయంగా అనుసరించినదే. బుద్ధుడు అష్టాంగ మార్గం లేక అష్టాంగిక మార్గం (The Eight-fold Noble Path) అనుసరించి దుఃఖాన్నుంచి విముక్తుడయ్యాడు.సమ్యగ్దృష్టి (సమ్యక్ దృష్టి -Right Views), సమ్యక్ సంకల్ప (Right Resolve), సమ్యక్ వాక్ (Right Speech), సమ్యక్ కర్మాంత (Right Conduct), సమ్యక్ ఆజీవ (Right Livelihood),సమ్యక్ వ్యాయామ (Right Effort), సమ్యక్ స్మృతి (Right Mindfulness),సమ్యక్ సమాధి (Right Concentration) -- అనేవి ఆ ఎనిమిది అంగాలు.
                     
 ప్రతీత్య సముత్పాదవాద సిద్ధాంతం ప్రకారం ప్రతి కార్యానికీ ఒక కారణం తప్పనిసరిగా ఉండి  తీరుతుంది. అలా ప్రతి వస్తువు యొక్క అస్తిత్వం  తప్పనిసరిగా దాని కారణం యొక్క అస్తిత్వం పైనే ఆధారపడి ఉంటుంది.ఈ విశ్వంలో ఏ ఘటనా యాదృచ్చికంగా జరగదు.ఈ సిద్ధాంతం రెండు ఏకాంత వాద (One-sided) దృక్పథాలను ఖండిస్తుంది.ఒకపక్క ఎటువంటి కారణం లేక షరతులు లేకుండా తనకు తానుగా (తన మీద తానే ఆధారపడే -స్వయంభూ )  శాశ్వత అస్తిత్వం కలిగి ఉండే భగవంతుడు (ఎట్టి షరతులపై ఆధారపడకుండా అనాదిగా, అనంతంగా  ఉంటుందని  భావించే  సత్పదార్థం) ఉండే అవకాశాన్ని ఈ సిద్ధాంతం కొట్టి పారేస్తుంది. మరోపక్క అది ధ్వంసతా వాదాన్ని కూడా ఖండిస్తుంది. అస్తిత్వం కలిగినదేదీ పూర్తిగా ధ్వంసమై శూన్యం కావడం అసాధ్యమని బుద్ధుని ప్రతీత్య సముత్పాద వాద సిద్ధాంతం నొక్కి చెబుతుంది. ప్రతి కారణమూ ఒక వేళ ధ్వంసమైతే  తన కార్యాన్ని మిగిల్చి తాను అదృశ్యమౌతుంది. అంతేగానీ దాని స్థానంలో శూన్యం ఏర్పడడం అసంభవం.అలా  ఈ రెండు ఏకాంత వాదాలకూ తన  ప్రతీత్య సముత్పాద వాద సిద్ధాంతం ఒక మధ్యే మార్గం (Middle Path) అంటాడు బుద్ధుడు. ధర్మం అంటే వేరే ఏదో కాదు.   ప్రతీత్య సముత్పాద వాద సిద్ధాంతమేనని బుద్ధుడి భావన. ఆ సిద్ధాంతాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళు మెట్లెక్కి ఒక ఎత్తైన స్థలాన్నుంచి బుద్ధుడి కళ్ళతో (బుద్ధుడి దృష్టి కోణం నుంచి, బుద్ధుడి దృక్పథాన్నుంచి) తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలరని బుద్ధుడు పేర్కొన్నాడు. ఆ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోవడమే లోకంలో మన బాధలన్నిటికీ మూల కారణమని బుద్ధుడు 'మహానిదాన సుత్త'లో అంటాడు.

బుద్ధునిచే ఎంతో లోతైన సిద్ధాంతమని కొనియాడబడి,  ప్రతి ఒక్కరూ దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలనీ ఉపదేశించబడిన ఈ సిద్ధాంతాన్ని అనంతరకాలంలో బౌద్ధులు పెద్దగా పట్టించుకోలేదు.
                       
బుద్ధుడి కర్మ సిద్ధాంతం ప్రకారం మనలో ప్రతి ఒక్కరి ప్రస్తుత అస్తిత్వం గతం అనే కారణం (cause) వలన ఏర్పడిన కార్యమే (effect). ఈ కారణాన్నే బుద్ధుడు కర్మ అంటాడు. మన భవిష్యత్ అస్తిత్వం కూడా  మన ప్రస్తుత అస్తిత్వం యొక్క కార్యమే.(The present existence of an individual is the effect of its past; and its future would be the effect of its present existence.)
                       
ఈ విశ్వం లోని సకల వస్తువులూ మార్పుకూ, నాశనానికీ లోనయ్యేవే. మారకుండా నశించకుండా శాశ్వతంగా ఒకే రీతిలో కొనసాగేది ఏదీ లేదు. ప్రతి వస్తువూ ఒక షరతు లేక కారణం మీద ఆధారపడి అస్తిత్వం కలిగి ఉన్నదే కనుక ఆ కారణం అదృశ్యం కాగానే ఆ వస్తువు కూడా  అదృశ్యమైపోతుంది.ఆది ఉన్న ప్రతిదానికీ అంతమూ ఉంటుంది. 'మహాపరినిర్వాణ సూత్ర'లో బుద్ధుడిలా అంటాడు,' అస్తిత్వం కలిగివున్న ప్రతిదీ ఒక కారణం లేక షరతుపై ఆధారపడి మాత్రమే అస్తిత్వం లోకి వచ్చింది ; అందుకే ప్రతిదీ నశ్వరమూ, అశాశ్వతమూనని గ్రహించండి.'  ' చూడ్డానికి మనకి అనశ్వరం, శాశ్వతం అనిపించే ప్రతిదీ నశించి తీరుతుంది.ఉన్నతమైనది నేలకూలి దుమ్ములో కలుస్తుంది.కలయిక అంటూ ఉన్న తరువాత ఎడబాటూ  తప్పనిసరి.ఎక్కడ పుట్టుక ఉందో అక్కడ చావు కూడా వచ్చి తీరుతుంది', అంటాడు బుద్ధుడు మరో సందర్భంలో. 
                           
బుద్ధుడు ప్రతిపాదించిన  ఈ అశాశ్వతత్వ సిద్ధాంతం ( The Doctrine of Universal Change and Impermanence) అనంతర కాలంలో ఆయన అనుచరులచే  క్షణికవాదం (Theory of Momentariness)గా  రూపొందించబడింది.ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలోని ప్రతి వస్తువూ కేవలం అశాశ్వతమైనది మాత్రమే కాదు; ఏ వస్తువూ ఒక్క క్షణ కాలం కంటే ఎక్కువ సమయం పాటు  మనలేదు.ఈ విశ్వంలోని సమస్తం  క్షణభంగురమే.క్షణికవాద సిద్ధాంత కర్తలు తమ సిద్ధాంతానికి మద్దతుగా ఈ విధంగా వాదిస్తారు.
ఈ విశ్వంలో ప్రతి వస్తువుయొక్క అస్తిత్వం (సత్తా) అది ఏదైనా కార్యం (effect) సృష్టించ గలదా? లేదా? - అనే విషయం మీదనే ఆధారపడి ఉంటుంది( అర్థ క్రియాకారిత్వ లక్షణమ్ సత్ ). కుందేటి కొమ్ము వంటి లేని వస్తువు ఎటువంటి  కార్యాన్నీ (effect ను) సృష్టించలేదు. అస్తిత్వం కలిగింది ఏదయినా క్షణికమైనదే. ఉదాహరణకు ఒక విత్తనాన్నే తీసుకుందాం. కొంతకాలం పాటు ఆ విత్తనం ఎలాంటి మార్పూ లేకుండా అలాగే ఉంటుందని మనం భ్రమిస్తాం. అయితే అది ఒక క్షణం కంటే ఎక్కువ అస్తిత్వం కలిగి ఉంటుందని మనం నమ్మాలంటే  అది ప్రతి క్షణం ఏదో ఒక కార్యం సృష్టించగలిగి ఉండాలి.అంతే కాదు; అది ఏ మార్పూ లేకుండా అలాగే ఉంటూ ఉన్నదని రుజువు చెయ్యాలంటే అది అస్తిత్వంలో ఉన్న  ప్రతి క్షణమూ అది ఒకే విధమైన కార్యాన్ని సృష్టిస్తూ ఉండాలి.కాని, వాస్తవానికి అలా జరగడం లేదు.ఇంట్లో నిల్వ చేసిన విత్తనం పొలంలో చల్లిన విత్తనంలాగా  మొలకెత్తడం లేదు.కనుకనే ఇంటిలో ఉన్న విత్తనమూ, చేలో చల్లిన విత్తనమూ ఒకటి కాదు.ఇంట్లో ఉన్నది ఎలాంటి కార్యమూ సృష్టించడం లేదు.చేలో చల్లిన విత్తనం మొలకను సృష్టిస్తున్నది.కనుక అవి రెండూ వేర్వేరు. దీనికి ప్రతిగా కొందరు ఇలా వాదించవచ్చు.ఆ విత్తనం విత్తనంగానే కొంత కాలం పాటు కొనసాగుతుంది. చేలో చల్లిన తరువాత భూమి, నీరు వంటి అనుకూల పరిస్థితులు లభించిన కారణంగా అది మొలకెత్తుతుంది. మొలకెత్తే వరకు ఆ విత్తనం ఎప్పుడూ విత్తనంగానే ఉంటుంది అనే వాదనను  క్షణికవాదులు  ఇలా ఖండిస్తారు. ఆ విత్తనం ఏ మార్పూ లేకుండా అలాగే ఉన్నదంటే మొదటి విత్తనం, మొలకెత్తిన విత్తనం ఒకటే అవడానికి వీల్లేదు.మరి అదే విత్తనం అనుకూల పరిస్థితులలో మొలకగా మారుతున్నదని ఒప్పుకుంటే -- మొదటి విత్తనం ఏ కార్యాన్నీ సృష్టించడం లేదు. రెండవది మొలకను సృష్టిస్తున్నది. కనుక ఆ విత్తనం ఈ విత్తనం రెండూ ఒకటి కావు.ఒకటేనంటే  అది ప్రతి క్షణం మార్పుకు లోనవుతున్నదని  అంగీకరించి తీరాలి. రెండు వేర్వేరు క్షణాలలో ఒక వస్తువు రెండు వేర్వేరు కార్యాలను సృష్టిస్తున్నదీ అంటే, అది క్షణ క్షణం మారుతూ ఉన్నదనే అర్థం. 'శక్తాశక్త స్వభావతయా ప్రతి క్షణం భేదః'. ఏదైనా కార్యాన్ని సృష్టించే శక్తి కలిగి ఉండే విషయంలో ప్రతి క్షణమూ భిన్నమైనది.అందుకనే ప్రతి వస్తువూ కార్య సృష్టి విషయంలో  ఒక క్షణంలో కలిగివున్న శక్తి మరొక క్షణంలో కలిగి ఉండదు. అందుకే ఈ విశ్వంలో ప్రతి వస్తువూ క్షణభంగురమైనదే.జైనులు కూడా ప్రతి  ద్రవ్యం తన గుణాల విషయంలో  ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందని భావించారు.(గుణ పర్యాయవత్ ద్రవ్యమ్).అందుకే బౌద్ధులు గానీ, జైనులుగానీ  మార్పు అంటూ లేకుండా శాశ్వతంగా అలాగే ఉండే ఒక భగవంతుడు లేక  పరమాత్మను  నమ్మరు.
                   
 అనాత్మవాదం :  సాధారణంగా ప్రతి మనిషిలో ఎప్పటికీ నశించని ఆత్మ అనేది ఒకటి ఉంటుందనీ, మానవుడు మరణించగానే ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసి, తిరిగి వేరొక శరీరంలో ప్రవేశిస్తుందనీ ఆస్తిక దార్శనికులు  అందరూ విశ్వసిస్తారు. కాని బుద్ధుడు ఆత్మ అనేది సత్యమని విశ్వసించలేదు.అయితే బుద్ధుడు నమ్మిన పునర్జన్మ సంగతి  ఏమిటి? ఆత్మను  నమ్మకుండా పునర్జన్మను నమ్మడం ఏమిటి ? పునర్జన్మ ఎత్తేది ఆత్మేనా - కాదా ? ఇలాంటి ప్రశ్నలన్నీ మన మనసులను  ముసురుతాయి.  ఆత్మే లేనప్పుడు ఒకే వ్యక్తి వివిధ జన్మలు ఎత్తడం, ఒక జన్మలోని బాల్యం, యౌవనం, వృద్ధాప్యం అనే  వేర్వేరు దశలలో ఒకే వ్యక్తి కొనసాగడం ఎలా సాధ్యం ? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆత్మ అనే   ఒకే విధమైన, ఎట్టి మార్పులకూ లోనుగాని,  శాశ్వతమైన,  అనశ్వరమైన పదార్ధం మానవులందరిలో ఉన్నదనే విషయాన్ని బుద్ధుడు నమ్మలేదు గానీ, ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలలో కొనసాగే చైతన్య స్రవంతి (Stream of Consciousness) యొక్క కొనసాగింపును మాత్రం ఆయన విశ్వసించాడు. మానవ జీవితం మొత్తం వివిధ దశల నిరంతరాయ సమాహారం. ప్రతి దశా తన అస్తిత్వానికి తన వెనుక దశ మీద ఆధారపడి ఉంటుంది. తన నుంచే తన తరువాత దశ ఉద్భవిస్తుంది. ఇలా జీవన శృంఖల మొత్తం ఒకదానికొకటి కారణ సంబంధం (Causal Connection) కలిగిన వివిధ దశల సమాహారమని బుద్ధుడు భావించాడు. ఈ జీవన శృంఖలను బుద్ధుడు ఒక దీపంతో పోల్చాడు.దీపం ఎలాంటి మార్పూ లేకుండా రాత్రంతా  వెలుగుతూ ఉన్నట్లు మనం అనుకుంటాం. కానీ, వాస్తవానికి  అది వేర్వేరు దీప శిఖల సమాహారం. ఒక్కొక్క క్షణంలోని దీప శిఖ  తనదైన  షరతులకు, పరిమితులకు లోబడి ఉంటుంది. వత్తి (వర్తి) యొక్క స్థితి, నూనెయొక్క  సమృద్ధి, గాలిపాటు -- ఇలాంటి నియమాలు ప్రతి దీపశిఖకూ ఆ యా  దశలకు ప్రత్యేకమైనవిగా ఉంటాయి. కానీ చూసేవాళ్ళకు ఒకే దీపం రాత్రంతా వెలుగుతున్నట్లే ఉంటుంది. కాని వాస్తవానికి వెలిగేది వేర్వేరు వరుస దశలకు సంబంధించిన వేర్వేరు దీప శిఖలు. ఆ యా దశల దీపశిఖలు అన్నీ క్షణభంగురమైనవి. అలా ఈ విశ్వంలో ఏదీ శాశ్వతమైనది కాదు; అలాగే  శాశ్వతమైనవి అనబడే ఆత్మలు కూడా  ఏవీ లేవు -- అనేది బుద్ధుని సిద్ధాంత సారం. అయితే ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించవచ్చు. ఆ రెండు దీపాల మధ్య కారణ సంబంధం ఉంది. అదే విధంగా ఒక ప్రాణి వేరొక ప్రాణిని పుట్టిస్తుంది. మొదటి ప్రాణిగానీ, దాన్నుంచి పుట్టిన రెండవ ప్రాణి కానీ శాశ్వతమైనవి కావు. అవి వేర్వేరు జీవన దశల సమాహారాలు మాత్రమే. నిష్క్రమించే దశ దాని తరువాత దశకు తావిచ్చి తాను తప్పుకుంటుంది. అలా బుద్ధుని సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ అంటే ఆత్మ ఒక శరీరం లోంచి వేరొక శరీరం లోకి ప్రవేశించడం (Transmigration of soul from one body to another)  కాదు. పునర్జన్మ అంటే ఒక జీవి వేరొక జీవికి జన్మనివ్వడం. ప్రస్తుత జీవనం భవిష్య జీవనానికి కారణం కావడం. అలా పాశ్చాత్య తాత్త్వికుడు విలియం జేమ్స్ సిద్ధాంతం వలెనే బుద్ధుని సిద్ధాంతంలో కూడా ఆత్మ స్థానంలో  క్షణ భంగురమైన వేర్వేరు దశలతో కూడిన నిరంతర చైతన్య స్రవంతికి చోటు కల్పించడం జరిగింది. ప్రస్తుత చైతన్యం గత చైతన్యం నుంచి ఉద్భ వించినదే. అది గత చైతన్యపు లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకుంటుంది. అందుకే ఆత్మ లేకపోయినా జ్ఞాపక శక్తి కొనసాగుతుంది. ఇదీ సంగ్రహంగా బుద్ధుడి అనాత్మవాదం. ఆత్మ ఉందనీ, దాని విముక్తి కోసం మనం కృషి చెయ్యాలనీ నమ్మడం ఎక్కడా లేని, ఎవ్వరూ విని  కూడా ఉండని అతిలోక సుందరితో ప్రేమలోపడడం వంటిదంటాడు బుద్ధుడు.  ఆ ప్రయత్నం మనం ఇంతవరకూ చూడని ప్రదేశానికి మెట్లు కట్టడం వంటిదని కూడా బుద్ధుని భావన.
                       
బుద్ధుడు మన ఆలోచనలన్నీ ఈ ప్రపంచంలో మన అస్తిత్వానికీ, ఇక్కడి మన సమస్యలను పరిష్కరించుకుని మన జీవితాలను మరింత  మెరుగుపరచుకొనడానికి మాత్రమే పరిమితం కావాలని పదే  పదే ఉద్బోధించాడు. ఎవరూ ఇదమిత్థంగా నిర్ధారణ చేసి  చెప్పలేని ఆముష్మిక విషయాలను బుద్ధుడు పక్కనబెట్టి,  వాటి గురించి సమయం వెచ్చించడం వృథా అన్నాడు. దుఃఖానికి మూల కారణం కనుగొని దుఃఖ నివారణకు ప్రయత్నించే లక్ష్య సాధనలో ఆముష్మిక విషయాలపై చర్చ ప్రతిబంధకం కాగలదని హెచ్చరించాడు. ఇక్కడే ఈ ప్రపంచం లోనే దుఃఖ నివారణ సాధ్యమన్నాడు. అలా ఆయన పాజిటివిస్టు దృక్పథంతో ఆలోచించాడు.
                         
అయితే అనంతర కాలంలో బుద్ధుని అనుయాయులు ఆయన వెలిబుచ్చిన భావాలకు, ఆముష్మిక విషయాలపై ఆయన పాటించిన మౌనానికి ఒక్కొక్కరు ఒక్కొక్క  రకమైన భాష్యాన్ని తమకు తోచిన రీతిలో చెప్పుకొచ్చారు. బుద్ధుడు తన జీవిత కాలంలో  ఏ విషయాలనైతే అశ్రద్ధ చేశాడో, బుద్ధుని అనంతరకాలంలో వాటిపై చర్చే ప్రాధాన్యాన్ని  సంతరించుకుంది. ఈ సిద్ధాంతాలపై సాగిన చర్చోపచర్చలే మొత్తం బౌద్ధాన్ని ఆవరించాయి. The nemesis of neglected metaphysics overtook Buddhism soon after the  founder's passing away.
                         
అలా బౌద్ధంలో పలు తాత్త్విక శాఖలు పుట్టుకొచ్చాయి. చిన్నా చితకా వాటిని మినహాయించినా  ఇంచుమించు ముప్పై శాఖలు  మనం చెప్పుకోదగినవిగా భావించవచ్చు.వీటిలో కూడా నాలుగింటిని మనం ప్రధాన శాఖలుగా ఎంచవచ్చు. అవి: అ)శూన్యవాద లేక మాధ్యమిక శాఖ (Nihilists)
ఆ) విజ్ఞానవాద లేక యోగాచార శాఖ (Subjective Idealists)
ఇ) బాహ్యానుమేయ లేక సౌత్రాంతిక శాఖ (Critical Realists)
ఈ) బాహ్య ప్రత్యక్షవాద లేక వైభాషిక శాఖ (Direct Realists).
ఈ నాలుగింటిలో మొదటి రెండూ మహాయాన బౌద్ధ శాఖలు కాగా మిగిలిన రెండూ హీనయాన శాఖలు. ఇవికాక హీనయాన, మహాయానాల్లో మరెన్నో శాఖలున్నాయి. 
                             
క్రీ.శ.రెండవ శతాబ్దికి చెందిన ఆచార్య నాగార్జునుడు స్థాపించిన మాధ్యమిక  లేక శూన్యవాద శాఖ  యొక్క సాహిత్యాన్ని అశ్వఘోషుడు వగైరా అనంతర కాలపు  తాత్త్వికులు సుసంపన్నం చేశారు.ఈ ప్రపంచంలో ఏదీ సత్యమైనది కాదు; అంతా శూన్యమేనని నాగార్జునుడు ప్రవచించాడని అందరూ పొరబడతారు.'సర్వదర్శన సంగ్రహ' లో మాధవాచార్య శూన్యవాదాన్ని ఇలా వివరించాడు-- తెలుసుకునే వ్యక్తి ( జ్ఞాని లేక ఆత్మ), తెలియబడేది (జ్ఞేయ వస్తువు), జ్ఞానము -- ఈ మూడూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నట్టివి. ఒకదాని వాస్తవికత మిగిలిన రెండూ వాస్తవమా కాదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి అవాస్తవం అయినా మిగిలిన రెండూ కూడా అవాస్తవాలే అవుతాయి.ఒక వ్యక్తికి సంతానం ఎవరూ లేరని మనం రుజువుచేస్తే ఆ వ్యక్తియొక్క  పితృత్వం అవాస్తవమే అయితీరుతుంది.ఇప్పుడిక 'రజ్జు సర్ప భ్రాంతి' లో మనం ఏం చేస్తాం ? తాడులో లేని పామును మనం భ్రాంతితో ఉన్నదని  ఊహించుకుని భయపడతాం. నిజానికి ఇక్కడ పాము ఉండడం  అవాస్తవం. కనుక ఏ మనస్సు పాము ఉన్నదని  భ్రాంతి చెందిందో అదీ అవాస్తవమే.కనుక ఒక జ్ఞేయ వస్తువును తెలుసుకునే మనస్సు (subject), ఆ జ్ఞేయ వస్తువు (object) మాత్రమే కాదు; జ్ఞానం కూడా అవాస్తవమే అయితీరుతుంది. మన లోపల కానీ వెలుపల కానీ మనం సత్యాలుగా  గ్రహిస్తున్న గ్రాహ్య వస్తువులు,  గ్రహిస్తున్న మనస్సు, మనం పొందుతున్న జ్ఞానం-- ఈ మూడూ కలలోని వస్తువులవలె అవాస్తవాలేనన్నమాట. కనుక మానసికమైన లేక భౌతికమైన ఏ వస్తువూ వాస్తవం కాదు.అందుకే ఈ విశ్వమంతా శూన్యం.అయితే ఇక్కడ శూన్యవాదుల సిద్ధాంతం ప్రకారం ప్రతి వస్తువూ అవాస్తవం అని మనం అనుకుంటే పొరపాటు.కొందరు భావిస్తున్నట్లు అది 'సర్వవైనాశికవాదం' లేక ధ్వంసతా వాదం కాదు. అది వాస్తవ ప్రపంచాన్ని తిరస్కరించదు.మనం సత్యాలని భావిస్తున్న ఈ భౌతిక ప్రపంచంలోని వస్తువులు మాత్రమే అసత్యాలు.ఈ భౌతిక ప్రపంచం వెనుక ఒక సత్యం దాగి ఉంది. దాన్ని  ఏ మానసిక, భౌతిక గుణగణాలతోనూ  వర్ణించడం కష్టం. జ్ఞేయమైన గుణగణాలేవీ లేని కారణంగానే దాన్ని 'శూన్యం' అన్నారు. పాజిటివ్ లక్షణాల (Positive Attributes)తో  అంతిమ సత్యం ఇది అని ఇదమిత్థంగా నిర్దారించలేని  కారణం చేత  ఏది  అంతిమసత్యం కాదో మాత్రమే నెగెటివ్ లక్షణాల   ద్వారా తెలపడం జరిగిందిక్కడ.వస్తువుల వాస్తవ స్వభావం మనం మన అంతఃకరణ (Intellect)తో తెలుసుకోగలిగేది కాదని, అందుకే మనం వర్ణించలేమని అంటారు శూన్యవాదులు. వారి దృష్టిలో వాస్తవమైనదేదీ తన  పుట్టుక లేక అస్తిత్వం కోసం మరో దానిపై ఆధారపడదు.మనకు తెలిసినవీ, మనం చూసేవీ అన్నీ కూడా తమ పుట్టుక లేక అస్తిత్వం కోసం   ఏదో మరొక  దానిపైనో , లేక ఏవేవో షరతులపైనో   ఆధారపడే ఉన్నాయి.కనుక అవేవీ అంతిమ సత్యాలు కావడానికి వీల్లేదు.అలాగని అవి అసత్యాలు అనడానికీ వీల్లేదు.ఎందుకంటే గాలిలో మేడ వంటి అవాస్తవిక విషయం అస్తిత్వం లోకి వచ్చే అవకాశమేలేదు.ఒకే సందర్భంలో ఒక వస్తువు వాస్తవమనీ, అవాస్తవమనీ, అది వాస్తవం కాదనీ, అవాస్తవమూ కాదనీ పేర్కొనడం మనకి కొంత గందరగోళంగా అనిపిస్తుంది.వస్తువులకు సంబంధించినంతవరకు  ఇలా ఇదమిత్థంగా నిర్ధారించి, వర్ణించి చెప్పడానికి సాధ్యపడని వాటి వాస్త్గవ తత్త్వాన్నే మాధ్యమిక వాదులు 'శూన్యం'అన్నారు.ఈ విశ్వంలోని అన్నీ అవాస్తవికమైనవనే దృక్పథానికీ, అన్నీ వాస్తవాలే అనే దృక్పథానికీ మధ్యేమార్గంగా వీరు వస్తువులన్నీ కొన్ని  షరతులకు లోబడిన అస్తిత్వం (Conditional Existence) కలిగి ఉంటాయని ప్రతిపాదిస్తారు. నాగార్జునుడు   దీనినే మధ్యేమార్గ సిద్ధాంతం అన్నాడు.నిర్వాణం పొందిన తరువాతనే ప్రతి వ్యక్తీ  పరమార్థ సత్యాన్ని (Transcendental or Noumenal Truth)గ్రహించగలుగుతాడనీ, అప్పటివరకూ ఈ విశ్వంలోని వివిధ వస్తువుల గురించి అతడు తెలుసుకోగలిగేది కేవలం సంవృతి సత్యాలు (Empirical or Phenomenal Truths) మాత్రమేనని అంటాడు నాగార్జునుడు.ఈ భౌతిక ప్రపంచం యొక్క వాస్తవికతను నిరాకరించడం, రెండు విధాల సత్యాలను-- వ్యావహారిక, పారమార్థిక సత్యాలను -- ప్రతిపాదించడం, అంతిమ సత్యాన్ని నిర్గుణి గా (with negative attributes) వర్ణించడం,నిర్వాణం అంటే పరమాత్మలో విలీనం అవడమేనని ప్రతిపాదించడం వంటి విషయాలలో శూన్యవాదులు (మాధ్యమికవాదులు) ప్రతిపాదించిన  సిద్ధాంతం ఉపనిషత్తులలో చెప్పబడిన, అనంతరకాలంలో గౌడపాదుడు, శంకరాచార్య మొదలగువారిచే  విపులీకరించబడిన అద్వైత వేదాంతంతో చాలా దగ్గర పోలికలు కలిగివున్నది.
                         
ఇక ప్రాతీతిక భావ వాదాన్ని (Subjective Idealism) ప్రతిపాదించిన  అసంగుడు, వసుబంధుడు, దిజ్ఞాగుడు వంటి యోగాచార శాఖీయుల విషయానికొస్తే -- బాహ్య వస్తువుల అవాస్తవికత విషయంలో వారు శూన్యవాదుల సిద్ధాంతంతో ఏకీభవించినా, మానవుల  చిత్తం (మనస్సు) మాత్రం అవాస్తవం అనడాన్ని వారు  ఎంతమాత్రమూ అంగీకరించలేదు.అప్పుడిక మన తర్కం, ఆలోచనలు అవన్నీ కూడా తప్పనిసరిగా  అవాస్తవాలే అయితీరతాయి.మరిక తమ వాదనలు సబబైనవని మాధ్యమికవాదులు సైతం ఎలా వాదించగలరు ? అని యోగాచార శాఖవారు ప్రశ్నించారు.మనస్సు మాత్రమే సత్యమని వారి భావన.మన చుట్టూ మనం ఉన్నవని భావిస్తున్న సమస్త వస్తువులు-- చివరికి మన శరీరం కూడా-- కేవలం మన మనస్సులోని భావాలే తప్ప వాటికి వేరే అస్తిత్వం లేదు.మన మనస్సుకు వెలుపల మనం ఉన్నట్లుగా భావిస్తున్న వివిధ వస్తువులను మనం ఏ పరిస్థితులలోనూ తెలుసుకోలేము. ఎందుకంటే ఆ వస్తువులు పరమాణు రూపంలో ఉంటే మనకు అవి కనుపించవు (microscopic) కనుక  మనం అవి ఉన్నట్లు తెలుసుకోలేము. ఇక పరమాణు సంఘాతంతో ఏర్పడిన వస్తువుల పూర్తి స్వరూపం మనకు అవగతం కాదు.ఉదాహరణకు ఒక కుండనే తీసుకుందాం.ఒకే సమయంలో దాని వేర్వేరు పార్శ్వాలు, వేర్వేరు భాగాలు చూడగలగడం మనకు సాధ్యం కాదు.కనుక మనం ఏ వస్తువులనూ పరిపూర్ణంగా  తెలుసుకొనడం అసాధ్యం.   సంస్కారంతోనూ, చిత్తాన్ని అదుపులో పెట్టుకొనడం ద్వారానూ మనం బాహ్య వస్తువులపై భ్రమలు,  వాటిపై అనురక్తి తొలగించుకుని అవి అవాస్తవాలని గ్రహించడం ద్వారా నిర్వాణం పొందగలుగుతామని  యోగాచార శాఖవారు ప్రతిపాదించారు.యోగసాధన ద్వారా నిర్వాణం పొందవచ్చునని బోధించారు గనుక వీరిని యోగాచార శాఖీయులనీ, వస్తువులు అసత్యమనీ, వాటి గురించిన మన మనసులోని భావనలు అంటే  వాటి విజ్ఞానం (Consciousness) మాత్రమే సత్యమనీ నమ్మారు కనుక వీరిని విజ్ఞానవాదులనీ అన్నారు. యోగాచార వాదులు మాధ్యమిక సిద్ధాంతం లోని అసంగతమైన విషయాలను చక్కగా ఎత్తిచూపినప్పటికీ వారి సిద్దాంతంలోనూ  ప్రధానమైన లోపం ఒకటుంది.వస్తువులు అసత్యాలు; వాటి గురించి మన మనస్సులలో ఉన్న విజ్ఞానం మాత్రమే సత్యం అనే వాదన చాలా బలహీనమైనది.వస్తువు గుణాలను మనం గ్రహించలేమనడం కూడా తప్పే.వస్తువుల గుణాలు మనం తెలుసుకోగలం. అలా తెలుసుకున్న ఆ వస్తువు యొక్క రూపం, రంగు వగైరా గుణాలను మన మనస్సులలో నిక్షిప్తం చేసుకుంటాం. ఇదే  మన మనస్సులో ఉన్న  ఆ వస్తువు యొక్క విజ్ఞానం( Consciousness). ఆ విజ్ఞానానికి మూలం ఆ వస్తువే. అలాంటి వస్తువుల ఉనికినే నిరాకరించి ఆ వస్తువుల గురించి మన మనస్సులలోవున్న విజ్ఞానం తప్ప మనం  ఏ వస్తువుల గురించీ ఏమీ తెలుసుకోలేమనడం  పొరబాటు.వస్తువులకు సంబంధించి మన మనస్సులలో మనం లోగడ సముపార్జించి నిక్షిప్తం చేసుకున్న  విజ్ఞానం కారణంగానే బయట ఏదైనా వస్తువు ఎదురైనప్పుడు అది లోగడ మనకు తెలిసినదే అయితే దాన్ని మన మనస్సులోని సమాచారంతో సరి పోల్చుకుంటాం (Recognition). అంచేత వివిధ వస్తువుల గురించి మన మనస్సులలో ఏర్పడిన విజ్ఞానం మాత్రమే కాదు.ఆ విజ్ఞానానికి మూలమైనట్టి ఆ యా  బాహ్య వస్తువులు కూడా వాస్తవికమైనట్టివే.కాని విజ్ఞానవాదులు మనస్సును తప్ప వేరే దేనినీ వాస్తవమని అంగీకరించని  స్వీయాత్మక భావవాదులుగా(Subjective Idealists)గా మిగిలిపోయారు. జ్ఞాన సముపార్జనకు ఇంద్రియానుభూతులు, మన అనుభవాలు మూలం అనే విషయాన్ని విస్మరించడం విజ్ఞాన వాదుల సిద్ధాంతంలో పెద్ద లోపం.
                           
సౌత్రాంతిక శాఖీయులు మనస్సుతో పాటు బాహ్య వస్తువులు కూడా సత్యమని నమ్మారు. అయితే ఈ నిర్ధారణను వారు అనుమాన ప్రమాణం సహాయంతో చేశారు.బాహ్య వస్తువులు నిజంగానే లేనట్లయితే విజ్ఞాన వాదులు చెపుతున్నట్లు మన మనస్సులలోని ఆ యా వస్తువుల విజ్ఞానం కారణంగా మనకు అవి ఉన్నట్లు భ్రమ కలగడం ఎలా సాధ్యపడుతుందని వారు ప్రశ్నించారు.మన మనస్సులలో నిక్షిప్తమైవున్న వేర్వేరు వస్తువుల విజ్ఞానం మొత్తంలో ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఆ వస్తువును మనం నిజంగా బాహ్యంగా చూసినట్లు అనుమానించినందువల్లే  కదా కలుగుతున్నది ? లేకపోతే  ఎప్పటికప్పుడు  ఏ వస్తువును చూసినట్లుగా మనకు భ్రమ కలగాలో ఎవరు నిర్ణయిస్తున్నారు ? కుండను చూసినట్లుగా మనకు కలుగుతున్న భ్రమ కుండను చూసినప్పుడే కలుగుతున్నదిగానీ, గుడ్డను చూసినప్పుడు కలగడం లేదేం ? కనుక బాహ్య వస్తువుల గురించి మన మనస్సులలో నిక్షిప్తమైవున్న విజ్ఞానమూ సత్యమే, బాహ్య వస్తువులూ సత్యమే. బాహ్య వస్తువులు నిజంగా ఉండబట్టే అవి మనకు తటస్థించి, వాటి కారణంగా మనకు కలిగిన ఇంద్రియానుభూతులు మన మనస్సులలో  ఆ యా బాహ్య వస్తువుల గురించి అంతకు పూర్వం ఏర్పడిన విజ్ఞానంతో మనం మన అనుభూతులను సరిపోల్చుకుంటాం.ఇలా అనుమాన ప్రమాణంతో బాహ్య వస్తువులు కూడా సత్యమని నిర్ధారణ చేస్తారు కనుకనే ఈ శాఖీయులను బాహ్యానుమేయవాదులు అనీ,' సుత్త పిటక'లేక 'సూత్ర పిటక' కు వీరు అమిత  ప్రాధాన్యం ఇస్తారు కనుక వీరిని సౌత్రాంతికులనీ అంటారు.సౌత్రాంతికులు పాశ్చాత్య తత్త్వవేత్తలలో స్వీయాత్మక భావవాది అయినట్టి బర్కిలీ సిద్ధాంతాలను ఖండించిన మూర్ వంటి రియలిస్టులు.లాక్ లాగా సౌత్రాంతికులు  రిప్రజెంటేషనిస్టులు (those following copy theory of ideas).
                                 
ఇక బాహ్యప్రమేయ వాదులకంటే ఒక అడుగు ముందుకువేసిన వైభాషికులు బాహ్య వస్తువులు సత్యమని  అనుమాన ప్రమాణంతో కాదు; ప్రత్యక్ష ప్రమాణంతో మాత్రమే  నిర్ధారణ చేయగలమంటారు. వస్తువులను గురించిన  పరిజ్ఞానం, వాటి గురించి మన మనస్సులలో ఏర్పడే చైతన్యం లేక విజ్ఞానం మనకు ప్రత్యక్ష ప్రమాణం ద్వారానే సాధ్యమంటారు.ఒక పర్వతం  నుంచి పొగ రావడం చూసిన మనం అది అగ్ని పర్వతమని ఎలా నిర్ధారణ చేస్తాం ? మనం లోగడ అగ్ని, పొగ విడదీయరాని విధంగా  కలిసి  ఉండడం చాలా సార్లు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా చూసి నిర్ధారణ చేసుకున్నాం.కనుకనే కనుపించే పొగను బట్టి కానరాని అగ్నిని అనుమానించి, అది అగ్ని పర్వతమని నిర్ధారణ చేశాం.అలా ప్రత్యక్ష ప్రమాణంతో చేకూరిన జ్ఞానమే అనుమాన ప్రమాణానికి కూడా మూలం.

కనుకనే బాహ్యవస్తువులను మనం అనుమాన ప్రమాణంతో కాదు; ప్రత్యక్ష ప్రమాణం ద్వారా చేకూరిన ప్రత్యక్ష జ్ఞానం ద్వారా  మాత్రమే తెలుసుకోగలం. సౌత్రాంతికులు  చెపుతున్నట్లు  బాహ్య వస్తువులను ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకోలేమని నమ్మితే వాటి అస్తిత్వం సత్యమేనని  అనుమాన ప్రమాణం ద్వారా నిర్ధారణ చేయడం కూడా అసాధ్యమంటారు వైభాషికులు.  ఎందుకంటే మనం ఇందాక చూసినట్లు అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది కనుక.అందుకే వీరిని బాహ్య ప్రత్యక్ష వాదులు (Direct Realists) అంటారు. పాశ్చాత్య తాత్త్విక శాఖల్లో వీరు నియో-రియలిస్టుల వంటి వారు.వీరు  అభిధర్మ పిటక మహా విభాష (సూక్ష్మంగా-- విభాష) అనబడే వ్యాఖ్యాన గ్రంథాన్ని ఆధారం చేసుకుని తమ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నారు కనుక వీరికి వైభాషికులు అనే పేరు వచ్చింది.
                                         
బుద్ధుని బోధనలను తుచ తప్పకుండా అనుసరించిన హీనయాన  తాత్త్విక శాఖలయిన   సౌత్రాంతిక, వైభాషిక శాఖల అనుయాయులు బుద్ధుని వలెనే ఆముష్మిక విషయాలను పక్కనబెట్టేశారు. పూర్తిగా ఐహిక విషయాలపైనే వారు తమ దృష్టినంతా నిలిపారు.వారి సిద్ధాంతాలలో  ధర్మం (Moral Law) తప్పితే ఎక్కడా భగవంతుడి ప్రస్తావనే లేదు. ఆత్మను  కూడా వారు నమ్మలేదు. బుద్ధుడి వ్యక్తిగత జీవితాన్నే ఆదర్శంగా తీసుకుని వారు, 'ఆత్మ దీపో భవ' (Be a Light unto Thyself) అన్న బుద్ధుని వాక్యం మేరకు తమకు తామే వెలుగునిచ్చే దివ్వెలుగా భావించుకుని తమకు తామే మార్గనిర్దేశకులుగా  'నిర్వాణం' దిశగా అడుగులేస్తూ,  ఆ కఠిన ప్రయాణంలో అంతిమంగా విముక్తి పొందడం కోసం నిర్విరామ కృషి చేసేవారు. ఈ మార్గం సామాన్య బౌద్దులందరికీ ఆచరణ సాధ్యం కాదని కొందరు భావించి, తేలిక మార్గాల కోసం వెదుకులాడసాగారు. అశోకుడు మొదలైన చక్రవర్తుల పరిపోషణలో సామాన్య జనం ఇబ్బడి ముబ్బడిగా బౌద్ధం స్వీకరించారు.  అలా వైదిక మత శాఖలకు చెందిన పలువురు బౌద్ధ తాత్త్విక సిద్ధాంతాలను లోపలినుండి ప్రభావితం చేశారు.భారతీయ దర్శనాలలోని భావవాద శాఖలతో  అనివార్యంగా కలిగిన సంపర్కం కూడా మహాయాన బౌద్ధ తాత్త్విక శాఖలలో భావవాద బీజాలను నాటింది.  అలా  భావవాద భావజాలంలో చిక్కుకున్న మహాయాన తాత్త్విక శాఖలైన శూన్యవాద,విజ్ఞానవాద(యోగాచార) శాఖలవారు క్రమంగా బుద్ధుడినే భగవంతునిగా భావించి ఆరాధించసాగారు.తాము ఒక్కళ్లమే  విముక్తి కావడం అనేది స్వార్థపూరితమనీ, జీవులన్నిటి విముక్తికీ కృషిచేయడం ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కావాలనీ, ఈ మహత్తర లక్ష్యం కలిగినది కనుకనే తమ శాఖ  విముక్తిని చేరుకునేందుకు ఉత్తమోత్తమమైన వాహనమనీ (యానమనీ) మహాయానులు భావించారు. గౌతమునిగా జన్మించక పూర్వం బుద్ధుడి గత జన్మలలో ఆయన సకల జీవరాశుల విముక్తి కోసం ఎలా పాటుపడ్డాడో తెలిపే జాతక కథా సాహిత్యాన్ని సృష్టించారు. బుద్ధుడు మహా పరి నిర్వాణం చెందిన తరువాతకూడా ఈ ప్రపంచం లోని సకల జీవరాశులూ విముక్తి చెందేందుకు, వారిని అవలోకితేశ్వరునిగా నిత్యం కనిపెట్టి కాపాడుతూ అంతిమంగా వారిని విముత్తి (విముక్తి) అనే ఒడ్డుకు చేరుస్తాడని వారు నమ్మసాగారు. అలా మహాయాన బౌద్ధ శాఖలలో క్రమంగా బుద్ధుడినే దైవంగా భావించడం మొదలైంది.  క్లుప్తంగా ఇదీ బౌద్ధ దర్శనంలో దైవాన్ని గురించిన విచారణ.
                     
వచ్చే నెల మరికొన్ని భారతీయ తాత్త్విక శాఖలు దైవం విషయమై ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నాయో పరిశీలిద్దాం. ప్రస్తుతానికి సెలవు.
 


ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ, ఒంగోలు, గుంటూరు, తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech