శీర్షికలు  

     శ్రీ శనీశ్వర శతకం-4
 

- రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ

 
 

31. సరసులు పండితోత్తములు సత్కవివర్యులు సాటివార లె

ల్లరు సెహబాసనన్ కడు బిరానను నాకృతి సాగనిమ్ము; నీ

శిరము మునంగ - జేతు నభిషేకము నువ్వుల నూనె తోడ-ప్రో

వర కరుణాంతరంగ - వరభక్త జనావన - శ్రీ శనీశ్వరా!

 

32. మంచి యశస్సు గూర్చి కడు మన్నన లందగ జేయువాడ;

వంచన లేనివాడ; పలు బాధలు మాత్రము పెట్టి మమ్ము శా

సించెడి వాడవయ్యు వరసిద్ధిని దీర్ప గ్రహమ్ములన్నిటిన్

మించిన నేర్పువాడ; కరుణించుచు బ్రోవర! శ్రీ శనీశ్వరా!

 

33. నేరేడు పండు మించు ద్విగుణీకృత వర్ణము వాడవీవు;

కారముదేముగాని మము గాచెడి పట్టున నిక్క మయ్యరో

క్షీరముకన్న, పల్కు చెలి చెల్వపు రాజ మరాళికన్న నున్

మీరిన తెల్పు నీ కృప; అమేయ గుణాకర - శ్రీ శనీశ్వరా!

 

34. ముదమున నీ గుణోన్నతి నమోఘపు రీతిని ఆలపించెదన్

మదికదె నీకు నిక్కమగు మక్కువ గూర్పగ మాల కాకికిన్

దధి బలులిత్తు; ‘మందునిను తత్పర బుద్ధిని గొల్చి, నామనో

రధమును దీర్చుకుందును పరంతప సోదర - శ్రీ శనీశ్వరా!

 

35. తొలుతనె భక్తి నీకిదియె దోయిలి యొగ్గుచు నుంటి; వెఱ్ఱినై

పలుకను నేటి నుండి శని బట్టెను నాకని స్వప్న మందునేన్

సలలిత నీలదేహ, బుధ సన్నుత, శాంతి అనుగ్రహించి -

త్ఫలముల నిచ్చి ప్రోవుమిక భవ్య గుణాకర! శ్రీ శనీశ్వరా!

 

36. ఇలపయి వాస్తవంబుగ నొకింతయొ అంతయొ మేలు జేయు, నిన్

ములుకుల పల్కులన్ దెగడు ముర్ఖుల ముక్కలు జేసి దిక్కులన్

కలయగ చల్లగా వలెను కాకుల గ్రద్దల కోగిరిమ్ముగన్!

లలితగుణున్ కవీంద్రు నను రాజిల జేయర - శ్రీ శనీశ్వరా!

 

37. సదయుడవైన నిన్ను మది సత్యము సుంతయుగాన లేక, ప్ర

ల్లదములు బల్కు చుంద్రు కవి రాజులు సైతము చిత్రమేమొ,

పదలను దాట లేక పెను బాధల నయ్యవి తాళ లేక హో

వదరెదరంతె; సైపుము ప్రభాకర నందన - శ్రీ శనీశ్వరా!

 

38, ‘శని-శనిగా డటంచు విరసంబుగ పల్కుదు మంతెగాని, నీ

పనులు సమస్తమెప్పుడు శుభప్రదముల్ గన; దైవతాళిలో

అనవసరంపు నింద పడుటయ్యది జెల్లెను నీకు మాత్రమే

వినతి నొనర్తు భక్తి నను వేగమ ప్రోవర - శ్రీ శనీశ్వరా!

 

39. ‘నీవను - నారదుండు - మరి నేనునుమువ్వుర మద్ది తొల్త నే

దో విధి నింద జెందుచు నుతుల్ తుది నక్కట పొందు చుందుమో

దేవర! చిత్రమౌర దురదృష్టపు కష్టపు జాతకాలు, మే

ధావుల సాక్షిగా మనవి; తాపము జెందకు - శ్రీ శనీశ్వరా!

 

40. మంచికి మారు పేరనుచు మాన్యుడ వంచును మున్గచెట్టు నె

క్కించుచు లేని పోని గుణకీర్తన చేయుటగాదు నిన్ను; నీ

అంచిత శక్తి యుక్తులవి అన్ని విధాలను గన్న పిమ్మటన్

వంచితి నా శిరంబిటుల వాయసవాహన - శ్రీ శనీశ్వరా!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech