Sujanaranjani
           
  సారస్వతం    
 

రచన : రాంభట్ల పార్వతీశ్వర శర్మ(అవధాని - పరిశోధకుడు)   

 

 

నేటి కాలపు సాహిత్యావధానాలు

‘పిపీలికా చుంబతి చంద్రమండలమ్’ అన్నది నవ ద్వీపంలో ‘సత్వర కవితా సవితా గౌడుడు’ అయిన అంబికా దత్తుని సమక్షంలో సాక్షాత్ - గణపతి, కవికులపతి,అతి దక్షుడు, దాక్షిణాత్యుడు అయిన కావ్యకంఠ వాశిష్ట గణపతి మునిగా కీర్తించబడ్డ శ్రీ అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రికివ్వబడ్డ సమస్య.

            సతీ వియోగేన విషన్న చేతస:
            ప్రభో శయానస్య హిమాలయే గిరౌ
            శివస్య చూడా కలతిం సుధాశయ
            పిపీలికా చుంబతి చంద్ర మండలమ్!! 


అని అత్యాశువుగా నాయన పూరించారీ సమస్య. చీమ చంద్రుడ్ని చుంబించడం యిందులో వైరుధ్యమైతే, సతీవియోగం చేత శివడు కలత చెంది, వెండి కొండ మీద శయనీస్తే, మస్తక భూషణుడూ అమృత కరుడైన చంద్రుడి సుధను ఆశించి, అక్కడి పరిసరాల్లో సంచరించే చీమ చంద్రున్ని చుంబించిందని చక్కని కల్పన పూరణ లో కన్పిస్తోంది. సమస్యను సాధించే విధానంలో ఇదో పద్ధతి.

అనంత సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపు దిద్దుకున్నాయి. వాటిలో అవధానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అవధానం-రూపకం ఈ రెండూ కేవలం ఆంధ్రుల సొత్తుగా అభివర్ణంచబడ్డాయి.

అవధానం సమాధానం ప్రణిధానం తదైవచ అని అమరసింహోవాచ. ‘చిత్తైకాగ్ర్యం అధానం’ అన్నది దీని వ్యుత్పత్తి. ఆంధ్రపురాణ కర్త మధునా పంతుల సత్యనారాయణగారు సి.వి.సుబ్బన్న శతావధాన ప్రబంధం అనేగ్రంధ పీఠిక రాస్తూ... ‘వెనకటి కవుల చిత్తైకాగ్ర్యం ప్రధానత; దేనియందో దానియందే నేటి శతావధాన ప్రక్రియ యొక్క తల్లివేరు. ఇదిఅచ్చముగా తెలుగు జాతిదేకానీ, విజాతిదికాదు. ప్రపంచ సాహిత్యంలో యిట్టి దొకటి యున్నదని యెవ్వరునూ చెప్పినది కాదు. ఈ అవధాన విధానం ఆంధ్ర సరస్వత్యుప్రజ్ఞము. ఆమాటకు వచ్చిన చో సంసృత భాషా పండిత కవులకు కూడా ఈ తెలుగు ప్రక్రియ ఆచార్యకమగుచున్నది’ అన్నారు. ఈవాక్యాలను బట్టి ఈ అవధాన విద్య ప్రాచీనత,తెలుగులోనే పుట్టి ఇతర భాషల్లోకి వెళ్లిందని అర్థమౌతోంది.

లోకోత్తరమైన అవధానవిద్య అనేక విధాలుగా విలసిల్లుతోంది. అష్టావధానం,ద్విగుణితాష్టావధానం,శతావధానం, ద్విశతావధానం, పంచశతావధానం, పంచమహా శతావధానం, సహస్రావధానం, పంచసహస్రావధానాలుగా పృఛ్చక సంఖ్యను అనుసరించి విభజించుకోవచ్చు.

అవధానాంశాలైన సమస్య, దత్తపది మొదలైనవి సంస్కృత, తెలుగు సాహిత్య చరిత్రను తరచిచూస్తే,పూర్వకవులు అక్కడక్కడా ఆశువుగా చెప్పినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాంభట్ల జగన్నాధశాస్త్రి మొదలుగా శ్రీ దోర్భల ప్రభాకరశర్మ యిత్యాదులు పరంపరగా సంస్కృతంలో అష్టావధానాలు నిర్వహించారు. తెలుగులో అవధానులు శ్లోకం లేదా భాషాంతరీకరణ అన్నఅంశంతో సంస్కృతానికీ స్థానం కల్పించారు.

ఈ అవధాన విద్యకు మూలాలను కనుగొనే ప్రయత్నం చేస్తే, జక్కన కంఠోక్తిగా చెప్పిన సీసమాలికలో అవధానపు పోలికలు కన్పిస్తున్నాయి. భట్టుమూర్తిగా ప్రసిద్ధుడైన రామరాజు భూషణుడి ఘంటాశతగ్రంథకల్పనం, అలాగే చిత్రభారత కర్త చరికొండ ధర్మన్న శతలేఖిన్యవధాన పద్య రచనా సంధ మొదలైనవి గ్రాంధికాధారాలుగా కన్పిస్తున్నాయి. ఆశు కవితగా విరాజిల్లే ఈవిద్యను శ్రీ నెల్లూరి రాఘవ కవి, శ్రీమాడభూషి వేంకటాచార్యలు ఒకప్రక్రియా రూపంలో జనబాహుళ్యం లోకి ప్రసరింపజేసారు.

తిరుపతి వేంకట కవుల యుగంలో అవధాన ప్రక్రియ ఏనుగు అంబారీనెక్కి ఊరేగింది. వేలూరివారు, అవ్వారివారు, చిదంబరశాస్ర్తి గారు మొదలైన వారెందరో తిరుపతి వేంకటకవుల ప్రభావంతో అవధానులు గా ఆంధ్ర కవిత్వాన్ని కొత్త బాటలో నడిపించారు.

అవధానుల్లో జంటకవుల హవా బాగా విస్తృతమైన రోజుల్లో కొప్పరపు సోదరకవులు, వేంకట పార్వతీశకవులు, వేంకట శేషకవులు మొదలైన వారెందరో అవధాన విద్యలో ఆరితేరి పల్లెపల్లెలో పద్యసరస్వతిని పల్లకీలో ఊరేగించారు. ఈ పరంపరంలో శ్రీ సి.వి. సుబ్బన్న శతావధాని - నాటి, నేటి అవధానులందరికీ ఆరాధ్యుడు. తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులు అవధాన ప్రస్థానంలో ప్రాత:స్మరణీయులుగా కీర్తించ బడుతున్నారు. 

అవధానంలో అంశాల విషయానికొస్తే సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, ఆశువు, ఘంటాగణనం, పుష్పగణనం, వారగణనం, ఆకాశపురాణం, అప్రస్తుత ప్రసంగం ఇలా అనేకానేకంగా ప్రాచీనకాలం నుండి కొద్దిపాటి మార్పులతో అవధాని స్వేచ్ఛగా ఆయా అంశాలను ఎంపిక చేసుకోవడం పరిపాటి. పృచ్ఛకుడిగా ఉండే వ్యక్తి ఆ అంశానికి సంబంధించిన ప్రశ్నాస్త్రాన్ని సంధిస్తే, అవధాని సద్యస్ఫురణతో పృచ్ఛకులను సమాధాన పరచాలి.

ఆశుకవితా విలాసంతో సాగే అవధానాల్లో సుకవిత్వం రసనాగ్రంలో నర్తించాలి. రసవత్వదోపస్థితం కావాలి. సువృత్తాలు రావాలి. కొమ్ములు తిరిగిన విద్వత్పరిషత్ సమక్షంలో ఈ వ్యవహారమంతా జరుగుతుంది. కాబట్టి కవి పండితులు అనుక్షణం అవధానిని పరిశీలిస్తూ, పరీక్షిస్తూంటారు. ఇంత లక్షణంగా అవధానం చేసే వ్యక్తికి ఉండాల్సిన మరికొన్ని అర్హతలను ఓ శ్లోకం ఇలా వివరిస్తోంది..

కవి; యది అవధానీ స్యాత్ -  సంపాద్యం ధ చతుష్టయమ్!
ధైర్యం ధారా ధోరణీచ - ధారణాచ సునిశ్చలా!!’

అవధానికి నాలుగు ధ కారాలుండలి అంటారు. అవి ధైర్యం, ధార, ధోరణి, ధారణ. సాహసోపేతమైన అవధాన ప్రక్రియా ప్రదర్శనమే ధైర్యానికి నిదర్శనం. అత్యాశువుగా పద్యరచన చేయడం ధార. చెప్పే విధానం ధోరణి అనుకుంటే, చెప్పింది పొల్లుపోకుండా గుర్తు పెట్టుకోవడం ధారణ అవుతుంది.ఆనాటి తిరుపతి, కొప్పరపు కవులు మొదలుగా నేటి అవధానులైన వారిలో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకాంశంగా కన్పిస్తోంది. సాహిత్యావధానాలే కాకుండా నేత్రావధానం, సంగీత నవావధానం లాంటి ప్రక్రియలు ఎన్నో ఉద్భవించాయి. అయితే ఇవేవీ సాహిత్యావధాన ప్రక్రియకు సాటిరావు అనడంలో అతిశయోక్తి లేదు.   

అవధానాంశాలలో సమస్యను నిర్వహించే పృచ్ఛకుడు ఒక పద్య పాదాన్ని భావ వైరుధ్యంతో ఇస్తాడు. అంతేకాదు అవధానాల్లో ఇచ్చే సమస్యలు చాలా చిత్రంగా ఉంటాయి. దుష్కర ప్రాసతోనో.. యతి భంగం చేసో... పద్యపాదంలో ఉండాల్సిన అక్షరాల కన్నా కొన్నింటిని ప్రారంభంలో తగ్గించో లేదా అచ్చును ప్రాసాక్షరంగా ఉంచో సమస్యను అత్యంత క్లిష్టంగా తయారు చేసి అడిగే అవకాశముంటుంది.

ఒకసారి కొప్పరపు సోదర కవులకు ఇచ్చిన సమస్య ‘కుక్కుట గృహ మందు కాక ఘూకములుండెన్’ అంటే కోడి ఉండే చోట (గంప కింద) కాకి, గుడ్లగూబలు కూడా ఉన్నాయని -విరుద్ధంగా ఇచ్చారు. దీనిని సహజ సుందరంగా కొప్పరపు జంట పూరించిన విధానం చూడండి -

ఒక్కడగుబోయ పక్షుల
వక్క జముగ నెన్నొ జాతులనదగు  వానిన్
కక్కురితి దెచ్చి యొక్కెడ
కుక్కుట; గృహమందు కాక ఘూకములుండెన్!!

కుక్కుటం -ను కోడి అనే అర్థంలో కాకుండా కుక్కడం అనే అర్థ సాధనతో సమస్య పూరించబడింది. ఇక దత్తపది విషయాని కొస్తే యివ్వబడే పదాలు కాబట్టి దత్తపది అంటున్నాం నాలుగు పదాలను పృచ్ఛకుడు అవధానికిచ్చి, అంశం నిర్దేశిస్తూ, ఆ పదాలు పద్యంలో వచ్చేలా నిర్బంధిస్తూ, ఒక్కోసారి ఆ పదాలకున్న అర్థం రాకుండా (స్వార్థత్యాగం) నియంత్రిస్తూ కూడా పద్యం చెప్పమని అడగవచ్చు.

శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ద్విభాషా మహాశాతావధానం లో జడేజా, బిడేజా, కాంబ్లీ, కుంబ్లే అన్న నాలుగు పదాలిచ్చి ఆంజ నేయుని  సాగర లంఘనాన్ని సంస్కృత శ్లోకంలో చెప్పమంటే....

ఏషా జడేజా వికటా నిహన్యా - తద్రాబిడేజా జలధి ప్రసిద్ధా
తన్వానరో ర్ముష్టి విఘాత చూర్ణా-కాంబ్లీతి కుంబ్లేతి రవం చకార!

ద్రావిడ స్త్రీ అయిన సురస భయంకరంగా సముద్ర మంతా ఆవరించి హనుమంతుని అడ్డగిస్తే, ఆయన తన ముష్టి ఘాతాలలో విజృంభించినపుడు సురస కాంబ్లే కుంబ్లే అంటూ విచిత్రంగా ఆహాకారాలెత్తిపోయిందని అన్య దేశ్యాలైన చక్కగా శ్లోకంలో ఇమిడ్చి చమత్కారవంతంగా పూర్తి చేసారు. అవధానంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా నిషిద్ధాక్షరి పేరొందింది. పృఛ్చకుడుద్దేశించిన విషయాన్ననుసరించి, అవధాని పద్యంలో మొదటి అక్షరం ప్రారంభిస్తే, పృచ్ఛకుడు రెండవ అక్షరం ఊహించి అది వాడకూడదు, నిషిద్ధమంటాడు. అప్పుడు అవధాని తిరిగి  అనుకున్న భావం చెడకుండా ప్రత్యామ్నాయ అక్షరాలను వేసుకుంటూ, అడుగడుగునా పృచ్ఛకుడు అడ్డుపడుతున్నా పద్యం పూరించాలి. సాధారణంగా ఇది కందపద్యంలో చేస్తారు.

ప్రతీ అక్షరం కాకుండా కొన్ని సార్లు పద్యం మొత్తంగా ఒకే అక్షరాన్నో, లేదా ఒక వర్ణాన్నో నిషేధించే సంప్రదాయం ఉంది. శ్రీనేమాని రామజోగి సన్యాసిరావు గారి అష్టావధానంలో ‘క’అనే అక్షరం పద్యంలో ఎక్కడా రాకుండా కందకూర గూర్చి కంద పద్యం చెప్పమన్నారు. పూరణ చూడండి.

తొలి హల్లు ననుస్వారము
వలపలను "ద" వర్ణముంచ వచ్చెడి దుంపన్
పులుసావలతో వండిన
బళిబళి రుచినెన్న వశమె పప్పన్నముతో!

పద్యంలో ఎక్కడా ‘క’ వర్ణం వాడకుండా కందకూరగూర్చి చెప్పడం జరిగింది.ఇక ఆశువులో ఆగకుండా మొత్తం పద్యాన్ని ఒకేసారి చెప్పాలి. ఇది అవధాని ధారాశుద్ధిమీద ఆధారపడి ఉంటుంది.  

వ్యస్తాక్షరి అంశంలో పృచ్ఛకుడు ఏదైనా పద్యపాదంలోనో పాటలోనో, వాక్యంలోనో అక్షరాలను చిన్నచిన్న కాగితం ముక్కల మీద రాసి, అస్తవ్యస్తంగా అప్పుడప్పుడూ ఆ కాగితం ముక్కల్ని అవధానికి అందిస్తే, చివరకు సరైన క్రమంలో ఆ అక్షరాలను గుర్తుంచుకుని- ధారణ సమయంలో వరస తప్పకుండా సభకు - యిచ్చిన అక్షరాలను అప్పచెప్పాలి. ధారణా బ్రహ్మ రాక్షసుడైన గరికపాటి నరసింహరావు గారికి వ్యస్తాక్షరిగా......  ‘విడ్జ్యా లుడ్భ్రమ లుట్ట్ర యట్ప్ర వసుధా డడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా’ అన్న కాళిదాసు శ్లోకంలో మూడవ పాదన్ని ఇవ్వడం జరిగింది. 

విషయముద్దేశించి, పృచ్ఛకుడు నాలుగు అక్షరాల్ని ఎంచుకుని ఒక్కొక్క అక్షరాన్ని పద్యంలో ఒక్కోస్థానంలో ఉంచుమని నాలుగు అక్షరాలు నాలుగు పాదాల్లో ఎక్కడ న్యస్తం చెయ్యలో చెబితే అది న్యస్తాక్షరి. ఇది క్లిష్టమైన అంశంగా అందరూ పరిగణిస్తారు.

ఘంటాగణనం, పుష్పగణనం మొదలైనవి అవధాని ఆలోచనా మగ్నుడైన సమయంలో ఆటంకపరుస్తూ... ధారణను పరీక్షించే అంశాలు.

వారగణనం అనే పేరుతో గణితానికి సంబంధించిన అంశం ఒకటి అవధానాల్లో చోటు చేసుకుంది. సంవత్సరం,నెల, తేదిలను చెప్పి, ఆ రోజు ఏవారు అవుతుందో అడిగే అంశమిది.

ఇంకా అవధానికున్న ప్రాచీన కావ్య, ఇతిహాస, ప్రబంధ, పురాణ పరిజ్ఞానాన్ని పరీక్షించే అంశమే ఆకాశపురాణం. పృచ్ఛకుడు అడిగిన పద్యం ఏగ్రంథంలోది? కవి వివరాలు, ప్రతిపదార్థ తాత్పర్యాలు -అవధాని సభకు వివరించడం అవధానాల్లో తరుచుగా కనిపించే అంశం.

అవధాని ఆలోచనల్ని భగ్నం చేసే పరిపుష్టమైన అంశం అప్రస్తుత ప్రశంస అవధానిలోని చమత్కృతిని, పాండిత్యాన్ని సభకు తెలిసేలా చేస్తూ... సభరంజకంగా ఈ అంశం అన్ని అంశాల కన్నా విలక్షణ మైనదిగా కన్పిస్తుంది.
ఇలా అవధాన సుధారస సాగరంలో ఒక్కో అంశం అవధానిలో ఒక్కో కోణాన్ని ఆవిష్కరిస్తూ అవధాని ప్రతిభ వ్యక్తమయ్యేలా చేస్తుంది.

సమస్య స్ఫురణను, దత్తపది భాషాపటిమను, వర్ణన- కల్పనా శక్తిని, వర్ణనా నైపుణ్యాన్ని, నిషిద్ధాక్షరి- మేధోబలాన్ని, వ్యాకరణ జ్ఞానాన్ని, వ్యస్తాక్షరి, ఘంటాగణనం,పుష్పగణనం, వారగణనం మొదలైనవి ధారాణాశక్తిని, ఆశువు ధారాశుద్ధిని, అప్రస్తుత ప్రశంస - సమయస్ఫూర్తిని వెల్లడి చేస్తాయనడంలో సందేహం లేదు.

సాహిత్య సుమ సౌరభ సౌధంలో కవిత్వానికి ఆకారమై అవధానాలు వ్యక్తిత్వ వికాసానికి, ప్రాచీన సాహిత్య సంపద పరిరక్షణకు, పరివ్యాప్తికి ఉపకరిస్తున్నాయనడంలో సందేహం లేదు. అందుకే.... నేను ప్రతి అవధానంలో ఇలా అవధాన ప్రాశస్త్యాన్ని నా మాటల్లో చెబుతుంటాను!ప్రతిపద్యపాదమ్ము ప్రతిపదార్థ యుతమ్ము
పండితామోదమ్ము ప్రగతిపథము!
ప్రతి వృత్తమాయత్త పరివృత వృత్తాంత
చిత్రిత కావ్య విజృంభణమ్ము!
ప్రతిసమస్యా పూర్ణ మతిరస మాధుర్య
విభవౌచితీ ధుర్య విభ్రమమ్ము!
ప్రతిదత్తపదిక్రొత్త వాగ్దత్త కేదార

ఫలసాయ సారాంశవిలసనమ్ము!
ఆశుకవితా సుధాధార యాశుగమ్ము!
వర్ణనోదీర్ణఘూర్ణ మానార్ణవమ్ము!
గాగ; నష్టావధానంపు కవనమొప్ప
పండితావళి మెప్పుల బడయు గాదె!!


ఇలా ప్రతిభ వ్యుత్పత్యభ్యసాలతో కూడుకొన్నటువంటి అవధానాలు పండితుల మెప్పును పొందుతూ అందరినీ అలరిస్తాయి.
 

 
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech