కథా భారతి  
    

          దొడ్డమ్మ ట్రంక్ పెట్టె

 రచన: కుంతి

 

 

 

పట్నం నుండి బయలుదేరి, మారుమూల పల్లెకు చేరే సరికి సాయంత్రము వేళ అయింది. ఎప్పుడూ కళకళలాడుతూ ఆ ఊరిలోని అతి పెద్ద మేడ దేవుడు లేని గుడిలా వెలవెలబోతోంది. వెంకటాద్రినాయుడు కుటుంబంతో సహా ఇంటి పరిసర ప్రాంతాల్లోకి చేరుకునేసరికి, మేడ ముందు వసారాలో గుమిగూడిన వారంతా ప్రక్కకు జరిగి దారినిచ్చారు. వేంకటాద్రినాయుడు తన కుటుంబంతో పాటు కారు దిగి ఇంటిలోకి అడుగు పెట్టాడు. ఇంటి బయట వసారా అరుగులపై దొడ్డమ్మ శవం కనిపించింది. దేవాలయ సేవలు చేసి, అలసి, సొలసి ప్రాణం విడిచిన భద్రగజములా ఉంది దొడ్డమ్మ. దివ్య పురుషుల మస్తిష్క భాగము నావరించి ఉండే ప్రభలా ఆమె తలవైపు పెట్టబడిన దీపపు కాంతి వెలుగులు విరజిమ్ముతుంది. ఆమె ముఖముపై చిరునవ్వు అలాగే ఉంది.

అన్నా మన దొడ్డమ్మ మనను విడిచిపోయింది అంటూ తమ్ముడు సిమ్మాద్రినాయుడు వచ్చి వెంకటాద్రినాయుడిపైడి బోరున ఏడవసాగాడు. చెల్లెళ్ళు లక్ష్మమ్మ, పద్మమ్మలు కూడా అన్నను పట్టుకుని ఏడవసాగారు. వెంకటాద్రియానుడు తాను దుఃఖాన్ని దిగమింగుతూ వారిని ఓదారుస్తూ, ఇంక ఈ సాయంత్రం ఏ కార్యక్రమాలు చేయలేము. టౌను నుండి ఐసు పెట్టి తెప్పించు, ఇంటి ముందు టెంట్ వేయించు, మన ఇంటి పురోహితులకు కబురు పెట్టు. రేపు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుపుదాము. అన్నాడు సిమ్మాద్రినాయుడుతో వెంకటాద్రినాయుడు. ఇంటి బయట ఉరి జనాలు మూగి ఉన్నారు. కొందరు దొడ్డమ్మ గురించి చెప్పుకుంటున్నారు. కొందరు మౌనంగా రోదిస్తున్నారు. సిమ్మాద్రినాయుడు ఏర్పాట్లకై వెళ్ళిపోయాడు. ఆ తరువాత వెంకటాద్రి నాయుడు, తన చెల్లెళ్ళను, మరదలిని, భార్యను పిలిచి మనందరం ఎన్నో నెలల తర్వాత మన ఊరుకు వచ్చాము. ఇంట్లో ఏమి ఉన్నాయో, ఏమిలేవో తెలియదు. పాలేరు వెంకటి, పోలయ్యల సహాయము తీసుకుని ఇంటిపని, వంటపని చూడండి అని తాను వెళ్ళి దొడ్డమ్మ కాళ్ళదగ్గర కూర్చున్నాడు. అలాగే దుఃఖిస్తూ కూర్చుండిపోయాడు. వెంకటాద్రినాయుడు గుండెలో పేరుకున్న బాధలా ఊరంతా చీకటి పరుచుకుంది.

- - -

ఆమె ఎప్పుడు ఆయింటికి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. తమకు ఊహ తెలిసినప్పటి నుండి ఆమెను ఇక్కడ చుస్తున్నాము. ఆమెను దొడ్డమ్మ అని అందరూ పిలిచేవారు. ఆమె పేరు కూడా ఎవరికి తెలీదు. ఆమె ఆజానుబాహురాలు. నుదుట పెద్ద బొట్టు, ఉన్నవి రెండు చీరలైనా ఎప్పుడు పరిశుభ్ర వస్త్రధారణతో ఉండేది. సంస్కారవంతమైన ప్రవర్తన, మర్యాదపూర్వకమైన సంభాషణం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖము. గుడిలో ఉండి ధూపదీప నైవేద్యాలతో, అలరారాల్సిన దేవతామూర్తి ఏవిధి వంచన చేతనో, పాడుబడిన గుహలోనో పడి ఉన్నట్లుగా ఉండేది. విరాటరాజు కొలువులో తనను తాను దాచుకుని ప్రవర్తిల్లే ద్రౌపదిగా ఉండేది. కానీ వెంకటాద్రినాయుడుకి మాత్రము దొడ్డమ్మను చూస్తే అభయ హస్తముతో ఊరివారిని కాపాడే గుడిలోని అమ్మవారిలా అనిపించేది.

వెంకటాద్రినాయుడు తండ్రి నీలకంఠము నాయుడు పెద్ద మోతుబరి రైతు. వందల ఎకరాల పొలము. లెక్కలేనన్ని పశువులు. ఇంటినిండా ధాన్యపురాశులు. ఇంట్లో పనిచేయడానికి పాలేర్లు. నీలకంఠం భార్య మణెమ్మ ఎప్పుడూ అనారోగ్యంతో మంచాన్నంటుకుని ఉండేది. దొడ్డమ్మ సూర్యోదయానికి ముందేలేచేది. ఇంటి పని, పొలము తాలూకు వ్యవహారాలు చూసుకునేది. పశువులను మేతకు పంపడము, కుడితి పెట్టడము, పాలు పితికించడము వంటి పనులు అంతా దగ్గరుండి చేయించేది. ఆ తరువాత ఇంటిపని, వంటపని అన్నీ ముగించుకుని పిల్లలను బడులకు పంపించేది. పిల్లలను ఆడించేది, పాడించేది, గోరుముద్దలు తినిపించేది.

ఒక్కమాటలో చెప్పాలంటే నీలకంఠం గారి పిల్లల ఆలనా, పాలనా, చదువు సంధ్యలూ, ఆటపాటాలూ, అచ్చట్లు, ముచ్చట్లు అన్నీ ఆమె చేతుల మీదుగా జరిగేవి. పిల్లలకు కూడా తల్లి ప్రేమంటే దొడ్డమ్మ ప్రేమే. ముఖ్యంగా వేంకటాద్రినాయుడుకి దొడ్డమ్మంటే మహాప్రాణము. వెంకటాద్రినాయుడి బాల్యము అంతా దొడ్డమ్మ కొంగు పట్టుకుని, చేతులు పట్టుకుని గడిచిపోయింది.

నీలకంఠము నాయుడు, మణెమ్మలు పేరుకు మాత్రమే ఇంటికి పెద్దలు. అన్ని వ్యవహారాలపై దొడ్డమ్మదే అజమాయిషీగా ఉండేది. ఉదయము నుండి రాత్రి వరకు పనులతో క్షణము విరామము లేకుండా గడుపుతూ, ఇంటిలో సేవలు చేసి చేసి ఏ రాత్రి పూటో ఆ ఇంటికి ఆనుకుని ఉన్న పాకలోకి వెళ్ళి విశ్రమించేది.

వెంకటాద్రినాయుడు పాకలో దొడ్డమ్మ దగ్గరే పడుకొనేవాడు. ఆమెను విడిచి క్షణము కూడా ఉండలేకపోయేవాడు. ఆ విధంగా దొడ్డమ్మ సంరక్షణలోనే పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఉన్నత విద్యలు చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు సంపాదించారు. ఆడపిల్లలకు చక్కగా పెళ్ళిళ్ళు అయి అత్తవారిళ్ళకు వెళ్ళారు.

ఇంట పండగొచ్చినా, పబ్బమొచ్చినా, బంధువులొచ్చినా అన్నీ తానై చూసుకునేది. పాలేర్లకు, నౌకర్లకు దొడ్డమ్మంటే అసూయ ఉన్నప్పటికీ యజమానులకు భయపడి ఒక్కమాట పైకి అనక పోయేవారు.

ఆ ఇంట పిల్లలకు కూడా దొడ్డమ్మ ఎవరూ అన్న సందేహము ఏనాడు కలగకపోయేది.

మణెమ్మ అనారోగ్యముతో పూర్తిగా మంచము పాలైనప్పటి నుండి ఆమెకు అన్ని రకాల సేవలు చేసింది దొడ్డమ్మ. దొడ్డమ్మ ఎన్ని సేవలు చేసినా ఆ సేవలు ఫలించలేదు. చివరకు పిల్లల అభివృద్ధి చూడకుండానే మణెమ్మ కనుమూసింది. మణెమ్మ కన్నుమూసిన కొద్ది రోజులకే నీలకంఠము నాయుడికి పక్షవాతము కమ్మింది. ఒక కాలూ, చేయి పడిపోయింది. నీలకంఠం నాయుడుకి కాలూ చేయీ తానే అయి అతడు పోయేంత వరకూ అతడికి సేవలు చేసింది. ఇంటి పెద్దలు పోయినా పిల్లల ప్రోద్భలముతో ఇల్లు, పొలము చూస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంత ఇదిగా ఆ ఇంట్లో సేవలు చేసినా దొడ్డమ్మ యేరోజూ మంచి బట్ట కట్టింది, కడుపు నిండా అన్నము తిన్నదీ వెంకటాద్రినాయుడు చూడలేదు. యే రాత్రైనా తన పాపకు వెళ్ళి పడుకునేది తప్ప ఆ ఇంట్లో ఒక్కనాడూ నిద్ర చేయలేదు. ఆ ఇంట్లో వాళ్ళకు ఏ సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించేది.

ఇంటి వాళ్ళకే కాక ఇరుగుపొరుగు వారికి ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉండేది. ఆ ఊరిలో ఎవరు గుండె బరువు దింపుకోవాలన్నా దొడ్డమ్మ భుజము ఆసరాకు సిద్ధంగా ఉండేది. అలాంటి దొడ్డమ్మ నీలకంఠం నాయుడు చనిపోయిన తరువాత మాత్రం కొద్ది రోజులు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఊరికి వచ్చినప్పుడు మాత్రము ఆమె నుదుట బొట్టు లేదు. ఏమిటి సంగతీ! అని పాలేర్లు ప్రశ్నించారు. ‘బాబుగారు పోయిన దినమే తెలిసింది నా చిన్నప్పుడే నన్ను వదిలి వెళ్ళిన భర్త కాశీలో ఉన్నాడని. అతడిని కలుసుకుందామని వెళ్ళాను. తీరా అక్కడకి వెళ్ళే సరికి తెలిసింది ఆయన ఎప్పుడో చనిపోయాడని, గంగలో పిండాలు పెట్టి, తర్పణలు వదిలి వచ్చేశాను’ అని సమాధానమిచ్చింది. నమ్మిన వాళ్ళు నమ్మారు. నమ్మని వాళ్ళు ఆమెను ప్రశ్నించే ధైర్యం చేయలేదు.

నీలకంఠము నాయుడు పోయిన తరువాత వాళ్ళ ఆబ్దికాలకు, పండుగలకు , పబ్బాలకు పిల్లలందరు ఊరికి వచ్చేవాళ్ళు. దొడ్డమ్మ వాళ్ళున్నన్నాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులున్నప్పుడు యెలా సంతోషంగా, సందడిగా ఆ ఇల్లు ఉండేదో, అలాగే ఉండేటట్టు చూసేది. వాళ్ళు రాగానే కౌలు లెక్కలు, ఇంటి జమాఖర్చులు అన్నీ వెంకటాద్రినాయుడుకి వివరించేది. వెంకటాద్రినాయుడికి ఆమెను చూస్తే దేవుడి సంపదను కాపు కాచే కాలసర్పము లా అనిపించేది.

అయితే ఇంతవరకు దొడ్డమ్మ గురించి చెప్పినదంతా కథలో ఒకకోణము.

మరొక కోణము దొడ్డమ్మ ట్రంకుపెట్టె.

- - -

దొడ్డమ్మ ఉండే పాకలో ఆమె పడుకునే కుక్కి మంచము క్రింద సొట్టలు పడిన ఒక ట్రంకు పెట్టె ఉండేది. నేలమాళిగలో దాచిన బొక్కసానికి వేసిన రకరకాల బంధనాలలాగ ఆ పెట్టెకు రెండు మూడు తాళాలు ఉండేవి. యే కోరికలు, ఆర్భాటాల, ఏ సంతోష విచారాలు లేని దొడ్డమ్మ ట్రంకుపెట్టెను మాత్రము ప్రాణముగా చూసుకొనేది. పాకలో లేనప్పుడు పాకకు తాళము వేసి ఉంచేది. ఎప్పుడైనా పాకలో తానున్నప్పుడు ఎవరైనా పిల్లలు పాకలోకి వచ్చి ఆ పెట్టెనుజ్ ముట్టబోతే ఎల్లప్పుడూ పిల్లల పట్ల ప్రేమ కురిపించే దొడ్డమ్మ ఉగ్రస్వరూపిణి అయ్యేది. యశోదకు కృష్ణయ్య ఎంత ముద్దో దొడ్డమ్మకు వెంకటాద్రి నాయుడు అంత. అయితే వెంకటాద్రి నాయుడు ను కూడా ఆమె ఆ పెట్టెను ముట్టనివ్వక పోయేది. చివరకు ఈ పెట్టె విషయము ఆ నోటా, ఈ నోటా పడీ, అది చర్చనీయాంశముగా మారింది.; అందులో దొడ్డమ్మ బాగా డబ్బు దాచిందని కొందరు, లేదా పొలాల పత్రాలు దాచిందని కొందరు, కాదు కాదు పెద్దింట్లో అందరికీ దగ్గరై వళ్ళెవరూ లేనప్పుడు యే వెండియో, బంగారమో కాజేసి దాచిందని కొందరు...ఇలా రకరకాలుగా అనుకునేవారు. దొడ్డమ్మ ఆ ఇంట్లో పొందే గౌరవాదరాలు చూసి గిట్టని కొందరు మాత్రము ఒకసారి ‘మీ ఇంట్లో పోయిన వెండి సామాను ఈమె పెట్టెలోనే ఉండవచ్చు’ అని నీలకంఠం నాయుడికి, మణెమ్మకు చెప్పారు. వారిద్దరూ ‘ఇంకొకసారి ఇలాంటి అవాకులు, చవాకులూ దొడ్డమ్మ మీద చెప్పవద్దు’ అని కోపగించి వాళ్ళ నోళ్ళు మూయించారు. నోళ్ళు మూసినా ట్రంకు పెట్టే తాలూకు వ్యవహారముపై ఎవరికి ఆసక్తి చావలేదు.

ఇది ఇలా ఉండగా ఒక రాత్రి మంచముపై దొడ్డమ్మ వెంకటాద్రినాయుడు పడుకొని ఉండగా ఒక దొంగాడు పాకలోకి దూరాడు. లాంతరు వెలుతురులో అతడికి ట్రంకు పెట్టె కనిపించింది. అతడు మెల్లగా వెళ్ళి ట్రంకుపెట్టె జరుపబోయాడు. వెలుతురు పెట్టెకు ఒకవైపే పడుతుంది. పెట్టెకు పక్కవైపునున్న కొక్కానికి తాడుకట్టి ఆతాడు యొక్క మరొక కొస ఎప్పటిలాగా తన చేతికి కట్టుకుని పడుకుంది దొడ్డమ్మ. దోంగాడు పెట్టెను లాగడముతో దొడ్డమ్మ చేయి కదిలింది. దొడ్డమ్మకు మెలుకవ వచ్చింది. అంతే రాక్షసుని చూసిన దుర్గే అయింది. మూలలో ఉన్న దుడ్డుకర్రను తీసుకుని వాడిని చావబోయింది. చిన్నదొంగ యేదో ఆశించి వచ్చాడు అనుకుంది. వెంటనే సత్తు కంచము నిండా ఇంత పచ్చడి అన్నం వేసి వాడికి ఇచ్చింది. వాడు ఆబగా తిన్నాడు. చెతిలో పది రూపాయలు పెట్టి మళ్ళీ ఇటు వైపు రావద్దు అని ఉరిమింది. ఇక ఆ తరువాత ఆ పెట్టెను గురించి ఆరాతీసే సాహసం ఎవరూ చేయలేదు. దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఆ ఇంటి వారందరికీ ఆ పెట్టె అర్ధము కాని ప్రహేళికలా మిగిలిపోయింది.

- - -

ఏమండీ చాలా పొద్దుపోయింది. ఎంగిలి పడండి’ దొడ్డమ్మ మరణము తాలూకు దుఃఖముతో భావోద్విగ్నుడై యున్న వెంకటాద్రి నాయుడు భార్య వసు పిలుపుతో తేరుకున్నాడు.

వద్దు వసూ! భోజనము చేయలేను.; నా కడుపులో పేగులు లుంగలు చుట్టుకుపోతున్నాయి. దొడ్డమ్మ లేదన్న బాధ నన్ను బాగా కుదిపేస్తుంది. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్. అన్నాడు. భర్త సంగతి తెలిసిన వసు అతడిని దగ్గరికి తీసుకుని పలురకాలుగా ఓదార్చి, మిగిలిన వాళ్ళ సంగతి చూడాలి’ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోవడాముతో వెంకటాద్రినాయుడు మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు. అలా ఎంత సేపున్నాడో తెలియదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎంతో దూరము ప్రయాణము చేసి వచ్చినందున అందరూ కలిసి నిద్రపోతున్నారు. ఇంటి బయటా పాలేర్లు నిదురపోతున్నారు. చడీచప్పుడూ లేదు. నిశ్శబ్దంగా అక్కడి నుండి లేచాడు వెంకటాద్రినాయుడు. తనను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన దొడ్డమ్మ గురించి, తమ కుటుంబానికి ఆమె సేవల గురించి ఆలోచిస్తూ ఇంటి బయటికి నడిచాడు. బయట వెన్నెల కురుస్తుంది. పాక కనిపించింది. పాక తలుపు గాలికి ఊగుతుంది. శతృ రాజులు రాజును తీసుకెళితే ఒంటిదైన కోటలా ఉంది ఆ పాక. తన బాల్యముతో, పెంపకముతో ముడిపడిన ఆ పాకలోకి ప్రవేశించాడు వెంకటాద్రినాయుడు. ఎవరు వెలిగించారో కానీ లాంతరు వెలుగుతోంది. ఎప్పటిలాగే కుక్కి మంచము క్రింద ట్రంకు పెట్టె మెరుస్తూ కనబడిది. పెట్టెకు ఒకవైపు కొక్కానికి తాడు వేలాడుతూంది. కానీ ఆ తాడు మరొక కొసకు దొడ్డమ్మ లేదు. వెళ్ళె అలాగే మంచముపై కూర్చున్నాడు. అంత వేదనలో కూడా ఆ పెట్టెలో ఏముండొచ్చు? అన మానవ సహజమైన కుతూహలము కలిగింది. దొడ్డమ్మ తాను బ్రతికి ఉన్నంత కాలము చీమను కూడా తాకనివ్వని ఆ పెట్టెను తెరిచి చూడాలనుకోవడం తప్పుకదా అనిపించింది. పైగా తన పాలిటి ప్రేమ మూర్తి అయిన దొడ్డమ్మకు ఇష్టము కాని పని చేయడము ఎందుకు అనిపించింది. ఈ పెట్టెలో ఆమె జీవిత రహస్యాలు ఉన్నాయేమో! ఖచ్చితంగా డబ్బు, విలువైన వస్తువులు అయితే ఉండవు.అయినా ఎంత చిత్రంగా ఉంటాయి మానవ సంబంధాలు. ఇంతకాలము ఈ ఇంట్లో ఉన్నా ఆమె గురించి తెలిసింది శూన్యమే. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నము ఏనాడూ చేయలేదు. పండిన చెట్టులా, పారేనదిలా అన్నీ తానే మనకు ఇచ్చింది. కాని తాము మాత్రం కృతజ్ఞతాహీనులమై ప్రవర్తించాము. కనీసము ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఎంత తప్పు చేశాము. ఆమెకు తనకంటూ ప్రత్యేకమైన ఆశలు, కోరికలు ఉన్నాయేమో.

(..సశేషం)

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech