శీర్షికలు  
     సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 15
 
- రచన : సత్యం మందపాటి  

    బట్టీ విక్రమార్కులు

 

 

రమణగారి రాతతో, బాపుగారి గీతతో చిచ్చర పిడుగు బుడుగు చెప్పిన పదమూడో ఎక్కం ఖద మీలో ఎంతమందికి గుర్తుంది? అది గుర్తులేదంటే మీరు చదవలేదనో, చదివినా ఖంఠతా పట్టలేదనో అర్ధం.
అయినా ఆ కథలో ముఖ్యమైన విషయాలు ఒక్కసారి గుర్తుచేస్తాను. ఇప్పుడైనా బట్టీ పట్టేయండి.
పాపం! సీతని ఒక రాఛ్ఛసుడు ఎత్తుకు పోయాడు.
యువరాజు వేషంలో వున్న బుడుగు సీతని వెతుక్కుంటూ కీలుగుర్రం ఎక్కి అక్కడికి వెళ్ళాడు. రాఛ్ఛసుడింటి దగ్గర వీధిలో ఇంకో పెద్ద రాఛ్ఛసుడు కూర్చుని వున్నాడు.
సీతనెక్కడ దాచావన్నాడు యువరాజు.
"వురేయ్ యువరాజూ! నీకు సీరాముని దైచేతను పజ్జెం వచ్చురా" అడిగాడు రాఛ్ఛసుడు.
యువరాజు "రాదు" అనగానే, ఆ రాఛ్ఛసుడు "అయితే పో వెదవా! పొయి చదూకో" అన్నాడు.
యువరాజు గబగబా ఇంటికెళ్ళి వాళ్ళమ్మ దగ్గర ఆ పజ్జెం బట్టీ పట్టేసి పరిగేఠుకెళ్ళి రాఛ్ఛసుడికి అప్పజెప్పాడు. సరే అని లోపలికి వదిలాడు వాడు.
లోపల ఇంకో రాఛ్ఛసుడున్నాడు. "వురేయ్ నీకు శిబి చక్రవర్తి పాఠం వచ్చిందిరా? ఆర్యులనగా ఎవరు?" అని అడిగాడు.
"రాదు. అది మా బాబాయి బళ్ళో పాటం… న.. న.. న.. నాకు తెలీదు" అన్నాడు యువరాజు.
"అది మీకూ వుంది. పొయి చదూకో" అన్నాడు రాఛ్ఛసుడు.
యువరాజు గబగబా ఇంటికెళ్ళి,  శిబి చక్రవర్తి పాటం, ఆర్యుల పాటం చదివేసి (అంటే బట్టీ పట్టేసి), పరిగేఠు కెళ్ళి రాఛ్ఛసుడికి అప్పజెప్పాడు. సరే అని లోపలికి వదిలాడు వాడు.
లోపల ఇంకో పేద్ధ రాఛ్ఛసుడున్నాడు. సీతకి ప్రైవేటు చెప్పేస్తున్నాడు.
"ఓరీ రాఛ్ఛసా! మా సీతని వదిలెయ్యి. లాపోతే ఈ ఖత్తితో యుద్ధం చేసి నీ నడ్డిమీద ఛంపేస్తా" అన్నాడు.
రాఛ్ఛసుడు గాఠిగా నవ్వి "వురేయ్! నీకు పదమూడో ఎక్కం వచ్చునా?" అన్నాడు.
"రాదు! మా బాబాయికి కూడా రాదని నా అవమానం" అన్నాడు యువరాజు.
"అయితే నేనే గెల్చాను, ఫో! సీతని ఇవ్వను. పోరా ఫో!" అన్నాడు రాఛ్ఛసుడు.
యువరాజు గబగబా ఇంటికెళ్ళి బాబాయినడిగాడు.
వాడు అమ్మాయిల్ని చూస్తూ“బిజీగా వున్నాను ఫో”అని గసిరాడు.
బాబాయికే కాదు, లావుపాటి పక్కింటి పిన్నిగారి ముగుడికీ, పకోడీల నారాయణా, వాళ బామా, ఆఖరికి పేదరాసి పెద్దమ్మా, ఎవరికీ పదమూడో ఎక్కం రాదు. చివరికి యువరాజు, వాళ్ళ నాన్నకి వచ్చేమోనని ఆయన్ని అడిగాడు. వాడు ఎక్కాల పుస్తకం తీసి, పదమూడో ఎక్కం చెప్పాడు.
యువరాజు అప్పుడా పదమూడో ఎక్కం ఘబఘబా ఖంఠతా పట్టేసి, మళ్ళీ రాఛ్ఛసుడి దగ్గరకెళ్ళి, యిలా నుంచుని "పదమూడోట్ల పదమూడు..  పదమూడు పదులు నూటముఫై" అని గబగబా అప్పజెప్పేశాడు.
అప్పుడా రాఛ్ఛసుడు హాశ్చెర్యపడిపోయి, యువరాజుకి సీతనిచ్చేశాడు. అదీ కథ.
- - -
గురజాడగారి గిరీశం బుచ్చమ్మ తమ్ముడు వెంకటేశానికేం చెప్పాడో తెలుసా? పాఠాలు భట్టీయం వేయమని.
- - -
ఆనాటినించీ ఈనాటి దాకా మన వేదపాఠశాలల్లో వేదాలు వల్లె వేయమని చెబుతారేగానీ, వేదాల్లో ఏముందో అర్ధం చేసుకోండర్రా అని ఎవరూ అనరు. అందుకే చాలామంది సోకాల్డ్ మతతత్వకారులు, వేదాలు ఘోషిస్తున్నా యనే చెబుతారుకానీ ఏం ఘోషిస్తున్నాయో చెప్పరు. ఇండియానించీ అమెరికాకి వచ్చే చాలమంది పురోహితులు వేదాలు అప్పజెప్పటం చూశాను కానీ, వేదానికి భాష్యం చెప్పేవాళ్ళని వేళ్ళ మీద లెఖ్కపెట్టవచ్చు. పురోహితులే కాదు చాలమంది సన్యాసులు బాబాలు స్వాములుకూడా వేదాల జోలికి పోకుండా శ్రీకృష్ణుడి రాసలీలలతో సరిపెట్టుకుంటారు.
- - -
ఆమధ్య ఇండియా వెళ్ళినప్పుడు చూశాను. మా చుట్టాలబ్బాయి పదిహేళ్ళు వుంటాయేమో సైన్స్ పాఠం ఏదో చదువుతున్నాడు. కాదు బట్టీ కొడుతున్నాడు. పుస్తకంలో ఒక లైను చదివి, పుస్తకం మూసేసి, రెండు కళ్ళూ మూసుకుని అదే వాక్యాన్ని పదిసార్లు మననం చేస్తున్నాడు. అతను బట్టీపడుతున్న గంటసేపూ అతన్ని గమనించనట్టు కూర్చుని చూస్తున్నాను. రేపటికి క్లాసులో పాఠం వచ్చేసింది. ఒక గండం గడిచింది. మరి ఆ పాఠంలో వున్న విషయం అర్ధమయిందా? భారతదేశంలో ఒక గొప్ప సైంటిస్ట్ తయారయే కార్యక్రమానికి నాంది జరిగిందా?
- - -
నేనేదో గొప్పవాణ్ణని చెప్పటం లేదు. నాకూ ఇంజనీరింగ్ కాలేజీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎన్నో గొప్ప (వాడి) మార్కులు వచ్చాయి కానీ, ఆరోజుల్లో కారులో ట్రాన్స్మిషన్ ఎక్కడుందో చూపించమంటే ఆకాశంలో చుక్కలు చూసేవాడ్ని. లేదా పుస్తకంలో ఎన్నో పేజీలో ఎన్నో లైనులో వుందో ఠక్కున చెప్పేవాడిని. మరి మాకు కాలేజీలో ఓ కారు కానీ, కారు భాగాలు కానీ లేవు. మేము కూడా కారున్న గొప్పవాళ్ళం కాదు కదా పాపం! ఎలా తెలుస్తుంది?
నేను అంత గొప్పవాడిని కాదుకానీ, కొంత అయివుండవచ్చు అని నా అనుమానం. ఎందుకంటే నాకు బట్టీ పట్టి గుర్తుపెట్టుకోవటం అంటే కొంచెం కష్టంగానే వుండేది. అందుకని రకరకాల కథలు, సంఘటనలతో అన్వయించుకుని గుర్తుపెట్టుకునే వాడిని. అలా అయితే ఆ కాంసెప్ట్ అర్ధమయేది, కలకాలం గుర్తూ వుండేది. అది
కూడా ఎలా అలవాటయింది అంటే, మా ఇంటి పక్కన వున్న లైబ్రరీలో ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతుండే
వాడిని. వాటిల్లో కొన్ని, ముఖ్యంగా అమెరికన్, రష్యన్ పుస్తకాల్లో ఇలాటివి ఎన్నో వుండేవి. చాల రోజుల తర్వాత
మిత్రులు మహీధర నళినీమోహన్ సైన్సులో సరదాలు, గణితంలో గారడీలులాటి పుస్తకాలు వ్రాశారు కూడాను. అదీకాక నా అదృష్టం కొద్దీ గుంటూరులోనూ, కాకినాడలోనూ, కాలేజీల్లోమంచి గురువులు కూడా వుండేవారు.
ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఫిజిక్స్ ఉష్ణ ప్రవాహం గురించి చదివేటప్పుడు, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ లకు తేడాలు సరిగ్గా అర్ధమయేది కాదు. కొంచెం గాబరాగా కూడా వుండేది. అప్పుడో చిన్న కథతో దాన్ని మరిచిపోకుండా గుర్తుపెట్టుకోగాలిగాను. ఒకచోట ఇల్లు కడుతున్నారు. ఎన్నో ఇటికలు ఒక పక్క నించీ, ఇంకో చోటుకి తీసుకువెళ్ళాలి. వాటిని మూడు రకాలుగా తీసుకువెళ్ళచ్చు. ఒకటి, పనివాళ్ళంతా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నుంచుని చేతులతో ఇటికలు అందించుకుంటూ ఒక పక్కనించీ ఇంకో పక్కకి చేరవేయటం. (కండక్షన్) ఇంకొకటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇటికని ఒక పక్కనించీ ఇంకో పక్కకి మోసుకుంటూ తీసుకువెళ్లటం. (కన్వెక్షన్) మూడోది ఒక పక్కనించీ ఓ వెంకయ్య ఇటికలు విసిరేస్తుంటే, రెండో పక్కన ఇంకో టెంకయ్య వాటిని కాచ్ చేయటం. (రేడియేషన్) మన ఇండియన్ క్రికెట్ ఫీల్డర్ లాగా అప్పుడప్పుడూ కాచ్ వదిలేస్తే, ఇటికలు పగిలిపోయే అవకాశం కూడా వుందనుకోండి! అది మన చేతుల్లో లేదు.
- - -
తర్వాత మన దురదృష్టం కొద్దీ కొంతమంది మంత్రులు మహా ప్రభువులయిపోయి, చదువుని వ్యాపారం చేసేసి, సరస్వతీదేవిని నడివీధిలో అమ్మకానికి పెట్టేశారు. భారతదేశంనించీ, స్విడ్జర్లాండ్ దాకా లక్ష్మీదేవికి పట్టం కట్టారు. దానితో అసలు చదువు తిరపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొండెక్కింది. బట్టీ విక్రమార్కులు బట్టీతో మార్కులు సంపాదించుకుంటుంటే, కొంతమంది అక్రమార్కులు అక్రమంగా మార్కులు సంపాదించుకుంటూ, పరీక్షలు పాసయిపోతున్నారు. ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అమెరికాకి వచ్చేస్తున్నారు.
- - -
ఇలా అమెరికాకి వచ్చిన అక్రమార్కులలో కొందరితో ముఖ పరిచయం వల్లా, వృత్తి రీత్యా మాటల వల్లా మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడూ కొంచెం హృదయం కల్లుక్కుమంటుంది. మంచి కాలేజీల నించీ వచ్చిన సమర్ధులైన వారి గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు. ఆ మిగిలిన కుసింత మంది విక్రమార్కులు, అక్రమార్కుల గురించి మాత్రమే.
మా ఆఫీసులో డేటాబేస్ మేనేజ్మెంట్ కోసం ఒక టెంపరరీ ఏజన్సీ నించీ పిలిపించిన ఒక తెలుగు కుర్రాడు, ప్రొద్దున్న ఎనిమిదింటికి వస్తే పదింటికే తేలిపోయింది అతనికేమీ తెలియదని. లంచ్ టైం అవకముందే, అతనికి ఉద్వాసన చెప్పవలసి వచ్చింది. ఇలాటి కేసులు ఈమధ్య కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి.
- - -
ఆమధ్య ఒక పార్టీలో ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక బట్టీ విక్రమార్కుడు, బట్టీల విశిష్టత గురించి గొప్పగా మాట్లాడి, బట్టీలకీ జై అని తన ఉపన్యాసం ముగించాడు. ఒకసారి బట్టీ వేసినది, మరిచిపోవటం కష్టం అన్నాడు. కావాలంటే నిరూపిస్తానన్నాడు.
అతన్ని న్యూటన్ మూడు సూత్రాల్లో, మొదటి సూత్రం చెప్పి నిరూపించమన్నాడు ఒక సుబ్బారావు.
విక్రమార్కుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని, ఒక్క క్షణం ఆగి కళ్ళు తెరిచి, “ఎ బాడి ఎట్ రెస్ట్.. ఎ బాడి
ఎట్ రెస్ట్.. ఎ బాడి ఎట్ రెస్ట్.. “ అని కాసేపు మంత్రాలు చదివి, కొంచెం సిగ్గు పడుతూ, “చాల రోజులయింది కదా.. మరిచిపోయాను” అన్నాడు.
అప్పుడు నేను “బట్టుగారూ. చాల సులభంగా గుర్తు పెట్టుకోవచ్చు దాన్ని. తెలుగులో ఒక సామెత వుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంటుంది అని. అంటే ఎవరైనా వచ్చి దాన్ని తీస్తే తప్ప కదలదు మెదలదు అని. అదే న్యూటన్ మొదటి సూత్రం. ఇంకోసారి బట్టీ భాషలో అనుకుని చూడండి అర్ధమయిపోతుంది” అన్నాను.
అవును మరి! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంటుంది, మనం కదిలించక పొతే!
అందుకే ఈ చిన్ని ప్రయత్నం!
 

 

 

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech