కబుర్లు  

     పట్టాభిరామాయణం

- రచన : బి.వి.పట్టాభిరాం  

మాటల మరాఠీలు
 

మ్యూనికేషన్ అంటే బాగా మాట్లాడటం మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ అసలు మాట్లాడకపోవడం కూడా కమ్యూనికేషనే. తీవ్ర ప్రభావంగల దాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుందిది.

ఉదాహరణకు కళ్ళు ముసుకుని ఓ ప్రయోగం చేయండి. ఇంట్లో ఉన్నారనుకోండి. మీరు పలకరించినా మిమ్మల్ని పట్టించుకోలేదనుకోండి. ఆ కోపంతో మీరు అలాగే ఆఫీసుకు వెళతారు. ఆశ్చర్యంగా అక్కడ కూడా ఇదే పద్ధతి ఎదురైందనుకోండి. మీకు బ్లడ్ ప్రజర్ మొదలై ‘వీళ్ళందరికి ఏం మాయరోగం వచ్చింది. ఇవాళ అంతా నోళ్ళు బిగించుక్కూర్చున్నారు’ అని తిట్టుకుంటారు.

ఇప్పుడు కళ్ళు తెరిచి దాన్ని గురించి ఆలోచించండి. మీలో ఏ ఒక్కరికైనా పై పరిస్థితి ఆనందంగా అనిపించిందా? నిశ్చయంగా అనిపించి ఉండదు. ఒకవేళ అనిపించి ఉంటే వారిలో ఏదో ఒక మానసిక లోపం ఉన్నట్లే! మీతో నలుగురూ మాట్లాడాలి. హాయ్, అని పలకరించాలి. కళ్ళతో, చేతులతో స్నేహభావాన్ని వ్యక్తం చేయాలని అనుకుంటున్నారా? మరి నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్నానా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ కుటుంబ సభ్యులతో, ఇతరులతో మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారా? స్నేహభావాన్ని వ్యక్తపరుస్తున్నారా? అని పరిశీలించుకోండి..

భారతదేశంలో లక్షల మంది భర్తలు ఈ కోవ లోకే వస్తారు. వారు సీరియస్ గా ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళందరూ వారికి నచ్చినట్లుగా ఉండాలి.

రైలు పట్టాల మాటలు:

ఇవెలా ఉంటాయంటే ఇద్దరు మాట్లాడుకుంటూంటే ఆ సంభాషణ, వినేవారికి పొంతన లేకుండా ఉన్నట్లనిపిస్తుంది. చూడండి..

ఏమండీ! మీరీమధ్య నాతో బొత్తిగా మాట్లాడ్డం మానేశారు అంది భార్య!

అబ్బ! ఆఫీసులో పనితో చచ్చిపోతున్నానే!

పొద్దున్నే వెళ్ళినప్పటి నుంచీ సాయంకాలం వరకూ పనే! అంటాడు భర్త.

అది కాదండీ! మొన్న ఆదివారం నా పుట్టినరోజని మీరు మరిచిపోయారు. నాకు కోపం వచ్చు మీకు గుర్తు చేయలేదు.

మా ఆఫీసులో ఒక దిక్కుమాలిన బాస్ వచ్చి చచ్చాడు. వాడికి పెళ్ళాంబిడ్డలతో పడిచావదు.

అదంతా మా మీద చూపిస్తున్నాడు.

ఇలా ఉంటుంది ఆ సంభాషణ.

ఆ వ్యక్తి భర్తగా తాను పోషించాల్సిన పాత్రను మరిచిపోయి ఎల్లప్పుడూ ఆఫీసు గొడవల్లోనే తలమునకలవుతున్నాడు.

ఇలాంటివారు ఆఫీసులోని ఒత్తిడిని ఇంట్లో పోగొట్టుకోవచ్చని తెలియక దాన్ని పెంచేసుకుని, ఇంట్లోవాళ్ళక్కూడా పిచ్చెక్కిస్తారు.

ఇంటా, బయటా పబ్లిక్ రిలేషన్స్ బాలన్స్ చేసేవారు విజయం సాధించగలుగుతారు.

కొంతమంది బయటివారితో బాగా కబుర్లు చెబుతారు.

ఇంటికొచ్చేసరికి మొహం మాడ్చుకుంటారు. వాస్తవానికి ప్రతివ్యక్తీ ఇంట్లోవారితో తాను ఉండవలసిన పద్ధతిలో ఉంటూ, పోషించవలసిన పాత్రను మనస్ఫూర్తిగా నిర్వహిస్తే మనశ్శాంతి లభించి తీరుతుంది.

ఆంథోనీ మెకిన్స్ అనే సైకాలజిస్ట్ నవసూత్రాలు రూపొందించారు. వాటివల్ల వేలాది జంటలు విడాకులు అనే మాటను మరిచిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నారు.

ఇతరులను విమర్శించేటప్పుడు ఆటల్లో కోచ్ లా సున్నితంగా చేయండి.

నిన్న ఎందుకు రాలేదు?

ఎక్కడ తగలడ్డావ్?

అనే బదులు నిన్న నువ్వు వచ్చి ఉంటే బాగుండేది, అనో లేదా నిన్న నువ్వు డిజప్పాయింట్ చేశావు అనో అని చూడండి.

కొన్ని ప్రశ్నలు డైరెక్టుగా అడగాలి. ఆలస్యంగా ఇంటికొచ్చిన కూతురిని ఇల్లు గుర్తొచ్చిందా? ఇప్పుడు టైమెంతైందో తెలుసా? అనటం కన్నా ఎందుకింత ఆలస్యం అనో లేదా ఇంతవరకూ ఏం చేశావు? అని సున్నితంగా అడగడం మంచిది. లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించే పరిస్థితి రావచ్చు.

అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తపరచాలి.

ఏమండీ! పండుగకు నేను పుట్టింటికి వెళతానండీ! అని భార్య అంటే కిందటిసారి వెళ్ళినప్పుడు నీ ఆరోగ్యం ఎంత పాడైందో గుర్తులేదా? అనేకన్నా నువ్వు నా దగ్గరే ఉంటే నాకు బావుంటుంది. అదే మనకు పండుగ అంటే ఇంకెప్పటికీ ఆవిడ పుట్టింటికి వెళ్ళదు. (అఫ్కోర్స్ కొంతమంది భర్తలకు అది ఇబ్బంది కావచ్చు) .

భార్యాభర్తల మధ్య వాగ్వివాదం తలెత్తినపుడు ఎవరో ఒకరు మరో గదిలోకి వెళ్ళి వేరే పని చేసుకోవాలి.

అందువల్ల కొంత ఉద్రిక్తత తగ్గుతుంది. అవసరమనుకుంటె పది నిముషాల బ్రేక్ ఇచ్చి వెళ్ళండి.

మీ విమర్శ ప్రత్యేకవ్యక్తికి సంబంధించి ఉండాలి తప్ప అందరినీ జనరలైజ్ చేయకూడదు. మీ వంశంలో అందరికీ గర్వం ఎక్కువ. అనటం కన్నా ఎవరి విషయంలో అలా అనిపించిందో చెప్పాలి. పరిస్థితిని కూడా విశ్లేషించుకోవాలి.

భర్త, ఆఫీసులో బాస్ తిట్టిన కోపాన్ని భార్యమీద చూపడం, కోడలు అత్తమీద కోపాన్ని పిల్లల మీద చూపి బాదడం చేయకూడదు.

ఎప్పుడు మీరే గెలవాలనుకోకుండా, ఇంట్లో వారికి కూడా గెలుపు రుచి చూపాలి.

చీటికీ మాటికీ గొడవలు పడి మాట్లాడుకోవడం మానేయద్దు. ఎదుటివారు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు వారిని క్షమించడం నేర్చుకోండి.

మీది తప్పయితే సారీ! అనటంలో తప్పులేదు.

మిమ్మల్ని ఇతరులు అకారణంగా విమర్శించినప్పుడు, కుమిలిపోయి, కుళ్ళిపోయి, జీవితాన్ని నరకం చేసుకోకండి. అటువంటి సంస్కారహీనులు ఏనుగును చూసి మొరిగే కుక్కల్లాంటి వాళ్ళని భావించి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి!

ఈ నవసూత్రాలను పాటించి నవ్వుతూ, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటె, మీరు మాయల మరాఠీలను మించిన మాటల మరాఠీలు కావచ్చు.

 

Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech