సారస్వతం  
    

         శకుంతల (పద్యకావ్యం) - 2

                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ  

 ప్రథమాశ్వాసం

కావ్యకథా ప్రారంభం

పూర్వము పూరువంశమున పుట్టిన రాజమనీషియొక్కడీ 

సర్వధరావిశాలపథచారుడు భారతదేశపుత్రుడా 

దుర్వహవిక్రముండు వరదోర్బల మండిత తేజు డొక్కనా 

డుర్విని దుర్గమాటవుల నుత్సుకతన్ మృగయావిహారియై                6

వెడలె దుష్యంత సంజ్ఞతో పిలువబడెడి 

వాడు మున్యాశ్రమ సురక్ష పాటు వడుచు 

క్రూర మృగ తర్జనోత్సాహకుండు నగుచు 

సాగె రథమున సారథి సహితుడగుచు.                             7 

వ్యాఖ్యానం

పద్యంతో కావ్యకథాంశం ప్రారంభమౌతోంది.

పూర్వం ఉన్నతమైన పూరు వంశంలో ఒక రాజమనీషి పుట్టాడు.రాజమనీషి అంటే రాజులలో గొప్ప మనస్సు గల రాజు అని ఒక అర్థం.శ్రేష్ఠమైన మనస్సు గల వాడని మరొక అర్థం.అలా పుట్టిన ఆ రాజపుంగవుడు ఈ సమస్త ప్రపంచమే తన విశాల మార్గంగా కలిగి ఉండేవాడు.అతడు భారతదేశానికే పుత్రుని లాంటి వాడు. ఆ అనితరసాధ్య పరాక్రమవంతుదైనవాడు తన భుజబలమే వెలిగే తేజస్సుగా కలిగి ఉన్నాడు. అలాంటి ఆ రాజు పేరు దుష్యంతుదు.ఆ రాజు ఒకనాడు మునుల వనాలను క్రూరమృగాల బారి నుండి రక్షించడానికీ,సాధుజీవులను కాపాడడానికీ సిద్ధపడినవాడై దుర్గమమైన అడవికి వేటకోసం బయలుదేరాడు. అతని వెంట అతని రథంతోబాటు,అతని రథసారథీ ఉన్నాడు. 

సింహ వ్యాఘ్ర గజేంద్ర ఖడ్గ విచలచ్చీత్కార ఫూత్కార వా 

గ్బృంహప్రోద్ధృతి ఘోరశబ్ద నినదోద్రేక ప్రతిధ్వానమై 

సంహారైక కథా ప్రచాలిత పథాసాంతశ్రాంత విభ్రాంతమై 

రంహింపన్ గని రాజసింహుడు ధనుర్బాణాయు ధోత్సేకుడై.                8

వ్యాఖ్యానం

రాజు ప్రవేశించిన ఆ ఘోరారణ్యం సింహాలూ,బెబ్బులులూ,మదగజాలూ,ఖడ్గమృగాలూ,మొదలైన క్రూర జంతువుల శీత్కారాలతోనూ, ఫూత్కారలతోనూ,గొప్ప అలజడిగా ఉన్నది.భయంకరమైన అరుపులు వినబదుతున్నాయి. ఎక్కడ చూచినా బలంగల జంతువులు బలహీన జంతువులను చంపి తినడం అనే సంహారక్రియ స్వేచ్చగా కొనసాగుతూ ఉన్నది.అలసిన జంతువులతోనూ,అలసిన వేటగాళ్ళతోనూ,ఆ అరణ్యం భయంకరమై కనబడసాగింది.అప్పుడు ఆ రాజు ఆ దృశ్యాలను చూస్తూనే తన ధనుస్సునూ,బాణాలనూ చేతబట్టుకొని వేటను కొనసాగించాడు

కాననంబుజొచ్చి గాంచిన మెకముల 

పారద్రోలి భయము పారద్రోలి 

యొక్క చోట మృగము మక్కువ గొల్పగ 

దాని వేటకొరకు పూని సాగె.                            9

వ్యాఖ్యానం

అలా ఆ రాజు ఆ అరణ్యంలోకి వెళ్ళి కనబడిన క్రూరమృగాలను దూరానికి పారద్రోలాడు. అలా చేయడం వల్ల మునులకూ,సాధుజీవులకూ భయం తొలగిపోయింది. అందుకే అతడు భయాన్ని పారద్రోలినవాడయ్యడు.అలా పారద్రోలుతున్నప్పుడు ఆ రాజుకు దూరంగా ఒక లేడిపిల్ల కనబడింది. దాన్ని చూడగానే ముచ్చట పడి, దాన్ని పట్టుకోవడానికి ముందుకు సాగాడు

 

సారథి యద్వితీయముగ స్యందనమున్ ఘన వాయువేగమున్ 

పోరునకో యనంగ తదపూర్వవనంబున ద్రోలుచుండె త 

ద్ధారుణి దద్దరిల్లునటు తత్క్షణమందనిపించె నీ రథం

బారయ నింగిపైకెగసి యావలి తీరము జేరునోయనన్.                  10

వ్యాఖ్యానం

రథాన్ని తోలుతున్న సారథి ఎంతో నేర్పరి. కనుకనే ఆ రథ్జాన్ని అద్వితీయంగా నడపడం ప్రారంభించాడు. వాయువేగంతో యుద్ధానికి తరలి వెళ్తున్న తీరులో ఆ అపూర్వ వనంలో రథాన్ని తోలుతూ ఉంటే భూమి దద్దరిల్లిపోతున్నట్లు అనిపించసాగింది. ఆ రథం నేలపైనే పరుగెడుతోందా లేక ఆకాశంలోకి ఎగసిపోతోందా అనే భావనను కలిగించసాగింది. నింగిలోకి ఎగసిపొయి ఆవలి తీరాన్ని చేరుతుందేమో అన్నట్లు ఆ రథం పరుగిడసాగింది.

అందినట్టులుండు నా క్షణమందున  

నా క్షణంబె అంద నట్టు లుండు 

హరిణ వేగమునకు హరులోడిపోవునో? 

హరులు జేరుకొనునొ హరిణపదము?                          11

వ్యాఖ్యానం 

లేడిపిల్ల ఆ రాజుకు అందినట్లే అంది తప్పించుకొనిపోసాగింది. ఒక క్షణంలో అందినట్లూ,ఒక క్షణంలో అందనట్లూ అనిపిస్తూ చిక్కకుండానే  పోయింది ఆ లేడిపిల్ల.ఇక ఆ లేడిపిల్ల వేగాన్ని అందుకోలేక ఆ గుర్రాలే ఓడిపోతాయో,లేక ఆ గుర్రాలు ఆ లేడిపిల్లను చేరుకుంటాయో తెలియదు. ఈ పద్యంలో హరిణములు,హరులు అనే పదాలతో కవి చక్కని అనుప్రాసాలంకారాన్ని ప్రతిబింబింపజేసి శ్రుతిసౌభాగ్యాన్ని ఇనుమడింపజేశాడు

 

                                                                                     -(సశేషం)    


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech