శీర్షికలు  

      సంగీత సౌరభాలు - 3

 - రచన: సంగీతాచార్య డా|| వైజర్సు బాలసుబ్రహ్మణ్యం

 

 

వాలాజాపేట తాళపత్రములు, వ్రాతప్రతులు

కాగితపు వ్రాతప్రతులు:

1. ఈ కాగితపు వ్రాతప్రతులన్నీ విభిన్న పరిణామాలు గలవి (కొన్ని ఫూల్ స్కేపు, కొన్ని రాయల్ సైజు, కొన్ని ఎక్సర్ సైజి నోటుబుక్కుల సైజు కలవి). పాతకాలపు కాగితపు ప్రతులు, చేతితో తయారుచేసిన దళసరి నునుపు కాగితాలమీద ఉన్నవి. మూడు ప్రతులు ఇంగ్లండు నుండి దిగుమతి చేసుకొన్న కాగితాల మీద వ్రాసినవి. వాటి మీద ఆ కాగితం ఎప్పుడు ఎక్కడ ఏ పారిశ్రామిక సంస్థలో తయారైనదో తెలిపే సంకేతాలూ నీలి గుర్తులూ (వాటర్ మార్క్స్) ఉన్నవి. నీలిరంగు కాగితాల మీద వ్రాసిన ప్రతులు 19వ శతాబ్ది ఉత్తర భాగంలో రూపుదిద్దుకొన్నవి.

త్యాగరాజస్వామి వారి కృతులు, వారి జీవితకాలంలోనే సస్వరంగా శిష్యులచేత లిపిబద్ధమైనవవడానికి ఆ కాగితపు ప్రతులే తిరుగులేని సాక్ష్యం పలుకుతున్నవి. త్యాగరాజస్వామి వారు కనకాంగి - రత్నాంగి పరిభాషా క్రమాన్నే పాటించారనడాన్ని కూడా ఆ వ్రాతప్రతులే నిర్ద్వంద్వంగా నిర్ధారిస్తున్నవి.

ప్రాథమిక స్వర శిక్షణలో భాగంగా ఉండే అలంకారాలు, సంచారీ గీతాలు, లక్షణ గీతాలు, వర్ణాలు, త్యాగరాజస్వామి వారి కృతులు, సస్వరంగా లిఖితమైన పెద్ద నోటు బుక్కు ఇది. ఇందులోనే జైమిని సూత్రం, టీక, గానకానంద గ్రంథం, మూలం, టీక మరియు జ్యోతిష గ్రంథమైన సర్వార్ధ చింతామణి ఉన్నవి.

2. పోతన భాగవతం - స్వామివారు చివరి రోజుల్లో పారాయణ గ్రంథంగా వాడుకొన్న వ్రాతప్రతి. ఎర్రని పట్టుబట్టతో చిక్కగా బైండు చేసిన గ్రంథమిది. అచ్చు గుద్దినట్లున్న లిపిలేఖనంతో అద్భ్హుతమైన కైవాటంతో కూర్చిన వ్రాతప్రతి. దళసరి ఫుల్ స్కేపు సైజు కాగితం మీద రెండు వైపులా లేఖనమున్నది. కాగితంలో కానవచ్చే పార గుర్తు 1823, 1924, 1825 వ సంవత్సరాలనాటిది. వైజ్ అండ్ కంపెనీ వారు తయారుచేసిన కాగితాలవి! గ్రంథ పూర్వోత్తరభాగాల నడుమగల దశమ స్కందమున్న పట్టు చిన్న అక్షరాలతోనూ ఉన్నది. సప్తమ, నవమ, ఏకాదశ స్కందాలు కూడా గ్రంథములో ఉన్నవి.

శతరత్నమాలికా పుస్తకం అనే గ్రంథం ఒకటి, త్యాగరాజస్వామి వారి నౌకా చరిత్రమున్న గ్రంథం ఇంకొకటి కూడా భాగవతపు లిపి లేఖన శైలిలోనే ఉన్నది. ఈ రెండు గ్రంథాలూ వేంకటరమణ భాగవతులు లిఖించినవి గనుక అట్టి లిపి లేఖనమేగల భాగవతపు వ్రాతప్రతి కూడా వేంకటరమణ భాగవతులు కూర్చినదే అని నిశ్చయంగా చెప్పవచ్చును. వేంకటరమణ భాగవతులే భాగవతాన్ని కూడా లిఖించి తమ గురుగుగారి షష్ట్యబ్ద పూర్తి సందర్భంలో 1827 లో సమర్పించారు. వేంకటర్మణ భాగవతులే కోదండ రామస్వామి చిత్రపటాన్ని వేయించి స్వామివారి కుమార్తె వివాహ సందర్భంలో బహూకరించగా, ఆ చిత్రపట సౌందర్యానికి ముగ్డులై స్వామివారు ‘నను పాలింప నడచి వచ్చితివో’ అనే మోహన రాగ కృతిని పారవశ్యంతో పాడారు. ఆ భాగవతపు వ్రాతప్ర్తతి వేంకటరమణ భాగవతులు వ్రాసింది కాబట్టే అది తిరిగి గ్రంథ విలేఖకుని కడకే వచ్చి చేరింది.

3. స్వరసహితములైన 170 రచనలున్నవి.

4. స్వర సహితంగా 29 పాటలున్నవి

5. తెలుగు అర్ధాలతో గల జయదేవుని అష్టపదులున్నవి.

6. వేంకటరమణ భాగవతుల త్యాగరాజ స్వామి వారిని ప్రస్తుతిస్తూ చెప్పిన ‘శ్రీ కాకర్లన్వయ రత్నాకర’ అను ఆదిగురు స్తోత్ర పంచకము, వేంకటసూరి ‘నరసింహ దాస’ అనే ముద్రతో వ్రాసిన పాటలు, పైశాచిక భాషలో కొన్ని శ్లోకాలు ఇందులో ఉన్నవి.

7. త్యాగరాజస్వామి వారి ప్రహ్లాద భక్తి విజయమనే తెలుగు సంగీత నాటకము, మార్గదర్శి శేషయ్యంగారి కృతులు కొన్ని ఉన్నవి.

8. క్షేత్రయ్య పదాలు, మరికొందరు పదకర్తల రచనలు, కొన్ని జావళీలు ఉన్నవి.

9. త్యాగరాజస్వామి వారి నౌకాచరిత్రము, (ఆంధ్ర నౌకా చరిత్రమనే ప్రసిద్ధ గలది) కవి వేంకట సూరి కృతమైన సంస్కృత నౌకా చరిత్రము కలవు. భ్రమర గీతాలు కొన్ని ఉన్నవి. (ఈ గ్రంథం నోటుబుక్కులో వాడిన కాగితం మీద బాల్ స్టమ్ అండ్ కంపెనీ అనే సంస్థ తయారుచేసిన కాగితమనే సంకేతం (వాటర్ మార్క్స్) ఉన్నది)

10. శ్రీ కె.కె.రామస్వామి భాగవతారు యథాలాపంగా వ్రాసిన త్యాగరాజస్వామి వరి జీవిత విశేషములు కొన్ని మరియొక నోటు పుస్తకము నందు కూడా ఉన్నవి. ఇందులో ‘సీతారామ విజయము’ అనే సంగీత నాటకము వ్రాయడానికి దారితీసిన పరిస్థితులు విశదీకరించబడ్డాయి.

11. ‘వీణా వాదన తత్త్వజ్ఞః.....’ అనే యజ్ఞవల్క్యుని శ్లోకములో ‘శృతి జాతి విశారద’ అను మాటలకు బదులు ‘శృతి శాస్త్ర విశారద’ అని వ్రాయబడి ఉన్నది.

12. జయదేవుని అష్టపదులు, అనేక పదరచనల శుద్ధ సాహిత్యాలు ఉన్నవి.

13. స్వరార్ణవమను గ్రంథములోని విశేషములు పొందుపరచిన ఒక నోటు పుస్తకము ఉన్నది.

14. శొంఠి వేంకట రమణయ్య, శొంఠి వేంకట సుబ్బయ్య, వేంకట శేషయ్య మరియు గోవింద దీక్షితార్ వ్రాసిన తానములు ఉన్నవి.

15. 400 జన్య రాగములకు ఆరోహణ, అవరోహణ ఇవ్వబడినవి. ఇందులో కనకాంగి రత్నాంగి మేళపథకము యొక్క అనుసరణ కలదు.

16. అనేకమంది వాగ్గేయకారుల రచనలు స్వరసహితముగా వ్రాయబడినవి.

17. సౌరాష్ట్ర భాషలో పాటలున్నవి

18. నీలిరంగు కాగితములు కల నోటు పుస్తకములో కొన్ని స్వరసహితముగా నున్న రచనలు ఉన్నవి.

19. నిరూపణలు, కొన్నిసుస్వర రచనలు ఇందులో ఉన్నవి.

20. కాలక్షేపాలలో పాడుకొనే పాటలున్నవి.

21. రామానుజదాసుల కీర్తనలు, పద్యాలు, దరువులు ఉన్నవి.

22. 44 వర్ణాలిందులో ఉన్నవి. వీనిలో వీణ కుప్పయ్యరు, వేంకటరమణ భాగవతులు, గోవింద సామయ్య చెప్పినవీ కలవు. శ్రీరాగం మిశ్రజాతి త్రిపుట తాళంలో ‘సామినీ పదపద్మములే చాల నమ్మినాను బ్రోవు’ అనే అముద్రత వర్ణమొకటి కలదు.

23. గీతాలు, పవళింపు పాటలు, పురందరదాసుల రచనలు ఉన్నవి. ప్రతి రచనకు రాగ, తాళ, నామములు విధిగ నీయబడినవి.

24. పురంధరదాసు, వేంకట విఠ్ఠల దాసుల రచనల సాహిత్యమున్నది.

25. క్షేత్రజ్ఞుల పదాలు, తాళార్ణవం శ్లోకాలు, త్యాగరాజ స్వామివారి కృతులు కొన్నిటికి శుద్ధ సాహిత్య పాఠాలున్నవి.

26. ద్రౌపదీ వస్త్రాపహరణం మరియు తామ్రద్వయ రాజుల చర్తిత్రము అను రెండు తెలుగు గేయనాటకములున్నవి.

27. పురందరదాసు, వేంకటేశ దాసుల రచనలు కొన్ని సౌరాష్ట్ర లిపిలో ఉన్నాయి.

28. త్యాగరాజ కృతులు స్వరసహితంగా ఉన్నవి. ‘వర రాగ లయజ్ఞులు’ అను చెంచుకాంభోజి రాగంలోని కృతి ఇందులో సస్వరంగా ఉన్నది. ఈ నోటు పుస్తకంలోని కొన్ని ప్రతులు గణిత సంబంధమైన విషయములకు కేటాయించబడినవి.

29. స్వరసహితముగా కూర్చిన రచనలు కల మరియొక పుస్తకము ఉన్నది.

30. సస్వరముగా కల మరికొన్ని కృతులు.

31. తమిళ లిపిలో ‘కన్సర్ట్ స్వరమ్’ అనే శీర్షికతో గల స్వర రచన, నాటి యూరోపియన్ సంగీతంలోని మధురమైన స్వరాలు కలవు. ఈ స్వర రచనలకు సంస్కృత సాహిత్యమున్నది. ఇవి ‘గురుగుహ’ ముద్రగల ముత్తుస్వామి దీక్షితుల వారి సాహిత్యము.

32. ఛందశ్శాస్త్రము వివరింపబడిన రచన

33. అల్లాడి వంశమునకు చెందిన రామచంద్ర కృతమైన ‘సిద్ధాంత శిరోన్మణి’ అను సంస్కృత గ్రంథం.

34. కె.కు. రామస్వామి భాగవతుల వ్రాతలో గల త్యాగరాజ స్వామివారి కృతులు స్వరసహితముగా ఉన్నవి. అముద్రితములైన మైసూరు సదాశివరావు కృతులు కూడా ఇందున్నవి.

35. భద్రాచల రామదాసుల వారి పాటలున్నవి. జ్యోతిష విషయము కూడా కొంత కలదు.

36...

37. తాళ ప్రస్తార విషయము

38. త్యాగరాజ కృతులు స్వరసహితముగా ఉన్నవి.

39. కె.కె. రామస్వామి భాగవతుల వ్రాతలో కొన్ని కృతులు స్వరసహితముగా ఉన్నవి.

40 స్వరసహితంగా కొన్ని రచనలున్నవి. (గౌరీ కళ్యాణి రాగంలో ‘ముత్యాల చవికెలో’ అను అపూర్వమైన కృతి ఇందులో ఉన్నది)

41. రాగములకు ఆరోహణ, అవరోహణములు కలవు.

42. కొన్ని ఎంచబడిన కృతులు స్వరసహితముగా వ్రాసి ఉన్నవి.

43. వేంకట సూరి కృతములైన కీర్తనలున్నవి.

44. త్యాగరాజ స్వామివారి పంచరత్నములున్నవి.

45. అముద్రితములైన వర్ణములు, తానములు కలవు.

46. క్షేత్రజ్ఞుల పదములు గల ఫూల్ స్కేపు సైజు నోటు పుస్తకములున్నవి. ఇందులో ప్రతి పద రచనకు నాయకీ (నాయిక) లక్షణాదులన్నీ నాట్య పరిభాషకనుగుణముగా ఉన్నవి. ఈ వివరాలు రచనలను ప్రదర్శించువారు సరియైన రసపోషణ చేయుటకు సహకరించగలవు.

47. సంస్కృత భాషలో గల ‘సంగీతామృత చంద్రిక

48. కొన్ని వర్ణములు, తానములు గల ఫుల్ స్కేపు సైజు నోటు పుస్తకము

49. తాన పుస్తకం, తాన నిఘంటు. ఇందులో తానములు మరియు శ్యామశాస్త్రుల వారి రచనలు కొన్ని స్వరసహితముగా ఉన్నవి.

50. 51....

52. త్యాగరాజు స్వామి వారి నౌకా చరిత్రము అర్ధసహితమైన వివరణతో కలదు.

53. కొన్ని పాటలు సస్వరంగా ఉన్న చిన్న సైజు నోటు పుస్తకము.

పైన ఉదహరించిన వివరణ సంగ్రహము పరిశోధకులకు మరింత పని కల్పిస్తున్నదనడంలో సందేహం లేదు.

విస్సా అప్పారావుగారు నాదు చూచిన వాలాజీపేట వ్రాతప్రతుల గురించి వారు వ్రాసుకున్న విషయములు కొన్ని ఈ క్రింద ఉదహరించబడినవి.

1. వాలాజీనగర్, 1860 లో వేంకటరమణ భాగవతార్ గారు వెలిబుచ్చిన కీర్తన పుస్తకము మ్యూజియంలో ఉన్నది.

2. `వాలాజీపేట వ్రాతప్రతులలో గల స్వర సహిత కీర్తనల్లో 350 కృతులు పరిశీలితములై అచ్చుకి సిద్ధంగా వ్రాయించబడినవి. వీటిలో అనేకం పూర్వమే అచ్చులోనికి వచ్చినా వీటన్నింటినీ కూర్చుకుని తాము విడిగా వాలాజీపేట ఎడిషనుగా అచ్చువేయగల్మని సౌరాష్ట్ర సభవారు మాట ఇచ్చిరి. కాని తరువాత వారు ఆ ఉద్దేశమును విరమించుకొన్నట్లున్నారు. వాటిల్లో ఒక పది శాతమును అనగా 35 కీర్తనలను మాత్రము నేను ఉద్రించుటకు అనుమతిచ్చిరి. వాటినే ‘రేర్’ అండ్ అన్ పబ్లిష్డ్ కీర్తనాస్ ఆఫ్ త్యాగరాజు’ అను పేరున ప్రకటించితిని.

3. ‘ఎ’ `అచ్చిల్లాద శ్రీ త్యాగరాజస్వామి కలియన్ కీర్తనగళ్’ సౌరాష్ట్ర సభ మ్యూజియమ్ అండ్ సాహిత్య పరిషత్తు (1) - (7) మ్యూజిక్ అకాడమీ జర్నల్ వాల్యూం 1951 లో పిపి 90-96 ప్రచురించితిని - కృతిమాత్రము. వ్యాఖ్యానము వ్రాసి ఉన్నది’.

బి’ వాలాజీపేట వేంకటరమణ భాగవతార్ ప్రపౌత్రులు విద్వాన్ కె.అర్ (?) వేంకటరమణ భాగవతార్, శ్రీమతి ఎం.కె. కమలకుమారి (మదురై) వీరిద్దరూ కలిసి 27.12.1950 నాడు మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఎక్స్ పర్ట్ కమిటీ సభలో పాడిన నూతన కిర్తనలు - స్వరయుక్తములు. మ్యూజిక్ అకాడమీ జర్నల్ 1951, పేజీ 29.

విస్సా వారు సౌరాష్ట్ర సభకు - స్వామివారి కృతులకు సంబంధించి 1946-51 సంవత్సరముల నడుమ గావించిన గణనీయమైన కృషిని ఈ ఉల్లేఖనములు ఎత్తి చూపుతున్నవి.

ఈ వాలాజాపేట తాళపత్ర సేకరణల వల్ల త్యాగరాజ స్వామివారి జీవితమునకు సంబంధించిన అనేక విషయములు తెలియవచ్చాయి. త్యాగరాజు గారు రచించిన ‘నౌకా చరిత్రము’ గేయనాటకము ‘పాంచాల్ చరిత్ర’ అను పేరుతో సౌరాష్ట్ర భాషలోనికి అనువదింపబడినదని కూడా తెలియవస్తోంది. గత శతాబ్దంలో ప్రకాశింపబడిన కొన్ని అమూల్య గ్రంథములు కూడ ఈ సేకరణలో భగమై ఉన్నాయి.

ఇవేకాక మదురై సౌరాష్ట్ర సభలో ఇతర వాగ్గేయకారుల రచనలెన్నో పరిశీలించవలసినవి కలవు. ఇంకనూ సంగీతేతరములైన సాహిత్య విషయములూ అనేకములున్నవి.

చారిత్ర్యాత్మకముగా, సంగీత పరముగా ఈ వాలాజాపేట తాళపత్ర, వ్రాతప్రతుల ద్వారా అనేకమంది వాగ్గేయకారుల రచనల మూల సాహిత్యములు, రాగ-తాళ వివరముఉ, జ్కొన్ని రచనల వర్ణమెట్టులు ఈనాడు మనకు తెలుస్తున్నాయి. త్యాగరాజస్వామివారికీ, కర్ణాటక సంగీతానికీ, సంగీతేతరములైన సాహిత్య విషయాలకూ మదురై సాహిత్య పరిషత్తు తరగని గని అనుకోవడంలోని సామంజస్యాన్ని పైన తెలుపబడిన విషయములు నిరూపిస్తున్నవి. ఇంత సుదీర్ఘ ప్రస్తావనకు కారణమైన మదురై సౌరాష్ట్ర సభలోని వ్రాతప్రతుల వైశిష్ట్యమును, వాటి తులనాత్మక పరిశీలనావశ్యకమును పరిశోధకులు గ్రహించి అనేక కొత్త విషయములను వెల్లడించి, సంగీత సంపదను అభివృద్ధి పరచవలసి ఉంది.

ఈ విధముగ జరిగిన పరిశోధనా యత్నము వలననే 15 అపూర్వ త్యాగరాజ కీర్తనలు వెలుగుచూసినవి. ఆచార్య వేటూరి ఆనందమూర్తిగారు, విద్వాన్ శ్రీ ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారి పూనికతో మదురై సౌరాష్ట్ర సభలోని వ్రాతప్రతులలో ఉండి, గ్రంథరూపాన అచ్చులోనూ, వాడుకలోనూ లేని త్యాగరాజ స్వామివారి కీర్తనలు పదునైదింటిని సుప్రసిద్ధ గాయకులు ‘సంగీత కళానిధి’ శ్రీనేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచి, పాడి ప్రచారమునకు తెచ్చిరి. 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 



సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech