కథా భారతి  
     

    ఓ వీడియోగ్రాఫర్ కథ

 - రచన: రాధిక

 

 

పరశురాంకి వీడియో షాపు ఉంది. అతను బాగా ముఖ్యమైన ఫంక్షన్లకు తానే స్వయంగా వెళ్ళి వీడియో తీస్తాడు. చిన్నచిన్న వాటికి తన అసిస్టెంట్ వాసుదేవ్ ని పంపిస్తాడు. ఒకానొకప్పుడు వీడియో పని అంతా మంచి రోజులలో మంచి ముహూర్తంలో మాత్రమే ఉండేవి. అప్పుడు పరశురాం టాక్సీ నడిపే బిజినెస్ చేసేవాడు. ఇప్పుడు రెండూ బాగానే నడుస్తున్నాయి. ట్రెయిన్ లలోనూ, బస్సులలోనూ టిక్కెట్లు దొరక్క చాలామంది టాక్సీలలో ఊళ్ళు వెళ్ళిపోతున్నారు. సంఘంలో ప్రయాణీకులూ పెరిగారు. ఫంక్షన్లు పెరిగాయి. ఇదివరకు పెళ్ళిళ్ళకు, షష్టిపూర్తిలకు మాత్రమే వీడియో తీసుకునేవారు. జనాలు చాలా ఫంక్షన్లు చేసుకుంటున్నారు. మీటింగ్ లకు, పుస్తకాల ఆవిష్కరణలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, పుట్టినరోజులకు, పుష్పవతి, ఒడుగు లాంటి ఫంక్షన్లకు మంచి రోజులు అక్కరలేదు. ఆఖరికి పిల్లలు విదేశాలలో ఉన్నవారు వారి తల్లిదండ్రుల చావులను కూడా వీడియో తీసి వారు వచ్చిన తరువాత చూపిస్తున్నారు. వారు చావుకి అందకపోయినా ఇది గుడ్దిలో మెల్ల. సముద్రతీరంలో శంఖానికి బదులు దొరికిన గుల్ల. 

పరశురాం భర్యా పిల్లలతో టూరు ప్లాన్ చేసుకుందామనుకున్నాడు. ఈలోపుగా అనుకోకుండా సాహితీ కార్యక్రమం ఒకటి తగిలింది. ఒక మహారచయిత తన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. దానికి ఆంధ్రదేశం నలుమూలల నుండి ఎందరో రచయితలు, రచయిత్రులు వస్తున్నారు. దానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథి. సహజంగా పుస్తకాలు చదవడం ఎంతో యిష్టం ఉన్న రామ్ కి ఈ ఫంక్శన్ ను వదలి వెళ్ళడం ఇష్టం లేక ప్రయాణం కాన్సిల్ చేసుకున్నాడు. ఇలాంటివి అతని భార్య వైదేహికి అలవాటయిపోయాయి.అవ్వాకావాలి, బువ్వాకావలి అంటే కుదరదని ఆవిడకి తెలుసు.

పరశురాం కి పని అంటే మహాశ్రద్ధ. తాను చేసిన ఏ చిన్న పనిలోనయినా పెర్ ఫెక్షన్ ఉండాలనుకుంటాడు. ముఖ్యంగా వీడియో తీసేటప్పుడు, ఫోటోలు తీసేటప్పుడు కూడా మనుషుల కాళ్ళు, చేతులు, తలలుకట్ అయిపోతే అవి తీయించుకున్న వారి సంగతేమో గానీ రాం అసలు భరించలేడు. అందరూ అందంగా, పొందికగా, చక్కగా పడాలనుకుంటాడు. అందుకే కొంచెం వాళ్ళను అటు జరగమని, వీళ్ళను ఇటు జరగమని సలహాలిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో బిజీగా ఉన్న అతిథులకు ఒక్కో సారి విసుగువస్తుంది. ఆ వీడియోతో సమయం వృధా అవుతుందని సణుగుతారు. అటువంటప్పుడు సార్, మీరు అయిదు నిముషాల వీడియోకి కేటాయిస్తే తరతరాలు అందరూ అందరికీ చక్కగా కనిపిస్తారు. ఇది కెమేరా వెనుకున్న నాకు, దానిముందున్న మీకు కూడా మంచిది. కాస్త ఓపిక పట్టండి అంటూ ఓపికగా చెబుతాడు. రాం చెప్పిన దాంట్లో నిజం ఉంది కాబట్టి వారు ఏడవలేక నవ్వుతూ అతను ఎలా చెబితే అలా వింటారు.  

పుస్తకావిష్కరణకు రాం వీడియో తీయడం మొదలుపెట్టాడు. కలెక్టర్ గారిని, రచయితలను, అతిథులను అందరినీ బాగానే కవర్ చేసాడు. వచ్చిన చిక్కల్లా అతనికి ఆడియన్స్ తోనే. హాలు పెద్దది జనాలు బాగానే వచ్చారు. గానీ ఆకాశంలో చుక్కల్లా హాలంతా పరచుకున్నారు. ముగ్గులోని చుక్కల్లా ఎవరి స్థలాల్లో వారు ఉండాలని పరుశురాం కోరుకుంటాడు.మొదటి నాలుగు వరుసలూ నిండాయి. ఆ తరువాత నుండి లైనుకి అటు చివర కుర్చీలు, ఇటు చివర కుర్చీలు నిండిపోయాయి. వాళ్ళు చూడానికి బొమ్మలు చెప్పిన కమ్మని కథలలోని బొమ్మలు మెట్లమీద వరుసగా పేర్చినట్లు కనబడుతున్నారు. వాళ్ళందరినీ ముందుకు రమ్మని అందరినీ దగ్గరగా కూర్చోమని రాం అభ్యర్ధించాడు. వాళ్ళెవరూ అతనిమాట వినలేదు. ఆ సీటు పోతే మరలా రాదు అన్నట్లు దానికే అతుక్కుపోయారు. 

వారి సమస్యలు వారివి. కొందరు తరచుగా టాయిలెట్ కు వెళ్ళాలని చివరలో కూర్చుంటారు. సభ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోవాలనుకునేవారు, తరచుగా సెల్ ఫోన్ లలో బయటకు వెళ్ళి మాట్లాడేవారు దగ్గు, తుమ్ములతో బాధపడేవారు ఇలాంటి వారు లైనుకి ఆ చివరా, ఈ చివరా కూర్చుంటారు. ఎవరి ఆలోచనలు వారివి. కాని రాం ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ ఖాళీ సీట్లను చూస్తే బాధగా, వెలితిగా ఉంటుంది. ముందు సీట్లలోని వారు ఖాళీ చేస్తే ఆ వరస అక్కడక్కడా పళ్ళూడిపోయిన పలువరుసలా అనిపిస్తుందతనికి. హాలంతా అక్కడ కూడా ఖాళీలుంటే దుప్పటికి అక్కడ కూడా పడిన చిరుగు కన్నాల్లా కనిపిస్తాయి. ఆ వెలితి వీడియో తీస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అతనికి బుర్రను తొలిచేస్తూ ఉంటుంది.

అక్కడికీ పరశురాం అతిథులను ముందుకి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. కాని అతని మాట ఎవరూ లెఖ్ఖ చేయరు. అటువంటప్పుడు హోస్ట్ లతో చెప్పిస్తాడు. అతిథులు వాళ్ళ మాటలు అంతకన్నా లెఖ్ఖ చేయరు. ఈ విషయంలో అతను నిస్సహాయుడు అతనిలోని ఆ వెలితి, ఎవరికీ కనబడకుండా అతనినే గుచ్చుతున్న కత్తి.

పరశురాంకి మంచి వీడియోగ్రాఫర్ గా పేరు ఉంది. ప్రతీ ఫంక్షన్ లోను ముందుగానే వారు ముఖ్యమైన వారిని చూపించి ముందు వారిని కవర్ చేయమని అతనికి చెప్పేస్తారు. రాం వారు చెప్పినట్టే చేస్తాడు. ఒకసారి పరశురాం తోడల్లుడి తల్లిదండ్రుల షష్టిపూర్తి వచ్చీంది. ఆ శుభకార్యానికి పరశురాం అతిథిగాను, వీడియోగ్రాఫర్ గానూ వచ్చాడు. ఆయన పోలిటిక్స్ లో ఉండడం వల్ల అతిథులు చాలా మంది వచ్చారు. ఎప్పటిలాగా రాం తన సమస్య చిన్న కెమేరా ముందు పెద్ద భూతంలా ప్రత్యక్షమయ్యింది. అది భూతద్దంలోని బొమ్మలా మనసుnఇ చికాకు పరుస్తుంది. ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అనే తపన అతనిలో ఎక్కువయ్యింది.

తన మనసులో విషయం తోడల్లుడికి చెప్పాడు. దానికతను నీ ఇష్టం అన్నయ్యా అన్నాడు. అతిథులకు నీవు చెప్పినా పరవాలేదు గానీ నేను చెప్పానంటె ఫంక్షన్ కు పిలిచి ఆంక్షలు పెట్టారని అలుగుతారు అన్నాడు. ఆ మాట చాలు అనుకున్నాడు. అదేదో ఉద్యోగంలో సెటిల్ అయినట్లు, ఎలక్షన్ లో ఎలక్ట్ అయినట్టు ఫీల్ అయ్యాడు. హాలులోముందు వరుసలు నిండిపోయాయి. ఆ తరువాత వరుసలో కూర్చోబెట్టడానికి,అతిథులను అఆహ్వానించడానికి తన సన్నిహితులను కొందరిని నియమించాడు. వారు ఫంక్షన్ కి వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ సినిమా హాల్లో సీట్లు నెంబర్లు చూసి కూర్చోబెట్టినట్టు అందరినీ కూర్చోబెడుతున్నారు. వచ్చినవారు ఎవరూ ఆఖరు లైన్లలో కూర్చోకుండా ఆ లైనుకి ఆ చివరి నుండి ఈ చివరి వరకు రిబ్బను కట్టించేశాడు. నిండిన సీట్లలోని వారు ఒకవేళ ఒకరిద్దరు లేచిఆ సీట్లు ఖాళీగా కనబడకుండా అతిథులను ఎవరినో ఒకరిని ఆ ప్లేస్ లో కూర్చోబెట్టేస్తున్నారు రాం స్నేహితులు. వాళ్ళెవరూ రావడానికి ఇష్టపడకపోతే రాంస్ స్నేహితులే ఆ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. వీడియో అయ్యేంతవరకూ.

ఇలా చేస్తే హాలు ఖాళీ లేకుండా గింజలతో నిండిన జొన్నవిత్తులా, వత్తయిన నల్లని జుత్తులా చూడముచ్చటగా ఉంది.


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech