కథా భారతి  

      కథా విహారం

- రచన :  విహారి

 

   సమసమాజ నిబద్ధతతో సామాజిక వాస్తవికతా వ్యాఖ్యానాలు జయంతి పాపారావు కథానికలు

 
 

1957 నుంచి సాహితీ లోకానికి పరిచితులైన సుప్రసిద్ధ రచయిత జయంతి పాపారావు గారు. మూడు కథానికా సంపుటాలు, రెండు నవలలు, ఐదు సాహిత్య విమర్శనా గ్రంథాలు ప్రచురించారు. ప్రస్తుతం - కథానికా ప్రస్థానం - పరిణామదర్శనం (1910-2009) శతజయంతి అధ్యయనం గ్రంథ రచనలోనిమగ్నులై ఉన్నారు. నూరేళ్ళు - నూరుగురు కథకలు - నూరు కథలు సంకలనాన్నీ ప్రచురించనున్నారు. నవల హిందీలోకి, ఇంగ్లీషులోకీ అనువాదం కాగా, 30 కథానికలు హిందోలోకి అనువాదం కాగా, 30 కథానికలు హిందీలోకి అనువాదం అయ్యాయి. జయంతి పాపారావుగారి సాహిత్యంపై ఎం.ఫిల్, పి.చ్. డిలకు పరిశోధనలు జరిగాయి. డి.లిట్ పరిశోధనలో భాగంగా ఉంది. హిందీ కథానికా సాహిత్యం మీదా పి.హెచ్.డి. జరుగుతోంది.

పాపారావు గురించి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ‘గురజాడకు సన్నిహితం కాగల వ్యక్తుల్ని ఎంచుకుని కథలు అల్లిన పాపారావు ధన్యుడు, చిరంజీవి’ అన్నారు. పాపారావు గారి స్ఫూర్తి ప్రదాతలు రావిశాస్త్రి, చాసో, కారా మాస్టారు.

పాపారావు గారి కథానికల్లో ఏ చిన్న కథని తీసి చదివినా, ఒకటి రెండు వాక్యాలు చదవగానే - ఆ రచనా శైలీ శిల్పాలు చప్పున రావిశాస్త్రిగారి రచనని స్ఫురింపచేస్తాయి. పాపారావు గారి కథానికలు అలదుకున్న ఒక సహజ గంథం ఇది. 1992 పాపారావు గారు ‘ఆమె చెప్పిన కథలు అను పన్నెండు తేనెసాల కతలు’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకానికి ఉన్న ‘పరిచయం’ ఇలా ఉంది. ఈ కథల్లో / ఒక చదువుకున్న యువతి ఉంటుంది. / ఆమె జీవితంలో దగాపడి ఊబిలో దిగిపోతుంది / ఆమె తను వ్యభిచార జీవితంలో చూసిందీ, విన్నదీ - అంతే గాకుండా, తెల్సుగున్నదీ / కథలుగా చెప్తుంది / ఇలా చెప్తూ - జీవిత నిజాలతో సామాజిక సత్యాలలో - సమాజానికి అద్దం పడుతుంది. అర్ధమైంది కదా- వస్తువు. ఇక మొదటి కథ ‘ఆమె’ ఇలా మొదలవుతుంది. ‘ఆమె ఎవరైనా కావచ్చు! ఆమె ఏమైనా కావచ్చు. ఆమె సంగీతం వాంతికావచ్చు! ఆమె మాటలు విశ్వం కావచ్చు. ఆమె కళ సృష్టి కావొచ్చు... అయితే ఆమె జీవితనిజం కాదు కాకకాదు! ఆమె సామాజిక సత్యం కాదు కాకకాదు! వాక్యాన్ని వ్యంగ్య విలసితం చేసి ఒక విపర్యయాన్ని మొహాన్ని ఛల్లున చరచటమన్న మాట - ఈ చెప్పే తీరులోని విలక్షణత, ప్రత్యేకత! ఇంకా చూడండి. ఆ అమ్మాయి, మొగుడుమీద కోపంతో కూపంలో వచ్చిపడిపోయింది. అన్ని నుయ్యిలూ ;మంచి నీళ్ళు యివ్వవు. అన్ని అక్షరలూ మంచిని చెప్పవట! అలంకార శాస్త్రంలో అర్ధాంతర న్యాసంవంటిది! పెద్ద వివరణలు అక్కర్లేదు. ఇదీ పాపారావు గారి శైలీ విన్యాసం. 1969 లో పాపారావుగారు రాసిన రాతి అరుగు కథానిక ఎంతో గొప్ప రచన. ఒక ‘దరిద్రదేవత గీసిన ఆకలి; బొమ్మ’ లాంటి ఆడది. కుడిచెయ్యి పడిపోయింది. స్వాధీనంలో లేదు. ఇంకో కుంటివాడు. ఒక కాలు ‘ఎండిపోయిన పుల్లలా ఉంది’;. వీళ్ళిద్దర్నీ కలిపింది రాతి అరుగు! ముష్ట్రైత్తి బతుకుదామంటాడు వాడు. కష్టపడి బతుకుతాను’ అంటుంది ఆమె. చెప్పాడు. విన్లేదు. వదిలేసి వెళ్ళిపోయాడు. చాసో,, ‘ఎంపు’ కథని చిన్న రివర్స్ గేర్. పురాణం వారన్నట్లు ‘దరిద్రుల ఎకనమిక్స్ వేరు’. సామాజిక వాతవికతలోని నగ్న ఆర్ధిక సూత్రం - కథాంశం - అయితే, బడుగుబతుకులు సంబంధ బాంధవ్యాలు గాలికి పోయిన పేలపిండి ఎలా అవుతాయో-కథావరణం చూపుతోంది. 

పాపారావు గారు 2003 లో ‘ఇవాళ...’ అనే గ్లోబలైజేషన్ కథ రాశారు. నిజానికి చిన్న స్కెచ్. పకపకా నవ్వుతున్నట్టు కనిపించే ప్రకృతి చెప్పే నగ్న వాస్తవాల దృశ్యమాలి ఈ కథ. ‘అభివృధ్ది అంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి? అని వో యువకుడు మంటలా మండుతూ, మంటలా ప్రశ్నిస్తూ.. సూర్యుళ్ళా మండుతూ వెల్ళిపోయాడు’ అంటూ ముగుస్తుందీ కథానిక. హిందీలోకి అనువదించబడింది. తెలుగులో విశాలాంధ్ర వారి గ్లోబలైజేషన్ కథలు’ సంకలనంలో ప్రచురించబడింది.

పాపారావు గారి కథానికల్లో దేన్ని చదివినా ఒక సాంఘిక దురాచారం లేదా దోపిడీ లేదా పరపీడన లేదా స్వార్ధం-అదౌర్భాగ్యాల రొచ్చుమాత్రమే కనిపించి ఊరుకోదు. ఇది ‘సోకాల్డ్’ సామాజిక స్ఫృహ’ ఉన్నదని కాలరెత్తుకునే అందరికథల్లోనూ ఉంటుంది. అంతేగాక, కథానిక సామాజిక జీవనాన్ని అద్దంలా ప్రతిబింబించాలి. కనుక - నా కథలో ఆ ప్రతిబింబం వుందని చెప్పుకోవడానికీ పనికొస్తోంది. అయితే, శతృత్వం’ ‘ఇవాళ’ ‘సంఘర్షణ’ వంటి పాపారావు గారి కథలు కేవలం దర్పణాలుగా మాత్రమే నిలిచి ఊరుకోవు. ఆ రొచ్చుకి కగ ములాల్ని విశ్లేషిస్తూ సాగుతాయి. అంతటితోనే మౌనం వహించక ఆ మూలాల్ని కళాత్మకంగా, కథాత్మకంగా వ్యాఖ్యానిస్తాయి. గొప్ప కథల లక్షణం ఇది. ఉదాహరణకి పాపారావు గారి మరీ గొప్ప కథ ‘రెండు గుండెల మనిషి’ ఉంది. ఇందులో ఒక చిట్టెమ్మ, ఒక సత్యం ఉన్నారు. సత్యం చిట్టెమ్మను సైకిల్ రిక్షాలో సత్యాలాడ్జీకి తీసుకు వెళ్ళి దించి, తెల్లవారుజాముకు తిరిగి తీసుకువస్తూ ఉంటాడు. ఆమె లాజిక్ కి అంగీకరించి సత్యం ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. కిల్లీబడ్డీ పెట్టించింది చిట్టెమ్మ. ఆమె ‘చిలిపితనం వల్ల కిల్లీ బడ్డీ బాగా నడుస్తోంది. అమ్మకూడదని అమ్ముతూ ఉండడంవల్ల కిల్లీబడ్డీ జోరందుకుంది’ అక్కణ్ణుంచీ చూడండి. టీకొట్టు కోరమండల్ రైలు బండిలా చివరి గదిలోని చిల్లర దుకాణం గుట్టుగా సంసరంలా ఇమానంలా ఎగురుతోంది. ఇక డబ్బే..డబ్బు! సత్యంకి ఉన్నట్టుండి వ్యాధి. గుండెల్లో నెప్పి. మంచం పట్టాడు. ఎందువలన? కారణం చెప్పాడు కథకుడు. నీ కొత్తగుండె. రెండోగుండె - పేదల రక్తం ఎండిపోయినా ఇంకా కొంచెం మిగిలే ఉంది. కొది రోజుల్లో అది కూడా పూర్తిగా ఎండిపోయి పాత గుండె పూర్తిగా నశించిపోతుంది. అప్పుడు నువు ఇవాళ పడుతున్న బాధ - మనసులో బాధ లేకుండా పోతుంది. అది రెండో గుండెని తాకలేదు. ఇదీ విషయం. ఈ కథకి రాసిన చివరి రెండు వాక్యాలే పైన నేను చెప్పిన కళాత్మక వ్యాఖ్యానం. ఆ రెండు వాక్యాలు ఇవి. దోపిడీ విషవాయువు లాంటిది. అది అంతటా సహజ వాయువులా వ్యాపించగలదు. అద్భుతమైన, ఆలోచనా స్ఫోరకమైన ముగింపు. ఈ వాక్యాలు చదివిన ఎవరి మేథయినా, కథనీ, కథలో పాత్రల్నీ, సంఘటల్నీ తలచుకుని తలచుకుని గిరికీలు తిరగాల్సిందే! ఇదీ గొప్ప కథ శక్తి. అది ఊరికే ఊకొట్టించి ఊరుకోదు. అయ్యోపాపం, ప్చ్, అనిపించి పెదవులు కదిలించి దిక్కులు చూపించదు. అవును - గొప్ప కథ గుండెని మండిస్తుంది, పిడికిళ్ళు బిగింపజేస్తుంది! ఏ కథకాకథగా, ఎన్నో గొప్ప కథలు రాసిన పాపారాబు గారికి నమస్సులు!

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech