కబుర్లు  
     వీక్ పాయింట్ - రచన : ఎం.వి.ఆర్. శాస్త్రి  

అమెరికా అలా... ఇండియా ఇలా!

 

అమెరికాకీ మనకూ ఏమిటి తేడా?

అమెరికాలో టెర్రరిస్టు దాడి జరిగింది. మన మీదా జరిగింది. అక్కడ జంట టవర్లు కుప్ప కూలాయి. మూణ్నెల్లు తిరక్కుండా ఇక్కడ ఏకంగా పార్లమెంటు మీదే ఉగ్రవాదం పంజా విసిరింది.

అలా ఎందుకయిందని అక్కడా ఇక్కడా దర్యాప్తులు నడిచాయి. భద్రతా దళాలకు శ్రుతి లేదు; ఉప్పందినా చప్పున కదిలే పరిస్థితి లేదు; కుడి చెయ్యి ఏమిచేస్తున్నదో ఎడమ చేతికి తెలియడం లేదు... అని అన్ని దర్యాప్తులూ తేల్చాయి.

అసలు సమస్య అర్థమైంది. వాషింగ్టన్ వెంటనే కదిలింది. తేవలసిన చట్టాలు తెచ్చింది. పెట్టాల్సిన వ్యవస్థలు పెట్టింది. చేయాల్సిన బిగింపులు చేసింది. అవతలివారు ఎవరన్నది చూడకుండా సెక్యూరిటీ ఆంక్షలను మహా కర్కశంగా అమలుపరచింది.

ఫలితం: మళ్లీ ఇప్పటిదాకా అమెరికాలో ఇంకో టెర్రరిస్టు దాడి జరగలేదు.

మనకూ అసలు సమస్య ఆనాడే అర్థమైంది. అయినా న్యూఢిల్లీ కదల లేదు. కదులుదామనుకున్నా రాజకీయ లంపటాలు, ఓటు బ్యాంకు అవసరాలు, సూడో సెక్యులర్ మొగమాటాలు, పార్టీ స్వార్థాలు దానిని కదలనివ్వలేదు. కొత్త చట్టాలు తేకపోగా ఉన్న (పోటా) చట్టానే్న గుంటపెట్టి గంట వాయించేదాకా మన మానవతా మూర్తులు నిద్ర పోలేదు.

ఫలితం: ఈ పదేళ్లలో మన దేశం మీద టెర్రరిస్టు దాడులు ఎన్ని జరిగాయో మనకే గుర్తులేదు. ఆఖరికి పాకిస్తానీ మిలిటరీ ఏజంట్లు కరాచీనుంచి మారణాయుధాలతో మహారాజుల్లా వచ్చి ముంబయి మహానగరాన్ని ముట్టడించి, మూడురోజులపాటు మొత్తం దేశాన్ని గడగడలాడించి 164 ప్రాణాలు తీసినా మనలో చలనం లేదు. భద్రతాదళాల చేతకానితనం, సమన్వయరాహిత్యం, ఇంటెలిజెన్సు ఘోరవైఫల్యం గుండెలదిరేలా బట్టబయలైనా ఎవరికీ పట్టదు. ఉగ్రవాద విషనాగులు విజృంభించి తలచిందేతడవుగా ఎందరిని ఎన్ని కాట్లు వేసినా మన పంథా మారదు.

అదీ తేడా!

టెర్రరిజాన్ని అణచాలంటే ఏమి చేయాలి? బీభత్సకారుల కదలికలను కనిపెట్టాలి. వాళ్లు ఏ ఎత్తుమీద ఉన్నారో, ఏ సన్నాహాలు చేస్తున్నారో, ఏ ప్లాన్లు వేస్తున్నారో ముందే పసిగట్టగలగాలి. దేశమంతటా ఉన్న రకరకాల భద్రతా విభాగాల నుంచి అందే వేగులను పరిశీలించి, సకాలంలో స్పందించి, సంబంధిత విభాగాలన్నిటినీ ఎలర్టు చేసేందుకు జాతీయస్థాయిలో ఒక వ్యవస్థ అంటూ ఉండాలి.

అది గ్రహించే అమెరికా ఎనిమిదేళ్ళకింద నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (ఎన్.సి.టి.సి.)ని పకడ్బందీగా ఏర్పాటు చేసింది.

మన ప్రభువులూ ముంబయి ముట్టడిలో మాడు పగిలిన తర్వాత మూడేళ్లు తీరుబడిగా ఆలోచించి, చించి... అలాంటిదొకటి మనమూ పెడితే పోలా అనుకున్నారు. వేరే పేరు వెదుక్కోవటమెందుకు... అమెరికా పెట్టిన పేరునే మనమూ కొట్టేద్దాం అనీ డిసైడయ్యారు. `అదే ఇది' అని జనానికి భ్రమకొలపడానికేమో అమెరికావాళ్ల పేరును మక్కీకి మక్కీ దించేశారు. అసలు విషయం దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఆడాల్సిన ఆటలు వాళ్లు ఆడేశారు. చివరికి - అయ్యవారిని చెయ్యబోతే కోతి అయిన చందాన అంతా కలిసి అతి ముఖ్యమైన భద్రత ఏర్పాటును నానా కంగాళీ చేశారు.

అన్ని విభాగాల పనినీ సమన్వయం చెయ్యటానికి ఉద్దేశించిన ఏజన్సీ మీద వాటిలో ఏ ఒక్క విభాగం వారికీ కంట్రోలు ఉండకూడదు. ఇది కామన్‌సెన్సు పాయింటు. దీన్ని గ్రహించే అమెరికా వాళ్లు కొత్త సెంటరును ఎవరి చెప్పుచేతల్లోనూ ఉంచకుండా దానికంటూ ప్రత్యేకంగా నేషనల్ ఇంటెలిజెన్సు డైరెక్టరేటును ఏర్పాటుచేశారు. దాని బాధ్యతను కొత్తగా ఒక డైరెక్టరుకు అప్పగించి, అది స్వతంత్రంగా పనిచేసేలా జాగ్రత్తపడ్డారు.

మరి మన దగ్గరో?

దేశంలో ఇంటెలిజెన్సు అంతా నానా గత్తర కావడానికి మొదటి ముద్దాయి ఐ.బి. అనబడే ఇంటెలిజెన్సు బ్యూరో. కేంద్ర హోంమంత్రికీ, రాజకీయ బాసులకే తప్ప పార్లమెంటుకు అది జవాబుదారీ కాదు. పాలకుల అవసరాలను, రాజకీయ ప్రయోజనాలను కనిపెట్టి, ఏలికలకు గిట్టని వారి వెంటపడి నానా విధాల సతాయించి, పాలకపక్షం సేవలో తరించడానికే దానికి ఎక్కడి సమయమూ చాలదు. వృత్తి నిబద్ధతతో ఇంటెలిజెన్సును సేకరించి, పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి, తక్షణ నివారణ చర్యలు తీసుకునేంత తీరిక దానికి సాధారణంగా ఉండదు. ఇంటెలిజెన్సు వైఫల్యానికి అసలు సమస్యే ఐ.బి.! పోయి పోయి దాని చేతుల్లోనే కొత్త `సెంటరునూ' పెట్టారంటే మనవాళ్ల తెలివిని ఏమనాలి? అసలు లొసుగే ఐ.బి. దగ్గర ఉన్నప్పుడు... అదే ఐ.బి. అదుపాజ్ఞల్లో పనిచేసే ఎన్.సి.టి.సి. ఆ లొసుగును ఎలా సరిచేయగలదు? కనీసం ఇదీ లొసుగు అని ఎలా బయటపెట్టగలదు?

అంతేకాదు. చట్టబద్ధమైన అధికారాలేవీ లేకుండానే ఐ.బి. వారు ఇప్పటిదాకా కేంద్ర పాలకుల రాజకీయ విరోధులను శతవిధాల ఇబ్బంది పెడుతున్నారు. ఘనత వహించిన సర్కారువారు ఇప్పుడు ఐ.బి. చేతికింద పనిచేయాల్సిన ఖర్మ పట్టిన ఎన్.సి.టి.సి.కి దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎవరినైనా అరెస్టుచేసే, సోదాలు జరిపే అధికారాన్ని కట్టబెట్టదలిచారు. అదీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా మాటమాత్రమైనా చెప్పాల్సిన అవసరమే లేకుండా!

అమెరికాలో ఎన్.సి.టి.సి.కి ఇంటెలిజెన్సు సేకరణ, విశే్లషణ, మదింపు బాధ్యతే తప్ప నేరుగా ఎవరినీ అరెస్టుచేసే అధికారం లేదు. అరెస్టులూ, సోదాలూ అవసరమైతే అక్కడ ఎఫ్.బి.ఐ. చూసుకుంటుంది. అలాంటి పనులు చేయటానికి మన దేశంలో కేంద్ర స్థాయిలో ఇప్పటికే సిబిఐ ఉంది. దానికి తోడు నేషనల్ ఇనె్వస్టిగేటివ్ ఏజన్సీ (ఎన్.ఐ.ఎ.)నీ కొత్తగా పెట్టారు. ఇక రాష్టస్థ్రాయిలో పోలీసు డిపార్టుమెంట్లూ ఉన్నాయి. సరైన సమాచారం సకాలంలో అందించి, సరైన పద్ధతిలో ముందుకు ఉరికించాలేగానీ నేరగాళ్ల అదుపునకు, నేరాల నిరోధానికి ఇప్పుడున్న ఏర్పాట్లే చాలు. వీటికి ఉపరి సరికొత్త ఎన్.సి.టి.సి. చేతికీ సంకెళ్లు ఇచ్చి ఎవరినిపడితే వారిని ఎక్కడపడితే అక్కడ అరెస్టు చేసెయ్యమంటే గందరగోళం ఇంకా పెరగదా? అధికార దుర్వినియోగం మరీ బరితెగించదా? శాంతిభద్రతలు రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే మాయలమారి చిదంబరం తీరికూచుని అతి రహస్యంగా పథకం రచించి ఈ మార్చి 1 నుంచే అలవిమాలిన అధికారాల ఎన్సీటీసీకి జండా ఊపేస్తున్నామంటే రాష్ట్రాలకు ఒళ్లు మండదా? ఇది రాష్ట్రాల హక్కులు హరించి, తమను సతాయంచేందుకేనని నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మండిపడ్డారంటే పడరా? వివాదం అవసరమే లేనిచోట తగవులు తెచ్చిపెట్టటమే యుపిఎ సర్కారు ప్రత్యేకతా? 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech