సారస్వతం  
    
  సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (10వ భాగం)
 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil

 

15. నీవాతస్థిత దీపన్యాయం

 

నీవాత = గాలిలో;  స్థిత = ఉన్న; దీప = దీపం

అనగా గాలిలో పెట్టిన దీపం అని అని భావం. ఇదే న్యాయం తెలుగులో.. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్న సామెతగా కూడా వ్యవహారం ఉంది.

గాలిలో పెట్టిన దీపం, ఏ క్షణంలోనైనా ఆరిపోవచ్చు. ఎప్పుడు అనేది చెప్పలేము. అట్లే గాలిలో దీపం పెట్టి దేవుడిపై భారంవేయడం అవివేకం. దానికి రక్షణ కల్పించడమనే మానవ ప్రయత్నం చేయడం వివేకవంతుల లక్షణం. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలి కాని, ఎట్టి ప్రయత్నం చేయకుండా అంతా దేవుడే చూసుకుంటాడు అని తలచకూడదు అని పై న్యాయం బోధిస్తుంది.

ఈ న్యాయాన్ని భారతంలోని, ఆది పర్వం అష్టమాశ్వాసంలోనున్నమందపాలుని కథతో వివరిస్తాను.

కృష్ణార్జునుల సహాయంతో అగ్ని ఖాండవవనాన్ని దహించడానికి పూనుకొంటాడు. అదే వనంలో మందపాలుడుఅనే మునికిజరితఅనే పక్షి భార్యగా ఉంటుంది. వారికి వేద స్వరూపులైన నలుగురు కుమారులు ఉంటారు. వారిపేర్లు ... జరితారి, సరీసృక్కు, స్తంభమిత్రుడు, ద్రోణుడు.. రెక్కలు రాని ఆ పక్షిపిల్లలతో జరిత ఓ చెట్టుమీద కాపురం ఉంటుంది. మందపాలుడు దూర ప్రాంతానికి వెళుతూ తన కుటుంబం, కాపురమున్న వృక్షాన్ని దహించవద్దని అగ్నిని ప్రార్ధించి అభయం పొంది వెళ్ళిపోతాడు. ఈ విషయం తల్లి పక్శికి తెలియక ఆ అగ్ని జ్వాలల నుండి తన పిల్లలని ఎలా రక్షించుకోవాలా? అని ఆలోచిస్తూ పిల్లలతో ఇలా అంటుంది. .. నాయనలారా..! ప్రయళాగ్నివలేనున్న ఈ మంటల నుండి మిమ్ములను ఎలా కాపాడుకోను? మీ తండ్రివలే నిర్దయగా మిమ్ము విడచి వెళ్ళలేను. ఇక్కడే ఉంటే అందరం చనిపోతాము.కనుక మీరు ఈ చెట్తు కింద ఉన్న బిలాలలోకి వెళ్ళి దాగుకొనండి. మంటలు చల్లారాక బయటకు రావచ్చు. అని పలికిన తల్లితో పెద్దవాడైన జరితారి ఇలా అంటాడు..అమ్మా! ఆపదలు వచ్చినపుడు అన్ని విధాలా ఆలోచించి , సమయస్ఫూర్తితో మెలగడం ఉత్తమ లక్షణం. అంతేకాని నీవాతస్థిత దీపన్యాయంలా ఆలోచనారహితం గా కార్యం నిర్వస్తిస్తే అది ఫలించదు. అట్టివారికి దైవం కూడా తోడుగా రాడు. మమ్ములను ఈ చెట్తుపైనే ఒదిలి నువ్వు ఎగిరిపో, నీవు బ్రతికి ఉంటె మేము లేకున్నా మాలాంటి పుత్రాలను మరల పొందవచ్చు. ఇంకా క్రింద బిలంలో ఎలుక ఉన్నది. మేము అందులోకి దూరిన వెంటనే అది మమ్ములను తప్పక చంపి తినివేస్తుంది. ఇక్కడే ఉంటె గాలి వాలుకి మంటలు ఇటు రాకుండా ప్రక్కనుంచి పోవచ్చు. అప్పుడు మేము బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు తప్పక నష్టం జరుగుతుంది. అన్న కార్యం కంటే, జరుగుతుందో జరగదో అన్న కార్యం చేయడం మంచిది. మేము దైవాన్ని స్మరించుకుంటూ ఇక్కడే ఉంటాము. నీవు ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకో అని తల్లికి ధైర్యం చెప్పి, పంపివేస్తాయి. ‘అగ్ని మందపాలుని కిచ్చిన మాట ప్రకారం ఆ చెట్టుని దహించకుండా ప్రక్క నుండి వెళ్ళిపోతాడు. జరితారి చెప్పిన ఉపాయం ఫలించి పిల్లలు బ్రతికి ఉండడం చూసి ఆ తల్లి పిల్లలను చేరి పరమానందభరితురాలై, హాయిగా ఉంటుంది . ఇది కథ. ఈ కథలో మాతృహృదయం, పిల్లల సమయస్ఫూర్తి, ఆలోచనా విధానం, దైవ సహాయం అన్నీ చక్కగా వివరించబడ్డాయి. ‘నీవాతస్థిత దీపన్యాయం లా కేవలం దైవం మీదే భారం వేయకుండా తమని తాము కాపాడుకుంటున్న విధానం చక్కని ఉదాహరణ.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech