శీర్షికలు  
     పద్యం - హృద్యం - నిర్వహణ : రావు తల్లాప్రగడ  

"సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు మార్చి 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.   

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

  మాసం సమస్యలు 

తే.గీ.|| పతిని దూషించ నట్టి యా పత్ని తగదు

వర్ణన(స్వేచ్చా వృత్తంలో) : "నందన నామ సంవత్సరం"  పైన వర్ణన "

మీ ఇష్టమైన చందస్సులో పద్యం చెప్పండి

క్రితమాసం సమస్యలు  

ఆ.వె.|| తప్పుచేయకున్న తప్పుయగును

వర్ణన(స్వేచ్చా వృత్తంలో) : "వైకుంఠాన శివుడుంటే"

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ - గండికోట  విశ్వనాధం,  హైదరాబాద్ ,   

.వె.|| అనృతమాడ దోష మనుచు మాన ప్రాణ

భంగమందు మాట మార్చకున్న

ముప్పు తప్పు కొనుచు మెప్పు పొందగ, తగు

తప్పు చేయ కున్న తప్పు యగును.

 

.||శ్రీ నటనోజ్వల స్ఫురిత చిత్ర విచిత్ర వినోద నాద వి

న్నాణముతో శివుండు, గిరి నందన, నందియు, శృంగి భృంగియున్

మానిత వెండి కొండ విడి మాధవు ధామము చేర, యోగ ని

ద్రా నటనాను వర్తి, సముదంచిత శోభిత శ్రీ రమా పతే

తానుగ దివ్య రూపమున తత్వము వ్యక్తము చేయు విస్మితిన్

కానగ, యిర్వురొక్కటిగ గాంచితి, దైవమొకండె యంచు నా

మానస వీధి దర్శన ప్రభావము జూపిన, యా హరున్ హరిన్

ధ్యానము సేతు శుధ్ధ మతి ధన్యత పొందగ భక్తి నిండగన్ 

 

రెండవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం


ఆ.వె.|| ఆంగ్ల భాష నేడు అవసరంబై ఉండె

విశ్వవీధులందు వినుతి గాంచ

మాతృభాష అయిన మన తెలుగును నేర్చు

తప్పుచేయకున్న తప్పు యగును

 

శా.|| శ్రీకంఠుండు సతీసమేతముగ నా శ్రీకాంతు దర్శింపగా

వైకుంఠంబను చేర గంగ దుముకున్ వైకుంఠు పాదాలకై

వైకుంఠంబున పక్షిరాజు కబెళంపన్ సర్పముల్ యాల్గగా

లోకాధీశులు చిత్తశాంతి సుఖముల్ లోపింప చింతింపరే

 

మూడవ పూరణ- నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ 

ఆ.వె.||తప్పు చేయు వారు  ఎప్పుడెప్పు డనుచు

యెదుటి వారి పైన నెట్ట దలచి

నింద వేసి తుదకు నేరస్తుని గజేయ

తప్పు జేయ కున్న తప్పు యగును .

 

కం.|| వైకుంఠాన  శివుడుంటే 

ఆ కంఠుని గరళ మంత కడలిని ముంచన్ ! 

వైకల్యము గలిగి  సురలు                   

వైకుంఠము వీడి  భువిని వైవశ్యము నొందున్ !

 

 నాల్గవ పూరణ -యం.వి.సి. రావు, బెంగళూరు

ఆ.వె.|| తప్పుచేసినతని తప్పింప జూచుట

తప్పు, చేయకున్న తప్పు యగును

నేరమొకచొ, దాని నేర్పుజూపి తుదకు

దాటవలయు న్యాయధర్మ నిరతి

 

మ.||శివుడే గొప్పని కొందరుండగ మరిన్ శ్రీనాథుడే గొప్పగా

నవరోధంబులు సల్పుచున్ జనులు ద్వేషంబుల్ రగుల్కొల్ప న

య్యవివేకంబును ద్రుంచి తా హరిహరాద్వైతంబు బోధింపగన్ 

శివుడేతెంచెను పద్మనాభుకడకున్ చిత్తంబురంజిల్లగా

      

 

ఐదవ పూరణ - టేకుమల్ల వేంకటప్పయ్య

ఆ.వె.|| కల్తి సరుకు నమ్ము కలియుగ ధర్మాన,

మంచి సరుకు నమ్మ మాడు పగులు

లోక రీతి మార్చ లోకేశు దిగిరాడ!

తప్పు చేయకున్న తప్పు యగును!

 

ఆరవ పూరణ-  డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా.

ఆ.వె.|| మంచి చేసినట్లె మదినైన పరులకు

తప్పు చేయ కున్న;తప్పు యగును

పరుల యశము గాంచి మదిలోన చింతించి

మలిన మనసు తోడ మాటలాడ

 

ఏడవ పూరణ - నిరంజన్ అవధూత, బోస్టన్

ఆ. వె.|| పలికె ధర్మజుండు భారతమున బొంకు

దాగి వాలి గూల్చె దాశరథియు

ధర్మ రక్షణమున, తప్పని సమయాన,

తప్పు చేయకున్న తప్పు యగును.

 

కం || వెడలగ హరియును సిరియును

తోడుగ హిమసుతయు, గణము, దొడదొడ మనుచున్ 

వేడుక మీరగ రాగా

వెడలెను ఆ ఈశ్వరుండు విష్ణు పురముకున్

 

కం|| కడలిని హిమముగ మార్చెను

విడువక  మెడ దాల్చె శేష విష నాగంబున్

పాడగ శృంగియు, తాండవ

మాడెను పరమేశ్వరుండు ఆనందముగన్

 

కం|| గణపతి వీణియ మీటెను

గుణగణ్యుడు భ్రుంగి తాను కూరిమి చెలగన్

గణగణ మని మ్రోగించెను

గణములకును ముదము గూర్చ గంటల నెల్లన్.

 

కం|| శివ శివ శివ శివ హర యని

భవ హరుడగు హరుని, భక్తి భావము పొంగన్,

శివ భక్తులు కీర్తించిరి,

శివ రూపము నిండి పోవ చిత్తము నందున్.

 

కం|| కరి ప్రణుతుని లోకంలో

పరమేశుడు కొలువు దీర పార్వతి తోడన్

హరి పురమే తలపించెను

గరిమకు ప్రాసాదమైన కైలాస గిరిన్.

(కరి ప్రణుతుడు = గజేంద్ర మోక్షంలో ఏనుగుచే పొగడ బడినవాడు; విష్ణువు)

 

కం|| తెరిపించిరి నా కన్నులు

తెరువయ్యది చూపి నాకు, తెలుగున వేడ్కన్,

ఒరపున్  పద్యాల్ రాయుచు

తరియించెద నేను నేడు తల్లా ప్రగడా !

 

ఎనిమిదవ పూరణ - పి. విజయ్ భాస్కర్ మలక్పేట్ హైదరాబాద్

ఆ.వె.|| తప్పు చేసి నపుడు తనలోని పొరపాట్లు

బయట పడిన క్షణము బాధ పడెను

తప్పు దిద్ది నపుడు తనకీర్తి పెరిగేను

తప్పు చేయ కున్న తప్పు యగును  

 

తొమ్మిదవ పూరణ -  కృష్ణ అక్కులు

ఆ.వె||మనసు పడ్డ మగువ మనువుకు సైయన

మొదటి రేయి మొగడు మొరటు గాను

నీరస మనుచు చెలి సరసున సరసుపు

తప్పు చేయకున్న తప్పు యగును

 

ఆ.వె||ముద్దు బిడ్డ కూడ హద్దు మీరినపుడు

సుద్ది,బుద్ధి చెప్పి చూడ వలయు

తీరు మార కున్న దేహశుద్ది మొదలు   

తప్పు చేయకున్న తప్పు యగును   

 

కం||శ్రీకరుడె సంచరించగ  

వైకుంఠాన,శివుడుంటె పైడి హిమగిరిన్!!

ఆకులు,పువ్వులు,ఫలములు 

గైకొనమని మునిజనులు జగతిన కొలువరే!!     

 

కం||శ్రీకరుడై హరి నుండగ

వైకుంఠాన,శివుడుంటె పీకల దాకా!!

భీకరముగ గరళం గొని

ఏకంగా లింగములనె మ్రింగరె నేతల్!!

 

పదవ పూరణ- రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

ఆ.వె.||పిల్ల పెళ్ళి నాడు ఇల్లు కట్టెడినాడు

అప్పుగొన్న కూడ తప్పు యవదు!

తప్పెయైనగాని తప్పని స్థితిలోన

తప్పుచేయకున్న తప్పుయగును!

 

పదకొండవ పూరణ - జె.బి.వి.లక్ష్మి

కవిత:  ఇల్లు వళ్ళు పనివారాల కప్ప గించి

ఆర్ధిక పరిపుష్టి ,ప్రెజెంటబిలిటీ ,ప్లానింగ్

మానియాలో పడివున్న నేటి యువత తీరు

వైకుంఠాన  శివుడున్న రీతి

 

రివాజు లేక  వైకుంఠాన శివుడుంటే

రుద్ర రౌద్ర తాండవ ములే గాని

పవ్వ ళింపు సేవ లేవీ

నరుని కైన నారాయణుని కైనగాని

 

కవిత: తాటి చెట్టు క్రింద  పాలు తాగగ  నెంచి

కల్లు తాగు వాడన్నకీర్తి గాంచి

తప్పు చేయ కున్న గాని తప్పు యగునని వగచు వాని

వివేకము నెంచ వశమే నారాయణుని కైన నేడు !

 

కవిత : స్త్రీ దేవతా స్వరూపమని

ఆమె లో తల్లిని దర్శించాలని  జీర్ణించుకొని

తాళి కట్టి తనువులో సగ భాగ మిచ్చేదనని చెప్పిన

 మగువ తో  తప్పు చేయకున్న తప్పు యగున్ 

 

గతమాసపు సమస్యకు ఆలశ్యంగా వచ్చిన పూరణ - డా.రామినేని రంగారావు యం.బి.బి.యస్, పామూరు,ప్రకాశం జిల్లా.

ఆ.వె.|| పంక్తి తలలవాని పదగొట్టి యుధ్ధాన

రమణి సీత గొనియె రాఘవుండు

రచ్చ గెలిచి యింట రచ్చరచ్చగ చేసి

చాకి మాట తెలిసి చాన నొదిలె.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech