Sujanaranjani
           
  అన్నమయ్య కీర్తనలు   
 

                                                             రచన : జి.బి.శంకర్ రావు

  కంటి నఖిలాండకర్త

కంటి అఖిలాండ కర్తనధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి

మహనీయ ఘనఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజ నవరత్న కాంచనవేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె కంటి

పావనంబైన పాపవినాశనము గంటి
కైవశంబగు గగనగంగ గంటి
దైవికపు పుణ్య తీర్థములెల్ల పొడగంటి
కోవిదులు కొనియాడు కోనేరుగంటి

పరమయోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి
తిరువేంకటాచలధిపు చూడగంటి


అఖిలాండకర్తయైన శ్రీ వేంకటేశ్వరుని దర్శిస్తే చాలు! మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి! అట్టి కమనీయ మూర్తిని, తిరుమల గిరుల సౌందర్యాన్ని అన్నమాచార్యులవారు దర్శించి భావావేశంతో ఆ అద్భుత సౌందర్యాన్ని సంకీర్తనం చేశారు. యోగీంద్రుల చిత్తపద్మాలలో నిలచి నిత్యం పూజలందుకొనే నీ పాదాలను, ఆర్తత్రాణ పరాయణతో భక్తులకు అభయమిచ్చే నీ దివ్య హస్తాన్ని ఈ తిరుమల గిరులపై నేను దర్శించినానయ్యా! అని ఆచార్యుల వారు భక్త్యానందంలో అంటున్నారు.


అఘములు = పాపములు;
విభవము = వైభవము;
రహి = ఒప్పారిన / అందమైన;
తిరమైన = స్థిరమైన


కంటిమి నేడిదె

కంటిమి నేడిదె గరుడాచలపతి
యింటి వేలుపగు ఈశ్వరుడితడు

శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు
దానవాంతకుడు దయానిధి
నానా మహిమల నమ్మిన వారిని
పూనుక కాచే పోషకుడితడు

దేవాది దేవుడు దినకర తేజుడు
జీవాంతరంగుడు శ్రీ విభుడు
దైవ శిఖామణి తలచిన వారిని
సేవలు గాని కాచే విభుడితడు

పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు
కరుణానిధి బుధకల్పము
పరగు శ్రీ వేంకటపతి తినదాసుల
నరుదుగ కాచే అనంతుడితడు
 

ప్రహ్లాద వరదుడైన చిన్మయమూర్తి శ్రీ నరసింహుడు! గరుడాచలంలో (అహోబలం) కొలువైయున్నాడు. నమ్మిన వారిని కాచేవాడు, దాసులను బ్రోచేవాడు, కరుణానిధియైన అనంత కళ్యాణ గుణగాత్రుడు, దేవాదిదేవుడైన శ్రీ వేంకటపతి అహోబిలంలో నారసింహమూర్తియై సేవలందుకుంటున్నాడు.

రుడాచలపతి = అహోబిలంలో కొలువైన నరసింహుడు; దానవాంతకుడు = రాక్షస సంహారుడు.

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech