సుజననీయం  
   

   తాజమహల్ షాజహాన్ కట్టిచిందేనా?

    తాజమహల్ వయస్సెంత?  ( 4వ భాగం)
 
- రచన : రావు తల్లాప్రగడ  

 

ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు!

తాజ్మహల్ వయస్సు ఎంత?

ముందు భాగాలలో (గత మూడు మాసాలలో) తాజమహల్లో వున్న హైందవ చిహ్నాలను, చారిత్రాత్మక ఆధారాలను, వాస్తుకళలనూ పరిశీలించాము. సంతృప్తిపొందలేదు. ఇక సాంకేతికపరంగా, ఆలోచించి చూద్దాము. 

తాజమహల్ని షాజహానే కట్టించి వుంటే తాజమహల్ వయస్సు అతడికంటే ఎక్కువ వుండే ఆస్కారమే లేదు. అందుచేత ఆ భవనం వయస్సుని సైన్సు ప్రకారం లెక్కించి చూస్తే ఏమి తెలుస్తోందో కూడా చూద్దాము.

చారిత్రాత్మక కట్టడాల వయస్సుని రెండు రకాలుగా లెక్కిస్తారు.

 

భారత ప్రభుత్వం ఎడమ వైపు ఫొటోలొ కనిపించే చెక్క తలుపులని తీసేసి కుడివైపు ఫొటోలో చూపిన విధంగా ఇటులతో మూసేసారు. 1974 లో అమెరికన్ ప్రొఫెసరైన మార్విన్ మిల్స్, ఈ చెక్క ముక్కల పైననే కార్బన్ డేటింగ్ పరీక్ష చేసారు

మొదటి--విధానం -- కార్బన్ డేటింగు టెక్నిక్కు. ఇది కొంచెం తేలికగా ఊహకు అందేది కనుక, దీని సంగతిని మొదట చూద్దాం. ఏదైనా చెక్కలోని రేడియోకర్బన శాతాన్ని బట్టి  ఆ చెక్క యొక్క వయస్సుని నిర్ణయించడానికి జరిపే సాంకేతిక పరీక్ష ఇది. సామాన్యంగా పురావస్తు శాస్త్రజ్ఞులు తమతమ పరిశోధనలలో దొరికిన శిధిలాల వయస్సుని నిర్ణయించడానికి వాడే శాస్త్రీయ విధానమిది. కాకపోతే ఈ పరీక్షని చెక్కలమీద మాత్రమే ప్రయోగించవచ్చును. రాతి శిలల వయస్సుని నిర్ణయించడానికి ఈ పరిక్ష పనికిరాదు. న్యూయార్కు కి చెందిన "మార్విన్ మిల్స్" యమునా నది వైపున్న తాజమహల్  తలుపులోని చెక్కముక్కని తీసుకుని రేడియోకార్బన్ డేట్ పరీక్ష చేసారు.    కార్బన్-14 డేటింగు టెక్నిక్కు పరీక్షని "డా. ఈవాన్ విలియంస్, డైరెక్టర్ ఆఫ్ ది బ్రూక్లిన్ కాలేజి రేడియేషన్ లాబొరేటరి" తో కలిసి చేసారట. ఈ పరీక్షలలో తాజ్‌మహల్ 1359వ సంవత్సరానికి చెందినది (లేక 1270-1448 మద్య లోనిది ) అని నిర్థారించారు. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం తాజమహల్ నిర్మాణం 1632లో మొదలు పెట్టారు. అంటే షాజహాను కన్నా తాజమహల్ దాదాపు 300 సంవత్సరాల పాతది అని తేలుతున్నది.

కానీ ఒక్క తలుపును పట్టుకొని ఈ భవనం మొత్తం ఆ కాలానిది అని నిర్థారించలేము. ఆ తలుపును మరెక్కడినుంచో తెచ్చి ఇక్కడ వాడి వుండవచ్చు, లేక ఆ తలుపు చెక్క మరేమైనా కారణాల వల్ల పాడైయి పోయి పరీక్షలో తప్పుడు ఫలితాన్ని కూడా ఇచ్చి వుండవచ్చు. ఇలాంటిదే మరొక సాంపుల్ సంపాదించి, దాని పైన కూడా ఈ పరీక్షను జరిపి, ఆ రెండు పరీక్షలూ ఒకే కాలాన్ని సూచిస్తే గానీ, భవనం వయస్సు ఇదీ, అని ఖచ్చితంగా నిర్ధారించలేము. ఆ పని కేవలం ప్రభుత్వ సహకారంతోటి అయ్యే పని. కానీ మన ప్రభుత్వానికి ఇప్పుడున్న మతపరమైన సమస్యలు అనేకం. అందుచేత రాజకీయపరంగా ఆలోచించే ప్రభుత్వాలు ఇటువంటి పరీక్షలకు ఒప్పుకోలేవు. అలా పరీక్షలు జరిపితేకానీ మన చరిత్రకారులు చరిత్రను తిరగ వ్రాయడానికి ఒప్పుకోనూలేరు.  అలాగే అసలు కార్బన్ డేటింగు టెక్నిక్కే తప్పని అంటూ కొందరి వాదనలు కూడా వినిపిస్తాయి. అందుచేత దొరికిన ఒక్క చెక్కముక్క సాంపిలు పట్టుకొని తాజమహల్ వయస్సుని ఖాయం చేసేయలేరు కానీ,  ఇది సూచించే అనుమానాన్ని మాత్రం శాస్త్రజ్ఞుడూ కొట్టివేయలేడు. అంటే అనుమానం మరింత బలపడుతోంది కానీ నిర్థారణకు చాలదు.

ఇహ పోతే రెండవ పద్దతి. దీని ప్రకారం భవననిర్మాణంలో వాడిన సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీని) బట్టి అది కాలం నాటిదో పరిశోధకులు అంచనా వేయగలుగుతారు. తాజమహల్లో ముఖ్యంగా కనపడేవి ఆర్చీలు, డోము (లేక బల్బు) గోపురాలు, మినారులు. భారతదేశంలో కాలంలో మినారులు, ఆర్చీలు, డోము (లేక బల్బు)  గోపురాలు కట్టడ్టం మొదలు పెట్టారో తెలిస్తే, భవనం అంతకన్నా పాతది కాదు అని నిర్థారించవచ్చును.  వీటిని పరిశీలిద్దాం.

ఆర్చి, గోపురాలు:

"శీర్షమున్న ఆర్చిలు" మహమ్మదీయుల వాస్తుశాస్త్రంలో ఒక ముఖ్యచిహ్నమే. అవి దేవుడు ఒకడే అని తెలుపుతాయి. బగ్దాద్ వద్ద అలాంటివి ఎన్నో కనపడతాయి.  అందుకనీ అవి సారసెనిక్ (మహమ్మదీయ వాస్తుకళ) వాస్తే అని మనకు ముఖ్యంగా వినపడే వాదన. ఇవి వున్నాయి కనుక తాజమహల్ మహమ్మదీయకట్టడమే అని దాని సారాంశం. అది భారతదేశనికి 12 శతాబ్దం తరువాత ఆఫ్ఘనుల ద్వారా వారి తరువాతి కాలంలో  ఎగుమతి అయ్యిందని ఒక థియరీ వుంది. మానవుడు ఆర్చిలను నిర్మించడం నేర్చిన తరువాతే బల్బు గోపురాలు సాధ్యపడ్డాయని కూడా సైన్సు చెబుతోంది. అలాగే "బల్బులాంటి గోపురాలు" కూడా  సమర్ఖండ్ (Turkey) నుంచీ భారతదేశంలోకి 16 శతాబ్దిలో (అంటే దాదాపు షాజహాన్ కాలమే) దిగుమతి చేయబడ్డాయి అని వాస్తు చరిత్రలో ఒక థియరీ కూడా ప్రసిద్ధికెక్కింది (కానీ ఈజిప్టు, బాగ్దాదుల బల్బు గోపురాలకూ తాజ్మహల్ గోపురానికీ పెద్ద తేడా వుంది.  అది కూడా తరువాత  పరిశీలిద్దాం). అంటే తాజమహల్ షాజహాన్ కన్నా ముందు వుండే ఆస్కారం లేదు, అని చరిత్రకారులు నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు.

బల్బు గోపురాల వాస్తుకళ 16 శతాబ్దిలో భారతదేశంలోకి దిగుమతి అయ్యిందన్న థియరీని బ్రిటీషు పరిశోధకుడైన జేంస్ ఫర్గూసన్ భారత వాస్తుకళ పై 1835 నుంచి ఐదు దశాబ్దాల పాటు అధ్యయనం చేసి ప్రతిపాదించాడు. ఇక్కడొచ్చింది చిక్కంతా.  ప్రాచీనభారత వాస్తుకళ పైన ఫర్గూసన్ చేసినంత లోతుగా వేరెవరూ అధ్యయనం చేయలేదన్నది నిర్వివాదాంశం. అందుచేత ఈయన మాటను ప్రశ్నించే సాహసం చేయలేక, అందరూ వదిలేసారు. ఈ సిద్ధాంతం ప్రకారం మొగలాయిలకు ముందుకాలంలో భారతదేశంలో బల్బుగోపురాలను కట్టే ఆస్కారమే లేదు కనుక, తాజమహల్ షాజహాన్ కట్టించినదే అని తేలిపోయింది.

అందుచేత మనం ఇంకా ప్రశ్నించదలుచుకుంటే ముందుగా ఫర్గూసన్ వ్రాసిన పుస్తకాలను చదవాలి. ఇతనివి, ఇతని తరువాత మరొక బ్రిటీషు పరిశోధకుడైన అలగ్జాండర్ కన్నిగ్హాము వ్రాసిన పుస్తకాలనే ప్రాచీనభారత వాస్తుచరిత్ర పైన ముఖ్యమైన పాఠ్యపుస్తకాలుగా పరిగణిస్తారు. ఫర్గూసన్ దేశంలోని నలుమూలలకూ వెళ్ళి అన్ని కట్టడాలనూ చూసి, విశ్లేషించి, మన వాస్తు కళను విభజించి, దశలవారి ప్రగతిని ప్రతిపాదించి, మరుగుపడ్డ మన కళను మనకు చూపించడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడిగా మనం గుర్తించి గౌరవించాల్సిందే.  కానీ ఎంత గొప్ప పరిశోధకుడైనా దొరికిన డాటాను బట్టి, కొన్నిచోట్ల చిన్నచిన్న తప్పులు చెయ్యడం జరగవచ్చు. అలాంటిదేమయినా జరిగిందేమో చూద్దాం.

ఈ ఫర్గూసన్ థియరీ లోని, ఆర్చిలు, బల్బు గోపురాలు మహమ్మదీయుల ద్వారా భారతదేశనికి వచ్చాయా? లేక అంతకుముందే భారదేశం నుంచీ మహమ్మదీయ దేశాలకు చేరాయా? అన్న ప్రశ్నలను పక్కన పెట్టి, ప్రస్తుతానికి అవి మహమ్మదీయ దేశలనుంచే మనకు వచ్చాయని అనుకుందాం. కానీ ఇవి (ఆర్చీలు బల్బుగోపురాలు) భారతవాస్తుకళలో ఏ కాలంలో విలీనమయ్యాయి అన్న మాటను మాత్రం ప్రశ్నించి చూద్దాము. ఒక వేళ 16 శతాబ్దికి ముందే (14 శతాబ్దికే) మన దేశ వాస్తు కళలోకి ఈ " ఆర్చిలు, గోపురాలు", చేరి విలీనమయ్యాయి అని మనం నిరూపించినా చాలు, ఇది షాజహాన్ కట్టడమే అవ్వాల్సిన  పని లేదని నిరూపించవచ్చు.  అప్పుడు కార్బన్ డేటింగు పరీక్షలో తేలిన ఋజువుకు కొంత అర్థం కూడా లభిస్తుంది.

అలా పరిశీలించి చూస్తే, 14 శతాబ్దినాటికే దక్షిణభారతంలోని విజయనగర చక్రవర్తుల నిర్మాణాల్లో శీర్షము వున్న ఆర్చిలు కనిపిస్తాయి. అంటే (ఈ కళ మహమ్మదీయులనుంచే దిగుమతి చేసుకోబడింది అని అనుకుంటే), ఈ కళ దక్షిణభారతానికే చేరిందీ అంటే, అది ఉత్తరభారతంలో అంతకు చాలాకాలం ముందే చేరి వుండాలి, అని తేల్చి చెప్పొచ్చు. అంటే రేడియోకార్బన్ డేటింగులో చెప్పిన 1359 నాటికి, ఆగ్రాప్రాంతంలో కళ చేరింది అంటే అందులో ఆశ్చర్యం లేదు!  అంతే కాదు 12 శతాబ్దిలో భారతదేశంలోకి ఆర్చీలను ఆఫ్ఘనులు తెచ్చారు అనికూడా మనకు తెలిసిన చరిత్ర చెప్పనే చెప్పింది. కనుక ఆర్చీలు ఉండటం చేత షాజహానే కట్టించాల్సిన అవసరంలేదు.

ఇకపోతే, బల్బు గోపురాలు సమర్ఖండ్లోనే (నేటి టర్కీ) పుట్టాయన్న మాటను కూడా మనం నమ్మాల్సిన పని లేదు. సమర్ఖండ్ వాస్తుకళని 1394-1404 మద్యలో అభివృద్ధిచేసినట్లుగా, ఈ ఘనతని టిముర్లంగ్ కే చరిత్ర ఆపాదిస్తుంది. అందుకని అసలు విషయం తెలియాలంటే, ఇతడి గురించి మరికొంచెం ఆరా తీయాలి. తవ్వితే చరిత్రలో దొరికే విషయాలు ఇవి.

1) ఇతడు బాబర్ చక్రవర్తికి 6 తరాల ముందు వాడు.

2) టిముర్లంగ్ 1398 లో భారతదేశాన్ని దోచుకుని, ఆక్రమించుకుని డిల్లీలోని స్థపతులను, వాస్తుకళాకారులను, శిల్పులను ఎత్తుకుపోయి, తన రాజధానియైన సమర్ఖండ్ని నిర్మించుకున్నారని కూడా చరిత్ర తెలుపుతోంది.

3)   మల్ఫుజట్--టిమూరి(టిముర్లంగ్) వారి ఆత్మకథలో ఒక పేరాలో ఇలా కనిపిస్తుందట  -- " హిందూస్తాన్ నుంచీ బంధీలుగా తేబడిన వారిలో కళాకారులని,  వారివారి ప్రజ్ఞ కుశలతలను బట్టి ఎంపికచేయమని నేను ఆదేశించాను.  ఆలా ఎంపిక చేయగా మిగిలిన వేలాదిమందిని  మా అమీర్లకీ, సామంతులకీ, రాకుమారులకీ పంచాను. నా రాజధాని సమర్ఖండ్లో ఒక సాటిలేని "మస్జీద్--జామి"ని నిర్మించాలని నిర్ణయించాను. దానికోసం ఉన్న శిల్పులను, స్థపతులనూ, మేస్త్రీలనూ, రాతిని చెక్కగలిగిన వారందరినీ, నా వద్ద అట్టేపెట్టుకుని, వారిచేత నా పధకాన్ని మొదలుపెట్టించాను".

ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే రేడియోకార్బన్ డేటింగు ప్రకారం తాజ్మహల్ నిర్మాణం 1359 లో జరిగింది. టిమర్లంగ్ భారతదేశాన్ని 1398 లో ఆక్రమించుకుని, మన శిల్పులను పట్టుకుపోయి వారిచేత బల్బు ఆ గోపురాలను చేయించుకున్నాడు. అంటే టర్కీలు కూడా ఆ బల్బు గోపురాలను కట్టడం భారత శిల్పుల వద్దే నేర్చుకున్నారు అని మనం ఊహించుకోవడంలో తప్పులేదు. అంటే బల్బుగోపురాలు నాటికే భారతదేశంలో ప్రాచుర్యంలో వుండి వుంటే అప్పుడు అవి సమర్ఖండ్కి బంధీలయిన స్థపతులు, శిల్పుల ద్వారా వెళ్ళివుండవచ్చు అని మనం అనుకోవచ్చు. అలా కనుక ఐతే, బల్బుగోపురాలను చూసి అది షాజహాన్ (లేక మహమ్మదీయ ) కట్టడమే అని ఎవరూ వాదించలేరు.

బల్బుగోపురాలు నాటికే భారతదేశంలో ప్రాచుర్యంలో ఉండేవి అనే వాదనను బలపర్చాలి, అంటే మరికొన్ని విషయాలను మనం పరిశీలించాల్సి వుంటుంది.  బల్బు గోపురాలు భారతదేశంలో ఇంకా ఎక్కడైనా వుండేవా?

నాటి లేక సమకాలీన భవనాలు: సోనాగిరి  కొండలలో (బండేల్ఖండ్), ముక్తగిరిలో (బెరార్) కొన్ని వందలకు పైగా వున్న జైన మందిరాలలో బల్బు గోపురాలు(డోములు), శీర్షమున్న ఆర్చీలు కనిపిస్తాయి. 

మందిరాలకు బల్బు/డోములు ఉన్నాయి కనుక (ఈ గోపురాలు భారతావనిలోకి మొగలు చక్రవర్తులద్వారా వచ్చాయని తాని ఇదివరకు సిద్ధాంతీకరించాడు కనుక), ఇవి 16, 17 శతాబ్దాలవని ఫెర్గూసన్ ప్రతిపాదించాడు. కానీ వాస్తవంగా వాటి కాలాన్ని నిర్థారించలేను అని కూడా  కూడా అంటూ, " నాకు తెలిసినంత మటుకూ ఇవి 16, 17 శతాబ్దికి చెందినవిగా అనిపిస్తున్నాయి. కాని ఇందులో కొన్ని ఇంకా చాలా పాతవని చెప్పవచ్చు. వాటి పునాదులైతే అవి మరీ పురాతనమైనవి. వాటి పురాతనత్వాన్ని నిర్థారించడం మన వల్ల కాని పని. అలాగే కొండలు ఎందువల్ల ఇంత పవిత్ర ప్రదేశాలుగా పరిగణింపబడ్డాయో కూడా మనకు తెలియని పరిస్థితి ... ... ..". సంధిగ్ధ పరిస్థితిలో వదిలేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అతని ప్రతిపాదనలోనే పునాది, గోపురాల కాలాల మద్య మైత్రి లేదని తేల్చాడు. బల్బు గోపురాలు మహమ్మదీయుల వల్ల భారతదేశంలోకి వచ్చాయని అన్న థియరీని ప్రతిపాదించిన వాడు ఆయనే కావడం వల్ల, కొండలలో బల్బు గోపురాలు మహమ్మదీయులకన్నా కొన్ని వందల సంవత్సరాల ముందే, ఎలా వచ్చాయో ఆయనకి మింగుడు పడలేదు.  అందుకే పునాదులు చాలా పాతవని, గోపురాలు తరవాత వచ్చివుంటాయనీ ప్రతిపాదించి వదిలేసాడు. అంటే బల్బు గోపుర నిర్మాణకౌశలం మనకు అంతకుముందే వుందన్న మాటను అతడు నమ్మలేకున్నాడు. కానీ మహమ్మదీయ గోపురాలనుకునే వాటిని జైనులు ఎందుకు కట్టుకుంటారు? అది జరిగే పని కాదు. గోపురాల ఆకారం పై మహమ్మదీయత అనే ముద్ర పడక ముందే, జైనులు గోపురాలను కట్టుకునేవారన్నది ఇందులో గమనించాల్సిన సూక్ష్మం.  అంటే, (మన దగ్గిర నుంచీ టర్కీకి వెళ్ళి అక్కడ ప్రసిద్ధి పొంది, మళ్ళీ భారతదేశానికి వచ్చాయని మనం అనుకోకపోయినా), ఒకప్పటి కాలంలో బల్బుగోపురాలను భారతదేశంలో అందరూ పెట్టుకునేవారు అని మాత్రం అనుకోవచ్చు.

ఫర్గూసన్ తరువాత పరిశోధనలను కొనసాగించిన బ్రిటీష్ అధికారు కన్నిగ్హాం తన "from Report of tours in the Gangetic provinces from Badaon to Bihar, in 1875-76 & 1877-78 ... By Sir Alexander Cunningham లో ఇలా వ్రాసుకున్నాడు.

"బుద్ధగయలోని మహా ఆలయంలో కూడా ఆర్చీలు, బల్బు గోపురాలు కనిపిస్తాయి. మందిరం కూడా చాలా పురాతనమైనదే కానీ గోపురాలు ఆర్చీలు తరువాత చేర్చివుండివుంటారు. ఎందుకంటే మందిరాలు కట్టిన కాలానికి గోపురాల పరిజ్ఞానం భారతదేశానికి వచ్చివుండదు. ఇంతకు ముందు చెప్పినట్లు ఇవి కూడా మహమ్మదీయుల రాక తరువాతే కట్టి వుంటారు. అలాగే నలందలోని బాలాదిత్యమందిరంలోని ఆర్చీలు కూడా తరువాతే చేర్చి వుంటారని అభిప్రాయపడుతున్నాను. కానీ భైతర్గావ్ లోనీ ఆర్చీలు, డోము గోపురాలు మొదటినుంచే మందిరం పైన వున్నటుగా తెలుస్తున్నాయి. ఇవి 7 లేక 8 వ శతాబ్దికి చెందినవి కావచ్చు, లేక ఇంకా పాతవి కూడా అయ్యే అవకాశం వుంది. కానీ ఆ కాలానికి హిందువులకు ఆర్చిలు కట్టటం కూడా రాదు అని కొందరు వాదించవచ్చు. నిజానికి మొదట్లో నేను కూడా అలాగే అనుకునేవాడిని. కానీ బిర్దాబన్, జుమై లలోని బౌద్ధస్తూపాల వద్ద ఆర్చీలను గమనించిన తరువాత, భారతీయ బౌద్ధులకు ఆర్చీల నిర్మాణం మహమ్మదీయుల ఆగమనాని కన్నా ఎంతో ముందే తెలుసునని నేను నమ్మటము మొదలు పెట్టాను. కానీ వీటి నిర్మాణ విధానం మహమ్మదీయ విధానానికి భిన్నంగా వున్నా వీటిలోని మౌళిక సూత్రాలు మాత్రం  ఒకటే". అంటే ఈ ఆర్చీలు, బల్బు గోపురాలూ కట్టుకోవడం అనే ఆచారం భారతదేశంలో మహమ్మదీయులు రాక ముందు నుంచే వుంది అని తేటతెల్లం చేసాడు.  కనీసం భైతర్గావ్ లోనీ డోము గోపురాలు క్రీ.శ. 7వ శతాబ్దినాటిదని, అంటే తాజమహల్ కన్నా చాలాచాలా ముందుకాలం నాటికే భారతదేశంలో డోము గోపురాలు వుండేవని తేల్చి చెప్పాడు. ఇది చాలు, తాజమహల్ పైన డోము గోపురముందికనుక అది మహమ్మదీయ కట్టడమే అని వాదించేవారిని తృప్తిపరచడానికి.

భారతీయ పురాతన వాస్తుకళ:

మనదేశంలో అతిప్రాచీనమైన కట్టడాలు, అంటే క్రీ.పూ.కాలం నాటివి అన్నీ, దాదాపుగా భౌద్ధులు కట్టినవే ఎక్కువగా కనపడతాయి. వారి చైత్యాలు , ఆరామాలు, విహారాలు, దిబ్బలు, స్థూపాలు, గుహలు మున్నగునవి. అంతకు ముందు హిందువులు ఏమీ కట్టలేదనికాదు. కాలగర్భంలో అవి ఎందుకో కలిసిపోయాయి. భౌద్ధుల కట్టడాల తరువాత జైనుల మందిరాలు, గుహలు మనకి కనిపిస్తాయి. తరువాత హిందూ మందిరాలు కనిపిస్తాయి. హిందూ మందిరాలలో దక్షిణభారత వాస్తుకళ, ఉత్తరభారత వాస్తుకళ అని రెండు రకాల వైవిద్యమైన రీతులు కనిపిస్తాయి. కానీ రెండు కళలలోనూ అనేక సారూప్యాలు వుంటాయి. కాలక్రమేణ  ఒకరి నుంచీ ఒకరు నేర్చుకుని రెండు కళలనూ అభివృద్ధిచేసుకున్నట్లు కనపడుతాయి. అలాగే జైను మందిరాలు, హిందూ మందిరాలలో కూడా చాలా పోలికలు కనిపిస్తాయి. నిజానికి రెండు మతాలలోనూ దేవుళ్ళు కూడా చాలా మంది ఒకరే. అలాగే జైన గుహలకీ, భౌద్ధ గుహలకీ కూడా చాలా పోలికలు కనపడతాయి. ఏది ఎవరి గుహో గుర్తుపట్టలేక చేసే అనేక రకాల విశ్లేషణలను కూడా మనం చూస్తూనే వుంటాము. అలాగే భౌద్ధులు, జైనులూ, హిందువులూ వారి వారి గుహాలనూ, ఆలయాలనూ ఒకరినుంచీ ఒకరు మార్చుకొన్న సందర్భాలు కూడా అనేకం. కాని మూడు మతాలలో మతసామరస్యం పాళ్ళు చాలా ఎక్కువేనని చెప్పుకోవాలి. ఇలా మందిరాల మార్పిడులు జరిగినప్పుడు అవి దాదాపుగా అహింసామార్గంలోనే (మహమ్మదీయుల వలే కాకుండా ) జరిగాయని ఫర్గూసన్ అభిప్రాయం కూడా. అలాగే అనేక సంధర్భాలలో ఒకే మందిర సముదాయంలో (ఉదాహరణకి ఖజరహో) హిందువులూ జైనులూ కలిసి మందీరాలు నిర్మించుకున్నారని కూడా వారు అనేక ఉదాహరణలను ఇచ్చారు.

అంటే మూడు మతాల వాస్తుకళలూ కలిసి పెరిగి ఒకదానితో మరొకటి విడదీయలేనట్టుగా దగ్గిరగా కలిసిపోయివుంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వెరసి మొత్తం కలిపి భారతీయ వాస్తు శాస్త్రంగా పరిగణిస్తే మనకు భారతీయ వాస్తు కళ ఒకదానినుంచీ మరొకటిగా ఎలా అభివృద్ధి చెందిందో విశ్లేషించడం తేలిక అవుతుంది.

క్రీ.శ. 124 నాటి మహరాష్ట్రలోని మన్మాద గుహలలోని ఒక శిల్పం ప్రకారం, నాటి ఆలయాలు ఇలా వుండేవని తెలుస్తోంది. ఇక్కడ కనపడే డోము గోపురాన్నీ, ఆర్చీలను గమనించండి.  ఆలయాలు ఇప్పుడు లేకపోయినా, అలనాటి శిల్పులే వీటిని చిత్రీకరించారు అంటే, అంతకు మునుపే (అంటే క్రీస్తు పూర్వం కాలం నాటికే) డోము గోపురాలు, ఆర్చీలు వుండేవని మనం గ్రహించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటుపల్లి గుహలలో (క్రీ.పూ. 3 శతాబ్ధి) కూడా బౌద్ధ, జైన, హిందూ మతస్తులు నివసించారని అక్కడ దొరికే ఆధారాలబట్టి తెలుస్తోంది. అక్కడి బౌద్దస్తూపాన్నే తరువాత హిందువులు శివలింగంగా పూజించేవారట. ఇక్కడ గుహలకున్న ఆర్చీలను గమనించండి.

నాలుగు అంతస్తుల బౌద్ధ విహారాలు ఇలా కట్టేవారు అని ఫర్గూసన్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇందులోని పై అంతసుకి పునాదిగా కింది అంతస్తు ఎలా కట్టారో గమనించండి. తాజమహల్ లోని 4 అంతస్తుల పునాది కూడా ఇటువంటిదే. అలాగే ఆర్చీలను, డోములను  కూడా గమనించండి.

పైన చూపబడ్డ క్రీస్తుపూర్వకాలం నాటి బౌద్ధుల ఆర్చీలు, గోడలు, గోపురాలు, వరండాలు, స్తంబాలు, ద్వారాలు, ద్వారబంధాలు చూస్తే నాటి నిర్మాణకళ చాలా అభివృద్ధి చెందినదని, వారు కూడా ఆర్చీలు, డోములు కట్టుకునేవారనీ తెలుస్తోంది.

క్రింద చూపబడిన క్రీ.పూ.300 నాటి సాంచి స్థూపం చూస్తే, ఇది కూడా తాజ్మహల్ కన్నా చాలా చాలా పాతది. ఇది మహమ్మదీయ వాస్తుశాస్త్రం కన్నా, మహమ్మదీయ మతం పుట్టడానికి కన్నా ముందే కట్టిన కట్టడం. ఇక్కడ కూడా మనకు ఒక డోము ఆకారం (గోపురం కాకపోయినా) కనిపిస్తుంది.

అలాగే, మన ఆంధ్రప్రదేశ్లోనే నాగార్జునకొండపై క్రీ.పూ.300 సంవత్సరం నాటి ఆచార్య నాగార్జున నిర్మించిన మాధ్యమిక విద్యాలయం. ఇందులో చైనా, శ్రీలంకల వంటి సుదూర ప్రాంతాల నుంచీ వచ్చి చదువుకునేవారట. ప్రదేశాన్ని 1926లో కనుగొన్నారు కనుక ఫర్గూసన్ దీనిని చూసే అవకాశమే లేదు. ఇక్కడ కూడా తెల్ల పాలరాయితో చెక్కిన అనేక బౌద్ధ శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే ఒక కట్టడం చూస్తే ఇది కూడా బ డోము ఆకారాన్ని పోలివుంటుంది.

 

19వ శతాబ్దిలో బ్రిటీష్ ఇంజినీర్ టి.ఎస్. బర్ట్ కి కనపడగా, తరువాత జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్‌హాం ద్వారా వెలుగులోకి తేబడిన ఖజరహో మందిర సముదాయాన్ని గమనిస్తే, ఈ మందిరాల్లో దొరికిన హైందవ శిల్ప కళ ఎంతటి వాడినైనా ఆశ్చర్యపరుస్తుంది. క్రీస్తు పూర్వ కాలానికి చెందిన ఈ మందిరాలలోని  శిల్పకళ, గోపురాలు తాజ్మహల్ని మించినట్టివే. మందిరాలు కూడా తాజ్మహల్లో లాగా పెద్ద పెద్ద ప్లాట్ఫారాల పైన కట్టినవే; తాజ్మహల్లో లాగా ఎన్నొ గదులు మండపాలు కలిగినవే. ఇది కూడా తాజ్మహల్ లాగా ఒక పెద్ద ఉద్యానవనంలోనే వుంటుంది. నున్నగా పిరమిడ్లాగా వుండే గోపురం, బల్బు గోపురానికి ఒక వేరియేషల్ లాగా అనిపిస్తుంది.

ఇందులోని జైన మందిరం ద్వారబంధం పై 13 శతాబ్దినాటి అక్షరాలలో వ్రాయబడ్డ శిలాశాసనం ప్రకారం మందిరం క్రీ.. 955 సంవత్సరం నాటిది. ద్వారంపై గరుడ వాహనం పైన వున్న విష్ణువు ఉండటం విశేషం అని Mr. Cousens అంటూ, మందిరం అంతకు ముందు ఒక వైష్ణవ మందిరంగా వుండేదని నిర్ధారిస్తూ, తరువాత జైనులు దాన్ని క్రీ.. 955 లో స్వాధీన పరుచుకున్నారని అభిప్రాయపడ్డాడు. మొదట్లో కట్టబడిన వైష్ణవ మందిరం కూడా పూర్తిగా మార్చబడిందని, ఇప్పుడు మనకు కనపడుతూ మిగిలింది 9వ శతాబ్దినాడు పునర్నిర్మించినది అయివుండవచ్చని కూడా ఆయన  పేర్కొన్నాడు.

శిలాశాసనంలో కనపడే కొన్ని అక్షరాలను చూపిస్తూ జనరల్ కన్నిగ్హాం మందిరం 6 లేక 7 శతాబ్దిదని నిర్థారించాడు. అక్కడ కనబడ్డ బౌద్ధశాసనాలను బట్టి, బుద్ధ విగ్రహాలను బట్టీ, చూస్తే అది బౌద్ధుల ఆలయమేమోనని మొదట్లో అనిపించినా, తరువాత జరిపిన త్రవ్వకాలలో దొరికిన పదకొండు దిగంబరజైన విగ్రహాలు, రెండు వైష్ణవ విగ్రహాలను చూసి అది ఆయన జైన మందిరమే అయివుండవచ్చని భావించాడు. ఇందూజైనబౌద్ధమతాల శిల్పకళ దగ్గిరగా ముడిపడి వుండేదని నిరూపించడనికి ఆలయాలు ఒక నిదర్శనంగా ఫర్గూసన్ పేర్కొన్నాడు కూడా. 

"జోధపూర్‌కి దగ్గిర ఓసియాలో దొరికిన జైన శిలాశాసనం ప్రకారము అక్కడి మందిరాలు 8 శతాబ్దికి చెందినవి. అక్కడి హిందూమందిరాలుకూడా అదే కాలానికి చెందినవి. బౌద్ధులు మొదటినుంచీ గుండ్రంగా ఉండే తోపులను కట్టడాలను నిర్మించినా అది వాటి బాహ్యరూపమే. కానీ రాతితో లోపల డోములాగా వారు నిర్మించడానికి ప్రయత్నించలేదు. ఇది హిందువులు, జైనులు మాత్రమే ప్రయత్నించిన ప్రక్రియ. అది వీరే ఎందుకు చేసారో మనం చెప్పలేనిది. మహమ్మదీయ కళలో కూడా భారతదేశాన్ని ఆక్రమించడానికి ముందే డోములు అంతర్భాగమయిపోయాయి. మహమ్మదీయులు భారతదేశంలోకి రాగానే, హిందువుల, జైనుల డోములను స్వాధీనపరచుకొని, తరువాత వాటి పైన తమదైన శైలిని ఏర్పరచుకొని భారతీయ వాస్తుకళలో ఒక విశిష్ఠ స్థానాన్ని సృష్ఠించుకున్నారు" అని జేంస్ ఫర్గూసన్ వ్రాసిన History of Indian and Eastern Architecture" అన్న పుస్తకానినే పునర్ముద్రణచేస్తూ, జేంస్ బర్జెస్, ఫీనీ స్పియర్స్ ప్రచురించిన రెండవ వాల్యూములో  పేర్కొన్నారు. దీని వల్ల కూడా ఫర్గూసన్ థియరీ తప్పని ఆయన పుస్తకంలోనే (ఆయన తరువాతి వారు చేసిన పునర్ముద్రణలోనే అయినా) కనపడుతోంది. అందుచేత డోములు ఆర్చీలు ఉన్నాయి కనుక అది మొగలుల తరువాతి కట్టడమే అని అనుకోవాల్సిన పనిలేదు. అనంటే తాజమహల్ 16వ శతాబ్దికన్నా చాలా పాతదయ్యే అవకాశం వుంది అని తెలుస్తోంది. కార్బన్ డేటింగు ఈ అవకాశానికి ఒక ఋజువును చేర్చుతోంది. కనుక ఈ కట్టడం షాజహాన్ కన్నా పాతదే అని నిర్థారించుకోవచ్చు.

ఏది ఏమైనా డోము మాత్రం ఖచ్చితంగా మహమ్మదీయ చిహ్నమే, దీనిని హిందువులు తమ ఆలయాలపైన వుంచుకోరు అన్న వాదన బలంగా అన్ని వర్గాలనుంచీ వినిపిస్తుంది. అందుచేత, మనకు భారతదేశంలో కనిపించే మరికొన్ని పురాతన మంది రాలపై ఉన్న డోము గోపురాలను కూడా గమనించి చూద్దాం. దీనిలో ఎంత వాస్తవం వుందో కూడా తెలుస్తుంది.

రామాయణకాలం నాటి వైశాల మహారాజు పాలించిన, వైశాలి ప్రాంతంలో, క్రీ.పూ 6 శతాబ్దిలో వజ్జిలు, లిచ్చవీల కాలంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన సాగేదట. ఇది మౌర్యులు గుప్తుల కాలంలో ఒక ప్రముఖ వాణిద్య ప్రాంతంగా విలసిల్లేది. బుద్ధభగవానుడు ప్రాంతాంతంలో తరుచుగా తన బోధనలను చేసేవాడట. బుద్దుని మహాపరినిర్వాణానంతర శతాబ్దిలో ఇక్కడ శ్మృతిగా ఒక మహా సభను నిర్వహించి రెండు స్థూపాలను నిర్మించారట. అలాగే క్రీ.పూ. 527 లో జైనుల మహావీరుడు కూడా ఇక్కడే జన్మించాడట. ఇక్కడ కూడా డోము ఆకారం మొదటినుంచీ కనిపిస్తుంది.

ఇది కూడా అతి పురాతనమైన కట్టడమే. అరబ్ పర్యాటకుడు అల్ బిరూనీ వ్రాసుకున్నదాని ప్రకారం సోమనాథ్ మందిరం 1025లో మహమ్మద్ గజనీ చేతిలో ధ్వంసం చేయబడింది. తరువాత మాల్వా భోజుని చేత పునర్నిర్మాణం చేయబడింది. మళ్ళీ 1300 సంవత్సరంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ మందిరాన్ని నాశనం చేస్తే, మహారాజు మహీపాలుడు దీన్ని పునర్నిర్మించాడు. మళ్ళీ మందిరాన్ని మహమ్మదీయులు తమతమ దండయాత్రలలో 1390, 1490, 1530లలో నాశనం చేసారు. చివరికి 1701లో మళ్ళి ఔరంగజేబు దీన్ని నాశనం చేసాడు. ఇలా ఎన్నిసార్లు నాశనం చేయబడినా మందిరాన్ని హిందువులు పునర్నిర్మిస్తూనే వచ్చారు. 1783లో అహిల్యాబాయ్ హోల్కర్ రాణీ మరొకసారి పునర్నిర్మిస్తే 1951లో భారత రాష్ట్రపతి మళ్ళీ ఈ జ్యోతిర్లింగాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా డోము ఆకారం మొదటి నుంచీ కనిపిస్తుంది.

 

ఇది కూడా అతి పురాతనమైన కట్టడమే. " శత్రుంజయ మందిరంలోని శిలాశాసనం ప్రకారం, ఇది 1530 సంవత్సరంలో చిత్తోడ్ రత్నసింహుడు చేయించిన 7 పునర్నిర్మాణం. మందిరం 960 నాటిది. రాన్‌పూర్ లోను మిగితా క్షేత్రాలలోనూ మహమ్మదీయులను శాంతింపచేసేటందుకు వారి ప్రార్థనామందిరాలను కూడా జైనులు నిర్మించారు"- ఫర్గూసన్.

ఇస్లాంలో దర్గాలు నిషేదించబడ్డయి, కానీ భారతీయ సూఫీలు వాటిని కట్టడం మొదలు పెట్టారు. ఇవి జైన మందిరాల వద్ద కూడా కనబడతాయి. 14 శతాబ్ది నాటి అల్లావుద్ధీన్ ఖిల్జీ శత్రుంజయ క్షేత్రాన్ని నాశనం చేయబోతూ వుంటే అక్కడ  దర్గా కట్టిస్తామని జైనులు బేరం కుదుర్చుకుని తమ మందిరాలను కాపాడుకున్నారట. మందిరాలలో కూడా అంతకు ముందు నుంచే డోము గోపురాలు కనబడతాయి.

"హిందువులు కూడా గతంలో అనేకసార్లు డోములని కట్టారు అనే మాటని మనం విశ్మరించకూడదు. ఉదాహరణకి అజంతా గుహల దగ్గర వున్న అంవార్ మందిర శిధిలాలో గర్భగుడి, దానిపైన గోపురం పోయినా కూడా అక్కడి మండువా మిగిలింది. దాని పై కప్పు కూడా శిధిలమైపోయినా, దానిలో ఉన్న డిజైనుని గ్రహించడానికి సరిపోతుంది. అక్కడ ఉన్న 30 స్తంభాలు సౌస్ఠవతను, శిల్పకళను, ప్రదర్శిస్తూ సరిసమానంగా పైకప్పుని నిలబెడుతూ కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది దీని అంతర్భాగంలోని 21 అడుగుల వ్యాసమున్న డోముని, దాన్ని నిలబెట్టిన 12 స్థంబాలని"- ఫర్గూసన్.  ఇది బల్బు డోమా కాదా అన్న విషయం తెలియదు.

తేజపాల్ నేమినాథ్ జైన మందిరం (22 తిర్థంకార్) కూడా అతిపురాతనమైనది. పాలరాతితో కట్టబడి డొము మద్యలో పద్మం ఉండటం, లేసు అల్లికలవంటివి పాలరాతిపై చెక్కడం, ఇక్కడి శిల్పకళకి నిదర్శనాలు. ఇక్కడ కూడా మినార్ వంటి కట్టడాలను గమనించవచ్చు.

భోజపూర్లో (భోపాల్ దగ్గిర) ధార్ మహారాజు, పర్మార్ రాజ భోజ్ (1010-1053), నిర్మించిన శివాలయం (భోజేశ్వరాలయం). మందిర నిర్మాణం పూర్తికాక మునుపే  అసంపూర్తి ఆపినట్టుగా తెలుస్తుంది. ఇది పూర్తయితే ఎలా వుండేదో తెలియదు కానీ, ఇక్కడ కూడా ఉన్న డోముని గమనించండి.

గౌహతీ వద్ద నీలాంచల్ కొండలపై నిర్మించిన కామాఖ్య మందిరం. ఇది కూడా చాలా  పురాతనమైనదే. మందిరంలో కూడా డోము గోపురాన్నే వాడటం గమనింపదగ్గ విశేషం. మందిరం పౌరాణిక కాలానికి చెందినదే అయినా 16 శతాబ్దిలో నాశనం చేయబడింది. తిరిగి 17 శతాబ్దిలో బీహార్ రాజు నరనారాయణ పునర్నిర్మించారు.

 అలాగే పైన చూపిన రాజస్థాన్లోని హవా మహల్ గానీ లేక పక్కపటంలో ఉన్న హరిద్వార్లోని కొన్ని గుళ్ళుగానీ చూసినా బల్బ్ గోపురాలు కనిపిస్తాయి.

 

చాళుక్యుల కట్టించిన, 11 శతాబ్దికాలం నాటి దిల్వార జైన మందిరాలు కూడా పాలరాతితో నిర్మింపబడ్డవే. వీటిలో కూడా ఆర్భాటంగా బయటకు కనిపించేవి, పెద్దపెద్ద డోము గోపురాలు, అనేక స్థంబాలపైన కట్టబడిన మండపాలు. సిక్కుల గురుమందిర్ సాహిబ్ లో కూడా డోము గోపురాన్ని వాడటం గమనించవచ్చు.

ఈ ఆర్చీలు, బల్బు గోపురాలు హిందువులు ఈ నాటికీ వాడుకుంటునే వున్నారు అనడానికి నిదర్శనంగా, నాటి స్వామి నారాయణ్ మందిరం లోనూ, ధ్యానలింగం మందిరం లోనూ, ఉమైద్ భవన్ పాలస్ లోనూ, కూడా డోము గోపురాలు దర్శనమిస్తాయి. అంటే నాటి నుంచీ నేటిదాకా - అనాదిగా భారతదేశంలో వున్న వాస్తు కళ ఇది. కానీ కాలక్రమేణా ఎందుకో డోము గోపురం చూడగానే అది మహమ్మదీయులది అని అనుకోవడం పరిపాటి అయిపోయింది. మహమ్మదీయులు డోము గోపురాలను మాత్రమే వాడటం దీనికి కారణం కావచ్చు. కానీ వాస్తవానికి డోము గోపురాలు అన్ని మతాలవారికీ చెందినవి. హిందువులు అనేకమార్లు వాడుకున్నవి.

మహమ్మదీయులు కూడా డోములను ఆర్చిలనూ తమ కట్టడాలలో వాడుతూ వచ్చినంత మాత్రాన, ఈ కళ మహమ్మదీయుల తోటే భారత దేశం లోకి ప్రవేశించింది అనడంలో ఫర్గూసన్ తప్పేచేసినట్లుగా కనిపిస్తోంది. జెనరల్ కన్నిగ్‌హాము కూడా ఈ కళ భారతదేశంలో ముందు నుంచే వుందన్న అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇలా, షాజహానుకు చాలా కాలం ముందు నుంచే, డోములు భారతదేశంలో వర్థిల్లుతున్నాయని, పైన చూపిన ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. కనుక ఈ డోముల కళ భారతదేశంలో ఆనాటికే ఉన్నది అని  తేలింది కాబట్టి, డోములను చూపించి, తాజమహల్ వయస్సును (నేటి చరిత్రకారులు వ్రాస్తున్నట్లు) మొగలాయిల కాలానిదని నిర్థారించడం సమంజసం కాదు. అలాగే  డోము గోపురమున్నంత మాత్రాన అది మహమ్మదీయ కట్టడం అవ్వాల్సిన పని కూడా లేదు అని నిర్థారించవచ్చు. ఈ విశ్లేషణ ప్రకారం తాజమహల్ వయస్సు షాజహాన్ కాలానికన్నా పాతది అయివుండవచ్చు. రేడియోకార్బన్ పరిక్షలో కూడా ఇదే తేలింది. ఈక మిగిలింది మినారులు. వీటిని కూడా హిందువులు వాడేవారా అన్న విషయాన్ని వచ్చే సంచికలో చూద్దాం. (సశేషం)

మీ

రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech