పాఠకుల సమర్పణ  
     మా నాన్నకు జేజేలు - నిర్వహణ : దుర్గ డింగరి  

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి. 


 

మా నాన్నగారు

 

డా|| పుట్టపర్తి నాగపద్మిని

ప్రేమ..

కుండలినీ శక్తి లాంటిది!

మారు మనలో ప్రవేశిస్తే యిక,

సహస్రారం దాకా ఆగదు.

జ్ఞాన చక్షువు ద్వారా,

సకల జగత్తునూ,

చుట్టి వస్తుంది!

వైయుక్తికం నుంచి

సామాజిక స్థాయికి పయనిస్తూ

వసుధైక కుటుంబం భావనని

మరింత పటిష్టం చేస్తుంది.

పంక్తులిలాప్రేమ గురించి రాయాలని ఎందుకనిపించిందో గాని మరుక్షణం కుండలినీ శక్తి గురించి, సహస్రారం గురించి మరోసారి తెలుసుకోవాలనిపించింది. ‘ఇంకెందుకు ఆలస్యం’? అన్నట్లు గూగుల్ నో మారు పలుకరించా! ఒక్క క్షణంలోనే వందల సైట్లు! పేజీల కొద్దీ సమాచారం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రాల వివరణ! అంతేనా! సూక్ష్మ శరీర ప్రయాణం ఎలా ఉంటుంది? మన సూక్ష్మ శరీరాన్ని మనం ఎలా చూడగలం? మరణానికి చాలా దగ్గరగా వెళ్ళి మళ్ళీ తిరిగి భౌతిక శరీరంలోకి ప్రవేశించిన వారి అనుభవాలు ఎలా ఉంటాయి? అన్న గ్రంథంలో స్వామీ యోగానంద గారి గురువు గారు యుక్తేశ్వర్ బాబా గారు మరణానంతరం గూడా సూక్ష్మ రూపంలో శిష్యుని దగ్గరికి వచ్చి తన అధ్యాత్మిక అనుభవాలను వివరించేవారట! (ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగీ) స్వామి యోగానంద ఆధ్యాత్మిక ప్రసంగాలిస్తూ ఉన్న సమయంలో అప్పటికే మరణించిన కొందరు శిష్యులు, సూక్ష్మ రూపంలో ఎదురుగా కూర్చుని వారి ప్రసంగాలను వింటూ కనిపించేవారట! ఇప్పుడైతే యిలాంటి విషయాలు ఎన్నెన్నో మనకు అవలీలగా తెలిసిపోయే మాధ్యమాలు బోలెడన్ని! కానీ 1970-75 ప్రాంతంలోనే యివన్నీ యింత అవలీలగా తెలిసిపోయే అవకాశం మాకుండేది! ఐన్ స్టీన్ తన పేరు తానే జపిస్తూ సమాధి స్థితిలో వెళ్ళిపోయేవాడట! రామకృష్ణ పరమహంస హనుమదుపాసనలో తన్ను తాను మరచిఉన్నప్పుడు ఆయనలో హనుమత్తత్వం సంపూర్ణంగా యెంతగా జీర్ణించుకుపోయిందంటే ఆయనకు వానరాల్లా వాలం (తోక) కూడా పుట్టుకొచ్చేసిందట. కబీర్ దాస్ ఒకసారెటో వెళ్తున్నారు. మార్గమధ్యంలో చోట పెద్ద గుంపు కనబడగా కారణమణిగారటఅందరూ ఎందుకలా మూగిఉన్నారని!’ ఎవరో చెప్పారు.. అక్కడి ఇంటిలో ఒక మహాపురుషుడు ఎలాంటి జబ్బులనైనా మూడుసార్లు రామనామం చెప్పి - తీర్దం యిస్తే ఠక్కున జబ్బు నయమై పోతోందట! కబీర్ దాస్ నవ్వారు. ‘ఇంతమాత్రం దానికి మూడు సార్లు నామం చెప్పడం అవసరమా? నేను ఒక్కసారి రామనామం చెప్పి తీర్ధం ఇస్తాను. జబ్బు తగ్గిపోతుంది. ఇలా రామనామ మహిమను తగ్గించడం మంచిది కాదని లోపలున్న మహనీయునికి చెప్పండి అన్నారు. తాను అన్న మాటను నిలబెట్టుకున్నారట. పుస్తకాలు తప్ప కంప్యూటర్ లాంటి మహత్తర మాధ్యమాలేవీ అందుబాటులో లేని రోజుల్లో ఇన్ని విషయాలు అవలీలగా తెలుసుకోవడం ఎలా సాధ్యం! తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదూ..! పదండి వెళ్దాం సారి కాలచక్రం గిర్రున వెనక్కి తిప్పి 1972 లలో కడప మోచంపేటలో వెలసి ఉన్న విశ్వేశ్వరాలయ విశాల ప్రాంగణంలోకి.!

సమయం సాయంత్రం 7 గంటల ప్రంతం! లోపలికి భక్తి శ్రద్ధలతో ప్రవేశించామనుకోండి! ముందు కూర్చోవడానికి స్థలం వెదుక్కోవలసి వస్తుంది మరి. తదేక ధ్యానంతో వేదికపై నుంచి వినిపించే గంభీరోపన్యాసాన్ని వింటున్న భక్త జన సందోహం!

గంగాఝరీ సదృశ్యంగా - అసదృశంగా సాగిపోతోంది. వాక్ ప్రవాహం! అప్రతిమాన ప్రసంగ వాహినిలో ప్రాచ్య, పాశ్చాత్య తత్వరీతులు మొదలు సాహిత్యం వరకూ అన్ని విషయాలూ అవలీలగా ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఉటంకించబడుతూ దాదాపు ఐదు సంవత్సరాలుగా సాగుతున్న పురాణ ప్రవచన చారిత్రాత్మక ఘట్టం! చెప్పబడుచున్నది. వాల్మీకి రామాయణం! ఇక పౌరాణికులు - ‘సరస్వతీ పుత్ర’ (1948), ‘వ్రజ భాషా భూషణ’ (1963), `సరస్వతీ తిలక’ (1964), `సర్వతంత్ర స్వతంత్ర’ (1972), ‘కవి సార్వభౌమ’ (1972) యిత్యాది బిరుదాలంకృతులు, శతాధిక గ్రంధకర్త, పుట్టపర్తి నారాయణాచార్యులవారు వయోధికులంతా భక్తి తాదాత్మ్యంతో ఏకాగ్రచిత్తులై వింటున్నారు. ‘పురాణ ప్రవచనంలో ఎక్కువగా, మీదపడిన వయసు తోరామా కృష్ణా అని ఆయాసపడుతూ గోడకి చేరగిలబడి వినే ముసలివారే ఎక్కువగా కనిపించడం ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడా ఇంతేలే! అని భావిస్తే తప్పులో కాలేసినట్టే అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన చంచరీక హృదయులు, దాంపత్య జీవన సౌఖ్యాలను మనసారా అనుభవిస్తూ ఆనందిస్తున్న దంపతులూ చాలామందే ఉన్నారక్కడ.

ఒక్క నిముషం ఏమరుపాటు వహిస్తే ఉపన్యాసంలోని యే ఆసక్తికర అంశాన్ని వదులుకుంటామో అన్న భయంతో వంచిన తల యెత్తకుండా ఆచార్యుల వారి ఉపన్యాస పాఠాన్ని తమ వెంట తెచ్చుకున్న పుస్తకాల్లో అతివేగంగా వ్రాసుకుంటూ వెళ్తున్న నావంటి శ్రధ్దాళువులూ చాలామందే ఉన్నారక్కడ. ఒక్కోరోజు వాల్మీకి విరచిత రామాయణంలోని నాలుగైదు శ్లోకాలకు మించి నడవదు ప్రవచనం! దాదాపు రెండు గంటలకు పైగా సాగే యీ ప్రవచనం. పై చెప్పిన రీతిలో ఐదు సంవత్సరాలకు పైగానే నడిచిందంటే మీరు నమ్మగలరా? ‘ఒక్కో సందర్భాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ రామాయణాలలో ఎలా చిత్రీకరించారు? వాల్మీకికి భిన్నంగా వ్రాసి, సఫలీకృతులైన వరెవరు? వాల్మీకిని అక్షరశః అనుసరించి తరించినదెవరు? రామనామ మహిమను తామనుభవించి, దివ్యానుభవాన్ని పంచి సకల జనావళినీ ధన్యజీవులను చేసిన పుణ్యపురుషులెవరు? రామనామ దివ్యమంత్రమే నారాయణ దివ్య మంత్రమా? అసలు మంత్రమంటే ఏమిటి? బీజాక్షరాలను నిక్షిప్తం చేసి వ్రాసినసౌందర్య లహరిలో ఆదిశంకరుల వారు అమ్మవారి అఖండ తేజోరూపాన్ని అభివర్ణించిన పద్ధతి ఎలాంటిది? ఆదిశంకర భగవత్పాదులు హైందవ ధర్మాన్ని ఎంత పటిష్టంగా నిలిపారు? తదనంతర కాలంలో వైష్ణవ, మధ్వ సిద్ధాంతాలెలా నెలకొల్పబడ్డాయి? సిద్ధాంతాల మధ్య ఎలాంటి స్పర్ధలుండేవి? స్పర్ధలు కేవలం ఆయా సిద్ధాంతాలననుసరించే వ్యక్తుల వల్ల వచ్చినవా? లేక వాటి మధ్య ఉన్న తేడాలవల్లనా? వీటన్నింటికన్నా మించి అసలు అన్ని సిద్ధాంతాలలోనూ భక్తి తత్త్వాన్ని విశ్లేషించిన తీరేంటి? నవవిధ భక్తి మార్గాలలో తరించి ముక్తినందన ధన్య్లులెవరు? భగవన్నామ సంకీర్తనా సుఖాన్ని పంచిన అన్నమయ్య ముప్ఫై రెండువేల కీర్తనలెలా అనూహ్యమైన వైవిధ్యంలో వ్రాయగలిగాడు? అసలు శృంగారాన్నీ, వైరాగ్యాన్నీ, ఒకే వ్యక్తి అనితర సాధ్యమైన రీతిలో తన పదాలలో పోషించటం వూహించగలమా? అన్నమయ్య ఆరాధించిన ఏడుకొండల వానినితిరువేంగడముడైయ్యాన్గా ఆరాధించిన తమిళ ఆళ్వారుల పాశురాలలోని భక్తితత్వం ఏమిటి? వైష్ణవ దివ్య క్షేత్రాలలో తిరుమల స్థానం ఏమిటి? తిరుమలను కృష్ణదేవరాయలు ఎన్నిసార్లు దర్శించాడు? తిరుమలదేవి, చిన్నాదేవి వెంట ఉన్నారా? అసలు కృష్ణదేవరాయల వ్యక్తిత్వం ఎలాంటిది? రూపం ఎలా ఉండేది? స్ఫోటకపు మచ్చల ముఖమైనా, సాహసంలో, భాస్కరునిగానూ, సాహిత్య పోషణలో చలువరేనిగానూ కొనియాడబడిన రాయలవారి ఆముక్తమాల్యద రచనా విశేషాలేంటి? ‘అసలు ఆముక్త మాల్యద ఆయన రచనే కాదు. స్వామి భక్త పారాయణులైన అష్టదిగ్గజ కవులెవరో రాసి ఆయన పేరు పెట్టారంటారు నిజమేనా?

యెన్నెన్నో విషయాలు..గుర్తు తెచ్చుకుని యిక్కడ ఉటంకించడానికే నాకు కాస్త కష్టంగా ఉంది కానీ కంప్యూటర్ లాంటి సాధనమూ లేని రోజుల్లో పుట్టపర్తి వారెలా ఇన్ని విషయాలు చదివి గుర్తించుకుని సందర్భోచితంగా ప్రస్తావించే వారో, తలచుకుంటె యిప్పటికీ ఆశ్చర్యమే నాకు! ‘వేదికపై పుంభావ సరస్వతిలా విజృంభించే పుట్టపర్తి వారు. నామమాత్ర సంభావనగా రోజు భక్తితో ఆలయ నిర్వాహకులు సమర్పించేది ఐదు రూపాయలే అయినా వినే వారికి ఐదు జన్మలకు సరిపడే సమాచారాన్ని ఉదారంగా అందించేవారు. అంతే! వేదిక దిగిన వెంటనే అతి మామూలు వ్యక్తిగా నిరాడంబరంగా వ్యవహరించే అభినవపోతన’ (1948 లో గద్వాల మహాసభలో ఇచ్చిన బిరుదు). సాక్షాత్తూ నాకు జన్మనిచ్చిన తండ్రి మా అయ్యగారు. విస్ఫారిత నేత్రాలతో విరాణ్మూర్తి రూపాన్ని పదే పదే చూస్తూ హృదయ మందిరంలో నిలుపుకునేదాన్ని నేను! వారి ఉపన్యాస పరంపరలను విన్న జ్ఞాపకాలను ఇప్పటికీ అమృత గుళికలుగా పదిలంగా దాచుకున్న అదృష్టవంతులెంతమంది ఉన్నారో తెలియదు.

అసలు మా అయ్యగారంతటి పాండిత్యాన్నీ ధారణనూ ఎలా అలవరచుకున్నారో అదో పెద్ద కథ. పన్నెండేళ్ళ వయసులోనే పెనుగొండ లక్ష్మి నిఘనగిరి నివాసిని గా ఆవిష్కరించారు బాలనారాయణులు! (1943 సం|| మద్రాసు విశ్వవిద్యాలయం వారు, విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఖండకావ్యాన్ని పెట్టారు). ఇదే కావ్యం పుట్టపర్తి వారు మళ్ళీ ఎప్పుడో విద్వాన్ పరీక్షకు కూర్చున్నప్పుడు పాఠ్యగ్రంథంగా వుండడం - పరీక్షలో ఒకే ఒక్క ప్రశ్నకు మూడు గంటలూ వెచ్చించి నారాయణా చార్యుల వారు యేటి పరీక్షలో అనుతీర్ణులవడం - ఇప్పటికీకథగా నిలిచిపోయిన మరో వాస్తవం.! 1972 జనవరి, 25అర్ధరాత్రిపద్మశ్రీ వచ్చిందన్న టెలిగ్రామ్ నేను అందుకుని ఆనందంగా అయ్యగారికి శుభాకాంక్షలు తెలిపితే చిరాకుపడిఇప్పుడిప్పుడే నిద్రపడుతోంది వార్త పొద్దునే చెబితే పోయేదిగా తొందరేముంది? అని నన్ను కసురుకుని అటు తిరిగి పడుకోవడం మరో కథ.

అరవై ఏళ్ళు దాటిన వయసులో ఉర్దూ నేర్చుకునే ప్రయత్నం చేయటం, ఆకాశవాణి మృదంగ విద్వాంసుడు భాస్కరభట్ల కృష్ణమూర్తి గారి దగ్గర మృదంగ వరుసలు కంఠతా పట్టటం యింకో కథ! మృత్యుశయ్యపై పడుకుని ఉన్నాపెరిస్త్రోయికా చదవలేకోయానేఅని తపన చెందడం ఉత్కంఠను రేపే మరోకథ!

మొత్తం అయ్యవారి జీవితమంతా యిలా కథలు కథలుగా చెబుతూ పోతే యింకా కాస్త మిగిలే ఉంటుందేమో! మా అమ్మ, మధుర కవయిత్రి వాగ్గేయకర్త్రి పుట్టపర్తి కనకమ్మ గారు (1921-1983). మా అక్కయ్యలు, అన్నయ్య మాటల్లో మరిన్ని విశేషాలు దొర్లుతుంటాయి.

పెళ్ళయిన కొత్తలో (1934 ప్రాంతాలు) మా అమ్మ పంచకావ్యం పాఠం చేసేదట అయ్యగారి దగ్గర!. వంటరాదు అంతగా! ఒకే ఒక్క గోరు చిక్కుడు వేపుడు ( మా కడపలో దీన్నిమటిక్కాయలు అంటామండీ) నీళ్ళచారు చేయడం వచ్చు. ఇదే వంటని దాదాపు రెండేళ్ళు చేసి పెట్టిందట తను. వంట ఏదైనా పరవాలేదు కానీ కావ్య పాఠం అప్పజెప్పకపోతే ఇక అయ్యగారి కోపం తారాస్థాయికి చేరుకునేదట! ప్రొద్దుటూరి నివాసంలో బడిపంతులు ఉద్యోగానికి వచ్చే చిన్న జీతంలో, వాళ్ళయిళ్ళకు వెళ్ళమన్నా వెళ్ళక అయ్యనంటిపెట్టుకుని ఉండే శిష్య బృందానికి ఎలా వండి వార్చేదే అమ్మకే తెలుసు! అంతేనా! ఊళ్ళోకి సంగీత విద్వాంసుడు వచ్చినా, రంగస్థల నటులు (సూరిబాబు లాంటివాళ్ళు) వచ్చినా, హరికథకులు వచ్చినా మా ఇంట ఆతిథ్యం స్వీకరించాల్సిందే! ఇవి కాక ఇంట్లో ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురు ఆడపిల్లల రక్షణ భారం. ఎటిమలాజికల్ డిక్షనరీ తయారీకి డిగ్రీలూ లేకపోయినా పాండిత్యమే కొలబధ్దగా యెన్నుకొనబడి తిరువాన్కూరుకు అయ్య ప్రయాణం. అక్కడి పరిస్థితులు నచ్చక కొద్ది రోజులకే తిరిగి రాక. మళ్ళీ అంతలోనే సాహిత్య అకాడమీ ఢిల్లీ పిలుపు! అక్కడా యిమడలేక అనారోగ్యంతో యింటికి! మధ్యలో వైరాగ్యభావన! ఒంటరిగా హిమాలయాలకు ప్రయాణం! ఎక్కడున్నారో తెలియదు! తిరిగి కొన్ని రోజులకే సరస్వతీ పుత్రునిగా పునరాగమనం! కొన్ని రోజులు స్మశాన వాసం! కృష్ణ చైతన్య సంప్రదాయంతో చెట్టపట్టాలు! అరబిందో సహవాసం! మళ్ళీ కంచి పెద్దస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీర్వాదబలంతో 1970 నాటికి జీవితంలో నిలకడ!

ఇక మా అక్కయ్యలు కరుణ తరులతల మాట్లల్లో వాళ్ళ సంగీత విద్యాభ్యాసం ఘట్టమొకటి! ‘మాకప్పటికి పది పన్నెండేళ్ళే! తెల్లవారు ఝామున మూడు గంటలు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నిశ్శబ్ద వాతావరణం! పూల తోతలూ, చల్లగాలులూ, అందమైన కలలలో విహరిస్తున్నా! ఇంతలో భుజంమ్మీద దెబ్బపడింది. ‘కరుణమ్మా లేలే! అంటూ అయ్య పిలుస్తున్నారు. తీయని కల నుంచి తేరుకోవాలని లేదు. పక్కనున్న తరులతనూ లేపుతున్నారయ్య! బలవంతంగా కళ్ళు తెరిచాను. పాపం చెల్లెలూ లేచింది నాలాగే! ‘విను విను నాదస్వరం వినిపిస్తోందా? అయ్య ప్రశ్న! నాదస్వరమా, ఇప్పుడీవేళలోనా! చెవులు మొరాస్తున్నాయి. ‘ఏమే తరులతా! వినిపిస్తోందా? అయ్య గద్దింపు.. ‘..... వినిపిస్తోంది..!’ ‘వినిపిస్తోంది కదూ శ్రద్ధగా వినండి... నాదస్వరం పై వినిపిస్తున్న కీర్తనేంటి? రాగమేంటి? దాని ఆరోహణా, అవరోహణా చెప్పండి..? నిద్రమత్తంతా ఎగిరిపోయింది. ఇంకెక్కడి నిద్ర. కళ్ళు నులుపుకుంటూ కష్టపడి ఆపాటేదో విన్నాం ఇద్దరమూ..అదీ ..అదీ .. నసుగుతున్నాం. ‘ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నా గుర్తుకురాలేదా? రఘువంశ సుధాంబుధి కదూ అది.. మాత్రం తెలీలేదా? విద్యార్ధులు ఎలా ఉండాలి? అర్ధరాత్రి నిద్రలేపి అడిగినా ఠక్కున జవాబు చెప్పాలిగా! అంటూ గద్దించి మళ్ళీ పడుకోమని చెప్పి వెళ్ళిపోయారయ్య! మళ్ళీ పడుకోవడానికి నిద్రవస్తేనా? నాదస్వరం వినిపించే వరకూ.. మళ్ళీ ఎప్పుడు వస్తారో, రాగం చెప్పమని అడుగుతారో అని భయంతో నిద్ర పోనేలేదు తెలుసా! ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో!

ఇక సంతానంలో తరువాత జోడీ! తులజక్కయ్య, అరవిందుడు. వాళ్ళ మాటల్లో ముచ్చట. మా ఇద్దరికీ సంతీతంతో పాటూ మైథివీశరణ్ గుప్తసాకేత్ని జంటగా కంఠోపాఠం చేయించారు. అయ్యగారితో మేము ముద్దుముద్దుగా సభలకు వెళ్ళేవాళ్ళం. అక్కడేదైనా సభా వేదికపై సందర్భం వస్తే మా పిల్లలిద్దరూసాకేత్ జంటగా చదువుతారు. వినండి అంటూ పిలిచి సాకేత్ నవమసర్గ్ లో ఊర్మిళా వేదన ఘట్టం చదవండి..అని పురమాయించేవారు. అక్కడేదైనా పొరపాటు జరిగిందో అయ్యకు చాలా కోపం వచ్చేది.

ఇవన్నీ వింటూంటే నాకొక్కటె అనిపిస్తోంది.. మా అయ్యగారికి మాతృప్రేమ దక్కలేదు. భార్యా వియోగంలో ఒంటరైన తాతగారు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులవారు. తండ్రి ప్రేమనూ అందించలేకపోయారు. పరిస్థితుల్లో అయ్య జీవితంలో సరైన దిశా-దశా కరువై, ఒక గాడిలో పడేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. నిద్రాహారాలు మాని తిరుపతిలోని గ్రంథాలయాన్నంతా కాచి వడగట్టడం, వివిధ భాషా సాహిత్యాలను మధించడం, తత్త్వశాస్త్ర అవలోకనం, తర్క వ్యాకరణాలంకార శాస్త్ర మథనం. సంగీత నాట్యాభ్యాసం.. ఇలా తనకు నచ్చినదాన్నల్లా నేరుస్తూ పోవటం వల్ల పరిధిలేని పాండిత్యం అబ్బింది. పాండితీలోకంపుట్టపర్తిని చూసి అమ్మో ఘటికుడు! అనేలా చేసింది కానీ .. అర్ధికంగా కడగండ్లు తప్పలేదు. అలా కాక, పిల్లలనయినా ఒక మార్గాన నడిపి, వారి జీవితాలకో గమ్యం నిర్దేశించాలన్న తపనే, పిల్లలపట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకునేలా చేసిందేమో అని!

సంఘర్షణాయుతమైన అయ్యగారి లాంటివారి జీవితాలు - ఇలా ఉంటేనే వారు సాధించిన విజయాలకు బ్రహ్మరథం పడతారు ప్రజలు. కూర్చున్న చోటనే చల్ల కదలకుండా, జీతం జేబులోకి చేరుతుంటే.. ఇక సాధించేదేముంటుంది? ఆటుపోటుల జీవితమే సాహసాలకు శ్రీకారం చుడుతుంది. అయ్యకు జీవిత ప్రధమార్ధం - సంఘర్షణాకాలం (1914 నుండి 1990 వరకూ పరిఢవిల్లింది వారి జీవితం)

ఆనాతి సాహిత్య ప్రపంచంలోని పోటీకి ధీటుగా పదునాల్గు భాషల ప్రగాఢ పరిచయం, పుంఖాను పుంఖాలుగా వివిధ ప్రక్రియల్లో, భాషల్లో విశృంఖల విహారం, వివిధ వేదికలపై సంగీత, సాహిత్య, నాట్య, విన్యాసాల అనితర సాధ్యకృతిశివతాండవ గానం, ప్రాకృత సాహితీ సుగంధ గంధ విస్తరణం. .ఇలా ఏనాటికా ఏడు తన జ్ఞాన విస్తరణకే చాలా సమయాన్ని వెచ్చించడం జరిగింది. అయ్య అనగానే ఇరవై నాలుగు గంటలూ తన గదిలో కరణం బల్ల ముందు కూర్చుని ఏవేవో గ్రంథాలను తదేకంగా చదువుకుంటున్న అయ్యగారి విగ్రహమే గుర్తొస్తుంది. ఎర్ర, ఆకుపచ్చ, నీలి, సిరా కలాలతో యేదో నోట్ చేసుకుంటూ తన ప్రక్కనే ఉన్న పెద్ద పెద్ద నోటు పుస్తకాలలో వ్రాసుకుంటూ ఉండెవారెప్పుడూ..తాను పనిచేసే రామకృష్ణా హైస్కూల్ కుకాలినడకన బయలుదేరేటప్పుడూ. ఇలాంటి ఒకటో రెండో నోటు పుస్తకాలు పట్టుకుని శుబ్రంగా ఉదికిన జుబ్బా కాసెపోసి కట్టుకున్న పంచె ధరించి, గంభీరంగా తలవంచుకుని వీధి వెంట వెళ్తూ ఉండేవారు. కానీ పెదవులెప్పుడూఅష్టాక్షరీ మంత్రాన్ని మననం చేస్తూనే ఉండేవి. ప్రొద్దుటూరు అమ్మవారి పాఠశాలలో 15 రూ.నెల జీతంతో మొదలై, 1972 లో కడప రామకృష్ణా హైస్కూల్లో నెలకు వెయ్యి రూపాయల జీతంతో అయ్యగారి ఉద్యోగ విరమణ జరిగినట్లు గుర్తు. మా యిల్లు పూర్తిగా మధ్యతరగతి కుటుంబానికి ప్రతీక. పండుగలకూ, పబ్బాలకూ కొత్త బట్టలు తెచ్చినా, మా అమ్మే కత్తిరించి, తెల్లవార్లూ పావడా జాకెట్టు కుట్టడం నాకింకా గుర్తే. ‘దుసురుపోగు’ (దూరదూరంగా త్వరగా కుట్టే కుట్టు) తో బట్ట్లలకోరూపం ఇచ్చి, పండుగ గడిచిన తర్వాతగట్టికుట్టుతో మళ్ళీ పావడా జాకెట్ భద్రంగా కుట్టేదమ్మ! తన జీతం అప్పుడప్పుడూ రచనలకు ప్రచురణకర్తలిచ్చే డబ్బు, సభలూ, సన్మాలకూ వచ్చే డబ్బూ - అంతా అమ్మ చేతుల్లో పోసేవారయ్య! ఇల్లంతా అమ్మే నడిపేది. మాకేకాదు మా అయ్యకు పంచెలూ, జుబ్బాలూ, ఆఖరికి బీడీలు కూడా అమ్మకొనేది. అయ్యకసలీ విషయాలు పట్టవు. ఎప్పుడూ చదువు..చదువు..అంతే.

క్రమంలోనే కావ్య, గేయ, నవలా, వచన, విమర్శన గ్రంథాల రచనలో చిత్తు వ్రాత ప్రతుల తయారీలో అమ్మ, కరుణక్కయ్య, తులజక్కయ్యలూ శ్రమించారు. ‘అయ్యకూ సంసారినికై పాటు పడాలని ఉండేదేమో పాపం! తనకుబాగా చేతనైనదీ, తన రచనలు కావాలని వస్తున్న ముద్రణ సంస్థలకు కావలసినదీ - అదే కావటం వల్ల అవకాశాన్నీ వదులుకొనక భార్యా పిల్లలపై ఆధారపడేవారేమో అయ్య!’ అనిపిస్తుంది నాకిప్పుడు. ఎందుకో మొదటి నుంచీ అయ్య, అక్కయ్యలో వ్రాయటమే చూశాను నేను. నిదానంగా కలాలతో వ్రాసే అలవాటు వల్ల వేగంగా రాయలేకపోయేవారేమో అయ్య! అక్కయ్యల పెళ్ళిళ్ళయి - వాళ్ళు అత్తవారిళ్ళకు వెళ్ళేనాటికి (1968) నాకు పదిహేనేళ్ళు. అప్పటి నుంచీ రేడియో ప్రసంగాలూ, త్యాగరాజు, అన్నమయ్య వంటి ఉపన్యాస పాఠాలూ, వరాహపురాణం, భామినీ విలాసం లాంటి పీఠికలూ 1976-77 ప్రాంతాలలో కడప ఆకాశవాణిలో ప్రసారమైనభారతంలో స్త్రీ పాత్రలు ప్రసంగ మాలికలు వంటి చిత్తు, వ్రాత ప్రతులు నేను వ్రాశాను. అయ్యగారి దగ్గర హాలుని గాథా సప్తశతి, రవీంద్రుని గీతాంజలి, అరబిందో ఊర్వశి, వేంకటాధ్వరి విరచితలక్ష్మీ సహస్త్రం’, ఇక అమ్మ దగ్గర నన్నయ్య ఆదిపర్వం, గోదా విరచిత తిరుప్పావై యిలా పాఠాలు చదివాను.

అమ్మయితే అయ్యగారిభాగవత సుధాలహరి చిత్తు వ్రాత ప్రతులను ఒంటిచేత్తోనే వ్రాసింది. 1970 నాటి మా యింటిని తలచుకుంటే మనసు విలవిల్లాడుతుంది. మళ్ళీ కాలచక్రాన్ని యిందాకటిలా వెనక్కి తిప్పి, కాలాన్ని కొత్తగా మరింత పరిణత హృదితో.. అమ్మ అయ్యల పట్ల ఆరాధనా భావంతో, అంకిత భావంతో, అనుభవించాలన్న తపన ఊపిరాడనివ్వదు. ప్రతి శనివారం ఇంట్లో శ్రీరామ పట్టాభిషేకం! అమ్మ వారమంతా చేసి ముగించిన శ్రీమద్వాల్మీకి రామాయణం ముగింపు సర్గ - పట్టాభిషేక సర్గ చదివి తాత్పర్యం వినిపించిన తర్వాత సాయంత్రం వరకూ భక్తి కీర్తనా గానం! పులిహోర దద్ధోజనం! అమ్మ నిండు మనసుతో ఆత్మ సమర్పణ భావనతో చేసిన నైవేద్యాన్ని సీతా సమేత శ్రీరామచంద్రుల వారికి సమర్పించిన తరువాత, అందరికీ వినిమయం! అమృతతుల్యమైన ప్రసాదాన్ని కడుపారా తిని, మా పడసాల (హాల్)లో అంతవరకూ కిటకిటలాడుతూ కూర్చున్న వారంతా - మళ్ళీ .. అయ్య అష్టాక్షరీ కృతులు, అమ్మ పరమతారక ముద్ర రచనలు, పురంధర, కనకదాసు, త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు రచనలు పాడుతూ.. వీధుల వెంట నడుస్తూ దేవుని కడప - వేంకట రమణుని దర్శనం కనులారా చేసుకుని, పవిత్రానుభూతిని గుండెల నిండా నింపుకుని, మళ్ళీ శనివారం కోసం నిరీక్షణతో వాళ్ళ గూళ్లకు చేరుకునేవారు! బృందానికంతా అమ్మా, అయ్యే ముందుండే వాళ్ళు.

మా అమ్మ ఊరివారందిరికీ అమ్మే. అయ్య ఆదేశానుసారం ఐహిక కాముకులకు అమ్మ సలహాలు! ఆదిత్య హృదయం, వేదాన్త దేశిక విరచితకనక ధారా స్తవం’, ‘కులశేఖరాళ్వార్ - ముకుందమాల ఇంకా హయగ్రీవస్త్రోత్రం, శ్రీ సూక్తం.. యివన్నీ అమ్మ ద్వారా నేర్చుకున్న వారెందరో! సంతానం, ఉద్యోగాలు, కళ్యాణం ఇలాంటి కోరికలతో వచ్చే వాళ్ళకు అమ్మ చెప్పే రామాయణ సర్గ పారాయణలు, తరుణోపోయాలుగా ఇట్టే పనిచేసేవి. అంతేనా! మతిస్థిమితం లేని యిద్దరు యువకులు అమ్మ మంత్ర దీక్ష ఇచ్చిన తర్వాత పవిత్ర తీర్ధంతో మళ్ళీ మామూలుగా మారి పెద్ద చదువులు చదివి జీవితంలో స్థిరపడటం కళ్ళారా నేను చూసిన సత్యం. ఆమె మరణం (1983) అయ్యకు మా అందరకూ ఆశనిపాతం!

ఆముష్మికంగా భగవదారాధన కోసం అయ్యను ఆశ్రయించే వారెందరో! భక్తి మార్గ విశ్లేషణ, అందులోని కష్టాలు, అధిగమించేందుకు భక్తుల జీవితోదాహరణలు, శరణాగతి తత్త్వవివరణ - అష్టాక్షరీ నాధుని కృపకోసం సాధన...యివి. అయ్య తనను చేరేవారికి బోధించే విషయాలు! అమ్మను బతికించుకోడానికి అయ్య మధ్య వీధిలోని రాఘవేంద్ర స్వామికి రోజూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేవారు. అరవై తొమ్మిదేళ్ళ వయసులో అలా అహరహమూ శ్రమించినా అమ్మను కాపాడుకోలేకపోయారు. అప్పటి నుంచీ ఆయన అంతర్ముఖులైపోయారు. వ్రాతకోతలు తగ్గాయి. ఒక శ్రీనివాస ప్రబంధం ద్వితీయార్ధం వచ్చిందంతే! తోడు కోల్పోయిన పక్షి విలవిల్లాడిన వైనం గుర్తొచ్చేది. నా తరువాత తొమ్మిదేళ్ళ తర్వాత పుట్టిన చెల్లెలు అనూరాధ (1962) పెళ్ళి భారం అయ్యపై పడింది. అంతకు ముందు జరిగిన మా అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళన్నీ అమ్మ - మా అయ్య శిష్యుడూ - దత్త పుత్రుడిగా మా యింట మసలిన మాలేపాటి సుబ్రహ్మణ్యం అన్నయ్యల నిర్వహణలోనే - పెళ్ళి చూపులు మొదలు - పెళ్ళి పీటల వరకూ ఏర్పాటయ్యేవి. అయ్య పెళ్ళి పెద్దగా పీటలపై కూర్చొని కన్యాదానం చేయటమే! ‘ మా చెల్లెలు రాధ పెళ్ళి ఎలా జరుగుతుందా? అని అయ్యకు ఒకటె దిగులు. మొత్తానికి మా అక్కయ్యలు, అన్నా వదినల సహకారంతో అనురాధ పెళ్ళి 1988 లో అవగానే యిక అయ్య ఆరాటం తగ్గింది. కానీ సాహిత్య ప్రపంచంలో వస్తున్న మార్పుల పట్ల ఏవగింపు పెరుగుతూ వచ్చిందా సమయంలోనే. లైను కింద లైనుగా అప్పట్లో వస్తున్న వచన కవిత్వమంటే అయ్యకు అయిష్టంగా ఉండేది. సాహిత్యంలో ఆశ్రిత కవిత్వ ధోరణీ పెరిగింది. అచ్చమైన నాణ్యత కల్గిన కవులకు నిరాదరణ జరగడం చూసి సహించలేకపోయేవారు. అర్హతలేని వారు అందలాలెక్కడం - వారిని చాలా కష్టపెట్టింది. అంతవరకూ ఊరించినజ్ఞానపీఠం కాస్తా కడప-గడప దాకా వచ్చి గిర్రున వెనుదిరిగి పోయిన వైనం అయ్యగారిని మరింతగా కృంగదీసింది. జాల రచయిత చంద్రమోహన్ తో జ్ఞానపీఠం వల్ల నాకేమీ కొత్త కిరీటం రాకపోయినా లక్ష రూపాయలతో నాజనప్రియ రామాయణం అరణ్య కాండ వెలుగులోకి వచ్చేదిరా అన్నారట అయ్య వడలిన శరీరంతో, వణుకుతున్న గొంతుతో!

అలా కృంగినవరు యిక మరి కోలుకోలేదు. ఆరోగ్యం క్షీణిస్తున్నా జ్ఞానార్తి మాత్రం తీరలేదు. హైద్రాబాద్ ఆనంద్ బాగ్ లో 1990 ఆగస్టు 2 తేదీ నుండి 18 వరకు మా ఇంట్లో ఉన్న సమయంలో తన అనుంగు శిష్యుడు రఘోత్తమరావుకు భాగవత రహస్యాలను విడమరిచి చెప్పేరు. చెక్కర వ్యాధి మిషతో ఆరోగ్యాన్ని దెబ్బతీసిన దైవాన్నీ, తన సహజ ధోరణిలోనే తప్పుపట్టారొకనాడు. నాయాలా! నిన్ను వదుల్తాననుకున్నావా! అని పైవాడు వెంటపడినాడురా. మూడు నెలలు మలేరియా, మళ్ళీ యిదిగో యీ కాలిపుండూ, ఈలోగా షుగరూ.. నేనేం తక్కువ తిన్నానా! నీకంటే నేను మహా మొండి వాడిని తెలుసా! చూద్దాం ఏం చేస్తావో! అని అనేశాను అని ఒకటే నవ్వు.

అటు తర్వాత కడపకు వెళ్ళాలని పట్టుదల. అక్కడికి వెళ్ళిన వారం రోజులకి బాల్ రెడ్డి ఆసుపత్రిలో చేరడం, పెరిస్త్రోయికా తెచ్చి పెట్టమనడం యివన్నీ జరిగాకభగవంతుడు, భాగవతము, భక్తుడూ అంతా ఒకటే అన్న చరమ శ్లోకార్ధం వినిపిస్తూ తను జన్మాంతం ఆరాధించిన అష్టాక్షరీ నాధునిలో సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రభాత వేళ సాహితీ ప్రభాకరుడు ఐక్యం చెందటం జరిగిపోయాయి. ‘ఏమమ్మా నాగా! అన్న అప్యాయతతో కూడిన పిలుపిక వినబడదు. కడప రామకృష్ణ హైస్కూల్ లో తన శివతాండవ నృత్య ప్రదర్శనలో పార్వతిగా నాకు అడుగులు నేర్పించి ప్రదర్శనానంతరం నన్ను ముద్దుగా ముద్దాడిన మా అయ్య యికరారు. వేంకటాధ్వరి లక్ష్మీ సహస్రాన్ని విశ్లేషించి వినిపించిన అయ్య గంభీర స్వరం యిక వినపడదు. 1990 సెప్టెంబర్ ఒకటవతేదీ నాడే మా కుటుంబ సభ్య్లులందరూ జీవఛ్ఛవాలయ్యాం! జీవించక తప్పదు కాబట్టి బతుకు బండిని ఎలాగో లాగుతున్నా, ఇలా లాగేందుకు అవసరమయ్యే యింధనమంతా అలనాటి అద్భుత లోకాలలో విహరించినప్పటి జీవధారల అమృతపానం వల్ల అందినదే!

అయ్య నుండి మేము నేర్చుకున్నదేంటి? జీవితంలోని యే క్షణాన్నీ వృధా పరచుకుకోకూడదన్న సత్యం. జీవించడానికే ఆహారం! ఆహారం కోసం జీవించడం నీచం! నిరాడంబర జీవితం! ఉన్నతాశయాలు! ఎవరి అండదండల వల్లయినా, దాసత్యం వల్లనయినా అందే గౌరవాల కన్నా, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ పొందే గౌరవాల విలువే ఎక్కువ! అయ్యగారు మాకేనాడూఇలా ఉండాలి సుమా అని చెప్పింది లేదు కానీ, ఆయన జీవితమే ఒక సందేశం మాకు! ఆయన్ని అభిమానించి ఆరాధించే వారందరికీ కూడా! సంగీతంలో శృతిని తల్లిగా - లయను తండ్రిగా చెబుతారు. మా జీవన సంగీతాలకూ శృతి మా అమ్మ, లయ మా అయ్య!

మా అమ్మ అయ్య గారి దాంపత్యం విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లాఉత్తర రామ చరిత్ర లో భవభూతి శ్లోకం గుర్తొస్తుందంటారు ఆచార్య శ్రీరంగాచార్యగారు. (పాలెం సంస్కృత కళాశాల పూర్వాచార్యులు)

అద్వైతం సుఖదుఃఖయోరనుగతం సర్వాస్వవస్థా సుయత్

విశ్రామో హృదయస్య యత్రజరసాయస్మిన్నహార్యోరసః

కాలేనా వరణాత్యయాత్ పరిణతే యత్ స్నేహ సారేస్థితం

భద్రం ప్రేమ సుమానుషస్య కథమప్యేతం హి తత్ ప్రాప్యతే (320)

సుఖదుఃఖాలలో సమానంగా అనుగమిస్తూ సాగే దాంపత్యం - పొద్దువాలిన వయసులో నీలిరాగంగా మరింత గాఢంగా వృద్ధ దంపతుల హృదయాల్లో నెలకొని - మరింత శోభాయమానంగా కనిపిస్తుందని అయ్యే తన ప్రసంగాలలో ప్రస్తావిస్తూ ఉండేవారు. అచ్చంగా, అలాగే మా అమ్మ, అయ్యల దాంపత్యం రూపెత్తిన విశిష్టాద్వైతం! అంతే!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

  Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.                    సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                                                                                                            Site Design: Krishna, Hyd, Agnatech