సారస్వతం  

     వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 3

పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

 

అధ్యాత్మయాత్రికులకు దారిదీపం

శ్రీ మహాభాగవతం లోని పంచమస్కంధం

ఆంధ్ర జాతీయమహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్యులవారు విరచించిన పరమపవిత్రమైన శ్రీమహాభాగవతంలో బొప్పన గంగనామాత్యుడు పరిపూర్ణించిన పంచమ స్కంధంలో మహాపురాణ దశలక్షణాలలో ఒకటయిన "స్థితి" లేదా "స్థానము" అనే అంశం వర్ణితమయిందని పెద్దలంటారు. స్థితి ర్వైకుంఠవిజయః అని భాగవతం అంటున్నది. అంటే, లోకంలోని దుష్టశక్తులపై భగవంతుని యొక్క విజయమని అర్థం. ఆ భగవంతుని సృష్టిలో మహదాదితత్త్వాల విలసనకు, ఆ తత్త్వగతుడైన జీవుని ఉనికికి స్థితిఅని పేరు. జీవుని స్థితి లేదా స్థానమునకు నిమిత్తమైన భగవంతుని లీల ఈ స్కంధంలో నోరారా వివరింపబడింది.   

       క.      "లోకద్రోహినరేంద్రా

                నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా

                వైకుంఠనాథు విజయం

                బాకల్పస్థాన మయ్యె నరేంద్రా!"   (2-261)

అని ద్వితీయ స్కంధంలో శుకయోగి పరీక్షిత్తుకు దీనిని నిర్వచించాడు.

షట్చక్రోపాసన : విరాట్పురుషతత్త్వం

అద్వితీయమైన బ్రహ్మపదార్థంపైని చిత్తాన్ని నిలిపేందుకు ఉద్దేశించిన ఈ పంచమ స్కంధానికి ఉపాసకుల మతంలో ధారణా స్కంధము అనికూడా పేరున్నది. ధారణ అంటే చిత్తవృత్తిని అదుపులోకి తెచ్చుకొని, ధ్యేయవస్తువుపై ఒకేచోట నిలిపి ఉంచటమని అర్థం. మూలాధారంలో దాగివున్న కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే ప్రక్రియలో శరీరంలోని వివిధచక్రాలకు ఆధారనిలయాలైన మూలము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్రము - ఇత్యాదులలో కాని, బాహ్యములైన విష్ణురూపాలపైని కాని మనస్సును ఏకాగ్రంగా తదాకారవృత్తితో నిలకడగా ఉంచే యోగవిశేషం ఇందులో ఉపదేశింపబడింది. అందువల్ల భగవానుడైన విరాట్పురుషుని స్థూలదేహము యొక్క భౌతికవర్ణన, భూగోళ వర్ణన, ఖగోళ వర్ణన, పాతాళలోక వర్ణన ఈ స్కంధంలో ఎంతో విపులంగా ఉన్నాయి. జీవన్ముక్తివివేకాన్ని కోరి షట్చక్రోపాసన కావించే యోగసాధకులు ఈ లోకాలను ధ్యానధారణలో నిలుపుకొని, విరాట్పురుషతత్త్వావధారణ మూలాన కేవలానుభవానందస్వరూపమైన బ్రహ్మవస్తువును దర్శించాలని దీని తాత్పర్యం.

జీవుల కర్మఫలవిచారం

పంచమ స్కంధంలో భువనకోశవర్ణన అతివిపులంగా ఉన్నది. ఈ భువనకోశంలో వెలసిన వివిధలోకాలలో సమస్త చరాచరజీవకోటీ నెలకొని ఉన్నది. ఆ జీవకోటి తమతమ ఏయే కర్మఫలంగా ఎటువంటి జీవితం అనుభవింపవలసి ఉంటుందో మనము ఈ స్కంధాన్ని చదివి తెలుసుకోవచ్చు. పూర్వకర్మమనేదొకటి ఉన్నదని, జీవులు పూర్వపు జన్మలలో చేసుకొన్న పుణ్యపాపకర్మలనుబట్టి వారివారికి ఆయా సుఖదుఃఖాలు యథాయథంగా నిర్దిష్టసమయాలలో కలుగుతుంటాయని శుకయోగి పలుసందర్భాలలో పరీక్షిత్తుకు చెప్పాడు. ఫలానుభవాన్ని గోచరింపజేసేది ఆ మునుపు చేసిన కర్మమేనని, ప్రకృతిబద్ధులు రాగద్వేషాలను అదుపులో ఉంచుకొనకపోతే ముప్పు తప్పదని వివరించాడు. అందువల్ల ఈ స్కంధంలో జీవులాచరించే దుష్కర్మలకు ఫలితమైన నరకలోకాల వర్ణన అతివిపులంగా చేయబడింది. అది చదివినవారు తామంతకు మునుపు చేసిన చెడుపనులకు పశ్చాత్తాపాన్ని పొంది, పాపవర్తనను మాని, భక్తిభావాన్ని అలవరచుకొని సాధుస్వభావులు కావడానికి ఈ వర్ణనమంతా ఉపకరిస్తుంది.

సంస్కృతంలో ఈ పంచమ స్కంధం ఇరవై ఆరు అధ్యాయాల సంక్షేపరచన. అందులో ఉన్న 666 శ్లోకాలు, గద్యాలలో శ్లోకాలకంటె గద్యభాగమే ఎక్కువ. తెలుగులో ఈ మొత్తం రెండు ఆశ్వాసాలుగా 352 గద్యపద్యాలలో ఇమిడిపోయింది.

జీవులకు వివిధవృత్తుల కల్పన

దుష్టశక్తులపై శ్రీ భగవానుని విజయాఖ్యమైన "స్థితి"ని వర్ణించిన తర్వాత శుకయోగి పరీక్షిత్తుకు "వృత్తి"ని వివరించి చెప్పాడు. ఈ వృత్తి యొక్క నిర్వచనం సంస్కృత భాగవతం పన్నెండవ స్కంధంలో

        వృత్తి ర్భూతాని భూతానాం చరాణా మచరాణి చ

కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపి చ. (12. 7. 13)

అని కనుపిస్తుంది. సర్గ విసర్గాలతో ఈ సృష్టిలో వెలసిన చరాచరజీవులూ సంతోషంగా జీవించేందుకు గాను వాటివాటికి అనువైన వృత్తులను కల్పించటం - అని ఈ మాట అర్థం. ఆ వృత్తులలో ఉన్నవారు స్వభావప్రేరణ వల్ల ఆచరించే వివిధశుభాశుభకర్మముల యొక్క ఫలితవిచారం - ముఖ్యంగా అశుభకర్మముల యొక్క విపరీతపరిణామాల విపులమైన చర్చ ఈ స్కంధంలో చేయబడింది.

పురాణరచనాశిల్పం

కథాప్రసక్తనీయాలైన అంశాలను సాంగోపాంగంగా నిర్వర్ణించటమే గాక, ప్రధానమైన ఇతివృత్తానికి ఎటువంటి ప్రత్యక్షసంబంధం లేని అనేక గౌణవిషయాలను వర్ణించటం కూడా మహర్షిప్రోక్తములైన పురాణముల రచనాశిల్పంలో ఒక భాగం. అయితే ఆ విషయాలన్నీ ఎటువంటి పూర్వోత్తరాన్వయమూ లేని నిరాధార రచనలు కావు. భగవదవతారం ఏయే కాలాలలో జరిగిందో - ఆయా కాలాలలోని భగవదంశసంభూతులైన రాజుల వంశాలను సగౌరవంగా వర్ణించటం కూడా వేదవ్యాసమహర్షి పురాణరచనాశిల్పంలో భాగమే. అందువల్ల ఈ స్కంధంలో ముమ్మొదట స్వాయంభువ మనువు కాలం నుంచి ఆ యుగసంధికాలం వరకు భూమండలాన్ని పరిపాలించిన అనేకమంది రాజుల పుణ్యచరిత్రలను పేర్కొనటం జరిగింది. నాలుగవ స్కంధంలో స్వాయంభువుని పెద్దకొడుకైన ఉత్తానపాదుని మొదలుకొని, ప్రాచీనబర్హి కాలం దాకా వెలసిన రాజుల కథలను గురించి వివరించిన తర్వాత ఈ ఐదవ స్కంధంలో మనువు రెండవ కొడుకైన ప్రియవ్రతుని వంశక్రమం చెప్పబడింది.

ప్రియవ్రతుడు

ప్రియవ్రతుడు అన్నగారి వలెనే ధర్మమార్గరతుడై మనువంశరాజులకు ఆదర్శంగా రాజ్యపాలన కావిస్తాడు. పుట్టుకతోనే ఆయనకు మహాపురుషలక్షణమైన శమదమాదిసద్గుణసంపత్తి చేకూరుతుంది.  జన్మాంతరసంస్కారం వల్ల వైరాగ్యోదయం కలిగి, నారదమహర్షి వంటి మహాత్ముని ఉపదేశభాగ్యం లభిస్తుంది. నివృత్తిమార్గం లోకి ప్రవేశించినా, రాజధర్మగతుడై ఉంటూనే సంసారబంధాలకు అతీతంగా వర్తించటం నేర్చుకొంటాడు. భువనకోశానికి కేంద్రబిందువుగా ఉన్న జంబూద్వీపాన్ని, దాని చుట్టూ ఇతరద్వీపాలను, సముద్రాలను ఉపకల్పించి, భూతలంలో అనేకానేక నదీపర్వతాలను నెలకొల్పిన పుణ్యాత్మునిగా అతనికి ప్రసిద్ధి కలుగుతుంది. ఒకప్పుడు సూర్యుడు ఆకాశమార్గాన సంచరిస్తున్నపుడు ప్రియవ్రతుడు సూర్యరథాన్ని అనుసరించి తన రథాన్ని నడిపించాడట. అతని రథచక్రాల ఒరపిడి వల్ల నేల చీలి, సముద్రాలు ఏర్పడినట్లు ఈ కథ మనకు చెబుతున్నది. ఆ ద్వీపాలు, సముద్రాలను గురించిన విపులమైన వర్ణనం ఈ భాగంలో వస్తుంది.

ప్రియవ్రతుని వంశం

ప్రియవ్రతుని కొడుకు అగ్నీధ్రుడు - ధర్మసమ్మతంగా, సకల ప్రజానురంజకంగా రాజ్యపాలన చేసినవాడు - చివరికి ఒక అప్సరస సౌందర్యానికి ముగ్ధుడై, ఆమె యందు నాభి అనే మహనీయుణ్ణి సుతునిగా పొందుతాడు. నాభి కాలంలో వైదికకర్మలు నిర్నిరోధంగా కొనసాగుతాయి. భగవదవతారం ఎటువంటి పుణ్యధనుల ఇండ్లలో సంభవిస్తుందో చెప్పటానికి ఈ ఉపక్రమణిక అంతా ఉపకరించింది.

శ్రీ ఋషభావతారం

నాభిరాజు ఒకప్పుడు వేదోక్తప్రకారం ఒక మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞవేదికపై శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించి, స్వయంగా తాను నాభి యింట జన్మింపగలనని వరాన్ని ప్రసాదించి, తన వాగ్దానం ప్రకారం వారింట ఋషభుడనే పేరిట ఉదయించి, రాజర్షితల్లజు డయ్యాడు. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూనే మానవులు పరమహంసపదాన్ని చేపట్టవచ్చునని శ్రీ ఋషభావతారం లోకానికి వెల్లడిచేసింది.

నవయోగుల కథ

ఋషభుని కొడుకులలో తొమ్మిదిమంది నవయోగులని ప్రఖ్యాతి గడించి అధ్యాత్మవిద్యాసంపన్నులయ్యారు. వారిలో పెద్దవాడి పేరు కవి కావటం వల్ల వారికి నవకవులని కూడా ప్రసిద్ధి ఏర్పడింది. కంటికి కనుపిస్తున్న ఈ సమస్తభూతసృష్టి ఏ విధంగా ఏర్పడింది? భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా? అని సందేహించేవారికోసం వారు లోకసంచారం చేసి,  స్థూల సూక్ష్మాత్మకమైన చరాచరవిశ్వమంతా భగవద్రూపమే అని, భగవదన్యమైన వస్తువు వేరొకటి లేదని - ఒక్కొక్కరూ ఒక్కొక్క విధమైన ప్రమాణాన్ని చూపిస్తూ ప్రచారం చేశారు. ఏకాదశ స్కంధంలో మనకు వారి అమోఘమైన దర్శనసారం పరిచయ మవుతుంది.

ఋషభుని కొడుకులలో తక్కినవారందరూ బ్రహ్మనిష్ఠులై బ్రాహ్మణులయ్యారు. ఋషభుడు సలక్షణంగా రాజధర్మాన్ని నిర్వహించి, పరమార్థవిదుడై అంత్యకాలంలో పరమహంస జీవితం గడిపాడు. ధర్మతత్పరు లైనవారు ఆయన జీవితోదంతాన్ని, బోధనల సారాన్ని ఈ స్కంధంలో తప్పక తెలుసుకోవాలి.

జైన మతస్థులు కూడా తమ అధ్యాత్మగురువులైన తీర్థంకరులలో ఒకరిగా ఈ ఋషభాచార్యులను పరిగణించటం విశేషం. భారతీయధర్మంలో వెలసిన వివిధ మతాల తులనాత్మకపరిశీలన కావించేవారు వీరిరువురి బోధనలను తప్పక అధ్యయనం చెయ్యాలి.

జడభరతుని కథ : భక్తితత్త్వం

ఋషభదేవుని సుతు లందరిలో అతని తర్వాత రాజ్యానికి వచ్చిన భరతుడు సుప్రసిద్ధుడు. ప్రజానురంజకుడైన ఆ రాజు పేరుమీదుగా అప్పటి వరకు అజనాభవర్షమని పిలువబడుతున్న భూమిభాగానికి భారతవర్షమని సరికొత్తగా వ్యవహారం ఏర్పడింది. సార్వభౌముడై దేశాన్ని ఒక్క గొడుగు క్రింద పరిపాలించి, ముసలితనం వచ్చాక అతను రాజధర్మానుసారం వానప్రస్థాన్ని స్వీకరించాడు. మనోలయానికి అడ్డునిలిచే బంధహేతువులైన సర్వసంగాలను త్యజించి, తపోదీక్షను గైకొన్న ఆ మహానుభావుడు అంత్యకాలం సమీపించిన చివరి రోజులలో కర్మవశాన మళ్ళీ బంధాలలో చిక్కుకొని, ఒక జింకపిల్ల పైని మమకారం పెట్టుకుని, అదే ప్రాణంగా జీవిస్తూ, ఆ బంధం వల్ల ఉత్తరజన్మలో హరిణమై పుట్టాడు. ఆ విధంగా జననమరణాల చక్రభ్రమణంలో కొట్టుమిట్టుకులాడి, కొంతకాలానికి మళ్ళీ మనుష్యజన్మను పొందిన తర్వాత - కర్మలన్నీ ఫలకారణాలేనని గ్రహించి, కర్మారంభాన్ని కూడా విడిచిపెట్టి, నిష్కామ జడత్వాన్ని అవలంబించి, జడభరతుడని పేరుపొందాడు.

ఒకనాడు తన ప్రాంతానికి వచ్చిన రహూగణుడనే రాజుకు భరతుడు పరమార్థసారాన్ని, జీవేశ్వరుల తత్త్వాన్ని వివరించటం ఈ స్కంధంలో పరమగంభీరంగా అమరింది.

ఈ జడభరతోపాఖ్యానం పంచమ స్కంధంలోని ముఖ్యఘట్టాలలో ఒకటి. ఇందులోని ప్రతీకలను శంకర - మధ్వ - రామానుజుల అద్వైత - ద్వైత - విశిష్టాద్వైత దర్శనాల సారాన్ని అనుసరించి వ్యాఖ్యాతలు వివిధరీతుల విపులంగా వివరించారు. ఆ వివరణకు వారు ప్రమాణీకరించిన ఉపనిషద్వాక్యావళిని పాఠకులు శ్రద్ధాసక్తులతో సమన్వయించుకొని, నిత్యానుసంధానంలో మననం చేయవలసి ఉంటుంది. అదీగాక ఆ వ్యాఖ్యలను బట్టి పాఠకులకు శ్రీమద్భాగవతాన్ని సాధకులు ఎన్ని విధాలుగా దర్శింపవచ్చునో తెలుసుకొనే అవకాశం ఉంటుంది. అతిగహనమైన వేదాంతసారాన్ని బోధిస్తూ అద్భుతమైన సంవిధానశిల్పంతో ఎంతో ఆకర్షణీయంగా రచింపబడిన ఖండం ఇది.

భువనకోశ వర్ణనం

మనువంశ రాజుల కథాకథనం తర్వాత ప్రధానంగా భూగోళ స్వరూపవర్ణన ఉన్నది. ఆధునికవిజ్ఞానశాస్త్రంతో పరిచయం ఉన్న పాఠకులకు ఇందులోని భూగోళ ఖగోళ విజ్ఞానాల స్వరూపమంతా శాస్త్రదృష్టి లోపించిన కట్టుకథే కాని కంటికి కనిపించే భౌతికసత్యం కాదన్న అపార్థం కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రసక్తమైనది కేవలం ఐహికదృష్టితో కావించిన వర్ణన కాదని మనము గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని గ్రహించినవాడు కనుకనే పరీక్షిత్తు ఈ సన్నివేశంలో -

"గుణమయంబును, స్థూలరూపంబును నైన శ్రీహరి శరీరం బగు నీ లోకంబునందు నిలిపిన చిత్తం బగుణం బగు; సూక్ష్మంబును, నాత్మజ్యోతియు, బ్రహ్మంబు నైన వాసుదేవుని యందు నిల్చు."                                                                                               (5. 2. 14)

అని శుకయోగితో అంటాడు. సత్త్వరజస్తమస్సులతో కూడిన ఈ సమస్తవిశ్వం ఆ విశ్వాత్ముని యొక్క స్థూలరూపమని భావించి, ఆ స్థూలరూపంలో గోచరిస్తున్న అద్భుతావహమైన సౌందర్యాన్ని, మహిమను ధ్యానంలో ధారణ చేసినట్లయితే, శ్రీ వాసుదేవుని సర్వాంతర్యామితను స్వానుభవంలో అర్థం చేసికొని, ఆ పరమేశ్వరుని సూక్ష్మతత్త్వాన్ని దర్శించటం సాధ్యమవుతుంది. సకలలోకోత్తరుడని మనము భావిస్తున్న ఆ భగవానుని ఉనికి కల్పితమాత్రం కాదని; కేవలసత్యమని తెలియజెప్పడమే ఈ సన్నివేశ వర్ణనలోని అంతరార్థం.  నిర్గుణమైన ఆత్మతత్త్వాన్ని తంత్రమార్గంలో తెలుసుకొనగోరినవారు ప్రాథమికదశలో యంత్రాలకిచ్చే ప్రాధాన్యం ఎటువంటిదో, భువనకోశవర్ణనలో భూగోళస్వరూపానికి ఉన్న ప్రాధాన్యం కూడా అంతే. ఇదంతా ధ్యానానికి కూర్చున్న సాధకుల కోసం.

సాధనరహస్యం

భగవత్తత్త్వరహస్యాన్ని తెలుసుకోవటం అంత సులభం కాదు. ఎక్కడో ఏదో చదివినంత మాత్రాననో, ఎవరో ఏదో చెబితేనో అది బోధపడదు. అందుకే దానిని కేవలానుభవానందస్వరూపం అన్నారు. ఈశ్వరుని శక్తివిలాసం ఎంత ఇంద్రియాతీతమో అంత ఇంద్రియానుభవయోగ్యం. గురువు యొక్క సదుపదేశాన్ని పొంది, సాధన మొదలుపెట్టి, ఈ భువనాల స్వరూపాన్ని ధ్యానిస్తుంటే క్రమంగా ఈశ్వరుని దివ్యశక్తి మానవమనోమందిరంలోకి ప్రవేశిస్తుందని శ్రీమద్భాగవతం బోధిస్తున్నది. విశ్వరూపాన్ని గ్రహించి అటువంటి దివ్యానుభవాన్ని సాధించిన సాధకులే సిద్ధులు. ఆ సిద్ధి సాధనకోసమే భాగవతాన్ని శుకయోగి పరీక్షిత్తుకు వినిపించాడు.

ద్వీపాలు, సముద్రాలు

ఈ పంచమ స్కంధమంతా భగవంతుని స్థూలరూపాన్ని ధ్యానమార్గంలో దర్శించి, స్వప్రకాశానందమయమైన ఆయన సూక్ష్మరూపాన్ని స్వానుభవంలో తెలుసుకొనగోరిన సాధకుల మననధారణ కోసమే తప్ప కేవలం భూగోళ ఖగోళ విజ్ఞానాలను సమీకరించాలనే ఐహికదృష్టి శుకయోగికి లేదు. ఈ విధమైన ధ్యానధారణ వల్ల శుద్ధము, బుద్ధము, ముక్తము, కేవలము, అఖండము, సచ్చిదానందస్వరూపము అయిన భగవత్తత్త్వాన్ని గ్రహించినవారికి - స్థూలరూపం నుంచి సూక్ష్మరూపంలోకి ప్రవేశింపజేసే  ఆ సాధనరహస్యం అర్థమవుతుందని భావం.

నరకలోకాల వర్ణన

పంచమ స్కంధం చివర వివిధ నరకలోకాల వర్ణనం ఉన్నది. నరకము అంటే నృ = మానవులయొక్క, అక = పాపముల ఫలితాన్ని అనుభవించటానికి విధింపబడిన లోకమన్నమాట. ఆ నరకములు అనేకప్రకారాలుగా ఉంటాయి. ఆ లోకాలన్నీ యాతనాభూములు. అక్కడ కేవలం జీవుల యొక్క పాపాలకు శిక్ష విధించటం ఒక్కటే ఉద్దేశం కాదు. లోకంలో ప్రతిషిద్ధలక్షణమైన అధర్మాన్ని కావించేవారి శ్రద్ధావైసాదృశ్యం బహురీతులుగా ఉన్నట్లే, వారికి కలిగే కర్మఫలాలు కూడా బహురీతులుగా ఉంటాయి. అనాదిసిద్ధమైన అవిద్య వలన కామనలు చెలరేగి పాపకర్మలను చేయించినప్పుడు, అందుకు పరిణామంగా సిద్ధించే ఫలాలను అనుభవించటం వల్ల జీవునికి మళ్ళీ చిత్తపరిశుద్ధి, నైర్మల్యం కలుగుతాయి. అందుచేతనే ఆనాటి పౌరాణికులు యాతనానుభవంలో మనస్సును పశ్చాత్తాపతప్తం కావించి, ఆ పాపసంకల్పాలు మళ్ళీ తలయెత్తకుండా ప్రక్షాళింపగల మహాశక్తి ఉన్నదని నిశ్చయించారు. ఆ విధంగా దుష్కర్మఫలాన్ని అనుభవించిన జీవునికి మళ్ళీ సన్మార్గంలోకి ప్రవేశించి, ఆత్మౌన్నత్యాన్ని సాధించేందుకు మరొక అవకాశం లభిస్తుంది. అందుచేత దోషకర్మకు ప్రాయశ్చిత్తంగా కష్టాలను విధించటం జరిగింది.

కష్టాలలో ఉన్నప్పుడు మనిషి మనస్సు పశ్చాత్తాపతప్తమై పరిశుద్ధ మవుతుంది. కష్టాలే మనిషిని మహాత్మునిగా పవిత్రీకరిస్తాయని భావం.

ఆంధ్రీకరణ విషయం

       ఈ పంచమ స్కంధాన్ని సుజనమనోహరంగా ఆంధ్రీకరించి, చరిత్రలో పోతన్న గారి సహపంక్తికి నోచుకొన్న  మహాకవి

బొప్పరాజు గంగనార్యుడు

నిజంగా ధన్యజీవి. శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి, ఆ స్వామి వైభవప్రకాశనకు తన కవితను పరికరింపజేసి, తాను తరించి, తెలుగు జాతిని తరింపజేసిన పుణ్యధను డాయన. ఈ కథాకథనముఖాన శృంగార వైరాగ్యాలకు ఆలవాలమైన మనువంశ రాజపురుషుల యొక్క జీవితసందేశబోధకు, విరాట్పురుషుడు కల్పించిన ఈ భువనకోశవర్ణనకు, పాపులకు గమ్యస్థానాలయిన నరకలోకాల వర్ణనకు అవకాశం లభించి భగవన్మహిమను, భగవల్లీలలను నోరారా వర్ణించి తన శిక్షణను, కారయిత్రీశక్తిని సార్థకం చేసుకొన్నాడు.

జీవిత విశేషాలు

తెలుగు కవులందరి వలెనే గంగనార్యుని జీవితవిశేషాలేవీ చరిత్ర కెక్కలేదు. స్కంధాంతగద్యలలో "ఇది శ్రీసకలసుకవిజనానందకర బొప్పనామాత్యపుత్త్ర గంగనార్యప్రణీతం బైన శ్రీమద్భాగవతమహాపురాణంబునందు" అని చెప్పుకొన్నదానిని బట్టి నియోగి బ్రాహ్మణుడని, బొప్పనామాత్యుల వారి తనయుడని మాత్రమే తెలుస్తున్నది. ఈయన నిజాము రాష్ట్రవాసి అని ఆంధ్రకవితరంగిణిలో చాగంటి శేషయ్యగారు ఊహించారు.

గంగన అన్నపేరు తెలంగాణంలోని నేటి ధర్మపురి చెంత పోతన్నగారికి శ్రీరామచంద్రప్రభువు సాక్షాత్కారం సిద్ధించి, శ్రీమహాభాగవతావరణకు కారణతీర్థమైన పుణ్యగంగనే సూచిస్తున్నదనీ, గంగనార్యుడు ఆ సమీపప్రాంతవాసి అనీ పెద్దలంటారు. బమ్మెర పోతనామాత్యులవారు దత్తమండలంలోని ఒంటిమిట్టకు చెందినవారని విశ్వసించిన విమర్శకులెవరూ ఈయన ప్రాంతీయతను గురించి చర్చింపలేదు.  అంతమాత్రాన ఈ వివాదం సుపరిష్కృతమైనట్లు భావించటం సరికాదు. ఉభయవాదాలను ఇంకా సమీకరించి, నిజాన్ని నిగ్గుతేల్చవలసి ఉన్నది.  

కాలనిర్ణయానికి ఆధారాలు

       ఇంతవఱకు సాహిత్య చరిత్రకారులు గంగనార్యుని కాలాదికం నిర్ణయించేందుకు సాధనాలేవీ చూపలేదు. వెలిగందల నారయకు తర్వాతి వాడని కొందఱు, ఏర్చూరి సింగనకు సమకాలికుడని కొందఱు భావిస్తున్నారు.

అయితే, వారెవరూ గుర్తింపని సాహిత్యికవిశేషం ఒకటున్నది. ఆ విశేషాన్ని వివరిస్తాను:

గంగనార్యుడు : హరిభట్టు

గంగనార్యునికి అత్యంత సమీపకాలికుడైన మహాకవి హరిభట్టు రచించిన మత్స్యపురాణంలో మన గంగనార్యుని పంచమ స్కంధ పద్యాన్ని పోలిన రచన ఒకటి కనుపిస్తుంది. మత్స్యపురాణం 1912లోనే అచ్చయినప్పటికీ అంత ప్రసిద్ధికి రానందువల్ల ఈ విషయం చరిత్రకారుల దృష్టికి రాలేదు. మత్స్యపురాణ - పంచమ స్కంధాలలోని ఆ పద్యాలు రెండింటినీ సరిపోల్చి, ఎవరు ఎవరికి అనుకర్తలో నిశ్చయింపగలిగితే ఈ చిక్కుముడి వీడుతుందని నా భావం.

ఆ రెండు పద్యాలనూ చూడండి -    

సీ.     గ్రైవేయకంకణాంగదహారకుండల

ప్రభ లలితస్ఫూర్తిఁ బరిఢవిల్ల

 నవరత్నకీలితోన్నతకిరీటద్యుతు

లాశావకాశంబు లలమికొనఁగఁ

గటివిలంబితహేమకాంచీవిలగ్న మై

రాజితపీతాంబరంబు మెఱయ

శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్త మై

తులసికాదామంబు తొంగలింప

తే.     నతిరయంబున గరుడవాహనసమేతుఁ

డగుచు విష్ణుండు శంఖచక్రాది విశ్రు

        తాయుధంబుల ధరియించి యవనిపతికి

దక్షణంబున నచట బ్రత్యక్ష మయ్యె.

- హరిభట్టు మత్స్యపురాణము (4-140)

 ఇది హరిభట్టు మత్స్యపురాణంలోని పద్యం. ఇక పంచమ స్కంధంలో గంగనార్యుని పద్యాన్ని చూడండి:

సీ.    అంత నావిష్కృతకాంతచతుర్భుజం

 బులును, బీతాంబరంబును వెలుంగ

శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు

లురమందు రమ్యమై యిరవుపడఁగ

శంఖచక్రగదాంబుజాతఖడ్గాది ది

వ్యాయుధంబులు సేతులందు మెఱయ

నతులితనవరత్నహాటకాంకితనూత్న

ఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ

తే.    గర్ణకుండలకటిసూత్రకనకరత్న

 హారకేయూరవరనూపురాదిభూష

ణముల భూషితుం డైన శ్రీనాయకుండు

దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె.

-      గంగనార్యుని పంచమ స్కంధమ (1-43)

అని. హరిభట్టు పద్యంలోని నవరత్నకిరీటోన్నతద్యుతు లాశావకాశంబు  లలమికొనఁగ అన్న పాదం గంగనార్యుని పంచమ స్కంధం లోని అతులితనవరత్నహాటకాంకితనూత్నఘనకిరీటద్యుతుల్ కడలుకొనఁగఅన్నదానికే పర్యాయం. హరిభట్టు పద్యంలోని శ్రీవత్సకౌస్తుభశ్రీరమాయుక్తమై తులసికాదామంబు తొంగలింప అన్న పాదం పంచమ స్కంధం లోని శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై ఇరవు పడఁగ అన్నదానికి పూర్తిగా సమానం.  హరిభట్టు పద్యంలోని విష్ణుండు శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి యవనిపతికి దక్షణంబున నచటఁ బ్రత్యక్ష మయ్యె అన్న పాదం పంచమ స్కంధం లోని కర్ణకుండల కటిసూత్ర కనకరత్నహారకేయూరవరనూపురాదిభూషణముల భూషితుం డైన శ్రీనాయకుండు దంపతుల కప్పు డెదురఁ బ్రత్యక్ష మయ్యె అన్న పరిసమాపక వాక్యానికి ప్రతిబింబన్యాయంగా సరిపోలి ఉన్నది. శంఖచక్రాదివిశ్రుతాయుధంబుల ధరియించి అన్న దళం కూడా   శంఖచక్రగదాంబుజాతఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెఱయ అన్న పంచమ స్కంధ పద్యపాదంలోనిదే. గంగనార్యుడు, హరిభట్టు రచించిన ఈ రెండు పద్యాలూ ఒకదానికొకటి ప్రతిబింబాలన్న విషయం వేరే చెప్పనక్కరలేదు. 

గంగనార్యుని పద్యానికి మూలమైన సంస్కృత భాగవతంలో నాభి మహారాజు చేసిన యజ్ఞంలో వేదికపై శ్రీమహావిష్ణువు అవతరించినప్పటి వర్ణన ఆ సందర్భంలో ఈ విధంగా ఉన్నది:

వ. అథ హ త మావిష్కృతభుజయుగలద్వయం హిరణ్మయం పురుషవిశేషం కటికౌశేయాంబరధర మురసి విలసచ్ఛ్రీవత్సలలామం దరవరవనరుహవనమాలా చ్ఛూర్యమృతమణిగదాదిభి రుపలక్షితం స్ఫుటకిరణప్రవరమణిమయమకుటకుండలకటకకటిసూత్రహార కేయూరనూపురాద్యంగభూషణవిభూషితం..." (అధ్యా.3;శ్లో.3)          

అని. మూలంలోని ఆవిష్కృతభుజయుగలద్వయం అన్నదే తెలుగు అనువాదంలో ఆవిష్కృతకాంతచతుర్భుజంబులు అయింది. తక్కిన దళాలన్నీ సంస్కృతమూలాన్ని యథాతథంగా ఆవిష్కరిస్తున్నాయి. సంస్కృతాంధ్రాలు రెండింటిని సరిపోల్చితే గంగనార్యుని పద్యం భాగవత మూలానికి యథాతథానువాదమని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మత్స్యపురాణంలో ఈ ఘట్టంలోని వర్ణన హరిభట్టు పద్యానికి మూలమని ఊహించేందుకు ఏ మాత్రం వీలులేకుండా ఉన్నది. అందువల్ల హరిభట్టు పద్యమే గంగనార్యుని పద్యానికి అనుసరణమని, మత్స్యపురాణ రచనాసమయంలో హరిభట్టు ముందు భాగవత పంచమ స్కంధ పద్యమే నిలిచి ఉన్నదని,  గంగనార్యుని పద్యం హరిభట్టు పద్యానికి అనుకరణం కాదని, మనము నిశ్చయింపవచ్చును. హరిభట్టు గంగనార్యుని పై పద్యాన్ని అనుకరింప లేదని; భాగవతమూలాన్ని చదివినందువల్ల అందులో తనకు నచ్చిన ఒక భాగాన్ని స్వతంత్రంగా అనుసరించాడని వాదించేందుకు వీలులేకుండా ఉభయపద్యాల సంవాదశిల్పమే సాక్ష్యం ఇస్తున్నది.  ఈ సాక్ష్యాన్ని బట్టి గంగనార్యుని కాలనిర్ణయం సాధ్యమవుతున్నది.

హరిభట్టు మత్స్యపురాణం అనువాదం క్రీ.శ. 1525 నాటిదని, అంతకు మునుపు క్రీ.శ. 1500 నాటికే ఆయన మొదట భాగవతం లోని ఏకాదశ - ద్వాదశ స్కంధాలను; ఆ తర్వాత క్రీ.శ. 1520 ప్రాంతాల భాగవత షష్ఠ స్కంధాన్ని పూర్తిచేశాడని విమర్శకులు భావిస్తున్నారు. గంగనార్యుని పంచమ స్కంధం క్రీ.శ. 1500 నాటికి పూర్వమే వెలసి ఉన్నందువల్ల దానిని చదువుకొన్న హరిభట్టు తన అనువాదానికి పంచమ స్కంధాన్ని చేపట్టలేదని భావించటం సమంజసంగా ఉంటుంది. కనుక గంగనార్యుని కాలం హరిభట్టు ఏకాదశ స్కంధానువాదానికి కనీసం అయిదు లేదా పదేండ్ల మునుపు - అంటే, క్రీ.శ. 1490 నాటికి పూర్వం అవుతుంది. ఆ ప్రకారం బొప్పరాజు గంగనార్యుడే బమ్మెర పోతన గారికి అత్యంత సమీపకాలికుడు, సన్నిహితుడు అని స్పష్టపడుతున్నది.

 పోతన గారి శ్రీమహాభాగవతం క్రీ.శ. 1480 నాటికి పాక్షికంగానైనా ఉత్సన్నమైపోయింది. 5, 6, 11, 12 స్కంధాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గంగనార్యునికి ఆ విషయం తెలిసి, పోతన గారి పంచమ స్కంధం ప్రతులు లోకంలో లేవని నిశ్చయించుకొన్నాకనే తన అనువాదయజ్ఞానికి ఉపక్రమించి ఉంటాడు. అందువల్ల పుణ్యగంగకు సమీపప్రాంతవాసి అని మనము భావించినది తర్కసహమే అవుతుంది. పోతన గారి అనువాదం కొంత పంచమ స్కంధంలో ఉన్నదని, గంగనార్యుడు కేవలం లుప్తపూరణం మాత్రమే చేశాడని, పంచమ స్కంధం పూర్తిగా గంగనార్యుని రచన కాదని చాగంటి శేషయ్యగారి వంటి కొందరు విమర్శకు లన్నారు. అది కేవలం ఊహ మాత్రమే. అందుకు ఎటువంటి ఆధారమూ లేదు. పోతన గారే తన శిష్యుడైన గంగనార్యునికి ఈ భాగాన్ని అప్పజెప్పి వ్రాయించి ఉండవచ్చుననటమూ భావ్యం కాదు. పోతన గారు అప్పజెప్పి ఉంటే, రచన స్వరూపం ఆయన పర్యవేక్షణలో సాగినట్లుగా లేదు. అంతేకాక పోతన్న గారి ఇతరస్కంధాలలోని పద్యాల అనుకరణలు - మరీ ముఖ్యంగా సప్తమ, అష్టమ స్కంధ పద్యాలకు అనుకరణలు ఇందులో కనుపిస్తాయి. అందువల్ల పోతన్న గారి భాగవతం పరిసమాప్తమై, వారు పరమపదించిన కొంతకాలానికి తర్వాతనే ఈ ఉత్సన్నపూరణం మొదలైనదని ఊహింపవచ్చును. ఈ పంచమ స్కంధం అనువాదానికి శ్రీకారం చుట్టేముందు గంగనార్యుడు పోతన గారి భాగవత భాగాన్ని పూర్ణంగా భావగతం చేసుకొన్నాడు. గురుశిష్యులు ఏకకాలంలో రచనను కొనసాగించివుంటే అది సాధ్యం కాదు. క్రీ.శ. 1485 - 90ల నడిమి కాలంలో తన అనువాదాన్ని పూర్తిచేసే నాటికి సుమారు 50 - 55 సంవత్సరాల వాడనుకొంటే గంగనార్యుని జీవితకాలం స్థూలంగా క్రీ.శ. 1430(±) – 1490(±) అని నిర్ణయించటం సమంజసంగా ఉంటుంది.

శ్రీరామాంకితమా? కృష్ణాంకితమా?

పోతనగారు తెనుగుచేసిన భాగవతం శ్రీరామచంద్రునికి అంకితమైంది. స్కంధాంతపద్యాలను బట్టి ఈ విషయం బోధపడుతుంది. "పలికించెడువాఁడు రామభద్రుం" డని పోతనగారు తానే అవతారికలో చెప్పుకొన్నారు. భాగవతం రెండవ స్కంధం మొదలుకొని పన్నెండవ స్కంధం వరకు గల స్కంధాదిపద్యాలన్నీ - ఒక్క ఈ పంచమ స్కంధంలోనూ, ఏర్చూరి సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప - అన్నీ శ్రీరామాంకితం గానే ఉన్నాయి. స్కంధాంతపద్యాలలో శ్రీరామాంకితం కాని పద్యాలు గంగనార్యుని ఈ పంచమ స్కంధంలోనూ, సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ తప్ప మరెక్కడా లేవు. సింగనామాత్యుని షష్ఠ స్కంధంలోనూ "రామరాజాఖ్యనిధీ!" అని ఉన్న దళాన్ని బట్టి ఆ స్కంధాంతపద్యాలను శ్రీరామాంకితంగా అన్వయించుకొంటే పోతనగారి మార్గం అప్రతిహత మైనట్లవుతుంది. పోతనగారి ప్రథమ స్కంధంలోని తొలిపద్యం, అవతారికలోని షష్ఠ్యంతాలూ శ్రీకృష్ణాంకితంగా ఉన్నాయి. ప్రథమ స్కంధం చివరనున్న పద్యాలు శ్రీరామాంకితంగా ఉన్నాయి.  

ఈ పంచమ స్కంధం వ్రాతప్రతులు పెక్కింటిలో ఇది ఏకాశ్వాసం గానూ; కొన్నింట రెండు ఆశ్వాసాలు గానూ కనబడుతున్నది. రెండాశ్వాసాలుగా విభజించిన ప్రతులలో పెక్కింట 1. ఆశ్వాసాదిపద్యాలు, ఆశ్వాసాంతపద్యాలు - రెండూ శ్రీరామపరంగా కాక శ్రీకృష్ణపరం గానూ, 2. కొన్నింట ఆశ్వాసాద్యంతపద్యాలు శ్రీకృష్ణపరంగా ఉన్నవే కొద్దిపాటి మార్పులతో శ్రీరామపరం గానూ ఉన్నాయి. శ్రీరామపరంగా ఉన్న ఆ పద్యాలలోని విశేషణాలు కొంత ప్రాథమికంగానూ, ఆ రచన కొంత కృతకంగానూ కనుపించటంవల్ల గంగనార్యుడు తన వంతు భాగవతభాగాన్ని శ్రీకృష్ణాంకితం చేశాడనే పూర్వముద్రణల పరిష్కర్తలు నిర్ణయించారు

ఏకాశ్వాసమా? రెండాశ్వాసాలా?

ఈ చిన్ని స్కంధాన్ని ఏకాశ్వాసంగా నిలపటం కంటె రెండాశ్వాసాలుగా విభజించటం వల్ల కథాప్రణాళికకు చేకూరే ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు. ఐనా తాళపత్రప్రతులు కొన్నింటిలోనైనా రెండాశ్వాసాలుగా విభాగం జరిగి ఉండటం వల్ల పరిష్కర్తలు దీనిని రెండాశ్వాసాల రచనగానే ముద్రించారు

కథాభాగాన్ని చూస్తే అగ్నీధ్రుని మొదలుకొని జడభరతుని వరకు గల కథాభాగం మొదటి ఆశ్వాసంగా 184 గద్యపద్యాలలో ఉన్నది. రెండవ ఆశ్వాసంలో భరతుని వంశంలో భక్తాగ్రేసరుడైన గయుడనే రాజు కాలం దాకా జన్మించిన రాజులందరి కథలూ సంక్షిప్తంగా ఉన్నాయి. ఆ తర్వాత భూగోళస్వరూపం, నరకలోక వర్ణనం - మొత్తం 168 గద్యపద్యాలు.

మనసులకు హత్తుకొనే శైలి

గంగనార్యుని పద్యశైలి మనోహరంగా ఉంటుంది. అనువాదం మూలానికి అత్యంతవిధేయం. ఎక్కడైనా వ్యాఖ్యానసాపేక్షములైన దళాలు కనిపిస్తే వాటిని శ్రీధరస్వామి భావార్థదీపికా వ్యాఖ్యను అనుసరించి తెలుగుచేశాడు. శ్రీధరస్వామి భావార్థదీపికలో లేకుండా - ఆ తర్వాత వెలసిన వీరరాఘవుని భాగవతచంద్రచంద్రికా వ్యాఖ్యలో మాత్రమే ఉన్న పంక్తులు కొన్ని గంగనార్యుని అనువాదంలో యథాతథంగా కానవస్తాయి. అవి తాళపత్రాలలో పూర్వకాలంలోనే చేరినవో లేక వ్యాఖ్యాతలు ఇటీవలికాలంలో చేర్చినవో వ్రాతప్రతులన్నింటినీ పరిశీలించితే కాని నిర్ధారించటం సాధ్యంకాదు.

అనువాదపద్ధతిని చూస్తే గంగనార్యునికి తన కథాకథననైపుణిని, పద్యనిర్మాణకౌశలాన్ని ప్రదర్శించటం కంటె సన్నివేశాన్ని సుభగంగా నడుపుకొనిపోవడమే సమ్మతమని అనిపిస్తుంది. పోతనగారి వలె సంస్కృతానికి సమసంస్కృతంగా పద్యాన్ని కదనుతొక్కించాలనే అభినివేశం ఉన్నవాడు కాదు. అందువల్ల సాత్త్వికమైన మార్గాన్ని ఆశ్రయించి ధారాళమైన ధారాకౌశలంతో కథను సరసంగా సంక్షేపించాడు. వేదాంతఘట్టాలలో కొంత తొట్రుపాటున్నప్పటికీ శృంగారసన్నివేశంలో కూర్పు సరసంగానే కొలువుతీరింది. అప్రతీతపదాలతో ప్రౌఢమైన ప్రయోగాలను చేయటంకంటె మూలాన్ని సరళంగా తెలుగుచేయటమే ఆయన అభిమతం. మారన, వెన్నెలకంటి సూరనల వలె పౌరాణిక కవుల కోవకు చెందినవాడు.

 

గంగన అనువాదంలో ముద్దులొలికే కొన్ని అందమైన పద్యాలను చూడండి:   

చ. నరులకు నే తపంబున ననంతసుఖంబులు గల్గుచుండు, శ్రీ

కరమతి  నా తపంబుc దగఁ గైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం

దిరముగఁ గల్గు; వృద్ధులను, దీనులఁ బ్రోవుఁడు; దుష్టవర్తనన్

జరుగుచునుండు కాముకుల సంగతి బోకుఁడు; మీఁద మేలగున్.

         అవును మఱి! సంగపరిత్యాగం చేసి ఆత్మనిష్ఠు లైనవారికి ఇంద్రియజయాన్ని, మనోలయాన్ని, దీనజనోద్ధరణను, మించిన తపస్సు ఏముంటుంది గనుక ! 

       ఈ క్రింది పద్యంలో పోతన గారి ప్రసన్నకవితాశుద్ధిని పుణికిపుచ్చుకొన్నట్లు శబ్దాలంకారం ఎంత భావస్ఫోరకంగా ఉందో చూడండి: 

        ఉ.     రాజులు ప్రస్తుతింప వసురాజసమానుఁడనై, తనూజులన్

రాజులఁ జేసి, తాపసులు రాజఋషీంద్రుఁ డటంచుఁ బల్కఁగాఁ

దేజము నొంది, యా హరిణదేహము నందుల బ్రీతిఁ జేసి నా

యోజ చెడంగ నేఁ జెడితి యోగిజనంబులలోన బేల నై.

 మరికొన్ని వెలలేని మాణిక్యాలు:

        చ.     కరువలిఁ బాయు వస్త్రమును గట్ట నెఱుంగవు; చూడ్కి దిక్కులం

బరపుచు జంచరీకములభాతిఁ జెలంగెదు; గంధరంబునం

బొరలెడు ముక్తకేశభరముం దుఱుమంగc దలంప; విప్పు డి

ట్లరుదుగ రత్నకందుకవిహారము సల్పెడు సంభ్రమంబునన్.

 

        చ.     గురువులు వాఱి, బిట్టుఱికి, కొమ్ములఁ జిమ్ముచు, నంతనంత డ

గ్గఱుచును, గాలు ద్రవ్వుచు, నఖంబుల గీఱుచు, గాసి సేయుచు

న్నొఱుగుచు, ధారుణీశ్వరుని యూరువులన్ శయనించి, యంతలో

నఱకడ మెక్కుచుం, బొదలి యాడుచు నా హరిణంబు లీలతోన్.

 

        చ.     కారణవిగ్రహంబు, నురుకాయము, నీ యవధూతవేషమున్,

భూరిధరామరత్వమును, బూర్వసమాగమ, మాత్మభావముం,

జారువిహార మత్యతులశాంతిగుణంబును, గూఢవర్తనం

                బారయఁ గల్గు నీకు ననయంబును మ్రొక్కెదఁ బెక్కుభంగులన్.

 

        ఉ.     భారతవర్షజంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు ! నీ

 భారతవర్షమందు హరి పల్మఱుఁ బుట్టుచు, జీవకోటికిం

ధీరతతోడ దత్త్వ ముపదేశము సేయుచుఁ జెల్మిసేయుచు

                న్నారయ బాంధవాకృతిఁ గృతార్థులc జేయుచునుండు నెంతయున్.

 

        చ.     జలజభవాదిదేవమునిసన్నుతతీర్థపదాంబుజాత ! ని

ర్మలనవరత్ననూపురవిరాజిత ! కౌస్తుభభూషణాంగ ! యు

  జ్జ్వలతులసీకురంగమదవాసితదివ్యదేహ ! శ్రీ

నిలయశరీర ! కృష్ణ ! ధరణీధర ! భానుశశాంకలోచనా !

ఇవన్నీ విద్యార్థులు కంఠస్థం చేయదగినవే.

హైదరాబాదులోని శ్రీ రామకృష్ణ మఠం వారి  ప్రకాశనగా పూజ్యశ్రీ జ్ఞానదానంద స్వామీజీ, శ్రీ శితికంఠానంద స్వామీజీల ఆధ్వర్యవంలో నేను పరిష్కరిస్తున్న శ్రీ మహాభాగవతము యొక్క పంచమ స్కంధంలోని కొన్ని వెలుగులను ఈ వ్యాసంలో నింపే ప్రయత్నం చేశాను. వ్యాసవిస్తరభీతి కారణంగా అందులోని పాఠస్వీకారవైషయికచర్చను చేయలేదు. పోతనగారి సహపంక్తిభాగ్యవిశేషం వల్ల గంగనామాత్యుడు ఆస్తికులకు ప్రసాదించిన పుణ్యవరం నుంచి ఈ దివ్యదీధితులను శ్రీ సుజనరంజనీ పత్త్రికాముఖంగా విద్వన్మనోవిహాయసాలలో విహరింపజేసే మహావకాశం నాకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన సంపాదకులు శ్రీ తల్లాప్రగడ రావుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.  

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech